Sunday, May 15, 2022

"శ్రీ నాన్న నిలయం" - (By రాజేశ్వరి గారు ( పొలమూరు))

నేను అరుణాచలం వెళ్ళిన మరుసటి రోజు గుడిలో పూజారి గారు మా ఇంటికి వచ్చి మా అమ్మాయి ఎలా ఉంది? అని నా గురించి అడిగారట. నాతో చెప్పకుండా మీ అమ్మాయి అరుణాచలం వెళ్ళిపోయింది. తను తిరిగి ఇంటికి రాదండి అని నా భర్త కోపంగా అన్నారట. పూజారి గారు అంత మాట అనకు. ఈశ్వరుడే నీకు, నాకు టిక్కెట్లు పంపినా మనం వెళ్ళలేము కదా! ఎంతో అదృష్టవంతులకు గాని అలాంటి అవకాశం రాదు అన్నారట. అరుణాచలంలో తొమ్మిది రోజులు ఉన్నాను. నాకు అక్కడ రూమ్ దొరకక పోతే కనుక, అరుణాచలం వచ్చినప్పుడు నాన్నగారు ఉండే రూమ్ లో నన్ను ఉండమని నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు. నేను అరుణాచలం వచ్చినట్టు నాన్నగారికి చెప్పలేదు. ఆయనకి ఎలా తెలిసిందో అనుకున్నాను. అరుణాచలం నుండి తిరిగి వచ్చేటప్పుడు భీమవరంలో బస్సు ఎక్కుతుంటే ఇల్లు గుర్తుకు వచ్చింది. నేను వచ్చేలోపు మరలా పూజారిగారు మా అమ్మాయి ఎప్పుడు వస్తుంది? అని నా భర్తని అడిగారంట. మీ అమ్మాయి రాదు అన్నాను కదా అని చెప్పారట. నా మీద ఒట్టు, ఈశ్వరుడి మీద ఒట్టు. నా కూతురుని ఒక్క మాట అంటే ఊరుకోను అని పూజారి గారు నా భర్తతో చేతిలో చేయి వేయించుకున్నారంట. నేను ఇంటికి వచ్చేసరికి నా భర్త నవ్వుతూ నీఅంత అదృష్టం ఎవరికి ఉంది? ఇలా ఎవరు వెళ్తారు? నువ్వు కాబట్టి వెళ్ళిపోయావు అన్నారు. ఒకసారి నాన్నగారు నన్ను నీ ఆస్థి ఏమిటి అని అడిగారు. నేను ఏమీ మాట్లాడలేదు. "అరుణాచలేశ్వరుడే నీ ఆస్థి అన్నారు."

ఒక సమయంలో మాకు పరిస్థితులు కలిసి రావట్లేదని మా భందువులందరూ హైదరాబాద్ వెళ్ళమని పట్టుబట్టారు. అప్పుడు నాన్నగారి దగ్గరకు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము అని చెప్పాను. ఎక్కడికి వెళతారు?అని అడిగారు. హైదరాబాదులో మామిడితోటలు తీసుకుంటున్నారు నాన్నగారు అక్కడికి వెళ్ళిపోతున్నాము అని చెప్పాను. నాన్నగారు వెంటనే వారికి రావట్లేదు అని ఉత్తరం రాయమని చెప్పారు. నాన్నగారూ వాళ్ళకి చాలా కోపం వస్తుంది అన్నాను. అప్పుడు నాన్నగారు, వారికి కోపం వస్తే వారు నిన్ను వదిలేస్తారు అంతకంటే ఏమి చేస్తారు అన్నారు. అప్పుడు హైదరాబాద్ వెళ్ళకుండా ఆగిపోయాము. బంధువులు అందరు మమ్మల్ని ఇంకెప్పుడూ పట్టించుకోము అని నా ముఖం మీదే నన్ను నింధించారు.

కొద్ది రోజులకు నాకు అనారోగ్యం వచ్చి డాక్టర్ గారికి చూపించుకుంటే కిడ్నీలు రెండూ తేడాగా ఉన్నాయి అన్నారు. టాబ్లెట్స్ ఇచ్చారు కానీ తగ్గలేదు. ఈ లోపు మాకు తెలిసిన వారు చివటంలో ఒక స్వామి ఉన్నారు అని ఆయన దగ్గరకు తీసుకువెళ్ళారు. ఆయన మందులు ఇచ్చి తగ్గకపోతే మళ్ళీ రమ్మన్నారు. తగ్గలేదని మళ్ళీ ఆయన దగ్గరకు వెళ్ళాను. ఇక దీనికి మందులు లేవు అని చెప్పి అయన పుస్తకాల అరలో నుండి కళ్ళు మూసుకుని ఒక పుస్తకం తీయమన్నారు. వివేక చూడామణి వచ్చింది. అందులో ఒక పేజీని కళ్ళు మూసుకొని తీయమన్నారు. అలా తీస్తే '"సర్వం గురువే" అని వచ్చింది. అప్పుడు ఆయన మీ గురువు తప్ప మిమ్మల్ని ఎవరూ రక్షించ లేరు అన్నారు. నాకు నాన్నగారికి చెప్పాలనిపించలేదు. మాకు తెలిసిన డాక్టర్ గారు టెస్ట్ చేసి మిమ్మల్ని హైదరాబాద్ పంపిస్తాను ఆపరేషన్ పడుతుందని చెప్పారు. నాకు మనసులో నా ప్రాణం పోయినా పరవాలేదు, వెంటనే పుట్టి మరల నాన్నగారి దగ్గరకు వచ్చేయొచ్చు అనిపించింది. ఆపరేషన్ కి నాలుగు లక్షలు అవుతుందని చెప్పారు. ఆపరేషన్ కోసం హైదరాబాద్ వెళ్ళే ముందురోజు, భీమవరం భక్తురాలు ఒకరు కారు వేసుకుని వచ్చి జిన్నూరు వెళదాం రండి అని నన్ను తీసుకువెళ్ళారు. నన్ను చూసి నాన్నగారు ఏమిటమ్మా అలా ఉన్నావని అడిగారు. ఏమీ లేదు నాన్నగారూ అన్నాను. నాన్నగారు మరలా నా వైపు ఎంతో దయతో చూస్తూ, ఏమ్మా నేను నీ తండ్రిని కాదా? నీకు ఇదివరకే చెప్పాను కదా నేను నీ తండ్రిని అని అన్నారు. అప్పుడు నేను ఆపరేషన్ కి రేపు హైదరాబాద్ వెళ్ళవలసి వస్తోంది నాన్నగారూ అన్నాను. ఇన్ని రోజుల నుండి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని, నా పక్కనున్న భక్తురాలితో నీకు ఈ విషయం తెలుసా? అని అడిగారు. ఆవిడ తెలియదు నాన్నగారూ ఇప్పుడే వింటున్నాను అన్నారు. నాన్నగారు ఆమెతో ఈరోజు నుండి రాజేశ్వరికి ఏ తేడా చేసినా నువ్వు నాకు కబురు చెయ్యి. మనకి భీమవరం డాక్టర్లు, హైదరాబాద్ డాక్టర్లు తెలుసు. నీ పూర్తి బాధ్యత నాదేనమ్మా అన్నారు. తరువాత నేను ఇంటికి వచ్చేస్తుంటే అరుణాచలేశ్వరుడి విభూది పొట్లం చేతిలో పెట్టి, రేపు నర్సాపురంలో మీటింగ్ ఉందమ్మా అని చెప్పారు. ఆ రోజు రాత్రి నాకు నాన్నగారు ఆపరేషన్ చేసినట్టు స్వప్నం వచ్చింది. మరుసటిరోజు నరసాపురం మీటింగ్ కి వెళ్ళి నాన్నగారిని కలిసాను. అక్కడ నాన్నగారు నన్ను పిలిచి, రాత్రి నీకు ఎలా ఉందమ్మా అని అడిగారు. బానే ఉంది నాన్నగారూ అన్నాను.

నాన్నగారు ఒకసారి నాకు దత్తాత్రేయ రూపంలో స్వప్నంలో దర్శనమిచ్చారు. నాన్నగారు పొలమూరు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు. నా భర్తతోటి రాజేశ్వరికి ఆరోగ్యం అంతా నయం అయిపోతుంది. మేము అరుణాచలం వెళ్ళినప్పుడల్లా రాజేశ్వరిని పంపండి అని చెప్పారు.

ఒకసారి పుష్కరాల సమయంలో, నాన్నగారు ముక్కామల వెళ్తున్నారు అని తెలిసి మేము కూడా వెళ్ళాము. నాన్నగారు నదికి పూజ చేస్తూ ఉంటే పైన పెద్ద వెలుగు కనిపించిందని ఆ దృశ్యం చూసిన భక్తులు చెప్పారు. పుష్కరుడు ప్రవేశించినప్పుడు అలా వెలుగు వస్తుందట. నాన్నగారు నదిలో స్నానం చేస్తూ పుష్కర స్నానం ఎలా ఆచరించాలో మాకు చెప్పారు. అక్కడ ఉన్న ఒక ఆశ్రమం వారు నాన్నగారిని తీసుకొనివెళ్ళారు. ఆ రోజు సాయంత్రం ప్రవచనం అయిన తరువాత ఇంటికి ఎలా వెళ్ళానో నాకు తెలియదు. అయిదారు రోజుల వరకు శరీరం పనిచేస్తున్నా మనసు పనిచేయలేదు. అలా జరగటం అది మొదటిసారి. కొంచెం దేహం స్పృహ వచ్చిన తరువాత నాన్నగారి దగ్గరకి జిన్నూరు వెళ్ళాను. నాన్నగారు పుష్కర స్నానానికి రాజమండ్రి వెళుతున్నారు అని తెలిసి నేనూ వస్తాను అని నాన్నగారితో అన్నాను. అప్పుడు నాన్నగారు నాతో నేను వెళ్ళవలసి వస్తే వెళతాను, నువ్వు మాత్రం ఈ 12 రోజులు పుష్కర స్నానానికి ఎక్కడకి వెళ్ళక్కర లేదు. మొన్న చేసిన ఆ నది స్నానం నీకు సరిపోతుంది అన్నారు.

ఒకసారి నాన్నగారు హైదరాబాద్ వెళ్ళటానికి పాలకొల్లు రైల్వే స్టేషన్ కి వస్తే, నేను కూడా స్టేషన్ కి వెళ్ళాను. నాన్నగారి దగ్గర భక్తులు అందరూ కూర్చొని ఉన్నారు. నాన్నగారు ట్రైన్ ని తెలుగు లో ఏమంటారు? అని అడిగారు. మేము ఎవరము చెప్పలేకపోయేసరికి నాన్నగారు ధూమశకటం అంటారు అని చెప్పారు. నాన్నగారు నా పర్సు తీసుకొని ఇందులో ఎంత పెట్టుకొని వస్తావు? అని అడిగారు. నా భర్తని అడిగితే ఎంతో కొంత ఇస్తారు నాన్నగారూ అవి లెక్క పెట్టుకోను. అవి పట్టుకొని వచ్చేస్తాను అని చెప్పాను. డబ్బులు లెక్కపెట్టుకోకపోవటం చాలా మంచి గుణం అమ్మా అన్నారు. ఆరోజు ఇంటికి వెళ్ళిన తరువాత మరలా శరీరం పనిచేస్తోంది కానీ మనసులో ఎలాంటి తలంపులు లేవు. అలా జరగటం అది రెండవ సారి.

ఒకసారి నాన్నగారికి ఏదో ఓపెనింగ్ చేయాల్సి ఉంది అని కాశీ వెళ్ళారు. అప్పుడు కూడా నాన్నగారు ట్రైన్ ఎక్కటానికి పాలకొల్లు వెళుతూ ఉంటే నేను స్టేషన్ కి వెళ్ళాను. స్టేషన్ లో అమ్మా రాజేశ్వరి వెళ్ళి వస్తాను అన్నారు. నాన్నగారు అలా అనగానే నాకు తెలియకుండానే కళ్ళనీళ్ళు వచ్చేసాయి. నా చేతిలో ఉన్న జామ పండ్లు చూసి ఇలా ఇవ్వు అని తీసుకొని అందులో ఉన్న రెండు దోర జామపండ్లు తీసి అక్కడ ఉన్న భక్తులకి ఇచ్చారు. మరలా నా వైపు చూసి, నేను పుణ్యం కోసం కాశీ వెళ్ళటం లేదమ్మా ఓపెనింగ్ కోసం వెళుతున్నాను. మరలా నాలుగు రోజులలో తిరిగి వచ్చేస్తాను అంటూ నా వైపు కొద్ది సేపు అలా చూసారు. ఈలోపుగా నాన్నగారి చేతిలో ఉన్న జామపండు ముగ్గిపోయింది. అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఆ ముగ్గిన పండు నా చేతికిచ్చి ఇంటికి తీసుకెళ్ళి మీరందరూ తినండి అని చెప్పారు. నాన్నగారు ట్రైన్ ఎక్కేటప్పుడు నాతో, మరలా వెళ్ళినప్పుడు నిన్ను తప్పనిసరిగా తీసుకొని వెళతానమ్మా అని ట్రైన్ ఎక్కారు. అలా ఆ రోజు ఇంటికి వెళ్ళిన తరువాత మరలా శరీరం పనిచేస్తోంది కానీ మనసులో ఎలాంటి తలంపులు లేవు. అలా జరగటం అది మూడవ సారి.

నాన్నగారు కాశీ నుండి తిరిగి వచ్చాక జిన్నూరు వెళ్ళాను. దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళిపోతుంటే నాన్నగారు నన్ను పిలిచి సూరదాసు, కృష్ణుడు ఉన్న ఫోటో ఇచ్చారు. మీ ఇంట్లో టేబుల్ మీద పెట్టుకో, భక్తులకు ఇటువంటి భక్తి రావాలి. మరో రెండు రోజులలో కొమ్మరలో ప్రవచనం ఉంది అక్కడికి రామ్మా అని చెప్పారు. కొమ్మరలో ప్రవచనం జరిగే రోజు ఉదయాన్నే కొమ్మర బయలుదేరదాము అనుకుంటున్నాను. వేరే గురువు గారి దగ్గరకి వెళ్ళే భక్తురాలు ఒకరు మా ఇంటికి వచ్చారు. ఈరోజు మీరు జిన్నూరు వెళ్ళలేదా అని నన్ను అడిగారు. ఈరోజు కొమ్మరలో ప్రవచనం ఉంది మధ్యాహ్నం వెళ్తాను అని చెప్పాను. అప్పుడు ఆమె రెండు రోజుల ముందుగానే మేము మా గురువు గారి దగ్గరికి వెళ్ళాము. గ్రహణం పట్టు మా మీద పడకుండా మమ్మల్ని అప్పుడే చూసేసారు. ఈ సమయంలో జపం చేసుకోమన్నారు అన్నారు. ఆమె అన్న ఆ మాటకి నాకు తెలియకుండానే మా గురువుగారు జన్మ జన్మల నుండి పట్టిన గ్రహణాన్ని మధ్యాహ్నం ప్రవచనంలో తుడిచేస్తారు అన్నాను. అప్పుడు ఆమె నాతో మరో 25 నిమిషాల్లో సూర్య గ్రహణం విడిచేస్తుంది. ఈ లోపుగా మీరు మీ గురువుగారిని దర్శనం చేసుకుంటే, మీరు అన్న ఈ మాట నిజమే అవుతుంది అన్నారు. ఆ మాట అనగానే మరో ఆలోచన లేకుండా చేతిలో పర్సు పట్టుకొని బయలుదేరాను. కొమ్మర వెళ్ళటానికి చాలా సమయం పడుతుంది కాబట్టి నేను 25 నిమిషాల్లో నాన్నగారి దర్శనం చేసుకోవటం అసాధ్యం. కొమ్మర వెళ్ళటానికి మధ్య దారిలో దిగి అక్కడ నుండి వేరే ఆటో కోసం చూస్తున్నాను. రోడ్లు అన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఈ లోపు ఒక కారు వచ్చి నా దగ్గర ఆగింది. అందులో కన్నమ్మగారు, నాన్నగారు కనిపించారు. నాన్నగారు విభూతి రేఖలతో, పైన చిన్న కుంకుమ బోట్టుతో అచ్చం పరమేశ్వరుడి లాగా ఉన్నారు. నాన్నగారు కార్ డోర్ తీసి అమ్మా రాజేశ్వరి నువ్వు తొందరగా అటో ఎక్కి కొమ్మర వచ్చేయమ్మా, అక్కడ అందరము భోజనం చేద్దాము అన్నారు. ఆ సంఘటన అలా జరగగానే నాకు ఆనందభాష్పాలు వచ్చాయి.

ఒకసారి అరుణాచలంలో తెల్లవారుజామున గిరిప్రదక్షిణకి వెళదాము అని నాన్నగారి ఆశ్రమంలో నుండి బయటకు వస్తున్నాను. అప్పుడు అక్కడ వంటగదిలో కూరగాయలు కోసే వారు ఎవరూ లేరని తెలిసి కూరగాయలు తరిగాను. అలా ఆ రోజు నుండి కూరగాయలు తరగటం అలవాటు అయ్యింది. మరో రెండు రోజులు తరువాత కూరగాయలు కొయ్యటం పూర్తయ్యాక గిరి వైపు చూస్తున్నాను. ఈ లోపు ఎవరో ఇద్దరు మగవారు వచ్చి ఆకలేస్తోందమ్మా భోజనాలు పెడతారా? అని అడిగారు. నేను వెళ్ళి అక్కడ వంట చేసే ఆమెని అడిగితే భోజనం పెట్టమని చెప్పారు. అలా ఆ రోజు నేను వారికి భోజనం వడ్డించాను. నాన్నగారు ఆ విధంగా నాకు అరుణాచలంలో కూరలు కోయటం, వడ్డన చేయడం నెమ్మదిగా అలవాటు చేశారు.

పొలమూరులో కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి నాన్నగారు వచ్చారు. నాన్నగారు పొలమూరు వచ్చినప్పుడల్లా ఒకరి ఇంటి వద్ద భోజనం ఏర్పాట్లు చేయించేదాన్ని. మరొకరి ఇంటి వద్ద టీ ఏర్పాటు చేయించేదానిని. నాన్నగారిని మా ఇంటికి భోజనానికి ఆహ్వానించటానికి తగిన సౌకర్యాలు లేనందు వలన సహజంగా వచ్చి చూసి వెళ్ళేవారు. నాన్నగారిని భోజనానికి ఆహ్వానించలేకపోతున్నాను అని చాలా దుఃఖం వచ్చేది. అప్పుడు నాన్నగారు నాతో నేను ఎవరి ఇంటికి వస్తే ఆ ఇల్లు నీదే అనుకో అమ్మా రాజేశ్వరీ, పొలమూరులో జరిగే మన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ నువ్వే దగ్గర ఉండి చూసుకోవాలి అని చెప్పారు. సరే నాన్నగారూ అక్కడ ఉన్న మన భక్తులు సహాయం తీసుకుని అన్నీ చూసుకుంటాను అని చెప్పాను.

పొలమూరులో శ్మశానం ప్రారంభోత్సవానికి నాన్నగారిని పిలిచి శ్మశానంలో ప్రవచనం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉండే మగవారు శ్మశానం లోనికి ఆడవారు ఎవరూ రావద్దు అని కబురు పంపించారు. అప్పుడు నేను వారితో గ్రామంలో ఉన్న ఆడవారు రాకపోవచ్చు గాని, భక్తులు అందరు వస్తారు అని చెప్పాను. ఆరోజు శ్మశానం అంతా మన భక్తులే నిండిపోయి, గ్రామంలో ఉన్న మగవారు అందరూ బయట నిలబడి ఉన్నారు.

మేము ఇల్లు నిర్మించుకుందాము అని స్థలం కొనుగోలు చేశాము. కన్నమ్మ గారు (నాన్నగారి ధర్మపత్ని) నాతో తరుచుగా మీరు ఇల్లు కట్టుకోవాలి. మీకు ఏ అవసరం వచ్చినా ఎక్కడకి వెళ్ళవద్దు, నేరుగా జిన్నూరు వచ్చేయండి. మీరు అమాయకురాలు, లోకంలో ఎలా ఉండాలో మీకు తెలియదు అంటూ నన్ను చాలా ప్రేమగా చూసుకునే వారు. కొన్ని రోజులకి మా ఇంటికి శంకుస్థాపన ముహూర్తం పెట్టారు అని నాన్నగారికి చెప్పడానికి వెళ్ళాను. అప్పుడు నాన్నగారు నన్ను లోపలికి వెళ్లి కన్నమ్మ గారిని కలవమన్నారు. కన్నమ్మగారు ఆ మాట విని చాలా సంతోషమైన కబురు చెప్పారు అన్నారు. కన్నమ్మగారు శంకుస్థాపనకి అవసరమైన సామాన్లు మరియు పుట్టింటి వారు పెట్టే బట్టలతో సహా అన్నీ నాకు అమర్చి ఇచ్చారు. అందులో వేయడానికి నాన్నగారు 9 రూపాయి బిళ్ళలు, రెండు కొబ్బరికాయలు ఇచ్చి అక్కడ కొట్టమని చెప్పి, మీ ఇల్లు పూర్తయిపోతుంది అని అన్నారు. అలా నన్ను వారు ఇరువురు కూడా కన్నకూతురిలా ప్రేమగా చూసుకునేవారు.

శంకుస్థాపన అయిన కొద్ది రోజులకి ఇల్లు కట్టడం పూర్తయింది. గృహప్రవేశం ముహూర్తం పెట్టిన తరువాత నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పాను. ఈ మాట వినగానే నాన్నగారు చాలా సంతోషం, అదే రోజు వేరే చోట కార్యక్రమం ఉంది, అది లేకపోతే నేను వద్దునమ్మా అన్నారు. నాన్నగారు నాకు రెండు కొబ్బరికాయలు ఇచ్చి ముహూర్తం సమయానికి ఇవి కొట్టేయండి అన్నారు. గృహ ప్రవేశానికి సంబంధించిన సామాగ్రి అంతా నాకు సర్ది ఇమ్మని కన్నమ్మ గారికి పురమాయించారు. కన్నమ్మగారు అన్నీ సర్ది, వచ్చిన బంధువులకు పంచి పెట్టుకోవటానికి స్వీట్స్ తో సహా సిద్ధం చేసి నాకు ఇచ్చారు. గృహప్రవేశం రోజు ఉదయాన్నే అందరం తయారయ్యి బ్రాహ్మణుల కోసం ఎదురు చూస్తున్నాము. కానీ మేము పురమాయించుకున్న పూజారి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. పూజారిగారు రారు అని తెలిసేసరికి, మా బంధువులు అందరూ బ్రాహ్మణులు లేకుండా గృహప్రవేశం ఏమిటి? వేరే ముహూర్తం పెట్టుకోండి ఈరోజు మానేయండి అన్నారు. వారందరి మాటలు విన్న నా భర్త నా దగ్గరకు వచ్చి, నీకు నాన్నగారు కావాలా? బ్రాహ్మణులు కావాలా? అని అడిగారు. నువ్వు బ్రాహ్మణులు కావాలి అంటే వేరే ముహూర్తం పెట్టిస్తాను. కానీ నిన్ను ఎప్పటికీ జిన్నూరు పంపించను. నీకు నాన్నగారు కావాలి అంటే కనుక ఈ క్షణంలో నా వెనక వచ్చేయి. కొబ్బరికాయ కొట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోదాము అన్నారు. నా భర్త అలా అనగానే నేను వెంటనే నాకు నాన్నగారే కావాలి అన్నాను. ఆ సమయానికి నాన్నగారు ఇచ్చిన ఆ రెండు కొబ్బరికాయలు కొట్టేసి ఇద్దరం నూతన గృహంలోకి ప్రవేశించాము.

గృహప్రవేశం అయిన రెండు రోజుల తరువాత నాన్నగారి దగ్గరకు వెళ్ళాను. నాన్నగారు గృహప్రవేశం ఎలా జరిగింది? అని అడిగారు. బ్రాహ్మణులు రాలేదు నాన్నగారూ, మిమ్మల్ని తలుచుకొని కొబ్బరికాయ కొట్టేసాము అన్నాను. నాన్నగారు ఏంటమ్మా నీ ధైర్యం అలా చేశావు అన్నారు. మీరు ఉన్నారనే ధైర్యంతో చేసాను అన్నాను. నాన్నగారు గోలక్ష్మి వచ్చిందా? భోజనాలు పెట్టుకున్నారా? అన్నారు. వచ్చింది నాన్నగారూ, వచ్చిన వారందరికి భోజనాలు పెట్టుకున్నాము అన్నాను. నీ విశ్వాసానికి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందమ్మా అన్నారు.

తరువాత కొద్ది రోజులకి నాన్నగారు భక్తులతో పాటు మా ఇంటికి వచ్చారు. ఆరోజు నాన్నగారికి పాద పూజ చేసుకున్నాము. నాన్నగారు మా ఇంటికి వచ్చిన రోజే యాదృచ్ఛికంగా రామకృష్ణుడి జయంతి కూడా అయ్యింది. నాన్నగారు ఈ ఇల్లు ఎవరిది? అని అడిగారు. అప్పుడు నేను మనసులో శంకుస్థాపనకి తొమ్మిది రూపాయలు ఇచ్చి ఇల్లు పూర్తయిపోతుంది అని చెప్పారు కదా అనుకొని మీదే నాన్నగారూ అన్నాను. తరువాత ఒకసారి మీ ఇంటికి పేరు ఏమని పెడతావు? అని అడిగారు. ఇంటికి పేర్లు ఏమి పెట్టుకోము అన్నాను. నా భర్తతో ఈ విషయం చెబితే నాన్నగారు అన్నారు కదా అని నువ్వు పేర్లు ఏమి పెట్టక్కర్లేదు అన్నారు. తరువాత ప్లాస్టింగ్ చేసే వారు వచ్చినప్పుడు నా భర్త, నాన్నగారు ఇంటికి పేరు గురించి అడిగారు అన్నావు కదా, వెళ్ళి నాన్నగారిని అడిగిరా అన్నారు. నాన్నగారి దగ్గరకు వెళ్ళి అడిగితే "శ్రీ నాన్న నిలయం" అనే పేరు సెలెక్ట్ చేసి ఇచ్చారు. అలా మేము కట్టుకొన్న ఆ గృహంలోకి నాన్నగారు దయతో నాలుగైదు సార్లు వచ్చారు.

ఒకసారి నాన్నగారు నీకు ఏం కావాలమ్మా? అని అడిగారు. మీ దయ ఉంటే అప్పులు ఇచ్చే వారిలో కూడా మీరే ఉండి ఇప్పించండి నాన్నగారూ అన్నాను. అప్పటినుండి మా పిల్లలకు ఫీజు విషయంలో గానీ, గృహ నిర్మాణానికి సంబంధించి గానీ ధనము అవసరము అయ్యే సమయానికి, ఎవరో ఒకరు వచ్చి నా భర్తకు డబ్బులు ఇచ్చి వెళ్ళేవారు. మా అబ్బాయికి డిగ్రీ అయిన తరువాత నాన్నగారి దగ్గరికి వెళ్ళాము. నాన్నగారు మా అబ్బాయి పొట్ట మీద తట్టి, మీ తాతయ్య నీకు ఉద్యోగం వేయిస్తారా? అని అడిగారు. అప్పుడు మా అబ్బాయి, మేము వారిని అడగము నాన్నగారూ అని చెప్పాడు. దానికి వెంటనే నాన్నగారు మీ తాతయ్య చేసే పని నేను చేసి పెడతాను అన్నారు. మా అబ్బాయిని దగ్గర ఉండి హైదరాబాద్ తీసుకొని వెళ్ళి ఇందిరగారి ఇంట్లో మూడు రోజులు ఉంచి ఎంబిఎ చదువుకోడానికి హాస్టల్లో జాయిన్ చేశారు. నేను మా అబ్బాయితో ఇకనుండి నీ గురించి నాకు సంబంధం లేదు. నిన్ను నాన్నగారికి అప్పగించేసాను అని చెప్పాను. మా అబ్బాయిల చదువులు, వివాహాలు అన్నిటికి కూడా నేను పనిముట్టుగా నిలబడి ఉన్నాను. బాధ్యత అంతా నాన్నగారిదే! మా పెద్ద బాబు వివాహం అయిన తరువాత ఒకరోజు జిన్నూరు వెళ్తే మిమ్మల్నందర్నీ రమణ కుటుంబంలోకి వేసేసాను అమ్మా అన్నారు. అలా మా కుంటుంబంలో అందరికి నాన్నగారే ఆధారం అయ్యారు.

మేము పాత ఇంట్లో ఉండగా మా ఇంట్లో ఎక్కువగా పాములు వస్తూ ఉండేవి. ఒకసారి చించినాడలో ప్రవచనం అయిపోయాక నాన్నగారు నన్ను పిలిచి మీ ఇంటిలోకి పాములు వస్తున్నాయా? అని అడిగారు. వస్తాయి నాన్నగారు అవి తిరుగుతూ ఉంటాయి అని చెప్పాను. ఎప్పుడైనా కాళ్ళకు తగిలినా కంగారు పడకు అది మెత్తగా, చల్లగా ఉంటుంది అన్నారు. నాన్నగారు అలా అన్న ఐదు రోజులకు చీకట్లో చూసుకోకుండా పాము మీద అడుగు వేసేసాను. అది ఏమీ చేయలేదు. నెమ్మదిగా ఆకుల మీద పాకుతూ వెళ్ళిన శబ్దం అయింది. నాన్నగారు చెప్పినట్టే అది అతి మెత్తగా చల్లగా ఉంది. ఈ సంఘటన జరుగుతుంది అని నాన్నగారు నాకు ముందే చెప్పి ఉంచారు అనుకున్నాను.

ఒకసారి నాన్నగారు నాతో, రాజేశ్వరీ నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అమ్మా అని అడిగారు. నాన్నగారూ నేను పొలమూరు నుండి చాలా మందిని తీసుకు వచ్చాను. మొదట వారందరు ఏ గురువు దగ్గరకు వెళ్ళినా దక్షిణ ఇవ్వాలి కదా, మేము దక్షిణ ఇవ్వలేము అన్నారు. అప్పుడు వారితో నేను నాన్నగారికి మీరు ఏమి ఇవ్వక్కర్లేదు, పండ్లు కూడా ఇవ్వక్కర్లేదు. మంత్రం ఇస్తారు తీసుకుని ఇంట్లో చేసుకోండి అని చెప్పి చాలా మందిని తీసుకు వచ్చాను. వారందరు ఇప్పుడు రమణ భాస్కర చదువుకుంటున్నారు. దైనందిన జీవితంలో ఎలా జీవించాలో మీరు మాకు నేర్పించారు నాన్నగారూ అన్నాను. చాలా బాగా చెప్పావమ్మా, నా గురించి నీ ఉద్దేశ్యం ఏమిటి? అని అడిగారు. నేను అందరికి మీరు "పేదల దేవుడు" అని చెప్తాను అన్నాను. ఆ మాట అనగానే నాన్నగారు "ఈ భూమి మీదకు ఈ శరీరం వచ్చినందుకు ఈ ఒక్క మాట సరిపోతుంది నాకు! నువ్వు కాదమ్మా! నీ లోపల ఉన్న ఈశ్వరుడు ఈ రోజు ఈ మాట పలికించాడు." అన్నారు. నాన్నగారితో మొదటసారి కాశీ వెళ్ళి వచ్చిన తరువాత, మీ అందరికీ మోక్షం ఇవ్వటం కాదమ్మా, వాసనా క్షయం చేసేయాలి అని ఉంది నాకు అన్నారు.

నాన్నగారు చెప్పిన కొన్ని మధుర వాక్యాలు నా జ్ఞాపకాలలో :

- ఒకసారి నాన్నగారు శుద్ధ జ్ఞాని గురువు అయి వస్తే, ఈ భూమి మీద ఆ వైభవం వేరుగా ఉంటుంది. నీ కల్మషాన్ని ప్రేమతో కడిగేస్తాడు అని చెప్పారు.

- ఒకసారి శృంగవృక్షంలో ప్రవచనం జరిగినప్పుడు, వర్షంలో భక్తులు అందరం తడుచుకొంటూ వెళ్ళాము. అప్పుడు నాన్నగారు అందరి వైపు ఎంతో దయతో చూసి అమ్మా! ఎన్నో బాధలు పడి పరిగెట్టుకుంటూ ఇక్కడకి వస్తున్నారు. మీ పుట్టింటి వారు, మీ భర్త, మీ పిల్లలు ఇచ్చిన డబ్బులు అన్నీ కూడా ప్రవచనాలకే ఖర్చు పెడుతున్నారు. కానీ వాటితో మీరు మీ కోరికలను తీర్చుకోవటం లేదు. అలా మీకు దేహ వాసన చాలా కరిగిపోతోంది అన్నారు.

- మీరు ప్రవచనాలకి బయలుదేరినప్పుడు మీ ఇంటికి, మీ బస్టాండ్ కి మధ్యలో ఉన్న చాలా మంది జనం మిమ్మల్ని తిట్టుకుంటారు. మీ బంధువులు కూడా మిమ్మల్ని తిడతారు. వారితో ఈశ్వరుడు అలా ఎందుకు తిట్టిస్తున్నాడు అంటే, మీరు ఇంకెప్పుడూ వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని అలా అనిపిస్తున్నాడు. అలా మీకు లోకవాసన తీసేస్తున్నాడు. ఆ విధంగా మీకు తెలియకుండానే మీరు పరమ పవిత్రులు అవుతున్నారు అన్నారు.

- మీ విరోధులు కూడా మిమ్మల్ని తిట్టుకుంటూ, వీరిని పట్టుకోవాలంటే వీరు నాన్నగారి దగ్గర, అరుణాచలంలో తప్ప ఇంక ఎక్కడా దొరకరు అనుకుంటూ నాన్నగారిని, అరుణాచలాన్ని స్మరించుకుంటున్నారు. అరుణాచలేశ్వర అనే పేరు తెలపగనే పట్టి లాగితివి కదా! అని వారికి తెలియదు అమ్మా! అలా వాళ్లందరూ కూడా పవిత్రులు అవుతున్నారు. ఎవరైనా జ్ఞానం పొందితే, ఏడు తరాలవారు పవిత్రులు అవుతారు అంటారు కదా! ఇప్పుడు మీ వలన వందల వేల మంది పవిత్రులు అవుతున్నారు. అందువలన మిమ్మల్ని తిట్టినా పరవాలేదు అన్నారు.

ఒకసారి నాన్నగారు ఇలా చెప్పారు. "మీ విశ్వాసం నిజమైతే మీ తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, వైద్యుడిగా అవసరమైతే మీ ఇంటి పని మనిషిగా కూడా గురువు రావడానికి సిద్ధంగా ఉన్నాడు" అన్నారు.

- శ్రీ కృష్ణ చైతన్యులు తమ అంతిమ సమయంలో భక్తులతో, నేను మీకు ఏమి ఇవ్వలేకపోతున్నాను. నా శరీరం పడిపోతే, ఎవరైనా ఈ శరీరాన్ని కొంటే దీన్ని అమ్మేసి మీరు కడుపు నింపుకోండి అన్నారు. గురువు ఆలా ఉంటాడు అన్నారు నాన్నగారు.

- మనం ఎవరికైనా ఉపకారం చేస్తే వాళ్ళు తిరిగి చేస్తారనే మనం సహజంగా అనుకుంటాము. మీకు తెలియకుండానే మీ ఆలోచన లోపల ఎలా ఉంటుందంటే, అవతలి వారికి కష్టం వచ్చింది అని మీరు సాయం చేశారు. అవతలి వారు మళ్ళీ మీకు సహాయం చేయాలంటే మీకు కష్టం రావాలి. అంటే మీకు తెలియకుండానే మీరు ఆ కష్టాన్ని కోరుకుంటున్నారు అన్నారు.

- ఇంటికి ఎవరైనా భిక్షాటనకి వస్తే పూర్వం పెద్దవారు రామార్పణం, కృష్ణార్పణం అనుకుంటూ భిక్ష వేయమని మనకి నేర్పించారు. అంటే మరలా జన్మకి ఈ బియ్యాన్ని దాచిపెట్టి ఉంచమని అర్థం. మనకి తెలియకుండానే మరొక జన్మని కోరుకుంటున్నాము. కానీ మనం ఎవరికి బియ్యం వేస్తున్నామో వారి బియ్యమే మన ఇంట్లో పెట్టుకుని వారిది వారికే వేస్తున్నాము అనుకుంటే మనకి కర్తృత్వం ఉండదు అన్నారు.

- రాబోయే కాలంలో చీకటి రోజులు వస్తున్నాయి. మీరు మంచం పడితే మిమ్మల్ని ఎవరూ చూడరు. మీరందరూ మంచం పట్టకుండా మీ జీవితాలు వెళ్లిపోవాలి అని నేను ప్రార్ధిస్తున్నాను అన్నారు.

ఒకసారి నాన్నగారు భక్తులను ఆయన చదువుకున్న స్కూల్ కి తీసుకు వెళ్లారు. అక్కడ ఆయన ఒక గదిలోకి వెళ్ళి బయటకు వచ్చి అటు ఇటు చూస్తూ నడుస్తున్నారు. నాన్నగారికి ఏమైనా అవసరం ఉందేమో అని దగ్గరికి వెళ్ళి ఏమి కావాలి నాన్నగారూ అని అడిగితే, నేను చదువుకున్న గది బాగా బూజులు పట్టేసి ఉంది. చీపిరి కనిపిస్తే తుడుద్ధామని అన్నారు. ఆ మాట వినగానే, మనం పని ఎంత శ్రద్ధగా చెయ్యాలో నేర్పించటం కోసం ఇంత కిందకు దిగి వచ్చి చెబుతున్నారు అనిపించింది.

పెద్ద సునామి వచ్చినప్పుడు సమస్తం ఆ సునామీలో ఏ విధంగా అయితే కొట్టుకొనిపోతుందో అలా, నాన్నగారి ప్రేమ ప్రవాహంలో మన అందరము కొట్టుకుపోవలసిందే!