Thursday, September 17, 2020

"మన రక్ష, శ్రీ నాన్నగారు" - (By శ్యామల గారు(ఖండవిల్లి))

మా కుటుంబంలో మా అమ్మగారు నాన్నగారి దగ్గరికి వెళుతూ ఉండేవారు. నన్ను రమ్మని అడిగినా, వెళ్ళేదాన్ని కాదు. ఒకరోజు మా అమ్మగారు నాతో, నాన్నగారు చెప్పిన మంచి వాక్యాలు ఎవరు చెబుతారు మనకి ఎన్నాళ్ళని ఇలా ఇంట్లో కూర్చుంటావు నాన్నగారి దగ్గరికి రమ్మన్నారు. అలా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను ఆ రోజు నాన్నగారు ప్రవచనంలో భగవాన్ గురించి చెబుతూ, భగవాన్ ని అన్నగారు తిడతారు కదా! ఎక్కడికైనా పోరాదా, నీ బోటి వాడికి ఇంటి దగ్గర పని ఏమీ ఉంది అని ఆ వాక్యం నాన్నగారు చెబుతుంటే అది నా మనసుకి తాకింది. మా అమ్మగారు కూడా ఇంట్లో ఎన్నాళ్ళు కూర్చుంటావు అన్నారు కదా. నా మనసుకి సమాధానం దొరికింది. అప్పటినుండి నాన్నగారి దగ్గరకు వెళ్ళటం, కుటుంబ సమస్యలన్నీ ఆయనతో పంచుకునే దానిని. 

ఒకసారి మా అబ్బాయి జాబు కి వేరే చోటకి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు వాడిని నాన్నగారి దగ్గరికి తీసుకు వెళ్ళి ,ఢిల్లీ వెళ్ళాలి నాన్నగారు అని చెప్పాను. వెళ్తున్నావా! సరే వెళ్ళు అని నాన్నగారు మా అబ్బాయి వైపు అలానే చాలాసేపు చూశారు. వెళ్తావా సరే వెళ్ళు ఇలా పదే పదే అన్నారు. మా అబ్బాయి జాబ్ లో జాయిన్ అయ్యాడు అక్కడ వర్క్ చేస్తుండగా, 20 అడుగుల లోతులో పడిపోయాడు. అంత ఎత్తు నుండి పడటం వలన కాళ్ళు చేతులు విరుగుపోతాయి కదా! కానీ వాడికి ఏమీ చిన్న దెబ్బ కూడా తాకలేదు. అప్పుడు నాన్నగారి అనుగ్రహం నాకు అర్ధమయ్యింది. నాన్నగారు మా అబ్బాయిని చూసిన ఆ చూపు కాపాడింది. ఇది ఆయన మా పట్ల చూపించిన దయ. మా సమస్యలు అన్నింటికి పరిష్కారం ఆయనే చూపిస్తారు. ఇదే కాదు క్లిష్టమైన ప్రతి సంఘటన నుంచి ఆయనే కాపాడుతున్నారు. నాన్నగారికి జరగబోయేది అంతా తెలుసు కదా. ఇంకేమీ చెప్పాలి నాన్నగారి గురించి. మనకు పంచిపెట్టటానికి ఆయన దగ్గర అనుగ్రహం, దయ తప్ప ఇంకేమీ లేదు.

No comments:

Post a Comment