Tuesday, September 22, 2020

"రమణ భాస్కరే నా ధైవం" - (By కుమారి గారు (నౌడూరు))

నాకు 19 వ సంవత్సరంలోనే వివాహం జరిగింది. నాకు వివాహం జరిగినా ఎటువంటి ప్రేమకూ నోచుకోలేదు. అప్పటి నుండి ఎన్నో కష్టాలు అనుభవించాను. కానీ, ఎవరితోనూ చెప్పుకునేదాన్ని కాదు, తల్లిదండ్రులతో కూడా పంచుకునేదాన్ని కాదు. చాలా భయంగా, సున్నితంగా ఉండేదాన్ని. ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు. నలుగురిలోకి వెళ్ళలేకపోయేదాన్ని. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పిరికిదాన్ని. నాకు కష్టాలు మీద కష్టాలు వస్తూనే ఉన్నాయి. అలాంటి సమయంలో నాకు నాన్నగారు లభించారు. 2000 సంవత్సరంలో ఒకరోజు మా చిన్న అత్తగారింటికి వెళ్తే, అక్కడ నాకు రమణ భాస్కర పుస్తకం లభించింది. 2001లో మా చిన్నత్తగారితో పెద్దపాపని తీసుకొని షష్ఠికి నాన్నగారి దర్శనం చేసుకున్నాను. తరువాత 2002 లో చిన్నపాప పుట్టింది.

రమణభాస్కర పుస్తకం రూపంలో అదృష్టం నా తలుపు తట్టింది. మా చిన్న అత్తగారికి చదువు రాదు. రమణ భాస్కర చదువమ్మా! చాలా బాగుంటుంది అన్నారు. నాకు అసలు గురువు గురించి ఏమీ తెలియదు. ఆ పుస్తకం తియ్యగానే ఒక తల్లి దగ్గర బిడ్డ ఏవిధంగా దుఃఖ పడుతుందో అంత దుఃఖం వచ్చింది నాకు. ఎప్పుడైతే రమణ భాస్కర లభించిందో, అప్పుడే ఈ జన్మ ఎందుకో అర్థం అయింది. రమణభాస్కరలో నీ అత్తగారిలో నేనే ఉన్నాను అని చదివాక చాలా దుఃఖం వచ్చింది. నాన్నగారి పుస్తకం చదవడం వలన మనం చేసుకున్నది మనకే వస్తుంది అని అర్థం అయింది. "రమణభాస్కర లో నాన్నగారు చెప్పిన వాటిని మన నిజ జీవితంలో ఆచరిస్తూ జీవించాలి" అదే సత్యం! అని అర్థం అయింది. నేను నాన్నగారి చేతిలో ఉన్నాను అని కూడా అర్థం అయింది. అప్పటికి మా చిన్న అత్తగారి దగ్గర తీసుకున్న రమణ భాస్కర తప్పించి నా దగ్గర ఏ ఫొటోలూ లేవు. రమణ భాస్కర పుస్తకమే అన్ని సమయాలలోనూ నాకు తోడుగా నిలిచింది. 2004 వరకూ నేను పుస్తకంతోనే మాట్లాడుకునేదాన్ని.

మా చిన్న అత్త గారితో కలిసి జిన్నూరు వెళతానంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. నాకు చిన్నపాప పుట్టాక చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే నాన్నగారు నా కోసం వచ్చారేమో అని చాలా ఆనందం అనిపించింది. నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత, నాన్నగారి దర్శనానికి వెళ్ళాను. అప్పుడు నాన్నగారు బ్రహ్మ తేజస్సుతో అరుగుమీద నాకు దర్శనమిచ్చారు. ఆ దర్శనంతో నాజన్మకు సార్థకత లభించింది అనుకున్నాను.

ఒకసారి పొలమూరు మీటింగ్ కి వెళ్ళవద్దు అని నాభర్త నన్ను మందలించారు. నీవు మీటింగ్ కి వెళ్తే మీ పుట్టింటికి వెళ్ళిపో అన్నారు. అన్నిటినీ సహించి, గురువే కావాలి అని ఆయన గురించే ఏడ్చాను. అప్పటి నుండి నన్ను నాన్నగారు బాధపడనివ్వలేదు. నాన్నగారు ఎవరికి వారే నమ్మా! భర్త లేరు, పిల్లలు లేరు, తండ్రీ లేరు. ఎవరు చేసుకుని వచ్చింది వారు అనుభవించాలి అని చెప్పిన వాక్యం నాకు పెద్ద మంత్రం అయింది. నా కష్టాలు చూసి మా అమ్మ ఏ దేవత కైనా మొక్కుకో అమ్మా అంటూ ఉండేది. జరగవలసింది జరుగుతుంది, జరగరానిది జరగనే జరగదు. అని నాన్నగారు చెప్పిన వాక్యం బాగా గుర్తుచేసుకునేదాన్ని! నాసమస్యలను నేనే పరిష్కరించుకునే దాన్ని. నాన్నగారిని తలుచుకోవడం, సమస్యను పరిష్కరించుకోవడం. అవి నా వల్ల అయిపోయినట్లు ఉండేవి. చేసినా చేయనివాడిలా ఉంటారు నాన్నగారు. నేనే కర్తను అన్నట్లు కుటుంబంలో అందరి ముందు చూపించేవారు.

మా అమ్మా, నాన్న ఇటువంటి పెళ్ళి చేసాము ఏమిటి? అని బాధపడ్డారు. కానీ నేను మాత్రం, నా అదృష్టం ఈ పెళ్ళి రూపంలో వచ్చింది అనుకున్నాను. మా అత్త గారి ఇల్లు నాకు అసలైన గురువుని చూపించింది. నాకు సరిగ్గా కష్టాలు ఎదురయ్యే సమయంలో నాన్నగారు నాకు లభించారు. నా భర్త వల్ల ఇబ్బందులు పడినా, నాప్రారబ్ధమే కదా! పోనీలే భరించేద్ధాం నాన్నగారు ఉన్నారు కదా అనిపించేది. నీ ప్రవచనాలకి ఎలాగూ రాలేకపోతున్నాను, నాకు బాహ్యంగా ఏమీ వద్దు. కానీ నా మనసు నీ పాదాలు దగ్గర ఉంచు తండ్రీ! అని నాన్నగారి పుస్తకానికి చెప్పుకుని బాధపడేదాన్ని. ఆ తరువాత నాన్నగారు నన్ను ఎప్పుడూ బాధపడనివ్వలేదు. తరువాత, తరువాత ప్రతిరోజూ దర్శనానికి వెళ్ళినా నన్ను ఎవరూ ఆపలేదు.

మా చిన్న పాపకి లోపల హార్ట్ లో తేడా ఉంది. అందువల్ల బ్రతకదు అని చెప్పేసారు. రమణ భాస్కర పుస్తకం, మా పాపని తీసుకుని భీమవరం ఆసుపత్రులన్నీ తిరిగాను. ఒకసారి మా చిన్న అత్త గారు నన్ను ఎవరు ఎలా బాగు పడతారో తెలియదు అని చెప్పి మా పాపని తీసుకుని నాన్నగారు మీటింగ్ కి వెళ్దాము అన్నారు. మా పాపని తీసుకుని వెళ్ళాము. కానీ, నాన్నగారి తో ఇదీ సమస్య అని చెప్పలేదు. అక్కడ ప్రవచనంలో నాన్నగారి ఎదురుగానే కూర్చున్నాము. నాన్నగారు మా పాపకి ఏదో తెలియని ట్రీట్ మెంట్ చేసారు. చనిపోతుంది అనుకున్న మా పాపకి ఏ వైద్యం లేకుండా నయం చేసేసారు. చాలా పెద్దగా ఉన్న ప్రారబ్ధాన్ని ఆయన అనుగ్రహంతో చిన్నదిగా చేసేసారు. అప్పటినుండి ఏ ఆసుపత్రికి వెళ్ళలేదు. మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసి ఆశ్చర్యపోయారు.

తరువాత మా చెల్లి నాన్నగారి దగ్గరికి వచ్చింది. మీ అక్క వస్తుందా అమ్మా? నాకు తెలియదు అన్నారు. నాన్నగారికి తెలియకపోవడం ఏమిటి? ఈసారి మీ ఇద్దరి పేర్లు చెప్పండమ్మా! గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి, ఇలా కష్టపడి ఎండలో రాకండి అన్నారు. ఎంత దయ అసలు తండ్రికి? అది మాటల్లో వర్ణించలేను. మా పేర్లు కుమారి, పద్మ అని చెప్పాము. మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను అన్నారు. 2017 లో మా పెద్ద పాపని మా తమ్ముడికి ఇచ్చి వివాహం చేశాను. పెళ్ళికి ముందు మా తమ్ముడిని నాన్నగారి దర్శనానికి తీసుకు వెళ్ళాను. ఏం భయం లేదమ్మా మీ తమ్ముడికి నేను చెప్పాను, నేను చెప్పాను అని నాన్నగారు అభయమిచ్చారు. అలా ఎన్నిసార్లు అభయ హస్తం అందించారో తండ్రి!

ఒకరోజు ప్రవచనం జరిగేటప్పుడు నాన్నగారి దగ్గరగా వెళ్ళి కూర్చున్నాము. అప్పుడు అక్కడ ఉన్న భక్తులు మమ్మల్ని ఎవరు మీరు? కొత్తగా వచ్చారు. ముందుకు వచ్చేసారు, వెనక్కి వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు నాన్నగారు వారిని ఎవరు అనుకుంటున్నారు? వారు పూర్వజన్మలో సత్సంగం చెప్పిన వారు అన్నారు. నాన్నగారి నేత్రాలను చూడాలంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి? అనిపించేది. నన్ను స్వతంత్రంగా నిలబెట్టారు. తండ్రి దయను మాటల్లో వర్ణించలేము. ఆయన ప్రేమకు హద్దులు లేవు.
1 comment: