Tuesday, September 8, 2020

"శరణాగతిలో ఉన్న వైభవం" - (By అమ్మాజీ గారు)

నాకు 33 ఏళ్లు వచ్చేవరకు నాన్నగారి దగ్గరకు వెళ్ళలేదు. నాకు భక్తి ఉండేది, అది ఎలాంటి భక్తి అంటే పూజ చేసుకోవటం గుడికి వెళ్ళి నాకున్న కోరికలను మొక్కుకోవడం. వ్రతాలు చేసుకోవటం, ఉపవాసాలు ఉండటం, ఇదే భక్తి అనుకునేదాన్ని, కానీ ఇవి అన్నీ చేయటమువలననే నాకు నాన్నగారి దర్శనం దొరికిందేమో! కానీ నాకు చిన్నప్పటి నుంచి ఏమి జరిగినా మన మంచికే అనే భావన మాత్రం బలంగా ఉండేది. ఆచార్యులవారు మనుష్వత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయః అన్నారు కదా! నాకు మానవజన్మ రావటం, భగవంతుడి మీద ఎంతో కొంత భక్తి అయితే ఉంది కానీ ఒక మహాపురుషుని యొక్క సందర్శనం కలగాలి కదా. అది నాకు నాన్న గారి దర్శనం వలన లభించింది. 

అది ఎలా జరిగింది అంటే, మా బావగారి కోడలు పద్మ (భాను గారి పద్మ)విజయవాడలో ఉన్నప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేది. ఒకసారి కార్తీకమాసంలో తను మా ఇంటికి రావటం, ఉపవాసం వుండి గుడికి వెళ్ళి దీపం పెట్టి వచ్చిన తర్వాత తను ఒక మాట అంది, "అమ్మాజి అక్కా నీకు చాలా భక్తి ఉంది. నిన్ను ఒకసారి నాన్నగారి దగ్గరకు తీసుకు వెళ్తాను". ఈ నాన్నగారు ఎవరు అని అడిగాను. ఒక మహా జ్ఞాని ఒకసారి దర్శనం చేసుకో అంది. అప్పట్లో నాన్నగారు విజయవాడలో సిరీస్ సుబ్బరాజు గారు ఇంటికి వచ్చేవారు. నాన్నగారు వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను నన్ను రమ్మని చెప్పింది. సరే ఒకసారి వెళ్దాము అనుకున్నాను. నాన్నగారు వచ్చినప్పుడు ఫోన్ చేసింది పద్మ, నేను  వెళ్లాను. నాన్నగారికి నన్ను మా చిన్న అత్తగారని పరిచయం చేసింది. నాన్నగారు ఒకసారి నన్ను చూసి నవ్వారు అంతే ఇంకేమీ మాట్లాడలేదు. కాసేపు అక్కడే ఆయన సమక్షంలో కూర్చుని వచ్చేసాను. మళ్లీ తర్వాత రెండో సారి వచ్చినప్పుడు వెళ్లాను. కానీ అప్పుడు కూడా నాన్నగారు నాతో ఏమీ మాట్లాడలేదు. ఒకసారి నవ్వారు అంతే. ఆ తర్వాత మూడోసారి నాన్నగారు వచ్చారని తెలిసి వెళ్దామని అనుకుంటే లోపల నుండి ఎందుకు వెళుతున్నావు ఆయన నీతో మాట్లాడరుగా, నాకు వెంటనే ఇంకో ఆలోచన పరవాలేదు, ఆయన మాట్లాడకపోయినా ఆయన చూపు, ఆ నవ్వు చాలా బాగున్నాయి. ఆయన సమక్షంలో ఏదో శాంతి ఉంది. ఆయన చూపు నా మీద పడితే చాలు అనుకుని వెళ్ళాను.

కానీ ఆరోజు నేను వెళ్లేసరికి ఆయన ఒక్కరే ఉన్నారు రూములో, నన్ను చూసి, "రామ్మా తలుపు దగ్గరగా వేయి" అన్నారు. నేను వెళ్లి నాన్న గారి పాదాల దగ్గర కూర్చున్నాను. ఆరోజు 1 1/2 గంట నాతో మాట్లాడారు. అన్ని విషయాలు అడిగి తెలుసుకుని నా మనసు అనే పుస్తకాన్ని చదివేసారు. నాకు కూడా ఆయన్ని చూస్తుంటే జనక భావన వచ్చేసింది. ఈయనకు అన్ని చెప్పేసుకోవచ్చు ఏమి దాయనక్కర్లేదు అనిపించింది. అలా నాన్నగారు నాతో మాట్లాడి నేను వెళ్ళిపోతుంటే నాకు "గీత" చిన్న బుక్కు ఇచ్చారు. నేను అన్నాను నాన్నగారు శ్లోకం తప్పు చదవకూడదు అంటారు కదా ,నాకు వస్తుందా అని అడిగాను. "అర్ధం చదువుకో అమ్మా, అర్ధం అవగతమయితే శ్లోకం చదవడం వచ్చేస్తుంది". అన్నారు. అలా ఆ రోజు నుండి నాన్నగారితో గాడమైన అనుబంధం ఏర్పడింది.

అలా నాన్నగారితో అనుబంధం ఏర్పడిన తర్వాత నేను కొన్ని పుస్తకాలు చదివాను. అందులో 'అమృత వాక్కులు', 'నేనెవడను' ఉన్నాయి.' నేనేవడను'అనే పుస్తకం చదువుతున్నప్పుడు నాకు చాలా కన్ఫ్యూజన్ వచ్చేది. తరువాత నాన్నగారు విజయవాడ వచ్చినప్పుడు నేను వెళ్ళాను, ఆ రోజు నాన్న గారిని అడిగాను, "ఈ 'నేనవడను' పుస్తకంలో నేనును, నేను తో తెలుసుకోమంటున్నారు నాకు ఏమిటో అంతా గందరగోళంగా ఉంది నాన్నగారు." 

అప్పుడు నాన్నగారు నా వంకా రెండు మూడు నిమిషాలు అలా చూసి కుడి చేయి పైకెత్తి ఆశీర్వదిస్తున్న ట్లుగా పెట్టి , "అమ్మా అమ్మాజీ నువ్వు భక్తి లో ఉండమ్మా నీకు భక్తి సరిపోతుంది"  అన్నారు. నేను అన్నాను నాన్నగారు జ్ఞానం రావాలంటే విచారణ చేయాలి అంటున్నారు కదా అన్నాను. 

అప్పుడు అన్నారు, "అమ్మ నేను నీకు ' గీత' ఇచ్చాను కదా! అందులో ఎన్ని మార్గాలు చెప్పాడమ్మా కృష్ణుడు: భక్తి మార్గం, కర్మ మార్గం, ధ్యానమార్గం, జ్ఞాన మార్గం. అన్ని చెప్పారు కదా. విచారణ మార్గం ఒక్కటే కాదమ్మా భక్తి మార్గం ద్వారా కూడా జ్ఞానం వచ్చేస్తోంది. 'భక్తి జ్ఞానానికి మాత' అమ్మా, తల్లి లేకుండా బిడ్డ రాదు కదా. ఆ మాట చెబుతూ భగవాన్ పైకి అంతా జ్ఞానమే లోపలంతా భక్తేనమ్మ. రామకృష్ణుడు కాళీ మాత భక్తుడిగా కనిపించినా లోపల అంత జ్ఞానమే అమ్మా. భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ జ్ఞానం వచ్చి తీరుతుంది. జ్ఞానం ఎక్కడ ఉందో అక్కడ భక్తి లేకుండా ఉండదు  ఈ రెండు ఎక్కడ ఉంటే అక్కడ శాంతి, ఆనందము ఉంటాయి. నీవు భక్తిలో ఉండమ్మా నీకు అది సరిపోతుంది." 

నా పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఏ మార్గము సరిపోతుందో సూచించారు అని నాకు బలంగా అనిపించింది. "భక్తి అంటే కోరికల భక్తి కాదమ్మా ఆ భక్తిలో నీవు కనబడకూడదు అందులో కరిగి పోవాలి, పంచదార బొమ్మ నీళ్ళల్లో కరిగినట్టు అప్పుడు నీవు తానుగా మిగిలి పోతావు" అని చెప్పారు. అప్పటి నుండి గుడికి వెళ్ళినా కోరికలు కోరుకోవటం మానివేశాను. ఈశ్వరా నా కంఠంలో ప్రాణం ఉండగా నా గురువు పాదాల మీద భక్తి వదలకుండా ఉండేటట్లు దీవించండి అని అడిగేదాన్ని.

నాకు నాన్నగారిని చూసినప్పటినుండి జనక భావనే ఉండేది. ఏ జన్మలోనో ఆయన కూతురుని మధ్యలో గాడి తప్పిపోయాను, మళ్లీ ఈ జన్మలో భక్తురాలిగా చేర్చుకున్నారు అని అనుకునేదాన్ని. ఆ భావన బలపడడానికి అన్నట్లుగా నాన్నగారు నాకు ఒక సంఘటన క్రియేట్ చేశారు. అది 1998వ సంవత్సరం అక్టోబర్ 29వ తారీకున నాన్నగారు సిరీస్ సుబ్బరాజు గారి ఇంటికి వచ్చారు, నేను వెళ్ళాను. నన్ను చూసి నాన్నగారు అమ్మా రేపు వాచ్ షాప్ కి వెళ్దాము వాచ్ తీసుకుందాము అన్నారు. నాన్నగారు రేపు నేను 10:30 కి వస్తాను షాప్ కి వెళ్దామని చెప్పి తర్వాత రోజు (30వ తారీఖు) వెళ్ళాను. నేను వెళ్లేసరికి నాన్నగారు భోజనం చేస్తున్నారు. అయిన తరువాత కాసేపు భక్తులతో మాట్లాడి నా వైపు తిరిగి వెళ్దామా అమ్మా అన్నారు. మేము ఇద్దరం సిరీస్ రాజుగారి కార్లో వెళ్ళాము. అప్సర టాకీస్ ఎదురుగా టైటాన్ షోరూమ్ కి తీసుకుని వెళ్ళమని డ్రైవర్ కి చెప్పాను. అక్కడకు వెళ్ళిన తరువాత నాన్నగారు అమ్మా నువ్వే చూడు అన్నారు. నేను ఆ షాప్ లో ఉన్న మోడల్స్ లో ఒకటి నాన్నగారికి సెలెక్ట్ చేసి చూపించాను. ఇది బాగుంది నాన్నగారు అన్నాను.అయితే ప్యాక్ చెయించమ్మ అన్నారు. 

షాప్ వాడు ప్యాక్ చేసి ఇస్తూ నాన్నగారిని చూసి, "మీ అమ్మాయా?" అని అడిగారు. 
"అవునండి" అన్నారు నాన్నగారు 
"మరి అల్లుడు గారు ఏం చేస్తారండి?" అని ఇంకొక ప్రశ్న వేశారు. 
"ప్రింటింగ్ ప్రెస్ అండి" అన్నారు నాన్నగారు. 

నా హృదయాంతరాలలో ఉన్న జనక భావన పొంగి సహస్రారాన్ని తాకింది. ఇప్పుడు వరకు నాకు బర్త్ డేట్ లేదు. ఈ రోజే నేను నాన్నగారి కూతురిగా పుట్టేశాను అని అనుకున్నాను. నాకు ఏనుగు ఎక్కినంత ఆనందం వచ్చేసింది. అలా తండ్రి నన్ను కూతురిగా స్వీకరించారు. ఇంతకన్నా ఈ జన్మకు ఇంకేమీ అక్కర్లేదు అని అనిపించింది.

భగవంతుడు అడ్మినిస్ట్రేటర్ ఆయన మన ప్రారబ్దంలో ఏమి ఉందో అది పంపించేస్తాడు. ప్రారబ్దం ద్వారా ఏమైనా మొట్టికాయలు తినవలసి ఉంటే ఆ మొట్టికాయలు పడిపోతాయి. మొట్టికాయలు మనకు పడ్డా దాని తాలూకు బాధ కొంచెం కూడా లేకుండా చేసి ధైర్యాన్ని ఇచ్చి జ్ఞానాన్ని ప్రసాదించే వాడు గురువు అని, మన ప్రారబ్దం యొక్క వేగం ఎంత స్పీడ్ గా ఉన్నప్పటికీ దాన్ని తట్టుకునే శక్తి ప్రసాదించే వాడు గురువు. ఆ డెస్టినీ ప్రకారం మనకు రావలసిన కష్టాలు, హింస, వస్తున్నప్పటికీ దాని యొక్క ప్రభావము మన మనస్సు మీద పడకుండా చేసి మనల్ని స్వీట్ గా ,హ్యాపీ గా, ఉంచే వాడే గురువు. దానికి నిదర్శనంగా ఆ హ్యాపీనెస్, స్వీట్ నెస్ నాకు తెలిసేటట్లు చేశారు. మేము ఆఫ్ సెట్ ప్రింటింగ్ మిషన్ ఒకటి కొన్నాము, దాని వలన మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ టైంలో నాకు తెలియకుండా నాకు చాలా నిరాశక్తత వచ్చినది కానీ నాన్నగారు దాన్ని ఎలా తీసివేశారు అంటే, నాన్న గారికి ఈ విషయాలన్నీ చెప్పుకున్నాను. ఆయనకు తెలియని విషయం ఏముంటుంది మనకు అత్యంత సమీపంలో ఉన్నది మన గురవే కదా! 

నాన్నగారు అన్నారు, "అమ్మా మనం దరిద్రాన్ని కొనుక్కున్నాము. మన ప్రారబ్దంలో అనుభవించవలసినదే అనుభవించాలి కదమ్మా నీకు నిరాసక్తత ఎందుకు వచ్చిందంటే మనము ఏదో expectation పెట్టుకుని పని చేస్తునాము. అమ్మా ఫలితాన్ని ముందే ఊహించుకుంటున్నాము. ఎప్పుడైతే ఫలితం మనం అనుకున్నట్లుగా రాలేదో మనకి రియాక్షన్ వస్తుంది. పని మాత్రమే మన చేతుల్లో ఉంది.ఫలితం ఈశ్వరుడు ఇస్తాడు.మనకు ఫలితాన్ని ఎలా ఇచ్చిన స్వీకరించాలి కదమ్మా మనము ప్రశ్న వెయ్యడానికి లేదమ్మా.మనం పనిచేటప్పుడు ఇది ఈశ్వరుడు నాకు కేటాయించిన పని ఈశ్వరుడే నాతో చేయిస్తున్నాడు అని అనుకుని పని చేయమ్మా. మనము పని వలన టైర్ అవ్వము. నేను చేస్తున్నాను అనే కర్తృత్వం పెట్టుకోవడం వలన టైర్ అవ్వుతున్నాము. పని మనల్ని వదిలి వేయాలి కానీ,మనం పనిని విడిచిపెట్టకూడదమ్మా". 

ఆ రోజు నుండి నాలో నిరాసక్తత పోయింది. పనిని విడిచి పెట్టాలి అనే భావన కూడా పోయింది. ఆ తర్వాత కొంత కాలానికి ఆ పనే నన్ను విడిచిపెట్టేటట్లుగా తండ్రి చేశారు.

ఆ తర్వాత ఆ మెషిన్ ని కూడా అమ్ముడయ్యేటట్లుగా చేయడం నాన్నగారి అనుగ్రహం. మిషన్ అమ్ముడు అవ్వాలని నాన్నగారు కాశీవిశ్వేశ్వరుడుని అడిగాను అని ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. ప్రపంచంలో ఎవరు మన కష్టాన్ని తీయాలని భగవంతుని కోరుకునే వారో, అది మన గురువు నాన్నగారికే చెల్లింది. నేను కూడా నాన్నగారి తో కాశీ వెళ్ళాను కానీ నేను విశ్వేశ్వరుడుని కోరుకోలేదు, నాన్నగారికి చెప్పుకున్నాను. ఈ ప్రారబ్ధాన్ని అనుభవించే శక్తిని ఇవ్వమని, ఆ శక్తిని నాకు ఇచ్చారు. ఆ బాధని దూరము చేశారు. ఇది మన గురువు "నాన్నగారికే" సాధ్యం.

నాన్నగారిని ఈ మిషన్ తో ఇబ్బందులు పడుతున్నప్పుడు నేను అడిగాను, "నాన్నగారు నా కోరికే నాకు తిప్పలు తెచ్చిపెడుతోంది. నేను ఏదో చెయ్యాలి అని చేస్తున్నాను, అది నాకు కష్టాలు తెచ్చిపెడుతుంది, ఇదంతా నేను కోరుకోవటంవలనే కదూ"  అన్నాను.

అప్పుడు నాన్నగారు అన్నారు, "నీ కోరిక కు బలం ఎక్కడ ఉంది నీ డెస్టినీ లో నువ్వు ఫేస్ చేయవలసిన కష్టాలు ఉంటే అవి నీ కోరికతో సంబంధం లేకుండా వచ్చేస్తాయి. ఒకవేళ నీ కోరికలు ఏమైనా నెరవేరినా అది ఈశ్వర సంకల్పంతో కలవటం వలన జరుగుతుంది. సంకల్పం ఈశ్వరుడిది. ఈశ్వర సంకల్పములో లేకపోతే నీ కోరిక తీరదు. నీ కోరికకు అసలు బలము లేదు"  అని తేల్చేసారు. "నువ్వు సంకల్పాలు లేకుండా ఈశ్వర సంకల్పం గౌరవించడం నేర్చుకో అప్పుడు నీకు రియాక్షన్ ఉండదు", అంటూ నాన్నగారు ఒక మాట అన్నారు. భగవాన్ అళగమ్మ గారితో అన్న మాట మన జీవితము మొత్తానికి సాధనకి సరిపోతుంది. "జరగవలసింది జరిగే తీరును, జరగరానిది ఎవరెంత ప్రయత్నించినా జరగనే జరగదు. ఇది సత్యం, ఊరకే ఉండటం ఉత్తమము". ఇది ఒక్కటే గుర్తుపెట్టుకో అన్నీ మర్చిపో అని చెప్పారు.

గురువు నోట వచ్చిన మాట వృధా పోదు అనటానికి ఒక నిదర్శనం చెబుతాను. మా పిల్లలు 8, 10 చదువుతున్నప్పుడే నాన్నగారు చెప్పారు ఇద్దరూ ఇంజనీరింగ్ చదువుతారమ్మ. కానీ మా అమ్మాయికి ఇంజనీరింగ్ అంటే అసలు ఇష్టం లేదు. వాళ్ల నాన్న ఫోర్స్ తో MPC inter లో చేరింది. నాన్నగారు హాస్టల్లో పెట్టమన్నారు. కానీ EAMCET చాలా భయంకరంగా రాసింది. ఎందుకంటే engineering ఇష్టంలేక అప్పుడైనా తనని Fashion Designing లో చేర్పిస్తాము అని. కాని తనకు EAMCET లో పెద్ద ర్యాంకు వచ్చినా వాళ్ళ నాన్న Ex-Service Man, ఆ quota లో విజయవాడలో K.L..C.E లో Seat వచ్చింది. ఇంక తప్పదని Engineering లో చేరింది. 

ఒకసారి IInd Year లో ఉండగా నేను నాన్నగారి దగ్గరకు వెళుతుంటే మా అమ్మాయి కూడా నాతో వస్తానని వచ్చింది. నన్ను రావద్దని తను నాన్నగారితో లోపలికి వెళ్ళి మాట్లాడి వచ్చింది. తను ఏమి మాట్లాడిందో నాకు తెలియదు. Engineering complete అయిన తరువాత Fashion designing చెయ్యటానికి Bangalore వెళ్ళింది ఆ తరువాత చాలా సంవత్సరాల తర్వాత నాకు చెప్పింది. నేను నాన్నగారి దగ్గరకు వెళ్ళి ఏమని అడిగాను తెలుసా, "నాన్నగారు నాకు, engineering చదవడము ఇష్టం లేదు మానేస్తాను" అందట. 

"మరి ఏమి చదవాలి అనుకుంటున్నావు?" అని అడిగారు 
"నేను Fashion Designing చెయ్యాలని అనుకున్నాను" అని చెప్పాను. 
అప్పుడు నాన్నగారు ఏమిచెప్పారంటే. "అమ్మా నీకు ఇష్టంలేని పని నీ జీవితంలో ఇది ఒక్కటే, నీవు Engineering పూర్తి చేసిన తరువాత నీకు కావలసినది చదువుకో, మీ అమ్మవాళ్లకు చెబుతాను. నీ జీవితంలో ఇష్టంలేని పని ఇది ఒక్కటే" అని  చెప్పారు. అందుకే నేను Engineering చేశాను అని చెప్పింది. 

అంటే ఒక జ్ఞాని నోటినుండి వచ్చిన మాటకు ఎంత బలముంటుందో నాకు బాగా అర్థమయ్యింది.

మన ప్రారబ్దం లో ఏది వచ్చినా అది ఈశ్వరుని ఆజ్ఞ లేకుండా రాదు కదా! గురువు యొక్క అనుగ్రహము లో మనము ఉన్నప్పుడు, ప్రారబ్ధము కొట్టే దెబ్బలు కొట్టినా వాటి యొక్క బాధ మనకు తెలియదు, అది గురువే తీసుకుంటారు. దానికి పెద్ద నిదర్శనము, మేము 2008లో ఒక పెద్ద వెంచర్ (రియల్ ఎస్టేట్) వేశాము. దానిలో పిల్లల పెళ్ళిళ్ళు కోసము అని ఉంచుకున్న ధనం మొత్తం అందులో పెట్టాము. కరెక్ట్ గా అదే సమయానికి అపార్ట్ మెంట్ కొనుక్కోవాలని కూడా అడ్వాన్స్ ఇచ్చివున్నాము. సడన్ గా రియల్ ఎస్టేట్ లో స్లమ్ వచ్చింది. ట్రాన్ సాంక్షన్స్ అన్నీ ఆగిపోయాయి. పెళ్ళిళ్ళు కుదిరాయి. ఒకే సంవత్సరంలో మూడు శుభకార్యాలు ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోయాయి.

అడిగిన వాళ్ళు లేదు అనుకుండా డబ్బులు సర్దుబాటు చేశారు. పెద్ద మిరాకిల్ లాగా జరిగిపోయాయి. ఒక ప్రక్క రియల్ ఎస్టేట్ లో స్ట్రక్ అయ్యాము. అయినా శుభకార్యాలు ఆగలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. రియల్ ఎస్టేట్ లో ఉన్న మా వాళ్ళు కొందరు నన్ను అడిగారు మీరు ఎలా తింటున్నారు ఎలా నిద్రపోతున్నారు. నేను అన్నాను, మాకు భయము వేయడము లేదు. మాకు అండగా మా గురువు ఉన్నారు. ఈ ఇబ్బంది నుండి మేము ఎలా బయట పడతామా అని నేను ఆలోచించటం లేదు. మాకు కొండంత అండ మా గురువు గారు ఉన్నారు. ఆయనే చూసుకుంటారు అనే నమ్మకం నాకు ఉంది. అందుకే సబ్జెక్ట్ వింటూ తింటున్నాను, సబ్జెక్టు వింటూ పడుకుంటున్నాను. నాకు ఏమీ వర్రీ లేదు అన్నాను. అలాగే అందులో నుండి నాన్నగారు మమ్మల్ని బయట పడేశారు. శరణాగతి లో ఉన్న వైభవం అది. ఇల్లు, అమ్మాయి పెళ్ళి, అబ్బాయి పెళ్ళి అన్ని వైభవంగా చేయించారు తండ్రి.

ఈ రియల్ ఎస్టేట్ స్లమ్ లో ఒక రియాక్షన్ వచ్చింది, ఏమిటంటే నాన్నగారు ఫర్ గెట్ మరియు ఫర్ గివ్ గురించి చెప్పేవారు. ఫర్ గివ్ బాగానే ఉంది కానీ ఫర్ గెట్ కష్టమయ్యింది. మేము ఇందులో నుండి బయటపడి పోయాము. అందరికీ కట్టవలసిన ఎమౌంట్ కట్టేసాము కానీ, ఆ టైమ్ లో నేను కొన్ని మాటలు పడవలసి వచ్చింది. వాళ్ళు అన్నప్పుడు తిరిగి ఏమి అనాలి అనిపించలేదు, కాని తర్వాత వాళ్ళ అన్న మాటలు గుర్తుకు వచ్చేవి, అవి ఫర్ గెట్ అవ్వలేకపోయాను. ఆ సమయంలో నాన్నగారి దగ్గరికి వెళ్ళాము.

నాన్నగారితో అన్నాను, "ఫర్ గివ్ బాగానే అమలు చేయగలుగుతున్నాము, కానీ ఫర్ గెట్ కష్టంగా ఉంది" నాన్నగారు అన్నాను. 

అప్పుడు అన్నారు, "అమ్మా హృదయం వైశాల్యం పెంచుకుంటే ఫర్ గెట్ వస్తుంది. హృదయం లోతులు పెంచుకోవాలి అని చెపుతూ నా వైపు రెండు మూడు నిమిషాలు అలాగే చూస్తూ చెయ్యి ఊపుతూ నీకు ఫర్ గెట్ వచ్చేస్తుంది అమ్మా"  అని అన్నారు. 

ఆ తరువాత కొన్ని రోజులకి ఆ విషయాలన్నీ ఆటోమేటిక్ గా నా ప్రయత్నం లేకుండానే ఫర్ గెట్ అయిపోయాయి. అంటే మనము ఎలా జీవిస్తే సుఖంగా ఉంటామో అలా గైడ్ చేసేవారు.

1 comment:

  1. నాన్నగారి అమృత వాక్కులు అందించారు, చాలా ధన్యవాదాలు అమ్మా మీకు..

    ReplyDelete