Wednesday, September 2, 2020

“ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః” - (By పద్మజ గారు, నర్సాపురం)


మొదటి సారి శ్రీ నాన్నగారిని దర్భరేవు ప్రవచనంలో దర్శించాను. స్వచ్ఛతకు మారుపేరైన శ్వేత వర్ణపు దుస్తులు ధరించిన దివ్య పురుషోత్తములు సద్గురు ప్రవచనపు వేదిక మీద ఆశీనులైనారు. సభంతా శాంతి ఆవరించింది. అటువంటి శాంతిని గతంలో ఎన్నడూ అనుభవించి ఎరుగను. స్వరూప సుఖాన్ని అనుభవింప చేసారు. ప్రవచనం అంతా నన్ను నేను మరచిపోయి ఆస్వాదిస్తున్నాను. అప్పుడు నా మనస్సు తోటి, బుధ్ధి తోటి నిర్ణయించుకోవటం లేదు.గురువుగారు స్ఫురింప జేస్తారు. ఇటువంటి అనుగ్రహ భాషణములు మనకెవరు చెపుతారు? ఇటువంటి గురుదేవునకు నమస్కరిచటం, పాదాభివందనం చేయటం కాదు, నా చర్మంతో చెప్పులు కుట్టించినా తక్కువే అవుతుందని స్ఫురింప జేసారు. ప్రవచనం అయిన తరువాత చాలాసేపు తపింప చేసి చివరకు దర్శనం ఇచ్చారు. నా ప్రమేయం లేకుండా సద్గురు పాదాల చెంత మోకరిల్లి పోయాను.నా పేరు అడిగి, “అమ్మా! పద్మజ! మీ ఇంటికి వస్తానమ్మా” అన్నారు. అప్పుడు స్ఫురించలేదు, తరువాత స్ఫురించింది, మా ఇంటికి అంటే మా హృదయంలో వస్తాను అన్నారని.


ఒకసారి అరుణాచలంలో శ్రీనాన్నగారితో రమణాశ్రమానికి వెళ్లాము. శ్రీ నాన్నగారు మాతృభూతేశ్వర ఆలయంలో కూర్చుంటే ఆయనకు ఎదురుగా కూర్చున్నాను. అప్పుడు శ్రీ నాన్నగారు చాలా ప్రసన్న వదనంతో,”దారిలో అడ్డంగా లే, వెనక్కు వెళ్లు, దారిలో అడ్డంగా లే, వెనక్కు వెళ్లు” అన్నారు. వెనక్కు జరిగి కూర్చోవటం కూర్చున్నాను కాని, శంతిలో కూరుకు పొయాను. కారణం, దేహం ప్రరబ్ధం ప్రకారం కూర్చుంది, వెనక్కి జరిగింది, కాని శ్రీ నాన్నగారి ప్రతి మాట కూడా దేహానికే కాదు అది మనస్సును మూలంలోకి పంపటానికి సహకరిస్తుందని స్ఫురింపజేసారు. అంటే లోపల ఉన్న వాసనలను, బలహీనతలను సంస్కారములను, గుణాలను అడ్డం తొలగమని శాసించి శాంతి రుచి చూపించారు.ఆ నాటినుండి నా మనస్సు ఆ శాంతిని అనుభవించడానికి అంతర్లీనంగా నా ప్రమేయం లేకుండా ప్రయత్నం చేస్తూనేవుంది. కారణం దర్భరేవులో ఆ మొదటి దర్శనంలోనే సద్గురు శ్రీ నాన్నగరి చూపులో ఉన్న శాంతిని, కాంతిని, ప్రేమను, దయను ఆస్వాదింపజేసి తద్వారా నా మనస్సు దానికి తెలియకుండా దాని చావుకి అదే ముహూర్తం పెట్టుకునేలా చేసారు నా తండ్రి.

ఒక సారి అరుగు మీదకు వెళ్లి కూర్చునప్పుడు శ్రీ నాన్నగారిని నామం ఇమ్మని అడిగాను. “నీకు ఏ నామం కావాలి?” అని అడిగారు.

“మీ నామం ఇవ్వండి” అని అడిగాను. అప్పుడు “ ఓం నమో భగవతే శ్రీ రమణాయ” అని నామం ఇచ్చారు.

నాకు ఆశ్చర్యం కలిగింది. కారణం “ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః” అని నామం ఇస్తారనుకుంటే, ఇదే నా నామం అని పలికారు శ్రీ నాన్నగారు. ఈ విధంగా సద్గురు శ్రీ నాన్నగారు భగవాన్ రమణ మహర్షి అవతారమేనని నాకు వ్యక్తమయి స్ఫురింపజేసారు.

No comments:

Post a Comment