Sunday, September 6, 2020

"స్వర్గరాజ్యం నీ హృదయంలోనే ఉంది" - (By డా. ఉష గారు)

చిదంబరంలో క్రిస్టియన్ స్నేహితురాళ్ళతో కలిసి ఎప్పుడన్నా వాళ్ళ చర్చ్ కి వెళ్ళేదాన్ని. ఒకసారి నేను డెంటల్ థర్డ్ ఇయర్ చదువు తుండగా వెళ్ళినప్పుడు అక్కడ ఫాదర్, "సెర్మన్ ఆన్ ది మౌంట్" ( కొండమీది ప్రసంగాలు ) గురించి చెబుతూ మనము చంటిపిల్లల్లా అవగలిగితే స్వర్గరాజ్యం ఎరుకపడుతుంది. అంతేగానీ, ఏవో శాస్త్రాలు, గ్రంథాలు చదవడం వల్లో, మనమేదో ప్రయత్నాలు చేయడం వల్లో అది ఎరుక పడదు అన్నారు.


నాకు ఆయన చెప్పింది మనసులో బాగా నాటుకుంది. ఆరోజు దాని గురించే ఆలోచిస్తూ, ఒక పేపర్ తీసుకుని చంటిపిల్లల లక్షణాలు రాయడం మొదలు పెట్టాను. అవి... పసితనపు అమాయకత్వం, నిశ్చింతగా ఉండటం, స్వచ్ఛత, నిర్భయత్వం, ఉత్సాహంగా ఉండటం, జరిగింది మర్చిపోవడం, క్షమించడం, తల్లి తనని చూసుకుంటుందనే సంపూర్ణ విశ్వాసంతో ఉండటం, వాళ్ళకి తెలియకుండానే సహజంగా ఇవన్నీ కలిగి ఉండటం ఇలా కొన్ని లక్షణాలు రాసాను. మన జీవితం పొడుగునా ఇవన్నీ ఆచరించాలంటే, నెగిటివిటీ లేకుండా ఫ్యూర్ గా, పోజిటివ్ గా ఉండాలి! మరి సంఘం మనతో అలా ఉండదు కదా! అంటే, సంఘం ఎలా ఉన్నా మనం ఇలా ఉండగలిగితే అప్పుడు కదా ముక్తి! నేను ఇదంతా ఆలోచిస్తూ పడుకున్నాను.

అప్పుడు కొద్దిసేపటికి నిద్రకూ, మెలుకువకూ మధ్యస్థంగా ఉన్న స్థితిలో నాకు ఎదురుగా జీసస్ కనిపించారు. తెల్లని వస్త్రాలతో, దివ్యమైన కాంతితో వెలిగిపోతూ చాలా పెద్ద ఆకారంతో ఉన్నారు. లోతయిన, గంభీరమైన గొంతుతో " My Child" అని పిలిచారు. ఇదంతా నిజమా అనుకుంటూ నేను ఎంతో సంభ్రమంగా, ఆశ్చర్యంగా శరీరస్పృహ కూడా తెలియనంతగా ఆయన వైపు చూస్తూఉన్నాను. అప్పుడు ఆయన "నేను నీకు దారి చూపిస్తాను" అన్నారు. తరువాత ఒక గది తలుపులు తెరుచుకొని నేను లోపలికి వెళ్తే, అక్కడ మళ్ళీ ఆయన ఒక సోఫాలో కూర్చుని ఉన్నారు. అంతకు ముందులాగే కాంతితో వెలిగిపోతూ ఉన్నారు. దూరంనుంచి చూస్తే నాన్నగారిలా అనిపించారు. దగ్గరకెళ్ళి చూస్తే జీసస్ గొంతు వినిపించింది. ఆయన చుట్టూ 12 మంది శిష్యులు కూడా ఉన్నారు. నన్ను చూసి "Come My Child" అన్నారు. ఒక తలుపు వైపు చూపిస్తూ నీకు ఒక దారి ముందే సిద్ధం చేసి ఉంచాను. ఆ దారమ్మట వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు వెళ్ళి పోవచ్చు నీకు ఆకలి, దప్పికలు కూడా ఉండవు అన్నారు. నేను సంశయంగా, ఆశ్చర్యంగా చూస్తుంటే, సందేహించకు ఆ దారమ్మట వెళ్ళిపో అన్నారు. నేను ఆ తలుపు తెరిచే సరికి చాలా పొడవుగా, విశాలంగా, నున్నగా ఉన్న రహదారిలాంటి మార్గం కనిపించింది. దానికి రెండు పక్కలా అంతా స్వచ్చమైన నీరు కనిపించింది.

నేను ఆదారమ్మట నడవడం మొదలుపెట్టాను. కానీ ఎంత నడిచినా తరగనట్టుగా అనిపిస్తోంది. వెనక్కి తిరిగి చూడవద్దన్నారు కదా అని మళ్ళీ నడవడం ప్రారంభించాను. ఎంతసేపు నడిచినా అంతం లేనట్టుగా ఉంది. ఇంక నేను ఆగలేక వెనక్కి తిరిగి చూసాను. అంతే, కళ్ళ ముందు దృశ్యం మాయమయింది. నేను స్పృహలోకి వచ్చి ఆలోచిస్తూ, ఇది ఎవరికైనా చెబితే బావుంటుందేమో అనుకున్నాను.

అప్పుడు వెంటనే నీతా అనే ఒక క్రిస్టియన్ స్నేహితురాలి గదిలోకి వెళ్ళాను. ఆమె నాకంటే సీనియర్, PG చేస్తోంది. ప్రతిరోజూ తన చదువు, బైబిలు చదువుకోవడం, తన పనులు తప్ప ఆమెకి వేరే ప్రపంచం ఉండదు. జరిగిందంతా ఆమెతో చెబితే ఆమెకు కన్నీళ్ళొచ్చాయి. నేను చిన్నప్పట్నీంచీ ప్రయత్నిస్తున్నా నాకెప్పుడూ ఆయన కనిపించలేదు. ఆయన గొంతు వినపడలేదు. నువ్వు క్రిస్టియన్ వి కాకపోయినా ఇదంతా జరగడం సామాన్యమైన విషయం కాదు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీకు జీసస్ ఆశీస్సులు ఉన్నాయి అంది. ఇప్పుడు నువ్వు చెప్పినదంతా బైబిల్ లో ఉందంటూ ఆఖరి అధ్యాయంలో తీసి చూపించింది. అందులో భగవంతుడు ఒక దారి చూపిస్తాడు, ఆ పొడవాటి దారిలో అటూ, ఇటూ క్రిస్టల్ క్లియర్ వాటర్ ఇలా బైబిల్ లో కూడా నాకు కనిపించిన దృశ్యంలో ఉన్నట్టే ఉన్నాయి.

ఆదారి చివరి వరకూ వెళితే అక్కడ ఏముంటుంది? అని నీతాను అడిగాను. అప్పుడు తను బైబిల్ లో మళ్ళీ చదివి చెప్పింది. ఈ దారి చివర మహా "కల్పవృక్షం" ఉంటుంది. ప్రతినెలా అది 12 రకాల పండ్లను ఇస్తుంది. ఆ వృక్షం ఆకులు సర్వరోగ నివారణకు ( అజ్ఞానానికి ) సంజీవనిలాగ పనిచేస్తాయి. అక్కడ జీసస్, ఆయన బిడ్డలు, ఆయన సేవకులు తప్ప శపించబడిన వాళ్ళు ఎవరూ ఉండరు. అక్కడ ఆయన స్వరూపం కనబడుతుంది. ఆయన పేరు వినబడుతుంది. సమస్త సృష్టికి అవసరమయిన వెలుతురుని ప్రసరింపచేసే, సూర్యునికి కూడా ఆధారం ఆయనే కనుక, అక్కడ చీకటి ఎలా ఉంటుందో తెలియదు. అక్కడకు చేరుకున్న వాళ్ళు మృత్యువును జయించి అమరత్వాన్ని పొందుతారు. అక్కడ భగవంతుని సింహాసనం ఉంటుంది. ఆయన చెప్పిన స్వర్గరాజ్యం అక్కడ ఎరుకపడుతుంది. అని బైబిల్ లో ఉంది.

నీతా అదంతా చదివాకా నాకు కూడా కన్నీళ్ళొచ్చాయి. జీసస్ నన్ను వెనక్కి తిరిగి చూడవద్దని చెపితే నేను తిరిగి చూసాను అని నీతాను అడిగితే, నీకు కలలో మార్గదర్శకం చూపించారు. నువ్వు నడవడం కూడా చాలావరకూ అయిపోయింది. నీకు తెలియజేయడానికి ఇదంతా చెప్పారు. ఏదో కలలో వెనక్కి తిరిగావని నీ ప్రయాణం ఏమీ ఆగదు. అలా వెనక్కి తిరగడానికి కూడా ఏదో అంతరార్థం ఉంటుంది. బహుసా భగవంతుడు నీతో చేయించే పని ఏదో ఉండడం వల్ల వెనక్కి తిరిగి ఉంటావు. అందుకని దీన్ని నువ్వు నెగిటివ్ గా తీసుకోవద్దు. నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పింది.

నేను నీతా గదిలోంచి బయటకు వస్తూ ఆలోచించాను. అసలు అన్ని మతాల సారం ఒకటే అని నాన్నగారు అంటారు కదా! ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళకి పన్నెండు దైవీ గుణాలు వచ్చి వరిస్తాయని చెప్పారు. అయితే "ఆ కల్పవృక్షానికి కాసే ఆ 12 పండ్లు, నాన్నగారు చెప్పిన 12 దైవీ గుణాలు ఒక్కటే" అన్నమాట! అయితే ఏ మతంలో, ఏ విధంగా చెప్పినా కూడా మనం చివరకు పొందవలసింది "ఆత్మ" ని అని ఇక్కడ రూఢి అయింది అనిపించింది. స్వర్గరాజ్యం మన హృదయంలోనే ఉంది. "The Kingdom of heaven is within you" అన్నాడు కదా ఏసు! మహాజ్ఞాని అయిన నాన్నగారి అనుగ్రహం లో ఉన్న మనందరికీ కూడా, దైవీ గుణాలయిన 12 ఫలాలు అంత సహజంగా వచ్చి వరిస్తాయి. 
 

బుద్ధుడు, జీసస్, రామకృష్ణుడు, రమణుడు, నాన్నగారు... వీరందరి రుపాలు వేరైనా వారిలో అంతర్యామిగా ఉన్న చైతన్యం ఒకటిగానే ఉంది. ఆ ఒకటిగా ఉన్న వస్తువును పొందిన జ్ఞాని శరీరం భగవంతుడికి ఉపాధి. ఆ ఉపాదుల ( శరీరాల ) ద్వారా లోకంలో భగవంతుడి కార్యమే జరుగుతుంది. అవతార పురుషులు,మహాత్ములు గురు రూపం ధరించి మనకి మార్గం చూపించినప్పుడు, ఆ మార్గం ద్వారా మనం ప్రయాణం చేస్తే, ఆ చైతన్య వస్తువే మన స్వరూపంగా వ్యక్తమవుతుంది. మనల్ని అనుక్షణం సునాయాసంగా గమ్యం వైపు తీసుకువెళ్తున్న నాన్న దయ అనిర్వచనీయం.

1 comment: