Sunday, August 2, 2020

"నాన్నగారితో తొలి యాత్ర" - (డా. ఉష గారు)


కొంతకాలం  గడిచిన  తరువాత  ఒక  పెళ్ళి  ఫంక్షన్  లో  నాన్నగారిని  కలవడం  జరిగింది.  అక్కడ  ఆయనతో  మాట్లాడుతున్నప్పుడు,  ఆయన  శ్రీశైలం  వెళ్ళబోతున్నానని  చెప్పారు.  నేను  కూడా  రావచ్చా  నాన్నగారూ!  అని  అడిగాను.  ఆయన  నవ్వుతూ  అంగీకారంగా  తలూపి,  రావచ్చమ్మా,  నేను  ఏర్పాటు  చేస్తాను,  మా  కారులోనే  వద్దువుగాని  అన్నారు.  అలా  కొంతమంది  భక్తులతో  కారులో  ఆయనతో  పాటు  శ్రీశైలం  వెళ్ళాను.  అక్కడ  ఉన్న  3  రోజులూ  అందరం  పూర్తి  శాంతిలో  చాలా  ఆనందంగా  గడిపాము.

శ్రీశైలంలో  నాన్నగారు  దగ్గరుండి  గుడితో  పాటు,  అన్నీ  తిప్పి  చూపించారు.  అక్కడ  ఉన్న  వృద్ధ  మల్లికార్జున  స్వామి  లింగం  దగ్గర  కూర్చున్నప్పుడు,  దానివంక  తదేక  దృష్టితో  ఎంతో  ఆరాధనగా,  ప్రేమ  పూర్వకంగా  ఆ  పెద్ద లింగం  వైపు  అలా  చూస్తూ  ఉండిపోయేవారు.  ఆ  సమయంలో  మనకి  తెలిసిన  నాన్నగారిలా  కాకుండా,  ఏదో  లోకంలో  ఉన్నట్టు  గంభీరంగా  కనిపించేవారు.  ఒకరోజు   దాని  గురించి  చాలా  ప్రత్యేకంగా  వర్ణించి  చెప్తూ..,  ఈ  వృద్ధ మల్లికార్జున  స్వామి  అంటే  నాకు  చాలా  ఇష్టమమ్మా,  ఈయన  చాలా  ముసలాయన,  ఇయన  పెద్ద  శివుడమ్మా!  నేను  ఎప్పుడు వచ్చినా  ఈయన  దగ్గర  ఎక్కువ  సమయం  గడుపుతానమ్మా!  అని  చెప్పారు. 

అక్కడ బయట ప్రదేశంలో  భోజనం  చేసేటప్పుడు  మొదటిరోజు  నాకు  వడ్డించిన భోజనం  ఎక్కువ  అయి  తినలేకపోతుంటే,  ఎక్కువైందా  అని  అడిగి,  ముందే  కొంచెం  పెట్టమని  చెప్పాలమ్మా!  "అన్నం  పరబ్రహ్మ  స్వరూపం"  పెట్టిన  తరువాత  వృధా  చేయకుండా,  పారేయకుండా  తినాలి  అని  చెప్పారు.  ఆ  చెప్పడం  కూడా  ఎంతో  మృధువుగా,  ప్రేమగా  చెప్పేవారు.  దాంతో  నేను  తినలేకపోయినా,  అతికష్టం  మీద  పూర్తిగా  తినడం  జరిగింది.  ఆ  సంఘటనలు  జరిగిపోయిన  తరువాత  ఆయన  ప్రేమ  పూర్వకమైన  మాటలను,  మన  మాటలతో  తిరిగి  వర్ణించలేము.  ఆధ్యాత్మికంగానే  కాకుండా,  భౌతికంగా  కూడా  ప్రతి  చిన్న విషయాన్నీ  విడమరిచి  చెప్పేవారు.  ఎలా  ఉండాలి?  ఎలా  జీవించాలి?  అనేది  సందర్భం  వచ్చినప్పుడల్లా  బోధిస్తూనే  ఉండేవారు.

నాన్నగారితో  శ్రీశైలం  వెళ్ళినరోజు  మేమంతా ఒక గెస్ట్ హౌస్ లో దిగాము.  ఆరోజు  నాన్నగారు  ఒంటరిగా  తీరిగ్గా  కూర్చున్నప్పుడు,  నాన్నగారితో  వచ్చే  5 సం॥లు  నేను దూరంగా  హాస్టల్ లో  ఉంటాను  కదా!  మీ  ఫుల్  ఫొటో  ఒకటి  కావాలి,  నేను  రోజూ  చూసుకోవడానికి  అని  అడిగాను.  ఆయన  అలాగే  అని  చెప్పి, కాళ్ళు  చాపుకొని  ఫొటో  పూర్తిగా  వస్తుందేమో  చూసుకోమన్నారు.  నేను  కొంచెం  దూరం  వెళ్ళి ఫొటో  పూర్తిగా  వచ్చేలా  తీసుకున్నాను.  అది  ఫ్రేమ్  కట్టించుకొని,  హాస్టల్ లో  టేబుల్  మీద  పెట్టుకొని  రోజూ  దన్నం  పెట్టుకునేదాన్ని!  అప్పుడు  నేను  తీసిన  నాన్నగారి మొదటి ఫొటో  ఇది!

"ఈ పుణ్యక్షేత్రాలు ఒక  ఆధ్యాత్మిక  శక్తితో  నిండి  ఉంటాయి.  ఇటువంటి  ప్రదేశాలను  అప్పుడప్పుడు  దర్శించడం  వలన  అక్కడ  ప్రవహించే  ఆధ్యాత్మిక  తరంగాలు  మనకు  కొంత  శక్తిని  కలిగిస్తాయి.  కానీ,  పుణ్యక్షేత్రాలను  దర్శించుకోవటం,  నదులలో  స్నానం  చేయటం,  ఆధ్యాత్మికతకు  ఉపయోగపడే  పుస్తకాలను  చదవడం ఇలాంటివి  ఎన్ని  చేసినా,  ఒక  జ్ఞాని  యొక్క  సన్నిధికి  సమానం  కావు.  అలాంటి  మహాత్ముని  సన్నిధి  కొరకు అవసరమైతే  ప్రపంచం  అంచులదాకా  ప్రయాణం  చేయమని  "ఐన్ స్టీన్"  చెప్పేవాడు.  అటువంటి  మహాత్ముని  సన్నిధి  వలన  మన  అహంకారం  కడిగివేయబడుతుంది” అన్నారు.

No comments:

Post a Comment