Friday, September 4, 2020

"నాన్నగారి అభయం, నీకు నేను ఉన్నాను" - (By రాణి గారు (గణపవరం))

గణపవరంలో నాన్నగారిని కల్యాణమండపంలో చూసిన క్షణం నుంచీ, ఇంక నాకు ఏమీ చూడాలనిపించలేదు. ఎప్పుడూ నాన్నగారినే చూస్తూ ఉండాలని అనిపించేది తప్ప, ఇంకేమీ తెలిసేది కాదు. తరువాత నాన్న దయ వల్ల ఏది మంచి, ఏది చెడు అనేది తెలిసేది. ఎక్కడ ఎలా ఉండాలో, నన్ను నేను పరిశీలన చేసుకోవటం, నాలో ఇన్ని గుణాలు ఉన్నాయని తెలియటం, దానిని మీరే తీయాలని వేడుకోవటం అలవాటు అయ్యింది.

నాన్నగారు రాముడు, కృష్ణుడు గురించి చెప్పినప్పుడు నేను వారిని చూడలేదు, వారి మాటలు వినలేదు. నేను చూసిందీ, విన్నదీ మీ దగ్గరే నాన్నగారూ అనుకున్నాను. మీ బోధ విన్నాకా నాకు మారు మనసు కలుగుతున్నది నాకు అన్నీ మీరే నాన్నగారూ!

ఒకసారి నాన్నగారు చిన్న నేను గురించి చెబుతుంటే, చిన్న నేను ఎలా పోతుంది నాన్నగారూ? అని అడిగాను. అప్పుడు నాన్నగారు ఒళ్ళంతా కుదిపేసుకొని పకపకా నవ్వుకుంటూ ప్రక్కన ఉన్న డాక్టర్ గారితో చిన్ననేను ఎలా పోతుంది అని అడుగుతుంది, అది అంత తేలికగా పోదు అన్నారు. అప్పుడు నేను మనస్సులో నీకు సాధ్యమే కదా! నాకు సాధ్యం కాదు కదా! ఎందుకలా నవ్వుకుంటున్నారు నాన్నగారూ! అని మనస్సులో అనుకున్నాను. అప్పుడు వెంటనే నాన్నగారు నా వంక జాలిగా చూసి అమ్మా! కర్తృత్వం లేకుండా జీవించమ్మా! అని చెప్పారు. అప్పుడు నాకు కర్తృత్వం అంటే ఏమిటో తెలియదు. తరువాత కొన్ని సం॥లకి కర్తృత్వం అంటే అర్థమయింది. అప్పుడు నేను చాలా ఏడ్చాను. ఎందుకంటే నిరంతరం కర్తృత్వంలో ఉండి అది ఎలా పోతుందో అడిగాను నాన్నగారిని. అప్పటి నుంచీ నాన్నగారిమాట రుచి తెలిసింది.

నాన్నగారు ఎవరిని పలకరించినా, ఎవరికి పళ్ళు ఇచ్చినా నాకు ఇచ్చినంత ఆనందం కలిగేది. నాన్నగారు నన్ను పలకరిస్తే ఒళ్ళంతా పులకరించేది. అలా రెండు మూడు రోజులు ఆ పులకరింపులో ఉండేదాన్ని. మొదట్లో నాన్నగారు నావంక చూడకపోతే బాధగా ఉండేది. తరువాత ఆయన బోధ వల్ల చూసినా, చూడకపోయినా ఆయన అనుగ్రహమే కదా అని బాధ అనిపించేది కాదు. నాన్నగారి దయవల్ల మనసులో ఏమి జరుగుతుందో గమనించుకోవడం తెలిసింది. ఒక్కొక్కసారి ఆయననుంచి జారిపోతాను, మళ్ళీ నాన్నగారే నా దృష్టిని ఆయన వైపు తిప్పుకుంటారు.

నేను మొదటిసారి జిన్నూరు వచ్చినప్పుడు నాకు నాన్నగారితో సంబంధం తప్ప, ఇతరులు ఎవరితోనూ సంబంధం ఉండకూడదు అని అనిపించింది. అలా అని ఎవరినీ దూరం పెట్టలేదు. పలకరిస్తే పలకడం, నవ్వితే నవ్వడం అంతవరకే. ఇప్పటికీ నాన్నగారు నన్ను అలానే ఉంచారు.

నాన్నగారు నా విషయాలు తెలుసుకుని ఏమ్మా, అని వాటిగురించి అడిగేవారు. నేను మనసులో నా గొడవలు మీకెందుకు నాన్నగారూ అనుకునేదాన్ని. అలా పలకరించి నాలో సంస్కారాలు తీసేసారు అని తరువాత తెలిసింది. నాకు తెలియక నాన్నగారు ధనవంతుల ఇంటికే వెళ్తారు అనుకునేదాన్ని. అప్పుడు నాన్నగారు నేను ఎక్కడికి వెళ్ళినా మీరంతా వస్తారు కదా! మిమ్మల్ని అందర్నీ చూసుకునేందుకు ఏ ఇబ్బందీ లేకుండా ఉండాలని వాళ్ళింటికి వెళ్తున్నానమ్మా అన్నారు.

నాన్నగారు నన్ను అన్ని రకాలుగా ఆదరించేవారు. ఒకసారి ఒక భక్తుడి ఇంటికి వెళ్ళాము. అక్కడ నాన్నగారు నాకు మామిడిపండు ఇచ్చారు. మళ్ళీ ఇంకో మామిడిపండు ఇస్తుంటే, నాకు ఇచ్చారు నాన్నగారూ అన్నాను. ఇది కూడా ఉంచు అని ఇంకోటి ఇచ్చారు. నాపేరు ఏంటి అని నా పక్కన ఉన్నవాళ్ళని అడిగారు. నాపేరు రామసీత అని చెప్పాను. కానీ అందరూ రాణీ అంటారు అని చెప్పాను. రాణమ్మా అన్నారు. నాన్నగారు మీ పాదాలమీద భక్తి మరువనివ్వకండి అన్నాను. రాణీ నన్ను మర్చిపోకండి అంటోంది అని నవ్వుకున్నారు. అమ్మా నీ భక్తిని నేను కాపాడుతాను అన్నారు. నాకు సత్సంగంలేదు. ఎప్పుడూ నేను ఒంటరిగానే ఉంటాను. నాన్నగారి, భగవాన్ ఫొటోస్ చూస్తూ మాట్లాడుకుంటాను. ప్రతీదీ నాన్నగారి ఫొటోతో చెప్పుకోవడం అలవాటు అయింది. నాకు ఎప్పుడు ఏది అవసరమయినా దానిని సమకూర్చుతారు. 

ఒకసారి అమ్మా నిన్ను అందరూ వదిలేసారు, అమ్మా, నీకు నేను ఉన్నానమ్మా అన్నారు. నాకు మీరుండగా భయమెందుకు నాన్నగారూ అనుకున్నాను. నాకు అవసరమయినప్పుడు లోపలినుంచే స్మరణ ఇచ్చేవారు. నీగురించి చాడీలు చెప్తున్నారు అని అడిగేవారు. ఏమో నాకు తెలీదు నాన్నగారూ అనేదాన్ని. నేను ఎప్పుడూ అందరి క్షేమం కోరుకుంటాను, అయినా నా మనస్సు మీకు తెలీదా అని లోపల అనుకున్నాను. నాన్నగారు నీ మనస్సు నాకు తెలుసమ్మా అనేవారు. నిన్ను అందరూ అపార్థం చేసుకుంటున్నారు అన్నారు.

నాన్నగారు ఇల్లుకట్టుకుంటున్నారు అని భక్తులు చెబితే తెలిసింది. చాలా సంతోషం కలిగింది. నాన్నగారూ మాఇల్లు పడిపోయేలా ఉంది అని మనసులో అనుకున్నాను. అంతా తండ్రిదయ. నాకు మూడు నెలల్లో ఇల్లు ఏర్పాటు చేసారు. అప్పుడు నా దగ్గర పైసా లేదు. ఎలా ఆయిపోయిందో అంతా తండ్రిదయ. సమస్యలు లేనప్పుడు ఎంతో తేలికగా ఉండేది. నాన్నగారి ఇంటిలో సమస్యలు చెప్పి ఇబ్భంది పెట్టిన సంఘటనలు ఉన్నాయి. నాన్నగారూ నేను తట్టుకోలేక పొతున్నాను అని చెబితే వెంటనే తేలిక చేసేవారు.

నాన్నగారు వైజాగ్ వెళ్ళినప్పుడు, నేనూ వైజాగ్ వెళ్ళాను. నాన్నగారు నన్ను ఎలా ఉన్నావు అని పలకరించారు. మీదయవల్ల బానే ఉన్నాను. ఇంట్లో వాళ్ళవల్ల సమస్యలు వస్తున్నాయి, దుఃఖం వస్తోంది నాన్నగారూ అన్నాను. నువ్వు ఏమీ పట్టించుకోకు అన్నారు.

నాకు నాన్నగారి ఇంటిదగ్గరకు వెళ్ళే అర్హతలేదు కూడా లేదు. అలాంటిది నన్ను అమ్మా ఇలా రా అని, సోపాలో కూర్చో అని ఆదరించేవారు. అలాంటి దయగల తండ్రి ఎవరు ఉంటారు? నాన్నగారు తప్ప. తండ్రీ, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆస్థితిలోకి నన్ను తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తూంటే, నేను ఏవో కోరికలు కోరుకుంటున్నాను. అయినా నన్ను వదలకుండా దయ చూపిస్తున్నారు. ఆయనే నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నారు. లోపలనుంచి గైడెన్స్ ఇచ్చి నడిపిస్తున్నారు.

నాన్నగారు కాశీ వెళ్తుంటే నేనూ వెళ్ళాను. కాశీ వెళ్ళాలనే ఆలోచన నాకు ముందు లేదు. తండ్రిదయవలన వెళ్ళాను. నాకు నాన్నగారి దర్శనం రెండు రోజులు దొరకలేదు. చాలా బాధ పడ్ఢాను. నేనేమయినా కాశీ వస్తానని చెప్పానా? మీ దర్శనం లేకపోతే నాకు శాంతి లేదు అని నాన్నగారి గుమ్మం దగ్గర కూర్చున్నాను. నాన్నగారు రెస్ట్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయారు అన్నారు భక్తులు. కానీ నాకు అక్కడనుంచి కదలాలనిపించలేదు. మనసులో నాన్నగారూ, నాన్నగారూ అని స్మరించుకుంటుంటే, తలుపు తీసుకుని ఆయన దర్శనం ఇచ్చారు. నాకు సంతోషం కలిగింది. నాన్నగారు హృదయంమీద చేయి వేసుకొని మీ నలుగురూ కాశీ వచ్చారమ్మా! నాకు సంతోషంగా ఉందమ్మా! అన్నారు. మా నలుగురినీ ఎప్పుడూ విడిచిపెట్టద్దు అని మనసులో కోరుకునేదాన్ని. ఏమైనా సంఘటనలు ఎదురైనప్పుడు మనస్సు కదులుతుంది. అప్పుడు నాన్న, నాన్న అనుకుంటే దాని వేగం తగ్గుతుంది. నా దృష్టిలో నాన్న, నాన్న అనుకోవడమే సాధన. నాకు ఇంకేమీ తెలియదు. 

ఒకసారి నాకు ఉపవాసం ఉండాలనిపించింది. ఉపవాసంతో నాన్నగారి ఎదురుగా కూర్చున్నాను. ఎందుకమ్మా శవాలముఖాలు వేసుకుని కోంచెం మజ్జిగ అన్నం తినవచ్చుకదా అన్నారు. ఆ తరువాత ఎప్పుడూ నేను ఉపవాసం చెయ్యలేదు. ఒక్కసారి చేస్తేనే అలా జరిగింది. నాన్నకి దయ తప్ప ఇంకోటి తెలియదు.

నాన్నగారు ఒకసారి నా ముఖం వంక చూస్తూ, మందుతాగే వాళ్ళకంటే సిగరెట్ త్రాగేవారు తొందరగా చనిపోతారని చెప్పారు. అలా చెప్పిన నాలుగు నెలలకి నా భర్త చనిపోయారు. తండ్రికి తెలియనిది ఏముంది? ఆయన చనిపోతారని నాన్నగారికి ముందే తెలిసింది. తరువాత నాన్నగారు అమ్మా అని ఎక్కువగా పలకరిస్తూ ఉండేవారు. నాన్నగారు ఎందుకు నాతో ఎక్కువగా మాట్లాడుతున్నారు అనుకునేదాన్ని. నాకు శాంతిని, శక్తిని ఇవ్వటానికే అలా ఎక్కువగా మాట్లాడుతున్నారని తరువాత అర్థమయింది. నాన్నగారు చెరువులో అనేక రేవులు ఉంటాయి, ఏ రేవులోంచి వెళ్ళినా నీళ్ళు దొరుకుతాయి అన్నారు. ఆ మాట నా హృదయానికి తాకింది. ఆయన అందరి హృదయాలను గమనించి ప్రవచనాలు చెబుతారు అని అనిపించింది.

ఒకసారి ఇంట్లో ధనియాలు కొనే పరిస్థితి కూడా లేదు. మా పరిస్థితి చూసిన ఒక భక్తుడు కందిపప్పు, మినప్పప్పు ఇంకా అన్ని సరుకులూ కొనుక్కొచ్చి పెరటి గుమ్మంలోంచి వచ్చి సైలెంట్ గా పెట్టివెళ్ళిపోయారు. ఇంకోభక్తుడు నూనె, బెల్లం లాంటి సరుకులు తెచ్చి వీధిగుమ్మంలోంచి పెట్టి వెళ్ళిపోయారు. 3,4 సం॥ రాల పాటు ఎంతమంది తిన్నా ఆ సరుకులు తరగలేదు. ఇదంతా నాన్నదయ కాకపోతే ఎవరు పెడతారు అనుకున్నాను. ఆరోజు నుండి ఇప్పటివరకూ ఏ లోటూ రాలేదు. నాన్నగారు కష్టాలు వస్తే పెరటి గుమ్మంలోంచీ, వీధిగుమ్మంలోంచీ వచ్చేస్తాయనేవారు. అలాగ నాకు కష్టం వస్తే, రెండు గుమ్మాలు నుంచీ అవసరమైనవన్నీ పంపించేసారు.

నాభర్త పోయాకా నాన్నగారిని ఒకసారి అడిగాను. మిమ్మల్ని చూడడానికి ఎప్పుడైనా రావచ్చా అని. నీకు ఎప్పుడు రావాలంటే అప్పుడు 3 గం.కి రా అన్నారు. నేను ఇంట్లో సమస్యల వల్ల ఒకసారి 1గం. కే వెళ్ళాను. 1గం.కే వచ్చేసారని భక్తులు తిట్టారు. అప్పుడు నాన్మగారు 1.30 కి తలుపు తీసుకొని బయటకు వచ్చారు. ఏమ్మా ఇలారా! వచ్చి కూర్చో అన్నారు. వివరాలు అన్నీ అడిగారు. అన్నీ మీకు తెలుసు కదా నాన్నగారూ, నాకు మీ పాదాల మీద భక్తి చాలు నాన్నగారూ అని ఆయన చేతులు పట్టేసుకున్నాను. నువ్వు ఏ గొడవలూ పట్టించుకోకమ్మా అని ఓదార్చారు. ఆయన దగ్గరకి ఏడుస్తూ రావటం, ఇంటికి వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్ళటం. ఇంటికి వెళ్ళాకా అన్నీ మరిచిపోయేదాన్ని. నేను వెళ్ళనిరోజున మీ అక్క రాలేదా అని ఎవరినైనా అడిగేవారు. నాకు ఎవరో చెప్పేవారు. అదివిన్నాక రాత్రి నాకు నిద్రపట్టేది కాదు. ఎప్పుడు ఆయనదగ్గరకు వెళ్ళిపోదామా అనుకునేదాన్ని. తీరా నాన్నగారి దగ్గరకు వెళ్ళాకా ఆయన నా వంక చూసేవారు కాదు. నాతో మాట్లాడేవారు కాదు. అయినా ఆయనదగ్గరకు రావటంపట్ల ఇష్టం తగ్గేదికాదు.

నాన్నగారూ మీ పాదాలు తాకి నమస్కారం చేసుకోవాలని ఉంది అన్నాను ఒకసారి. ఎందుకమ్మా అవసరం లేదు అంటూనే, పాదాలు ముందుకు చాపి అవకాశం ఇచ్చారు. జ్ఞాని పాదాలు తాకితే వారికి వేడి మంటలు వస్తాయని భక్తులు చెప్పారు. అప్పట్నించీ దూరంనుంచే పాదాలకి నమస్కారం చేసుకునేదాన్ని.

No comments:

Post a Comment