Sunday, September 20, 2020

"సర్వకారణ కారణం" - (By డా. ఉష గారు)

అరుణాచలం నుంచి తిరిగి హాస్టల్ కి వెళ్ళిపోయాకా వారం, పది రోజులకి ఒక కల వచ్చింది. అరుణాచలం కొండలాంటి కొండమీద నేను ఒంటరిగా నడుస్తున్నాను. విశ్రాంతిగా, తీరిగ్గా ఒకచోట కూర్చున్నాను. అప్పుడు ఒక ప్రక్కన ఉన్న చెట్ల పొదకి మంట అంటుకుంది. నేను ఇదేంటి? ఇప్పటివరకూ ఏమీలేదు, చుట్టూ కూడా ఎవరూ లేరు, ఇంత అకస్మాత్తుగా మంట ఎలా అంటుకుంది? అని దానివైపు ఆశ్చర్యంగా చూస్తున్నాను. అలా చూస్తుంటే ఆ ఒక్క పొదకీ మంట ఇంకా పెద్దది అయిపోయింది. అలా మండుతున్న పొదవెనకాల పాదాలు కనిపించాయి.

ఇక్కడ మనుషులు ఎవరూ లేరు. పాదాలు కనిపిస్తున్నాయి ఏమిటి? అని దగ్గరకు వెళ్ళాను. అవి ఎవరి పాదాలా అని చూస్తే, తెల్లని వస్త్రాలతో ఉండి పాదాలు మాత్రం కనిపిస్తున్నాయి. అప్పుడు జీసస్ గొంతు వినపడింది. గంభీరమైన గొంతుతో ఆయన ఏదో చెపుతున్నారు. అయితే ఆయన భాష నాకు అర్థం కాలేదు. చెప్పడం అయిపోయాకా ఆయన అదృశ్యమయిపోయారు. పొదకి అంటుకున్న మంటకూడా అదృశ్యమైపోయింది. తరువాత నాకు మెలుకువ వచ్చింది.

ఏమిటిది? జీసస్ మళ్ళీ కలలోకి వచ్చారు. అసలు దీని అర్థమేంటి అనుకుంటూ కారిడార్ లో నడుచుకుంటూ వెళ్తుంటే, మెడికల్ జూనియర్ శైలా బయట కూర్చుని తన మెడికల్ బుక్ చదువుకుంటోంది. తన ఎదురుగా టేబుల్ పైన బైబిల్ కూడా ఉంది. నడుస్తున్న నేను తన దగ్గర ఆగాను. తను నాకు మంచి ఫ్రెండ్. శైలా బైబిల్ లో ఈ సంఘటన గురించి ఉందేమో చూడు అని నాకు వచ్చిన కల గురించి చెప్పాను (ఇదివరకు జీసస్ కలలో చూపించిన దృశ్యం బైబిల్ లో ఉండడంవల్ల). ఎందుకు లేదు అంటూ, తను బైబిల్ తీసి చదివి తరువాత దాని అర్థం చెప్పింది.

ఇలాగే మోసెస్ కొండమీద నడిచి వెళ్తుంటే ఒకపొదకి మంట అంటుకుంటుంది. కానీ ఆ మంట ఆపొదని కాల్చటం లేదు. ఇదేమిటి ఆశ్చర్యంగా ఉందని దగ్గరకు వెళ్ళి చూస్తే, మంటలో నుంచి భగవంతుడి గొంతు వినిపిస్తుంది మోసెస్..! మోసెస్..! అని. ఇక్కడే ఉన్నాను ప్రభూ అంటాడు. అంతకన్నా దగ్గరకు రాకు, నువ్వు చెప్పులు విప్పేయి. ఎందుకంటే, ఇది పవిత్రమైనస్థలం. నేను నీ తండ్రికి దేవుడిని అంటాడు. మోసెస్ ఆ వెలుగు వైపు చూడలేక చేయి అడ్డుపెట్టుకుంటాడు. ఆయన చెప్పడం కొనసాగిస్తాడు! ఈజిప్ట్ లో ప్రజలు క్షోభలో ఉన్నారు. ఎందుకంటే, వాళ్ళు అక్కడ బానిసలుగా ఉన్నారు, వాళ్ళ ఏడుపులు నాకు వినిపిస్తున్నాయి, వాళ్ళ దుఃఖం నాకు కష్టంగా ఉంది అందుకని నువ్వు ఈజిప్ట్ వెళ్ళి వాళ్ళని ఆ స్థితిలోంచి బయటకు తీసుకురా! అనిచెప్పి అదృశ్యమవుతాడు. ఇదంతా విన్నాకా మోసెస్ కొద్దిసేపు సందిగ్ధంగా ఉండిపోతాడు. తరువాత భగవంతుడి నిర్ణయానికి అనుగుణంగా మోసెస్ జీవించడం జరుగుతుంది.

ఈ విధంగా భగవంతుడి పనికి మోసెస్ ఎన్నుకోబడతాడు! అని చెప్పి శైలా నాతో, ఉషా మోసెస్ కి కనిపించినట్టుగా పొదలో మంట రావడం, అదే దృశ్యం నీకు కలలో కనిపించడం ఇదంతా చాలా వింతగా ఉంది! జీసస్ నిన్నుకూడా ఏదో పనికి ఎన్నుకుంటారు అనుకుంటా! లేకపోతే ఇలా కల రావడం అసాధ్యం అని చెప్పింది. నాకు ఆయన భాష అర్థం కాలేదు కదా అన్నాను. ఆయన అనుకున్నది మోసెస్ తో ఎలా అయితే చేయించాడో, నీద్వారా కూడా ఆయన అనుకున్నది చేయిస్తాడని అనిపిస్తోంది అంది.

ఈ రోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. ఒకసారి నాన్నగారు అరుణాచలం నుంచి జిన్నూరు తిరిగి వెళ్తూ, మధ్యలో వేలూరులో రాజకుమార్ అనే ఒక భక్తుని ఇంట్లో ఆగడం జరిగింది. అక్కడ నాన్నగారు హాలులో దివాన్ మీద పడుకొని ఉన్నారు. మేమంతా ఆయన సన్నిధిలో కూర్చుని ఉన్నాము. ఆయన కిటికీలోంచి బయట ఉన్న చెట్లవైపు దీక్షగా చూస్తూ ఉన్నారు. అలా చూస్తున్నప్పుడు నాన్నగారి ఒక కంటిలో నుంచి ధారగా కన్నీరు కారింది. ఆ కన్నీరు చూసి నాకు దుఃఖం ఆగలేదు. అప్పటికి ఆశ్రమంలో ఇబ్బందులు, బయటనుంచి సమస్యలూ చాలా ఉన్నాయి. నాన్నగారి కంటిలోంచి కన్నీరు కారడానికి ఆ సమస్యలే కారణమా? ఆ కన్నీరు ఎందుకు వస్తోంది? దేనివల్ల? ఇలాంటి దృశ్యం నేనెప్పుడూ చూడలేదు అని దుఃఖిస్తూ అరుణాచలేశ్వరుడిని ప్రార్థించాను. తండ్రీ..!! నాన్నగారు భౌతికంగా ఏవిధమైన ఇబ్బందులకి, సమస్యలకి, అసౌకర్యాలకి ఎప్పుడూ గురికాకూడదు. అలాంటి పరిస్థితులేమైనా ఉంటే వాటికి నన్ను కవచంగా అడ్డుపెట్టు. ఈ జన్మకి నాకు అది సరిపోతుంది. అంతేకానీ, నా జీవితంలో నేను మళ్ళీ ఇలాంటి సంఘటన చూడకూడదు. ఈ ఒక్క కోరికా తీర్చు, ఇంకెప్పుడూ నిన్ను ఏమీ అడగను అని హృదయపూర్వకంగా వేడుకుంటూ వెక్కి, వెక్కి ఏడ్చేసాను.

కొద్దిసమయం తరువాత నాన్నగారు దివాను మీద నుంచి లేచి కూర్చున్నారు! మెల్లగా నేను దుఃఖంనుంచి తేరుకున్నాను. భక్తులు నాన్నగారికి టీ తీసుకొచ్చి ఇచ్చారు. నాన్నగారు టీ కప్పు తీసుకుంటూ "లోకంలో మనుషులు 2 రకాలుగా ఉంటారు. వారిలో కొందరికి చాలా మంచితనం ఉంటుంది కానీ తెలివితేటలు తక్కువ ఉంటాయి. కొందరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కానీ మంచితనం తక్కువ ఉంటుంది. మంచితనం తెలివి తేటలూ రెండూ ఉన్నవాళ్ళు అరుదుగా కొంతమంది ఉంటారు. అలా ఉన్నా కూడా, వారిలో మంచితనమూ, తెలివితేటలూ సమానంగా ఉండి బేలన్స్ అవడం చాలా అరుదుగా జరుగుతుంది. అది ఈరోజు మన ఉషకి జరిగింది. తనకి హృదయమూ, మేథస్సు కూడా బేలెన్స్ అయింది. అందుచేత భవిష్యత్తులో ఉష నా పని చేస్తుంది" అన్నారు!

ఈ సంఘటన జరిగిన కొన్నినెలల తరువాత నాన్నగారు, నన్ను శ్రీ నాన్నగారి ఆశ్రమానికి ప్రెసిడెంట్ ని చేయడం జరిగింది. తరువాత అరుణాచలేశ్వరుని అనుగ్రహం వలన కొన్ని సంవత్సరాలలో అన్ని ఇబ్బందులు, సమస్యలలోంచి బయటపడటం కూడా జరిగింది. ఆ పదవిలో ఉండటానికి సంశయిస్తూ నాన్న గారితో ఇది నా వల్ల కాదు అన్నపుడు, నాన్నగారు ఎంతో దయతో, "తెర మీద నువ్వు కనపడతావు అమ్మ, పని నేను చేస్తాను" అన్నారు. విచిత్రమేమిటంటే, నాన్నగారు నాకు ఆపదవి ఇవ్వడం వల్ల నిరంతరం ఆయన పక్కనే ఉండి, ఆయనతో ఎక్కువ సమయం గడిపే అవకాశం కలిగింది. ఇది వరకటి కంటే ఎక్కువగా ప్రయాణాలు చేసి ఆయన దగ్గరికి వెళ్ళవలసి వచ్చేది. ఒక సందర్భంలో నాన్నగారు నాతో ప్రారబ్థం కూడా నిన్నూ, నన్నూ వేరు చేయకూడదు అన్నారు. ఆ మాటకి, నూటికి నూరు శాతం న్యాయం చేస్తూ ప్రతిక్షణం నాకు ఆయన రక్షక కవచంలా ఆయ్యారు.

ప్రతీది అయన సంకల్పంతో నడుస్తోంది. ఆనాటి కల ఈ రోజుకి అంచలు అంచలుగా అయన దయతో అమలు చేయబడుతోంది.

నారాయణం పరబ్రహ్మం సర్వ కారణం కారణం అని అనేవారు నాన్నగారు. సర్వ కారణాలకీ ఒక కారణం ఉంటుంది, ఆ కారణం కృష్ఞుడు అనేవారు నాన్నగారు.

No comments:

Post a Comment