Saturday, September 12, 2020

"భగవాన్, నాన్నగారు ఒక్కరే" - (By సతీష్ గారు)

నాకు 11 సంవత్సరాల వయస్సులో మొదటిసారి నాన్నగారి దగ్గరికి మా అమ్మగారు నన్ను నా తొబుట్టువు తో బాటు తీసుకు వెళ్ళారు. అప్పుడు నాన్నగారు నాకు మంత్రం ఇచ్చారు. ఆ మంత్రం తీసుకునేసరికి ఆ మంత్రం యొక్క విలువ గాని, గురువు అంటే ఏమిటి అని గాని నాకు ఆ చిన్న వయసులో తెలియలేదు. తర్వాత అప్పుడప్పుడు నాన్నగారి ప్రవచనాలకు వెళుతూ ఉండేవాడిని కాని, ఆ చిన్న వయసులో నాన్నగారి సబ్జెక్ట్ అంతగా అర్థమయ్యేది కాదు.

గురువు యొక్క ఒక మాట చాలు, ఒక చూపు చాలు, ఒక స్పర్శ చాలు

2004 లేదా 2005వ సంవత్సరంలో డిగ్రీ రెండవ సంవత్సరం పరీక్షలు జరుగుతూ ఉంటే, మా అమ్మ గారు ఒకరోజు నాకు పరీక్ష ముగిసిన తరువాత నన్ను ప్రవచనం జరిగే చోటికి రమ్మని తను అక్కడికి వెళ్లింది. ఆ రోజు పరీక్ష ముగిసినపుడు విపరీతమైన వర్షంపడుతోంది. నాకు అసలే అంతగా వెళ్ళాలని లేదు. దానికితోడు వాతావరణం కుడా బాలేదు. కానీ అంత వర్షంలో తడుచుకుంటూ పాలకొల్లు ప్రవచనం దగ్గరకి వెళ్లాను. పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపంలో ప్రవచనం జరుగుతోంది. అక్కడ స్టేజి కి దూరంగా కూర్చొని రెండు గంటలు పాటు విన్నాను. అయితే, ఈ తడవటం వలన అక్కడ ఎయిర్ కండిషన్ లో ఉండటం వలన ఆ కూలింగ్ కి నాకు జ్వరం వచ్చేసింది. నాన్నగారి స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత నాన్నగారు పక్కనే ఉన్న డాక్టర్ గారి ఇంటికి వెళ్ళారు. అప్పుడు నాన్నగారు గదిలో కూర్చుంటే నేను బయటి నుంచే డోర్ తీసుకొని లోపలికి వెళ్తూ నాన్నగారికి నమస్కారం చేశాను. అప్పుడు నాన్నగారు వెంటనే భగవాన్ వాక్యం ఒక్కటి చెప్పారు, "మనం గురువుకి నమస్కారం పెడతాం కదా! అది మనం పెట్టాము అనుకుంటాము కానీ అంతకు పూర్వమే గురువు మనకి హృదయంలో నమస్కారం పెడతాడు అప్పుడు నమస్కారం పెట్టాలి అనే బుద్ధి మనకి కలుగుతుంది".

ఆరోజు ఇప్పటికీ చాలా బాగా గుర్తు ఉంది. అప్పటికే జ్వరం వచ్చి కొంచెం వణుకుతూ ఉన్నాను. నేను దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, నాన్నగారు నన్ను మొదటసారి టచ్ చేశారు. ఆయన టచ్ తగలగానే ఆ జ్వరం, వణుకు అంతా పోయి శరీరం అంతా పులకించింది. ఆ టచ్ నాకు కొత్త అనుభవాన్ని ఇచ్చింది. ఇప్పుడు అవి అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే అనిపిస్తుంది. “గురువు యొక్క ఒక మాట చాలు, ఒక చూపు చాలు, ఒక స్పర్శ చాలు” అని నాన్నగారు చెప్పేవారు కదా అని. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకు వస్తూ ఉంటే ఆ అనుభూతి ఏమిటని ఇప్పుడు అర్థమవుతోంది. దాని తర్వాత నుండి నాన్నగారి ప్రవచనం వినేవాడిని. బాగా అర్ధమయ్యేది , బావుంది కదా అనుకునేవాడిని. చాలా తెలియని విషయాలు నేర్చుకునే వాడిని. నాన్నగారి ప్రవచనాలలో భగవాన్ సబ్జెక్టు చెప్పినప్పుడు మాత్రం ఎక్కువ ఆనందంగా అనిపించేది. మొత్తం స్పీచ్ లో నాన్నగారు భగవాన్ గురుంచి చెప్పే విషయాలు మాత్రం చాల శ్రద్ధగా వినేవాడిని . ఏదో తెలియని బంధం ఉండేది భగవాన్ తో.

నాన్నగారితో కలసి మొదటిసారి నా అరుణాచల ప్రయాణం

నాన్నగారు అరుణాచలం వెళ్తున్నారని తెలిసి మొదటిసారి 2009లో అరుణాచలం వెళ్ళాను. అక్కడ నాన్నగారితో గాఢమైన అనుబంధం ఏర్పడింది. అలాగే అక్కడ గిరితోను చాలా అనుభవాలు జరిగాయి. అలా మొదటిసారి నాన్నగారితో అరుణాచలం వెళ్ళి వచ్చినప్పటినుండి, నాన్నగారు ప్రవచనాలు బాగా అర్థం అవటం మొదలయ్యింది. భగవాన్ విచారణ ఇలాంటివి చేసుకోవటం వచ్చింది. ఇక 2009 నుండి ఒక రెండు సంవత్సరాలు అయితే పూర్తిగా భక్తిలోనే ఉండేవాడిని. అంటే అరుణాచలేశ్వరుడుతో ఏర్పడిన అనుబంధం అనుకోవచ్చు లేక ముందు జన్మల బంధం అనుకోవచ్చు. చాలా గాఢమైన అనుబంధం అరుణాచలంతో ఉండేది. అది ఎలాగంటే, నా ప్రక్కన ఎవరైనా అరుణాచలం అనే మాట పలికేసరికి నాకు లోపల నుండి విపరీతమైన దుఃఖం వచ్చేసేది. ఆ భక్తి కూడా గాఢమైన భక్తి. అయన తప్ప ఇంకో జీవితం ఉంది మనకి అని అనిపించేది కాదు. అంటే అక్కడ ఎక్కడ తిరిగినా ఆయన అనుగ్రహమంతా నన్ను స్పర్శిస్తున్నట్టే ఉండేది. కానీ ఈ జ్ఞానాలు, విచారణలు అన్నీ అంటున్నారు కదా! దీని కన్నా అది తియ్యగా అనిపించేది. ఇంకేం కావాలి మన జీవితానికి? అనిపించేది. 

అరుణాచలం వేళ్ళకుండా ఉండలేకపోయేవాడిని, ఎవరైనా అరుణాచలం గురించి మాట్లాడితే ఆనందం. అదీ నాన్నగారితో కలిసి చూసినందుకు ఇంకా ఆనందం. అలాగే రెండు సంవత్సరాలు గడిచింది. అప్పుడు ఇంకో సమస్య ఎదురైయ్యింది. అది ఏమిటంటే నాన్నగారితో స్వయంగా మాట్లాడాలంటే భయంగా ఉండేది. జిన్నూరు వెళ్ళినా కూడా మెట్లు కింద నుండే నాన్నగారి కి నమస్కారం పెట్టేవాడిని. ఏమైనా చెప్పాలి అంటే ఎవరో ఒకరి ద్వారా చెప్పించేవాడిని. వారు నాన్నగారితో చెప్పేవారు. నాన్నగారితో మాట్లాడుతూ ఉంటే నాకు వణుకు వచ్చేసేది. అది భయం అని చెప్పలేము, ఆయన దగ్గర ఏదో విధేయతగా ఉండాలి అనిపించేది.

అరుణాచలమే నా స్థిర నివాసం అని నాన్నగారికి నా లేఖ

ఒకవిధంగా అరుణాచలం పట్ల ఏర్పడిన ప్రేమ, అనుబంధం వలన ఎలాగైనా అరుణాచలం వెళ్ళిపోవాలి అనిపించేది. నాన్నగారికి చెప్పాలి అని ఒక పేపర్ లో ఇలా రాసాను: "నాన్నగారు నాకు అరుణాచలంతో బంధం ఉంది అండి , నాకు ఇక్కడ ఈ జనాలు అందరిలోనూ ఈ పరిసరాలలో ఉండాలనిపించటం లేదు. రామకృష్ణుడు అంటాడు, రాబందుల దృష్టి ఎప్పుడు శవాల మీద ఎలా తిరుగుతూ ఉంటుందో అలాగే, మన హృదయంలో చైతన్యం ఉన్నా మనకి దాని మీద కంటే బాహ్య విషయాల మీదకే మనసు వెళ్ళిపోతోంది అని, ఆలా ఈ ప్రపంచంలో ఉంటే నా మనసు కూడా వెళ్లిపోయేలా ఉంది నాన్నగారు. నేను ఇక్కడ ఉన్నట్టే అరుణాచలంలో బ్రతుకుతాను, నాకు అక్కడ శాంతి గా ఉన్నప్పుడు నేనెందుకు కోల్పోవాలి? అక్కడికి వెళ్తాను" . నాన్నగారు అది మొత్తం చదివి బాగానే ఉందమ్మా ఇవి అన్ని జరగటానికి స్వప్రయత్నం, కాలపరిపక్వము, ఈశ్వర అనుగ్రహం ఉండాలి అని ఈ మూడు వాక్యాలు చెప్పి నా కళ్ళలోకి చూస్తూ నువ్వు ఎక్కువసార్లు అరుణాచలం వెళ్ళకు. సంవత్సరానికి ఒకసారి వెళ్తూ ఉండు తరుచూ వెళ్ళవద్దు అని చెప్పారు. దాని తర్వాత ఎప్పుడన్నా అరుణాచలం వెళ్ళడమంటే నాన్నగారు వెళ్ళినప్పుడు వెళ్ళటమే కానీ విడిగా వెళ్ళలేదు

ఈ సృష్టిలో దేహాలు అన్నీ కుడా భగవాన్ ప్రతిరుపాలే

2011 లో ఒకసారి నాన్నగారుతో పాటు అరుణాచలంలో ఉన్నప్పుడు ఏమైందంటే, నాన్నగారి ఆశ్రమంలో ప్రతీరోజూ సత్సంగం జరిగేది. ఒకరోజు సత్సంగంలో నాన్నగారు చెప్పిన ఒక వాక్యం నన్ను చాలా ఆకర్షించింది. ఆ వాక్యం ఏమిటంటే కర్త లేని కర్మ చేయమన్నారు. ఆ మీటింగ్ అంతా అదే పాయింట్ నాకు బాగా కనెక్ట్ అవ్వటం వలన ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నాన్నగారు నడిచి పైకి మెట్లు ఎక్కుతారు కదా, మనము అప్పుడు ఇరువైపులా నిలబడతాము. నాన్నగారు చెప్పిన ఆ వాక్యం గురించి ఆ సమయంలో నాకు అప్పటికే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మనసులో నాన్నగారు మీ అనుగ్రహం లేకుండా కర్త లేని కర్మ మేము ఎలా చెయ్యగలము అని ఆయన వైపు చూస్తూ అనుకుంటున్నాను. ఆయన నా వైపు తిరిగి నా భుజాన్ని నొక్కి పెట్టి ఉంచి మూడు సార్లు కొట్టారు. అప్పుడు ఒక నవ్వు నవ్వారు. నాన్నగారుఎప్పుడూ నవ్వే నవ్వు కంటే ఆ నవ్వు చాలా కొత్తగా అనిపించింది. నాన్నగారు పైకి వెళ్ళిపోయారు, ఏమిటి ఇలా నవ్వారు అని అనుకున్నాను. తర్వాత నేను రమణాశ్రమానికి వెళ్ళిపోయాను.

నేను రమణాశ్రమానికి వెళ్ళేసరికి సమయం ఆరు గంటలు అయ్యింది. రమణ సద్గురు పారాయణ జరుగుతోంది. ఆ రోజు శనివారం. నాన్నగారు తెలిసినప్పటి నుండిగానీ అంతకు ముందు గానీ ధ్యానం అనేది ఒకచోట కూర్చుని చేసే అలవాటు ఎప్పుడూ లేదు. అలాంటిది ఆరోజు నేను హాల్ లో కూర్చోగానే ఏమి జరిగిందంటే నా ప్రమేయం ఏమీ లేకుండానే కళ్ళు మూతలు పడిపోయాయి, ధ్యానంలోకి వెళ్ళిపోయాను. రమణ సద్గురు వినిపిస్తోంది కానీ నేను చెప్పలేనుటువంటి శాంతిలోకి వెళ్లాను. నా మనసుకి అందనటువంటి శాంతి లోపల హృదయంలో నుండి వస్తూ ఉంటే, ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. కాని కళ్ళు తెరవలేకపోతున్నాను. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరూ లేగుస్తారు కదా. అతి కష్టం మీద నేను కళ్ళు తెరిచి చూస్తే అక్కడున్న భక్తులందరూ నాకు భగవాన్ ప్రతిరూపాలుగా కనిపించారు. అంటే ఆయన మాత్రమే ఉన్నారు అన్న భావన గట్టిగా నాటుకుపోయింది. ఆరోజు భగవాన్ సన్నిధిలో ఎంత శాంతి అంటే మాటల్లో వర్ణించలేను. ఈ సృష్టి అంతా ఇంత అందంగా ఎలా ఉంది అని అనిపించింది. దాన్ని వర్ణించడం కూడా కష్టమే అనిపించింది. ఆ అనుగ్రహంలో ఉండిపోయాను చాలాసేపు, ఎంతో అద్భుతంగా ఉంది, శాంతి ఉంటే నిజంగా ఇంత ఆనందంగా ఉంటుందా అనిపించింది.

భగవాన్ అనుగ్రహం ఎప్పుడూ నీకు ఉంటుంది అని నాన్నగారి అభయం

మరునాడుు నాన్నగారికి నాకు జరిగిన అనుభవం అంతా రాసి ఇచ్చాను. అప్పుడు నాన్నగారు "నీకు భగవాన్ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. నువ్వు సబ్జెక్టు ప్రోపర్ గా అర్ధం చే సుకోవటానికి భగవాన్ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అని చెప్పారు". జీవితంలో ఆ ఒక్క వాక్యము సరిపోతుంది అనుకున్నాను.

No comments:

Post a Comment