Sunday, September 13, 2020

"గురువు గారి అనుగ్రహ ప్రవాహం" - (By డా. ఉష గారు)

నేను తర్డ్ ఇయర్ డిసెంబరులో, నాన్నగారు వచ్చినప్పుడు అరుణాచలం వెళ్ళాను. మామూలుగా డిసెంబరు, జనవరి నెలల్లో అరుణాచలంలో విదేశీయులు ఎక్కువగా ఉంటారు. వారిలో అరుణాచలం వచ్చి స్థిరపడిన విదేశీయులు కూడా నాన్నగారి దగ్గరకు వస్తూ ఉండేవారు. వారిలో ఒకామె అరుణాచలంలో స్థిరపడి గోపికగా పేరు మార్చుకుంది. ఆమెకు నాన్నగారు అంటే చాలా ఇష్టం.

నా పుట్టినరోజు డిసెంబరు నెలలో అవడం, ఆ సమయానికి నేను అరుణాచలంలో ఉండటం వల్ల నేను ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోకూడదు అనుకున్నాను. అసలు దేహంతో తాదాప్యం వల్లనే కదా, ఈ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం. జీవుడి పుట్టుక ఎప్పుడో అదే అసలు పుట్టుక, జీవుడు ఎప్పుడు మరణిస్తే అదే అసలు మరణం కదా! మరణం దేనికి అంటే, మరణంలేని వస్తువులోకి మేల్కొనడానికి. అది మరణిస్తే శాశ్వతంగా ఉండే వస్తువు నీవవుతావు. మహాజ్ఞాని గురువుగా వచ్చి నాకు జ్ఞానం గురించి బోధిస్తున్నారు, దాన్ని అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఆరోజు గడపాలనుకున్నాను.

గోపిక నాన్నగారితో, క్రిసమస్ కంటే ముందుగానే మీరు తిరిగి వెళ్ళిపోతారు కదా! మాకు మీరే జీసస్ కాబట్టి, మీ సమక్షంలో క్రిసమస్ కంటే ముందుగానే వేడుకలు చేసుకుంటాము, మీకు వీలయిన డేట్ చెప్పండి నాన్నగారూ అని అడిగింది. అప్పుడు నాన్నగారు కేలెండర్ తెమ్మని 18 వ తేదీన పెట్టుకుందామా అమ్మా ఉషా? అన్నారు. నేను మీరు ఎలా అంటే అలాగే నాన్నగారూ అన్నాను. ఉండు మళ్ళీ చూస్తాను అని, నేను వెళ్ళే ముందురోజులవీ ఎందుకమ్మా! డిసెంబరు 17 న పెట్టుకుందాం అన్నారు. ఆయన ఆలోచన నాకు అర్దం అయింది. అలాగే నాన్నగారూ అన్నాను. నేనెలాగూ మర్చిపోదామనుకున్నాను, ఆయన ఏ రోజు పెడితే ఏముందిలే అనుకున్నాను.

గోపిక అక్కడున్న విదేశీయులందరికీ 17 న క్రిసమస్ వేడుకలు నాన్నగారి సమక్షంలో జరుగుతాయని చెప్పింది. వాళ్ళంతా డెకరేషన్ కి సంబంధించినవి అన్నీ సిద్ధం చేసి ఆంద్రా ఆశ్రమంలో పెట్టారు. 17వ తేదీ ఉదయం 6 గం.లకి నాన్నగారి మొదటి దర్శన సమయంలో, మద్రాసు నుంచి వచ్చిన దంపతులు నాన్నగారికి పెద్దగా ఉన్న రెండు చాక్లెట్ పేకెట్స్ ఇచ్చారు. వాటిలో రంగురంగుల చాక్లెట్స్ ఉన్నాయి. ఆ చాక్లెట్ రేపర్స్ అన్నింటిమీదా Happy Birthday అని రాసుంది. అవి నాన్నగారు నాకిచ్చి, ఇదేంటమ్మా విచిత్రంగా ఉంది అంటూ నావైపు చూసి, ఇదిగో అమ్మా ఉషా హేపీ భర్తడే అనిచెప్పి, అవి అందరికీ పంచు అని నా చేతికి ఇచ్చారు. అవి అందరికీ పంచాకా, నాన్నగారు హేపీ భర్తడే చాక్లెట్స్ బావున్నాయి కదమ్మా ఉషా! అంటూ ఆ మిగిలినవి నువ్వు ఉంచేసుకోమ్మా అన్నారు. ఆరోజు భోజనాలు అయ్యాకా నాన్నగారు మళ్ళీ హేపీ భర్తడే చాక్లెట్స్ బావున్నాయి కదా ఉషా అన్నారు. బావున్నాయి నాన్నగారూ అన్నాను. నాకు లోపల నవ్వు వస్తోంది. అయినా బయటపడకూడదని సైలెంటుగా ఉన్నాను.

నేను గోపికకి కొన్ని చాక్లెట్స్ ఇస్తే ఆమె తనబేగ్ లో వేసుకుంది. ఆరోజు క్రిసమస్ వేడుకలకి డెకరేషన్ చేస్తుంటే, గోపిక చాక్లెట్స్ బయటికి తీసి హేపీ భర్తడే ఉషా అంది సరదాగా. నేను నీకెలా తెలిసింది అని ఆశ్చర్యంగా అడిగాను. తెలియడమేంటి అంది. ఏంలేదులే అన్నాను. కానీ, తనకి విషయం అర్థమయిపోయింది. ఓ మైగాడ్! నిజంగా ఈరోజు నీ భర్తడేనా? అంటూ నువ్వు నా కూతురులాంటిదానివి అని నన్ను ముద్ధుపెట్టుకుంది. భగవంతుడు ఎంత దైవికంగా చాక్లెట్స్ పంపాడో చూడు అని చాలా సంతోషించింది. నేను తనతో విషయం బయటకు చెప్పొద్దన్నాను. సరే అంది.

ఆ రోజు సాయంత్రం విదేశీయులు గిటార్, వయొలిన్. అన్నీ తమవెంట తెచ్చుకుని, రాముడు, కృష్ణుడు, రమణుడు, ఈశ్వరుడు నటరాజు. మీద చాలా అద్భుతమైన పాటలన్నీ పాడారు. దాదాపు రెండు గంటల సేపు జరిగిన ఆ కార్యక్రమంలో, అక్కడున్న అందరం తన్మయత్వంతో నాన్నగారితో సహా, లోకం తెలియని స్థితిలోకి వెళ్ళిపోయాము. 

తరువాత నాన్నగారు ఇప్పుడు నేను పాడతాను, నాతో పాటు మీరు కూడా పాడండి అంటూ, "Oh God beautiful" అనే పాట మొదలుపెట్టారు.

Oh God beautiful, Oh God beautiful, Oh God beautiful! I do bow at thy feet 
Thou are green in the forest, thou are high in the mountain, 
Thou are restless in the river, thou are grave in the ocean, 
Thou are sympathy to the sorrowful, thou are service to the serviceful, 
Thou are bliss to the yogi, thou are love to the lover.- (Paramahamsa Yogananda)

తల ఊపుతూ, చేతులు కూడా పైకెత్తేసి చాలా, సేపు అలా పాడుతూనే ఉన్నారు. ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం. నాన్నగారు ప్రకృతిని వర్ణిస్తూ అంతలా పాడుతూ ఉంటే ఆ అద్భుతాన్ని చూస్తూ కొతమందికి కన్నీళ్ళొచ్చాయి. మరికొంతమంది భక్తితో పరవశించారు. ఆ సమయంలో హోలీ వైబ్రేషన్ ఆ ప్రదేశమంతా వ్యాపించి, ఆయన వైభవం ఆరోజంతా అక్కడ నిలిచిపోయింది. ఆ తరువాత అందరూ చాలాసేపు మౌనంలో ఉండిపోయారు.

గోపిక 3 లేయర్స్ ఉన్న కేకు మీద "హేపీ భర్తడే", "మేరీ క్రిసమస్" అని రాయించి తీసుకొచ్చింది. నాన్నగారు కేకు చూస్తూ, హేపీ భర్తడే అండ్ మేరీ క్రిసమస్ అన్నారు. అప్పుడు గోపిక అవును నాన్నగారూ ఉష భర్తడే అని చెప్పింది. నాన్నగారు రామ్మా ఉషా! కేకు నువ్వు కట్ చేద్దువుగాని, అని నాచెయ్యి పట్టుకుని కట్ చేయించి కేకు తినిపించారు. నాకు ఆయన ప్రేమకి తట్టుకోలేక కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి.

తరువాత గోపికని "బైబిల్" లోంచి "సెర్మన్ ఆన్ ది మౌంట్" తీసి చదవమన్నారు. జీసస్ కలలో కనిపించి అప్పటికి కొన్ని నెలలైంది. అది వింటుంటే పరవశించి పోయాను. నేను భర్తడేనే మరిచిపోదామంటే, ఉదయం 6 గం. నుంచి సాయంత్రం 7 గం. వరకూ ఆయన దానిగురించే ఎక్కువగా తలపెడుతూ, ఆయన చేతుల్తో వేడుక చేస్తూ, తినిపిస్తూ, భగవంతుడై స్వయంగా పాటపాడుతూ అన్నీ చేసారు. ఇదంతా చూసి నాకు లోలోపల నుంచి కృతజ్ఞత తన్నుకుంటూ వచ్చింది. వెక్కి, వెక్కి ఏడుస్తూ ఆయన పాదాలకి ధన్నం పెట్టుకుంటూ, హృదయంలో చెప్పలేని ఆనందం పొంగుతూ ఉంటే, లేవలేక చాలాసేపు అలా ఉండిపోయాను. ఇంక మనసంతా ఖాళీ అయిపోయింది మౌనంగా ఉండిపోయాను. ఏం జరిగిందో, అలా ఎంతసేపు ఉండిపోయానో నాకు తెలియలేదు. నేను నా అస్థిత్వాన్ని మరిచిపోవాలనుకున్నాను. కానీ, ఆయన నా అస్థిత్వాన్ని కోల్పోయిన స్థితిలో ఉంచేస్తారని ఊహించలేదు. 

అప్పుడు నాన్నగారు అన్నారు "భగవంతుడి దయ చాలమ్మా ఉషా! ఇంకేం అక్కరలేదు జీవితానికి. అది నీకు నిండుగా ఉంది" అన్నారు.

వర్ణించలేని దైవ ప్రేమతో ఇదంతా చేసారు. మనల్ని మనం కోల్పోతే ఉన్నది భగవంతుడి ప్రేమే! ఆయన దయ తప్ప అక్కడ ఇంకేమీ లేదు. అది అనుభవంలోకి వస్తే క్రియేషన్ అదృశ్యమయిపోతుంది. ఉన్నదొక్కటే అనేది అక్కడ అనుభవం అవుతుంది. ఆ అనుభవంలో ఉంచేసారు నన్ను. చాలా టైమ్ పట్టింది మళ్ళీ మామూలు స్థితికి రావడానికి. ఇది తప్ప ఇంకే భర్తడే గుర్తురాకుండా చేసేసారు. అటువంటి మహత్తరమైన దివ్య ప్రేమకి జీవుడు కరిగిపోకుండా ఎలా ఉంటాడు? సులభంగా కరిగిపోతాడు. శరణాగతిలో ఉన్న వైభవం అది. ఒక జ్ఞాని ప్రేమని భక్తుడు రుచి చూసినప్పుడు ఇంతకన్నా ఉత్కృష్టమైంది ఇంకేముంటుంది లోకంలో? నీకేమీ అక్కర్లేకపోయినా, తల్లి తనపిల్లల్ని అలంకరించి ఆనందించినట్టుగా, జీవుడిని ప్రేమతో అలంకరించి ఆయన ఆనందిస్తాడు.

No comments:

Post a Comment