Tuesday, September 15, 2020

"నాన్నగారంటేనే ప్రేమ స్వరూపం" - (By విజయలక్ష్మి గారు (ఖండవిల్లి))

నాన్నగారితో నా పరిచయం 20 సంవత్సరాల క్రితం జరిగింది. కేశవరం మా పుట్టింట్లో మా పెద్దమ్మాయికి నాన్నగారితో అక్షరాభ్యాసం చేయించాను. అప్పుడు నాన్నగారిని చూసినా, నాకు ఎటువంటి అనుభూతి కలగలేదు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఆయన దగ్గరకు వెళ్ళాను. అప్పటి నుండి "నాకు గురువు, దైవం తల్లి ,తండ్రి అన్నీ నాన్నగారే".

నాన్నగారు కొన్ని రోజులకి కైకలూరు భగవాన్ విగ్రహ ప్రతిష్ఠకి వచ్చారు. నాన్నగారు ప్రవచనం చెబుతూ, మధ్యలో భగవాన్ భక్తులను ఉద్దేశించి ఒక వాక్యం చెప్పారు, "పులి నోట్లో పడ్డ మాంసపు ముక్కని పులి ఎలా వదిలిపెట్టదో, అలాగే భగవాన్ మన అందరికీ జ్ఞానం వచ్చే వరకు విడిచిపెట్టరు" అని నాన్నగారు చెబుతూ రెండు మూడు సార్లు దృష్టి నాపై ప్రసరించారు. నాకు ఇది వరకు నాన్నగారిని చూస్తే, ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడు నాన్నగారిని చూస్తే ప్రేమ, భక్తి కలిగాయి.

కొన్ని రోజుల తరువాత మళ్ళీ నాన్నగారి దగ్గరకి జిన్నూరు వెళ్ళాను. నాన్నగారు నన్ను చూడగానే నా మనస్సుకు ఏదో తెలియని హాయిగా అనిపించింది. తర్వాత నన్ను చూసి నీ పేరేంటమ్మా అని అడిగారు. విజయలక్ష్మి అని చెప్పాను. మీది ఏ ఊరు అని అడిగారు. ఖండవిల్లి అని అన్నాను. నాన్నగారు చాలా సంతోషంతో ఖండవిల్లి లో చిన్నప్పుడు గడిపిన ఆయన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.

మీకు భక్తి ఎప్పుడు కలిగింది అమ్మ అని అడిగారు. నేను అరుణాచలం వెళ్ళాక అని అన్నాను. అవునా అందరూ అరుణాచలం వెళ్ళిన తరువాత లోపల వాసనలు కదిలిపోయాయి అంటున్నారు. కానీ నువ్వు అరుణాచలం వెళ్ళిన తరువాత భక్తి కలిగింది అంటున్నావు సంతోషం అమ్మా అన్నారు. నాన్నగారు అరుణాచలం ఎన్ని అక్షరాలు అని అడిగితే, ఐదు అక్షరాలు నాన్నగారు అన్నాను. నువ్వు అరుణాచలం అని అనుకో సరిపోతుంది అని రెండు మూడు సార్లు అన్నారు. ఆ రోజు నాన్నగారు చుసిన ఆ చూపు నా మనస్సుని కట్టిపడేసింది. నాన్నగారు నా పై చూపించిన ప్రేమ నేను మొట్టమొదటిసారిగా అనుభవించాను. ఆ కళ్ళల్లో ఉన్న ప్రేమను నేను ఎవరి దగ్గరా ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. ఆ రోజు నుంచే నాన్నగారు నాకు సర్వస్వం అయ్యారు. నా మీద ఎనలేని ప్రేమను కురింపించేవారు. నాతోసహా నా కుటుంబ బాధ్యతలను అన్నింటినీ నాన్నగారికి సమర్పించుకున్నాను.

ఒకసారి నాన్నగారు ఆదిశంకరాచార్యులు గురించి ఏమని చెప్పారంటే, ఈశ్వరుడు భోళా శంకరుడు. శంకరాచార్యులు వారు జ్ఞానం బోధించటానికి వచ్చిన ఈశ్వరుడు అని అంటూ, లింగం కదలని ఈశ్వరుడు అయితే శంకరుడు కదిలే ఈశ్వరుడు అన్నారు. శంకరాచార్యులు వారు శిష్యులకు ఎనర్జీనీ ప్రసరిస్తూ ఉండేవారు, అది తట్టుకోలేక శిష్యులు పరవశించిపోయేవారు అని చెప్పారు. నేను నాన్నగారిని నా మనసులో "నాన్నఈశ్వరా" అని పిలిచుకునేదానిని.

ఒకసారి ఇంట్లో కూర్చున్నప్పుడు నాన్నగారు అక్కడ ఉన్నవారితో కుమార స్వామి గురించి చెబుతూ ఆయన మా కుటుంబంలో వాడే కదా అని అన్నారు. నాన్నగారు పక్కన కూర్చున్న వ్యక్తి నాన్నగారుతో, మీరు, కుమార స్వామి ఒకటేనా అని అడిగారు. నాన్నగారు నవ్వి ఊరుకున్నారు. అప్పుడు నాది ఎంత పూర్వజన్మ పున్యఫలమో కదా! సాక్షాత్తు ఆ కుమారస్వామి చెంతనే కూర్చున్నాను అని అనిపించి చాలా ఆనందం కలిగింది.

2010 వ సం. లో అక్టోబర్ 7 వ తారీఖున నాన్నగారు ఖండవిల్లి వచ్చి, వేణుగోపాలస్వామి గుడి లోపలకి వెళ్ళారు. అప్పుడు బయట ఉన్న నాన్నగారి చెప్పులు తీసుకుని గుండెలకి హత్తుకున్నాను. నాన్నగారు పాదాలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆ పాదాలు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. బ్రాహ్మణులు నాన్నగారికి శాలువా కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు. అప్పుడు నాన్నగారు నీ పేరేంటమ్మా అని అడిగితే, విజయ అని చెప్పాను. మీ ఇల్లు హైస్కూల్ దగ్గర కదా! అని నువ్వు నాకు గుర్తు ఉంటావు అమ్మ అన్నారు. నాన్నగారు కారు ఎక్కిన తరువాత నన్ను ఆశీర్వదించి, నా వైపు చుసిన ఆ చూపుకి నా దేహం అంతా పులకించిపోయింది. ఆ ప్రేమను మాటలలో వర్ణించలేను. అప్పుడు నాన్నగారు విజయ ఇలారామ్మా అని పిలిచారు. నాకు ఆ పిలుపుకే హృదయంలో నుండి ఒక వైపు ఆనందం, మరోవైపు బాధ రెండూ ఒకేసారి వచ్చేసాయి. నాన్నగారు అలా పిలిచేటప్పటికీ, ఆ పిలుపులో ఉన్న ప్రేమ నాకు ఎక్కడా దొరకదు అనిపించింది. ఏదో తెలియని అనుభూతి నన్ను తాకింది. నాన్నగారి చేతిలో ఉన్న కొబ్బరి చెక్క, కుడుము ప్రసాదం నాకు ఇస్తూ తులసి దళం కూడా నా చేతిలో పెట్టారు. నువ్వు ఈ తులసిని భద్రంగా బీరువాలో భధ్రపరుచుకో అమ్మా ,నువ్వు ముట్టుకోకు ఈ తులసి దళాన్ని తాకవద్దు అన్నారు. రెండు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించారు. నాకు అప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే వచ్చి నన్ను అనుగ్రహించారు అని అనిపించింది.

3 నవంబర్ 2016 న జిన్నూరు వెళ్ళాను. నాన్నగారు పిలిచి నన్ను దగ్గరగా కూర్చోమన్నారు. నాతో ప్రేమగా మాట్లాడుతూ, నేను ఖండవిల్లి వచ్చినప్పుడు నీకు ఏదో ఇచ్చాను కదా అన్నారు. కొబ్బరి చెక్క, కుడుము ,తులసి దళం అని చెప్పాను. ఇంతలో ఎవరో భక్తులు వస్తూ తులసిదళం తెచ్చారు.

నాన్నగారు ఎంతో ప్రేమతో అనుగ్రహించి, వాటిని నాకు ఇచ్చారు. నా ప్రారబ్ధాన్ని తప్పించటానికి నాన్నగారు వర్క్ చేస్తున్నట్లు నాకు అర్థమై వెక్కి వెక్కి ఏడ్చాను. నాన్న గారితో మూడు సంవత్సరాల నుండి అనుబంధం కానీ ఆయన ప్రేమ నన్ను తరింపజేసేవరకు వదిలిపెట్టదు. "నాన్న అంటేనే ప్రేమ కదా".

2017 వ సంవత్సరంలో పిబ్రవరి 4 వ తారీఖున శివరాత్రి వచ్చింది. ఆ రోజు నాన్నగారి ఇంటికి వెళ్ళాను. నాన్నగారి దర్శనం చేసుకుందామని నాన్నగారు గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాను. శివరాత్రి రోజు నాన్నఈశ్వరుడి దర్శనం అవుతుందని నమ్మకం ఉంది. ఈ లోపు నాన్నగారు భక్తులు ఎవరో ఇంట్లో నుండి బయటకు వస్తూ, నాన్నగారు విశ్రాంతి తీసుకుంటున్నారు తర్వాత వస్తారు అని చెప్పారు. నాన్నగారికి నేను వచ్చినట్టు తెలియదు. నాన్నగారు ధరించే దుస్తులు అక్కడ తీగమీద ఆరేసి ఉన్నాయి. నేను వాటిని చూస్తూ, నాన్నగారిని తలుచుకుంటున్నాను. అలా ఉండగా ఏదో శక్తి వచ్చి నా శరీరాన్ని తాకింది. నా శరీరం అంతా తేలిక అయిపోయి, నా దేహం అంతా పులకించిపోయింది. ఏదో జరిగింది. నాకు తెలియదు. ఇంతకుముందు ఎన్నడూ అటువంటి ఆనందాన్ని నేను అనుభవించలేదు. చాల హాయిగా అనిపించింది. 

తరువాత నాన్నగారు గది తలుపులు తీసుకుని బయటకు వచ్చారు. అక్కడ ఉన్న భక్తులతో ఖండవిల్లి విజయ అక్కడ ఉంది లోపలికి రమ్మనండి అని చెప్పారు. నాకు ఆ మాటకు ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే నాన్నగారికి నేను వచ్చినట్టు తెలియదు. కానీ గదిలో ఉన్న నాన్నగారికి నేను వచ్చినట్టు ఎలా అర్థం అయిందో నాకు తరువాత తెలిసింది. జ్ఞాని అంటే దేహం కాదు, చైతన్యం. చైతన్యం అంటే అంతటా నిండిఉన్న పరబ్రహ్మ స్వరూపం. ఆయన అంతటా నిండి ఉన్నారని ఆరోజు అర్థమయ్యింది. అంతటా నిండి ఉన్న చైతన్యానికి తలుపులు తోటి, గోడల తోటి సంబంధం లేదు కదా! ఆ రోజు నేను చాలా ఆర్తిగా ఎదురు చూస్తున్నాను. ఆయనను తలుచుకుంటూ చూడాలి అనే తపనతో ఉన్నానని ఆయనకు అర్థమైపోయింది. నాన్నగారు గదిలోకి పిలిచార,ు ఆయన చూపుతో నాకు ఆనందం వచ్చేసింది. ఆ రోజు ఆయన నన్ను చూస్తుంటే, నేను ఆయనను చూడలేకపోయాను. కుటుంబ యోగక్షేమాలను అడిగి, ఒక సంచి నిండా పండ్లు ఇచ్చారు. ఆ రోజంతా ఆయన నన్ను ఎక్కువ చూపుతో అనుగ్రహించారు. శివరాత్రి రోజు సాక్షాత్తు శివుని పాదాల దగ్గర చోటు దొరికింది. నేను శివానుగ్రహం లో ఉన్నాను అనిపించింది.

నాన్నగారు నాకు తులసిదళం ఇచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది. దానిని నన్ను ముట్టుకోవద్దు అన్నారు కదా!. అది ఇప్పటికీ ఎండిపోలేదు. అలాగే పచ్చగానే ఉంది. ఇది నాన్న అనుగ్రహానికి నిదర్శనం. 




No comments:

Post a Comment