Saturday, September 26, 2020

"ఓం ఆచార్య దేవో భవ!" - (డా.ఉష గారు)

నాకు అరుణాచలం వెళ్ళాలని అనిపించినప్పుడల్లా వెళ్ళిపోతూ ఉండేదాన్ని. అలాంటి తపనతో ఒకసారి అరుణాచలం వెళ్ళాను.ఆరోజు అర్థరాత్రి గం.12.30 కి ఆంధ్రాఆశ్రమం చేరుకునేసరికి, గిరిప్రదక్షిణ చేసివచ్చిన భక్తులు బయట వరండాలో కూర్చుని ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి నవ్వుతూ, వచ్చేసావా? మేము సంశయంతో ఉన్నాము ఉష వస్తుందా? రాదా? అని. ఎందుకంటే నాన్నగారు వస్తున్నారని మేమంతా వచ్చాము. కానీ ఆఖరి క్షణంలో ఆయన ప్రయాణం ఆగిపోయింది. నాన్నగారు మధ్యాహ్నానికి ఇక్కడికి చేరుకుంటే, నువ్వు అర్థరాత్రికి చేరతావు కదా ఎప్పుడూ! మరి ఇప్పుడు ఆయన రావట్లేదు కాబట్టి నువ్వు ఏంచేస్తావా అని చూస్తున్నాం అన్నారు. అప్పుడు నేను, నాన్నగారు రావలసి ఉంది కాబట్టి నేను బయలుదేరి వచ్చేసాను. ఆయన రావడం కేన్సిల్ అయినా, నాకు ఆయనతో ఉండటం ముఖ్యం కాబట్టి, ఆయన ఎక్కడుంటే అక్కడికి నేనూ వెళ్తాను అని నవ్వుతూ సమాదానం చెప్పాను. ఆ తరువాత లోపలికి వెళ్ళి మేనేజరుగారి భార్యని, నాన్నగారు ఎందుకు రాలేదు? జిన్నూరు నుంచి బయలుదేరారా? అని అడిగాను. ఆవిడ, నాన్నగారు చెన్నై వరకూ వచ్చి ట్రైన్ దిగారు. కానీ అక్కడ రంగరాజు గారు ఆయనని కలిసి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా! మనం కోయంబత్తూరు వెళదాము అక్కడ చల్లగా ఉంటుంది. ఒకవారం ఉన్న తరువాత కావాలంటే అప్పుడు అరుణాచలం వెళుదురుగాని అంటూ ఫ్లైట్ లో కోయంబత్తూరు తీసుకెళ్ళిపోయారు అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళారు ఆంటీ, కోయంబత్తూరు లో రంగరాజుగారి ఇంటికా అని అడిగాను. లేదు హోటల్ పేరు గణేష్ , విఘ్నేష్ లాంటిది ఏదో చెప్పినట్టు గుర్తు అన్నారు.

ఆరాత్రికి అక్కడే ఉండి, తెల్లవారేకా మళ్ళీ చిదంబరం వెళ్ళాను. అక్కడనుండి మధ్యాహ్నం కేరళ వెళ్ళే స్నేహితులతో కలిసి ట్రిచ్ఛీ (తిరుచనాపల్లి) వరకూ ప్రయాణం చేసి, అక్కడ్నించి ఒంటరిగా కోయంబత్తూరు వెళ్ళే ట్రైన్ ఎక్కాను. కోయంబత్తూరులో అర్థరాత్రి 1గంటకి ట్రైన్ దిగాను. దిగాక ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎక్కడకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ నెమ్మదిగా నడుచుకుంటూ ఆటో వద్ధకు వెళ్ళాను. ఆటో అతనితో హోటల్... అని ఒక్క క్షణం ఆగి (హోటల్ పేరు తెలియక) సంశయంగా వినాయక్ అన్నాను. వెంటనే అతను 20 రూపాయలు అన్నాడు. అయితే దగ్గరే అయిఉంటుందని 10 రూపాయలు అన్నాను. అప్పుడు తమిళంలో టైమ్ ఎంతయిందో చూడమ్మా అన్నాడు. అందుకు దగ్గరే అయిఉంటుందని నమ్మకం కుదిరి ఆటో ఎక్కాను. ఒక సందు తిప్పి 2 నిముషాలలో హోటల్ దగ్గర దించేసాడు.

అక్కడ రిసెప్షన్ లో నిద్రపోతున్న వ్యక్తిని లేపి, ఆంధ్రానుంచి నాన్నగారు పేరుమీద గురువుగారు ఎవరైనా వచ్చారా నిన్న? అని అడిగితే రాలేదన్నాడు. పైకి గురువులాగ ఏమీ కనిపించరు, తెల్లబట్టలు వేసుకుని సాధాగా ఉంటారు, అలాంటివారు ఎవరైనా వచ్చారా అంటే రాలేదు అన్నాడు. ఒక్కక్షణం, నాన్నగారు ఇక్కడ లేకపోతే ఏం చేయాలా అని అలోచన వచ్చింది. వెంటనే గుర్తుకొచ్చి రంగరాజు గారి పేరుమీద ఎవరైనా రూమ్ బుక్ చేసారా అని అడిగాను. అతను రిజిస్టర్ తీసిచూసి రెండు గదులు 401, 402 బుక్ చేసారు అని చెప్పాడు. అది విన్న వెంటనే నాకు ప్రాణం లేచివచ్చినట్టు అయింది.

నాన్నగారిది ఏ గది అయిఉంటుందో అనుకుంటూ(ఆ సమయంలో ఆయన్ని నిద్ర లేపడం బాగోదని) సందేహంగా 402 తలుపు తట్టాను. అదృష్టవశాత్తూ రంగరాజుగారు ఉన్న రూము అది. తలుపు తీసాకా ఆయన నన్ను చూసి అవాక్కయిపోయారు. నీకు ఎలా తెలిసింది మేము ఇక్కడ ఉన్నటు? గురువుగారికి ఈ విషయం తెలిస్తే ఏమంటారో అని ఆయన కంగారుపడ్డారు. మీరు కంగారు పడకండి నాన్నగారికి తెలియకుండా నేను రాలేను కదా అన్నాను. ఆయనకి సర్థిచెప్పి, నేను ఆ రూంలో నేలమీద పడుకున్నాను. ఉదయం 5 గంటలకి రంగరాజుగారు నాన్నగారిని లేపాలి. కానీ నాన్నగారే ముందుగా తలుపు తట్టి రంగరాజుగారు తెరవగానే, ఉష వచ్చిందా? అని అడిగారు. రంగరాజుగారు, అయితే ఉష మీకు చెప్పే వచ్చిందా! అనవసరంగా నేను కంగారుపడ్డాను గురుదేవా! అన్నారు. ఆ మాటలకి నాకు మెలుకువ వచ్చి లేచాను. నాన్నగారు లోపలికి వచ్చి అమ్మా ఉషా టైముకి బానే వచ్చావు. 6 గంటలకి మనం "కాలడి" వెళ్తున్నాం అందుకే రప్పించాను అన్నారు.

ఉదయం 6 గంటలకి నాన్నగారు, రంగరాజుగారు, నేను కారులో బయలుదేరి కాలడి వెళ్ళాము. అంతకు ముందు రెండు రాత్రులు ప్రయాణాలతో నిద్రలేకపోవడం వల్ల కారులో నాకు విపరీతమైన నిద్ర వచ్చేస్తోంది. కేరళలో ప్రవేశించింది మొదలు నాన్నగారు నాతో, ఉషా నిద్రపోకమ్మా! చుట్టూ చూడు మనం కేరళాలో ఉన్నాం, నీకు జ్ఞాపకం వస్తోందా ? అన్నారు. నాకు ఆశ్చర్యమేసింది నేను కేరళ రావటం అదే మొదటిసారి! నాన్నగారి మాటల్లో ఏదైనా అంతరార్థం ఉందేమో, అని ఆలోచిస్తూ మౌనంగా ఉన్నాను. ఆయన వెనక్కి తిరిగి మళ్ళీ అమ్మా నీకు జ్ఞాపకం వస్తోందా కేరళ? అన్నారు. నేనెప్పుడూ ఇక్కడికి రాలేదు కదా నాన్నగారూ అన్నాను. అదేంటమ్మా నువ్వు కేరళా రాకపోవడం ఏంటి? ఇది మన ప్రాంతం, నిద్రపోకు చుట్టూ చూస్తూ ఉండు అన్నారు. అలా కాలడి వెళ్ళాము. కాలడిలో పూర్ణానది దగ్గరకు తీసుకువెళ్ళారు. శంకరుల తల్లి ఆర్యాంబ, శంకరులు స్నానం చేసిన నది అది. నన్ను ఒడ్డునే ఉండమని నాన్నగారు, రంగరాజు గారు ఆ నదిలో స్నానం చేసారు.

ఆచార్యుల వారిని నదిలో మొసలి ఎక్కడయితే పట్టుకుందో, ఆ ప్రదేశం వరకూ నాన్నగారు నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళి, అమ్మా ఉషా! ఆచార్యుల వారిని దొంగమొసలి పట్టుకుంది చూడు ఇక్కడేనమ్మా! అది దొంగ మొసలి, నిజమైన మొసలి కాదమ్మా! సన్యాసం తీసుకోవడానికి ఇంకో రకంగా అయితే తల్లి ఒప్పుకోదని, తల్లిని భయపెట్టి ఒప్పించాడు. కొడుకుని మొసలి పట్టుకుందని తెలియగానే ఆర్యాంబ పరిగెత్తుకుంటూ వస్తుంది. శంకరులు తల్లితో, నువ్వు కనక ఒప్పుకోకపోతే ఈ మొసలి చంపేస్తుంది. నువ్వు ఒప్పుకుంటే వదిలేస్తుంది అంటారు. అప్పుడు ఆర్యాంబ వద్దు, వద్దు సన్యాసం తీసుకోవడానికి నేను ఒప్పుకుంటాను, నాకొడుకుని ఏం చేయవద్దు అంటుంది. అప్పుడు మొసలి విడిచిపెడుతుంది. ఈ కథంతా చెప్పి నాన్నగారు బయటకు వచ్చి నవ్వుకుంటూ, దొంగ మొసలమ్మా! సృష్టించాడు సన్యాసం పుచ్చుకోవడానికి! అన్నారు. ఆ ప్రాంతం అంతా శంకరాచార్యులు తిరిగినట్టు తిరిగేస్తూ, ఆచార్యుల వారు తల్లితో ఎలా ఉండేవారో అలా అయిపోతూ చిన్నపిల్లాడిలా సంబరపడిపోతూ ఆప్రాంతం అంతా సంచరించారు. ఆసమయంలో నాకు నాన్నగారిని చూస్తే ఆచార్యులవారే అనిపించింది!

ఆర్యాంబ నివసించిన ఇంటికి తీసుకువెళ్ళి, ఆర్యాంబ గురించి అన్నీ వివరించి చెప్పారు. ఆచార్యుల వారి తల్లి చివరి దశలో ఉందని గ్రహించి, అప్పటికప్పుడు బయలుదేరి కాలడి వస్తారు. తల్లిని తరింపచేయడానికి ఈశ్వరుడిని ప్రత్యక్షం చేస్తారు. కానీ, ఆర్యాంబ నాకు ఆ మూర్తిపై ధ్యాస నిలవడం లేదు, నేను జీవితమంతా ఆరాధించిన విష్ణుమూర్తిని దర్శింపచేయమంటుంది. అప్పుడు విష్ణుమూర్తిని దర్శింపచేస్తారు. దాంతో ఆమె తరించి ప్రాణం వదిలేస్తుంది. ఆచార్యులవారు సన్యాసం తీసుకున్న కారణంగా, తల్లిని దహనం చేయటానికి ఊరి జనం ఒప్పుకోరు. అప్పుడు ఆయన, నేను నా తల్లికి మాట ఇచ్చాను. మరణకాలంలో తన దగ్గరకు రావాలని, నా చేతుల్తో దహనం చేయాలని ఆమె కోరుకుంది! అందుచేత నేనే దహనం చేస్తాను అంటారు. అయినా ఊరి జనం సహకరించరు. ఊరివాళ్ళు నిప్పు కూడా ఇవ్వకపోతే, ఆచార్యులవారే స్వయంగా అగ్నిని సృష్టించి తల్లి దేహాన్ని దహనం చేస్తారు! తరువాత, ఆర్యాంబ పూజించిన కృష్ణుడి గుడికి కూడా తీసుకువెళ్ళారు. అమ్మా! కృష్ణుడిని చూడమ్మా! ఎంత అందంగా ఉన్నాడో...! చూడు... చూడు... ఎంత ముద్దుగా ఉన్నాడో...! అన్నారు. నాకు ఆయన చెప్పినట్టు అక్కడ ఏం కనిపించలేదు. చిన్న నల్లటి విగ్రహం మాత్రమే కనిపించింది. దన్నం పెట్టుకుని బయటకు వచ్చేసాకా బలే అందంగా ఉన్నాడు కదమ్మా కృష్ణుడు అన్నారు మళ్ళీ! అప్పుడు నేను మనసులో అనుకున్నాను, సృష్టిలో ఏ అందమయినా నాకు నీ తరువాతే కదా! ఇంత స్వచ్ఛత, అమాయకత్వం, ప్రేమ, పవిత్రత నీలో చూసాకా, నాకు నిజంగా కృష్ణుడు కనిపించినా నీ అందం ఆయనలో కనపడుతుందా? అనుకున్నాను.

ఆచార్యులవారు బోధించిన ప్రదేశాన్ని, ఆయన సంచరించిన ప్రదేశాలను అన్నీ చూపిస్తూ, ఏకదాటిగా శంకరుల గురించి వివరించి చెప్పారు. ఆచార్యుల వారు సబ్జక్ట్ కు ప్రథమస్థానం ఇచ్చారు అమ్మా! ఈ గుడులూ, పూజలూ, అభిషేకాలూ అవన్నీ రెండోపక్షం అన్నారు. మరుగున పడుతున్న ఆధ్యాత్మిక సిద్ధాంతాలను వెలుగులోకి తీసుకువచ్చి, వాటిని సరయిన రీతిలో ప్రజలకు అందించడానికే ఆయన జన్మ తీసుకున్నారు. సౌందర్యలహరి, భజగోవిందం, వివేకచూడామణి లాంటివే కాకుండా, భాష్యాలు కూడా వ్రాసారు. భక్తి పరంగా, జ్ఞాన పరంగా ఎంతో బోధచేస్తూ ప్రచారం చేసారు. కానీ ఆచార్యుడు ఆచార్యుడేనమ్మా! అంటే, మనకి అద్వైత బోధని ఇంత స్పస్టంగా అందజేసిన వారిలో ప్రముఖులు ఆయన! టీచింగ్ యొక్క ప్రాముఖ్యతని ఆయనే తెలియజేసారమ్మా! ఏదో తెలియడం వల్ల పొందేది కాదు అది. అసలు ముందు ఆత్మ విద్య వంటబట్టాలి. అప్పుడు నువ్వు దానిని అనుష్ఠానం చేయగలుగుతావు. అది నీకు అర్థమే కాకపోతే అనుష్ఠానం ఎలా చేయగలుగుతావు? అందుచేత అది అర్థమై ఆచరించాలి అంటే, దానిని ఎవరైనా అర్థమయ్యేలా చెప్పాలి. అలా చెప్పేవారిలో ఆచార్యుల వారిని మించినవారు లేరమ్మా!

భారతదేశం మొత్తం ఆయన కాలి నడకన వెళ్ళారమ్మా! భారతదేశం నలుమూలలా నాలుగు పీఠాలు స్థాపించారు. అని చెప్పి, వివేకచూడామణి గురించి, శంకరుల అద్వైతం గురించి చెబుతూ, శంకర శంకర, శంకర, శంకర, శంకర, శంకర.... అంటూ ఆపకుండా స్మరించడం మొదలు పెట్టారు. అలా మౌనంలోకి వెళ్ళిపోయి, ఒక చెయ్యి పైకి ఎత్తేసేవారు అనుగ్రహిస్తున్నట్టు! అదంతా చూసిన నాకు, ఆయన ఆచార్యులవారిలా అయిపోయి మన లోకంలోనే లేనట్టుగా అనిపించింది. ఆ తరువాత అమ్మా! ఆచార్యులవారి బోధని మనం అర్థంచేసుకుని, దానిని జీర్ణించుకుని, ఇతరులకి అర్థమయ్యేలా మనం బోధించగలిగితే, అంతకన్నా ఆచార్యులవారి ఋణం మనం ఎలా తీర్చుకోగలం? ఇప్పుడు ఆచార్యులవారు మనల్ని అనుగ్రహించారమ్మా! అంటూ, మళ్ళీ శంకర, శంకర,శంకర, శంకర... అంటూ, స్మరిస్తూ "ద గ్రేట్ ఆచార్య, దగ్రేట్ ఆచార్య" అనటం, కళ్ళు మూసేసుకొని మధ్య, మధ్యలో చెయ్యి పైకెత్తేయడం! ఇలా అక్కడున్నంత సమయం ఎక్కువగా శంకరుల ధ్యాసతోనే గడిపారు.

అక్కడ మేము రెండు రోజులు గడిపి మళ్ళీ తిరిగి కోయంబత్తూరు వచ్చాము. వచ్చాకా కూడా శంకరుల గురించి, ఆయన అద్వైతం గురించి వివరిస్తూనే ఉన్నారు. అప్పుడు కూడా ఆచార్యులవారు అనుగ్రహించేసారమ్మా! ఆచార్యులవారి అనుగ్రహం మనమీద నిండా ఉందమ్మా! " "దగ్రేట్ ఆచార్య, దగ్రేట్ ఆచార్య" అంటూనే ఉన్నారు. ఎంతమ్మా చిన్న వయసు, ఆయన జీవిత కాలం 32 ఏళ్ళు. అంత తక్కువ కాలంలోనే ఉత్కృష్టమైన పని చేసాడమ్మా! అన్నారు. అక్కడ అలా 3 రోజులు గడిపిన తరువాత నేను కాలేజ్ కి తిరిగి వెళ్ళిపోయాను.

అప్పటినుంచీ, రెండున్నర సం॥ ల వరకూ వీలయినప్పుడల్లా, శని, ఆది వారాలలో అరుణాచలం వెళుతూ ఉండేదాన్ని. అలా వెళ్ళినప్పుడు అక్కడ రమణాశ్రమంలో భగవాన్ సమాధి చుట్టూ తిరుగుతూ ఉంటే, ఆంధ్రానుంచి వచ్చిన ఒక భక్తురాలు మీతో మాట్లాడాలంటూ, నా చేయి పట్టుకొని బయటకు తీసుకొచ్చారు. ఉష అంటే మీరేనా అంటే, అవును అన్నాను. మేము ఈమధ్యే మొదటిసారిగా నాన్నగారి దర్శనం చేసుకున్నాము. జిన్నూరులో ఆయన ఇంటి అరుగుమీద మాతో పాటు ఇద్దరు, ముగ్గురు భక్తులు కూర్చుని ఉన్నారు. అప్పుడు నాన్నగారు కళ్ళు మూసుకొని, చాలాసేపు ఆచార్యులవారిని తలపెట్టుకుంటున్నారు. ఆతరువాత నలుగురి పేర్లు చెప్పారు. అందులో లక్ష్మి పూర్వజన్మలో భగవాన్ చెల్లెలు, హైమ జ్ఞానానికి సర్టిఫికెట్ తీసుకుని వచ్చింది, పార్వతి గారు పండుతున్న పండు, ఉష ఆచార్యులవారి సంపద అని ఈ నాలుగు పేర్లు చెప్పారు. ఆ ఉష మీరేనా? అని అడిగారు. ఉషలు చాలామంది ఉన్నారమ్మా, నేను కాకపోవచ్చు అన్నాను. డాక్టరు చదివేది మీరేనా? అంటే అవును అన్నాను. డాక్టర్. ఉష చిదంబరంలో చదువుకుంటోంది అని చెప్పారండి అన్నారు ఆమె. మీరు ఆచార్యుల వారి సంపద అంట! మీరు మాకు ఏమన్నా చెపుతారా? అని అడిగారు. అదేంలేదమ్మా! ఆయన ఏ ఉద్ధేశ్యంతో చెప్పారో, దానిలో అంతరార్థం ఏమిటో మనకు తెలీదు. నేను ఊరికే రెండు రోజులు ఉందామని అరుణాచలం వచ్చాను అంతే! మీరు జిన్నూరు నాన్నగారి దగ్గరికి వెళుతూ ఉండండి, అక్కడ వారానికో మీటింగ్ జరుగుతుంది, చాలా సబ్జక్ట్ చెపుతారు. "నాన్నగారు స్వయంగా ఆచార్యులు" అని చెప్పాను.

No comments:

Post a Comment