Wednesday, October 26, 2022

"నామం హృదయంలో చేసుకోండి" - (సూర్యకాంతమ్మ గారు)

నాన్నగారి వద్దకు వచ్చే, నిగూడ భక్తులలో సూర్యకాంతమ్మ గారు ఒకరు. వీరి పుట్టినిల్లు గుమ్మలురు గ్రామం. పుట్టింటి వారి ద్వారా నాన్నగారు ఆమె జీవితంలోకి ప్రవేశించారు. ఆమె చిన్నప్పటి నుండి కృష్ణ భక్తురాలు. ఆమెకు తరచూ కృష్ణడు స్వప్న దర్శనం అయ్యేది. ఒకసారి, కృష్ణుడు స్వప్నంలోకి వచ్చి, నా నిజరూప దర్శనం చూపించమంటావా అని అడిగి, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నానని చెప్పి, అలాగే పరమాణువు కంటే చిన్నగా కూడా ఉన్నానని వివరించాడట. ఆ చెప్పే క్రమంలో, సురేకాంతమ్మ గారికి కూడా తనని తాను కోల్పోతున్న భావన కలిగి కృష్ణా! నాకు భయం వేస్తొంది అని అరిచారట. ఇప్పుడు నీకు వివరించినా అర్థం కాదు; నీకు 40వ సంవత్సరం వచ్చిన తరువాత, మరలా నీ వద్దకు వచ్చి చెబుతాను, అప్పుడు నీకు అర్థమవుతుందని చెప్పాడట. సరిగ్గా ఈమెకు 40 సంవత్సరాలు వచ్చిన తరువాత, నాన్నగారి ప్రవచనం కాపవరంలో విన్నారట. నాన్నగారు, కాంతమ్మ గారిని ఆయన ప్రక్కనే కూర్చోబెట్టుకుని కృష్ణుడు గురించి చెబుతూ, మధ్య మధ్యలో మీకు కృష్ణుడు కనిపించాడు కదా! అని అన్నారట. అప్పుడు కాంతమ్మ గారి మదిలో, ఆనాడు స్వప్నంలో కనిపించిన కృష్ణుడే, ఈనాడు నాన్నగారి రూపంలో వచ్చి బోధిస్తున్నారు అనే స్పురణ కలిగిందట. ఒకసారి కాంతమ్మ గారు, నామం పైకి ఉచ్చరిస్తూ నాన్నగారి ఇంటి ప్రాంగణంలోకి వెళ్ళారట. అప్పుడు నాన్నగారు, కాంతమ్మ గారు నామం మనసులో జపించండి, శబ్దాన్ని పైకి రానివ్వద్దు, ఆ శబ్దం ఎక్కడినుండి వస్తోందో గమనిస్తూ ఉండండి అని చెప్పారట. ఆనాటి నుండి, ఆమె జీవితంలో ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయి. తుది శ్వాస విడిచే వరకు భగవాన్ చెప్పిన విచారణ మార్గంలోనే ఉంటూ.. శ్రావణ శుక్రవారం రోజున, దేహం వదిలారు.

 

Sunday, October 23, 2022

"ఈశ్వరుడే నాన్నగారు రూపంలో" - (రామచంద్ర రాజు గారు)

నేను ఆంధ్రపత్రికలో విలేఖరిగా చేస్తూ ఉండే వాడిని. నాన్నగారిని దర్శించక ముందు నుండే ఆద్యాత్మిక విషయాలు తెలుసుకోవాలని కుతూహలం గా ఉండేది. నేను వడ్లవానిపాలెంలో ఉండగా, సుబ్బరాజుగారు మా ఇంటికి వస్తూ ఉండేవారు. అలా వచ్చినప్పుడు ఒకసారి నాకు భక్తి గురించి చాలా ఇష్టంగా ఉంది అని చెప్పాను. ఆయన నాన్నగారు అని జిన్నూరులో ఉన్నారు వెళ్దాం రండి అన్నారు. అంతకుముందే నేను ఒకసారి నాన్నగారు ప్రవచనం విన్నాను ఒక ప్రవాహం లాగా చెప్పటం వలన నాకు అర్థం కాలేదు. సరే అయినా రమ్మంటున్నారు బాగోదు కదా అని వెళ్ళాను. మేము వెళ్ళే సరికి సాయంత్రం 5 అయ్యింది. నాన్నగారు అప్పుడే భోజనం పూర్తిచేసుకొని అరుగు మీద ఉన్న పుస్తకాల రూమ్ లో ఉన్నారు. నన్ను అక్కడకి తీసుకువెళ్ళి సుబ్బరాజుగారు వెళ్ళిపోయారు. నేను నాన్నగారు మాత్రమే అరుగు మీద ఉన్నాము. నన్ను చూసి నా యోగక్షేమాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత నుండి ప్రతిరోజూ నాన్నగారి దర్శనానికి వచ్చేవాడిని. ఆ సమయంలోనే రెండోసారి దర్శనం చేసుకున్నప్పుడు నాన్నగారి మాటలు విన్న తర్వాత నుండి, ఇంటికి వెళ్ళినా కూడా ఆయనే ఉండేవారు. నా కూడా ఉన్నట్టు అనిపించేది. ఆ ఆనందాన్ని పట్టలేక పోయేవాడిని. ఈశ్వరుడే గురు రూపం ధరించి వస్తాడు అని, హృదయం లోనే ఆనందం ఉంది అని కానీ ఆయన సబ్జెక్ట్ వినక ముందు నాకు తెలియదు. అలా సబ్జెక్ట్ వినక ముందే నాన్నగారిని చూసినప్పుడు ఆనందం వస్తూ ఉండేది. ఏంటి ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తోంది అనుకునేవాడిని. నాన్నగారు నాలోనే, నాతోనే ఉంటూ నిరంతరం ఆయన సమక్షంలో గడిపే మహోన్నతమైన వరాన్ని నాకు ప్రసాదించారు. నాలో ఉన్న వాసనలు అన్నీ నాన్నగారు తీసేసి, నా హృదయాన్ని ఖాళీ చేశారు. అను నిత్యం ఆయన సమక్షంలో గడపటమే నాకు సాధన. అప్పట్లో నేను ఒక్కడినే నాన్నగారి దగ్గర ఉండటం వలన నాకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉండేవాడిని. అలా ఒక సారి మధ్యాహ్నం 1:00 కి వెళ్ళినప్పుడు నాన్నగారు పడుకుని ఉన్నారు. నేను వెళ్ళేసరికి, రండి, రామచంద్రరాజు గారు మీ గురించి చూస్తున్నాను అన్నారు. నేను ఏమీ నాన్నగారిని మంత్రం అడగకుండానే "హే భగవాన్ , ప్రియా భగవాన్, శ్రీ గురు దేవులు, సద్గురు రమణులు" అనే మంత్రాన్ని ఇచ్చారు. నాకు అప్పటికీ మంత్రం ఇస్తారని కూడా తెలియదు.

ఒకసారి నాన్నగారు అరుణాచలం వెళ్దాం అన్నారు సరే అని చెప్పి పాలకొల్లు వచ్చేసాను. తరువాత నాన్నగారు పాలకొల్లు సంతకు వస్తూ ఉండేవారు. అలా సంతకి వచ్చినప్పుడు ఒకసారి కూరగాయలు కొనుక్కుని మా షాప్ దగ్గరికి వచ్చి రామచంద్ర రాజు గారు అరుణాచలం వెళ్లి వచ్చేద్దాము సిద్ధంగా ఉండండి, టికెట్ తీసుకున్నాను అన్నారు. ఆత్మ ఒక్కటే సత్యం అంటున్నారు కదా! ఇవి అన్నీ వెళ్ళటం అవసరమా నాన్నగారు అని అడిగాను. నాన్నగారు " రాజీ లేదు, తిరుగు లేదు ఆత్మ ఒక్కటి మాత్రమే సత్యం" అన్నారు నాన్నగారు.

ఈశ్వరుడే గురు రూపంలో నాన్నగారిలా వచ్చారు అని తెలిసినా, మనసులో అంత పట్టు కుదరక ఆయనని ఒక స్నేహితుడి లాగా చూశాను. మీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పారు. చాలా యాత్రలకు మేము ఇద్దరమే వెళ్ళేవాళ్ళము. అలా మొదటసారి అరుణాచలం వెళ్తుంటే, గిరి కనిపించగానే అదిగో రామచంద్ర రాజుగారు అదే అరుణాచలం గిరి అని చెప్పారు. ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి అరుణాచలం వెళ్ళే వాళ్ళము. అలా ఒకసారి అరుణాచలం వెళ్ళి అక్కడ నుండి చిదంబరం, కుంభకోణం, తిరుచందూర్, స్వామిమలై, తిరుచంద్రాపురం, కన్యాకుమారికి వెళ్ళాము. కన్యాకుమారి నుండి మద్రాసు బస్సులో ప్రయాణించాము. చాలా సమయం పట్టింది. నాకు బస్సు ప్రయాణాలు పడక పోవటం వలన వాంతులు అవుతూ ఉండేవి.ఆ ట్రిప్పు మాత్రమే వాంతులు అయ్యాయి. తర్వాత నుండి ఎక్కడికి వెళ్ళినా నాకు వాంతులు తగ్గిపోయాయి. నాన్నగారు అరుణాచలంలో ఉండగా మోరీ గెస్ట్ హౌస్ లో ఉంటూ, భోజనానికి బయటికి వెళ్ళే వాళ్ళము. అలా ఒకసారి నాన్నగారు నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే, “భోజనం తిని , భోజనానికి ఉండేవాడు బుద్ధిమంతుడు లక్షణం అని బుద్ధుడు చెప్పేవాడు, రామచంద్ర రాజు గారు” అన్నారు. అరుణాచలం నాన్నగారితో రెండోసారి వెళ్ళినప్పుడు గిరిప్రదక్షిణకి వెళ్ళాము. అలా గిరి ప్రదక్షణ చేస్తూ నడుచుకుంటూ మధ్య , మధ్యలో ఉన్న ప్రతి చిన్న గుడిని, ప్రతీ లింగాన్ని నాన్నగారు నాకు చూపించారు. నాన్నగారితో పాటు నడుచుకుంటూ భగవాన్ భక్తులైన సాధువు ఓం, అన్నమలై స్వామి దగ్గరకు వెళ్ళే వాళ్ళము. అలా వారందరిని నాకు పరిచయం చేశారు. ఒకసారి నాన్నగారు అరుణాచలం గిరి ప్రదక్షణకి నేను రాను, మీరు వెళ్ళండి అని చెప్పి, సాధు ఓం ఇంకో భక్తుడిని నాకు పరిచయం చేశారు. వారిద్దరితో కలిసి నాన్నగారు నన్ను గిరిప్రదక్షిణ చేయించారు. అలా వారితో కలిసి చెయ్యటం నా జీవితంలో మరుపురానిది.

ఒకసారి నాన్న గారితో కలిసి కొడైకెనాల్ పది రోజులు ఉండి వద్దామని వెళ్లాము. కానీ మేము తీసుకున్న కాటేజ్ చలి ఎక్కువగా ఉండటం వలన నాలుగు రోజులు ఉండి అరుణాచలం తిరిగి వచ్చేసాము. చాలాసార్లు శ్రీహరికోట కూడా వెళ్ళాము. అలా ఒకసారి శ్రీహరికోట నుండి అరుణాచలం వెళ్తుంటే, మధ్యలో సూళ్లూరుపేట నుండి చెన్నై రావటానికి ఒక ట్రైన్ ఎక్కాము. ట్రైను లో ఖాళీ లేకుండా ప్రయాణికులు అందరూ కిక్కిరిసిపోయి ఉన్నారు. ఆ ట్రైన్ లో Bath room దగ్గర నాలుగైదు గంటలపాటు నాన్నగారు కూడా అలాగే నిలబడి మద్రాస్ వరకు ప్రయాణం చేశారు. ఒకసారి భగవాన్ ఆత్మానుభవం పొందిన మదురై కూడా వెళ్ళాము. అక్కడ ఒక చాప ఇస్తే ఆ చాప మీదే ఆ రోజు రాత్రి పడుకున్నాము. నేను నాన్నగారు కలిపి అరుణాచలంలో ఒకే మంచం మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. నేను , నాన్నగారు అరుణాచలంలో గదిలో ఉన్నప్పుడు నాన్నగారికి ఆత్మానుభవం కలిగింది అంటారు కానీ, నేను నాన్నగారిని దర్శించక ముందే నాన్నగారు పొందవలసినది పొందారు. అందుకే ఆయన పొందిన సుఖం అందరికీ పంచి పెట్టాలని అప్పటికే ఆత్మ సుఖం గురించి అందరికీ బోధిస్తూ ఉన్నారు.

ఒకసారి నాన్నగారు నేను అరుణాచలంలో గుడి ని దర్శించుకున్నప్పుడు అపితకుచాంబ గుడి ఎదురుగా నాన్నగారు కూర్చుని ఆ కొండనే మౌనంగా చూస్తూ ఉన్నారు. నాన్నగారు అప్పుడు నాతో, “ఈ గిరి ఫైనల్ స్టేట్” అన్నారు. అలా నాన్నగారు ఎప్పుడూ ఆ గిరిని ఒక చైతన్యంగా, ఒక ఈశ్వరుడిగా మాత్రమే చూసేవారు.

1999వ సంవత్సరంలో నాన్నగారితో కలిసి బద్రి, రిషికేశ్ వెళ్ళాము. నాన్నగారితో కోయంబత్తూరు కూడా వెళ్ళాము అక్కడి నుండి కేరళలో ఉన్న కొన్ని పుణ్యక్షేత్రాలు కూడా వెళ్ళాము. కోయంబత్తూర్ లో ఉండగా నాన్నగారు భగవద్గీత చదువుతూ ఉండేవారు. అలాగే నాన్నగారితో పాటు నాగపూరు అక్కడి నుండి భీమశంకరం మరియు జ్ఞానేశ్వర్ మరియు భక్త తుకారాం ఉండే స్థలాలు కూడా చూసి వచ్చాము. అలా నాన్న గారితో చాలా సంవత్సరాల వరకు మేము ఇద్దరమే చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాము. అలా 38 సంవత్సరాలు నిరంతరంగా విరామం లేకుండా ఆయనతో ఈ జీవిత యాత్ర కొనసాగింది.

నాన్నగారితో అరుణాచలం వెళ్తున్నప్పుడు నా శరీరానికి కూడా ఆనందం వచ్చేస్తూ ఉండేది. శరీరానికే ఇంత ఆనందం వచ్చేస్తూ ఉంటే ఇంకా ఆత్మానందం వస్తే ఇంకా ఎంత వైభవంగా ఉంటుంది అనుకునేవాడిని. నాన్నగారు నాతో ఏమిటి ఇంత వైభవంగా ప్రయాణాలు చేస్తున్నారు అనుకునేవాడిని, ఆయన వైభవానికి సరిపోయే అర్హత ,యోగ్యత నాకు లేకపోయినా నన్ను ఎందుకు ఈయన ఎంచుకున్నారు అని అనిపిస్తూ ఉండేది.

తర్వాత నాన్నగారి ఇంటి దగ్గర ప్రవచనాలు జరుగుతూ ఉండేవి. నెమ్మది, నెమ్మదిగా భక్తులు రావటం వలన అరుగు మీద స్థలం సరిపోయేది కాదు. అప్పుడు జిన్నురు post master కూడా నాన్నగారి ప్రవచనాలు వింటూ ఉండేవారు. అలా జిన్నూరు పోస్ట్ ఆఫీస్ లో ప్రతి ఆదివారం ప్రవచనం ప్రారంభమయ్యింది. అలా పోస్ట్ ఆఫీస్ లో ఒక సంవత్సరం చెప్పిన తరువాత అక్కడ కూడా నిండిపోవడం వల్ల తరువాత వేరే చోట రమణ క్షేత్రానికి స్థలం తీసుకుంటే మంచిదని స్థలం తీసుకున్నాము గానీ, వెంటనే మొదలు పెట్టలేదు. వారంలో 2 లేదా 3 ప్రవచనాలు వేరే గ్రామాల్లో ఉంటూ ఉండేవి. నాన్నగారితోనే వెళ్ళేవాడిని. అలా వేరే వ్యాపకం ఏమీ లేకుండా, నాన్నగారితో నే నిరంతరం గడిపేవాడిని. అక్కడ వారు అడిగిన ప్రశ్నలకి నాన్నగారు వారికి సమాధానం చెబుతూ ఉండేవారు. అవి అన్ని పుస్తకాలు కింద రాస్తే ఎన్ని పుస్తకాలు అయ్యేవో అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఆయన చెప్పినవన్నీ మాధుర్యం మింగినట్టు మింగేసాను కానీ ఇతరులకి నేను పంచి పెట్టలేకపోయాను.

నాన్నగారు కూడా చిన్న గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడ జరిగిన ప్రవచనాలు అన్నీ రాసేవాడిని. నేను విలేకరి ని అవ్వటం వలన వాటిని పత్రికలలో ప్రచురించటానికి ఇచ్చే వాళ్ళము. అలా మేము పంపిన ప్రసంగాలు అన్నీ కూడా పత్రికా సంపాదకులు ప్రముఖ స్థానం ఇచ్చి వాటిని ప్రచురించేవారు. అప్పట్లో జిల్లా ఎడిషన్ లేకపోవటం వలన పత్రికల్లో ప్రచురించిన నాన్నగారి ప్రసంగాలు అన్నీ మెయిన్ పేపర్ లోనే వచ్చేవి.

నాన్నగారు జీవితంలోకి భగవాను ఎలా ప్రవేశించారు అదికూడా పత్రికల్లో వేయించడం జరిగింది. దాని వలన భక్తులందరికీ తెలుసుకోవటానికి ఎక్కువ ఉపయోగపడింది. అలా పత్రికలో ప్రచురించిన ప్రసంగాలు అన్నీ కూడా సేకరించి ఒక పుస్తకం కింద వేయిద్దాం అన్నారు నాన్నగారు. "శ్రీ నాన్నగారి ప్రవచనాలు" అని ఒక పుస్తకం ప్రచురించారు. నాన్నగారి సాహిత్యం చూడాలంటే భక్తులందరూ ఆ పుస్తకం చదివి తీరాలి. చాలాకాలం పుస్తకాలకి ముందుమాటగానీ, ఉపోద్ఘాతము కానీ వ్రాయవలసి వస్తే నన్ను ఒక గదిలోకి తీసుకు వెళ్ళి నాచేత నాన్నగారే స్వయంగా రాయించేవారు.

ఒకసారి గుమ్ములూరు లో ప్రవచనం నిమిత్తం నాన్నగారిని నా సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళే అవకాశం దొరికింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన సహజత్వం, ఆయన నిరాడంబరత్వానికి ఆయన సమక్షంలో నేను పొందిన అనుభూతులకు ఇది గురు శిష్యుల సంబంధమా! స్నేహితుల మధ్య ఉండే అనుబంధమా! ఏమిటి ఈ అనుబంధం అనిపిస్తూ ఉంటుంది. రమణాశ్రమంలో నాన్నగారికి కలిగిన అనుభూతిని నాతో పంచుకున్నారు..

నాన్నగారు భక్తులకి ఎవరికైనా ప్రవచనం గురించి మాట ఇస్తే, ఆ సమయానికి ఆయనకీ ఆరోగ్యం బాగో లేకపోయినా, ప్రవచనం మాత్రం చెప్పటం మానలేదు. అలాగ ఆయన భక్తులపై అపారమైన ప్రేమ కురిపిస్తూ ఉండేవారు. భక్తులకు ఆయనకు విడదీయరాని బంధం ఉండేది. ఏమైనా పని ఉంటే నాన్నగారు నాకు ఫోన్ చేసి రమ్మనే వారు అప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఆయనకు సంబంధించిన ప్రతి విషయంలోనూ నన్ను భాగస్వామిని చేశారు. అలాగా నిర్విరామంగా, విశ్రాంతి లేకుండా కర్మయోగియై జనులందరికీ ఉజ్వలమైన ఆధ్యాత్మిక భవిష్యత్తు అందించాలని కృషి చేస్తూనే ఉన్నారు. ఆయన చైతన్యం కాబట్టి ఆయనకు విశ్రాంతి అవసరం లేదు. కానీ ఆయనతో పాటు ఉన్న నాకు కూడా అలిసి పోతున్నాను అనే స్పృహ లేకుండా చేసేసారు.

ఒక్కొక్కసారి నాన్నగారు పిలిచే ఆ పిలుపుకి నా హృదయం ద్రవిస్తూ ఉండేది. ఆ పిలుపు నాన్నగారు హృదయం నుండి వచ్చేది కాబట్టి నాకు అంతు పట్ట లేని ఆనందం వచ్చేస్తూ ఉండేది. ఇంటికి వెళ్ళినా కూడా అది అలాగే ఉంటూ ఉండేది. నేను పడుకున్నప్పుడు నా మంచానికి ఎదురుగా భగవాన్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూస్తుంటే, నా కళ్ళు చెమ్మగిల్లేవి. కానీ నాకు నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాcయా, భగవాన్ కళ్ళు చెమ్మగిల్లుతున్నాయా అని అర్థమయ్యేది కాదు. అలా అంతా ఆనందంగా ఉండేది. శరీరానికి ఆనందం పెట్టాడు, లోపల ఆత్మలోని ఆ0నందం పెట్టాడు ఏమిటి ఇంత ఆనందం అనుకుంటూ ఉండే వాడినీ. అలా నాన్నగారు నాకు శరీర స్పృహ తెలియనివ్వలేదు. నాన్నగారు చైతన్యము అయ్యి చెప్పారు కాబట్టి అవి ఈ రోజు నదులు సముద్రాలు దాటుతున్నాయి. నాన్నగారి వాక్యాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. మా పిల్లల వివాహాలు అన్నీ కూడా నాన్నగారే బాధ్యత వహించారు. నన్ను నాన్నగారికి నీడ అంటారు కానీ, ఆయన నన్ను వదిలి పెట్టకుండా ఆయన వెంట అలా తిప్పుకున్నారు.

సూర్యుడు మనకి ప్రత్యక్షంగా ఎలా కనిపిస్తాడో, అలాగే గురువే మనకు ప్రత్యక్ష దైవం అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఆత్మానుభవం పొందిన గురువు దొరకటం చాలా కష్టం. లోపల హృదయంలో నాన్నగారు పొందిన ఆనందాన్ని ఇముద్చుకొలెక తాను పొందినది అందరూ పొందాలనె కాంక్షతో మన అందరికి పంచుతూ ఉండేవారు. ఆత్మానందం గురించి చెప్పటం చాలా కష్టం. కానీ నాన్న గారు మనకు అర్థమయ్యేలా చిన్న చిన్న ఉదాహరణలతో చెప్పేవారు. ఉపనిషత్తులు అవి రాసిన వారు వస్తువుని దర్శించి రాసారు అంటారు. నాన్నగారు చెప్పే సబ్జెక్టు మామూలు వారు చెప్పలేరు. అవి దర్శించి చెప్పిన వాక్యాలు. ఆ వాక్యాలు చదువుతూ ఉంటే, నాన్నగారికి దగ్గరగా ఉన్నా నేను చాలా మిస్ అయ్యాను అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు.

ఒక సారి పోస్ట్ ఆఫీస్ మీటింగ్ లో నాన్నగారు ప్రవచనం చెబుతూ మధ్యలో నా గురించి "రామచంద్ర రాజు గారు నా జీవితంలోకి ఆలస్యంగా ప్రవేశించినా నాతో చివరి వరకు ఉంటారు అన్నారు". భక్తుల సమక్షంలో అన్న ఈ మాట నూటికి నూరుపాళ్లు సత్యమైంది. అలాగా చివరి వరకు ఆయనతో ఉండే సాన్నిధ్యాన్ని నాకు కల్పించారు. ఒక జ్ఞాని సమక్షంలో నిరంతరం కలిసి ఉండటం ఆయన నాకు ప్రసాదించిన వరం.

ఎన్నో సందర్భాలలో నాన్నగారు నా చెయ్యి పట్టుకొని నడిచేవారు. అప్పుడు నాన్నగారు నన్ను చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు అని నేను అనుకునే వాడిని. కానీ నా జీవితం చివరివరకూ అలాగే ఆయన నన్ను చేయి పట్టుకొని నడిపించారని ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అలా వారి బోధ, మా ఇరువురి బంధం విడదీయరానిది.

నాన్నగారు జన్మరాహిత్యం పొందటానికి నాకు ఏ వాసనలు అడ్డు వస్తున్నాయో ఆ వాసనలు నేను గుర్తించేలాగా చేశారు అంతకు మించిన భాగ్యం ఏముంటుంది. భక్తుల జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేసినా అవి చెయ్యనివాడిలా చాలా calm గా భగవాన్ లా ఉండేవారు. భగవాన్ , నాన్నగారు వేరు , వేరు కాదు ఇద్దరు ఒక్కటే. నాన్నగారే భగవాన్, భగవానే అరుణాచలేశ్వరుడు కదా! అలా వారు ముగ్గురు ఒక్కటే అందులో ఏ మాత్రం తేడా లేదు. అలాంటి గురువుని మనము ఇక ముందెన్నడు చూడలేము. ఎప్పుడో గాని దేహం తీసుకోరు. కానీ నాన్నగారు మన కోసం మళ్ళీ దేహం ధరించి వస్తారు.

నాన్నగారికి వేదాల సారం, ఉపనిషత్తుల సారం అంతా తెలుసు. భగవదనుభవం పొందిన తరువాత కూడా నాన్నగారు పుస్తక పఠనం విడిచిపెట్టలేదు. ఏదైనా ఒక పుస్తకం చదివి దాని సారము మొత్తం వివేకానందుడిలా చెప్పేస్తారు. ఒకసారి ఉపన్యాసాలు ఇంత అద్భుతంగా ఎలా చెప్పగలుగుతున్నారు నాన్నగారు అని అడిగాను. దానికి నాన్నగారు, “మన గొప్పతనం ఏమీ లేదు రామచంద్ర రాజుగారు భగవాన్ పలికిస్తున్నారు” అనేవారు.

శ్రీ నాన్నగారి దర్శన భాగ్యం వలన, ఆయన సన్నిధి మాత్రం చేత, ఆయన బోధల వల్ల నేను మా ఇంటికి వెళ్లినా, ఏ పని చేస్తున్నా, నిద్రిస్తున్నా, నిరంతరం నా స్మృతిలో ఉంటూ, నాలో ఉంటూ, నన్ను నడిపిస్తున్నట్లుగా ఉండేది. నా హృదయాంతరాలలో నుండి ఒక తెలియరాని ఆత్మానందం వెల్లుబికి వచ్చేది. ఈ ఆనందం, ఈ వైభవం ఏమిటని నన్ను నేనే నమ్మలేక పోయేవాడిని. అలా ఆయనను చూసినంత మాత్రాన, ఆయన ప్రవచానాలు విన్నంత మాత్రాన ఆయనతో ఉన్న సన్నిహిత సహచర్యం వల్ల- ఆనందం, శాంతి, కాంతి, సత్యం,ప్రేమ నా స్వంతమై నా అనుభవంలో శాశ్వతమైతే ఇంక ఎంత బాగుంటుందోనని, అంతకంటే సాధించేది లేదనిపించింది. ఆయన చూపులో, వాక్కులో ఎంతో ప్రేమానురాగాలు పొంగివచ్చి నా హృదయంతరాలలో ప్రవేశించి నన్ను అంతర్ముఖపరిచేవి.

రాముడికి ఒక హనుమంతుడు
శంకరాచార్యులు వారికి ఒక తోటక ఆచార్యులు
బుద్ధుడుకి ఒక ఆనంద్
నాన్నగారికి ఒక రామచంద్ర రాజు గారు