Saturday, August 22, 2020

"హృదయాలయం" - (డా. ఉష గారు)

డెంటల్ 2 వ సం॥లో దసరా సెలవులకి మొదటి సారి జిన్నూరు వెళ్ళాలనిపించింది.నాకు జిన్నూరు ఎక్కడ ఉందో పెద్ద అవగాహన లేదు. పాలకొల్లుకి దగ్గర అని మాత్రమే తెలుసు. స్నేహితుల సహాయంతో చెన్నైలో భీమవరం టికెట్ బుక్ చేసుకున్నాను. చెన్నైనుంచి భీమవరం వెళ్ళాను. అక్కడనుంచి బస్ లో పాలకొల్లు వెళ్ళి, అక్కడినుంచి ఆటోలో జిన్నూరు ప్రయాణం చేసాను. 10 నిముషాల్లో ఆటో జిన్నూరు వచ్చేసింది. 
ఎవరికీ నేను వస్తున్న విషయం చెప్పలేదు. ఎన్నింటికి దిగుతాను అనేది కూడా నాకు అవగాహన లేదు. నేను వెళ్ళేసరికి గురువుగారు గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నారు. ఆయనకి తెలియనిది ఏముంటుంది?

తిరుగు ప్రయాణానికి టికెట్ తీసుకోలేదు. నా గురించి నేను ఆలోచించుకోకుండా ఈశ్వర సంకల్పానికి అనుగుణంగా నేను నడిచేలా ఆయనే చూసేవారు.నాన్న విషయంలో ఎప్పుడూ కూడా వెళ్ళడం మాత్రమే చూసుకునేదాన్ని. ఎప్పుడూ తిరుగు ప్రయాణం ఆయనే నిర్ణయించేవారు. పగలు అంతా అక్కడే ఉండి, అక్కడే భోజనం చేయమని, రాత్రికి మాత్రం ఎదురుగా ఉన్న భక్తుల ఇంట్లో పడుకోమని ఆయనే పురమాయింపు చేసారు. ఆక్కడ ఉన్న ఆ ఐదురోజుల్లో మా మధ్య జరిగిన సంభాషణ ఇదే. ఆ తరువాత ఆయనకూ, నాకూ మధ్య ఏ మాటలూ లేవు. రోజంతా ఆయన కూడా ఉండేదాన్ని. 
ప్రతీదీ గమనిస్తూ ఆయన పక్కనే కూర్చొని ఉండేదాన్ని. ఆయన ముఖానికి ఫౌడర్ రాసుకోవడం,తలకి నూనె రాసుకోవడం, పేపర్ చదువుకోవడం, భోజనం చెయ్యడం, తీరిగ్గా కూర్చొని పుస్తకాలు చదువుకోవడం ఇవన్నీ ఆయన పడుకునే వరకూ నేను చూస్తూ ఉండేదాన్ని. నేను ఉన్న సంగతి గుర్తించనట్టుగా ఆయన ఉండేవారు. నేను కూడా, నన్ను నేను మర్చిపోయేంత పరవశంతో ఉండేదాన్ని.

ఆయన భోజనం అయ్యాక, కన్నమ్మగారు నాకు వడ్డించేవారు. హడావిడిగా భోజనం చేసేదాన్ని. (నాన్నగారిని మిస్ అయిపోతాను అన్నట్టుగా).ఆవిడ చాలా ఆప్యాయంగా భోజనం పెట్టేవారు. దాంతో ఆట్రిప్ లో కన్నమ్మతో కూడా అనుబంధం ఏర్పడింది.

నా హృదయంలో ఆయన పట్ల అపారమైన ప్రేమ, గౌరవం పొంగుకుంటూ వచ్చేవి. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేక, మెల్లగా ఆయన పాదాలకు నమస్కరించేదానిని. కళ్ళల్లో తెలియకుండా ఆనంద బాష్పాలు వచ్చేవి. ఆయన సాన్నిధ్యం తప్ప నా జీవితానికి ఇంకేమీ అవసరం లేదు అనిపించేది. ప్రశాంతమైన దివ్యత్వం ఆయన. కొన్ని సందర్భాలలో ఏమీ చేయకుండా ఆయనలో ఆయనే అలా ఉండిపోయేవారు. ఆయన్ని గమనిస్తూ ఉన్న నాకు తలపులు ఆగిపోయి అద్భుతమైన మౌనం ఆవరించేది. కాలం తెలియని ఆ ప్రశాంతతలో 5 రోజులూ ఎలా గడిచిపోయాయో తెలియలేదు. 

ఒకరోజు మధ్యాహ్నం స్టేషన్ మాస్టరుగారు వచ్చారు నాన్నగారి దర్శనానికి. నాన్నగారు సంతోషంగా ఆయనని ఆహ్వానించారు. రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను, ఉషకి రేపటికి చెన్నై వెళ్ళే ట్రైనుకి టిక్కెట్ తియ్యాలి, అక్కడనుంచి బస్ లో చిదంబరం వెళ్ళిపోతుంది అన్నారు. స్టేషన్ మాష్టర్ గారు రేపు నేను టికెట్ తీసుకుని వచ్చి ఉషని స్టేషన్ కి తీసుకువెళతానని చెప్పారు.

అదేరోజు సాయంత్రం పాలకొల్లు సత్యనారాయణరాజుగారు నాన్నగారి దర్శనానికి వచ్చారు. నాన్నగారు నన్ను ఆయనకి పరిచయం చేసి, పాలకొల్లు హైమ ( సత్యనారాయణ గారి భార్య ) గారింట్లో సత్సంగం జరుగుతుందమ్మా! అని నాతో చెప్పి, ఆయన్ని మర్నాడు వచ్చి వాళ్ళింటికి తీసుకు వెళ్ళి, నన్ను హైమ ఆంటీకి పరిచయం చేసి స్టేషన్లో బండి ఎక్కించమన్నారు.

అది వినగానే నాకు కళ్ళల్లో నీరు తిరిగింది. తెలియకుండానే 4 రోజులు గడిచిపోయాయి. తిరుగు ప్రయాణం టైమ్ వచ్చేసింది. 

ఆరోజు సాయంత్రం భోజనం అయ్యాకా, సంధ్య వేళలో పెరటిలోకి వచ్చి ఆకాశంలో సూర్యాస్తమయం చూస్తూ నిలబడిపోయారు. ( నేను తరచుగా ఎలా చూస్తూ ఉండిపోతానో అలా ) ఆరోజు మాత్రం నేను ఆకాశం వైపు చూడకుండా, తన్మయత్వంతో ఆయనని చూస్తూ ఉండిపోయాను. ఎంత గంభీరమైన మౌనం ఆయనది. ఆ తరువాత నాన్నగారు అక్కడ పెరటిలో ఉన్న ఆవులు, దూడల వైపు కూడా దయగల చూపుతో అనుగ్రహాన్ని కురిపిస్తూ నిలబడిపోయారు. ఆయన మనందరినీ ఎలా ప్రేమగా కళ్ళల్లోకి చూస్తూ అనుగ్రహిస్తారో, అలా జంతుజాలంమీద కూడా అంతటి దివ్యమైన ప్రేమని, అనుగ్రహాన్ని కురిపించేవారు.

దేవీ నవరాత్రులు ఆయన సన్నిధిలో గడపడం అమ్మవారి ఒడిలో ఉన్నట్టుగా అనిపించింది. 5 రోజులూ ఆయనతో గడిపాకా, బయలుదేరే సమయానికి ఆయన మళ్ళీ నాతో మాట్లాడారు. నా కళ్ళల్లోకి అమితమైన దయతో చూస్తూ, "నువ్వు బ్లెస్డ్ చైల్డ్ అమ్మా ఉషా!" అని చెప్పి, అనుగ్రహం ఎప్పుడూ నీ వెంట ఉంటుంది అని ఆశీర్వదించారు.

మౌనంగా ఆయన పాదాలు తాకి వీడ్కోలు తీసుకున్నాను. విడిచి వెళ్ళలేక ఆయన రూపం కనిపిస్తున్నంతవరకూ వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాను. ఆయన రూపం అదృశ్యమైంది కానీ, ఆయన అనుగ్రహించినట్టుగానే ఆయన నావెంట ఎప్పుడూ ఉండనే ఉన్నారు.

నాన్న త్యాగరాజు మాటలు తరచుగా చెప్పేవారు: "నిధి చాలా సుఖమా! నీ సన్నిధి చాలా సుఖమా! ఓ రామా!" దీని అంతరార్థము... ఈ సృష్టిలో ఏ సంపదా నీ సన్నిధితో సమానం కాదు కదా అని.

No comments:

Post a Comment