Tuesday, April 4, 2023

"ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూపం నాన్నగారు" - (పరమపదించిన సరస్వతమ్మ గారు)

సరస్వతి దేవి గారు తణుకు ప్లీడర్ సూర్య నారాయణ రాజు గారి కుమార్తె. ఆమెను చిన్నప్పుడు ఒకసారి ఎవరో తిడితే ఆ విషయం తన తండ్రితో చెప్పారు. దానికి ఆమె తండ్రి, గాలి అటు వీస్తూ వెళుతోంది కదా! ఆ తిట్లు కూడా అలా గాలిలో కలిసి వెళ్లిపోతాయి అన్నారు. అప్పటినుండి ఎవరు ఏమన్నా ఆమె పట్టించుకునేవారు కాదు. ప్లీడర్ గారు బెనారస్ లో Law పాసైన రోజునే ఈమె పుట్టారని సరస్వతి అని పేరు పెట్టారు. ప్రపంచంలో సహృదయలందరూ వాటాదారులే అని భగవాన్ రంగన్ తో చెప్పినట్లు, నాన్నగారు ప్లీడర్ గారి సహృదయానికి తరచుగా తణుకు వెళ్ళేవారు. నాన్నగారు ఆయనకి రామనామం ఇచ్చారు. ఆయన తుది శ్వాస వదిలే వరకు రామనామం విడిచిపెట్టలేదు. ప్లీడర్ గారు చనిపోయిన తరువాత నాన్నగారు ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన చాలా నిరాడంబరుడు. కోర్టులో వాదించినప్పుడు ఫీజు ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు అన్నారు. ప్లీడర్ గారి సహృదయం గురించి నాన్నగారు ఒక చిన్న సంఘటన ఈ విధంగా చెప్పారు. ఒక వ్యక్తి ప్లీడర్ గారికి రు. 25,000 ఇవ్వాల్సి వస్తే, అతను వచ్చినప్పుడు అడగమంటారా అంటే, అతన్ని అడగవద్దు అతను ఏమి ఇబ్బందుల్లో ఉన్నాడో అందినప్పుడు ఇస్తాడు అన్నారట. ప్లీడర్ గారు చనిపోయిన పదకొండో రోజు నాన్నగారు రమణ అష్టోత్తరం పుస్తకాలపై ఆయన ఫొటో వేయించి అందరికీ పంచారు. 1992 లో సరస్వతమ్మ గారికి స్వప్నంలో నాన్నగారు పువ్వుల దండతో కనిపించారు. మర్నాడు జూబ్లీహిల్స్ లో ఆవిడకి స్వప్నంలో కనిపించినట్టే నాన్నగారు దర్శనమిచ్చారు.

ఆ రోజు నుండి ఇప్పటివరకూ సరస్వతి గారికి అన్నీ నాన్నగారే. ఆవిడ నాన్నగారిని శాంతిని ఇమ్మని ప్రార్థించేవారు. ఆవిడకి అందరూ సమానమే! అందరి క్షేమాన్ని కాంక్షించేవారు. ఆమె భర్త దత్తుడు గారు. మొదటిసారి నాన్నగారు అజ్రం వెళ్ళినప్పుడు దత్తుడు గారి తల్లి ఫోటోవైపు చూస్తూ, ఆమె తల్లి భగవాన్ ని దర్శించుకున్నారు ఆ బంధమే నన్ను ఇలా తీసుకొచ్చింది అన్నారు. దత్తుడి గారి తల్లి సుబ్రహ్మణ్య స్వామికి గుడి కట్టించారు. దత్తుడు గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు రోజు గుర్తుకొస్తూనే ఉంటారమ్మా అన్నారు. దత్తుడు గారు ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించారు. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు. దత్తుడి గారికి ఆరోగ్యం బాగా లేనప్పుడు నాన్నగారు చూడటానికి వచ్చి, ఈశ్వరుని బొమ్మ ఆయనకి ఎదురుగా ఉంచమని ఇచ్చారు. ఆయన తుదిశ్వాస వదిలేవరకు అది మంచం పక్కనే పెట్టుకుని ఉన్నారు. దత్తుడు గారు చనిపోయాక నాన్నగారు ఆయన ఫోటో పెద్దది కట్టించి తణుకు క్షత్రియ కళ్యాణ మండపంలో పెట్టారు.

1993లో గురు పౌర్ణమికి 30 మందితో కలిసి సరస్వతమ్మ గారు అరుణాచలం వెళ్ళారు. రమణాశ్రమంలో వంటశాల దగ్గరనుండి చిన్న కొండ స్పష్టంగా కనిపించేది. అప్పట్లో చెట్లు ఎక్కువ ఉండేవి కావు. ఒకరోజు సాయంకాలం సరస్వతమ్మ గారికి నాన్నగారు అక్కడ నిలబడి ఆశీర్వదిస్తూ కనిపించారు. ఆవిడ అక్కడ ఉన్న అందరినీ పిలిచారు. నాన్నగారు చాలాసేపు ఆ విధంగా దర్శనమిచ్చారు. తరువాత రెండు నెలలకి నాన్నగారు హైదరాబాద్ వచ్చారు. ఆరోజు నాన్నగారు చెప్పిన మొదటి వాక్యం ఏమిటంటే "బాహ్యంగా ఎంత సేపు చూస్తారు? హృదయంలోకి చూడండి" అన్నారు. అప్పుడు సరస్వతమ్మ గారికి అరుణాచలేశ్వరుడే నాన్నగారు అని అర్థమయింది. నాన్నగారు చాలాసార్లు అజ్రం వచ్చేవారు. వచ్చినప్పుడు ఇక్కడ అరుణాచలంలో ఉన్నట్టు ఉందమ్మా అనేవారు. అక్కడ రెండు మూడు రోజులు ఉండేవారు. అలా మే నెలలో అజ్రం వచ్చినప్పుడు, నాన్నగారు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడానికి రూములోకి వెళ్ళగానే కరంటు పోయింది.

నాన్నగారు విశ్రాంతి తీసుకొని బయటికి వచ్చిన తరువాత ఆవిడతో, సరస్వతమ్మ గారూ నేను గదిలో లోపల ఉన్నాను కదా అయినా వేడి తెలియలేదు అన్నారు.

ఒకసారి ఏదో విషయంలో ఆవిడ కూతుర్లు ఆమెని, కోడళ్ళు చూసుకుంటారు నీకెందుకు అని విసుక్కున్నారు. ఆ రోజు మధ్యాహ్నం సరస్శతమ్మ గారు అందరితో కలిసి జిన్నూరు వెళ్ళారు. నాన్నగారు ఆవిడకి దగ్గరగా కుర్చీ వేసుకుని ముందుకు ఒంగి ప్రేమతో, సరస్వతమ్మ గారూ మీకు ఏమి ఇవ్వగలను? మీకు మోక్షం ఇమ్మని భగవంతుడిని ప్రార్థిస్తాను. ఆయన మోక్షం ఇవ్వాలనుకుంటే పిల్లల మీద మమకారం పోవటానికి వారితో తిట్టిస్తాడు అన్నారు.

కన్నమ్మ గారు సరస్వతమ్మ గారితో, మిమ్మల్ని నాన్నగారు రోజు తలుచుకుంటారు అన్నారు. అదేవిధంగా నాన్నగారు కూడా సరస్వతమ్మ గారితో మీరంటే కన్నమ్మగారికి చాలా ఇష్టమండి అన్నారు. కన్నమ్మ గారు ఎక్కడికి వెళ్ళకపోయినా, అజ్రం మాత్రం రెండు మూడు సార్లు వెళ్ళారు. అప్పుడప్పుడు సరస్వతమ్మ గారితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. తరచూ సరస్వతి గారికి స్వీట్సు, పళ్ళు పంపుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కన్నమ్మ గారు సరస్వతి గారికి ఫోన్ చేసి మిమ్మల్ని చూడాలని ఉంది నేను రాలేను. నాన్నగారు ఎప్పుడైనా మజ్జిగ తాగేవారు. ఆ గ్లాసు మీకు ఇవ్వాలని ఉంది అది పంపిస్తాను అన్నారట. సరస్వతమ్మ గారికి ఎన్నోసార్లు నాన్నగారు కలలో కనిపిస్తూ ఉంటారు. ఆమెకు భావనాబలం బాగా ఉంది. ఆమె ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఎంతోమంది అజ్రాన్ని పుట్టినిల్లు లా భావిస్తూ ఉంటారు. కన్నమ్మ గారి లాగానే సరస్వతమ్మ గారు కూడా దీపావళి తోరాలు వందలకొలది పంచుతారు.

ఒకసారి నాన్నగారు హైదరాబాద్ లో ఒక భక్తుల ఇంట్లో ఉండగా సరస్వతమ్మ గారు వచ్చారు. నాన్నగారు కాసేపు దర్శనమిచ్చి ఎవరో కలవటానికి వచ్చారని గదిలోకి వెళ్ళి పోయారు. ఆవిడ అక్కడే గుమ్మం దగ్గర నిలబడి ఇంకొకసారి దర్శనం అవుతుందని ఎదురుచూస్తున్నారు.

నాన్నగారు తలుపులు తీసి, ఆమె రెండు చేతులను నాన్నగారి తలపై పెట్టుకుని అలాగే చాలా సేపు ఉండి పోయారు. సరస్వతమ్మగారు ఆ ఆనందాన్ని, శాంతిని తట్టుకోలేక పోయారు. ఆమె కుమార్తెలతో నాన్నగారు, మీ అమ్మగారిలో చాలా హుందాతనం ఉందమ్మా అన్నారు.

2015 లో సరస్వతమ్మ గారి మేనకోడలు వేణమ్మ జిన్నూరు వెళ్ళారు. నాన్నగారు ఆమెను నువ్వు ఉదయం రాలేదేమిటి అని అడిగారు. అత్తయ్య ని చూడటానికి వెళ్ళాను అని వేణమ్మ చెప్పారు. నేను అజ్రం వెళ్ళాలి రేపు ఉదయాన్నే వెళదాము అన్నారు. మరుసటి రోజు ఉదయం నాన్నగారే స్వయంగా, సరస్వతమ్మ గారి ఇల్లు నాకు భాగా తెలుసు అంటూ డ్రైవర్ కి దారి చూపిస్తూ తీసుకువెళ్ళారు. కారు దిగిన తరువాత స్పీడ్ గా లోపలికి సరస్వతమ్మ గారి దగ్గరకు వెళ్ళి కుర్చీ దగ్గరకు జరుపుకుని, మీకు మోక్షం రాకుండా ఆపే అవకాశం లేదు. మీరు స్వర్గ రాజ్యం పొందుతారు. మీరు శాంతి, ఆనందం పొందాలి అంటూ ఆ ఆశీర్వాదంతో కూడా నాన్నగారు తృప్తి చెందకుండా, మీరు నిర్వాణ సుఖం పొందాలి. మీరు నామం కూడా చెయ్యక్కరలేదు అల్టిమేట్ స్టేట్ పొందాలి అన్నారు. అక్కడే ఉన్న కొడుకులతో, కోడళ్ళతో ఆమెను చూసుకోవటం మీ అదృష్టం. ఆమెకు కుమార్తెలు కూడా గుర్తుకురాకూడదు. అంటే మీరు అంత బాగా చూసుకోండమ్మా! మీరు యజ్ఞాలు, యాగాలు చెయ్యక్కర్లేదు. ఆమెను చూసుకుంటూ, ఆమెకు సేవ చెయ్యండి అదే మీ అదృష్టం అన్నారు.

నాన్నగారి రెండు చేతులు సరస్వతమ్మ గారి నుదుటి మీద పెట్టి ఉంచారు. అప్పుడు నాన్నగారు, సరస్వతమ్మ గారు ఇద్దరూ కూడా తేజస్సుతో వెలిగిపోయారు. నాన్నగారితో కలిసి అక్కడికి వెళ్ళిన వేణమ్మ ఇదంతా చూసి, నేను ఎంత పుణ్యం చేసుకున్నానో ఈ దృశ్యం చూసే భాగ్యం నాకు కలిగింది. ఆ ప్రేమ, ఆ దయ ఆ అనుగ్రహం చూసే అదృష్టం నాకు కలిగింది. అది నాన్నగారు నాకు ఇచ్చిన బహుమతి అనుకున్నారు. ఆమె జీవించిన జీవిత విధానానికి నాన్నగారు అక్కడికి వచ్చి ఆమెను అలా అనుగ్రహించారు అనిపించింది. సరస్వతమ్మగారికి సత్సంగం అంటే చాలా ఇష్టం. సత్సంగం అయిన వెంటనే ఫోన్ చేసి ఏమి చెప్పారు? అని అడుగుతారు. దూరం నుంచి వస్తారు కదా భోజనాలు పెట్టుకోండి అంటారు. కుమార్తెల కి వారి అత్తగారిని ఎప్పుడూ బాగా చూసుకోవాలి అని చెప్పేవారు.

ఒకసారి లక్ష్మిగారి ఇంట్లో సరస్వతమ్మ గారిని జ్యోతి వెలిగించమన్నారు. ఒకసారి అరుణాచలంలో సరస్వతమ్మ గారు, లక్ష్మి గారు రమణాశ్రమంలో ఒకే రూమ్ లో పడుకున్నారు. లక్ష్మి సామాన్యం కాదు, లక్ష్మిలో కూడా శాంతి ఉంది అన్నారు. ఆ రాత్రంతా శాంతిలో ఉండి సరస్వతమ్మ గారు నిద్రపోలేదు. ఒకసారి 1993లో తణుకులో ఎవరింటికో నాన్నగారు వెళ్ళారు. ఒక ఆమె తల నొప్పి భరించలేక పోతున్నాను అని నాన్నగారితో చెప్పారు. నాన్నగారు కళ్ళల్లోంచి ఒక మెరుపు చుక్కలా వచ్చి ఆమె కళ్ళలోకి వెళ్ళింది. నాన్నగారు తల నొక్కుకుంటూ ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. క్రమేపీ ఆమెకు తల నొప్పి తగ్గింది. సెప్టెంబర్ 23 న నాన్నగారి జయంతి రోజు రాత్రి 12 గంటలకు సరస్వతమ్మ గారికి ఎందుకో మెలుకువ వచ్చింది. నాన్నగారికి హ్యాపీ బర్త్ డే అని చెప్పి పండ్లు సమర్పించి దన్నం పెట్టుకున్నారు. ఇది అంతా ఆయన కృప అన్నారు. సరస్వతమ్మ గారికి 90 సం॥ ల వయస్సు ఉన్నప్పటికీ రోజంతా నాన్నగారి ప్రవచనాలు వింటూనే ఉంటారు. అవి అందరికీ షేర్ చేయటం ఆవిడకి ఇష్టం. ఎవరైనా, ఏ విషయంలో అయినా సరస్వతమ్మ గారిని తప్పు పట్టినా, ఆవిడలో ఏ విధమైన రియాక్షన్ ఉండదు. నాలో ఉన్న తప్పులు గురించి నాకు చెప్పండి నాకు తెలియదు కదా అంటారు. అలా ప్రతీదీ అంగీకరిస్తారు. ప్రతిరోజూ ఇద్దరు ముగ్గురు అనాధలు వారింట్లో భోజనం చేసేవారు. ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన వంట చేస్తే పెద్దవారికి పంపేవారు. ఇంటికి వచ్చిన వారిని ఊరికే పంపటం సరస్వతమ్మగారికి ఇష్టం ఉండదు.

Wednesday, October 26, 2022

"నామం హృదయంలో చేసుకోండి" - (సూర్యకాంతమ్మ గారు)

నాన్నగారి వద్దకు వచ్చే, నిగూడ భక్తులలో సూర్యకాంతమ్మ గారు ఒకరు. వీరి పుట్టినిల్లు గుమ్మలురు గ్రామం. పుట్టింటి వారి ద్వారా నాన్నగారు ఆమె జీవితంలోకి ప్రవేశించారు. ఆమె చిన్నప్పటి నుండి కృష్ణ భక్తురాలు. ఆమెకు తరచూ కృష్ణడు స్వప్న దర్శనం అయ్యేది. ఒకసారి, కృష్ణుడు స్వప్నంలోకి వచ్చి, నా నిజరూప దర్శనం చూపించమంటావా అని అడిగి, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నానని చెప్పి, అలాగే పరమాణువు కంటే చిన్నగా కూడా ఉన్నానని వివరించాడట. ఆ చెప్పే క్రమంలో, సురేకాంతమ్మ గారికి కూడా తనని తాను కోల్పోతున్న భావన కలిగి కృష్ణా! నాకు భయం వేస్తొంది అని అరిచారట. ఇప్పుడు నీకు వివరించినా అర్థం కాదు; నీకు 40వ సంవత్సరం వచ్చిన తరువాత, మరలా నీ వద్దకు వచ్చి చెబుతాను, అప్పుడు నీకు అర్థమవుతుందని చెప్పాడట. సరిగ్గా ఈమెకు 40 సంవత్సరాలు వచ్చిన తరువాత, నాన్నగారి ప్రవచనం కాపవరంలో విన్నారట. నాన్నగారు, కాంతమ్మ గారిని ఆయన ప్రక్కనే కూర్చోబెట్టుకుని కృష్ణుడు గురించి చెబుతూ, మధ్య మధ్యలో మీకు కృష్ణుడు కనిపించాడు కదా! అని అన్నారట. అప్పుడు కాంతమ్మ గారి మదిలో, ఆనాడు స్వప్నంలో కనిపించిన కృష్ణుడే, ఈనాడు నాన్నగారి రూపంలో వచ్చి బోధిస్తున్నారు అనే స్పురణ కలిగిందట. ఒకసారి కాంతమ్మ గారు, నామం పైకి ఉచ్చరిస్తూ నాన్నగారి ఇంటి ప్రాంగణంలోకి వెళ్ళారట. అప్పుడు నాన్నగారు, కాంతమ్మ గారు నామం మనసులో జపించండి, శబ్దాన్ని పైకి రానివ్వద్దు, ఆ శబ్దం ఎక్కడినుండి వస్తోందో గమనిస్తూ ఉండండి అని చెప్పారట. ఆనాటి నుండి, ఆమె జీవితంలో ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయి. తుది శ్వాస విడిచే వరకు భగవాన్ చెప్పిన విచారణ మార్గంలోనే ఉంటూ.. శ్రావణ శుక్రవారం రోజున, దేహం వదిలారు.

 

Sunday, October 23, 2022

"ఈశ్వరుడే నాన్నగారు రూపంలో" - (రామచంద్ర రాజు గారు)

నేను ఆంధ్రపత్రికలో విలేఖరిగా చేస్తూ ఉండే వాడిని. నాన్నగారిని దర్శించక ముందు నుండే ఆద్యాత్మిక విషయాలు తెలుసుకోవాలని కుతూహలం గా ఉండేది. నేను వడ్లవానిపాలెంలో ఉండగా, సుబ్బరాజుగారు మా ఇంటికి వస్తూ ఉండేవారు. అలా వచ్చినప్పుడు ఒకసారి నాకు భక్తి గురించి చాలా ఇష్టంగా ఉంది అని చెప్పాను. ఆయన నాన్నగారు అని జిన్నూరులో ఉన్నారు వెళ్దాం రండి అన్నారు. అంతకుముందే నేను ఒకసారి నాన్నగారు ప్రవచనం విన్నాను ఒక ప్రవాహం లాగా చెప్పటం వలన నాకు అర్థం కాలేదు. సరే అయినా రమ్మంటున్నారు బాగోదు కదా అని వెళ్ళాను. మేము వెళ్ళే సరికి సాయంత్రం 5 అయ్యింది. నాన్నగారు అప్పుడే భోజనం పూర్తిచేసుకొని అరుగు మీద ఉన్న పుస్తకాల రూమ్ లో ఉన్నారు. నన్ను అక్కడకి తీసుకువెళ్ళి సుబ్బరాజుగారు వెళ్ళిపోయారు. నేను నాన్నగారు మాత్రమే అరుగు మీద ఉన్నాము. నన్ను చూసి నా యోగక్షేమాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత నుండి ప్రతిరోజూ నాన్నగారి దర్శనానికి వచ్చేవాడిని. ఆ సమయంలోనే రెండోసారి దర్శనం చేసుకున్నప్పుడు నాన్నగారి మాటలు విన్న తర్వాత నుండి, ఇంటికి వెళ్ళినా కూడా ఆయనే ఉండేవారు. నా కూడా ఉన్నట్టు అనిపించేది. ఆ ఆనందాన్ని పట్టలేక పోయేవాడిని. ఈశ్వరుడే గురు రూపం ధరించి వస్తాడు అని, హృదయం లోనే ఆనందం ఉంది అని కానీ ఆయన సబ్జెక్ట్ వినక ముందు నాకు తెలియదు. అలా సబ్జెక్ట్ వినక ముందే నాన్నగారిని చూసినప్పుడు ఆనందం వస్తూ ఉండేది. ఏంటి ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తోంది అనుకునేవాడిని. నాన్నగారు నాలోనే, నాతోనే ఉంటూ నిరంతరం ఆయన సమక్షంలో గడిపే మహోన్నతమైన వరాన్ని నాకు ప్రసాదించారు. నాలో ఉన్న వాసనలు అన్నీ నాన్నగారు తీసేసి, నా హృదయాన్ని ఖాళీ చేశారు. అను నిత్యం ఆయన సమక్షంలో గడపటమే నాకు సాధన. అప్పట్లో నేను ఒక్కడినే నాన్నగారి దగ్గర ఉండటం వలన నాకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉండేవాడిని. అలా ఒక సారి మధ్యాహ్నం 1:00 కి వెళ్ళినప్పుడు నాన్నగారు పడుకుని ఉన్నారు. నేను వెళ్ళేసరికి, రండి, రామచంద్రరాజు గారు మీ గురించి చూస్తున్నాను అన్నారు. నేను ఏమీ నాన్నగారిని మంత్రం అడగకుండానే "హే భగవాన్ , ప్రియా భగవాన్, శ్రీ గురు దేవులు, సద్గురు రమణులు" అనే మంత్రాన్ని ఇచ్చారు. నాకు అప్పటికీ మంత్రం ఇస్తారని కూడా తెలియదు.

ఒకసారి నాన్నగారు అరుణాచలం వెళ్దాం అన్నారు సరే అని చెప్పి పాలకొల్లు వచ్చేసాను. తరువాత నాన్నగారు పాలకొల్లు సంతకు వస్తూ ఉండేవారు. అలా సంతకి వచ్చినప్పుడు ఒకసారి కూరగాయలు కొనుక్కుని మా షాప్ దగ్గరికి వచ్చి రామచంద్ర రాజు గారు అరుణాచలం వెళ్లి వచ్చేద్దాము సిద్ధంగా ఉండండి, టికెట్ తీసుకున్నాను అన్నారు. ఆత్మ ఒక్కటే సత్యం అంటున్నారు కదా! ఇవి అన్నీ వెళ్ళటం అవసరమా నాన్నగారు అని అడిగాను. నాన్నగారు " రాజీ లేదు, తిరుగు లేదు ఆత్మ ఒక్కటి మాత్రమే సత్యం" అన్నారు నాన్నగారు.

ఈశ్వరుడే గురు రూపంలో నాన్నగారిలా వచ్చారు అని తెలిసినా, మనసులో అంత పట్టు కుదరక ఆయనని ఒక స్నేహితుడి లాగా చూశాను. మీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పారు. చాలా యాత్రలకు మేము ఇద్దరమే వెళ్ళేవాళ్ళము. అలా మొదటసారి అరుణాచలం వెళ్తుంటే, గిరి కనిపించగానే అదిగో రామచంద్ర రాజుగారు అదే అరుణాచలం గిరి అని చెప్పారు. ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి అరుణాచలం వెళ్ళే వాళ్ళము. అలా ఒకసారి అరుణాచలం వెళ్ళి అక్కడ నుండి చిదంబరం, కుంభకోణం, తిరుచందూర్, స్వామిమలై, తిరుచంద్రాపురం, కన్యాకుమారికి వెళ్ళాము. కన్యాకుమారి నుండి మద్రాసు బస్సులో ప్రయాణించాము. చాలా సమయం పట్టింది. నాకు బస్సు ప్రయాణాలు పడక పోవటం వలన వాంతులు అవుతూ ఉండేవి.ఆ ట్రిప్పు మాత్రమే వాంతులు అయ్యాయి. తర్వాత నుండి ఎక్కడికి వెళ్ళినా నాకు వాంతులు తగ్గిపోయాయి. నాన్నగారు అరుణాచలంలో ఉండగా మోరీ గెస్ట్ హౌస్ లో ఉంటూ, భోజనానికి బయటికి వెళ్ళే వాళ్ళము. అలా ఒకసారి నాన్నగారు నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే, “భోజనం తిని , భోజనానికి ఉండేవాడు బుద్ధిమంతుడు లక్షణం అని బుద్ధుడు చెప్పేవాడు, రామచంద్ర రాజు గారు” అన్నారు. అరుణాచలం నాన్నగారితో రెండోసారి వెళ్ళినప్పుడు గిరిప్రదక్షిణకి వెళ్ళాము. అలా గిరి ప్రదక్షణ చేస్తూ నడుచుకుంటూ మధ్య , మధ్యలో ఉన్న ప్రతి చిన్న గుడిని, ప్రతీ లింగాన్ని నాన్నగారు నాకు చూపించారు. నాన్నగారితో పాటు నడుచుకుంటూ భగవాన్ భక్తులైన సాధువు ఓం, అన్నమలై స్వామి దగ్గరకు వెళ్ళే వాళ్ళము. అలా వారందరిని నాకు పరిచయం చేశారు. ఒకసారి నాన్నగారు అరుణాచలం గిరి ప్రదక్షణకి నేను రాను, మీరు వెళ్ళండి అని చెప్పి, సాధు ఓం ఇంకో భక్తుడిని నాకు పరిచయం చేశారు. వారిద్దరితో కలిసి నాన్నగారు నన్ను గిరిప్రదక్షిణ చేయించారు. అలా వారితో కలిసి చెయ్యటం నా జీవితంలో మరుపురానిది.

ఒకసారి నాన్న గారితో కలిసి కొడైకెనాల్ పది రోజులు ఉండి వద్దామని వెళ్లాము. కానీ మేము తీసుకున్న కాటేజ్ చలి ఎక్కువగా ఉండటం వలన నాలుగు రోజులు ఉండి అరుణాచలం తిరిగి వచ్చేసాము. చాలాసార్లు శ్రీహరికోట కూడా వెళ్ళాము. అలా ఒకసారి శ్రీహరికోట నుండి అరుణాచలం వెళ్తుంటే, మధ్యలో సూళ్లూరుపేట నుండి చెన్నై రావటానికి ఒక ట్రైన్ ఎక్కాము. ట్రైను లో ఖాళీ లేకుండా ప్రయాణికులు అందరూ కిక్కిరిసిపోయి ఉన్నారు. ఆ ట్రైన్ లో Bath room దగ్గర నాలుగైదు గంటలపాటు నాన్నగారు కూడా అలాగే నిలబడి మద్రాస్ వరకు ప్రయాణం చేశారు. ఒకసారి భగవాన్ ఆత్మానుభవం పొందిన మదురై కూడా వెళ్ళాము. అక్కడ ఒక చాప ఇస్తే ఆ చాప మీదే ఆ రోజు రాత్రి పడుకున్నాము. నేను నాన్నగారు కలిపి అరుణాచలంలో ఒకే మంచం మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. నేను , నాన్నగారు అరుణాచలంలో గదిలో ఉన్నప్పుడు నాన్నగారికి ఆత్మానుభవం కలిగింది అంటారు కానీ, నేను నాన్నగారిని దర్శించక ముందే నాన్నగారు పొందవలసినది పొందారు. అందుకే ఆయన పొందిన సుఖం అందరికీ పంచి పెట్టాలని అప్పటికే ఆత్మ సుఖం గురించి అందరికీ బోధిస్తూ ఉన్నారు.

ఒకసారి నాన్నగారు నేను అరుణాచలంలో గుడి ని దర్శించుకున్నప్పుడు అపితకుచాంబ గుడి ఎదురుగా నాన్నగారు కూర్చుని ఆ కొండనే మౌనంగా చూస్తూ ఉన్నారు. నాన్నగారు అప్పుడు నాతో, “ఈ గిరి ఫైనల్ స్టేట్” అన్నారు. అలా నాన్నగారు ఎప్పుడూ ఆ గిరిని ఒక చైతన్యంగా, ఒక ఈశ్వరుడిగా మాత్రమే చూసేవారు.

1999వ సంవత్సరంలో నాన్నగారితో కలిసి బద్రి, రిషికేశ్ వెళ్ళాము. నాన్నగారితో కోయంబత్తూరు కూడా వెళ్ళాము అక్కడి నుండి కేరళలో ఉన్న కొన్ని పుణ్యక్షేత్రాలు కూడా వెళ్ళాము. కోయంబత్తూర్ లో ఉండగా నాన్నగారు భగవద్గీత చదువుతూ ఉండేవారు. అలాగే నాన్నగారితో పాటు నాగపూరు అక్కడి నుండి భీమశంకరం మరియు జ్ఞానేశ్వర్ మరియు భక్త తుకారాం ఉండే స్థలాలు కూడా చూసి వచ్చాము. అలా నాన్న గారితో చాలా సంవత్సరాల వరకు మేము ఇద్దరమే చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాము. అలా 38 సంవత్సరాలు నిరంతరంగా విరామం లేకుండా ఆయనతో ఈ జీవిత యాత్ర కొనసాగింది.

నాన్నగారితో అరుణాచలం వెళ్తున్నప్పుడు నా శరీరానికి కూడా ఆనందం వచ్చేస్తూ ఉండేది. శరీరానికే ఇంత ఆనందం వచ్చేస్తూ ఉంటే ఇంకా ఆత్మానందం వస్తే ఇంకా ఎంత వైభవంగా ఉంటుంది అనుకునేవాడిని. నాన్నగారు నాతో ఏమిటి ఇంత వైభవంగా ప్రయాణాలు చేస్తున్నారు అనుకునేవాడిని, ఆయన వైభవానికి సరిపోయే అర్హత ,యోగ్యత నాకు లేకపోయినా నన్ను ఎందుకు ఈయన ఎంచుకున్నారు అని అనిపిస్తూ ఉండేది.

తర్వాత నాన్నగారి ఇంటి దగ్గర ప్రవచనాలు జరుగుతూ ఉండేవి. నెమ్మది, నెమ్మదిగా భక్తులు రావటం వలన అరుగు మీద స్థలం సరిపోయేది కాదు. అప్పుడు జిన్నురు post master కూడా నాన్నగారి ప్రవచనాలు వింటూ ఉండేవారు. అలా జిన్నూరు పోస్ట్ ఆఫీస్ లో ప్రతి ఆదివారం ప్రవచనం ప్రారంభమయ్యింది. అలా పోస్ట్ ఆఫీస్ లో ఒక సంవత్సరం చెప్పిన తరువాత అక్కడ కూడా నిండిపోవడం వల్ల తరువాత వేరే చోట రమణ క్షేత్రానికి స్థలం తీసుకుంటే మంచిదని స్థలం తీసుకున్నాము గానీ, వెంటనే మొదలు పెట్టలేదు. వారంలో 2 లేదా 3 ప్రవచనాలు వేరే గ్రామాల్లో ఉంటూ ఉండేవి. నాన్నగారితోనే వెళ్ళేవాడిని. అలా వేరే వ్యాపకం ఏమీ లేకుండా, నాన్నగారితో నే నిరంతరం గడిపేవాడిని. అక్కడ వారు అడిగిన ప్రశ్నలకి నాన్నగారు వారికి సమాధానం చెబుతూ ఉండేవారు. అవి అన్ని పుస్తకాలు కింద రాస్తే ఎన్ని పుస్తకాలు అయ్యేవో అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఆయన చెప్పినవన్నీ మాధుర్యం మింగినట్టు మింగేసాను కానీ ఇతరులకి నేను పంచి పెట్టలేకపోయాను.

నాన్నగారు కూడా చిన్న గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడ జరిగిన ప్రవచనాలు అన్నీ రాసేవాడిని. నేను విలేకరి ని అవ్వటం వలన వాటిని పత్రికలలో ప్రచురించటానికి ఇచ్చే వాళ్ళము. అలా మేము పంపిన ప్రసంగాలు అన్నీ కూడా పత్రికా సంపాదకులు ప్రముఖ స్థానం ఇచ్చి వాటిని ప్రచురించేవారు. అప్పట్లో జిల్లా ఎడిషన్ లేకపోవటం వలన పత్రికల్లో ప్రచురించిన నాన్నగారి ప్రసంగాలు అన్నీ మెయిన్ పేపర్ లోనే వచ్చేవి.

నాన్నగారు జీవితంలోకి భగవాను ఎలా ప్రవేశించారు అదికూడా పత్రికల్లో వేయించడం జరిగింది. దాని వలన భక్తులందరికీ తెలుసుకోవటానికి ఎక్కువ ఉపయోగపడింది. అలా పత్రికలో ప్రచురించిన ప్రసంగాలు అన్నీ కూడా సేకరించి ఒక పుస్తకం కింద వేయిద్దాం అన్నారు నాన్నగారు. "శ్రీ నాన్నగారి ప్రవచనాలు" అని ఒక పుస్తకం ప్రచురించారు. నాన్నగారి సాహిత్యం చూడాలంటే భక్తులందరూ ఆ పుస్తకం చదివి తీరాలి. చాలాకాలం పుస్తకాలకి ముందుమాటగానీ, ఉపోద్ఘాతము కానీ వ్రాయవలసి వస్తే నన్ను ఒక గదిలోకి తీసుకు వెళ్ళి నాచేత నాన్నగారే స్వయంగా రాయించేవారు.

ఒకసారి గుమ్ములూరు లో ప్రవచనం నిమిత్తం నాన్నగారిని నా సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళే అవకాశం దొరికింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన సహజత్వం, ఆయన నిరాడంబరత్వానికి ఆయన సమక్షంలో నేను పొందిన అనుభూతులకు ఇది గురు శిష్యుల సంబంధమా! స్నేహితుల మధ్య ఉండే అనుబంధమా! ఏమిటి ఈ అనుబంధం అనిపిస్తూ ఉంటుంది. రమణాశ్రమంలో నాన్నగారికి కలిగిన అనుభూతిని నాతో పంచుకున్నారు..

నాన్నగారు భక్తులకి ఎవరికైనా ప్రవచనం గురించి మాట ఇస్తే, ఆ సమయానికి ఆయనకీ ఆరోగ్యం బాగో లేకపోయినా, ప్రవచనం మాత్రం చెప్పటం మానలేదు. అలాగ ఆయన భక్తులపై అపారమైన ప్రేమ కురిపిస్తూ ఉండేవారు. భక్తులకు ఆయనకు విడదీయరాని బంధం ఉండేది. ఏమైనా పని ఉంటే నాన్నగారు నాకు ఫోన్ చేసి రమ్మనే వారు అప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఆయనకు సంబంధించిన ప్రతి విషయంలోనూ నన్ను భాగస్వామిని చేశారు. అలాగా నిర్విరామంగా, విశ్రాంతి లేకుండా కర్మయోగియై జనులందరికీ ఉజ్వలమైన ఆధ్యాత్మిక భవిష్యత్తు అందించాలని కృషి చేస్తూనే ఉన్నారు. ఆయన చైతన్యం కాబట్టి ఆయనకు విశ్రాంతి అవసరం లేదు. కానీ ఆయనతో పాటు ఉన్న నాకు కూడా అలిసి పోతున్నాను అనే స్పృహ లేకుండా చేసేసారు.

ఒక్కొక్కసారి నాన్నగారు పిలిచే ఆ పిలుపుకి నా హృదయం ద్రవిస్తూ ఉండేది. ఆ పిలుపు నాన్నగారు హృదయం నుండి వచ్చేది కాబట్టి నాకు అంతు పట్ట లేని ఆనందం వచ్చేస్తూ ఉండేది. ఇంటికి వెళ్ళినా కూడా అది అలాగే ఉంటూ ఉండేది. నేను పడుకున్నప్పుడు నా మంచానికి ఎదురుగా భగవాన్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూస్తుంటే, నా కళ్ళు చెమ్మగిల్లేవి. కానీ నాకు నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాcయా, భగవాన్ కళ్ళు చెమ్మగిల్లుతున్నాయా అని అర్థమయ్యేది కాదు. అలా అంతా ఆనందంగా ఉండేది. శరీరానికి ఆనందం పెట్టాడు, లోపల ఆత్మలోని ఆ0నందం పెట్టాడు ఏమిటి ఇంత ఆనందం అనుకుంటూ ఉండే వాడినీ. అలా నాన్నగారు నాకు శరీర స్పృహ తెలియనివ్వలేదు. నాన్నగారు చైతన్యము అయ్యి చెప్పారు కాబట్టి అవి ఈ రోజు నదులు సముద్రాలు దాటుతున్నాయి. నాన్నగారి వాక్యాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. మా పిల్లల వివాహాలు అన్నీ కూడా నాన్నగారే బాధ్యత వహించారు. నన్ను నాన్నగారికి నీడ అంటారు కానీ, ఆయన నన్ను వదిలి పెట్టకుండా ఆయన వెంట అలా తిప్పుకున్నారు.

సూర్యుడు మనకి ప్రత్యక్షంగా ఎలా కనిపిస్తాడో, అలాగే గురువే మనకు ప్రత్యక్ష దైవం అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఆత్మానుభవం పొందిన గురువు దొరకటం చాలా కష్టం. లోపల హృదయంలో నాన్నగారు పొందిన ఆనందాన్ని ఇముద్చుకొలెక తాను పొందినది అందరూ పొందాలనె కాంక్షతో మన అందరికి పంచుతూ ఉండేవారు. ఆత్మానందం గురించి చెప్పటం చాలా కష్టం. కానీ నాన్న గారు మనకు అర్థమయ్యేలా చిన్న చిన్న ఉదాహరణలతో చెప్పేవారు. ఉపనిషత్తులు అవి రాసిన వారు వస్తువుని దర్శించి రాసారు అంటారు. నాన్నగారు చెప్పే సబ్జెక్టు మామూలు వారు చెప్పలేరు. అవి దర్శించి చెప్పిన వాక్యాలు. ఆ వాక్యాలు చదువుతూ ఉంటే, నాన్నగారికి దగ్గరగా ఉన్నా నేను చాలా మిస్ అయ్యాను అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు.

ఒక సారి పోస్ట్ ఆఫీస్ మీటింగ్ లో నాన్నగారు ప్రవచనం చెబుతూ మధ్యలో నా గురించి "రామచంద్ర రాజు గారు నా జీవితంలోకి ఆలస్యంగా ప్రవేశించినా నాతో చివరి వరకు ఉంటారు అన్నారు". భక్తుల సమక్షంలో అన్న ఈ మాట నూటికి నూరుపాళ్లు సత్యమైంది. అలాగా చివరి వరకు ఆయనతో ఉండే సాన్నిధ్యాన్ని నాకు కల్పించారు. ఒక జ్ఞాని సమక్షంలో నిరంతరం కలిసి ఉండటం ఆయన నాకు ప్రసాదించిన వరం.

ఎన్నో సందర్భాలలో నాన్నగారు నా చెయ్యి పట్టుకొని నడిచేవారు. అప్పుడు నాన్నగారు నన్ను చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు అని నేను అనుకునే వాడిని. కానీ నా జీవితం చివరివరకూ అలాగే ఆయన నన్ను చేయి పట్టుకొని నడిపించారని ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అలా వారి బోధ, మా ఇరువురి బంధం విడదీయరానిది.

నాన్నగారు జన్మరాహిత్యం పొందటానికి నాకు ఏ వాసనలు అడ్డు వస్తున్నాయో ఆ వాసనలు నేను గుర్తించేలాగా చేశారు అంతకు మించిన భాగ్యం ఏముంటుంది. భక్తుల జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేసినా అవి చెయ్యనివాడిలా చాలా calm గా భగవాన్ లా ఉండేవారు. భగవాన్ , నాన్నగారు వేరు , వేరు కాదు ఇద్దరు ఒక్కటే. నాన్నగారే భగవాన్, భగవానే అరుణాచలేశ్వరుడు కదా! అలా వారు ముగ్గురు ఒక్కటే అందులో ఏ మాత్రం తేడా లేదు. అలాంటి గురువుని మనము ఇక ముందెన్నడు చూడలేము. ఎప్పుడో గాని దేహం తీసుకోరు. కానీ నాన్నగారు మన కోసం మళ్ళీ దేహం ధరించి వస్తారు.

నాన్నగారికి వేదాల సారం, ఉపనిషత్తుల సారం అంతా తెలుసు. భగవదనుభవం పొందిన తరువాత కూడా నాన్నగారు పుస్తక పఠనం విడిచిపెట్టలేదు. ఏదైనా ఒక పుస్తకం చదివి దాని సారము మొత్తం వివేకానందుడిలా చెప్పేస్తారు. ఒకసారి ఉపన్యాసాలు ఇంత అద్భుతంగా ఎలా చెప్పగలుగుతున్నారు నాన్నగారు అని అడిగాను. దానికి నాన్నగారు, “మన గొప్పతనం ఏమీ లేదు రామచంద్ర రాజుగారు భగవాన్ పలికిస్తున్నారు” అనేవారు.

శ్రీ నాన్నగారి దర్శన భాగ్యం వలన, ఆయన సన్నిధి మాత్రం చేత, ఆయన బోధల వల్ల నేను మా ఇంటికి వెళ్లినా, ఏ పని చేస్తున్నా, నిద్రిస్తున్నా, నిరంతరం నా స్మృతిలో ఉంటూ, నాలో ఉంటూ, నన్ను నడిపిస్తున్నట్లుగా ఉండేది. నా హృదయాంతరాలలో నుండి ఒక తెలియరాని ఆత్మానందం వెల్లుబికి వచ్చేది. ఈ ఆనందం, ఈ వైభవం ఏమిటని నన్ను నేనే నమ్మలేక పోయేవాడిని. అలా ఆయనను చూసినంత మాత్రాన, ఆయన ప్రవచానాలు విన్నంత మాత్రాన ఆయనతో ఉన్న సన్నిహిత సహచర్యం వల్ల- ఆనందం, శాంతి, కాంతి, సత్యం,ప్రేమ నా స్వంతమై నా అనుభవంలో శాశ్వతమైతే ఇంక ఎంత బాగుంటుందోనని, అంతకంటే సాధించేది లేదనిపించింది. ఆయన చూపులో, వాక్కులో ఎంతో ప్రేమానురాగాలు పొంగివచ్చి నా హృదయంతరాలలో ప్రవేశించి నన్ను అంతర్ముఖపరిచేవి.

రాముడికి ఒక హనుమంతుడు
శంకరాచార్యులు వారికి ఒక తోటక ఆచార్యులు
బుద్ధుడుకి ఒక ఆనంద్
నాన్నగారికి ఒక రామచంద్ర రాజు గారు

Sunday, May 15, 2022

"శ్రీ నాన్న నిలయం" - (By రాజేశ్వరి గారు ( పొలమూరు))

నేను అరుణాచలం వెళ్ళిన మరుసటి రోజు గుడిలో పూజారి గారు మా ఇంటికి వచ్చి మా అమ్మాయి ఎలా ఉంది? అని నా గురించి అడిగారట. నాతో చెప్పకుండా మీ అమ్మాయి అరుణాచలం వెళ్ళిపోయింది. తను తిరిగి ఇంటికి రాదండి అని నా భర్త కోపంగా అన్నారట. పూజారి గారు అంత మాట అనకు. ఈశ్వరుడే నీకు, నాకు టిక్కెట్లు పంపినా మనం వెళ్ళలేము కదా! ఎంతో అదృష్టవంతులకు గాని అలాంటి అవకాశం రాదు అన్నారట. అరుణాచలంలో తొమ్మిది రోజులు ఉన్నాను. నాకు అక్కడ రూమ్ దొరకక పోతే కనుక, అరుణాచలం వచ్చినప్పుడు నాన్నగారు ఉండే రూమ్ లో నన్ను ఉండమని నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు. నేను అరుణాచలం వచ్చినట్టు నాన్నగారికి చెప్పలేదు. ఆయనకి ఎలా తెలిసిందో అనుకున్నాను. అరుణాచలం నుండి తిరిగి వచ్చేటప్పుడు భీమవరంలో బస్సు ఎక్కుతుంటే ఇల్లు గుర్తుకు వచ్చింది. నేను వచ్చేలోపు మరలా పూజారిగారు మా అమ్మాయి ఎప్పుడు వస్తుంది? అని నా భర్తని అడిగారంట. మీ అమ్మాయి రాదు అన్నాను కదా అని చెప్పారట. నా మీద ఒట్టు, ఈశ్వరుడి మీద ఒట్టు. నా కూతురుని ఒక్క మాట అంటే ఊరుకోను అని పూజారి గారు నా భర్తతో చేతిలో చేయి వేయించుకున్నారంట. నేను ఇంటికి వచ్చేసరికి నా భర్త నవ్వుతూ నీఅంత అదృష్టం ఎవరికి ఉంది? ఇలా ఎవరు వెళ్తారు? నువ్వు కాబట్టి వెళ్ళిపోయావు అన్నారు. ఒకసారి నాన్నగారు నన్ను నీ ఆస్థి ఏమిటి అని అడిగారు. నేను ఏమీ మాట్లాడలేదు. "అరుణాచలేశ్వరుడే నీ ఆస్థి అన్నారు."

ఒక సమయంలో మాకు పరిస్థితులు కలిసి రావట్లేదని మా భందువులందరూ హైదరాబాద్ వెళ్ళమని పట్టుబట్టారు. అప్పుడు నాన్నగారి దగ్గరకు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము అని చెప్పాను. ఎక్కడికి వెళతారు?అని అడిగారు. హైదరాబాదులో మామిడితోటలు తీసుకుంటున్నారు నాన్నగారు అక్కడికి వెళ్ళిపోతున్నాము అని చెప్పాను. నాన్నగారు వెంటనే వారికి రావట్లేదు అని ఉత్తరం రాయమని చెప్పారు. నాన్నగారూ వాళ్ళకి చాలా కోపం వస్తుంది అన్నాను. అప్పుడు నాన్నగారు, వారికి కోపం వస్తే వారు నిన్ను వదిలేస్తారు అంతకంటే ఏమి చేస్తారు అన్నారు. అప్పుడు హైదరాబాద్ వెళ్ళకుండా ఆగిపోయాము. బంధువులు అందరు మమ్మల్ని ఇంకెప్పుడూ పట్టించుకోము అని నా ముఖం మీదే నన్ను నింధించారు.

కొద్ది రోజులకు నాకు అనారోగ్యం వచ్చి డాక్టర్ గారికి చూపించుకుంటే కిడ్నీలు రెండూ తేడాగా ఉన్నాయి అన్నారు. టాబ్లెట్స్ ఇచ్చారు కానీ తగ్గలేదు. ఈ లోపు మాకు తెలిసిన వారు చివటంలో ఒక స్వామి ఉన్నారు అని ఆయన దగ్గరకు తీసుకువెళ్ళారు. ఆయన మందులు ఇచ్చి తగ్గకపోతే మళ్ళీ రమ్మన్నారు. తగ్గలేదని మళ్ళీ ఆయన దగ్గరకు వెళ్ళాను. ఇక దీనికి మందులు లేవు అని చెప్పి అయన పుస్తకాల అరలో నుండి కళ్ళు మూసుకుని ఒక పుస్తకం తీయమన్నారు. వివేక చూడామణి వచ్చింది. అందులో ఒక పేజీని కళ్ళు మూసుకొని తీయమన్నారు. అలా తీస్తే '"సర్వం గురువే" అని వచ్చింది. అప్పుడు ఆయన మీ గురువు తప్ప మిమ్మల్ని ఎవరూ రక్షించ లేరు అన్నారు. నాకు నాన్నగారికి చెప్పాలనిపించలేదు. మాకు తెలిసిన డాక్టర్ గారు టెస్ట్ చేసి మిమ్మల్ని హైదరాబాద్ పంపిస్తాను ఆపరేషన్ పడుతుందని చెప్పారు. నాకు మనసులో నా ప్రాణం పోయినా పరవాలేదు, వెంటనే పుట్టి మరల నాన్నగారి దగ్గరకు వచ్చేయొచ్చు అనిపించింది. ఆపరేషన్ కి నాలుగు లక్షలు అవుతుందని చెప్పారు. ఆపరేషన్ కోసం హైదరాబాద్ వెళ్ళే ముందురోజు, భీమవరం భక్తురాలు ఒకరు కారు వేసుకుని వచ్చి జిన్నూరు వెళదాం రండి అని నన్ను తీసుకువెళ్ళారు. నన్ను చూసి నాన్నగారు ఏమిటమ్మా అలా ఉన్నావని అడిగారు. ఏమీ లేదు నాన్నగారూ అన్నాను. నాన్నగారు మరలా నా వైపు ఎంతో దయతో చూస్తూ, ఏమ్మా నేను నీ తండ్రిని కాదా? నీకు ఇదివరకే చెప్పాను కదా నేను నీ తండ్రిని అని అన్నారు. అప్పుడు నేను ఆపరేషన్ కి రేపు హైదరాబాద్ వెళ్ళవలసి వస్తోంది నాన్నగారూ అన్నాను. ఇన్ని రోజుల నుండి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని, నా పక్కనున్న భక్తురాలితో నీకు ఈ విషయం తెలుసా? అని అడిగారు. ఆవిడ తెలియదు నాన్నగారూ ఇప్పుడే వింటున్నాను అన్నారు. నాన్నగారు ఆమెతో ఈరోజు నుండి రాజేశ్వరికి ఏ తేడా చేసినా నువ్వు నాకు కబురు చెయ్యి. మనకి భీమవరం డాక్టర్లు, హైదరాబాద్ డాక్టర్లు తెలుసు. నీ పూర్తి బాధ్యత నాదేనమ్మా అన్నారు. తరువాత నేను ఇంటికి వచ్చేస్తుంటే అరుణాచలేశ్వరుడి విభూది పొట్లం చేతిలో పెట్టి, రేపు నర్సాపురంలో మీటింగ్ ఉందమ్మా అని చెప్పారు. ఆ రోజు రాత్రి నాకు నాన్నగారు ఆపరేషన్ చేసినట్టు స్వప్నం వచ్చింది. మరుసటిరోజు నరసాపురం మీటింగ్ కి వెళ్ళి నాన్నగారిని కలిసాను. అక్కడ నాన్నగారు నన్ను పిలిచి, రాత్రి నీకు ఎలా ఉందమ్మా అని అడిగారు. బానే ఉంది నాన్నగారూ అన్నాను.

నాన్నగారు ఒకసారి నాకు దత్తాత్రేయ రూపంలో స్వప్నంలో దర్శనమిచ్చారు. నాన్నగారు పొలమూరు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు. నా భర్తతోటి రాజేశ్వరికి ఆరోగ్యం అంతా నయం అయిపోతుంది. మేము అరుణాచలం వెళ్ళినప్పుడల్లా రాజేశ్వరిని పంపండి అని చెప్పారు.

ఒకసారి పుష్కరాల సమయంలో, నాన్నగారు ముక్కామల వెళ్తున్నారు అని తెలిసి మేము కూడా వెళ్ళాము. నాన్నగారు నదికి పూజ చేస్తూ ఉంటే పైన పెద్ద వెలుగు కనిపించిందని ఆ దృశ్యం చూసిన భక్తులు చెప్పారు. పుష్కరుడు ప్రవేశించినప్పుడు అలా వెలుగు వస్తుందట. నాన్నగారు నదిలో స్నానం చేస్తూ పుష్కర స్నానం ఎలా ఆచరించాలో మాకు చెప్పారు. అక్కడ ఉన్న ఒక ఆశ్రమం వారు నాన్నగారిని తీసుకొనివెళ్ళారు. ఆ రోజు సాయంత్రం ప్రవచనం అయిన తరువాత ఇంటికి ఎలా వెళ్ళానో నాకు తెలియదు. అయిదారు రోజుల వరకు శరీరం పనిచేస్తున్నా మనసు పనిచేయలేదు. అలా జరగటం అది మొదటిసారి. కొంచెం దేహం స్పృహ వచ్చిన తరువాత నాన్నగారి దగ్గరకి జిన్నూరు వెళ్ళాను. నాన్నగారు పుష్కర స్నానానికి రాజమండ్రి వెళుతున్నారు అని తెలిసి నేనూ వస్తాను అని నాన్నగారితో అన్నాను. అప్పుడు నాన్నగారు నాతో నేను వెళ్ళవలసి వస్తే వెళతాను, నువ్వు మాత్రం ఈ 12 రోజులు పుష్కర స్నానానికి ఎక్కడకి వెళ్ళక్కర లేదు. మొన్న చేసిన ఆ నది స్నానం నీకు సరిపోతుంది అన్నారు.

ఒకసారి నాన్నగారు హైదరాబాద్ వెళ్ళటానికి పాలకొల్లు రైల్వే స్టేషన్ కి వస్తే, నేను కూడా స్టేషన్ కి వెళ్ళాను. నాన్నగారి దగ్గర భక్తులు అందరూ కూర్చొని ఉన్నారు. నాన్నగారు ట్రైన్ ని తెలుగు లో ఏమంటారు? అని అడిగారు. మేము ఎవరము చెప్పలేకపోయేసరికి నాన్నగారు ధూమశకటం అంటారు అని చెప్పారు. నాన్నగారు నా పర్సు తీసుకొని ఇందులో ఎంత పెట్టుకొని వస్తావు? అని అడిగారు. నా భర్తని అడిగితే ఎంతో కొంత ఇస్తారు నాన్నగారూ అవి లెక్క పెట్టుకోను. అవి పట్టుకొని వచ్చేస్తాను అని చెప్పాను. డబ్బులు లెక్కపెట్టుకోకపోవటం చాలా మంచి గుణం అమ్మా అన్నారు. ఆరోజు ఇంటికి వెళ్ళిన తరువాత మరలా శరీరం పనిచేస్తోంది కానీ మనసులో ఎలాంటి తలంపులు లేవు. అలా జరగటం అది రెండవ సారి.

ఒకసారి నాన్నగారికి ఏదో ఓపెనింగ్ చేయాల్సి ఉంది అని కాశీ వెళ్ళారు. అప్పుడు కూడా నాన్నగారు ట్రైన్ ఎక్కటానికి పాలకొల్లు వెళుతూ ఉంటే నేను స్టేషన్ కి వెళ్ళాను. స్టేషన్ లో అమ్మా రాజేశ్వరి వెళ్ళి వస్తాను అన్నారు. నాన్నగారు అలా అనగానే నాకు తెలియకుండానే కళ్ళనీళ్ళు వచ్చేసాయి. నా చేతిలో ఉన్న జామ పండ్లు చూసి ఇలా ఇవ్వు అని తీసుకొని అందులో ఉన్న రెండు దోర జామపండ్లు తీసి అక్కడ ఉన్న భక్తులకి ఇచ్చారు. మరలా నా వైపు చూసి, నేను పుణ్యం కోసం కాశీ వెళ్ళటం లేదమ్మా ఓపెనింగ్ కోసం వెళుతున్నాను. మరలా నాలుగు రోజులలో తిరిగి వచ్చేస్తాను అంటూ నా వైపు కొద్ది సేపు అలా చూసారు. ఈలోపుగా నాన్నగారి చేతిలో ఉన్న జామపండు ముగ్గిపోయింది. అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఆ ముగ్గిన పండు నా చేతికిచ్చి ఇంటికి తీసుకెళ్ళి మీరందరూ తినండి అని చెప్పారు. నాన్నగారు ట్రైన్ ఎక్కేటప్పుడు నాతో, మరలా వెళ్ళినప్పుడు నిన్ను తప్పనిసరిగా తీసుకొని వెళతానమ్మా అని ట్రైన్ ఎక్కారు. అలా ఆ రోజు ఇంటికి వెళ్ళిన తరువాత మరలా శరీరం పనిచేస్తోంది కానీ మనసులో ఎలాంటి తలంపులు లేవు. అలా జరగటం అది మూడవ సారి.

నాన్నగారు కాశీ నుండి తిరిగి వచ్చాక జిన్నూరు వెళ్ళాను. దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళిపోతుంటే నాన్నగారు నన్ను పిలిచి సూరదాసు, కృష్ణుడు ఉన్న ఫోటో ఇచ్చారు. మీ ఇంట్లో టేబుల్ మీద పెట్టుకో, భక్తులకు ఇటువంటి భక్తి రావాలి. మరో రెండు రోజులలో కొమ్మరలో ప్రవచనం ఉంది అక్కడికి రామ్మా అని చెప్పారు. కొమ్మరలో ప్రవచనం జరిగే రోజు ఉదయాన్నే కొమ్మర బయలుదేరదాము అనుకుంటున్నాను. వేరే గురువు గారి దగ్గరకి వెళ్ళే భక్తురాలు ఒకరు మా ఇంటికి వచ్చారు. ఈరోజు మీరు జిన్నూరు వెళ్ళలేదా అని నన్ను అడిగారు. ఈరోజు కొమ్మరలో ప్రవచనం ఉంది మధ్యాహ్నం వెళ్తాను అని చెప్పాను. అప్పుడు ఆమె రెండు రోజుల ముందుగానే మేము మా గురువు గారి దగ్గరికి వెళ్ళాము. గ్రహణం పట్టు మా మీద పడకుండా మమ్మల్ని అప్పుడే చూసేసారు. ఈ సమయంలో జపం చేసుకోమన్నారు అన్నారు. ఆమె అన్న ఆ మాటకి నాకు తెలియకుండానే మా గురువుగారు జన్మ జన్మల నుండి పట్టిన గ్రహణాన్ని మధ్యాహ్నం ప్రవచనంలో తుడిచేస్తారు అన్నాను. అప్పుడు ఆమె నాతో మరో 25 నిమిషాల్లో సూర్య గ్రహణం విడిచేస్తుంది. ఈ లోపుగా మీరు మీ గురువుగారిని దర్శనం చేసుకుంటే, మీరు అన్న ఈ మాట నిజమే అవుతుంది అన్నారు. ఆ మాట అనగానే మరో ఆలోచన లేకుండా చేతిలో పర్సు పట్టుకొని బయలుదేరాను. కొమ్మర వెళ్ళటానికి చాలా సమయం పడుతుంది కాబట్టి నేను 25 నిమిషాల్లో నాన్నగారి దర్శనం చేసుకోవటం అసాధ్యం. కొమ్మర వెళ్ళటానికి మధ్య దారిలో దిగి అక్కడ నుండి వేరే ఆటో కోసం చూస్తున్నాను. రోడ్లు అన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఈ లోపు ఒక కారు వచ్చి నా దగ్గర ఆగింది. అందులో కన్నమ్మగారు, నాన్నగారు కనిపించారు. నాన్నగారు విభూతి రేఖలతో, పైన చిన్న కుంకుమ బోట్టుతో అచ్చం పరమేశ్వరుడి లాగా ఉన్నారు. నాన్నగారు కార్ డోర్ తీసి అమ్మా రాజేశ్వరి నువ్వు తొందరగా అటో ఎక్కి కొమ్మర వచ్చేయమ్మా, అక్కడ అందరము భోజనం చేద్దాము అన్నారు. ఆ సంఘటన అలా జరగగానే నాకు ఆనందభాష్పాలు వచ్చాయి.

ఒకసారి అరుణాచలంలో తెల్లవారుజామున గిరిప్రదక్షిణకి వెళదాము అని నాన్నగారి ఆశ్రమంలో నుండి బయటకు వస్తున్నాను. అప్పుడు అక్కడ వంటగదిలో కూరగాయలు కోసే వారు ఎవరూ లేరని తెలిసి కూరగాయలు తరిగాను. అలా ఆ రోజు నుండి కూరగాయలు తరగటం అలవాటు అయ్యింది. మరో రెండు రోజులు తరువాత కూరగాయలు కొయ్యటం పూర్తయ్యాక గిరి వైపు చూస్తున్నాను. ఈ లోపు ఎవరో ఇద్దరు మగవారు వచ్చి ఆకలేస్తోందమ్మా భోజనాలు పెడతారా? అని అడిగారు. నేను వెళ్ళి అక్కడ వంట చేసే ఆమెని అడిగితే భోజనం పెట్టమని చెప్పారు. అలా ఆ రోజు నేను వారికి భోజనం వడ్డించాను. నాన్నగారు ఆ విధంగా నాకు అరుణాచలంలో కూరలు కోయటం, వడ్డన చేయడం నెమ్మదిగా అలవాటు చేశారు.

పొలమూరులో కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి నాన్నగారు వచ్చారు. నాన్నగారు పొలమూరు వచ్చినప్పుడల్లా ఒకరి ఇంటి వద్ద భోజనం ఏర్పాట్లు చేయించేదాన్ని. మరొకరి ఇంటి వద్ద టీ ఏర్పాటు చేయించేదానిని. నాన్నగారిని మా ఇంటికి భోజనానికి ఆహ్వానించటానికి తగిన సౌకర్యాలు లేనందు వలన సహజంగా వచ్చి చూసి వెళ్ళేవారు. నాన్నగారిని భోజనానికి ఆహ్వానించలేకపోతున్నాను అని చాలా దుఃఖం వచ్చేది. అప్పుడు నాన్నగారు నాతో నేను ఎవరి ఇంటికి వస్తే ఆ ఇల్లు నీదే అనుకో అమ్మా రాజేశ్వరీ, పొలమూరులో జరిగే మన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ నువ్వే దగ్గర ఉండి చూసుకోవాలి అని చెప్పారు. సరే నాన్నగారూ అక్కడ ఉన్న మన భక్తులు సహాయం తీసుకుని అన్నీ చూసుకుంటాను అని చెప్పాను.

పొలమూరులో శ్మశానం ప్రారంభోత్సవానికి నాన్నగారిని పిలిచి శ్మశానంలో ప్రవచనం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉండే మగవారు శ్మశానం లోనికి ఆడవారు ఎవరూ రావద్దు అని కబురు పంపించారు. అప్పుడు నేను వారితో గ్రామంలో ఉన్న ఆడవారు రాకపోవచ్చు గాని, భక్తులు అందరు వస్తారు అని చెప్పాను. ఆరోజు శ్మశానం అంతా మన భక్తులే నిండిపోయి, గ్రామంలో ఉన్న మగవారు అందరూ బయట నిలబడి ఉన్నారు.

మేము ఇల్లు నిర్మించుకుందాము అని స్థలం కొనుగోలు చేశాము. కన్నమ్మ గారు (నాన్నగారి ధర్మపత్ని) నాతో తరుచుగా మీరు ఇల్లు కట్టుకోవాలి. మీకు ఏ అవసరం వచ్చినా ఎక్కడకి వెళ్ళవద్దు, నేరుగా జిన్నూరు వచ్చేయండి. మీరు అమాయకురాలు, లోకంలో ఎలా ఉండాలో మీకు తెలియదు అంటూ నన్ను చాలా ప్రేమగా చూసుకునే వారు. కొన్ని రోజులకి మా ఇంటికి శంకుస్థాపన ముహూర్తం పెట్టారు అని నాన్నగారికి చెప్పడానికి వెళ్ళాను. అప్పుడు నాన్నగారు నన్ను లోపలికి వెళ్లి కన్నమ్మ గారిని కలవమన్నారు. కన్నమ్మగారు ఆ మాట విని చాలా సంతోషమైన కబురు చెప్పారు అన్నారు. కన్నమ్మగారు శంకుస్థాపనకి అవసరమైన సామాన్లు మరియు పుట్టింటి వారు పెట్టే బట్టలతో సహా అన్నీ నాకు అమర్చి ఇచ్చారు. అందులో వేయడానికి నాన్నగారు 9 రూపాయి బిళ్ళలు, రెండు కొబ్బరికాయలు ఇచ్చి అక్కడ కొట్టమని చెప్పి, మీ ఇల్లు పూర్తయిపోతుంది అని అన్నారు. అలా నన్ను వారు ఇరువురు కూడా కన్నకూతురిలా ప్రేమగా చూసుకునేవారు.

శంకుస్థాపన అయిన కొద్ది రోజులకి ఇల్లు కట్టడం పూర్తయింది. గృహప్రవేశం ముహూర్తం పెట్టిన తరువాత నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పాను. ఈ మాట వినగానే నాన్నగారు చాలా సంతోషం, అదే రోజు వేరే చోట కార్యక్రమం ఉంది, అది లేకపోతే నేను వద్దునమ్మా అన్నారు. నాన్నగారు నాకు రెండు కొబ్బరికాయలు ఇచ్చి ముహూర్తం సమయానికి ఇవి కొట్టేయండి అన్నారు. గృహ ప్రవేశానికి సంబంధించిన సామాగ్రి అంతా నాకు సర్ది ఇమ్మని కన్నమ్మ గారికి పురమాయించారు. కన్నమ్మగారు అన్నీ సర్ది, వచ్చిన బంధువులకు పంచి పెట్టుకోవటానికి స్వీట్స్ తో సహా సిద్ధం చేసి నాకు ఇచ్చారు. గృహప్రవేశం రోజు ఉదయాన్నే అందరం తయారయ్యి బ్రాహ్మణుల కోసం ఎదురు చూస్తున్నాము. కానీ మేము పురమాయించుకున్న పూజారి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. పూజారిగారు రారు అని తెలిసేసరికి, మా బంధువులు అందరూ బ్రాహ్మణులు లేకుండా గృహప్రవేశం ఏమిటి? వేరే ముహూర్తం పెట్టుకోండి ఈరోజు మానేయండి అన్నారు. వారందరి మాటలు విన్న నా భర్త నా దగ్గరకు వచ్చి, నీకు నాన్నగారు కావాలా? బ్రాహ్మణులు కావాలా? అని అడిగారు. నువ్వు బ్రాహ్మణులు కావాలి అంటే వేరే ముహూర్తం పెట్టిస్తాను. కానీ నిన్ను ఎప్పటికీ జిన్నూరు పంపించను. నీకు నాన్నగారు కావాలి అంటే కనుక ఈ క్షణంలో నా వెనక వచ్చేయి. కొబ్బరికాయ కొట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోదాము అన్నారు. నా భర్త అలా అనగానే నేను వెంటనే నాకు నాన్నగారే కావాలి అన్నాను. ఆ సమయానికి నాన్నగారు ఇచ్చిన ఆ రెండు కొబ్బరికాయలు కొట్టేసి ఇద్దరం నూతన గృహంలోకి ప్రవేశించాము.

గృహప్రవేశం అయిన రెండు రోజుల తరువాత నాన్నగారి దగ్గరకు వెళ్ళాను. నాన్నగారు గృహప్రవేశం ఎలా జరిగింది? అని అడిగారు. బ్రాహ్మణులు రాలేదు నాన్నగారూ, మిమ్మల్ని తలుచుకొని కొబ్బరికాయ కొట్టేసాము అన్నాను. నాన్నగారు ఏంటమ్మా నీ ధైర్యం అలా చేశావు అన్నారు. మీరు ఉన్నారనే ధైర్యంతో చేసాను అన్నాను. నాన్నగారు గోలక్ష్మి వచ్చిందా? భోజనాలు పెట్టుకున్నారా? అన్నారు. వచ్చింది నాన్నగారూ, వచ్చిన వారందరికి భోజనాలు పెట్టుకున్నాము అన్నాను. నీ విశ్వాసానికి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందమ్మా అన్నారు.

తరువాత కొద్ది రోజులకి నాన్నగారు భక్తులతో పాటు మా ఇంటికి వచ్చారు. ఆరోజు నాన్నగారికి పాద పూజ చేసుకున్నాము. నాన్నగారు మా ఇంటికి వచ్చిన రోజే యాదృచ్ఛికంగా రామకృష్ణుడి జయంతి కూడా అయ్యింది. నాన్నగారు ఈ ఇల్లు ఎవరిది? అని అడిగారు. అప్పుడు నేను మనసులో శంకుస్థాపనకి తొమ్మిది రూపాయలు ఇచ్చి ఇల్లు పూర్తయిపోతుంది అని చెప్పారు కదా అనుకొని మీదే నాన్నగారూ అన్నాను. తరువాత ఒకసారి మీ ఇంటికి పేరు ఏమని పెడతావు? అని అడిగారు. ఇంటికి పేర్లు ఏమి పెట్టుకోము అన్నాను. నా భర్తతో ఈ విషయం చెబితే నాన్నగారు అన్నారు కదా అని నువ్వు పేర్లు ఏమి పెట్టక్కర్లేదు అన్నారు. తరువాత ప్లాస్టింగ్ చేసే వారు వచ్చినప్పుడు నా భర్త, నాన్నగారు ఇంటికి పేరు గురించి అడిగారు అన్నావు కదా, వెళ్ళి నాన్నగారిని అడిగిరా అన్నారు. నాన్నగారి దగ్గరకు వెళ్ళి అడిగితే "శ్రీ నాన్న నిలయం" అనే పేరు సెలెక్ట్ చేసి ఇచ్చారు. అలా మేము కట్టుకొన్న ఆ గృహంలోకి నాన్నగారు దయతో నాలుగైదు సార్లు వచ్చారు.

ఒకసారి నాన్నగారు నీకు ఏం కావాలమ్మా? అని అడిగారు. మీ దయ ఉంటే అప్పులు ఇచ్చే వారిలో కూడా మీరే ఉండి ఇప్పించండి నాన్నగారూ అన్నాను. అప్పటినుండి మా పిల్లలకు ఫీజు విషయంలో గానీ, గృహ నిర్మాణానికి సంబంధించి గానీ ధనము అవసరము అయ్యే సమయానికి, ఎవరో ఒకరు వచ్చి నా భర్తకు డబ్బులు ఇచ్చి వెళ్ళేవారు. మా అబ్బాయికి డిగ్రీ అయిన తరువాత నాన్నగారి దగ్గరికి వెళ్ళాము. నాన్నగారు మా అబ్బాయి పొట్ట మీద తట్టి, మీ తాతయ్య నీకు ఉద్యోగం వేయిస్తారా? అని అడిగారు. అప్పుడు మా అబ్బాయి, మేము వారిని అడగము నాన్నగారూ అని చెప్పాడు. దానికి వెంటనే నాన్నగారు మీ తాతయ్య చేసే పని నేను చేసి పెడతాను అన్నారు. మా అబ్బాయిని దగ్గర ఉండి హైదరాబాద్ తీసుకొని వెళ్ళి ఇందిరగారి ఇంట్లో మూడు రోజులు ఉంచి ఎంబిఎ చదువుకోడానికి హాస్టల్లో జాయిన్ చేశారు. నేను మా అబ్బాయితో ఇకనుండి నీ గురించి నాకు సంబంధం లేదు. నిన్ను నాన్నగారికి అప్పగించేసాను అని చెప్పాను. మా అబ్బాయిల చదువులు, వివాహాలు అన్నిటికి కూడా నేను పనిముట్టుగా నిలబడి ఉన్నాను. బాధ్యత అంతా నాన్నగారిదే! మా పెద్ద బాబు వివాహం అయిన తరువాత ఒకరోజు జిన్నూరు వెళ్తే మిమ్మల్నందర్నీ రమణ కుటుంబంలోకి వేసేసాను అమ్మా అన్నారు. అలా మా కుంటుంబంలో అందరికి నాన్నగారే ఆధారం అయ్యారు.

మేము పాత ఇంట్లో ఉండగా మా ఇంట్లో ఎక్కువగా పాములు వస్తూ ఉండేవి. ఒకసారి చించినాడలో ప్రవచనం అయిపోయాక నాన్నగారు నన్ను పిలిచి మీ ఇంటిలోకి పాములు వస్తున్నాయా? అని అడిగారు. వస్తాయి నాన్నగారు అవి తిరుగుతూ ఉంటాయి అని చెప్పాను. ఎప్పుడైనా కాళ్ళకు తగిలినా కంగారు పడకు అది మెత్తగా, చల్లగా ఉంటుంది అన్నారు. నాన్నగారు అలా అన్న ఐదు రోజులకు చీకట్లో చూసుకోకుండా పాము మీద అడుగు వేసేసాను. అది ఏమీ చేయలేదు. నెమ్మదిగా ఆకుల మీద పాకుతూ వెళ్ళిన శబ్దం అయింది. నాన్నగారు చెప్పినట్టే అది అతి మెత్తగా చల్లగా ఉంది. ఈ సంఘటన జరుగుతుంది అని నాన్నగారు నాకు ముందే చెప్పి ఉంచారు అనుకున్నాను.

ఒకసారి నాన్నగారు నాతో, రాజేశ్వరీ నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అమ్మా అని అడిగారు. నాన్నగారూ నేను పొలమూరు నుండి చాలా మందిని తీసుకు వచ్చాను. మొదట వారందరు ఏ గురువు దగ్గరకు వెళ్ళినా దక్షిణ ఇవ్వాలి కదా, మేము దక్షిణ ఇవ్వలేము అన్నారు. అప్పుడు వారితో నేను నాన్నగారికి మీరు ఏమి ఇవ్వక్కర్లేదు, పండ్లు కూడా ఇవ్వక్కర్లేదు. మంత్రం ఇస్తారు తీసుకుని ఇంట్లో చేసుకోండి అని చెప్పి చాలా మందిని తీసుకు వచ్చాను. వారందరు ఇప్పుడు రమణ భాస్కర చదువుకుంటున్నారు. దైనందిన జీవితంలో ఎలా జీవించాలో మీరు మాకు నేర్పించారు నాన్నగారూ అన్నాను. చాలా బాగా చెప్పావమ్మా, నా గురించి నీ ఉద్దేశ్యం ఏమిటి? అని అడిగారు. నేను అందరికి మీరు "పేదల దేవుడు" అని చెప్తాను అన్నాను. ఆ మాట అనగానే నాన్నగారు "ఈ భూమి మీదకు ఈ శరీరం వచ్చినందుకు ఈ ఒక్క మాట సరిపోతుంది నాకు! నువ్వు కాదమ్మా! నీ లోపల ఉన్న ఈశ్వరుడు ఈ రోజు ఈ మాట పలికించాడు." అన్నారు. నాన్నగారితో మొదటసారి కాశీ వెళ్ళి వచ్చిన తరువాత, మీ అందరికీ మోక్షం ఇవ్వటం కాదమ్మా, వాసనా క్షయం చేసేయాలి అని ఉంది నాకు అన్నారు.

నాన్నగారు చెప్పిన కొన్ని మధుర వాక్యాలు నా జ్ఞాపకాలలో :

- ఒకసారి నాన్నగారు శుద్ధ జ్ఞాని గురువు అయి వస్తే, ఈ భూమి మీద ఆ వైభవం వేరుగా ఉంటుంది. నీ కల్మషాన్ని ప్రేమతో కడిగేస్తాడు అని చెప్పారు.

- ఒకసారి శృంగవృక్షంలో ప్రవచనం జరిగినప్పుడు, వర్షంలో భక్తులు అందరం తడుచుకొంటూ వెళ్ళాము. అప్పుడు నాన్నగారు అందరి వైపు ఎంతో దయతో చూసి అమ్మా! ఎన్నో బాధలు పడి పరిగెట్టుకుంటూ ఇక్కడకి వస్తున్నారు. మీ పుట్టింటి వారు, మీ భర్త, మీ పిల్లలు ఇచ్చిన డబ్బులు అన్నీ కూడా ప్రవచనాలకే ఖర్చు పెడుతున్నారు. కానీ వాటితో మీరు మీ కోరికలను తీర్చుకోవటం లేదు. అలా మీకు దేహ వాసన చాలా కరిగిపోతోంది అన్నారు.

- మీరు ప్రవచనాలకి బయలుదేరినప్పుడు మీ ఇంటికి, మీ బస్టాండ్ కి మధ్యలో ఉన్న చాలా మంది జనం మిమ్మల్ని తిట్టుకుంటారు. మీ బంధువులు కూడా మిమ్మల్ని తిడతారు. వారితో ఈశ్వరుడు అలా ఎందుకు తిట్టిస్తున్నాడు అంటే, మీరు ఇంకెప్పుడూ వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని అలా అనిపిస్తున్నాడు. అలా మీకు లోకవాసన తీసేస్తున్నాడు. ఆ విధంగా మీకు తెలియకుండానే మీరు పరమ పవిత్రులు అవుతున్నారు అన్నారు.

- మీ విరోధులు కూడా మిమ్మల్ని తిట్టుకుంటూ, వీరిని పట్టుకోవాలంటే వీరు నాన్నగారి దగ్గర, అరుణాచలంలో తప్ప ఇంక ఎక్కడా దొరకరు అనుకుంటూ నాన్నగారిని, అరుణాచలాన్ని స్మరించుకుంటున్నారు. అరుణాచలేశ్వర అనే పేరు తెలపగనే పట్టి లాగితివి కదా! అని వారికి తెలియదు అమ్మా! అలా వాళ్లందరూ కూడా పవిత్రులు అవుతున్నారు. ఎవరైనా జ్ఞానం పొందితే, ఏడు తరాలవారు పవిత్రులు అవుతారు అంటారు కదా! ఇప్పుడు మీ వలన వందల వేల మంది పవిత్రులు అవుతున్నారు. అందువలన మిమ్మల్ని తిట్టినా పరవాలేదు అన్నారు.

ఒకసారి నాన్నగారు ఇలా చెప్పారు. "మీ విశ్వాసం నిజమైతే మీ తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, వైద్యుడిగా అవసరమైతే మీ ఇంటి పని మనిషిగా కూడా గురువు రావడానికి సిద్ధంగా ఉన్నాడు" అన్నారు.

- శ్రీ కృష్ణ చైతన్యులు తమ అంతిమ సమయంలో భక్తులతో, నేను మీకు ఏమి ఇవ్వలేకపోతున్నాను. నా శరీరం పడిపోతే, ఎవరైనా ఈ శరీరాన్ని కొంటే దీన్ని అమ్మేసి మీరు కడుపు నింపుకోండి అన్నారు. గురువు ఆలా ఉంటాడు అన్నారు నాన్నగారు.

- మనం ఎవరికైనా ఉపకారం చేస్తే వాళ్ళు తిరిగి చేస్తారనే మనం సహజంగా అనుకుంటాము. మీకు తెలియకుండానే మీ ఆలోచన లోపల ఎలా ఉంటుందంటే, అవతలి వారికి కష్టం వచ్చింది అని మీరు సాయం చేశారు. అవతలి వారు మళ్ళీ మీకు సహాయం చేయాలంటే మీకు కష్టం రావాలి. అంటే మీకు తెలియకుండానే మీరు ఆ కష్టాన్ని కోరుకుంటున్నారు అన్నారు.

- ఇంటికి ఎవరైనా భిక్షాటనకి వస్తే పూర్వం పెద్దవారు రామార్పణం, కృష్ణార్పణం అనుకుంటూ భిక్ష వేయమని మనకి నేర్పించారు. అంటే మరలా జన్మకి ఈ బియ్యాన్ని దాచిపెట్టి ఉంచమని అర్థం. మనకి తెలియకుండానే మరొక జన్మని కోరుకుంటున్నాము. కానీ మనం ఎవరికి బియ్యం వేస్తున్నామో వారి బియ్యమే మన ఇంట్లో పెట్టుకుని వారిది వారికే వేస్తున్నాము అనుకుంటే మనకి కర్తృత్వం ఉండదు అన్నారు.

- రాబోయే కాలంలో చీకటి రోజులు వస్తున్నాయి. మీరు మంచం పడితే మిమ్మల్ని ఎవరూ చూడరు. మీరందరూ మంచం పట్టకుండా మీ జీవితాలు వెళ్లిపోవాలి అని నేను ప్రార్ధిస్తున్నాను అన్నారు.

ఒకసారి నాన్నగారు భక్తులను ఆయన చదువుకున్న స్కూల్ కి తీసుకు వెళ్లారు. అక్కడ ఆయన ఒక గదిలోకి వెళ్ళి బయటకు వచ్చి అటు ఇటు చూస్తూ నడుస్తున్నారు. నాన్నగారికి ఏమైనా అవసరం ఉందేమో అని దగ్గరికి వెళ్ళి ఏమి కావాలి నాన్నగారూ అని అడిగితే, నేను చదువుకున్న గది బాగా బూజులు పట్టేసి ఉంది. చీపిరి కనిపిస్తే తుడుద్ధామని అన్నారు. ఆ మాట వినగానే, మనం పని ఎంత శ్రద్ధగా చెయ్యాలో నేర్పించటం కోసం ఇంత కిందకు దిగి వచ్చి చెబుతున్నారు అనిపించింది.

పెద్ద సునామి వచ్చినప్పుడు సమస్తం ఆ సునామీలో ఏ విధంగా అయితే కొట్టుకొనిపోతుందో అలా, నాన్నగారి ప్రేమ ప్రవాహంలో మన అందరము కొట్టుకుపోవలసిందే!

Sunday, March 27, 2022

"పేదల దేవుడు, శ్రీ నాన్నగారు" - (By పొలమూరు రాజేశ్వరి గారు)

నాకు చిన్నప్పటి నుండి గుడికి వెళితే దేవుడి పాదాలు గట్టిగా పట్టుకోవాలని కోరికగా ఉండేది. గుడిలో మనల్ని ఆ పాదాలని తాకనివ్వరు కదా అని చాలా బాధ అనిపించేది. నాకు చిన్నప్పటి నుండి రామాయణం చదవటం అలవాటు ఉండేది. అందులో జటాయువు, శబరి పాత్రలని చాలా ఇష్టపడేదాన్ని. స్కూల్లో మాకు రామకృష్ణుడి గురించి చెప్పేవారు. అలా నాకు తెలియకుండానే రామకృష్ణుడు, శారదామాత అంటే ఇష్టం ఏర్పడింది. నా వివాహం అయిన తరువాత మా అత్తగారి ఇంట్లో రామకృష్ణుడు, శారదా మాత, వివేకానందుడు ముగ్గురు కలిసి ఉన్న ఫోటో గోడకు తగిలించి ఉండేది.

ఒకసారి నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో కొంత మందితో కలిసి ఒక కొండ పక్క నుండి వెళ్తున్నాను. అక్కడ అరుపులు కేకలు వినిపించేసరికి అందరూ భయంతో పారిపోతున్నారు. ఆ కలలో నేను చాలా చిన్న పిల్లలా ఉన్నాను. ఎవరో ఒక తాతయ్య నన్ను మామిడి చెట్టు దగ్గరకు తీసుకు వెళ్ళి కూర్చోబెట్టి ఆయన కూడా నా పక్కనే కూర్చున్నారు. మీకు ఆ అరుపులు వినిపిస్తూ ఉంటే భయం వేయటం లేదా తాతయ్యా అని అడిగాను. ఆప్పుడు ఆయన లేదమ్మా అవి మన దగ్గరకు రాలేవు అని చెప్పారు. ఆ స్వప్నం సమాప్తం అయ్యింది.

ఆగర్రు లో సీతమ్మగారు అని నాన్నగారి భక్తురాలు ఉండేవారు. ఒకసారి సీతమ్మగారితో, మరియు మరికొంతమంది భక్తులు, బంధువులతో కలిసి మొదటిసారిగ జిన్నూరు వెళ్ళాను. నాన్నగారిని చూడగానే ఎక్కడో చూసాను అనిపించింది. నాన్నగారు తదేకంగా నావైపు చూస్తుంటే నేను తలవంచుకున్నాను. ఈ అమ్మాయి ఎవరు అని నాన్నగారు సీతమ్మ గారిని అడిగారు. ఈ అమ్మాయికి రామకృష్ణుడు కావాలంట నాన్నగారు అని ఆమె చెప్పారు. ఆ సందర్బాన్ని అనుసరించి నాన్నగారికి, నాకు మధ్య సంభాషణ ఈ విధంగా కొనసాగింది :

నాన్నగారు : ఏమ్మా రామకృష్ణుడు కావాలా నీకు? ఎందుకు రామకృష్ణుడు కావాలి అనుకుంటున్నావు? అని అడిగారు.

రామకృష్ణులు కాళీమాతతో మాట్లాడతారు కదా! నాకు కూడా ఒకసారి కాళీమాతతో మాట్లాడాలని ఉంది. అమ్మవారిని ఏం అడుగుతాను అంటే, మంచివారిని చాలా బాధలు పెడుతున్నావు, చెడ్డ వారిని రక్షిస్తున్నావు ఇది నీకు న్యాయమా! అని అడుగుతాను. నాకు అమ్మవారు కలలో కనిపిస్తుంది. కానీ కలలో అడగలేకపోతున్నాను అన్నాను.

నాన్నగారు : నీకు రామకృష్ణుడు దొరికేస్తాడు అమ్మా అని నవ్వుతూ... నేను రెండు ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెప్పు అన్నారు.

మొదటి ప్రశ్న : బస్తాడు బియ్యంలో ఊక ఏరుకోవటం తేలికా? లేక బస్తాడు ఊకలో బియ్యం ఏరుకోవటం తేలికా? అన్నారు.

బస్తాడు బియ్యంలో ఊక ఏరుకోవడం తేలిక కదండి అన్నాను.

రెండవ ప్రశ్న : బట్టలు శరీరం కప్పుకోవడానికి కట్టుకుంటున్నారా? ఇతరులు అందరూ మీ బట్టలను చూసి మెచ్చుకోవడానికి కట్టుకుంటున్నారా?

బట్టలు శరీరం కప్పుకోవటానికే కదండి అన్నాను.

నాన్నగారు నన్ను "అరుణాచల శివ" అని ఉదయం మూడు సార్లు, సాయంత్రం మూడుసార్లు అనుకోమన్నారు. నాన్నగారికి నమస్కారం చేసుకున్నాను. వెంటనే అకారణంగా నా నేత్రాల వెంట కన్నీరు ధారగా కారింది.

నాన్నగారు అక్షరమణమాల పుస్తకం, భగవాన్ ఫోటో ఇచ్చి నిన్ను మరిచిపోను అన్నారు. ఇంటికి వచ్చిన తరువాత భగవాన్ ఫోటో చూసి, ఈ తాతయ్యకు, నాన్నగారికి సంబంధం ఏమిటి? ఈ తాతయ్యే కదా స్వప్నంలో నన్ను పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఈయనే భగవానా అనుకున్నాను. తర్వాత జిన్నూరు వెళ్ళటానికి అప్పటికి నా పిల్లలు చిన్నవాళ్ళు అవ్వటము వలన వీలుపడలేదు.

పక్క ఊరిలో నాన్నగారి ప్రవచనం జరుగుతూ ఉంటే, మా ఇంటి ప్రక్కన ఉన్నవారు నా భర్తని అడిగి నన్ను ఆ ప్రవచనానికి తీసుకువెళ్ళారు. అక్కడ నాన్నగారిని చూడగానే దేహ స్పృహ మరిచిపోయాను. ప్రవచనం అయిపోయిన తరువాత నాన్నగారు నా వైపు చూసి నవ్వి పలకరించారు. అప్పుడు నాన్నగారిని మంత్రం ఇవ్వమని అడిగాను. నీకు ఏ నామం కావాలి? అని అడిగారు. నాకు ఏది మంచిదో అది మీరు ఇవ్వండి. మీరు నాకు ఒక మాట ఇవ్వాలి అన్నాను. ఏమి మాట ఇవ్వాలమ్మా అన్నారు. నాకు కోపం ఎక్కువ అది మీరు తీసుకోవాలి అన్నాను. ఆయన నవ్వుతూ అలాగే నీ పేరులోనే ఉగ్రరూపం ఉంది. నీకు కోపాలు ఏవీ ఉండవమ్మా పోతాయి అని చెప్పి మంత్రం ఇచ్చారు. అప్పటినుండి భగవాన్ ఎక్కువగా కలలోకి వచ్చేవారు. స్వప్నంలో శివాలయం లో నుంచి వస్తూ నాకు ప్రసాదం తెచ్చి ఇచ్చేవారు. నేను పిల్లల్ని పాలకొల్లు హాస్పిటల్ కి తీసుకువెళ్లినప్పుడు, తిరిగి వస్తూ ఇంట్లో ఎవరికీ తెలియకుండా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. నాన్నగారు నన్ను చూడగానే అరుగు మీద నుండే రామ్మా అని పిలిచి, మంచినీళ్లు ఇచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చోబెట్టుకునేవారు. ఒకసారి నీకు ఏమైనా కావాలా అమ్మా అని అడిగారు. అప్పుడు నాకు తెలియకుండానే శాంతి కావాలి నాన్నగారూ అన్నాను. అది నీకు దొరుకుతుంది అన్నారు.

నేను నాన్నగారి దగ్గరకి వెళ్ళినప్పుడల్లా రెండు గంటలు కూర్చోబెట్టుకుని రామకృష్ణుడి వైభవం గురించి చెప్పేవారు. అప్పుడు నాకు తెలియకుండానే నా నేత్రాల వెంట నీరు వచ్చేది. నాన్నగారు ఒకసారి మీ ఇంటికి వస్తాను అన్నారు. మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం అవటం వలన నాన్నగారిని ఆహ్వానించే పరిస్థితులు నాకు అప్పట్లో లేవు. నా పరిస్థితి ఇలా ఉంటే నాన్నగారు వస్తాను అంటున్నారు ఏమిటి అనుకున్నాను.

ఒకసారి ఎవరో భక్తురాలు వచ్చి నాన్నగారి దగ్గరకు తీసుకెళ్ళమన్నారు. అప్పుడు నాన్నగారు నన్ను పంటలు ఎలా ఉన్నాయి? అని అడిగారు. ఈ మధ్య కొంచెం దెబ్బతిన్నాయి నాన్నగారూ, ఉమ్మడి కుటుంబంలో ఉన్న మా ఇల్లు కూడా అమ్మేశారు అని చెప్పాను. మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటమ్మా అని అడిగారు. హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అని చెప్పాను. మీరు ఎక్కడికీ వెళ్ళవద్దు, ఇప్పుడు మీరు తాటాకు ఇంట్లో ఉండాలి. పూర్తిగా మీ ప్రారబ్దం ఖర్చు అయిపోవాలి అన్నారు. నా భర్త అలా ఒప్పుకోరు నాన్నగారూ అని చెప్పి ఇంటికి వచ్చేసాను.

ఆ తర్వాత నుండి నేను ఎప్పుడు నాన్నగారి దగ్గరకు వెళ్ళినా అలా మౌనంగా చూసేవారు. నాతో ఇంతకు ముందులాగ అంత ప్రేమగా మాట్లాడటం లేదు అనిపించేది. తరువాత మేము తాటాకు ఇంట్లోకి మారవలసి వచ్చింది. ఇదంతా నాన్నగారు చేసిన పనే అని నాకు అనిపించింది. తాటాకు ఇంట్లోకి వెళ్ళిన వెంటనే సత్సంగం ప్రారంభం చేసాము. కొద్ది రోజులకు నాకు అరుణాచలం వెళ్ళాలనే కోరిక కలిగింది. చిన్న పిల్లల్ని వదిలేసి ఎలా వెళతావని చాలామంది నన్ను అడిగారు. తరువాత జిన్నూరు వెళ్ళినప్పుడు నాకు కూడా అరుణాచలం రావాలని ఉంది నాన్నగారూ అని చెప్పాను. నాన్నగారు వెంటనే మాతో నువ్వు కూడా అరుణాచలం వస్తున్నావు. వెంటనే టిక్కెట్లు తీయించుకో, నువ్వే కాదు నీకూడా ఎంతమంది వచ్చినా తీసుకురావచ్చు అన్నారు.

అరుణాచలం వెళ్ళాక నాన్నగారితో పాటు అందరము ఆంధ్ర ఆశ్రమంలో ఉన్నాము. అప్పటికి భక్తులతో నాకు పెద్దగా అనుబంధం లేదు. నాన్నగారు అరుణాచలంలో చూడవలసిన ప్రదేశాలు అన్నీ చెప్పి, నాకు తోడుగా భక్తులను పంపి అన్నీ చూపించారు. నాన్నగారు మమ్మల్ని ఒక డ్యామ్ దగ్గరికి తీసుకువెళ్ళారు. అక్కడ నీళ్లు వదిలేటప్పుడు నాన్నగారి చేత కొబ్బరికాయ కొట్టించారు. నాన్నగారు ఆ నీటిలోకి దిగిన తరువాత నీటికి నమస్కారం చేసుకుంటూ "నాకు దేవాలయాల కంటే ఇటువంటి పనులు అంటే చాలా ఇష్టం. ఈ నీటి వలన పంటలు పండి అన్ని జీవరాశులకు ఆహారం దొరుకుతుంది అన్నారు."

అరుణాచలం నుండి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే భగవాన్ అనుభూతులు విపరీతంగా కలిగేవి. మా బంధువులు అందరు నన్ను వారి గురువుల దగ్గరకు పంపించాలి అని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ నేను రాను అని చెప్పేదాన్ని. అప్పుడు ఒకసారి నా భర్త అందరితో అలా రాను అని చెబితే బావుండదు కదా! ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయి అన్నారు. నాకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా నా భర్త అన్నమాట కాదనలేక వెళదాము అనుకుంటుంటే నాకు లోపల, నా మనసు ఎప్పుడో అమ్ముడు పోయింది, ఈ శరీరానికి ఒక్కడే డ్రైవర్ ఉంటాడు, ఇద్దరు డ్రైవర్లు ఉండరు. నాకు డ్రైవర్ నా భగవానే అనిపించి నేను ఎక్కడికి రాలేను అని కఠినంగా చెప్పాను. అప్పుటినుండి అందరి ప్రయత్నాలు తగ్గాయి.

తరువాత ఒకసారి నాన్నగారి దగ్గరకి వెళ్తే అక్కడ ఉన్న నాన్నగారి భక్తులు ఎలా ఉన్నారు? అని నన్ను పలకరించారు. నాకు కలిగిన అనుభూతులు గురించి వారికి చెప్పాను. వారు ఇవి అన్నీ సిద్ధులు మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. వెంటనే నాన్నగారికి ఈ విషయం చెప్పండి అన్నారు. నేను నాన్నగారికి నాకు కలిగిన అనుభూతుల గురించి, మా బందువులు వారి గురువుల దగ్గరకి నన్ను తీసుకువెళ్ళే ప్రయత్నాల గురించి చెప్పాను. నాన్నగారు ఏమీ మాట్లాడకుండా చాలాసేపు నా కళ్ళల్లోకి చూశారు. నీ విశ్వాసానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నిన్ను తరచు జిన్నూరు రమ్మని చెప్పాను కదా! నీ కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అన్నారు. కొద్దికాలానికి నాన్నగారు మా ఇంటికి వచ్చారు. మా ఇంటి బయట వాకలి అంతా ఇసుక, మట్టి ఉండేవి. నాన్నగారు వచ్చినప్పుడు ఏమి చేయాలో అర్థంకాక నాన్నగారి పాదాలకు మట్టి అంటుకోకుండా ఉండాలని నా చీరలు అన్నీ పరిచేశాను. నాన్నగారు వచ్చి అలా చీర మీద నిలబడి అమ్మా బృందావనం వచ్చాను అన్నారు. తరువాత నాన్నగారు లోపలకి వచ్చి నా భర్త తో మాట్లాడారు. అన్ని ఆయనే స్వయంగా అడిగి మరీ చేయించుకొని నన్ను సంతృప్తి పరిచారు. కొద్దిసేపు కూర్చున్న తరువాత నాన్నగారు కారు దగ్గరికి వెళ్ళారు. నాన్నగారికి బట్టలు పెట్టలేక పోయాను అనిపించి నేను లోపలకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి నాన్నగారి చేతోలో పెట్టాను. నాన్నగారు అవి గుండెలకు హత్తుకుని ఇవి నీ దగ్గర ఉంచు అని తిరిగి ఇచ్చేసారు. అప్పుడు నేను నాన్నగారితో "ఉడత శ్రీరామచంద్రుడుకి సహాయం చేసింది కదా, ఉడత వేసిన ఇసుక రేణువులులాగే నాది కూడా ఒక ఇసుక రేణువు అనుకోండి నాన్నగారూ" అన్నాను. నా వైపు అలా చూసి మరల చెప్పమ్మా అన్నారు. నేను మరల చెప్పాను. ఈ డబ్బులు మీరు ఉంచాలి నాన్నగారూ అన్నాను. అయితే పొలమూరు అని రసీదు రాసి ఇస్తానమ్మా అన్నారు. మీది జిన్నూరు, మాది పొలమూరు అని హద్దులు పెడుతున్నారా నాన్నగారూ అన్నాను. నాన్నగారు నవ్వి ఇంకెప్ఫుడూ ఈ మాట అనను అన్నారు.

మాకు కొమ్మరలో బంధువులు ఉన్నారు. వారు మా ఇంటికి వచ్చినప్పుడు నాన్నగారు చిన్నప్పుడు ఎలా ఉండేవారు అని అడిగాను. నాన్నగారు చిన్నప్పుడు ప్రాకుతున్నప్పుడు చిన్ని కృష్ణుడులా ఉండేవారు. చూస్తే చాలా ఆనందం అనిపించేది. బయట పడేయవలసిన వస్తువులు ఉంటే వాటిని దూరంగా పట్టుకుని వెళ్ళి చెరువు గట్టున పడేసేవారు. చిన్నప్పటి నుండి ఆయనలో మంచి లక్షణాలు కనిపించేవి అని చెప్పారు.

నాన్నగారి చిన్నప్పటి స్నేహితులు అయిన నల్ల సుబ్బరాజు గారు ఎక్కువగా మా ఇంటికి వచ్చేవారు. ఆయన ఎందుకు వచ్చేవారో తెలియదు. నాకు రావాలనిపించి వచ్చాను అనేవారు. కొన్నిసార్లు ఇటువైపుగా వెళుతూ వచ్చాను అనేవారు. నల్ల సుబ్బరాజు గారు వచ్చినప్పుడు నాన్నగారి గురించి కొన్ని విషయాలు చెబుతూ ఉండేవారు. వాటిలో కొన్ని :

*నాన్నగారు చిన్నప్పుడు చదువుకునే వయసులో ఎవరిదైన పలక పగిలిపోతే, నాన్నగారి పలక వారికి ఇచ్చేసేవారు. బడిలో మాష్టారు చదువురాదు అని ఎవరినైనా తిడితే నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వారికి చదువుచెప్పి వచ్చేవారు.

*ఒకసారి నాన్నగారు సుబ్బరాజు గారితో నా కప్పు నిండిపోయి కారిపోతోంది. ఎవరూ రావడం లేదు ఇది ఎలా పంచిపెట్టమంటారు? ఎంతమంది వచ్చినా ఇంకా మిగిలే ఉంటుంది. ఎక్కడైనా చిన్న పందిరి వేసి జ్ఞానం గురించి బోధిస్తే ఎవరైనా వస్తారు కదా! అని నల్ల సుబ్బారాజు గారితో అన్నారట.

*నాన్నగారి ఇంట్లో ఒక ఆమె పనిచేసేది. ఆమెకి సంతానం లేరు. ఆమె నాన్నగారిని చూసి "మా బాబే, మా బాబే" అని మురిసిపోయేది. ఆమెకి పెద్ద వయసు వచ్చిన కారణంగా నాన్నగారి ఇంట్లో పని మానేసింది. ఆమె వంట కూడా చేసుకోలేకపోతే నాన్నగారే భోజనం పంపించేవారు. ఆమెకి కొన్నాళ్ళకు మతిస్థిమితం పోయి స్నానం చేయక దగ్గరకు వెళ్తే దుర్గంధం వచ్చేది. ఒకరోజు మా పెద్ద బాబు (నాన్నగారు) ని చూడాలి అని కలవరించిందట. నాన్నగారికి ఆ విషయం తెలిసి నల్ల సుబ్బరాజు గారిని తీసుకుని ఆమె ఇంటికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే ఆమె నుండి వచ్చే వాసన భరించలేక నల్ల సుబ్బరాజు గారు బయటకు వచ్చేసారు. నాన్నగారిని చూడగానే ఆమె పెద్దబాబు అని పిలిచింది. నాన్నగారు ఆమె పక్కనే ఒక అరగంట కూర్చుని, అమ్మా నీకు తగ్గిపోతుంది. నువ్వు బాగుంటావు అని చెప్పి వచ్చేసారు. నాన్నగారు వెళ్ళి చూసిన తరువాత ఆమెకు మనసు కుదుట పడి మామూలు అయ్యింది. నాలుగు రోజుల తరువాత "మా బాబే మా బాబే" అంటూ ప్రశాంతంగా ప్రాణం వదిలింది అని చెప్పారు.

•నాన్నగారు, నల్ల సుబ్బరాజు గారు అరుణాచలం వెళ్ళినప్పుడు నాన్నగారు గిరి ప్రదక్షిణ చేసి రాత్రి ఆలస్యమయితే, రమణాశ్రమం రూమ్ కి వెళ్ళే ఓపిక లేక చెట్ల కింద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి అన్నారు. ఈ విధంగా నాన్నగారి గురించి నల్ల సుబ్బరాజు గారు మా ఇంటికి వచ్చినప్పుడు చెబుతూ ఉండేవారు.

ఒకసారి నాన్నగారి దగ్గరకు వెళ్ళినప్పుడు నాన్నగారు నాతో, మీ బంధువులలో ఒకరు మంత్రి పదవిలో ఉన్నారు కదా! మీ పెద్ద బాబు 10 వ తరగతి అయిపోయాక ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించమని అడగండి. ఆ ఉద్యోగం చేసుకుంటూ ఇంటర్, డిగ్రీ చదువుకుంటాడు అన్నారు. అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చిన తరువాత నాకు రెండో ధ్యాస కనిపించట్లేదు నాన్నగారూ, జానెడు పొట్ట కోసం వెళ్ళి అందరి కాళ్ళు పట్టుకొని ఎందుకు నాన్నగారూ ఈ ప్రయాస అంతా? వాడు పొట్ట కోసం ఎక్కడ పని చేసుకున్నా మూడు, నాలుగు వేలు సంపాదించుకుంటే సరిపోతుంది అన్నాను. అప్పుడు నాన్నగారు నా వైపు చూసి ఏంటమ్మా అంత వైరాగ్యంతో మాట్లాడుతున్నావు అన్నారు. మీ పాదాలని నేను జ్ఞానం కోసం పట్టుకున్నాను కానీ, పొట్ట నింపుకోవడం కోసం కాదు అన్నాను. నాన్నగారు నీకు కాదమ్మా పిల్లలకు అన్నారు.

నాన్నగారితో రెండు మూడు సార్లు అరుణాచలం వెళ్ళాను. తర్వాత ఇంట్లో పరిస్థితుల వలన కుదరక అరుణాచలం వెళ్ళలేదు. భగవాన్ ని నాకు మీ దగ్గరకి రావాలని కోరికగా ఉందని నిరంతరం ప్రార్ధిస్తూ ఉండేదాన్ని. ఒకరోజు భగవాన్ అరుణాచలం తీసుకు వెళ్ళటం లేదని మా పిల్లలతో, ఈ భగవాన్ ని అరుణాచలం తీసుకువెళ్ళమనే కదా మనము అడుగుతున్నాము. కానీ ఆయన తీసుకువెళ్ళటం లేదు. నాకు అరుణాచలం మీద తప్పించి మరోదాని మీద ధ్యాస లేదు. అక్కడకు వెళ్ళి వచ్చాక నేను చనిపోయినా పరవాలేదు అని అంటున్నాను. ఇంతలో ఒక అబ్బాయి మా ఇంటికి వచ్చి ఆంటీ మా ఇంటికి ఎవరో వచ్చారు. మా అమ్మగారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు అని చెబితే నేను వారి ఇంటికి వెళ్ళాను. అక్కడ నాకు తెలియని ఎవరో ఒక ఆమె వచ్చి ఉన్నారు. ఆమె నన్ను చూసి, నేను అరుణాచలం వెళదామని టికెట్ తీసుకున్నాను. కానీ నాకు అనుకోని ఇబ్బంది వచ్చింది. ఈ టికెట్ మీకు ఇవ్వాలి అనిపించి వచ్చాను అని ఆ టికెట్ నా చేతోలో పెట్టి మీరు వెళ్ళవలసిందే అన్నారు. నేను ఇంటికి వచ్చి మా పిల్లలకి చెబితే, ఇప్పుడే కదమ్మా భగవాన్ ని అరుణాచలం తీసుకువెళ్ళటం లేదు అని తిట్టుకున్నావు. ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే నీదే తప్పు అవుతుంది అన్నారు. నాకు అప్పుడు భగవాన్ వాళ్ళ నోటితో అలా అనిపించారు అనిపించింది. నాభర్త తో ఈ విషయం చెప్పే సమయం కూడా లేదు. అయినప్పటకి, ఏదయినా జరగనీ అనుకొని నాలుగు జతల బట్టలు సర్దుకుని, కొంచెం డబ్బులు పట్టుకొని వారి కూడా వెళ్ళిపోయాను. అరుణాచలం వెళ్ళిన తరువాత ఇంటి ధ్యాస మరిచిపోయాను.

Sunday, February 13, 2022

"సాక్షాత్తు భగవంతుని స్వరూపులు, శ్రీ నాన్నగారు" - (By లేట్ అప్పలనరసమ్మ గారు)

అప్పలనరసమ్మగారికి, నాన్నగారికి మధ్య ఉన్న అనుబంధం గురించి ఆమె మేనకోడలు అయిన వేణమ్మగారు తెలియచేసిన విషయాలు :

మా మేనత్త గారైన అప్పలనరసమ్మ గారి భర్త తన రెండవ సంతానం కడుపులో ఉన్నప్పుడే చనిపోయారు. ఆ కారణంగా తన పుట్టినిల్లయిన జిన్నూరులో మా ఇంటికి తీసుకువచ్చారు. మేమందరం కలిసి ఉండేవాళ్ళం. అలా తన జీవితమంతా జిన్నూరులోనే కొనసాగింది. తన ఇద్దరు పిల్లలు ఇంకా నేను, నా తమ్ముడు మొత్తం నలుగురము కూడా తన ఆధ్వర్యంలోనే పెరిగాము. అందరినీ చాలా సమానంగా చూసేవారు. ఇంకా మా బంధువుల పిల్లలు అందరూ కూడా జిన్నూరు స్కూల్లో చదువుకోవడం వల్ల మా ఇంటికి వస్తూ ఉండేవారు. అలా మొత్తం ఒక పది మంది పిల్లలం ఉండేవాళ్ళం. ఆవిడ ఉదయం నుండి సాయంత్రం వరకు అలసిపోకుండా చిరునవ్వుతో మా అందరికీ అవసరమైనవి చేసి పెడుతూ ఉండేవారు. బేదభావన అనేది లేకుండా అందరినీ సమానంగా చూసేవారు. మాది చాలా పెద్ద కుటుంబం అవటం వలన తరచు బంధువులు వస్తూ ఉండేవారు. వారందరికి ఆవిడే వంట చేసి పెట్టేవారు.

ఆమె కుమార్తె అయిన సత్యవతి కూడా నాన్నగారికి చాలా ఉత్తమమైన భక్తురాలు. తన కొడుకు జిన్నూరులోనే ఉంటారు. ఆయన కూడా సమాజ సేవ బాగా చేస్తారు. అందువలన నాన్నగారు ఆయనని చాలా ఇష్టపడేవారు. నాన్నగారిపట్ల ఆయనకి కూడా చాలా గౌరవం, ప్రేమ ఉన్నాయి. మా మేనత్త ఎవరి మధ్యవర్తిత్వం లేకుండానే నాన్నగారిని కలుసుకున్నారు. నాన్నగారిని సంపూర్ణంగా విశ్వసించారు. మా మేనత్త ఎప్పుడూ ఎవరి మాట కాదనేవారు కాదు. కానీ ఒక్క నాన్నగారి విషయంలో మాత్రం, ఆయన దగ్గరికి వెళ్ళవద్దు అని ఎవరైనా చెప్పినా ఆమె వినేవారు కాదు. అది నా వ్యక్తిగత విషయం అన్నట్టు ఉండేవారు. నాన్నగారి ఇంటి నుండి మా ఇంటికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది. మా ఇంటి దగ్గర నుండి నాన్నగారి ఇంటికి నడిచి వెళుతూ మధ్యలో ఉండే వారందరి ఇంటి తలుపులు కొట్టి, "మీకు తెలియటం లేదు సాక్షాత్ భగవంతుడే నాన్నగారి రూపంలో వచ్చారు", అంటూ అందరికీ చెబుతూ వెళ్ళేవారు.

ఎవరైనా కష్టంలో ఉన్నారు అని తెలిస్తే వాళ్లని ఆ కష్టాల్లో నుండి బయటకు తీసుకు రావటానికి తన వంతు ప్రయత్నం తను చేసేవారు. నాన్నగారు ఎన్నోసార్లు అప్పలనరసమ్మ గారు ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు తన చీరచెంగుతో వారి కన్నీళ్లను తుడుస్తారు అని చెప్పేవారు. ఆవిడ నాన్నగారి దగ్గరికి అందరిని రమ్మని చెప్పినా కానీ వారు రాకపోతే, "నాన్నగారు భగవత్ స్వరూపులని వీళ్ళు గుర్తించటం లేదు, వీళ్ళు ఎందుకు పుట్టారో వీరికి అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉండేవారు. ఆ మాట వినేసరికి నాకు ఇప్పటికీ వెన్నులో వణుకు వస్తుంది. అత్తయ్యకి భౌతికంగా ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ, తన దృష్టి ఎప్పుడూ నాన్న గారి మీద చెక్కుచెదరకుండా ఉంచుతూ భగవంతుడే నాన్నగారుగా వచ్చారు అన్న విశ్వాసంతో జీవించారు. అందుకే అంత శాంతిగా ఉండగలిగేవారు. ఇది అంతా జరిగి దాదాపు ౩౦ సంIIలు అయ్యి ఉంటుంది. అప్పట్లో స్త్రీలు బయటకు ఎక్కువగా వచ్చేవారు కాదు. అందువలన ఆమె కొడుకుకి ఆవిడ నాన్నగారి ఇంటికి వెళ్ళటం ఇష్టం ఉండేది కాదు.

హాల్లో తన కొడుకు తిడుతున్నా సరే, లోపల అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు నాన్నగారి ఫోటో మీద వేసి పూజ చేస్తూ ఉండేవారు. నాన్నగారి విషయంలో మాత్రం పూర్తి స్వేచ్ఛ తనకు తనే తీసుకున్నారు. నాన్నగారి దగ్గరకు వెళ్తున్నందుకు ఆ రోజుల్లో ఎంతోమంది ఎన్నో మాటలు అనేవారు. అయినా అవేమీ పట్టించుకోకుండా నవ్వి ఊరుకునేవారు. నాన్నగారి గురించి వారికి తెలియటం లేదు అనేవారు.

నాన్నగారి 60 వ పుట్టినరోజుకి నాకు మా మేనత్త ఫోన్ చేసి ఈరోజు నాన్నగారి పుట్టినరోజు జరిగింది. సుదర్శనమ్మ గారు సావిత్రమ్మ గారి చేత దండలు పంపించి నాన్నగారిని, కన్నమ్మ గారిని వేసుకోమన్నారు. వారు ఇద్దరు ఆ దండలని వేసుకొన్నారు అని చాలా ఆనందపడుతూ, ఆ ఆనందంతో చెప్పలేక చెబుతూ, ఆ విషయం గురించి పదినిమిషాలు మాట్లాడారు. తన దృష్టిలో నాన్నగారంటే ఒక మానవ రూపం కాదు, సాక్షాత్ భగవంతుడే! ప్రతిరోజు ఆవిడ నాన్నగారి ఇంటికి వెళుతూ ఉండేవారు. అప్పట్లో కొన్ని కారాణాల వలన ఒక్కొక్కసారి నాన్నగారి ఇంట్లోకి వెళ్ళటం కుదేరేది కాదు. అలా కుదరకపోతే నాన్నగారి ఇంటి చుట్టూ, అంటే నాన్నగారు ముందు వీధిలో నుండి వెనక వీధికి తిరుగుతూ అలా మూడు సార్లు ఆ ఇంటికి ప్రదక్షణ చేసి నమస్కారం చేసుకొని వచ్చేవారు. ఒక్కొక్కసారి మాకు దర్శనం ఇవ్వటానికి నాన్నగారు టవల్ ఆరేసుకునే వంకతో బయటికి వచ్చి మాకు దర్శనం ఇచ్చారు అని ఆనందపడుతూ చెప్పేవారు. ఆ ఆనందానికి అవధులు ఉండేవి కావు.

ఒకసారి అత్తయ్య నాన్నగారి ఇంటి గుమ్మం దగ్గర నిలబడి దుఃఖ పడుతూ ఉన్నారట. నాన్నగారు గుమ్మానికి ఉన్న కర్టెన్ తీసుకుని బయటకు వచ్చి అప్పలనరసమ్మ గారూ మీరు దేవుడ్ని చూసారా..? అని అడిగారట. దుఃఖ పడటం వలన నోటి నుంచి మాటరాక చూడలేదు అని తల ఊపారట! అప్పుడు నాన్నగారు నేను భగవంతుడిని చూశాను.

నేను చూసిన భగవంతుడిని మీకు చూపిస్తాను అన్నారట. ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న స్నేహితురాలు తరువాత నాకు చెప్పారు.

ఒకసారి నాన్నగారికి ఆపరేషన్ అయినప్పుడు నాన్నగారిని చూడటానికి అత్తయ్య హైదరాబాద్ వచ్చారు. వారమ్మాయి, నేను హైదరాబాదులో ఉంటాము. నాన్న గారి దగ్గరికి తీసుకు వెళ్ళమని నన్ను చాలా బలవంతం చేసారు. నాకు నాన్నగారిని ఇబ్బంది పెట్టడం పెద్దగా ఇష్టం ఉండదు. ఎంత చెప్పినా వినకపోయేసరికి సరే అని ఆ హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్లి, తరువాత వచ్చి తీసుకెళ్తాను అని చెప్పి వచ్చేసాను. అక్కడ కూర్చుని దుఃఖ పడుతూ ఉన్నారట. నాన్న గారు బయటకు వచ్చి ఏంటి అప్పల నరసమ్మ గారూ మీరు ఇక్కడ ఉన్నారు ఏమిటి? అని అడిగారట. మిమ్మల్ని చూసి వెళదామని వచ్చాను నాన్నగారూ అని చెప్పారట. నేను బానే ఉన్నాను అని నాన్నగారు సర్దిచెప్పి పంపించారట. తరువాత ఈ విషయం నాన్నగారే స్వయంగా చెప్పారు. ఒకసారి మా చిన్న మేనత్త భర్త చనిపోయారు. వాళ్ళు అమలాపురంలో ఉంటారు. ఆయన అప్పలనరసమ్మ గారికి మరిది అవ్వటం వలన ఆవిడ చెల్లెలు ఇంటికి వెళ్లారు. అప్పుడు రావులపాలెంలో నాన్నగారి ప్రవచనం జరిగింది. మా మేనత్త ఆ ప్రవచనానికి వెళ్ళారు. నాన్నగారు అక్కడ మా మేనత్త ని చూసి, మరిది గారు చనిపోతే అప్పలనరసమ్మ గారు ఇక్కడ ఉన్నారు ఏమిటి, అని చాలాసార్లు అన్నారట. ఈ విషయం నాన్న గారే చెప్పారు. తర్వాత అప్పలనరసమ్మ గారు తన చెల్లిని పుట్టినిల్లు అయిన జిన్నూరు తీసుకువచ్చారు. ఆ సమయంలోనే తనకి కొంచెం ఆరోగ్యం భాగాలేకపోవటం వలన పాలకొల్లు హాస్పత్రిలో జాయిన్ చేశారు. అక్కడ నుండి హైదరాబాదు తీసుకువచ్చారు. హైదరాబాద్ వచ్చిన తరువాత నాన్నగారికి నన్ను హైదరాబాదు తీసుకొచ్చినట్టు తెలుసో లేదో అన్నారు.

అదే ఆవిడ మాట్లాడిన ఆఖరి మాట! ఆ రోజే అత్తయ్య దేహం వదిలేసారు. ఆ సమయానికి నాన్నగారు కోయంబత్తూర్ లో ఉన్నారట. నాన్నగారు భోజనం చేద్దామని చెయ్యి కడుక్కుని చాలా సేపు నిలబడి అప్పలనరసమ్మ గారు ఏంటి నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు అన్నారట. తర్వాత రోజు నాన్నగారికి ఫోన్ చేశాను. ఏంటమ్మా అత్తయ్య మనతో చెప్పకుండా వెళ్ళిపోయారు అన్నారు. తను ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా నాన్నగారిని మనసులో నింపుకుని చేసేవారేమో అనిపించేది నాకు.

భర్తలేకపోయినా, తన ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసినా, పైకి కష్టపడినట్టు కనిపించేవారు కాదు. అంటే ఆవిడ జీవితానికి నాన్నగారే సర్వస్వం అయ్యారు. నాన్న గారిని నాన్నగారు అని కూడా అనేవారు కాదు, సాక్షాత్తు భగవంతుడు అనేవారు. తను చనిపోయినప్పుడు నాన్నగారు కోయంబత్తూరులో భక్తులతో అన్న మాటలు : “అప్పల నరసమ్మ గారు ఇలా వెళ్లిపోయారు ఏమిటి? అప్పలనరసమ్మ గారికి ఇప్పుడు శరీరంతో సంబంధం తెగిపోయింది, బంధువులతో సంబంధం తెగిపోయింది, అందరితోనూ సంబంధం తెగిపోయింది, ఇపుడు గురువు పని మొదలవుతుంది. చీకటి లోకాలకు వెళ్ళకుండా గురువు వెలుగులోకి తీసుకు వెళ్తారు. అప్పల నరసమ్మ గారికి ఇంక ఒకటి రెండు జన్మలు మాత్రమే మిగిలి ఉన్నాయి" అన్నారు.

జిన్నూరులో ఒకసారి ప్రవచనం జరిగినప్పుడు అప్పలనరసమ్మ గారి కోసం ఈ లడ్డూలను పంచుతున్నాను అన్నారు. దానికి అప్పలనరసమ్మ గారి కుమారుడు లడ్డూలకు నేను డబ్బులు ఇస్తాను నాన్న గారూ అంటే, అది నీకు సంబంధం లేదు. నా కోసం నేను పంచిపెడుతున్నాను అన్నారు. నాన్నగారు అప్పలనరసమ్మ గారి ఫోటో ఒకటి తెప్పించి, ఆశ్రమంలో ఆయన గదిలో పెట్టుకున్నారు.

తరువాత నాలుగైదు ప్రవచనాలలో ఒక పది నిమిషాలు అప్పలనరసమ్మ గారి గురించి మాట్లాడారు. ఒకసారి నాన్నగారు నాతో మీ నాన్నగారు పొలిటీషియన్ అవ్వడం వలన మీ అమ్మగారు బిజీగా ఉండేవారు.

మొత్తం కష్టమంతా అప్పల నరసమ్మ గారిదే అమ్మా! తను ఎంత కష్టపడ్డారో నీకు ఏమి తెలుసు? నేను చూశాను... నేను చూశాను... అన్నారు. జిన్నూరులో చాలామంది అప్పల నరసమ్మగారు మా జీవితాలకి నాన్నగారిని ప్రసాదించారు అని చాలా కృతజ్ఞతగా ఉంటారు.

Sunday, January 30, 2022

"దేవీ స్వరూపులు శ్రీ నాన్నగారు" - (By లేట్ కనుమూరి లక్ష్మి గారు)

జిన్నూరులో నాన్నగారి తమ్ముడుగారి ఇంట్లో మేము అద్దెకు ఉండేవాళ్ళం. మా పిల్లలు నాన్నగారి ఇంటి ఎదురుగా ఉన్న స్కూల్లో చదువుకునేవారు. నాన్నగారు గ్రామ పెద్దగా ఉండి అన్ని కార్యక్రమాల్లోను పాలుపంచుకునే వారు. మా పిల్లలకి ఆటల పోటీలలో బహుమతి వస్తే, నాన్నగారి చేతుల మీదగా అందుకున్నారు. నాకు చిన్నప్పటి నుండి దేవుడిని తెలుసుకోవాలి అనే కాంక్ష బలీయంగా ఉండేది. ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే వారు భగవంతుని మాటలు ఏమైనా చెబుతారా అని ఎదురు చూసేదాన్ని. నేను మూడోతరగతి చదువుతున్నప్పుడు అమ్మవారు నా జీవితంలోకి ప్రవేశించారు. అప్పటినుండి నాకు దేవి అంటే చాలా ఇష్టం. నాకు అప్పుడప్పుడు దర్శనం కూడా కలిగేది. స్కూలుకి వెళ్ళి నిన్ను మరిచి పోతున్నాను తల్లి అని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గర బాధపడుతూ ఉండేదాన్ని. వివాహమై, ముగ్గురు సంతానం కలిగిన తర్వాత కూడా ప్రతినిత్యం అమ్మవారి పూజ చేసుకునేదాన్ని. నాకు ఏ కష్టం వచ్చినా అమ్మవారి తోనే పంచుకునే దానిని. నాకు తెలిసిన వారందరూ దేవిని ఎక్కువ పూజించడం వలన కష్టాలు వస్తాయి అనేవారు. అమ్మా, అందరూ ఇలా అంటున్నారు ఏమిటి అని దేవిని ప్రార్ధిస్తే, తల్లి బిడ్డలను ప్రేమిస్తుంది కానీ, కష్టాలు పాలు చెయ్యదు అనే సమాధానం వచ్చింది. నా భర్త సహకారం నాకు సరిగ్గా ఉండేది కాదు. అందువలన పిల్లలని పోషించలేనేమో అని చనిపోదాం అనుకున్నాను. అప్పుడు అమ్మవారు కలలో కనిపించి నాన్నగారిని చూపించి, ఆయన దగ్గరకు వెళ్ళు ఆయన నీకు మహోన్నతమైన స్థితిని ప్రసాదిస్తారు అని చెప్పింది.

నాన్నగారు దర్శనం కోసం నాన్నగారి ఇంటికి వెళ్ళగానే, నాన్నగారు నన్ను చూసి నాకు ఎదురొచ్చి లోపలకి తీసుకు వెళ్ళారు. నాకు చాప వేసి కూర్చోమని ఆయన మంచం మీద కూర్చున్నారు. రామకృష్ణుడు అన్నీ అమ్మవారితో పంచుకున్నట్టు నాకు నాన్నగారిని చూడగానే నా అనుభవాలన్నీ ఆయనకి చెప్పుకోవాలి అనిపించింది. నాన్నగారు నన్ను ఏమీ మాట్లాడనివ్వకుండా కళ్ళు మూసుకొని కూర్చున్నారు. అప్పుడు నాన్నగారిలో ఉన్న ఆ బ్రహ్మ తేజస్సు ఈ విశ్వమంతా వ్యాపించినట్టు నాకు అనిపించింది. అందరూ నాన్నగారిని భక్తుడిగానే చూస్తున్నారు కానీ, ఆయన దేహం ధరించి వచ్చిన ఆ పరమేశ్వరుడే అనుకున్నాను. నా మానసిక రోగం తగ్గించటానికి నాకు ఒక మంచి వైద్యుడు లభించాడు అనిపించింది. అలా ఆ రోజు నుండి నాన్నగారు మీద విశ్వాసం కుదిరి ఆయనకే శరణాగతి చెందాను. నాన్నగారితో ఈ జీవిత యాత్ర దాదాపుగా 40 సంవత్సరాలు కొనసాగింది. ఏ రోజూ కూడా ఆయన మీద నమ్మకం చెక్కుచెదరనివ్వలేదు. ఆ రోజు నుండి ప్రతిరోజూ ఇంట్లో పూజ చేసుకుని, తర్వాత నాన్నగారి దర్శనం చేసుకుని వచ్చేదాన్ని. ప్రతిరోజు అదే నా దినచర్య. అలా నా జీవితానికి నాన్నగారి దర్శనం ఒక మహా వెలుగు అయ్యింది. నాన్నగారికి దగ్గరలో ఏవో కారణాలు వలన మా పిల్లలు ఇల్లు కొనుక్కోవద్దు అన్నారు. దూరంగా ఉంటే నాన్నగారిని చూడటానికి వీలుపడదు అని, నాన్నగారి ఇంటికి దగ్గరలోనే ఇల్లు తీసుకుంటాను, నా జీవితానికి అది సరిపోతుంది అని మా పిల్లలకి చెప్పాను. నాన్నగారి పట్ల నాకు కుదిరిన ఆ విశ్వాసం వలన నాన్నగారు నాకు భగవంతుడు స్వరూపంగానే కనిపించేవారు. కానీ అప్పట్లో అందరూ నన్ను మనిషిని పట్టుకుని దేవుడు అంటుంది ఏమిటి? అని విమర్శించేవారు. అయినా ఏమీ లెక్క చేసేదాన్ని కాదు. ఆ దైర్యానికి నాన్నగారు నన్ను మెచ్చుకునేవారు. నాకు ఎన్నో స్వప్నాలు వచ్చేవి. ఆ స్వప్నాల యొక్క అర్థం ఎవరిని అడిగినా మాకు తెలియదు అని చెప్పేవారు. ఒక్క నాన్నగారి దగ్గర మాత్రమే నా ప్రశ్నలకు సమాధానం దొరికింది. నాన్నగారికి భిన్నంగా నాకు వేరే జీవితం అంటూ ఏదీ లేదు. అందుకే నా జీవితం గురించి నాకు తెలియదు. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితమంతా నాన్నగారే నిండి ఉన్నారు.

ఒకసారి నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయని నాన్నగారికి చెప్పకపోయినా, నాన్నగారు నాకు కొంత ధనము ఇచ్చి ఇది ఉపయోగించుకో అన్నారు. అప్పుడు నాన్నగారూ నేను మీ దగ్గరికి ఏదో ఆశించి రావటం లేదు. సమాజపరంగా కానీ, కుటుంబపరంగా కానీ నాకు లభించనటువంటి జ్ఞానం మీ దగ్గర లభిస్తోంది. దానివల్ల నా మనసుకి విపరీతమైన శాంతి చేకూరి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవి నా మనసుని తాకటం లేదు. అందువలన మీ సమక్షానికి వస్తున్నాను అని నాన్నగారు ఇచ్చిన ధనాన్ని అక్కడ పెట్టేసాను. అప్పుడు నాన్నగారు నావెనకే వచ్చి అప్పు కింద తీసుకో, నీ దగ్గర ఉన్నప్పుడు తిరిగి ఇవ్వచ్చమ్మా అని నా చేతోలో పెట్టేసి, నిన్ను చూస్తుంటే దేవత భూమి మీదకు వచ్చి నడుస్తున్నట్టు ఉంటుంది అన్నారు. ఒకసారి నాన్నగారు నీకు వచ్చే కష్టాలను చూసి నీకు భయం వేయటం లేదామ్మా అని అడిగారు. నాకు భయం వేయటం లేదు నాన్నగారు. అందరిలా పరిస్థితులు బావుంటే నేను ఇక్కడికి రావటానికి నా భర్త అంగీకరించకపోదురు. ఆ కష్టాలు ఉండటం వల్లనే ఇక్కడకు వచ్చి మీ సమక్షాన్ని ఆనందిస్తూ, మీ సబ్జెక్ట్ ని ఆస్వాదిస్తున్నాను. నాకు ఉపనిషత్తులు ఏమీ తెలియకపోయినా మీ నోటి నుండి వచ్చిన ప్రతి వాక్కు నాకు ఉపనిషత్తుతో సమానం. నాకు కష్టాలు ఉండటం వల్లనే ఈ ఉపనిషత్తులు వినటానికి నాకు ఇక్కడికి వచ్చే భాగ్యం కలిగింది. అందువలన ఆ కష్టాలు ఉన్నా పరవాలేదు అన్నాను. నువ్వు ఏమాట మాట్లాడినా ఉపనిషత్తులా మాట్లాడతావు అన్నారు. మాకు బంధువులు, స్నేహితులు అన్నీ నాన్నగారే అయ్యి నడిపించారు. ఒకసారి మా అబ్బాయిని నాన్నగారు మీరు మీ బంధువులందరినీ మరిచిపోయారా అని అడిగారు. అప్పుడు మా అబ్బాయి తాతయ్యా, మీ సమక్షంలో ఉండి మీ వాక్యాలు వింటూ అందరిని మరిచిపోయేలా చేసారు. మాకు అన్నీ మీరే అయ్యారు అన్నాడు.

ఒక్కొక్కసారి నాకు నాన్నగారి చెబుతున్న వాక్యాలు వింటున్నాము కానీ వాటిని ఆచరించలేక పోతున్నాము, అవి ఆచరించలేనప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయనను ఇబ్బంది పెట్టడం ఎందుకు అనిపించి వెళ్ళేదాన్ని కాదు. అప్పుడు నాన్నగారే సైకిల్ తొక్కుకుంటూ మా ఇంటికి వచ్చి ఎందుకు రావటం లేదమ్మా లక్ష్మీ అని అడిగి రమ్మని చెప్పి వెళ్ళేవారు.

నాన్నగారు ఒకసారి "మీకు తలంపులు వస్తున్నా ఆ తలంపులు మీరు కాదు. తలంపులు లేని స్థితి ఒకటి ఉంటుంది అదే మీరు" అన్నారు. ఆ వాక్యం విని చాలాసేపు ఆలోచించుకుని, నాన్నగారూ నా తలంపులే నేను అనుకుంటున్నాను. అది మాత్రం నాకు స్పష్టంగా తెలుస్తోంది. తలంపు లేని స్థితి ఒకటి ఉంటుంది అని మీరంటున్నారు. అది నాకు అనుభవంలో లేదు. అందువలన మీరు చెప్పిన దానిని నేను అంగీకరించలేక పోతున్నాను. దీని గురించి నాకు అర్థమయ్యేలా చెప్పండి అని అడిగాను. నాన్నగారు ఒక పది రోజులు నీకు కొంచెం కష్టంగా ఉంటుంది. తరువాత దీని గురించి నీకు బాగా అర్థమవుతుంది అన్నారు. తరువాత నాకు ఆ విషయాన్ని అవగాహనలోకి తెచ్చారు. అలా నాన్నగారు ఏదైనా వాక్యం చెబితే అది అనుభవంలోకి రావడం లేదని చాలా బాధ పడేదాన్ని. నేను పడుతున్న ఆ బాధ నాన్నగారికి తెలిసి అవమానాలు భరించకుండా, కష్టాలు పడకుండా ఆత్మ జ్ఞానం వస్తుంది అని ఎదురు చూడకు. అందుకు నీ మనసుని సిద్ధం చేసుకుని నా దగ్గరికి రా అన్నారు.

ఒకసారి నాన్నగారి ఇంటికి వెళ్ళి, నాన్నగారూ ఇంట్లోనూ న్యాయం చేయలేకపోతున్నాను, మీరు చెప్పిన వాక్యాలు విని అర్థం చేసుకొని జీవించలేకపోవటం వలన అనవసరంగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్నీ ఇబ్బంది పెడుతున్నాను. రేపటినుండి సత్సంగాలకి రాను నాన్నగారూ అన్నాను. అప్పుడు నాన్నగారు "ఒక గుడికి వెళ్తే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతాము. కానీ ఆ కాయ ఒక్క దెబ్బకు పగలదు కదా! తొమ్మిదిసార్లు కొడితే పదవసారి పగులుతుంది. ఆ తొమ్మిది సార్లు కొట్టిన ప్రభావం దాని మీద ఉండటం వలన అది పదవసారి పగులుతుంది. అలాగే సబ్జెక్టు శ్రవణం చేయగా, చేయగా దాని ప్రభావం నీ మనసు మీద ఉంటుంది. ఈశ్వరుడు ఒక్కసారి నిన్ను తలుపు సందులో పెట్టి నొక్కి ఆ వాక్యాన్ని అనుభవంలోకి తీసుకు వస్తాడు. అందుకే శ్రవణం చేయమని చెబుతారు. అది నీకు ఎప్పుడు అనుభవంలోకి తీసుకురావాలో ఆ ముహూర్తం ఈశ్వరుడు పెట్టుకుంటాడు. నువ్వు ఇక్కడకు వచ్చి ప్రవచనం వింటూ ఉంటేనే నీకు మారు మనసు రావటం లేదు. ఇక ఇక్కడకి రాకపోతే నీకు మారు మనసు ఎలా వస్తుంది? అందువలన నువ్వు ప్రవచనం వినటానికి రావటం మానవద్దు" అని చెప్పారు. మరొక సందర్భంలో నాన్నగారు "స్నేహం అంటే రూపాలు వేరైనా, వారి హృదయం ఒక్కటిగానే ఉంటుంది. నీ స్నేహం నాకు ఇష్టం అమ్మా లక్ష్మీ" అన్నారు. నాన్నగారు రామచంద్రరాజుగారితో, లక్ష్మి చాలా కష్టాలు పడుతున్నప్పటికీ అవి ఏమి తన ముఖంలో కనిపించవు. అందరూ ఆశ్చర్యపడే స్థాయికి లక్ష్మిని ఈశ్వరుడు తీసుకువస్తాడు అన్నారట. లక్ష్మీ నువ్వు ఏమీ చింతించకు, నాన్నగారు నీ గురించి ఇలా అంటున్నారు అని రామచంద్ర రాజు గారు నాకు చెప్పారు. అలా డాక్టర్ గారు, రామచంద్ర రాజు గారు నాకు తోబుట్టువుల్లా ఉండేవారు. నేను ఎప్పుడయినా చెడు స్నేహాలలో పడినా, నాన్నగారు నాకు లోపలినుండి వారితో స్నేహం చేయకు అని గైడ్ చేసేవారు. అలా అనుక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు. ఒకసారి నేను వెళ్ళే సమయానికి నాన్నగారు ధ్యానంలో ఉన్నారు. నేను వచ్చిన సంగతి ఆయనకు తెలిసి ధ్యానం నుండి బయటకు వచ్చి అమ్మా లక్ష్మీ , ఈశ్వరుడు నీకు వరం ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఏమి వరం కావాలి? అని అడిగారు. నాకు జ్ఞానం కావాలి అన్నాను. జ్ఞానం మాట అటు ఉంచు. నీకు ధనం కావాలా? చదువు కావాలా? అన్నారు. నాన్నగారు నాకు చదువు కావాలి. చదువంటే ఇష్టం అని చెప్పాను. అప్పుడు నాన్నగారు అయితే మీ ముగ్గురు పిల్లలని ప్రయోజకులను చేసి ఈశ్వరుడు నీ చేతిలో పెడతాడమ్మా..! తరువాత జ్ఞానం కావాలి అని అడిగావు కదా..! జ్ఞానం అంటే ఏమిటో తెలుసా? అన్నారు. జ్ఞానం అంటే ఏమిటో నాకు తెలియదు నాన్నగారూ కానీ, అది పొందాలనే కాంక్ష మాత్రం బలీయంగా ఉంది అన్నాను. అప్పుడు నాన్నగారు నా జాతి దానివి ఎన్నాళ్ళకు దొరికావు? ఈ ప్రకృతి మాటలు విని నా చెవులు చిల్లులు పడిపోయాయి. నీ ముఖంలో ఎప్పుడూ అసూయ అన్నది నాకు కనపడదు. ఆ అసూయని పోగొట్టుకోవటానికి నువ్వు పూర్వజన్మలో చాలా తపస్సు చేసావు అని నాకు తెలుస్తోంది అన్నారు. నా దినచర్యలో భాగంగా ఒకసారి నాన్నగారి దర్శనానికి వెళ్ళాను. భోజనం చేసావా? పిల్లలకు పెట్టేవామ్మా..! నీ యోగ క్షేమాలు చూడకుండా నేను భోజనం చెయ్యను. ఈ దేహం ఈ భూమి మీద ఉన్నంతవరకు మీ కుటుంబ యోగక్షేమాలను నేను చూసుకుంటాను అన్నారు.

ఆయన చేసే ప్రతి పనిలోను, ప్రతి మాటలోను ఆయన ఆత్మగా నాకు వ్యక్తమయ్యేవారు. నాన్నగారు ప్రేమ ఎటువంటిదంటే, ఒక రాయికి బాధ కలిగినా కూడా ఆ బాధ తీర్చటానికి స్పందించే ప్రేమ హృదయం నాన్నగారిది. నాకు వచ్చే సమస్యలన్నీ నాన్నగారి దగ్గర ఏమీ చెప్పకపోయినా, నా హృదయంలో ఉండి నా సమస్యలు అన్నీ తెలుసుకొని నన్ను అన్నివిధాలా సంరక్షించారు. భౌతికంగా నాకు తండ్రిలా, ఆధ్యాత్మికంగా నాకు దైవంలా నా వెన్నంటి ఉంటూ నన్ను అడుగడుగునా రక్షిస్తూ ఉండేవారు. అలాంటి ప్రేమను ఇకముందు ఎన్నడూ ఎవరిలోనూ చూడలేము. నాన్నగారి దేహం లేకపోయినా, ఇప్పడు కూడా నాకు లోపల నుండి గైడెన్స్ ఇస్తున్నారు.

నాన్నగారు నన్ను ఏది చెయ్యమని చెబితే అదే చేసేదానిని. నాకంటూ ప్రత్యేకమయిన అభిప్రాయం ఏమీ ఉండేది కాదు. మా పిల్లలు వివాహం జరిగే సమయంలో మా బంధువుల వలన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పాను. "ఎవరి సలహాను అనుసరించి మనం జీవించగలము అమ్మా, నీకు స్ఫూర్తిని ఇచ్చేవాడు భగవంతుడు. ఆయన నీ హృదయం నుండి నిన్ను గైడ్ చేస్తాడు. దాని ప్రకారం నువ్వు పని చేసుకు వెళ్ళిపో!" అన్నారు. నా భర్తకి ఆరోగ్యం బాగా లేనప్పుడు నాన్నగారు నీ భర్తని చూసుకోమ్మా అన్నారు. నాన్నగారికి ఇచ్చిన మాట కోసం ఆయనకు సేవ చేస్తూ ఉండేదాన్ని. కానీ ఆయనకు సేవ చేసే శక్తి నాన్నగారు ఇస్తున్నారని స్పష్టంగా తెలుస్తూ ఉండేది. ఈ సేవ చేసే ప్రక్రియలో నాలో ఉన్న ఇష్టాలను, అయిష్టాలను కూడా నాన్నగారు తగ్గించేసారు. చాకిరి నేను చేస్తుంటే, గౌరవం నీకు వస్తోంది ఏమిటి లక్ష్మీ.. అన్నారు. అంటే నాలో ఉండి నాకు శక్తిని ఇస్తూ నాన్నగారు చేసేవారు. అలా ఆయన ప్రేమతో అన్నీ చేయిస్తూ ఆయన ప్రేమలో జీవుడిని కరగ పెట్టేవారు. "చెడు తలంపు లోనుంచి నువ్వు బయటకు రావాలి అని కష్ట పడుతూ ఉంటావు కదా! నువ్వు పడిన ఆ కష్టమే నిన్ను కష్టం లేని స్థితికి తీసుకు వెళుతుంది" అనేవారు.

నాన్నగారితో కలిసి చాగల్లు ప్రవచనానికి వెళ్ళాను. అక్కడ వంటచేసి నాన్నగారికి వడ్డించినప్పుడు, లక్ష్మీ... వంట బాగా చేసావమ్మా అన్నారు. తరువాత ఇంటికి వచ్చేసి ఆరోజు రాత్రి కింద ఏమీ పరుచుకోకుండానే నిద్రపోయాను. అప్పుడు మా ఇంట్లో విద్యుత్ సౌకర్యం లేదు. నాకు సహజంగానే గాఢ నిద్ర పడుతుంది. ఆ రోజు అలా పడుకున్నప్పుడు ఎదో నా శరీరం మీద పాకుతున్నట్టు అనిపించింది. కానీ కళ్ళు తెరవలేక నాన్నగారి మీద భారం వేసి పడుకున్నాను. మరుసటి రోజు నాన్నగారి దర్శనానికి వెళ్ళినప్పుడు నన్ను చూసి, దేహం మీద ఏమీ పాకుతోందో అనే స్పృహ లేకుండా పడుకున్నావు అంత నిద్ర ఏమిటి? కింద ఏమైనా పరుచుకొని పడుకోవాలి. చీకటిలో ఉన్నప్పుడు బ్యాటరీ లైట్ వేసుకో అనిచెప్పి కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు. అంటే నువ్వు నిద్రపోతున్నా నీ హృదయములో ఉన్నవాడు మాత్రం నిద్ర పోకుండా నిన్ను చూస్తూ ఉంటాడు. వాడు ఒక్కడు మాత్రమే నీ క్షేమం కోరుకునేవాడు అని అంటారు కదా! అలా నాన్నగారు నా క్షేమం కోరుకుంటూ నాకు అడుగడుగునా సహాయం అందిస్తూ ఉన్నారు. ఒకసారి ఊరు వెళుతూ చపాతీ పిండి బయట మర్చిపోయి వెళ్ళిపోయాను. ఊరి నుండి వచ్చిన తరువాత, నాన్నగారిని దర్శనం చేసుకుని వచ్చి ఈ చపాతీ పిండితో చపాతీలు చేసుకుని తిందాము అనుకుని నాన్నగారి ఇంటికి వెళ్ళాను. అప్పుడు నాన్నగారు ఆ చపాతీ పిండిపై బల్లి పాకింది. ఈ రోజు నువ్వు మా ఇంట్లో భోజనం చెయ్యి అని, కన్నమ్మ గారితో లక్ష్మి కి కూడా వంట చెయ్యి అని చెప్పారు. కన్నమ్మగారు లక్ష్మి కి నేను వంట చేసే ఉంచాను అన్నారు. అలా వారు ఇరువురు నాపై చూపే ప్రేమలో నాకు భౌతిక జీవితంతో సంబంధం లేకుండా వారి ఇరువురి నడుమ పసిబిడ్డలా అనందిస్తూ గడిపేదాన్ని. నాన్నగారు నాకు ఏదైనా పండు ఇచ్చినా, ఈ పండు నీ ఆరోగ్యానికి మంచిది తిను లక్ష్మీ అని ప్రేమగా చెప్పి ఇచ్చేవారు.

ఒక భక్తుడు నాన్నగారితో లక్ష్మి మనస్తత్వం పిల్లల స్వభావంలా ఉంటుంది ఏమిటి నాన్నగారూ అన్నారట. లక్ష్మి మనసు మనకు ఉంటే ఒక్క సెకనులో భగవంతుడు మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అన్నారట నాన్నగారు. ఎంతో మంది స్వాములు నాన్నగారి దర్శనానికి వచ్చి నన్ను చూసి, నాన్నగారి సమక్షంలో ఉంటూ ఆడుతూ, పాడుతూ నువ్వు పొందవలసినది పొందుతున్నావు. ఇంతకు మించిన భాగ్యం ఎవరికి లభిస్తుంది? అనేవారు. ఒక జ్ఞాని జీవుడిలో ఉన్న అజ్ఞానం తో పోరాడి, చివరికి ఆ పోరాటంలో జ్ఞానే విజయం సాధిస్తాడు. ఇది నా జీవితంలో నాన్నగారి ద్వారా జరిగింది. ఇది నా ప్రత్యక్ష అనుభవం.

ఒకసారి మా ఇంట్లో అమ్మవారు ఎందుకో దుఃఖ పడుతున్నట్టు నాకు అనిపించింది. నాన్నగారి ఇంటికి వచ్చి చూస్తే నాన్నగారు కూడా అలాగే కనిపించారు. అప్పుడు నాన్న గారిని నేనేమైనా తప్పు చేశానా? మీరు ఇరువురూ అలా దుఃఖ పడుతున్నట్టు నాకు ఎందుకు అనిపిస్తోంది? నా తప్పు ఉంటే చెప్పండి నేను సరి చేసుకుంటాను అన్నాను. అప్పుడు నాన్నగారు "నీకు వచ్చే దుఃఖాన్ని మీ బంధువులు ఎవరూ పంచుకోలేరు. నువ్వు ప్రేమించే నీ దేవి, నువ్వు ఆరాధించే నేను మాత్రమే పంచుకోగలము. నీ హృదయంలో ఉన్న అంతరాత్మ తప్ప నీ దుఃఖాన్ని ఎవ్వరూ పంచుకోలేరు" అన్నారు. ఈ మాట భక్తులందరికీ కూడా ఉపయోగపడుతుంది అనిపించింది. ఒకసారి భగవాన్ జయంతికి నాన్న గారిని భోజనానికి రమ్మని ఆహ్వానించాను. అప్పుడు నాన్నగారు నువ్వు నా మాటలు అర్థం చేసుకుని ఆచరించు అదే నీ నుండి నేను ఆశిస్తున్నాను అన్నారు.

ఒకసారి నాన్నగారు అరుణాచలం వెళ్ళారు. అప్పుడు నాన్నగారు ఇక ఉండరు అనే భయం నాలో కలిగి అరుణాచలం వెళ్ళి నాన్నగారిని చూసేయాలి అనిపించింది. చేతిలో ప్రయాణానికి సరిపడా ధనం ఏమీ లేకపోయినా, అరుణాచలం వెళ్ళాలనుకుని స్టేషన్ కి వెళ్ళాను. అప్పుడు అక్కడ భక్తులు ఒకరు కనిపించి మిమ్మల్ని నేను తీసుకు వెళ్తానని చెప్పి తీసుకువెళ్లారు. అరుణాచలం వెళ్ళి నాన్నగారిని చూసిన తరువాత నాన్నగారు బానే ఉన్నారు. ఇది అంతా నా మనసు చేసే గారడీ అని అర్థమైంది. ఇంక ఎప్పుడు మనసు మాట వినకూడదు అనుకున్నాను.

నాన్నగారు ప్రవచనాలు చెప్పటం మొదట నాన్నగారి ఇంటి దగ్గర ప్రారంభించారు. ఆ తరువాత పోస్ట్ ఆఫీస్ లో చెప్పేవారు. నాన్నగారు అక్కడికి వెళ్ళేటప్పుడు మా అబ్బాయిలను కూడా సైకిల్ ఎక్కించుకుని తీసుకుని వెళ్ళేవారు. నాన్నగారు అక్షరమణమాల పాడుతూ, మా అబ్బాయిని సైకిల్ ఎక్కించుకుని తొక్కుకుంటూ, ప్రతి పౌర్ణమికి పక్కనే ఉన్న చిన్న , చిన్న గ్రామాలకు ప్రవచనం చెప్పటానికి వెళ్ళేవారు. మా అబ్బాయిలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు అల్లరి చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని వాళ్ళని నాన్నగారు వెంట తీసుకు వెళ్ళేవారు.

నాన్నగారి ప్రవచనాలు వేరే గ్రామాల్లో జరిగినప్పుడు, అక్కడికి వెళ్ళటానికి సరిపడా ధనం నా దగ్గర ఉండేది కాదు. అటువంటప్పుడు నన్ను ప్రవచనానికి తీసుకువెళ్ళే బాధ్యత మీదే నాన్నగారూ అని ప్రార్థించేదాన్ని. అలాగే నాన్నగారు ఏదో ఒక రకంగా సహాయం చేస్తూ, నా ప్రయణానికి సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిస్తూ ఉండేవారు. ఒకసారి చించినాడలో గురుపౌర్ణమి చేసినప్పుడు నాన్నగారి ప్రవచనానికి వెళ్ళాను. అప్పుడు నాన్నగారు నన్ను దగ్గరకు పిలిచి, "ఏ శక్తిని నమ్మి నువ్వు ఈ ప్రవచనాలకి వస్తున్నావో, నిన్ను తిరిగి ఇంటి దగ్గర దింపే భాధ్యత కూడా ఆ శక్తిదే." అందువలన నువ్వు ప్రతి ప్రవచనానికి రావచ్చు అన్నారు.

నాన్నగారి వాక్యాలు మా పిల్లలు కూడా వినాలని, ప్రతి ఆదివారం వాళ్ళకి ఇష్టం లేకపోయినా నాన్నగారి దగ్గరకు తీసుకు వెళ్ళేదాన్ని. అది చూసి నాన్నగారు పిల్లల్ని ఎందుకు తీసుకు వస్తున్నావు అని అడిగేవారు. వీళ్ళు కూడా బాగు పడాలి అనే నా స్వార్థం కోసం నేను తీసుకొస్తున్నాను నాన్నగారూ అని చెప్పేదాన్ని. అది విని వెరీగుడ్ అనేవారు.

ఒకసారి పాలకోడేరు ప్రవచనానికి వెళ్ళాము. అక్కడ ఎవరో నా గురించి చెడుగా చెప్పటం వల్ల ఒక పెద్దాయన నేను భోజనం చేస్తుండగా వచ్చి నన్ను మందలించడం మొదలు పెట్టారు. నాకు అక్కడి నుండి వెంటనే వచ్చేయాలని అనిపించింది. కానీ వ్యక్తి అంటే అహంకారం. అది ముఖ్యం కాదు. అన్నం అంటే పర బ్రహ్మ స్వరూపం. అంటే, అన్నం ముందు కూర్చున్నప్పుడు అది తినకుండా వచ్చేస్తే, అన్నాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది అని లోపల నుండి స్ఫురించింది. అందువల్ల ఆయన మాటలు పట్టించుకోకుండా భోజనం ముగించుకుని వచ్చేసాను. అలా అవమానాలను భరించే శక్తి కూడా లోపల నుండి నాన్నగారు ఇస్తూ ఉండేవారు.

నేను ఆపరేషన్ చేయించుకోవటానికి వెళ్ళేముందు నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను. అంతా సవ్యంగా అవుతుంది చేయించుకోమ్మా అన్నారు. ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్స్ మీరు మాకు సహకరించాలి, మీరు బతుకుతారు అని గ్యారెంటీ కూడా ఇవ్వలేము అని చెప్పారు. దానికి ఈశ్వరుడు నన్ను ఈ ఆపరేషన్ వంక పెట్టుకుని తీసుకు వెళ్ళాలనుకుంటే తీసుకు వెళ్ళిపోతాడు. మీ పని మీరు చేయండి అన్నాను. నా నోటి ద్వారా నాన్నగారు పలికించిన ఆ వాక్యాలకి డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. నేను మగతలోకి జారుకుంటున్నప్పుడు అరుణాచలం గిరి పై నుండి ఒక మహా వెలుగు వచ్చి నా లోకి ప్రవేశించినట్టు అనిపించింది. ఆపరేషన్ అయిన తరువాత నాలో ఎలాంటి భయాందోళనలు లేకుండా ఉండటం చూసి డాక్టర్లు, మా పిల్లలు కూడా ఆశ్చర్యపోయారు.

ఒకసారి నాన్నగారు ఈ ప్రహరీ దాటి గుమ్మం లోపలికి వచ్చిన వారు ఎవ్వరూ కూడా ఒట్టి చేతులతో బయటకు వెళ్ళరు అన్నారు. నాకు పూజ ద్వారానే నాన్నగారు లభించారు అనిపిస్తుంది. పూజ చేసినప్పుడు దీపం వెలిగిస్తాం కదా! ఆ దీపం వెలిగించినప్పుడు ఎలా ప్రార్థించాలో చెప్పేవారు నాన్నగారు. హృదయంలో ఉన్న జ్ఞానజ్యోతిని వెలిగించడం నాకు తెలియక, దానికి పరోక్షంగా ఈ దీపాలను వెలిగిస్తున్నాను. నా హృదయంలో ఉన్న జ్ఞానాన్ని వెలుగులోకి తీసుకు రమ్మని చెప్పి భగవంతుడిని ప్రార్ధించి దీపం పెట్టుకోండి అనేవారు. అలాగే పూజ చేసి హారతి ఇచ్చేటప్పుడు, నాలో ఉన్న అజ్ఞానాన్ని కరిగించమని ఈశ్వరుడిని ప్రార్థించండి అనేవారు. నాకు పూజ అంటే ఆసక్తి ఉండటం వలన హారతి ఇచ్చేటప్పుడు హారతి ఇచ్చేది ఎవరు? అది పొందేది ఎవరు? అని ఒకోసారి అనిపిస్తూ ఉండేది. అంటే అంతా నాన్నగారే కదా! అలా మధ్య, మధ్యలో అద్వైతస్థితి అనుభవంలోకి వచ్చేటట్టు చేస్తూ ఉండేవారు. నాన్నగారు దేహం వదిలేసే ముందు ఎందుకో నాకు ఇక నాన్నగారు దేహం ఎన్నో రోజులు ఈ భూమిపైన ఉండదు అనిపిస్తూ ఉండేది. అప్పుడు నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల నాన్నగారికి దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా నాన్నగారిని విడిచి ఉండలేను అని మా అబ్బాయిలతో పోట్లాడి నాన్నగారి దగ్గరకు వచ్చేసేదానిని. మా పెద్దబ్బాయికి ఒకసారి నాన్నగారు స్వప్నంలో దర్శనమిచ్చి, మీ అమ్మను నా దగ్గరకు పంపించు నా దేహం ఇంకా ఎన్నో రోజులు ఉండదు అని చెప్పి, నన్ను చూడటానికి నువ్వు ఎప్పుడు వస్తావు? అని మా అబ్బాయిని అడిగారట.

ఒక భక్తురాలికి భగవాన్ స్వప్నంలో దర్శనం ఇచ్చి నన్ను అరుణాచలము తీసుకొని రమ్మని చెప్పారట. నాకు కూడా అదే సమయంలో స్వప్నంలో దర్శనమిచ్చి నువ్వు అరుణాచలం వస్తావా అని అడిగారు. అలా భగవాన్ అనుగ్రహంతో నా దగ్గర ప్రయాణానికి సరిపడా ధనం లేకపోయినా అరుణాచలం వెళ్ళాను. గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు గిరిని చూసి దేవుడు అనుకునే అంత భక్తి నాకు లేదు. రాయిని దేవుడు అంటారేమిటి అనుకున్నాను. ప్రదక్షణ చేసి వచ్చిన తర్వాత నా చుట్టూ నేను తిరుగుతున్నట్టు నాకు కల వచ్చింది. గిరి అంటే మన హృదయంలో ఉన్న ఆత్మ అని నాకు అప్పుడు అర్థమయింది.

నాన్నగారి దగ్గర ఏమాత్రం భయపడకుండా ఉండేదాన్ని. ఆయనంటే విపరీతమైన ఇష్టం ఉండటం వల్లనే ఆయనంటే భయం కలిగేది కాదు. నాన్నగారి సమక్షంలో ఉన్నప్పుడు నాన్నగారి నోటిలో నుండి వచ్చే ప్రతి వాక్యం అనుభవంలో నుండి వచ్చేది. అందువలన అక్కడ దేహ స్ఫురణ కూడా ఉండేది కాదు. నాన్నగారు నా వైపు చూస్తూ ఉంటే, ఎందుకు తరచుగా నా వైపు చూస్తూ ఉంటారు అనుకునే దానిని. నీ వైపు చూడకుండా ఉండలేక చూస్తున్నాను అమ్మా అనే వారు. నాన్నగారు ఏవాక్యం చెప్పినా కపటం లేకుండా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు. ఆయన్ని చూస్తుంటే ఒక్కొక్కసారి జ్ఞానమే రూపం ధరించి వచ్చింది అనిపించేది. ఒకసారి నాన్నగారి దగ్గరకు వచ్చిన ఒక డాక్టరు mathematics కి అంతం ఏమిటి? అని అడిగారు. అంతం చైతన్యమే! అని నాన్నగారు చెప్పారు. నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు, జ్ఞాని నా స్వరూపం పొందుతాడు అని భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు అని నాన్నగారు చెప్పారు. అలా భక్తుల మనసులలో ఉన్న బండరాళ్ల లాంటి వాసనలు నాన్నగారి అనుగ్రహం ద్వారా తొలగించబడ్డాయి. అందువల్లనే ఈరోజు భక్తులు అందరం చాలా ఆనందంగా ఉండగలుగుతున్నాము. ఇలా నా జీవితంలో జరిగే ప్రతి సంఘటన రాస్తే ఒక పెద్ద గ్రంధం అవుతుంది. మనం బాగు పడటానికి ఒక గురువు చాలు అని నాన్నగారు చెప్పారు. అలా మనల్ని మనం బాగు చేసుకోవడానికి ఒక రమణ భాస్కర చాలు అనిపిస్తుంది. ఎవరు ఏ యోగంలో ప్రయాణం చేసినా, మన దృష్టి అంతా ఎక్కడ కేంద్రీకరించాలి అంటే మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి. దేహంతో ఏ నేను అయితే తాదాప్యం పొందుతోందో దాని నుండి విడుదల పొందాలి.

Sunday, January 2, 2022

"నాన్నగారు మనతోనే ఉన్నారు" - (By సుజాతా గారు)

ఒకసారి నాన్నగారితో కాశీ వెళ్ళాము. నాన్నగారు ఎప్పుడూ నాకు పని చెప్పేవారు కాదు. నువ్వు అలసిపోతావమ్మ అనేవారు. ఒకసారి ఆయన బట్టలు ఉతకడానికి ఇస్తూ నీకు కష్టం అయిపోతుందేమో అన్నారు. పరవాలేదు నాన్నగారూ అని జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఉతికి ఇస్త్రీ చేయించి ఇచ్చాను. నన్ను పవిత్రం చేయడానికి ఆ అవకాశాన్ని ఇచ్చారు. ఒకసారి నాన్నగారి రూమ్ తుడుస్తుంటే వెరీ గుడ్, వెరీ గుడ్ అన్నారు. ఎందుకో తెలియదు అలా అనేవారు. మా కజిన్స్ లో ఒకరు, తన సొంత పని ఎలా చేసుకుంటారో ఎదుటివారి పని కూడా అలాగే చేస్తారు. ఒకసారి నాన్నగారి దగ్గర తన గురించి చెప్పాను. అప్పుడు నాన్నగారు అలాంటి వారిని డబ్బుపెట్టి కొనుక్కోలేము కదమ్మా, ఇలాంటి వారు దొరకటం చాలా అరుదు అన్నారు.

గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేస్తూ తిరిగేవాళ్ళం. ఒకసారి నా స్నేహితురాలు "మోహము త్రిప్పి నీ మోహ మొనర్చి నామోహము తీరదా అరుణాచల" అని అక్షరమణమాల లో ఉన్న ద్విపదను అంటుంటే, నాన్నగారు తనతో- ఈ ద్విపద ఇప్పుడు మనకు సరిపోదు. ముందు మనకు ఉన్న మోహములో నుండి బయటకు వచ్చేయాలి. ఆయన మీద మోహం కలిగిన తరువాత ఆయన తీసుకోవాలి అని చెప్పారు. నీకు ఏ ద్విపద అంటే ఇష్టం? అని తరువాత నన్ను అడిగారు. "ఊరూరు తిరుగక ఉల్లము నినుగని అణగ నీ ద్యుతి చూపుము అరుణాచల." అని చెప్పాను.

నాకు సంగీతం నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ఒక పది క్లాసుల వరకు సంగీతం నేర్చుకున్నాను. ఒకరోజు సంగీతం క్లాస్ కి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే, భగవాన్ చెప్పిన వాక్యం ఒకటి నాకు జ్ఞాపకం వచ్చింది. అదేమిటంటే, ఒకరు భగవాన్ దగ్గరకు వచ్చి నువ్వే శరణు, నువ్వే శరణు అని పాట పాడుతున్నారు. ఇంత పాట, ఇన్ని దీర్ఘాలు ఎందుకు? ఆ పాడేది మనసు కదా! దానిని అర్పిస్తే సరిపోతుంది అన్న భగవాన్ మాట గుర్తుకు వచ్చింది. (ఆ తరువాత ఎప్పుడూ సంగీతం క్లాసుకి వెళ్ళలేదు). ఆరోజు ఇంటికి రాకుండా పద్మ గారి ఇంటికి వెళ్ళాను. ఆవిడ సత్సంగాలు చెపుతారని నాకు అప్పటికి తెలీదు. నేను వెళ్ళేసరికి అక్కడ సత్సంగం జరుగుతోంది. ఆ రోజు పద్మ గారు సత్సంగంలో నన్ను మాట్లాడమన్నారు. అప్పుడు భగవద్గీతలోని నాకు చాలా ఇష్టమైన "గతే భర్త ప్రభు సాక్షి" అనే శ్లోకం చెప్పాను. నేను చెప్పడానికి ముందే పద్మ గారికి సుజాత వచ్చి ఈ శ్లోకం చెబుతుంది అని అనిపించిందట. నేను సత్సంగంలో చెప్పటం అలా మొదలయ్యింది. సత్సంగంలో నాన్నగారి వాక్యాలు చాలా ఎంజాయ్ చేసేదాన్ని. లోపలనుండి శాంతి ఊరుతూ ఉండేది. ఒక్కొక్కసారి నాకు అర్థం కాని వాక్యం వస్తే దానిని వదిలి వేరే వాక్యం చెప్పేదానిని. ఈ సత్సంగాలు చెప్పటం, నాన్నగారి సబ్జెక్టు వినటం, నాన్నగారి సమక్షంలో గడపటం అవి అన్నీ కూడా ఎంతో అందమైన రోజులు. పద్మ గారు, నేను కలిసి ప్రతిరోజు నాన్నగారి సబ్జెక్టు స్మరించుకుంటూ అన్నీ బాగా చర్చించుకునే వాళ్ళం. అలా సబ్జెక్టు స్మరణ అనే మత్తులో ఏ బాధ తెలియకుండా కొన్ని సంవత్సరాలు మా ఇద్దరికీ గడిచిపోయాయి.

సత్సంగాలు ఎప్పుడూ వీలైనంతవరకూ మానేదాన్ని కాదు. తరువాత ఇంట్లో పనుల వలన కొద్ది రోజులు సత్సంగాలకు వెళ్ళటం కుదరలేదు. తరువాత అరుణాచలంలో నాన్నగారు ఒకరోజు భక్తులు అందరూ ఉండగా, సుజాతకి ఈమధ్య సత్సంగానికి వెళ్ళటానికి సమయం దొరకట్లేదటండి, ఈ బిజీ ఏమైనా వల్లకాటికి వస్తుందా అన్నారు. ఆ మాట అనగానే నాకు కొట్టినట్టు అనిపించింది. ఎప్పుడూ మనం సబ్జెక్ట్ ని మిస్ అవ్వకూడదని నాన్నగారు చెప్తున్నారు అనుకుని, అప్పటి నుండి సత్సంగానికి వెళ్ళటానికి ప్రయత్నం చేసేదాన్ని. ఒకసారి మా అత్తయ్య గారి ఇంట్లో నాన్నగారు ఒక భక్తురాలిని సుజాత సత్సంగంలో ఏమి చెబుతోంది? అందులో నీకు నచ్చిన వాక్యం ఏమిటమ్మా అని అడిగారు. అప్పుడు ఆ భక్తురాలు జీవితాన్ని భరించమన్నారు నాన్నగారూ ఆ వాక్యం నాకు బాగా నచ్చింది అని చెప్పారు. దానికి నాన్నగారు చాలా మంచి వాక్యం అమ్మా అన్నారు. అంటే సత్సంగంలో నా ద్వారా వినిపించిన వాక్యం ఆమె పట్టుకున్నారు. నాన్నగారు అలా ఏదో ఒక రకంగా, ఏదో ఒక ఒంపు పెట్టుకుని మనల్ని పవిత్రం చేయటానికి అలా స్మరిస్తూ ఉండేవారు.

నాలో ఎన్ని వాసనలు ఉన్నాయో! అది నాకు, నా గురువుకి మాత్రమే తెలుస్తుంది. నాన్నగారు ఎక్కడ ఉన్నా ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకునేదాన్ని. నాన్నగారు దేహం వదిలేముందు దేహబాధ చాలా అనుభవించారు. ఆ సమయంలో ఒకసారి నాన్నగారు ఆసుపత్రిలో పేపర్ చదువుతూ నాతో అమ్మా సుజాతా..! "పనిలో నేర్పు అంటే ఏమిటంటే, పనిని నేర్పుగా, ఓర్పుగా చేయడం నేర్చుకోవాలి. అంటే పని చెయ్యాలి, ఆ పని మనకు గుర్తు రాకూడదు. హృదయంలో ఉంటూ ఆ పనిని చేయాలి. హృదయం పని చేస్తుంది కానీ నేను చేశాను అని అనుకోదు. ఎందుకంటే, దానికి కర్తృత్వం లేదు. అలాగ నువ్వు కూడా ఏ పని చేసినా కర్తృత్వం పెట్టుకోకు. పని చేయ్యాలి అది నిన్ను అంటకూడదు. జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినా నువ్వు హృదయంలో ఉండటం నేర్చుకో అదే అభ్యాసము!" అని చెప్పారు.

నాన్నగారు మాతో, మీ మావయ్య గారిని మీరు చాలా బాగా చూసుకున్నారు. నాకు అలా గడవకపోవచ్చు అమ్మా అన్నారు. అప్పుడు నేను, నాన్నగారూ మిమ్మల్ని చూసుకోవటానికి ఎంతో మంది ప్రియమైన భక్తులు ఉన్నారు అన్నాను. నాన్నగారు పొగిడినప్పుడల్లా వాటిని మనం తీసుకుంటే హృదయంలో ఉన్న సత్యానికి దూరమైపోతాము అనిపిస్తూ ఉండేది. అలా పొగడ్తలు తీసుకోకూడదు అనే గైడెన్స్ కూడా నాన్నగారే ఇస్తున్నారు అని తెలుస్తూ ఉండేది. నాన్నగారు దేహం వదిలేసే ముందు వైజాగ్ ఆస్పత్రికి వచ్చినప్పుడు మా మరిది గారి ఇంట్లో కొద్ది రోజులు ఉన్నారు. అప్పుడు నాన్నగారి దేహ బాధలు చూడలేక నాకు నాన్నగారి దగ్గరకు వెళ్ళాలంటే భయం వేసేది. ఆ సమయంలో కూడా నాన్నగారు వచ్చిన భక్తులందరినీ ఎంతో ప్రేమపూర్వకంగా అనుగ్రహించి వారిని సంతృప్తి పరిచారు. అలాంటి సమయంలో నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి నన్ను పిలిచి, అనారోగ్యం వచ్చి హాస్పిటల్ కి వెళితే వారందరూ డబ్బులు చాలా ఎక్కువ దోచేస్తున్నారు అమ్మా అని చెప్పారు. నాన్నగారు అంటే పూర్ణం. అంటే దైవత్వం లోనే మానవత్వం కూడా ఉంటుంది. కాబట్టే మానవులు పడే ఇబ్బందులను అర్థం చేసుకొని అలా బాధని వ్యక్తపరుస్తున్నారు అనుకునేదాన్ని. ఆ సమయంలో ఒకసారి నా భర్త వచ్చి, నాన్నగారూ ఇప్పుడే మీ ఆరోగ్యం కొద్దిగా కుదుటపడుతోంది కాబట్టి ఇప్పుడే మీరు జిన్నూరు వెళ్లొద్దు, కొద్దిరోజులు ఇక్కడే ఉండండి అన్నారు. దానికి నాన్నగారు మా భక్తులు జిన్నూరు లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నారు. అప్పుడు నా భర్త, భక్తుల కోసం బస్సులు వేద్దాము నాన్నగారూ, వారు వచ్చి మిమ్మల్ని దర్శించుకుని వెళతారు అని చెప్పారు. దానికి నాన్నగారు, అదంతా వద్దు నేనే జిన్నూరు వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉండి మరలా తిరిగి వచ్చేస్తాను అన్నారు. అదే సమయంలో ఒక డాక్టర్ గారు నాన్నగారిని మీరు ఇప్పుడు జిన్నూరు వెళ్ళవద్దు, ఒక వేళ వెళ్ళినా మీరు మాట్లాడకుండా మౌనంగా కూర్చోండి. ఎవరో ఒకరు సబ్జెక్టు చెబుతారు అన్నారు. అప్పుడు నాన్నగారు నన్ను జిన్నూరు వెళ్ళవద్దు, అక్కడ మాట్లాడవద్దు అని మీ మనసు చెబుతోంది. అది అంతా నిజం కాదు. "నేను ఉండటానికి సంబంధించిన వాడిని. అది మీకు తెలియదు. మీరు కూడా ఉండటమనేది మననం చేయండి. అలా మననం చేయడం వలన మీ జీవితంలో ఎన్ని కష్టనష్టాలు వచ్చినప్పటికి అవి అన్నీ కాలి బూడిదైపోతాయి. ఆ ఉండటం అనేది అంత గొప్పది" అన్నారు. నాన్నగారి మాటలలో నాకు ఉండటం అనే వాఖ్యము చాలా ఇష్టము. దాని తాలూకు అనుభవాన్ని కూడా నాన్నగారు కొద్దిగా రుచి చూపించారు. ఆ ఉండటం అనే వాక్యము నా జీవితంలో చాలా రోజులు నన్ను వెంటాడింది. నాన్నగారు ఆఖరి సమయంలో హాస్పటల్ లో ఉండగా నన్ను చూసి ఒక చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వు మాత్రము ఇప్పటికీ నేను మరిచిపోలేను. భగవాన్ ఫోటో చూసినా, నాన్నగారి ఫోటో చూసినా ఆ చిరునవ్వే దర్శనం ఇస్తుంది. ఏ తలంపులు లేనిచోట నేను ఉన్నాను అనిపిస్తుంది. వెంటనే నాకు దక్షిణామూర్తి జ్ఞాపకం వస్తారు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ నాన్నగారి ఫోటో దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, లోపల ఉన్న అశాంతిని తొలగించి, హృదయంలో ఉన్న శాంతిని ఎప్పటికప్పుడు నాకు రుచి చూపిస్తూ ఉంటారు. గురువు ఎప్పుడూ మనకి ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నారు. మనకి భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని ఒక అవకాశంగా భావించి దానిని పొందటానికి తయారు అవ్వాలి (పక్వానికి రావాలి).

నాన్నగారు నాకు దండలు వద్దు, నమస్కారాలు వద్దు. నేను ఏ స్పిరిట్ తో ఈ మాటలు చెబుతున్నానో, ఆ స్పిరిట్ తో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆచరించండి చాలు. అదే నాకు పెద్ద నమస్కారం అనేవారు. నాన్నగారి సబ్జక్ట్ వినేటప్పుడు చాలా ఏకాగ్రతగా వినేదాన్ని. అలా క్యాసెట్ రూపంలో అందిన నాన్నగారి సబ్జెక్ట్ ని చాలా ఎంజాయ్ చేశాను. మనం విన్నది ఏదీ కూడా వృధా పోదు. అది ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలో పని చేస్తూనే ఉంటుంది.

నాన్నగారు చెప్పిన వాక్యాలలో "నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఫలానా, నేను ఇది, నేను అది అని అనుకోకుండా ఉంటే చాలు మనకి మోక్షం వచ్చేస్తుంది". అన్న ఈ వాక్యం నన్ను చాలాకాలం ఆచరిస్తూ జీవింపచేసింది. అలా గడిచిన రోజులలో నిరంతరం శాంతి నాలో ప్రవహిస్తూనే ఉండేది. అది భగవంతుని దయ! వాక్యము దేవుడై ఉంది దేవుడు, వాక్యం వేరు కాదు అన్నది నాన్నగారు అలా రుచి చూపించారు. కృష్ణుడు ఇదంతా నా విభూతి అంటాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ భగవంతుడు ఇస్తాడు. ఏ భక్తుల్ని చూసినా భగవంతుడి వైభవం కనిపిస్తుంది. నాన్నగారిని చూసినా భగవంతుడి వైభవం కనిపిస్తుంది. అలా మనసు ఎక్కడికి వెళ్ళినా భగవంతుడే జ్ఞాపకం వచ్చేవాడు. అప్పుడు మనసు వెనక్కి తిరిగి హృదయం లోపలికి వెళ్ళిపోయేది. జననమరణాలకు మనము అలవాటు పడిపోయి, జ్ఞానాన్ని, భక్తిని మిస్ అయిపోతున్నాము అని నాన్నగారు ఒక మాట చెప్పారు. "మన జీవితంలో ఎన్నో వస్తాయి. వాటిని అన్నింటిని పరిష్కరించుకోవాలి అంటే అసలు పని అవ్వదు. దాన్ని దానికే వదిలేయాలి. మనం మనంగా ఉండడానికి ప్రయత్నించాలి. జీవితంలో ఎవరితోనూ పోల్చుకోకూడదు." అన్నారు. అంటే మనం ఎలా ఉంటున్నామో చూసుకుని, మనం తరించడానికి ప్రయత్నం చేయాలి. ఎదుటి వారిలో ఉన్న మంచిని చూసి మనం ఆనందించాలి. దేహం వదిలే ఆఖరి సమయం వరకు మీ మనసుని నమ్మవద్దు అని నాన్నగారు చెబుతారు కదా! భగవంతుడు నన్ను మంచి కుటుంబంలో ఉంచి, మంచి గురువుని కూడా ప్రసాదించాడు. అందువలన జీవితంలో పెద్ద కష్టాలు అంటూ ఏమీ తెలియదు కానీ, చిన్న సమస్యలే పెద్ద భూతంలా కనిపిస్తూ ఉండేవి. కానీ నాన్నగారి దయ వలన ఇప్పుడు అలా అనిపించడం లేదు. మనకు కష్టాలు ఏమీ తెలియకుండా, మన భక్తులందరినీ కూడా నాన్నగారి అనుగ్రహం ఉంచుతోంది.

ఒకరోజు నా భర్తకి టిఫిన్ పెడుతున్నాను. అప్పుడు ఒక యాచకుడు వచ్చి అమ్మా బిక్షం అన్నాడు. రోడ్డున పోయే వాడు భిక్ష అడుగుతున్నాడు అని మా వారు అన్నారు. అప్పుడు నేను బయట ఉన్నవాడు చిన్న బిచ్చగాడు, మనము పెద్ద బిచ్చగాళ్ళం. మనమంతా భగవంతుడిని ఏదో ఒకటి కోరుకుంటున్నాము కదా! మనం పైకి బిక్ష అనే వేషం వేసుకోలేదు కానీ లోపల మనం కూడా బిచ్చగాళ్ళమే! ఆ వచ్చిన యాచకుడు అలా కనిపిస్తున్నాడు, మనం కనపడుట లేదు అంతే తేడా అన్నాను. వెంటనే మావారు నవ్వేసారు. నా భర్తకి ఆరోగ్యం బాగాలేనప్పుడు హైదరాబాదులో ఉండవలసి వచ్చింది. అప్పుడు మా కజిన్ వచ్చి నాన్నగారిని చాలా విమర్శించారు. నాకు ఆ సమయంలో చాలా దుఃఖం వచ్చినా ఆపుకున్నాను. అప్పుడు నా భర్త మా వాళ్ళు ఎవరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టరు. మా ఇంట్లో అన్ని పనులు చేసుకునే సత్సంగానికి వెళ్తారు అన్నారు. తను వెళ్ళిపోయాక నాకు కన్నీళ్లు వచ్చేసాయి. అప్పుడు నా భర్త రోడ్డు మీద వెళ్ళే వారి మాటలు నువ్వు పట్టుకుంటావు ఏమిటి? ఆ మాత్రం విశ్వాసం నీకు లేదా? అన్నారు. వెంటనే మొత్తం దుఃఖం అంతా అణిగిపోయింది. ఎవరో ఒకసారి నా భర్త దగ్గర మీ ఆడవారు ఇంత చిన్న వయసులో సత్సంగానికి ఎందుకు వెళ్తున్నారు అన్నారంట. వారు అలా అడిగిన విషయం నా భర్త నాకు చెప్పలేదు. తరువాత ఎవరి ద్వారానో నాకు ఆ మాట తెలిసింది. అప్పుడు నేను, మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నానా అని నా భర్తని అడిగాను. అప్పుడు మావారు నువ్వు చదివే భగవద్గీత మీద నీకు విశ్వాసం లేకపోతే అది కాలవలో పడేయి అన్నారు. అలా నాన్నగారు, మా కుటుంబ సభ్యులు, భక్తులు అందరూ నన్ను ప్రోత్సహించి బాగు చేస్తూనే ఉన్నారు.

నాన్నగారు దేహం ఉన్నా, లేకపోయినా ఆయన పని జరుగుతోంది అనే దానికి నిదర్శనమే ఈ సత్సంగాలు. ఆయన మనతో ఉన్నారు అనటానికి నిదర్శనం ఏమిటంటే, మన లోపాలను మనకు చూపిస్తూ, వాటి బాధ మనకి తెలియకుండా తీసేస్తున్నారు. లోపల ఉన్న ఆనందాన్ని, శాంతిని మనము మరిచిపోతున్నా, మనల్ని మరవనివ్వకుండా చేస్తూ నడిపిస్తున్నారు. మనకి కుటుంబంలో వచ్చే సమస్యల వలన అవి తట్టుకునే శక్తి లేక, గురువు మాట వినకుండా మన వాసనల వెంట వెళ్ళిపోయి, అక్కడ ఉన్న అశాంతి తెలుసుకొని, ఈ అశాంతికి కారణం బయట గొడవలు కాదు, మన మనసే కారణం అని నాన్నగారు చెప్పిన వాక్యం స్మరణకి తెచ్చుకొని వెనక్కి తిరుగుతున్నాము. అలా ఎప్పటికప్పుడు నాన్నగారి అనుగ్రహం మనల్ని హృదయం వైపుకి మళ్ళిస్తూనే ఉంది. మనందరం నాన్నగారి బిడ్డలం. ఆయన అనుగ్రహానికి మనందరం కూడా వారసులమే! మన హృదయంలో ఉన్న ఆనందము స్వతంత్రమైనది అన్న విషయం మనకి అనుభవంలో లేదు. ఎన్ని పుస్తకాలు చదివినా అది అర్థం కాదు. కళ్ళతో చూసి, చెవులతో వింటేనే గానీ మనము నమ్మలేము. అందువల్ల దయామయుడైన భగవంతుడు తన దయనే ఒక గురువుగా నాన్నగారి రూపంలో మనకి పంపారు. మన హృదయంలో ఉన్న సత్యం తో మనకి అనుబంధం కుదిరితే ఎలా ఉంటుందో, నాన్న గారితో అనుబంధం అలా ఉంటుంది. ఈ అనుబంధం ఎన్ని జన్మల నుంచి కొనసాగుతుందో తెలియదు. కానీ మనకు మోక్షం వచ్చేవరకు అది వదలదు. హృదయంలో ఉన్న సత్యానికి మనము ఎంతగా దగ్గర అవుతామో, అంతగా బంధాలలో నుంచి విడివడుతూ ఉంటాము. కృష్ణుడి చిలిపితనం, రాముడి మర్యాద, గౌతముడి గంభీరం, ఆచార్యుడు సత్య బోధ, భగవానుడి ఆత్మనిష్ఠ... వీటన్నిటిని మనము నాన్నగారిలో దర్శించాము. ఆంజనేయుడికి రాముని పని తప్ప సొంత పని ఏమీ ఉండదు. అలాగే మన నాన్నగారు సొంత పని ఏమీ లేకుండా, మనల్ని ఉద్ధరించటమే ఆయన పనిగా పెట్టుకున్నారు. ఇలా అన్ని అవతారాలు కూడిన సత్యమే మన నాన్నగారు! భక్తులు ఆయన చెప్పిన ప్రవచనాలను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనము భక్తుల్ని, ఆ సత్యాన్ని, ఆ ప్రేమని, అన్నిటినీ పూర్ణంగా ఎంజాయ్ చేసాము. అదంతా మన అదృష్టము! నాన్నగారు దేహంతో ఉన్న సమయంలో అనుగ్రహం అనే మత్తులో ఉంచారు. ఆయన చూపు, మాట, మౌనం ద్వారా అనుగ్రహించి మన జీవితంలో ఎదురవుతున్న వాటికి, మనకి బాధ తెలియకుండా ఆయన దాటిస్తున్నారు. మీ అందరికీ బాధ తెలియకుండా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాలి అని ఉంది. అదే నా ఆశ! అని నాన్నగారు అనేవారు. ఆ ఆశని ఆయన తప్పకుండా నెరవేరుస్తారు. కొంతమంది తొందరగా పక్వానికి రావచ్చు, మరికొంతమందికి కొంచెం ఆలస్యం కావచ్చు. కానీ ఈ గేట్ లోకి వచ్చిన తరువాత తరించడం అనేది కచ్చితంగా జరుగుతుంది. నాన్నగారి చూపు, నాన్నగారి మాట మనకి నిజమైన మత్తు. విషయాలు ఎక్కువైతే వేరే మత్తు వచ్చేస్తుంది. కాబట్టి వాటిలో పడకుండా, ఈ నిజమైన మత్తులోనే మన జీవితాలు వెళ్ళిపోవాలి. అలా నాన్నగారు మనల్ని అందరినీ అనుగ్రహించారు. ఈ రోజు ఇలా నాన్నగారి జ్ఞాపకాలు మీతో పంచుకోవడానికి, ఎప్పుడో అనుభవించిన ఆ శాంతిని నా ప్రమేయం లేకుండా మళ్ళీ నాన్నగారు కొద్ది కొద్దిగా రుచి చూపిస్తున్నారు. భక్తులకి - నాన్న గారి పట్ల ఉన్న ప్రేమ చూస్తూ ఉంటే నాకు కొంచెం ఈర్ష్య వస్తూ ఉండేది. మరలా వెంటనే ఎందుకు వస్తోంది ఈర్ష్య...? వారు ఎంత కష్టపడి వారి హృదయాలను ఖాళీ చేసుకుంటే వారికి నాన్నగారి పట్ల ప్రేమ కలిగింది...? అనుకుని అటువంటి వారిని చూసి మనం ఆనందించాలి. అలా ఆనందించే బుద్ధిని ఇమ్మని భగవంతుడిని ప్రార్థించేదాన్ని. ఎప్పుడూ ఆయన పాదాలను ఆశ్రయించి ఉండాలి అనుకునేదాన్ని. మన హృదయంలో ఉన్న ఆత్మ దగ్గరికి వెళ్ళి అక్కడ స్థిరపడటానికి ఒక్క గురువు తప్ప ఎవరూ సహాయం చేయరు.నాన్నగారు, మీకు శాస్త్రం అనుగ్రహం ఉంది, గురువు అనుగ్రహం ఉంది, అందరి అనుగ్రహం ఉంది.. మీ మనసు అనుగ్రహమే ఉండాలి అనేవారు. మన మనసు అంగీకరిస్తేనే కదా మనం అక్కడ ఉండగలిగేది. ఆయన సమక్షంలో మహిమలు జరిగేవి కానీ ఎప్పుడూ వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. పాలకోడేరులో ప్రవచనం చెబుతూ నాన్నగారు, పావలాకే నీకు ఆనందం వచ్చేస్తూ ఉంటే రూపాయి గొడవ నీకు ఎందుకు? అన్నారు. చిన్న చిన్నవి మనకు తెలిసినవి ఆచరిస్తూ ఉంటేనే మనకు ఆనందం వచ్చేస్తోంది కదా... పెద్దపెద్ద వాటి గొడవ మనకు ఎందుకు అని చెప్పకుండా చెప్పారు అనిపించింది. మోక్షం గొడవ మనకెందుకు? భగవంతుడు ఇప్పుడు నీకు ఏది ఇస్తే అది పట్టుకుని ఎంజాయ్ చెయ్యి అని నాన్నగారు చెప్పేవారు. దేహ ప్రారబ్ధాన్ని బట్టి జరిగే వాటితో మనం తాధాప్యం పొందకుండా ఉండటమే సాధన! ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు సాధనే! నాన్నగారి సబ్జక్ట్ వలన సాధన చాలా సులభంగా జరుగుతుంది. అందుకే మన భక్తులతో కలిసి కూర్చున్నప్పుడు ఇవి ఆన్ని చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉంటాము. కృష్ణుడు ఒక మాట చెప్పాడు - మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎల్లమ్మ, పుల్లమ్మ కబుర్లు చెప్పుకోకుండా, నా గురించే మాట్లాడుకోండి. మీకు తెలియకుండానే మీ మనస్సు పక్వానికి వచ్చేస్తుంది అన్నాడు అని నాన్నగారు చెప్పారు. ప్రతిక్షణం నాన్నగారు మనతోనే ఉంటున్నారు కాబట్టి, మనం కూడా నాన్నగారిని వదలకుండా జీవించాలి.