Tuesday, September 1, 2020

"అందరి బంధువు" - పరమపదించిన బుజ్జి గారు

శ్రీ నాన్నగారిని దర్శించుకున్న భక్తులలో చాలామందికి బుజ్జి బాగా తెలుసు. బుజ్జి అనేది ఒక పేరు కాదు, భక్తులకు కలిగే ఒక అనుభూతి. భక్తులందరితో సరదాగా, ఆత్మీయుడిలా ఉండేవాడు. తెల్లవారుజామున నాన్నగారి పాదాలకి నూనె రాయడంతో బుజ్జి పని మొదలయ్యేది. రోజంతా నాన్నగారికి అవసరమైన పనులన్నీ చేస్తూ, కన్నమ్మగారికి ఇంట్లోకి అవసరమైనవన్నీ తెచ్చిపెడుతూ వారి కుటుంబంలో సభ్యుడిలా పనిచేస్తూ ఉండేవాడు.

నాన్నగారు చెప్పే ఉపన్యాసాలన్నిటినీ రికార్డ్ చేసి, వాటిని ఆడియో క్యాసెట్స్ రూపంలో తీసుకువచ్చాడు. వాటిని భక్తులకి కొరియర్ చేస్తూ ఉండేవాడు. రమణ భాస్కర కవర్ పేజీ డిజైన్ పని కూడా ఆ టీమ్ తో కలిసి చేసేవాడు. రమణభాస్కర పుస్తకాలను కొరియర్ చేసేవాడు. రమణ కేంద్రంలో భక్తులెవరైనా బస చేసినప్పుడు వారికి కావాల్సిన సౌకర్యాలు, ఆహారము, వాటర్ బాటిల్స్ అన్ని ఏర్పాట్లూ దగ్గరుండి చూసుకునేవాడు. అవసరమైతే పాలకొల్లునుంచి పార్శిల్స్ తెచ్చిపెట్టేవాడు. వారంతా తిరిగి వెళ్ళేటప్పుడు స్టేషన్ లో ట్రైన్ ఎక్కేవరకూ బాధ్యత తీసుకునేవాడు. భక్తులకు ట్రైన్ లో తినడానికి పార్సిల్స్ తెచ్చిపెట్టేవాడు.

నాన్నగారు ఎక్కడికి వెళితే అక్కడికి కూడా ఉండి తీసుకెళ్ళడము, ఆయనతో పాటు వెళ్ళే భక్తులకు టికెట్స్ బుక్ చేయడము....ఇలా అన్ని పనులలో నాన్నగారికీ, భక్తులకూ మధ్య ఫోస్ట్ మేన్ లా పని చేసాడు. నాన్నగారితో ఎవరైనా మాట్లాడాలనుకుంటే, బుజ్జికి ఫోన్ చేసేవారు. బుజ్జి నాన్నగారికి చెప్పి, మళ్ళీ నాన్నగారు ఏమన్నారో భక్తులకు చెప్పి, అవసరమైతే భక్తులని నాన్నగారితో మాట్లాడించేవాడు. నాన్నగారి ఆరోగ్యానికి, సౌకర్యానికి ఇబ్బంది లేకుండా ఏ టైమ్ కి ఎవర్ని పంపాలి? ఎవర్ని పంపకూడదు అనేది కూడా బుజ్జే చూసుకునేవాడు. ఇలా చేసే పనిలో ఎవర్నీ నొప్పించకుండా అందర్నీ సమన్వయం చేసుకుంటూ, వీలయినప్పుడు భక్తులకు ఆయన దర్శనం ఇప్పించేవాడు. నిజంగా కష్టాలలో, ఇబ్బందులలో ఉన్నవాళ్ళెవరైనా వస్తే వాళ్ళని ఆప్యాయంగా ఓదార్చి, ధైర్యం చెప్పి పంపేవాడు.

బుజ్జి మంచి భోజనప్రియుడు. వేడిగా ఉన్న రుచికరమైన పదార్థాలను తినడం ఇష్టపడేవాడు. అలాగే, వాటిని అందరికీ పంచడంలో ఉన్న ఆనందాన్ని కూడా రుచి చూసేవాడు.

నాన్నగారికి ఆరోగ్యం బాగోక హాస్పిటల్ లో చేరినప్పుడు రాత్రీ, పగలూ కాపలాగా ఉండేవాడు. రాత్రిళ్ళు నాన్నగారికి నిద్రపట్టకపోతే తనూ మేల్కొనే ఉండేవాడు. నాన్నగారు జరిపిన ఫంక్షన్స్ కి, ఆయన భర్తడే వేడుకలకి ముఖ్యమైన ఏర్పాట్లు చూసేవాడు.

బుజ్జి పైకి నవ్వుతూ కనపడినా తనకీ కష్టాలు ఉండేవి. తరువాత కాలంలో బుజ్జికి షుగర్ వ్యాధి రావడం, భౌతికంగా, కుటుంబపరంగా కొన్ని ఇబ్బందులు, సమస్యలు రావడం జరిగాయి. అయినా అటువంటి సమయంలో కూడా బుజ్జి నాన్నగారి పనిని ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు. ఎన్ని ఇబ్భందులు వచ్చినా కూడా, తన పని తాను చాలా సహజంగా చేస్తూ ఉండేవాడు. ఈ పరిస్థితిలో బుజ్జిని నాన్నగారు కంటికి రెప్పలా చూసుకున్నారు. బుజ్జి తన కష్టాల గురించి భక్తులతో చెప్పుకున్నప్పుడు నాన్నగారి అనుగ్రహం వల్లనే నేను తట్టుకుంటున్నానని చెప్పేవాడు.

ఒకసారి బుజ్జి ఒక భక్తునితో చెప్పాడు. నేను నాన్నగారి దగ్గరకు భక్తి తో రాలేదు. డబ్బులు కోసం వచ్చాను. భక్తితో అన్నీ వదులుకుని నాన్నగారి దగ్గరకు వచ్చిన చాలామంది, దారితప్పి డబ్బువైపు ఆకర్షితులయ్యారు. కానీ నేను డబ్బుకోసం వస్తే నాకు భక్తి కలిగింది అని చాలా సహజంగా, ఎటువంటి ఆత్మవంచనలేకుండా తన బలహీనతను ఒప్పుకున్నాడు. అందుకేనేమో నాన్నగారు తమను సేవించుకోవడానికి, బుజ్జికి అన్నిరకాలుగా అంత అవకాశం ఇచ్చారు అనిపిస్తుంది.

భగవాన్ ఒకసారి మితిమీరి గిరిప్రదక్షిణలు చేస్తుంటే ఒక ముసలామె, "అలా తిరుగుతూ ఉండకపోతే ఒకచోట కూర్చోరాదా" అన్నదట. భగవాన్ ఆశ్చర్యపోయి తనపట్ల ఇంత చనువు పార్వతీదేవే తీసుకోగలదని తలచి, ఆమె ఆజ్ఞగా భావించి గిరిప్రదక్షిణ ఆపేసారట. అలాగే నాన్నగారు సమయం తెలియకుండా ప్రవచనాలు చెప్పినా, భక్తులతో గడిపినా నాన్నగారిని మరియు భక్తులను అదుపులో పెట్టడం బుజ్జికే చెల్లింది. ఒక ప్రసంగంలో బుజ్జి గురించి నాన్నగారు "మా బుజ్జి ఏమంటున్నాడు అంటే, టైమ్ అవ్వగానే నేను మీకు చేబుతాను, అప్పుడు వెంటనే పుస్తకం కింద పడేసి మీదారిన మీరు వెళ్ళిపోండి, వినేవాళ్ళు వాళ్ళదారిన వాళ్ళు వెళ్ళిపోతారు. మీకు ఆతిధ్యం ఇచ్చేవాళ్ళు సుఖపడతారు అంటున్నాడు" అన్నారు.

ఒకసారి నాన్నగారు భగవాన్ గురించి చెబుతూ అన్నారు: రమణాశ్రమంలో భోజనాల తరువాత భగవాన్ టైమ్ తెలియకుండా అక్కడున్న భక్తులకు ఆధ్యాత్మిక విషయాలు చెబుతుంటే, ఒక పరిచారకుడు వచ్చి భగవాన్ వెనుక నిలుచుని ఇక వెళ్ళండి అని భక్తులకు సైగ చేసేవారట. అలాగే బుజ్జి నాన్నగారి దగ్గర భక్తులను వెళ్ళిరమ్మని సైగలు చేయడం జరిగింది.

ఒకసారి శ్రీశైలంలో నాన్నగారి సమక్షంలోకి కొంతమంది భక్తులను పంపడం, కొంతమందిని పంపకపోవడంతో భక్తులు నిరాశ చెంది బుజ్జితో నాన్నగారికి అందరూ సమానమే కదా అన్నారట. అప్పుడు బుజ్జి నాన్నగారితో భక్తులు అన్నమాట చెబితే, నాన్నగారు: "హృదయంలో అందరూ సమానమే. కానీ భౌతికంగా అదెలా కుదురుతుంది?" అన్నారు.

సాదారణంగా భక్తులందరం గురువుగారి దగ్గరికి పండ్లు తీసుకెళ్ళి, కాసేపు కూర్చుని ఆయన చెప్పింది విని, ఆయన అనుగ్రహాన్ని పొంది తిరిగి వస్తాము. కానీ ఒక జ్ఞాని దగ్గర నిరంతరం పని చేయడం సామాన్యమైన విషయం కాదు. వేరే విధంగా బలహీనతలతో ఉండి అక్కడ పనిచేయడానికి ఆస్కారమే ఉండదు. ఆ పనులు కష్టమైనా నిమగ్నమై చేయాలి. భగవంతుడు ఈ ప్రక్రియలో జీవుడుని రెండో కంటికి తెలియకుండా పవిత్రుడిని చేస్తాడు. అది బుజ్జి విషయంలో జరిగింది. దాదాపు 20 సం॥లు జ్ఞాని సమక్షంలో గడిపి ఆయనకు సేవ చేసే భాగ్యం, ఆయన భక్తులకు సేవ చేసే భాగ్యం బుజ్జికి దొరికినట్టుగా ఇంకేవరికీ దొరకిఉండదు. బహుసా అందుకేనేమో! "భగవంతుడు బుజ్జి అందరిలా ఈ లోకంలో జీవించఢం సరయినది కాదని ఆయన లోకానికి తీసుకెళ్ళిపోయాడు".

"బుజ్జి, నాన్నగారి బుజ్జిగానే మనందరికీ తెలుసు. ఇక నాన్నగారి బుజ్జిగానే మన జ్ఞాపకాలలో మిగిలిపోతాడు".

1 comment: