Sunday, August 30, 2020

"అనుగ్రహంగా మారిన నైవేద్యం" - (By డా. ఉష గారు)

డెంటల్ సెకండ్ ఇయర్ చివర్లో వేసవికాలంలో, నాన్నగారు అరుణాచలం వచ్చారు. నేను కూడా చిదంబరం నుంచి అరుణాచలం వచ్చాను. అక్కడ ఆంధ్రాఆశ్రమంలో ఒకరోజు సాయంత్రం ఆయన భోజనం చేసాకా, ఆంధ్రానుంచి భక్తులు తెచ్చిన మామిడిపళ్ళును పట్టుకొచ్చి తినమన్నారు. నాన్నగారు సాయంత్రం తింటే నాకు తేడా చేస్తుంది, ఈపండు ఉషకి ఇచ్చేయండి. నేను రేపు ఉదయం భోజనంలో తింటాను అన్నారు. నాతో ఉషా ఇది నువ్వు తినమ్మా! అని చెప్పి, ఆయన దర్శనానికి హాల్లోకి వెళ్ళారు. వెనకే మేమంతా వెళ్ళిపోయాము.

తరువాత మేమంతా భోజనానికి వెళ్తుంటే నాకు మామిడిపండు తినమన్న విషయం గుర్తుకొచ్చింది. అప్పుడు వంటగదిలోకి వెళ్ళి చూస్తే కనిపించలేదు. సరేలే అనుకుని వచ్చేసాను. మర్నాడు నాన్నగారు భోజనానికి వచ్చినప్పుడు మళ్ళీ మామిడిపళ్ళు పెట్టారక్కడ. ఉషా మామిడిపండు ఎలా ఉంది? అని అడిగారు. నేను ఏం చెప్పాలో తెలియక మర్చిపోయాను నాన్నగారూ అన్నాను. అప్పుడు నాన్నగారు ముందురోజు వడ్డించిన ఆమెతో మీరు నిన్న ఉషకి మామాడిపండు ఇవ్వడం మర్చిపోయారా? అని అడిగారు. ఆవిడ, ఉష మీవెనకాలే వచ్చేసింది నాన్నగారూ, మేము అంత పట్టించుకోలేదు అని కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పారు. అయితే ఈ పండుని ఇప్పుడు ఉష కి ఇవ్వండి, నేను రేపు తింటాను అన్నారు. ఆ తరువాత ఆ భక్తురాలు నన్ను విసుక్కున్నారు, నీ వల్లే నాన్నగారు నిన్న, ఈ రోజు కూడా మామిడి పళ్ళు తినలేదు అని. ఆ రోజు ఆవిడ నన్ను తినమని ఇచ్చారు కానీ, నాకు తినాలనిపించక తినలేదు. మీరు భయపడకండి నాన్నగారు అడిగితే నేను తిన్నానని చెపుతానులెండి అన్నాను.

ఈరోజే కాదు, ఎప్పుడూ మామిడి పళ్ళు తినకూడదు అని ఆ క్షణంలో నిర్ణయించుకున్నాను. మర్నాడు నాన్నగారు నన్ను మళ్ళీ అడిగారు. నేను అవునూ, కాదు అన్నట్లుగా తల ఊపాను. ఆయన ఒక కుర్చీ ఇలా లాగండి అని చెప్పి ఒక ప్లేటు తెమ్మని మామాడిపండు నాకిచ్చి నువ్వు తిని అది ఎలాఉందో చెప్పు, అప్పుడు నేను తింటాను అన్నారు. నేను మొత్తానికే మామిడి పండు తినకూడదు అనుకుంటే, ఆయన పక్కన కూర్చోపెట్టుకుని తినేలా చేసారు. నేను తిని చాలా బావుంది నాన్నగారూ అన్నాకా, ఆయన తిన్నారు. తరువాత వెంటనే నాతో, అమ్మా..! ఏ సీజన్ లో దొరికిన పళ్ళు ఆ సీజన్ లో తింటే ఆరోగ్యానికి చాలామంచిది. ఫ్రూట్స్ ఎప్పుడూ మానకమ్మా ఉషా అన్నారు.

ఆయనకి మనపట్ల ఉన్న ఇష్టానికి హద్దులు ఉండవు. అటువంటి ప్రేమని మనమీద కురిపిస్తూ ఉంటే, అసలు ఈ భూమి మీద పుట్టడం, ఒక జ్ఞాని సమక్షంలో గడపడం ఒక వరం కదా అనిపించింది. నాకు మామిడి పళ్ళు చూసినప్పుడల్లా నాన్నగారు గుర్తుకొస్తారు. నాన్నగారు పళ్ళసెట్ పెట్టుకొనేవారు. అవి బ్రష్ తో నన్ను కడగమనేవారు. అలా నేను డెంటిస్ట్ ని కాబట్టి ఎవరికైనా పళ్ళ సెట్ అమర్చేటప్పుడు కూడా నాన్నగారు గుర్తుకొస్తారు. నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా, భక్తులు ఆయనకోసం తెచ్చిన స్వీట్స్, పళ్ళు, విదేశీయులు తెచ్చిన చాక్లెట్స్ నన్ను తీసుకెళ్ళమనేవారు. ఇది తింటావామ్మా! ఇది నీకు ఇష్టమా! అంటూ ఇంచుమించు అన్నీ ఇచ్చేసేవారు. నేను అన్ని వద్దు నాన్నగారూ భక్తులకివ్వండి అంటే, నీకు కావలసినవి తీసుకువెళ్ళు అనేవారు. ఆయన ధ్యాస నిరంతరం మన మీద ఉండటం వలన ఆయన లేరు అనుకునే ప్రసక్తే లేదు. అలా నాకు "పండు-పళ్ళు" చూసినా, జీవితంలో ఏ సంఘటన జరుగుతున్నా కూడా ఆయన జ్ఞాపకం వస్తూవుంటారు.

భగవంతుడి సృష్టిలో భాగంగా తయారయ్యే ప్రతి గింజమీదా, పండ్లమీదా అన్నింటిమీదా తినేవాడి పేరు రాసుంటుంది అంటారు.

ఒకసారి నాన్నగారితో సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు, అక్కడ బాబా పూజలో పెట్టిన మామిడిపండ్లు నాన్నగారికి ఇచ్చారు. అవి చాలా పెద్ధ సైజుతో, బాగా పండి, సువాసన వస్తూ ఉన్నాయి. నాన్నగారు ఆ పండ్ల కవరు నాచేతికి ఇచ్చి ఇంటికి జాగ్రత్తగా పట్టుకెళ్ళు అన్నారు. నేను వాటిని ఒక పక్కన పెట్టి ఆయనకూడా అంతా తిరిగి, వాటిని మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయాను. ఆ విషయం జ్ఞాపకం వచ్చాక కొన్ని క్షణాలు నాకు బాధ అనిపించింది. బాబా అంటే నాకు చాలా ఇష్టం. నాన్నగారి చేతితో ఇచ్చిన బాబా ప్రసాదం తెచ్చుకొని ఉంటే అందరికీ ఇచ్చేదాన్ని కదా అనుకున్నాను. తరువాత వెంటనే, నాకు వాటిని కొని తినగల ఆర్థిక స్థోమత భగవంతుడు ఇచ్చాడు. అలా కొనుక్కోలేని వాళ్ళెవరికైనా లేదా ఇబ్బందిలో ఉన్నవాళ్ళకి ఆ ప్రసాదం అందితే, వాళ్ళు చాలా సంతోషిస్తారు కదా అనుకున్నాను. ఆ బాధనుంచి నా ఆలోచన ఈ విధంగా మార్పు చెందేసరికి, నాకు మనసుకి చాలా శాంతిగా, ఆనందంగా అనిపించింది.

భగవాన్, నాన్నగారు కూడా చెట్టుమీద పూత పిందెగా మారినప్పుడే దానిమీద తినేవాడి పేరు రాసుంటుంది, దాని ప్రకారం అది ఎవరికి చెందాలో వారికే చెందుతుంది అంటారు. అది ఈరోజు ఇలా అనుభవమైంది అనుకున్నాను.

మనం సాధారణంగా ఒక సద్గురువుకి, భగవంతుడికి ఏదయినా సమర్పిస్తాము కదా! అలా నాన్నగారికి ఎవరైనా, ఏదైనా ఇచ్చినప్పుడు దీనిని ఏమంటారమ్మా అని అడిగి, ఆఫరింగ్ అంటారు అనిచెప్పి, అలాగే దానిని తిరిగి మీకు ఇస్తే ప్రసాదమంటారు అని నవ్వుతూ ఇచ్చేవారు. మనం గురువుకి ఏదైనా సమర్పించినప్పుడు దానిని పవిత్రంచేసి, ఆయన అనుగ్రహాన్ని జోడించి ప్రసాదంగా మనకు తిరిగి ఇస్తారు. అలా మన అహంకారాన్ని గనక భక్తితో ఆయనకు సమర్పించగలిగితే, మన హృదయంలో ఆయన చైతన్యంగా వ్యక్తమవుతారు.

నాన్నగారు తరచూ చెప్పేవారు, "మనం చేసే ప్రతి చర్య క్రిష్ణార్పణ భావం తో చేస్తే ఆయన అపారమైన దయకి పాత్రులవుతాము".

No comments:

Post a Comment