Tuesday, April 4, 2023

"ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూపం నాన్నగారు" - (పరమపదించిన సరస్వతమ్మ గారు)

సరస్వతి దేవి గారు తణుకు ప్లీడర్ సూర్య నారాయణ రాజు గారి కుమార్తె. ఆమెను చిన్నప్పుడు ఒకసారి ఎవరో తిడితే ఆ విషయం తన తండ్రితో చెప్పారు. దానికి ఆమె తండ్రి, గాలి అటు వీస్తూ వెళుతోంది కదా! ఆ తిట్లు కూడా అలా గాలిలో కలిసి వెళ్లిపోతాయి అన్నారు. అప్పటినుండి ఎవరు ఏమన్నా ఆమె పట్టించుకునేవారు కాదు. ప్లీడర్ గారు బెనారస్ లో Law పాసైన రోజునే ఈమె పుట్టారని సరస్వతి అని పేరు పెట్టారు. ప్రపంచంలో సహృదయలందరూ వాటాదారులే అని భగవాన్ రంగన్ తో చెప్పినట్లు, నాన్నగారు ప్లీడర్ గారి సహృదయానికి తరచుగా తణుకు వెళ్ళేవారు. నాన్నగారు ఆయనకి రామనామం ఇచ్చారు. ఆయన తుది శ్వాస వదిలే వరకు రామనామం విడిచిపెట్టలేదు. ప్లీడర్ గారు చనిపోయిన తరువాత నాన్నగారు ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన చాలా నిరాడంబరుడు. కోర్టులో వాదించినప్పుడు ఫీజు ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు అన్నారు. ప్లీడర్ గారి సహృదయం గురించి నాన్నగారు ఒక చిన్న సంఘటన ఈ విధంగా చెప్పారు. ఒక వ్యక్తి ప్లీడర్ గారికి రు. 25,000 ఇవ్వాల్సి వస్తే, అతను వచ్చినప్పుడు అడగమంటారా అంటే, అతన్ని అడగవద్దు అతను ఏమి ఇబ్బందుల్లో ఉన్నాడో అందినప్పుడు ఇస్తాడు అన్నారట. ప్లీడర్ గారు చనిపోయిన పదకొండో రోజు నాన్నగారు రమణ అష్టోత్తరం పుస్తకాలపై ఆయన ఫొటో వేయించి అందరికీ పంచారు. 1992 లో సరస్వతమ్మ గారికి స్వప్నంలో నాన్నగారు పువ్వుల దండతో కనిపించారు. మర్నాడు జూబ్లీహిల్స్ లో ఆవిడకి స్వప్నంలో కనిపించినట్టే నాన్నగారు దర్శనమిచ్చారు.

ఆ రోజు నుండి ఇప్పటివరకూ సరస్వతి గారికి అన్నీ నాన్నగారే. ఆవిడ నాన్నగారిని శాంతిని ఇమ్మని ప్రార్థించేవారు. ఆవిడకి అందరూ సమానమే! అందరి క్షేమాన్ని కాంక్షించేవారు. ఆమె భర్త దత్తుడు గారు. మొదటిసారి నాన్నగారు అజ్రం వెళ్ళినప్పుడు దత్తుడు గారి తల్లి ఫోటోవైపు చూస్తూ, ఆమె తల్లి భగవాన్ ని దర్శించుకున్నారు ఆ బంధమే నన్ను ఇలా తీసుకొచ్చింది అన్నారు. దత్తుడి గారి తల్లి సుబ్రహ్మణ్య స్వామికి గుడి కట్టించారు. దత్తుడు గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు రోజు గుర్తుకొస్తూనే ఉంటారమ్మా అన్నారు. దత్తుడు గారు ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించారు. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు. దత్తుడి గారికి ఆరోగ్యం బాగా లేనప్పుడు నాన్నగారు చూడటానికి వచ్చి, ఈశ్వరుని బొమ్మ ఆయనకి ఎదురుగా ఉంచమని ఇచ్చారు. ఆయన తుదిశ్వాస వదిలేవరకు అది మంచం పక్కనే పెట్టుకుని ఉన్నారు. దత్తుడు గారు చనిపోయాక నాన్నగారు ఆయన ఫోటో పెద్దది కట్టించి తణుకు క్షత్రియ కళ్యాణ మండపంలో పెట్టారు.

1993లో గురు పౌర్ణమికి 30 మందితో కలిసి సరస్వతమ్మ గారు అరుణాచలం వెళ్ళారు. రమణాశ్రమంలో వంటశాల దగ్గరనుండి చిన్న కొండ స్పష్టంగా కనిపించేది. అప్పట్లో చెట్లు ఎక్కువ ఉండేవి కావు. ఒకరోజు సాయంకాలం సరస్వతమ్మ గారికి నాన్నగారు అక్కడ నిలబడి ఆశీర్వదిస్తూ కనిపించారు. ఆవిడ అక్కడ ఉన్న అందరినీ పిలిచారు. నాన్నగారు చాలాసేపు ఆ విధంగా దర్శనమిచ్చారు. తరువాత రెండు నెలలకి నాన్నగారు హైదరాబాద్ వచ్చారు. ఆరోజు నాన్నగారు చెప్పిన మొదటి వాక్యం ఏమిటంటే "బాహ్యంగా ఎంత సేపు చూస్తారు? హృదయంలోకి చూడండి" అన్నారు. అప్పుడు సరస్వతమ్మ గారికి అరుణాచలేశ్వరుడే నాన్నగారు అని అర్థమయింది. నాన్నగారు చాలాసార్లు అజ్రం వచ్చేవారు. వచ్చినప్పుడు ఇక్కడ అరుణాచలంలో ఉన్నట్టు ఉందమ్మా అనేవారు. అక్కడ రెండు మూడు రోజులు ఉండేవారు. అలా మే నెలలో అజ్రం వచ్చినప్పుడు, నాన్నగారు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడానికి రూములోకి వెళ్ళగానే కరంటు పోయింది.

నాన్నగారు విశ్రాంతి తీసుకొని బయటికి వచ్చిన తరువాత ఆవిడతో, సరస్వతమ్మ గారూ నేను గదిలో లోపల ఉన్నాను కదా అయినా వేడి తెలియలేదు అన్నారు.

ఒకసారి ఏదో విషయంలో ఆవిడ కూతుర్లు ఆమెని, కోడళ్ళు చూసుకుంటారు నీకెందుకు అని విసుక్కున్నారు. ఆ రోజు మధ్యాహ్నం సరస్శతమ్మ గారు అందరితో కలిసి జిన్నూరు వెళ్ళారు. నాన్నగారు ఆవిడకి దగ్గరగా కుర్చీ వేసుకుని ముందుకు ఒంగి ప్రేమతో, సరస్వతమ్మ గారూ మీకు ఏమి ఇవ్వగలను? మీకు మోక్షం ఇమ్మని భగవంతుడిని ప్రార్థిస్తాను. ఆయన మోక్షం ఇవ్వాలనుకుంటే పిల్లల మీద మమకారం పోవటానికి వారితో తిట్టిస్తాడు అన్నారు.

కన్నమ్మ గారు సరస్వతమ్మ గారితో, మిమ్మల్ని నాన్నగారు రోజు తలుచుకుంటారు అన్నారు. అదేవిధంగా నాన్నగారు కూడా సరస్వతమ్మ గారితో మీరంటే కన్నమ్మగారికి చాలా ఇష్టమండి అన్నారు. కన్నమ్మ గారు ఎక్కడికి వెళ్ళకపోయినా, అజ్రం మాత్రం రెండు మూడు సార్లు వెళ్ళారు. అప్పుడప్పుడు సరస్వతమ్మ గారితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. తరచూ సరస్వతి గారికి స్వీట్సు, పళ్ళు పంపుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కన్నమ్మ గారు సరస్వతి గారికి ఫోన్ చేసి మిమ్మల్ని చూడాలని ఉంది నేను రాలేను. నాన్నగారు ఎప్పుడైనా మజ్జిగ తాగేవారు. ఆ గ్లాసు మీకు ఇవ్వాలని ఉంది అది పంపిస్తాను అన్నారట. సరస్వతమ్మ గారికి ఎన్నోసార్లు నాన్నగారు కలలో కనిపిస్తూ ఉంటారు. ఆమెకు భావనాబలం బాగా ఉంది. ఆమె ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఎంతోమంది అజ్రాన్ని పుట్టినిల్లు లా భావిస్తూ ఉంటారు. కన్నమ్మ గారి లాగానే సరస్వతమ్మ గారు కూడా దీపావళి తోరాలు వందలకొలది పంచుతారు.

ఒకసారి నాన్నగారు హైదరాబాద్ లో ఒక భక్తుల ఇంట్లో ఉండగా సరస్వతమ్మ గారు వచ్చారు. నాన్నగారు కాసేపు దర్శనమిచ్చి ఎవరో కలవటానికి వచ్చారని గదిలోకి వెళ్ళి పోయారు. ఆవిడ అక్కడే గుమ్మం దగ్గర నిలబడి ఇంకొకసారి దర్శనం అవుతుందని ఎదురుచూస్తున్నారు.

నాన్నగారు తలుపులు తీసి, ఆమె రెండు చేతులను నాన్నగారి తలపై పెట్టుకుని అలాగే చాలా సేపు ఉండి పోయారు. సరస్వతమ్మగారు ఆ ఆనందాన్ని, శాంతిని తట్టుకోలేక పోయారు. ఆమె కుమార్తెలతో నాన్నగారు, మీ అమ్మగారిలో చాలా హుందాతనం ఉందమ్మా అన్నారు.

2015 లో సరస్వతమ్మ గారి మేనకోడలు వేణమ్మ జిన్నూరు వెళ్ళారు. నాన్నగారు ఆమెను నువ్వు ఉదయం రాలేదేమిటి అని అడిగారు. అత్తయ్య ని చూడటానికి వెళ్ళాను అని వేణమ్మ చెప్పారు. నేను అజ్రం వెళ్ళాలి రేపు ఉదయాన్నే వెళదాము అన్నారు. మరుసటి రోజు ఉదయం నాన్నగారే స్వయంగా, సరస్వతమ్మ గారి ఇల్లు నాకు భాగా తెలుసు అంటూ డ్రైవర్ కి దారి చూపిస్తూ తీసుకువెళ్ళారు. కారు దిగిన తరువాత స్పీడ్ గా లోపలికి సరస్వతమ్మ గారి దగ్గరకు వెళ్ళి కుర్చీ దగ్గరకు జరుపుకుని, మీకు మోక్షం రాకుండా ఆపే అవకాశం లేదు. మీరు స్వర్గ రాజ్యం పొందుతారు. మీరు శాంతి, ఆనందం పొందాలి అంటూ ఆ ఆశీర్వాదంతో కూడా నాన్నగారు తృప్తి చెందకుండా, మీరు నిర్వాణ సుఖం పొందాలి. మీరు నామం కూడా చెయ్యక్కరలేదు అల్టిమేట్ స్టేట్ పొందాలి అన్నారు. అక్కడే ఉన్న కొడుకులతో, కోడళ్ళతో ఆమెను చూసుకోవటం మీ అదృష్టం. ఆమెకు కుమార్తెలు కూడా గుర్తుకురాకూడదు. అంటే మీరు అంత బాగా చూసుకోండమ్మా! మీరు యజ్ఞాలు, యాగాలు చెయ్యక్కర్లేదు. ఆమెను చూసుకుంటూ, ఆమెకు సేవ చెయ్యండి అదే మీ అదృష్టం అన్నారు.

నాన్నగారి రెండు చేతులు సరస్వతమ్మ గారి నుదుటి మీద పెట్టి ఉంచారు. అప్పుడు నాన్నగారు, సరస్వతమ్మ గారు ఇద్దరూ కూడా తేజస్సుతో వెలిగిపోయారు. నాన్నగారితో కలిసి అక్కడికి వెళ్ళిన వేణమ్మ ఇదంతా చూసి, నేను ఎంత పుణ్యం చేసుకున్నానో ఈ దృశ్యం చూసే భాగ్యం నాకు కలిగింది. ఆ ప్రేమ, ఆ దయ ఆ అనుగ్రహం చూసే అదృష్టం నాకు కలిగింది. అది నాన్నగారు నాకు ఇచ్చిన బహుమతి అనుకున్నారు. ఆమె జీవించిన జీవిత విధానానికి నాన్నగారు అక్కడికి వచ్చి ఆమెను అలా అనుగ్రహించారు అనిపించింది. సరస్వతమ్మగారికి సత్సంగం అంటే చాలా ఇష్టం. సత్సంగం అయిన వెంటనే ఫోన్ చేసి ఏమి చెప్పారు? అని అడుగుతారు. దూరం నుంచి వస్తారు కదా భోజనాలు పెట్టుకోండి అంటారు. కుమార్తెల కి వారి అత్తగారిని ఎప్పుడూ బాగా చూసుకోవాలి అని చెప్పేవారు.

ఒకసారి లక్ష్మిగారి ఇంట్లో సరస్వతమ్మ గారిని జ్యోతి వెలిగించమన్నారు. ఒకసారి అరుణాచలంలో సరస్వతమ్మ గారు, లక్ష్మి గారు రమణాశ్రమంలో ఒకే రూమ్ లో పడుకున్నారు. లక్ష్మి సామాన్యం కాదు, లక్ష్మిలో కూడా శాంతి ఉంది అన్నారు. ఆ రాత్రంతా శాంతిలో ఉండి సరస్వతమ్మ గారు నిద్రపోలేదు. ఒకసారి 1993లో తణుకులో ఎవరింటికో నాన్నగారు వెళ్ళారు. ఒక ఆమె తల నొప్పి భరించలేక పోతున్నాను అని నాన్నగారితో చెప్పారు. నాన్నగారు కళ్ళల్లోంచి ఒక మెరుపు చుక్కలా వచ్చి ఆమె కళ్ళలోకి వెళ్ళింది. నాన్నగారు తల నొక్కుకుంటూ ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. క్రమేపీ ఆమెకు తల నొప్పి తగ్గింది. సెప్టెంబర్ 23 న నాన్నగారి జయంతి రోజు రాత్రి 12 గంటలకు సరస్వతమ్మ గారికి ఎందుకో మెలుకువ వచ్చింది. నాన్నగారికి హ్యాపీ బర్త్ డే అని చెప్పి పండ్లు సమర్పించి దన్నం పెట్టుకున్నారు. ఇది అంతా ఆయన కృప అన్నారు. సరస్వతమ్మ గారికి 90 సం॥ ల వయస్సు ఉన్నప్పటికీ రోజంతా నాన్నగారి ప్రవచనాలు వింటూనే ఉంటారు. అవి అందరికీ షేర్ చేయటం ఆవిడకి ఇష్టం. ఎవరైనా, ఏ విషయంలో అయినా సరస్వతమ్మ గారిని తప్పు పట్టినా, ఆవిడలో ఏ విధమైన రియాక్షన్ ఉండదు. నాలో ఉన్న తప్పులు గురించి నాకు చెప్పండి నాకు తెలియదు కదా అంటారు. అలా ప్రతీదీ అంగీకరిస్తారు. ప్రతిరోజూ ఇద్దరు ముగ్గురు అనాధలు వారింట్లో భోజనం చేసేవారు. ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన వంట చేస్తే పెద్దవారికి పంపేవారు. ఇంటికి వచ్చిన వారిని ఊరికే పంపటం సరస్వతమ్మగారికి ఇష్టం ఉండదు.