Monday, July 12, 2021

"హార్ట్ టు హార్ట్ బోధ" - (By లీల గారు)

నాన్నగారు ఒక్కొక్కసారి, "లీలా, పోస్ట్ ఆఫీస్ వైభవం జన్మలో రాదమ్మ అని, అప్పుడు ఉన్న మీరందరూ అదృష్టవంతులు అమ్మా" అనేవారు. పోస్ట్ ఆఫీస్ ప్రవచనాలు వైభవం నాకు అప్పట్లో తెలియక పోవటం నాకు తిరిగి ఏమి సమాధానం చెప్పాలో తెలిసేది కాదు. కానీ నాన్నగారి యొక్క ఆ గంభీరమైన మౌనం చూడకుండా ఉండలేక వెళ్ళిపోయేదాన్ని. నాన్నగారి పోస్ట్ ఆఫీస్ ప్రవచానాలు అన్ని పొదుగు దగ్గర పాలు అనేవారు. పోస్ట్ ఆఫీస్ లో ప్రవచానాలు జరిగే సమయంలో నాన్నగారు నన్ను నువ్వు చాలా భక్తిగా ఉంటున్నావమ్మా అనేవారు. అప్పట్లో ఆధ్యాత్మికత గురించి నాకు పెద్దగా అవగాహన లేక నాన్నగారు ఈ భక్తి సరిపోతుందా అని అడిగేదానిని. ఆ మాట విని నాన్నగారు నవ్వుకునేవారు. 12 సంవత్సరాల క్రితం నాన్నగారు అరుణాచలంలో రమణాశ్రమంలో భగవాన్ హాలులో మౌనంగా కూర్చున్నారు. అప్పుడు నాకు సడెన్ గా నాన్నగారు పోస్ట్ ఆఫీస్ మౌనం స్ఫురణలోకి తీసుకు వచ్చారు. మనసుకి చాలా శాంతిగా అనిపించి ఈ మహా శాంతి, ఆనందం ఎక్కడి నుండి వస్తోంది అని నా లోపల అన్వేషణ చేసుకున్నాను. జిన్నూరు వచ్చేసిన తరువాత, నాన్నగారితో అరుణాచలంలో భగవాన్ హాల్లో మౌనంగా కూర్చున్నారు కదా నాన్నగారు, అప్పుడు నాకు పోస్ట్ ఆఫీస్ మౌనం స్ఫురణలోకి వచ్చి, ఈ ఎడతెగని శాంతి, ఆనందం ఎక్కడినుండి వస్తున్నాయి అని వెతికాను నాకు ఏమీ అర్థం అవ్వలేదు నాన్నగారు అని చెప్పాను. అప్పుడు నాన్నగారు, "అమ్మా లీలా అది మనసుకి అందదమ్మా, అది దక్షిణామూర్తి మౌనం. ఆ మౌనం నేను అనుకుంటే రాలేదమ్మా అది నన్ను వరించిందమ్మ" అన్నారు. అప్పుడు పోస్టాఫీసు మౌనం అంతా దక్షిణామూర్తి మౌనం అని నాకు అనిపించింది. నాన్నగారు అది దక్షిణామూర్తి మౌనం అని అందంగా చెబుతూనే, నాకు దక్షిణామూర్తి వైభవం చూపించి, పోస్ట్ ఆఫీస్ మౌనాన్ని నాకు తెలియజేశారు. అలాంటి దృశ్యాలు ఆయన దయ వలన ఆయన సమక్షంలో చూడగలిగాము అంటే, మన ఎన్ని జన్మల పుణ్యఫలమో అనిపిస్తూ ఉంటుంది.

పోస్ట్ ఆఫీస్ లో నాన్నగారు ప్రవచనాలు చెప్పేటప్పుడు, నాన్నగారిలో నుండి వచ్చే ఆ కాంతే వేరుగా ఉండేది. ఇప్పుడంతా నాన్నగారు ప్రేమ ముద్ద. పోస్ట్ ఆఫీస్ ప్రవచనాలలో ఆయన శక్తినంతా ధారపోసారు. తరువాత మేము ఆచరించటం లేదని బల్లను గట్టిగా తట్టి మీరు వినరా,మీరు చెయ్యరా అని బల్లగుద్ది చెప్పేవారు. అక్కడ ఉన్న భక్తులందరికీ లోపల నుండి కంగారు వచ్చేసేది. పోస్ట్ ఆఫీస్ లో ప్రవచనాల తర్వాత నాన్నగారు జిన్నురుకి దగ్గరలో ఉండే గ్రామాలకు కూడా వెళ్ళి ప్రవచనాలు చెప్పటం మొదలు పెట్టారు. మా గ్రామంలో ఉన్న కట్టుబాట్లు వలన స్త్రీలు బయటకు వచ్చే వారు కాదు. అందువలన మా కుటుంబంలో వారికి నాన్నగారి ప్రవచనాలకు వెళ్ళటానికి అవకాశం కుదిరేది కాదు. నాన్నగారు జిన్నూరులో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్ళే వాళ్ళము. ఒకసారి నాన్నగారితో మా తోటికోడలు “నాన్నగారు వేరే ఊరిలో ప్రవచనాలకు మేము రాలేకపోతున్నాము మాకు చాలా బాధగా ఉంది” అని అంది. అప్పుడు నాన్నగారు, "ప్రవచనాలకు వచ్చేవారు ఏ ఆనందాన్ని పొందుతున్నారో మీ ఆర్తి కూడా ఆ ఆనందం దగ్గరికే తీసుకొని వెళ్తుంది అమ్మ" అన్నారు. దానికి మా తోటి కోడలు ఆ ఫలితాన్ని మేము ఏమిచేసుకుంటాము నాన్నగారు మీ సమక్షం కావాలి అంది. అప్పుడు నాన్నగారు, "మా దగ్గరకు వచ్చి ఇప్పుడు నువ్వు చెప్పిన మాట వింటుంటే, నాకు ఏనుగు ఎక్కినంత ఆనందం వచ్చేస్తుంది అమ్మ" అన్నారు.

ఒకసారి నాన్నగారి చిన్నప్పటి విశేషాలు తెలుసుకుందామని నాన్నగారి తల్లిని అడిగాను. నాన్నగారు చిన్నప్పుడు SLC ఫెయిల్ అయ్యారట అప్పుడు నాన్నగారు, వారి తల్లి దగ్గరకు వచ్చి అమ్మ తమ్ముడు రంగడు SLC పాస్ అయ్యాడు అని ఎంతో ఆనందంగా చెప్పారట. నువ్వు పాస్ అయ్యావా అని నాన్నగారిని వారి తల్లి అడిగితే, నేను మరలా కట్టుకుని పాస్ అవుతాను, మన రంగడు పాసయ్యాడు కదా, అని ఎంతో ఆనందంగా చెప్పేరట. మనం పరీక్ష తప్పి మన తమ్ముడు పాస్ అయితే జీవలక్షణాలు ఉన్న మనము అంత ఆనందంగా చెప్పగలమా అనుకున్నాను. నాన్నగారు జన్మతః జ్ఞాని కనుక ఆ సమానత్వం నాన్నగారికి చిన్ననాటి నుండే ఉంది అనిపించింది.

మాకు హై స్కూల్ లో ఒక మాస్టర్ ఉండేవారు. నాన్నగారు పోస్ట్ ఆఫీస్ ప్రవచనాలు మొదలు పెట్టిన తర్వాత ఒకసారి మాతో ఆ మాష్టారు గారు మీరందరూ నాన్నగారిని దేవుడు అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. కానీ ఆయన నడవడిక చిన్నప్పటి నుండి జ్ఞాని నడతే అని చెప్పి, నాన్నగారు సైకిల్ మీద వెళుతూ ఉంటే, ఎవరైనా బ్రాహ్మణులు గాని పెద్దవారు గాని నాన్నగారికి ఎదురు వస్తూ ఉంటే, వారు కొన్ని అడుగులు దూరంగా ఉండగానే నాన్నగారు సైకిల్ దిగిపోయి వారు వెళ్ళిన తరువాత సైకిల్ ఎక్కి వెళ్లేవారు. అలా శ్రీరామచంద్రమూర్తి పెద్దలను ఏవిధంగా గౌరవంగా చూసేవారో, అదేవిధంగా నాన్నగారు కూడా పెద్దల యందు ఉండేవారు అని ఆ మాస్టారు గారు మాతో చెప్పారు. అలా నాన్నగారిని చూస్తే నాకు రాముడు వైభవమే అనిపిస్తూ ఉండేది. ఆ తెల్లని వస్త్రం, ఆ ముఖారవిందంలో ఉండే నిర్మలత్వం, అవి చూస్తే నాకు రాముడు లాగానే అనిపించేవారు. నాన్నగారు మనకి విశ్వాసం కల్పించడానికి ఏదో ఒకటి చూపిస్తారు కదా, అలా ఒకసారి భోజనం వడ్డించేటప్పుడు ఇంట్లో వండిన కూరలు కూడా నాన్నగారికి వడ్డించాను. నాన్నగారు అవి అన్ని భుజించి, లీలా నువ్వు ఎప్పుడైనా భరద్వాజ విందు గురించి విన్నావా అని అడిగారు, వినలేదు నాన్నగారు అన్నాను. రాముడు అరణ్యవాసం అయి తిరిగి వస్తూ ఉంటే, భరద్వాజుడు రాముడుకి విందు చేశాడు ఒక ఆకు నిండుగా కూరలు పెట్టాడు, మరొక ఆకు నిండుగా అన్నం వడ్డించాడు అమ్మ అని ఈరోజు నువ్వు వడ్డించిన విందు నాకు భరద్వాజ విందుని జ్ఞాపకం చేసావు అమ్మ అన్నారు. అలా నాన్నగారు రాముడే అని నాకు ఉన్న విశ్వాసాన్ని దృడపరచడం కోసం రాముడుని తీసుకువచ్చి నాకు స్ఫురించేలా చేశారు.

అందరూ నాన్నగారిని భగవంతుడు అనేవారు. అప్పట్లో నాకు ఆధ్యాత్మికత గురించి పెద్దగా తెలియక మన బంధువులు కూడా దేవుడు అయిపోతారా అనిపించేది. ఒక వ్యక్తిగా మాత్రం నాన్నగారంటే, చాలా ఇష్టంగా ఉండేది. నాన్నగారు జ్ఞాని కాబట్టే ఆయన నేత్రంలో నుండి రశ్మి వచ్చి నా హృదయాన్ని తాకింది. ఆ రశ్మి జ్ఞానాగ్ని కాబట్టే నాలో ఉన్న అజ్ఞానం అలా దడదడ లాడి పోయింది అని అర్థం అవడానికి నాకు రెండు సంవత్సరాలు పట్టింది. ఒకరోజు మధ్యాహ్నం నాన్నగారు క్యాసెట్ వింటూ నాన్నగారు మిమ్మల్ని దేవుడు అని కొంతమంది అంటున్నారు కానీ నేను మిమల్ని గొప్ప వ్యక్తి అని అనుకుంటున్నాను, మీరు ఎవరో నాకు తెలియట్లేదు. అసలు మీ అవతారం ఏమిటి? ఇది అంతా మీరు ఎందుకు బోధిస్తున్నారు, నాకు ఎందుకు తెలియట్లేదు అని అనుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయాను. ఆ నిద్రలో నాకు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నాన్నగారు ఒక చోట ప్రవచనం చెబుతూ ఉంటే, నేను నాన్నగారి పాదాలను స్పర్శిస్తూ, తండ్రీ నాకు జ్ఞానం ఇవ్వండి అని దుఃఖంతో అర్థిస్తూ, తలపైకెత్తి చూసేసరికి నాన్నగారే భగవాన్ లా కనిపించారు. ఆ భగవాన్ శరీరమంతా విభూదితో నింపుకుని, చాలా కాంతివంతంగా ప్రకాశిస్తున్నారు. అప్పుడు మరలా భగవాన్ పాదాలను స్పర్శిస్తూ అలాగే దుఃఖంతో జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. అప్పుడు భగవాన్ తొడలో నుండి విభూది తీసి నాకు ఇస్తున్నారు. అది తీసుకువెళ్ళడానికి ఒక కాగితం పేపర్ ఉంటే బాగుండును అనిపించి పేపర్ కోసం వెతుకుతూ ఉంటే, పేపర్ పక్కనే చిన్న కృష్ణుడు ఫోటో కూడా ఉంది. నాకు చిన్నప్పటినుండి కృష్ణుడు అంటే చాలా ఇష్టం అవ్వడం వలన, భగవంతుడిని దొంగలించినా పరవాలేదు అని నా మనస్సు చెబుతూ ఉంటే, ఆ పేపర్ తో పాటుగా కృష్ణుడిని కూడా తీసుకున్నాను. అప్పుడు మరలా భగవాన్ నాన్నగారులా అయిపోయి నన్ను ఆశీర్వదించారు. ఆ విధంగా భగవాన్, నాన్నగారు, కృష్ణుడు ముగ్గురు ఒకటే అని నాన్నగారు ఆ స్వప్నంలో నాకు తెలియజేశారు. అలా నా అనుభవానికి వచ్చే వరకు ఎంత మంది చెప్పినా నా మనసు నమ్మలేదు. అప్పటినుండి నాన్నగారు అంటే, సాక్షాత్ భగవంతుడే, ఆయన అంతర్యామిగా నా హృదయం లోనే ఉన్నారు అనే మానసిక అనుబంధం నాన్నగారితో ఏర్పడింది.

మేము ఏ ఊర్లో ఉంటే, ఆ ఊర్లో ఉన్న మా ఇంటికి నాన్నగారు తప్పకుండా వచ్చేవారు. నాన్నగారు నాపై చూపించిన ప్రేమకు కృతజ్ఞత తప్ప నేను ఏమి ఇవ్వగలను అనిపించేది. అలా ఒకసారి మద్రాస్ లో ఉండగా నాన్నగారు నా ఒక్కదాని కోసం మీరు ఇంత దూరం వస్తున్నారు నాన్నగారు అన్నాను. "నేను రావటం ఏమిటి నీ భక్తే నన్ను రప్పిస్తొంది అమ్మా", అన్నారు. నేను మద్రాస్ లో ఉండగా నాన్నగారు వచ్చి రెండు రోజులు ఉండేవారు. ఒకోసారి అనిపిస్తూ ఉంటుంది గత జన్మలో నేను పాపాలు కంటే పుణ్యాలు ఎక్కువ చేసి ఉంటాను. స్వయంగా భగవంతుడే నాకు అత్యంత సన్నిహితంగా వచ్చి , అమ్మ అని పిలుస్తూ, ఆయనే నన్ను దగ్గరకు చేరదీసుకొని అత్యంత ప్రేమగా చూశారు. నా జీవితానికి ఇంతకమించి ఏమికావాలి, ఆయన నాపై చూపిన ప్రేమ ముందు నా జీవితంలో వచ్చే కష్టాలు ఏపాటివి, వస్తే రానివ్వు అనిపిస్తూ ఉంటుంది. ఈ కళ్ళు, ఎంత పుణ్యం చేసుకుని ఉంటే, సాక్షాత్ దేహ ధరించి వచ్చిన భగవంతుడిని దర్శించగలిగినవి, ఈ చేతులు ఆయనకు వండి పెట్టగలిగినవి,ఈ కాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళగలిగినవి అనుకుంటూ, నాన్నగారు నా మనసును కూడా తీసుకోరా అని ప్రార్థిస్తూ ఉంటాను.

నాన్నగారిని ఒకసారి శుద్ధ భక్తి ఎలా వస్తుంది అని అడిగాను. "భగవంతుడిని నిరంతరం స్మరిస్తు, ఆయనను జ్ఞాపకంలో పెట్టుకోవడం వలన నీకు భగవంతుడి మీద విశ్వాసం కలుగుతుంది అదే నీకు శుద్ధ భక్తిని కలగజేస్తుంది అమ్మ. భక్తి అంటే నోట్లో కాదమ్మా హృదయంలో భక్తి కలగాలి. ఒక దీపం వెలిగించి దాని చుట్టూ ఉన్న చీకటిని వెళ్ళిపోమని చెప్పాలా, అలాగే హృదయంలో భక్తి కలిగింది అనుకో దానంతట అదే నీలోపల ఉన్న అజ్ఞానం అంతా కాలి బూడిదై పోతుంది" అని వివరణ ఇస్తూ, నీ ఆనందం నీకు అనుభవంలోకి వస్తుందమ్మా అన్నారు. అంటే హృదయంలో భక్తి అన్నారు కదా నాన్నగారు అక్కడ కృష్ణుడు కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మణాం అన్నాడు. జ్ఞానాగ్నిలోనే ఈ వాసనలు, సంస్కారాలు కాలతాయి. ఈ దేహం భౌతికమైన అగ్నికి కాలిపోతుంది, జ్ఞానాగ్ని అంటే నా హృదయంలోనే నా తండ్రి ఉన్నాడు కదా, నేను ఏ పని చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా, ఏ మనసు అయితే నేను అనుకుంటున్నానో అది నా హృదయంలో ఉన్న తండ్రితో తాదాప్యం చెందుతూ, ఈ ఉపాధి ద్వారా పని జరుగుతుంది అని ఎప్పుడైతే చూడగలుగుతున్నానో, అప్పుడు నా మనసులో ఉన్న వాసనలు నెమ్మదిగా కాలడం మొదలవుతాయి కదా, అని లోపల తాదాప్యం పొందటం నేర్చుకుంటూ ఆ వాక్యాన్ని అలా సమన్వయపరుచుకున్నాను.

ఒకసారి కాశీలో నాన్నగారు నాతో అగ్నిహోత్ర కర్మ గురించి ఇప్పుడు నేను చెప్పేదంతా హార్ట్ టు హార్ట్ అని చెప్పి నువ్వు జాగ్రత్తగా విను అని నన్ను అన్నారు. "అగ్నిహోత్ర కర్మ అంటే నువ్వు చేసే పని ద్వారా నీ మనసు, నీ ఇంద్రియాలు, నీ బుద్ధి అన్ని పవిత్రం అయిపోవాలి. అలా నువ్వు భగవంతుడి చేతిలో పనిముట్టులా ఉండాలమ్మా, ఇది నువ్వు మర్చిపోకు అని చెప్పి, నీకు అర్థం అయిందా అని అడిగి, నువ్వు దీనిని జాగ్రత్తగా ఫాలో అవ్వు" అని చెప్పారు. నాన్నగారు శుద్ధ భక్తి గురించి నాకు చెప్పినప్పుడు పవిత్రత గురించి కూడా ప్రస్తావించారు. మన దినచర్యలో భాగంగా మన ప్రవర్తనలోనే పవిత్రత వచ్చేయాలి అని శుద్ధ భక్తికి, పవిత్రత కూడా ఉండాలమ్మ అని, నాన్నగారు ఎలా చెప్పారంటే, "నువ్వు ఒక మేడ కడుతూ దానికి పునాది ఒంటి ఇటుకతో కట్టి పైన మేడ స్ట్రాంగ్ గా కడితే అది ఎలా పడిపోతుందో, అలాగే నీకు పవిత్రత లేకుండా విచారణ,శరణాగతి వీటిల్లో ఏ మార్గంలోకి వెళ్ళినా, నీ సాధన పడిపోతుంది అమ్మ. నువ్వు దైనందిన జీవితంలో ఎలా జీవిస్తే నీకు పవిత్రత వస్తుందో అలా నీ ఆలోచన,మాట,చేత ద్వారా జీవించడం నేర్చుకో. నీ ఆలోచన కరెక్ట్ గా ఉంది అనుకో, అప్పుడు నీ మాట, చేత కూడా కరెక్ట్ గా ఉంటాయి" అన్నారు. అప్పుడు నేను ఆలోచన దగ్గర ఎరుకతో ఉండాలా నాన్నగారు అని అడిగాను. "ఎరుక కాదమ్మా అక్కడ మెలకువ కలిగి ఉండాలి", అన్నారు. "అక్కడ నువ్వు మెలకువగా ఉన్నావు అనుకో నీకు భౌతికమైన ఆలోచన వచ్చింది అనుకో, దానిని ఆధ్యాత్మికంగా తిప్పుకోవడానికి సులువు అవుతుంది. నువ్వు అక్కడ మెలుకువగా ఉండి నీఆలోచన భగవంతుని వైపు తిప్పుకున్నావు అనుకో నీ మాట, చేత కూడా కరెక్ట్ గా ఉంటుంది.దీని ద్వారా పవిత్రత చేకూరుతుంది అమ్మా అని చెప్పి, ఆ పవిత్రతనే నువ్వు ఎప్పుడూ కూడా పునాదిగా పెట్టుకో అమ్మ" అన్నారు నాన్నగారు. "నువ్వు ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళేటప్పుడు భగవాన్ పుస్తకం ఒక పేజీ తీసి ఒక వాక్యం పట్టుకొని ఆ రోజంతా దానిని నీలోపల మననం చేసుకుంటూ ఉండు. అలా మననం చేసుకోవటం వలన నీకు సహజంగా ఆ వాక్యం యొక్క అర్థం స్ఫురించి ఎంతో కొంత నువ్వు అలా జీవిస్తే ముందుకు వస్తావు అమ్మ" అన్నారు. అలా నాన్నగారు మన గమ్యాన్ని చూపిస్తూ ఏ విధంగా జీవించాలో అడుగడుగునా మనకు బోధించారు.