Saturday, August 15, 2020

"నాన్నగారి అంతులేని అనుగ్రహము, అనిర్వచనీయమైన దయ" - (By లలిత గారు)

జనవరి 2015 లో నాభర్తకి బ్రెయిన్ కేన్సర్ వచ్చింది. చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారు. నేను చాలామందికి ఈ విషయం చెప్పలేదు. అయినా కూడా సెప్టెంబరు 2015 లో చిన్మయ మిషన్ లో లక్ష్మీ మాధవి అనే భక్తురాలు ఒకామె ఈ విషయం తెలుసుకొని నాభర్తని చూడటానికి రిహేబిలిటేషన్ సెంటరుకి వచ్చింది. అలా వచ్చినప్పుడు తనతో నాన్నగారి, భగవాన్ ఫొటోస్, కొన్ని పుస్తకాలు తీసుకొచ్చింది. నేను నాన్న గారి ఫొటో చూడటం అదే మొదటిసారి. ఈయన ఎవరు అని నేనడిగితే, ఆమె శాంతంగా ఈయన జిన్నూరు నాన్నగారు, మా గురువుగారు అని చెప్పింది. నువ్వు కావాలంటే ఆయనతో ఫోన్ లో మాట్లాడచ్చు, ఫోన్ కలపమంటావా? అని అడిగింది. కానీ నేను అప్పటికే మానసికంగా కృంగిపోయి ఉండటం వల్ల, ఇంక ఏ ఆశా కూడా లేకపోవడం వల్ల నేనెవరితోనూ మాట్లాడ్డానికి సిద్ధంగా లేను అని చెప్పాను. అప్పుడు మాధవి నాన్నగారి వెబ్ సైట్ ఓపెన్ చేసి నీకు వీలయినప్పుడు నాన్నగారి ప్రసంగాలు విను అని చెప్పింది. మనకి సమయం రానప్పుడు మన ఇంద్రియాలు, మనసు సహకరించవు కదా! అందుచేత నేను వాటిని విందామని ప్రయత్నించినా కూడా నా మైండ్ కి అవి ఎక్కలేదు.

ఇదంతా జరిగిన నెలరోజులకి నా భర్త చనిపోయారు. దాంతో నాకు చాలా నిరాశ, నిస్పృహ, విసుగుదల, కోపము వచ్చేవి. అప్పుడు మాధవి ఇచ్చిన పుస్తకాలు జ్ఞాపకం వచ్చి వాటిని తీసాను. అందులో మధుగీత పుస్తకం నేను చదివేదాన్ని. మా అమ్మగారు అమృతవాక్కులు చదివేవారు. అందులో ఉన్న విషయాలు నాకు కొన్ని చెబుతూ ఉండేవారు. అలా చెప్పినప్పుడు, అందులో ఒక వాక్యం నా దృష్టిని చాలా ఆకర్షించింది. ఆ వాక్యం నా మనస్సుకు శాంతిని, అంగీకారాన్ని ఇచ్చింది. అప్పట్నించీ ఏ సందేహాలు, సంశయాలు వచ్చినా మాధవికి ఫోన్ చేసి అడిగేదాన్ని. 2016 మే నెలలో మాధవి చిన్మయ మిషన్ లో కలిసింది. నేను తనతో, నాభర్త అస్థికలు తీసుకుని ఇండియా వెళ్తున్నాను అక్కడ కార్యక్రమాలు పూర్తిచేయడానికి, ఆ టైమ్ లో అక్కడే ఒక గురువుని వెతుక్కుంటాను, కుదిరితే బేలూరుమఠ్, అరుణాచలం, జిన్నూరు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాను.

అప్పుడు మాధవి ముందు జిన్నూరు వెళ్ళు సరిపోతుంది అని చెప్పింది. నా ప్రారబ్ధంలో అది రాసిపెట్టి ఉంటే జరుగుతుందిలే అని నవ్వేసాను. మాధవి మళ్ళీ చెప్పింది, నువ్వు వైజాగ్ ఎలాగూ వెళ్తున్నావు కాబట్టి, హైదరాబాదు నుంచి వెళ్ళడం కంటే, వైజాగ్ నుంచి జిన్నూరు వెళ్ళడం నీకు దగ్గరవుతుంది అని చెప్పింది. అలా నేను ఇండియాకి బయలు దేరి వెళ్తున్నప్పుడు అనుకోకుండా దీప్తిని కలవడం జరిగింది. ఆమె కూడా నాన్నగారి భక్తురాలు. తను ఫ్లైట్లో నా వెనక సీటులోనే పడింది. నాకు తెలిసి నాన్నగారి గ్రేస్ అక్కడనుంచే మొదలైంది. దీప్తి కూడా చెప్పింది సందేహించకుండా తప్పనిసరిగా నాన్నగారిని కలవమని.

వైజాగ్ వచ్చిన వారానికి అక్కడ ఇంట్లో వాతావరణం అంతా దుఃఖంగా ఉంది. నా అంతరాత్మకి అప్పుడు అనిపించింది, అనవసరంగా ఇక్కడ టైమ్ వేస్ట్ చేసుకోవడం కంటే, జిన్నూరు వెళ్తే బావుంటుందేమో అని. అయితే, అక్కడికి ఎలా వెళ్ళాలో తెలీదు. ఆసమయంలో అత్తగారిని వాళ్ళనీ ఎలా అడగాలో అర్దం కాలేదు. ఆరోజుల్లో మా అత్తగారి ఊర్లో నెట్ కనక్షన్ కూడా లేదు. అప్పుడు వదినకి ఫోన్ చేసి మాధవిని, నాకు ఫోన్ చేయమని చెప్పమన్నాను. కొన్ని క్షణాలలోనే మాధవి నాకు ఫోన్ చేసింది. నాన్నగారు అరుణాచలం వెళ్తున్న కారణంగా, రెండు రోజుల్లోనే నాన్నగారిని కలవమని చెప్పి, జిన్నూరు వెళ్ళడానికి తనే ఏర్పాట్లు చేసింది. ధైర్యం చేసి అత్తగారింట్లో చెప్పాను. ఆ సందర్భం అంత సరయినది కాదు కాబట్టి వాళ్ళు మొదట కొంచెం సందేహించినా, చివరికి ఒప్పుకున్నారు.

అప్పుడు నాకు మనసులో, "మన అన్వేషణ గొప్పదయినప్పుడు సహకారం కూడా గొప్పగానే ఉంటుందని, దేని గురించీ విచారించక్కర్లేదని అనిపించింది". ఎదురు చూసిన సమయం వచ్చింది. జూన్ 21, 2016 తెల్లవారుజామున 6 గం. లకు నేను, పిల్లలిద్దరు, మావయ్యగారితో కలిసి జిన్నూరు బయలుదేరాము.

జిన్నూరు వెళ్తుండగా దారిలో కొంచెం ఆందోళన వచ్చింది. భోజనం తరువాత ఆయన రెస్ట్ కి వెళ్ళిపోతారని చెప్పారు, ఆయన్ని కలవగలనో లేదో అనిపించింది. ఇంకో 20 నిముషాలలో జిన్నూరు వస్తుందనగా దారిలో పోడూరు పుష్ప ఆంటీ మాతో కలిసి జిన్నూరు వచ్చారు. మేము నాన్నగారింటికి వెళ్ళేసరికి, బయట దీప్తి మా కోసం ఎదురు చూస్తోంది. నాన్నగారు లోపలికి వెళ్ళారు, బహుసా ఇప్పుడు రాకపోవచ్చు, అయినా కాసేపు ఎదురు చూద్దామని చెప్పింది. అక్కడ హాల్లో భక్తులు కూర్చుని ఉన్నారు. నా మనసంతా ఆలోచనలతో నిండిపోయింది. ఆయన ఎలా ఉంటారో, ఎలా మాట్లాడతారో, నేనేం చెప్పాలా అని రకరకాల ఆలోచనలతో ఉన్నాను. గం. 10. 15 కి నాన్నగారు ఆ రూములోకి వచ్చారు. అదే మొదటిసారి నేను ఆయనను చూడటం. నాగుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. చాలా ఆనందంగా, కంగారుగా కూడా అనిపించింది. ఆయన నా వివరాలు అన్నీ అడిగారు.


నాన్నగారు నాకు చెప్పిన మొదటి ఉపదేశం ఏమిటంటే, "ఆనందం స్వతంత్రమైనది, బాహ్య వస్తువులమీద కానీ, మనుషులమీద కానీ, పరిసరాలమీద కానీ ఆనందం ఆధారపడి ఉండదు" అన్నారు. 

 అప్పటికి నేను భర్త పోయారన్న దుఃఖంలో ఉన్నాను కదా, ఇంకో మాట ఏం చెప్పారంటే,   "మనకి మనమంటే ముందు ఇష్టముంటుంది, తరువాత ఇతరులంటే ఇష్టపడతాము. ఎందుకంటే, మన అహంకారాన్ని వాళ్ళు సంతృప్తిపరుస్తారు కాబట్టి! మరణం అంటే ఏమీ లేదు. ఈ ఇల్లు ఖాళీచేసి ఇంకో ఇంటికి వెళ్ళడం అంతే" అన్నారు.

అప్పుడు నేను నా ప్రారబ్ధాన్ని ఎలా తగ్గించుకోవాలని అడిగాను. ఏదో మేజిక్ లాంటిది ఏదో చేస్తారని నేను ఆశించాను. నామనసుకి ఇంక తట్టుకునే శక్తిలేదు. ఆయన ఏమాట చెబితే నేను ఇది దాటెయ్యచ్చా అనే తపనతో ఉన్నాను.

ఆయన ఏమన్నారంటే, "దేహంతో తాదాత్మ్యం చెందకుండా, నీ ప్రారబ్ధంలో ఏది ఉంటే అది పాయసం తాగినట్లు ఎంజోయ్ చెయ్యి, అలా చేస్తే ఈ ప్రారబ్ధం వచ్చే జన్మల్లో రాకుండా ఉంటుందన్నారు. ఇంకా, నీ దుఃఖాన్ని 24 గంటల్లో నేను తీసుకుంటాను" అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయి, ఇదెలా సాధ్యం అనుకున్నాను.

తరువాత నాన్నగారు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు. మధ్యాహ్నం మాకు మళ్ళీ దర్శనమిచ్చారు. ఆ ఖాళీ సమయం అంతా నా మనసులో ఒకే ఆలోచన మెదులుతోంది. నేనెంత పాపం చేసుకుని ఉంటే, నాకింత చిన్న వయసులో ఇంత కఠినమైన ప్రారబ్ధం వచ్చుంటుంది? అని. ఈ ప్రశ్న నాన్నగారిని అడగాలనుకున్నాను. కానీ మావయ్యగారు పక్కన ఉండటం వలన అడగలేకపోయాను. నాన్నగారు నన్ను పలకరించారు. కాసేపు మాట్లాడిన తరువాత వెళ్ళిపోయే సమయం వచ్చింది. అంతా వెళ్ళొస్తామని చెప్పి బయటకు వచ్చేసాము.

పుష్పగారు ఇప్పుడు నీకు ఆనందంగా ఉందమ్మా? అని అడిగారు. నేను పుష్పగారికి పైకి చెప్పలేదు కానీ, నాన్నగారిని అడగాలనుకున్నది అడగలేదని, ఆయనతో ఎక్కువ సమయం గడపలేదని నాకు లోపల అసంతృప్తిగా ఉంది. మావయ్యగారు ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నేను కూడా కష్టంగానే లేచి వెళ్తుంటే, నన్ను వెనక్కి పిలిచారు. అమ్మయ్య నన్ను పిలిచారు అనుకున్నాను. అంతటా ఉన్నారు కాబట్టి నా మనసులో ఏముందో ఆయనకి తెలిసింది. నేను నెమ్మదిగా వెళ్ళి కూర్చున్నాను.

అప్పుడు నాన్నగారు చాలా ప్రశ్నలు వేసారు. ఎలా ప్రశ్నించారంటే, నా మనసులో ఉన్న ప్రశ్న నేను అడిగేంతవరకూ ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నారు. అప్పుడు ఏడ్చేసాను. నాకు విపరీతమైన దుఃఖం వచ్చింది. నా మనసులో ఉన్న భారమంతా దిగిపోయేలా ఏడ్చేసాను. చూట్టూ ఎవరున్నారు, ఏంటి అనే స్పృహ కోల్పోయి ఏడ్చేసాను. నా కూతురు నాపక్కనే ఉంది. నాతో పాటు చుట్టూ ఉన్న భక్తులంతా ఏడ్చారని, తరువాత నా కూతురు చెప్పింది. నా దుఃఖాన్ని రెండు గంటల్లో అందరికీ పంచేసారు.

"నేను నీకు శాంతిని ఇస్తానమ్మా",  అన్నారు.

"నువ్వు భరించలేనంత శాంతిని నీకిస్తాను, నువ్వు సుఖంగా ఉంటావమ్మా",  అన్నారు.

"ఈశ్వరుడు నియంతమ్మా! ఆయనకి జాలిలేదు, ఆయన కఠినుడమ్మా! ఆయనకి దయ లేదమ్మా!",  అన్నారు. 

నువ్వు వెబ్ సైట్ చూడమ్మా, అందులో ఉన్న ప్రసంగాలు విను అని ఎంత ప్రేమగా చెప్పారంటే, నా జీవితంలో ఇంత ఆప్యాయతా, ప్రేమ నేను ఎక్కడా పొందలేదు. ఇంత దయ, కరుణ ఎక్కడా చూడలేదు. మాకు ప్రసాదం కూడా ఇచ్చాకా మేము చాలా ఆనందంగా తిరిగి వెళ్ళిపోయాము. మెల్లగా నా మనసుని ఆయన స్వాధీనం చేసుకున్నారు.

ఆ మర్నాడు నేను అమెరికా వెళ్ళడానికి, హైదరాబాదులో మధ్యాహ్నం 1. గం కి ఫ్లైట్ ఎక్కాలి. నేను ప్రయాణ మవుతుంటే, మా అత్తగారు పూరీలు చేసి పెట్టారు. నేను వాటిని ఏ ఆలోచనా లేకుండా తినేసాను. ఆరోజు మధ్యాహ్నం హైదరాబాదులో ఫ్లైట్ ఎక్కాకా నాకు జ్ఞాపకం వచ్చింది. నాభర్తకి మా అత్తగారు చేసిన పూరీలంటే చాలా ఇష్టం. అందుకని ఆయన చనిపోయాకా, అతనికి ఇష్టమైన పూరీలు చూసినప్పుడు నాకు తినబుద్ధి అయ్యేది కాదు. దుఃఖం కూడా వచ్చేది. అందుకని వాటిని తినడం మానేసాను. కానీ ఈరోజు ఉదయం నేను అవి తింటున్నప్పుడు అతని జ్ఞాపకాలు కానీ, దుఃఖం కానీ రాలేదు అన్న విషయం గ్రహింపుకి వచ్చింది. అంటే, ఇంతలా ఉంటుందా నాన్నగారి దయ అనిపించింది. 24 గంటల్లో నీ దుఃఖాన్ని తీసేస్తాను అన్నమాటకి, 24 గంటలు కూడా గడవకముందే నా దుఃఖం తీసేసి ఈ విధంగా నిదర్శనం చూపించారని అర్థమయింది. ఎంతో ఆనందమనిపించింది.

అమెరికా వచ్చేసాకా మళ్ళీ నాన్నగారిని చూడాలని, ఆయనతో సమయం గడపాలనే కోరిక బలపడుతూ వచ్చింది. దుఃఖంతో ఆయన దగ్గరకు వెళ్ళిన నాకు, తిరిగి వచ్చాకా రోజూ ఆయనిస్తున్న శాంతితోనూ, ఆనందంతోనూ కళ్ళమ్మట నీళ్ళొచ్చేవి. ఆయన అనుగ్రహం వల్ల 6 నెలల్లో మళ్ళీ ఆయన్ని కలిసి కొద్ది రోజులు గడిపే అవకాశం వచ్చింది. ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతిసారీ నాలోపల ఉన్న శాంతి ఇంకా పెరుగుతూ వచ్చింది. 

ఈ ట్రిప్ లో వెళ్ళినప్పుడు నాన్నగారు, "భగవంతుడు నీకు ఏ పనినైతే కేటాయించాడో ఆపని నీవు ఇష్టంగా చెయ్యాలి, నీ భర్త లేకపోయినా, నీ ప్రారబ్ధంలో నీకు కేటాయించిన పని నీకు తప్పదు. దానిని అయిష్టంగా చెయ్యకుండా, ఇష్టంగా చెయ్యి", అన్నారు. 


తరువాత 2017 లో, 3 వ సారి గురుపౌర్ణమి కి ఆయనని కలిసినప్పుడు,  "నా స్వభావం మార్చండి నాన్నగారూ, నాకది కష్టంగా ఉంది"  అన్నాను. 

"స్వభావం మారడం చాలా కష్టం, ఎందుకంటే అది బహుజన్మల నుంచీ వచ్చింది. పూర్వజన్మల వాసనలు ఉంటాయి కదా! ఆ వాసనల వల్ల స్వభావం మారడం కష్టం. అయితే, మనకు దృఢసంకల్పమూ, ఏకాగ్రత, శ్రద్ధ కలిగినప్పుడు భగవంతుడు కలుగజేసుకొని అనుగ్రహంతో స్వభావంలో మార్పు తీసుకొస్తాడు"  అని చెప్పారు.

నాన్నగారిని మొదటిసారి కలిసినప్పుడు మేజిక్ వర్డ్ ఏదో చెబుతారని ఎదురు చూసాను. స్వభావం మారడానికి ఆ మేజిక్ వర్డ్ అప్పుడు చెప్పారు. "సహనం, సహనం, మరింత సహనం" అని. ఆయన్ని కలిసాకా నా జీవితం U టర్న్ తీసుకొని 360॰ కోణంలో చక్రం తిరిగినట్టు తిరిగింది.

కొన్ని సందర్భాలలో నాకు, పిల్లల్ని క్లాసులకి లేదా వేరే ఇతర పనులకి తీసుకువెళ్ళాలన్నా, దూర ప్రాంతాలకి వెళ్ళవలసి వచ్చినా, నాభర్త బతికిఉంటే కొన్ని ఆయన చూసుకునేవారు కదా అనిపించేది. నాన్నగారు అంతర్యామి! ఆయనకి మన తలంపులు, ఇబ్భందులు అన్నీ తెలుస్తాయి కదా! ప్రెసిడెంట్ లక్ష్మిగారిని కలిసినప్పుడు ఆవిడ నాకు ఒక మాట చెప్పారు. "ఒక పని నీద్వారా జరగవలసి ఉంటే, అది నీభర్త బతికి ఉన్నా నువ్వు చెయ్యక తప్పదు. అది నువ్వే చేయవలసి వస్తుంది. అందుకని నీపని నువ్వు శ్రద్ధగా, ఇష్టంగా చెయ్యి" అన్నారు. దానితో నా సందేహాలు అన్నీ తొలగి నాపనులు శ్రద్ధగా చేసుకోవడమే కాదు, కంప్లైంట్స్ చేసుకోవడం కూడా మానేసాను. అప్పటినుంచీ చెయ్యాల్సిన పనికి బాధపడటం లేదు. నాన్నగారు అలా ఎవరినో ఒకరిని ఉపయోగించుకొని సమయానికి తగిన సహాయం అందచేస్తూ ఉంటారు. మనల్ని సన్మార్గంలో నడిపించి అంతర్ముఖుల్ని చేయడానికి. ఆయన్ని కలవక ముందు నేను చాలా సత్సంగాలు విన్నాను. కానీ అవి వినడం వరకు మాత్రమే. నాన్నగారు ఆత్మవిద్యని చాలా వివరంగా, చాలా సులభంగా బోధించారు. ఆత్మ విద్యను పొందడానికి ఏమేమి అవసరమో, నాన్నగారి ఉపన్యాసాలు విన్నాకా, భగవాన్ వి, నాన్నగారివి పుస్తకాలు చదివాకా అర్థమయింది. "నేనెవరిని" అనేది కేవలం ఒక వాక్యం కాదు, అది మనకు ఆయనిచ్చిన ఉపదేశం. దీని గురించి ఆయన మనకు బోధించడమే కాదు, అది అభ్యాసం చేయడానికి కావల్సిన శక్తిని కూడా ఇచ్చారు. అది లేకపోతే జీవితానికి ఇంక అర్థం లేదు. సబ్జక్ట్ తెలియక ముందు నేను ఈ జన్మబాలేదు, వచ్చే జన్మలు అయినా బావుంటాయి అనుకుంటూ వచ్చాను. అయితే అది నిజం కాదని అర్థం అయింది. నా కళ్ళు పూర్తిగా తెరిపించిందేంటంటే, నాన్నగారు ఏదయితే చెప్తున్నారో అది మనకు చాలా అవసరం, ఉన్నతమైన పుట్టుక రావడానికి, మోక్షం సాధించడానికి "మనసు పవిత్రత చాలా అవసరం" అని అర్థం అయింది. నాన్నగారిని కలిసే వరకూ నాకు ఈ ముఖ్యమైన విషయం తెలియలేదు.

కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు, మన టైమ్ బాలేనప్పుడు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు, ఇష్టమైన వారు దూరమై పరితపిస్తున్నప్పుడు మనం బాధపడినా కూడా, ఇలాంటి విషాద సంఘటనలు మన జీవితంలో మంచే చేస్తాయి అనిపించింది. ఎందుకంటే, ఈ పరిస్థితులే కదా, నన్ను నాన్నగారిని కలిసేలా చేసాయి! 

"మన మంచి మనకన్నా ఈశ్వరుడికే ఎక్కువ తెలుస్తుంది",  అంటారు నాన్నగారు.   

నేను ఆయనను వ్యక్తిగతంగా కలిసింది మూడుసార్లే అయినా, మానసికంగా అనుబంధం ఎప్పటికీ ఉండిపోయేలా అనుగ్రహించారు. నా లోపల పని చేస్తున్నట్లుగా కూడా నాకు తెలిసేలా చేసారు. 

నేను ఆయన అనుగ్రహం గురించి పేజీలు, పేజీలు రాస్తూ వెళ్ళిపోగలను. కానీ, ఎంత రాసినా నేను ఆయనకు న్యాయం చేయలేను.

చిన్నప్పుడు నేను సాయి చరిత్ర, దత్త చరిత్ర అవన్నీ చదివేదాన్ని. ఈ ప్రార్థనలన్నీ కూడా భగవంతుడిని, ఏదో ఒక కోరిక కోరుకోవడం కోసమే! నా భర్త ఎప్పుడయితే కేన్సర్ తో బాధపడ్డారో అప్పుడు కూడా నేను చేసిందదే. కానీ ఇవేమీ నాకు సహకరించలేదు. నాన్నగారి ఉపన్యాసాలు విన్నాకా నాకు అర్థమయిందేమిటంటే, భగవాన్ చెప్పినట్లు "జరుగవలసింది జరిగే తీరును. జరగరానిది ఎవరు ఎంత ప్రయత్నం చేసిననూ జరుగనే జరుగదు" ఇది భగవాన్ తల్లికిచ్చిన ఉపదేశం. ఇది కూడా నాన్నగారు చెప్పారు. అది నేను బాగా జ్ఞాపకం పెట్టుకున్నాను. అది నా జీవిత దృక్పధం మార్చేసింది. మాధవి అంటే నాకు చాలా గౌరవం. నన్ను నాన్నగారికి పరిచయం చేయడం వల్ల ఆమెను నా ఉపగురువుగా భావిస్తాను. నేను ఎప్పుడూ కృతజ్ఞురాలిని. నాన్నగారి ఆధ్యాత్మిక కుటుంబంలో సభ్యురాలిని అయినందుకు, ఆయన అపారమైన హద్దులు లేని ప్రేమకు అర్హురాలిని అయినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

No comments:

Post a Comment