Sunday, March 27, 2022

"పేదల దేవుడు, శ్రీ నాన్నగారు" - (By పొలమూరు రాజేశ్వరి గారు)

నాకు చిన్నప్పటి నుండి గుడికి వెళితే దేవుడి పాదాలు గట్టిగా పట్టుకోవాలని కోరికగా ఉండేది. గుడిలో మనల్ని ఆ పాదాలని తాకనివ్వరు కదా అని చాలా బాధ అనిపించేది. నాకు చిన్నప్పటి నుండి రామాయణం చదవటం అలవాటు ఉండేది. అందులో జటాయువు, శబరి పాత్రలని చాలా ఇష్టపడేదాన్ని. స్కూల్లో మాకు రామకృష్ణుడి గురించి చెప్పేవారు. అలా నాకు తెలియకుండానే రామకృష్ణుడు, శారదామాత అంటే ఇష్టం ఏర్పడింది. నా వివాహం అయిన తరువాత మా అత్తగారి ఇంట్లో రామకృష్ణుడు, శారదా మాత, వివేకానందుడు ముగ్గురు కలిసి ఉన్న ఫోటో గోడకు తగిలించి ఉండేది.

ఒకసారి నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో కొంత మందితో కలిసి ఒక కొండ పక్క నుండి వెళ్తున్నాను. అక్కడ అరుపులు కేకలు వినిపించేసరికి అందరూ భయంతో పారిపోతున్నారు. ఆ కలలో నేను చాలా చిన్న పిల్లలా ఉన్నాను. ఎవరో ఒక తాతయ్య నన్ను మామిడి చెట్టు దగ్గరకు తీసుకు వెళ్ళి కూర్చోబెట్టి ఆయన కూడా నా పక్కనే కూర్చున్నారు. మీకు ఆ అరుపులు వినిపిస్తూ ఉంటే భయం వేయటం లేదా తాతయ్యా అని అడిగాను. ఆప్పుడు ఆయన లేదమ్మా అవి మన దగ్గరకు రాలేవు అని చెప్పారు. ఆ స్వప్నం సమాప్తం అయ్యింది.

ఆగర్రు లో సీతమ్మగారు అని నాన్నగారి భక్తురాలు ఉండేవారు. ఒకసారి సీతమ్మగారితో, మరియు మరికొంతమంది భక్తులు, బంధువులతో కలిసి మొదటిసారిగ జిన్నూరు వెళ్ళాను. నాన్నగారిని చూడగానే ఎక్కడో చూసాను అనిపించింది. నాన్నగారు తదేకంగా నావైపు చూస్తుంటే నేను తలవంచుకున్నాను. ఈ అమ్మాయి ఎవరు అని నాన్నగారు సీతమ్మ గారిని అడిగారు. ఈ అమ్మాయికి రామకృష్ణుడు కావాలంట నాన్నగారు అని ఆమె చెప్పారు. ఆ సందర్బాన్ని అనుసరించి నాన్నగారికి, నాకు మధ్య సంభాషణ ఈ విధంగా కొనసాగింది :

నాన్నగారు : ఏమ్మా రామకృష్ణుడు కావాలా నీకు? ఎందుకు రామకృష్ణుడు కావాలి అనుకుంటున్నావు? అని అడిగారు.

రామకృష్ణులు కాళీమాతతో మాట్లాడతారు కదా! నాకు కూడా ఒకసారి కాళీమాతతో మాట్లాడాలని ఉంది. అమ్మవారిని ఏం అడుగుతాను అంటే, మంచివారిని చాలా బాధలు పెడుతున్నావు, చెడ్డ వారిని రక్షిస్తున్నావు ఇది నీకు న్యాయమా! అని అడుగుతాను. నాకు అమ్మవారు కలలో కనిపిస్తుంది. కానీ కలలో అడగలేకపోతున్నాను అన్నాను.

నాన్నగారు : నీకు రామకృష్ణుడు దొరికేస్తాడు అమ్మా అని నవ్వుతూ... నేను రెండు ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెప్పు అన్నారు.

మొదటి ప్రశ్న : బస్తాడు బియ్యంలో ఊక ఏరుకోవటం తేలికా? లేక బస్తాడు ఊకలో బియ్యం ఏరుకోవటం తేలికా? అన్నారు.

బస్తాడు బియ్యంలో ఊక ఏరుకోవడం తేలిక కదండి అన్నాను.

రెండవ ప్రశ్న : బట్టలు శరీరం కప్పుకోవడానికి కట్టుకుంటున్నారా? ఇతరులు అందరూ మీ బట్టలను చూసి మెచ్చుకోవడానికి కట్టుకుంటున్నారా?

బట్టలు శరీరం కప్పుకోవటానికే కదండి అన్నాను.

నాన్నగారు నన్ను "అరుణాచల శివ" అని ఉదయం మూడు సార్లు, సాయంత్రం మూడుసార్లు అనుకోమన్నారు. నాన్నగారికి నమస్కారం చేసుకున్నాను. వెంటనే అకారణంగా నా నేత్రాల వెంట కన్నీరు ధారగా కారింది.

నాన్నగారు అక్షరమణమాల పుస్తకం, భగవాన్ ఫోటో ఇచ్చి నిన్ను మరిచిపోను అన్నారు. ఇంటికి వచ్చిన తరువాత భగవాన్ ఫోటో చూసి, ఈ తాతయ్యకు, నాన్నగారికి సంబంధం ఏమిటి? ఈ తాతయ్యే కదా స్వప్నంలో నన్ను పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఈయనే భగవానా అనుకున్నాను. తర్వాత జిన్నూరు వెళ్ళటానికి అప్పటికి నా పిల్లలు చిన్నవాళ్ళు అవ్వటము వలన వీలుపడలేదు.

పక్క ఊరిలో నాన్నగారి ప్రవచనం జరుగుతూ ఉంటే, మా ఇంటి ప్రక్కన ఉన్నవారు నా భర్తని అడిగి నన్ను ఆ ప్రవచనానికి తీసుకువెళ్ళారు. అక్కడ నాన్నగారిని చూడగానే దేహ స్పృహ మరిచిపోయాను. ప్రవచనం అయిపోయిన తరువాత నాన్నగారు నా వైపు చూసి నవ్వి పలకరించారు. అప్పుడు నాన్నగారిని మంత్రం ఇవ్వమని అడిగాను. నీకు ఏ నామం కావాలి? అని అడిగారు. నాకు ఏది మంచిదో అది మీరు ఇవ్వండి. మీరు నాకు ఒక మాట ఇవ్వాలి అన్నాను. ఏమి మాట ఇవ్వాలమ్మా అన్నారు. నాకు కోపం ఎక్కువ అది మీరు తీసుకోవాలి అన్నాను. ఆయన నవ్వుతూ అలాగే నీ పేరులోనే ఉగ్రరూపం ఉంది. నీకు కోపాలు ఏవీ ఉండవమ్మా పోతాయి అని చెప్పి మంత్రం ఇచ్చారు. అప్పటినుండి భగవాన్ ఎక్కువగా కలలోకి వచ్చేవారు. స్వప్నంలో శివాలయం లో నుంచి వస్తూ నాకు ప్రసాదం తెచ్చి ఇచ్చేవారు. నేను పిల్లల్ని పాలకొల్లు హాస్పిటల్ కి తీసుకువెళ్లినప్పుడు, తిరిగి వస్తూ ఇంట్లో ఎవరికీ తెలియకుండా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. నాన్నగారు నన్ను చూడగానే అరుగు మీద నుండే రామ్మా అని పిలిచి, మంచినీళ్లు ఇచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చోబెట్టుకునేవారు. ఒకసారి నీకు ఏమైనా కావాలా అమ్మా అని అడిగారు. అప్పుడు నాకు తెలియకుండానే శాంతి కావాలి నాన్నగారూ అన్నాను. అది నీకు దొరుకుతుంది అన్నారు.

నేను నాన్నగారి దగ్గరకి వెళ్ళినప్పుడల్లా రెండు గంటలు కూర్చోబెట్టుకుని రామకృష్ణుడి వైభవం గురించి చెప్పేవారు. అప్పుడు నాకు తెలియకుండానే నా నేత్రాల వెంట నీరు వచ్చేది. నాన్నగారు ఒకసారి మీ ఇంటికి వస్తాను అన్నారు. మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం అవటం వలన నాన్నగారిని ఆహ్వానించే పరిస్థితులు నాకు అప్పట్లో లేవు. నా పరిస్థితి ఇలా ఉంటే నాన్నగారు వస్తాను అంటున్నారు ఏమిటి అనుకున్నాను.

ఒకసారి ఎవరో భక్తురాలు వచ్చి నాన్నగారి దగ్గరకు తీసుకెళ్ళమన్నారు. అప్పుడు నాన్నగారు నన్ను పంటలు ఎలా ఉన్నాయి? అని అడిగారు. ఈ మధ్య కొంచెం దెబ్బతిన్నాయి నాన్నగారూ, ఉమ్మడి కుటుంబంలో ఉన్న మా ఇల్లు కూడా అమ్మేశారు అని చెప్పాను. మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటమ్మా అని అడిగారు. హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అని చెప్పాను. మీరు ఎక్కడికీ వెళ్ళవద్దు, ఇప్పుడు మీరు తాటాకు ఇంట్లో ఉండాలి. పూర్తిగా మీ ప్రారబ్దం ఖర్చు అయిపోవాలి అన్నారు. నా భర్త అలా ఒప్పుకోరు నాన్నగారూ అని చెప్పి ఇంటికి వచ్చేసాను.

ఆ తర్వాత నుండి నేను ఎప్పుడు నాన్నగారి దగ్గరకు వెళ్ళినా అలా మౌనంగా చూసేవారు. నాతో ఇంతకు ముందులాగ అంత ప్రేమగా మాట్లాడటం లేదు అనిపించేది. తరువాత మేము తాటాకు ఇంట్లోకి మారవలసి వచ్చింది. ఇదంతా నాన్నగారు చేసిన పనే అని నాకు అనిపించింది. తాటాకు ఇంట్లోకి వెళ్ళిన వెంటనే సత్సంగం ప్రారంభం చేసాము. కొద్ది రోజులకు నాకు అరుణాచలం వెళ్ళాలనే కోరిక కలిగింది. చిన్న పిల్లల్ని వదిలేసి ఎలా వెళతావని చాలామంది నన్ను అడిగారు. తరువాత జిన్నూరు వెళ్ళినప్పుడు నాకు కూడా అరుణాచలం రావాలని ఉంది నాన్నగారూ అని చెప్పాను. నాన్నగారు వెంటనే మాతో నువ్వు కూడా అరుణాచలం వస్తున్నావు. వెంటనే టిక్కెట్లు తీయించుకో, నువ్వే కాదు నీకూడా ఎంతమంది వచ్చినా తీసుకురావచ్చు అన్నారు.

అరుణాచలం వెళ్ళాక నాన్నగారితో పాటు అందరము ఆంధ్ర ఆశ్రమంలో ఉన్నాము. అప్పటికి భక్తులతో నాకు పెద్దగా అనుబంధం లేదు. నాన్నగారు అరుణాచలంలో చూడవలసిన ప్రదేశాలు అన్నీ చెప్పి, నాకు తోడుగా భక్తులను పంపి అన్నీ చూపించారు. నాన్నగారు మమ్మల్ని ఒక డ్యామ్ దగ్గరికి తీసుకువెళ్ళారు. అక్కడ నీళ్లు వదిలేటప్పుడు నాన్నగారి చేత కొబ్బరికాయ కొట్టించారు. నాన్నగారు ఆ నీటిలోకి దిగిన తరువాత నీటికి నమస్కారం చేసుకుంటూ "నాకు దేవాలయాల కంటే ఇటువంటి పనులు అంటే చాలా ఇష్టం. ఈ నీటి వలన పంటలు పండి అన్ని జీవరాశులకు ఆహారం దొరుకుతుంది అన్నారు."

అరుణాచలం నుండి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే భగవాన్ అనుభూతులు విపరీతంగా కలిగేవి. మా బంధువులు అందరు నన్ను వారి గురువుల దగ్గరకు పంపించాలి అని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ నేను రాను అని చెప్పేదాన్ని. అప్పుడు ఒకసారి నా భర్త అందరితో అలా రాను అని చెబితే బావుండదు కదా! ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయి అన్నారు. నాకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా నా భర్త అన్నమాట కాదనలేక వెళదాము అనుకుంటుంటే నాకు లోపల, నా మనసు ఎప్పుడో అమ్ముడు పోయింది, ఈ శరీరానికి ఒక్కడే డ్రైవర్ ఉంటాడు, ఇద్దరు డ్రైవర్లు ఉండరు. నాకు డ్రైవర్ నా భగవానే అనిపించి నేను ఎక్కడికి రాలేను అని కఠినంగా చెప్పాను. అప్పుటినుండి అందరి ప్రయత్నాలు తగ్గాయి.

తరువాత ఒకసారి నాన్నగారి దగ్గరకి వెళ్తే అక్కడ ఉన్న నాన్నగారి భక్తులు ఎలా ఉన్నారు? అని నన్ను పలకరించారు. నాకు కలిగిన అనుభూతులు గురించి వారికి చెప్పాను. వారు ఇవి అన్నీ సిద్ధులు మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. వెంటనే నాన్నగారికి ఈ విషయం చెప్పండి అన్నారు. నేను నాన్నగారికి నాకు కలిగిన అనుభూతుల గురించి, మా బందువులు వారి గురువుల దగ్గరకి నన్ను తీసుకువెళ్ళే ప్రయత్నాల గురించి చెప్పాను. నాన్నగారు ఏమీ మాట్లాడకుండా చాలాసేపు నా కళ్ళల్లోకి చూశారు. నీ విశ్వాసానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నిన్ను తరచు జిన్నూరు రమ్మని చెప్పాను కదా! నీ కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అన్నారు. కొద్దికాలానికి నాన్నగారు మా ఇంటికి వచ్చారు. మా ఇంటి బయట వాకలి అంతా ఇసుక, మట్టి ఉండేవి. నాన్నగారు వచ్చినప్పుడు ఏమి చేయాలో అర్థంకాక నాన్నగారి పాదాలకు మట్టి అంటుకోకుండా ఉండాలని నా చీరలు అన్నీ పరిచేశాను. నాన్నగారు వచ్చి అలా చీర మీద నిలబడి అమ్మా బృందావనం వచ్చాను అన్నారు. తరువాత నాన్నగారు లోపలకి వచ్చి నా భర్త తో మాట్లాడారు. అన్ని ఆయనే స్వయంగా అడిగి మరీ చేయించుకొని నన్ను సంతృప్తి పరిచారు. కొద్దిసేపు కూర్చున్న తరువాత నాన్నగారు కారు దగ్గరికి వెళ్ళారు. నాన్నగారికి బట్టలు పెట్టలేక పోయాను అనిపించి నేను లోపలకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి నాన్నగారి చేతోలో పెట్టాను. నాన్నగారు అవి గుండెలకు హత్తుకుని ఇవి నీ దగ్గర ఉంచు అని తిరిగి ఇచ్చేసారు. అప్పుడు నేను నాన్నగారితో "ఉడత శ్రీరామచంద్రుడుకి సహాయం చేసింది కదా, ఉడత వేసిన ఇసుక రేణువులులాగే నాది కూడా ఒక ఇసుక రేణువు అనుకోండి నాన్నగారూ" అన్నాను. నా వైపు అలా చూసి మరల చెప్పమ్మా అన్నారు. నేను మరల చెప్పాను. ఈ డబ్బులు మీరు ఉంచాలి నాన్నగారూ అన్నాను. అయితే పొలమూరు అని రసీదు రాసి ఇస్తానమ్మా అన్నారు. మీది జిన్నూరు, మాది పొలమూరు అని హద్దులు పెడుతున్నారా నాన్నగారూ అన్నాను. నాన్నగారు నవ్వి ఇంకెప్ఫుడూ ఈ మాట అనను అన్నారు.

మాకు కొమ్మరలో బంధువులు ఉన్నారు. వారు మా ఇంటికి వచ్చినప్పుడు నాన్నగారు చిన్నప్పుడు ఎలా ఉండేవారు అని అడిగాను. నాన్నగారు చిన్నప్పుడు ప్రాకుతున్నప్పుడు చిన్ని కృష్ణుడులా ఉండేవారు. చూస్తే చాలా ఆనందం అనిపించేది. బయట పడేయవలసిన వస్తువులు ఉంటే వాటిని దూరంగా పట్టుకుని వెళ్ళి చెరువు గట్టున పడేసేవారు. చిన్నప్పటి నుండి ఆయనలో మంచి లక్షణాలు కనిపించేవి అని చెప్పారు.

నాన్నగారి చిన్నప్పటి స్నేహితులు అయిన నల్ల సుబ్బరాజు గారు ఎక్కువగా మా ఇంటికి వచ్చేవారు. ఆయన ఎందుకు వచ్చేవారో తెలియదు. నాకు రావాలనిపించి వచ్చాను అనేవారు. కొన్నిసార్లు ఇటువైపుగా వెళుతూ వచ్చాను అనేవారు. నల్ల సుబ్బరాజు గారు వచ్చినప్పుడు నాన్నగారి గురించి కొన్ని విషయాలు చెబుతూ ఉండేవారు. వాటిలో కొన్ని :

*నాన్నగారు చిన్నప్పుడు చదువుకునే వయసులో ఎవరిదైన పలక పగిలిపోతే, నాన్నగారి పలక వారికి ఇచ్చేసేవారు. బడిలో మాష్టారు చదువురాదు అని ఎవరినైనా తిడితే నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వారికి చదువుచెప్పి వచ్చేవారు.

*ఒకసారి నాన్నగారు సుబ్బరాజు గారితో నా కప్పు నిండిపోయి కారిపోతోంది. ఎవరూ రావడం లేదు ఇది ఎలా పంచిపెట్టమంటారు? ఎంతమంది వచ్చినా ఇంకా మిగిలే ఉంటుంది. ఎక్కడైనా చిన్న పందిరి వేసి జ్ఞానం గురించి బోధిస్తే ఎవరైనా వస్తారు కదా! అని నల్ల సుబ్బారాజు గారితో అన్నారట.

*నాన్నగారి ఇంట్లో ఒక ఆమె పనిచేసేది. ఆమెకి సంతానం లేరు. ఆమె నాన్నగారిని చూసి "మా బాబే, మా బాబే" అని మురిసిపోయేది. ఆమెకి పెద్ద వయసు వచ్చిన కారణంగా నాన్నగారి ఇంట్లో పని మానేసింది. ఆమె వంట కూడా చేసుకోలేకపోతే నాన్నగారే భోజనం పంపించేవారు. ఆమెకి కొన్నాళ్ళకు మతిస్థిమితం పోయి స్నానం చేయక దగ్గరకు వెళ్తే దుర్గంధం వచ్చేది. ఒకరోజు మా పెద్ద బాబు (నాన్నగారు) ని చూడాలి అని కలవరించిందట. నాన్నగారికి ఆ విషయం తెలిసి నల్ల సుబ్బరాజు గారిని తీసుకుని ఆమె ఇంటికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే ఆమె నుండి వచ్చే వాసన భరించలేక నల్ల సుబ్బరాజు గారు బయటకు వచ్చేసారు. నాన్నగారిని చూడగానే ఆమె పెద్దబాబు అని పిలిచింది. నాన్నగారు ఆమె పక్కనే ఒక అరగంట కూర్చుని, అమ్మా నీకు తగ్గిపోతుంది. నువ్వు బాగుంటావు అని చెప్పి వచ్చేసారు. నాన్నగారు వెళ్ళి చూసిన తరువాత ఆమెకు మనసు కుదుట పడి మామూలు అయ్యింది. నాలుగు రోజుల తరువాత "మా బాబే మా బాబే" అంటూ ప్రశాంతంగా ప్రాణం వదిలింది అని చెప్పారు.

•నాన్నగారు, నల్ల సుబ్బరాజు గారు అరుణాచలం వెళ్ళినప్పుడు నాన్నగారు గిరి ప్రదక్షిణ చేసి రాత్రి ఆలస్యమయితే, రమణాశ్రమం రూమ్ కి వెళ్ళే ఓపిక లేక చెట్ల కింద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి అన్నారు. ఈ విధంగా నాన్నగారి గురించి నల్ల సుబ్బరాజు గారు మా ఇంటికి వచ్చినప్పుడు చెబుతూ ఉండేవారు.

ఒకసారి నాన్నగారి దగ్గరకు వెళ్ళినప్పుడు నాన్నగారు నాతో, మీ బంధువులలో ఒకరు మంత్రి పదవిలో ఉన్నారు కదా! మీ పెద్ద బాబు 10 వ తరగతి అయిపోయాక ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించమని అడగండి. ఆ ఉద్యోగం చేసుకుంటూ ఇంటర్, డిగ్రీ చదువుకుంటాడు అన్నారు. అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చిన తరువాత నాకు రెండో ధ్యాస కనిపించట్లేదు నాన్నగారూ, జానెడు పొట్ట కోసం వెళ్ళి అందరి కాళ్ళు పట్టుకొని ఎందుకు నాన్నగారూ ఈ ప్రయాస అంతా? వాడు పొట్ట కోసం ఎక్కడ పని చేసుకున్నా మూడు, నాలుగు వేలు సంపాదించుకుంటే సరిపోతుంది అన్నాను. అప్పుడు నాన్నగారు నా వైపు చూసి ఏంటమ్మా అంత వైరాగ్యంతో మాట్లాడుతున్నావు అన్నారు. మీ పాదాలని నేను జ్ఞానం కోసం పట్టుకున్నాను కానీ, పొట్ట నింపుకోవడం కోసం కాదు అన్నాను. నాన్నగారు నీకు కాదమ్మా పిల్లలకు అన్నారు.

నాన్నగారితో రెండు మూడు సార్లు అరుణాచలం వెళ్ళాను. తర్వాత ఇంట్లో పరిస్థితుల వలన కుదరక అరుణాచలం వెళ్ళలేదు. భగవాన్ ని నాకు మీ దగ్గరకి రావాలని కోరికగా ఉందని నిరంతరం ప్రార్ధిస్తూ ఉండేదాన్ని. ఒకరోజు భగవాన్ అరుణాచలం తీసుకు వెళ్ళటం లేదని మా పిల్లలతో, ఈ భగవాన్ ని అరుణాచలం తీసుకువెళ్ళమనే కదా మనము అడుగుతున్నాము. కానీ ఆయన తీసుకువెళ్ళటం లేదు. నాకు అరుణాచలం మీద తప్పించి మరోదాని మీద ధ్యాస లేదు. అక్కడకు వెళ్ళి వచ్చాక నేను చనిపోయినా పరవాలేదు అని అంటున్నాను. ఇంతలో ఒక అబ్బాయి మా ఇంటికి వచ్చి ఆంటీ మా ఇంటికి ఎవరో వచ్చారు. మా అమ్మగారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు అని చెబితే నేను వారి ఇంటికి వెళ్ళాను. అక్కడ నాకు తెలియని ఎవరో ఒక ఆమె వచ్చి ఉన్నారు. ఆమె నన్ను చూసి, నేను అరుణాచలం వెళదామని టికెట్ తీసుకున్నాను. కానీ నాకు అనుకోని ఇబ్బంది వచ్చింది. ఈ టికెట్ మీకు ఇవ్వాలి అనిపించి వచ్చాను అని ఆ టికెట్ నా చేతోలో పెట్టి మీరు వెళ్ళవలసిందే అన్నారు. నేను ఇంటికి వచ్చి మా పిల్లలకి చెబితే, ఇప్పుడే కదమ్మా భగవాన్ ని అరుణాచలం తీసుకువెళ్ళటం లేదు అని తిట్టుకున్నావు. ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే నీదే తప్పు అవుతుంది అన్నారు. నాకు అప్పుడు భగవాన్ వాళ్ళ నోటితో అలా అనిపించారు అనిపించింది. నాభర్త తో ఈ విషయం చెప్పే సమయం కూడా లేదు. అయినప్పటకి, ఏదయినా జరగనీ అనుకొని నాలుగు జతల బట్టలు సర్దుకుని, కొంచెం డబ్బులు పట్టుకొని వారి కూడా వెళ్ళిపోయాను. అరుణాచలం వెళ్ళిన తరువాత ఇంటి ధ్యాస మరిచిపోయాను.