Wednesday, October 14, 2020

"మర్యాద పురుషోత్తముడైన రాముడే మన నాన్నగారు" - (By పద్మ (నౌడూరు))

నాన్నగారి దగ్గరకు నన్ను మా అక్క తీసుకు వెళ్ళింది. అప్పుడు నా వయస్సు 22 సంవత్సరాలు. నాకు ఒక పాప, బాబు. మా బాబుకి ఒకటవ సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల వరకు హాస్పిటల్ కి తిరుగుతూనే ఉన్నాను. అప్పుడు బాబు కాలులో ముక్క తీసి ముంబై పరీక్షకు పంపారు. మళ్ళీ హైదరాబాద్ తీసుకురమ్మన్నారు. అప్పుడు నేను బాబుకి పెద్ద అనారోగ్యం వచ్చిందని దుఃఖ పడుతున్నాను. అప్పుడు మా అక్క వచ్చి, జిన్నూరు నాన్నగారు ఉన్నారు ఆయనను చూడగానే దుఃఖం పోతుంది, శాంతి వస్తుంది అని నన్ను నాన్నగారి దర్శనానికి తీసుకువెళ్ళింది. మా అక్క, నేను వెళ్ళేటప్పటికి నాన్నగారు అరుగు మీద కూర్చుని ఉన్నారు. మొదటిసారి నాన్నగారిని చూడగానే దుఃఖం ఆగింది, చాలా శాంతిగా అనిపించింది. చిన్నప్పటి నుండి మా అమ్మ నాకు రామనామం నేర్పించింది. అప్పుడు నాకు ఆ రాముడే వచ్చి అరుగు మీద కూర్చున్నాడు అనిపించింది. అప్పుడు నాన్నగారితో మా బాబుకి ఆరోగ్యం బాగోలేదు, హైదరాబాద్ తీసుకు వెళ్ళమంటున్నారు నాన్నగారూ అని చెప్పాను. మా బాబుని ఎలా అనుగ్రహించారు అంటే; ఎంతో దయతో తల నిమురుతూ, బుగ్గ మీద చేయి వేసి మళ్ళీ వస్తే తీసుకువెళ్ళమ్మా! ఇప్పుడు వద్దు, ఇప్పుడు వద్దు అన్నారు. ఆ మాటతో నేను అన్నీ నాన్నగారి తోనే చెప్పుకోవడం మొదలుపెట్టాను. అప్పటి నుండి మా బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. మళ్ళీ రెండోసారి నాన్నగారి దగ్గరకు అరటిపళ్ళు హస్తం పట్టుకుని వెళ్ళాను. అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇవి కొంచెం ముగ్గాలమ్మా అని, ఎవరికో ఇచ్చి లోపల పెట్టమన్నారు. అప్పటి నుంచి నా బాధ్యత అంతా నాన్నగారిదే అనిపించింది.

మా అక్క వెళ్ళినట్టు నాకు మీటింగులకు వెళ్ళే అవకాశం లేదని బాధపడేదాన్ని. అప్పుడు మా ఊరు దగ్గర ఉన్న వేండ్ర అనే గ్రామానికి, నాన్నగారు ప్రవచనం చెప్పటానికి వస్తున్నారు అని తెలిసింది. అప్పుడు రమణ భాస్కర లో భక్తి అనే ఒక అడుగు నువ్వు వేస్తే, 9 అడుగులు నేను వేస్తాను అని నాన్నగారు చెప్పిన వాక్యం చదివాను. తరువాత నేను వేండ్ర ప్రవచనానికి వచ్చాను. అప్పుడు నాన్నగారు "తట్టండి తెరవబడుతుంది, అడగండి ఇవ్వబడుతుంది" అన్నారు. స్వర్గ రాజ్యం నీ హృదయంలోనే ఉంది అన్నారు. అప్పటినుండి మీటింగులకు రావటం మొదలు పెట్టాను. అప్పటినుండి నాన్నగారు నేను ఎప్పుడు వెళ్ళినా కుటుంబ విషయాలు అడుగుతూ ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు

2011లో నాన్నగారు అరుణాచలం వెళ్తున్నారని మా అక్క రమ్మంది, పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. మర్నాడు అరుణాచలం మీటింగులో నాన్నగారి దగ్గర కూర్చున్నాను. నాన్నగారి మీటింగ్ జరుగుతున్నంతసేపూ దుఃఖం వస్తూనే ఉంది. మీటింగ్ అయిపోయిన తర్వాత నాన్నగారు నా వైపు చూస్తూ "కర్తలేని కర్మ" అని చెప్పమన్నారు. అప్పుడు నా నోటి వెంట మాట రావట్లేదు, దుఃఖం వస్తోంది. అయినా చాలా సార్లు అదే చెప్పించారు. అప్పటి నుండి అదే నాన్నగారు నాకు ఇచ్చిన మంత్రం అనుకున్నాను. నాలుగు రోజులు ఉన్నాకా తిరిగి వెళ్ళిపోతున్నాము అని నాన్నగారికి చెప్పడానికి పైకి వెళ్ళాను. ఇక్కడ ఉన్న నాలుగు రోజుల్లో ఇల్లు గుర్తుకు వచ్చిందా అమ్మా! అని అడిగారు. లేదు నాన్నగారూ అని చెప్పాను. తరువాత జిన్నూరు వెళ్ళాను, నాన్నగారు రమణ భాస్కర పుస్తకం ఇచ్చి చదువుతావా? అని అడిగారు. చదువుతాను నాన్నగారు అని ప్రసాదంగా తీసుకున్నాను. మీ పేర్లు గుర్తు పెట్టుకుంటాను అన్నారు. నేను నాన్నగారి దగ్గరకు వెళ్ళినప్పుడల్లా నా కష్టసుఖాలు గురించి అడిగేవారు.

ఒకసారి మా షాపు క్యాలెండర్ ను తీసుకుని నాన్నగారి దగ్గరకు వెళ్ళాను. ఆ రోజు వైకుంఠ ఏకాదశి. నేను, అక్క షెడ్ లో ఉన్నాము. నాన్నగారు తలుపు తీసి లోపలికి రమ్మన్నారు. క్యాలెండర్ ను తీసుకుని క్యాలెండర్ లో ఒక పేజీ తీస్తూ బాలబాలాజీ ఇక్కడకు వచ్చేసాడు అన్నారు. మరొక పేజీ చూసి అరుణాచలేశ్వరుడు వచ్చాడు అన్నారు. ఇంకొక పేజీలో భద్రాచల రాముడి విగ్రహాలు ఉన్నాయి. గుడిలో ఉన్నట్టే అచ్చుగుద్దినట్టు అలానే వచ్చాయమ్మా బాగున్నాయి అన్నారు. అప్పుడు రాముడు గురించి ఒక 15 నిమిషాలు చెప్పారు. అప్పుడు నాన్నగారిని చూసి నాకు నా తండ్రి రాముని అవతారమే అనిపించి, రాముడే రాముడి గురించి చెప్పినట్లుగా అనిపించింది. మా తమ్ముడుని నాన్నగారి దర్శనానికి తీసుకు వెళ్ళాను. అప్పుడు నాన్నగారు తలుపు తీసుకుని వస్తున్నారు అక్కడ మగవారు ఎవరూ లేరు. అప్పుడు మా తమ్ముడుని నాన్నగారి చేయి పట్టుకోమన్నాను. అప్పుడు నాన్నగారు మా తమ్ముడుతో నీ చేయి నేను పట్టుకుంటాను అన్నారు. ఆరోజు నుండి నాన్నగారు వాడి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. 2017 లో మే 17వ తారీఖున మా తమ్ముడికి వివాహం అయిన తరువాత ఇద్దరినీ పసుపు బట్టలతోనే నాన్నగారి దర్శనానికి తీసుకు వెళ్ళాను. అప్పుడు నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు, జ్వరంగా ఉంది. అప్పుడు బుజ్జి లోపలకు వెళ్ళి ఎవరో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు వచ్చారు అని చెప్పారు. అప్పుడు నాన్నగారు మమ్మల్ని గదిలోనికి తీసుకు రమ్మన్నారు. నాన్నగారు నన్ను చూడగానే నువ్వు నాకు తెలుసు కదమ్మా అన్నారు. ఇంత ఎండలో ఎందుకు తీసుకు వచ్చావు? అన్నారు. మీ ఆశీర్వాదం కోసం వచ్చాము నాన్నగారూ అన్నాను. అప్పుడు నాన్నగారు నా ఆశీర్వాదం మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంటుందని ఆశీర్వదించారు.

నాన్నగారు వైజాగ్ నుండి వచ్చారని తెలిసి చూడటానికి వెళ్ళాను. నా తండ్రి శరీరం ఇక కనబడదా అని చాలా దుఃఖం వచ్చింది. "కృష్ణుడు అంటే దేహమే అయితే ఆ దేహము ఇప్పుడు లేదు కదా! మరి ఎలా తరించగలుగుతున్నారు" అని నాన్నగారు చెప్పిన వాక్యం స్పురణకు వచ్చింది. ఆ వాక్యం జిన్నూరు ప్రవచనంలో చెప్పారు. నా తండ్రి దేహం వదిలేసిన తరువాత ఆరోగ్య సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ ఎన్ని వచ్చినా అవి నన్ను తాకలేదు. గురువు శరీరం ఉండటం, లేకపోవటం అనే వ్యత్యాసం లేదు అని అనుభవం అయింది. 2018 లో శివరాత్రి రోజున జిన్నూరు వస్తుండగా భగ్గేశ్వరాన్ని నాకు యాక్సిడెంట్ జరిగింది. నా తండ్రి పెద్ద ప్రారబ్ధాన్ని చిన్న ప్రారబ్దంగా చేసేసారు. ఆయన పాదాలు కన్నీటితో కడిగినా తనివి తీరదు. అక్షరమణమాలలో గిరి రూపమైనట్టి కరుణా సముద్రమా! కృప చేసి నన్నేలుమరుణాచలా అని ఉంటుంది కదా! అంత కరుణా సముద్రుడు, అంత దయామయుడు మన తండ్రి.

No comments:

Post a Comment