Sunday, August 9, 2020

"నాన్నగారు మాకు ఇవ్వబడిన బహుమతి" - (లక్ష్మీగారు (మాధాపూర్))

నాకు బాహ్యంగా జీవితం లో ఏ లోటూ లేదు. కాని ఏదో వెలితి. జీవితం ఇంతేనా అనిపించేది. ఆ సమయం లో మా అమ్మమ్మగారు చనిపోయారు. విపరీతమైన దుఃఖం. ఏమిటీ జీవితం? ఎందుకు పుడ్తున్నాం? ఎందుకు మరణిస్తున్నాం? మరణాంతర జీవితం ఎమిటి? ఒకటే ఆలోచనలు. ఆ పది రోజులు, భగవంతుడా! నువ్వుంటే నాకు సప్పోర్ట్ రా అని ప్రార్థించేదాన్ని.

ఫిబ్రవరి 9, 1990- నా జీవితం లో మరచిపోలేని రోజు. నా స్నేహితురాలు పుష్ప “అమృతవాక్కులు” అనే పుస్తకం ఇచ్చి చదవమంది. నేను తీసిన పేజీలో “నీ దేహమే నీది కానప్పుడు ఈ లోకం నీదంటావేమిటి?” అన్న వాక్యం చదివిన వెంటనే ఆలోచన మొదలైయింది. అమ్మమ్మ పోయారే అని బాధ పడుతున్నానేమిటి? నా దేహమే నాది కానప్పుడు, దీన్ని కూడ ఒక రోజు వదిలెయ్యాలి కదా! ఎంత అద్భుతంగా ఉంది. పుస్తకము మీద “నాన్నగారు” పేరు చదివాను. “నాన్నగారెవరు?” అని అడిగాను. “నాన్నగారు జిన్నూరులో ఉంటారు. తీసుకెళతాను. వస్తావా” అని మా తాతయ్య చెల్లెలు అన్నారు. ఆ వాక్యం చదివిన అరగంట లోనే జిన్నూరు బయలు దేరాను. నేను ఆనందమయ జీవితంలోకి ప్రవేశించే రోజని, నాకు ఆ రోజు తెలియదు.

నాన్నగారింటికి వెళ్లి వారి పాదాలకు నమస్కరిస్తూంటే, ఏదో తెలియని ఆనందం వచ్చింది. మా మామ్మగారు నాన్నగారికి పరిచయం చేస్తూ, లక్ష్మీ “ అమృత వాక్కులు” చదివి ఆ పుస్తకాల కోసం వచ్చిందన్నారు. “ ఏం చదివావమ్మా” అన్నారు. “ నీ దేహం నీది కానప్పుడు ఈ లోకం లో నీదంటూ ఏముంది?” ఆ మాట నాకు చాలా నచ్చిందన్నాను. ఒక్క మాట చదివి వచ్చావామ్మ లక్ష్మీ అన్నారు...అమ్మా లక్ష్మీ అంటూ ఏడెనిమిది సార్లు అన్నారు. ఆ పిలుపు వింటూంటే నా 23 ఏళ్ల జీవితం లో ఎవ్వరు అంత ప్రేమ గా పిలవలేదు అనిపించింది. నాన్నగారి దగ్గర ఒక అరగంట ఉండి వచ్చేసాను.


ఆ రాత్రంతా ‘ అమృతవాక్కులు’ ‘నాన్న ఉవాచ’ చదివాను. ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే తెలియని లోకాలకు తీసుకెళుతున్నట్టు అనిపించింది. నాన్నగారి పుస్తకాలలో చదివిన మాటలు నాన్నగారి గొంతుతో వచ్చేసేవి. పువ్వులు కొస్తూ ఉంటే, “దేవుని పాదల వద్ద నీ అహంకారమనే పుష్పం పెట్టమ్మ” అని వచ్చేది. ఎమైనా పని అయిష్టంగా చేస్తే ‘ ఇష్టంగా చేయి, కొత్త వాసనలు రావు, పాత వసనలు పోతాయి’ అని నిరంతరం హృదయంలో నుండి గైడంస్ వచ్చేది.

ఒక ప్రవచనం లో నాన్నగారు ‘ మీ హృదయం లో భగవంతునికి చొటివ్వండి’ అన్నారు. నాకు భగవంతుడిని తలచుకోవడం, స్మరించుకోవడం అనిపించలేదు. నా మనస్సు లో తలంపులు ఎంత సేపు అణిగితే అంత సేపు హృదయం ఖాళీ అవుతుంది. అప్పుడే భగవంతునికి చోటిచ్చినట్టు అని అనిపించింది. నానగారు చెప్పే అమృతస్థితి పొందకుండా మనస్సే అడ్డు వస్తోంది. ‘ఆ మనస్సుని పట్టించుకొకు’ అని నాన్నాగారు చెప్పిన మాట నాకు చాలా ఇష్టం. సాధన అదే చేస్తోంది. అదే చెప్పుకుంటుంది. అదే పెరిగిపోతుంది.

ఒక సారి నాన్నగారితో కారులో వెళ్తూ “ దేహం తో తాదాత్మ్యం వల్లనే కదా ఇన్ని బాధలు నాన్నగరూ!” అన్నాను. “ అవునమ్మా! ఆ తాదాత్మ్యం పోగొట్టుకోవడం పెద్ద కష్టం కాదు. నీకు ఎవరింటికైన వెళ్లాలనిపిస్తుందనుకో అదీ ఒక తలంపే కదా, దాన్ని తలంపుగా ఎలా చూస్తున్నావో, అలాగే ఈ దేహం నేననేది కూడ అలాగే తలంపులా చూడు. ఆ తలంపులో నుంది విడుదల పొందితే, ఇప్పుడే ఇక్కడే జ్ఞానం పొందవచ్చు” అన్నారు.

నాన్నగారి బోధ నిజతత్వానికి మనల్ని చేరుస్తుంది. ఆ చేరుకోవటానికి వచ్చే అనేక అడ్డంకుల్ని వివిధ కోణాల్లో మనసుకి హత్తుకునేటట్లు చెప్తారు. నాన్నగారు ఇది పోగొట్టుకోమని చెప్పరు. కాని ఏవైతే అమృత స్థితి పొందకుండా అడ్డు వస్తూన్నాయో అవి మనకి కూడా తెలియకుండా రాలిపోతాయి.


భగవాన్ ని భుజాన వేసుకుని ఊరూరు, ఇల్లిల్లూ తిరుగుతూ పామరులలో సైతం నిజమేదనే ఆలోచన కలిగిస్తున్నారు. ఆయన ప్రేమ అపారం. ప్రతి ఒక్కరిని ఆ ప్రేమ బంధిస్తుంది. ఆయన ప్రేమ, ఆప్యాయత, బోధించే జ్ఞానం, అనుగ్రహం మాటలలో చెప్పుకుంటే తక్కువ చేసిన వారము అవుతామేమో అనిపిస్తుంది. సృష్టిలో దేనితోనూ ఆయనని పోల్చలేము. నాన్నగారు అన్న నాలుగు అక్షరాలు నాలుగు వేదాల సారం.

ఒక రోజు అరుణాచలం శివాలయంలో కొత్త భక్తులు “ఈ రొజే నాన్నగారిని చూస్తున్నాం. వారి గురించి ఎమైనా చెప్పండి” అని అడిగారు. మీరు ఆలయం లో శివుడిని చూసి దైవ భావం తో పాటలు పాడారు.. నా దేవుడు నాన్నగారే!ఎందుకంటే ఎలా జీవించాలో, ఎలా బంధం నుంది విడుదల పొందాలో, ఎలా శాంతి పొందగలమో తెలిపింది నాన్నగారే. నాన్నగారు నాన్నగారే!!” అన్నాను.

నాన్నగారి ప్రతి మాట మనల్ని ఆలోచింప చేస్తుంది. మనసుని ఎడ్జుకేట్ చేస్తుంది, వెలుగు లోనికి తీసుకు వెళ్తుంది. ఆయన నోటి లోంచి వచ్చే ప్రతీ మాట నాకు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంటుంది. ఈ తండ్రి రాక పోతే ఎమై పోదునో అనిపిస్తుంది. ఈ తండ్రిని మాకు ప్రసాదించినందుకు భగవాన్ కి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. భగవాన్! మేమంటే నీకు పక్షపాతం ఉంది. ప్రపంచం లో ఎంత మంది భక్తులు లేరు నీకు. కాని నాన్నగార్ని మాకు ప్రసాదించావు. ఆ తండ్రి చైతన్య వైభవం బోధిస్తూ ఆనందాన్ని రుచి చూపిస్తూ తీసుకెళ్తున్నారు. తండ్రీ!! నీ అనుగ్రహం మా మీద ఉందనటానికి నిదర్శనం నాన్నగారు!”

అరుణాచలం, భగవాన్, నాన్నగారితో నాకు తెలియని సంకెళ్ళు పడ్డాయి. వారిని ప్రేమించాలని ప్రేమించలేదు. ప్రేమించకుండా ఉండలేక ప్రేమిస్తున్నాను. “మనది జన్మాంతర సంబంధం అమ్మా” అన్నారు నాన్నగారు.


No comments:

Post a Comment