Sunday, August 16, 2020

"శ్రీ నాన్న దివ్యచరణములే నాకు శరణము!" - (డా. ఉష గారు)

చిదంబరం నుంచి అరుణాచలం మొదటిసారి వెళ్ళినప్పుడు, స్నేహితురాలి కారులో సులభంగానే వెళ్ళాను. కానీ రెండవసారి వెళ్ళినప్పటినుంచీ అంటే, దాదాపు రెండు సం॥లు చాలా ఇబ్బందులు పడుతూ అరుణాచలం వెళ్ళేదాన్ని. అరుణాచలం వెళ్ళడానికి ట్రైన్స్ ఏమీ లేవని, డైరెక్ట్ బస్సులు కూడా లేవని చెప్పారు. నాకు అప్పటికి తమిళం తెలీదు. బస్టాప్ లో ఉన్న వాళ్ళని అడుగుదామంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. బస్సుల మీద కూడా తమిళ బాషే ఉండేది. వచ్చీరాని బాషలో అందర్నీ అడుగుతూ 3, 4 బస్సులు మారుతూ వెళ్ళవలసివచ్చేది. దీనివల్ల 4 గంటల ప్రయాణానికి దాదాపు 6, 7 గంటల సమయం పట్టేసేది. ఉదయం కాలేజ్ లో క్లాసులు ఉండటం వల్ల, మధ్యాహ్నం బయలుదేరవలసి వచ్చేది. ఒక్కోసారి బస్సులు మరీ లేటయిపోయి ఎక్కువసేపు వెయిట్ చేయడం వల్ల, నేను అరుణాచలం వెళ్ళేసరికి చాలాసార్లు అర్థరాత్రి అయిపోయేది.
     
అలాంటప్పుడు మర్నాడు ఉదయాన్నే నాన్నగారి దర్శనానికి వెళ్ళినప్పుడు, నేను వచ్చిన టైమ్ కరెక్ట్ గా చెప్తూ, రాత్రి చాలా ఆలస్యంగా వచ్చావమ్మా...! ఇంత దూరం ఇలా రావడానికి అలిసిపోవట్లేదా...? అని ఎంతో ప్రేమగా అడిగేవారు.  

అప్పుడు నేను లేదు నాన్నగారు, నాకు మీమీదే ధ్యాస ఉండటం వల్ల, ఆ ఆనందంలో అలసట తెలియడం లేదు అని చెబితే, చాలా సంతోషంతో రెండు చేతులూ పైకెత్తి ఆశీర్వదించేవారు.

నాకు ఇలా వెళ్ళిన ప్రతిసారీ కూడా దేహం మీద ధ్యాస ఉండేది కాదు. భయం కానీ, అలసట కానీ తెలిసేది కాదు. నాన్నగారి అనుగ్రహంలోనే నిరంతరం ఉండటం వల్ల, నా మనసంతా కూడా ఆయన మీదే కేంద్రీకరించబడి ఉండటం వల్ల, ఏదో ఒక శక్తి నా ప్రమేయం ఏమీ లేకుండానే నన్ను అరుణాచలం వైపు లాక్కెళ్తున్నట్టు నాకు అనుభవమయ్యేది. ఇదంతా చాలా సహజంగా జరిగేది. నాకు ఆశ్చర్యంగా కూడా ఉండేది కాదు. ఆయన నాతో పైకి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, మౌనంగానే నాకు లోపల గైడెన్స్ ఇచ్చేవారు. ఇలా ప్రయాణాలు చేయడానికి కావాల్సిన శక్తిని, ధైర్యాన్ని, సహనాన్ని నాకు నిశ్శబ్ధంగానే అందించేవారు. అలా మెల్ల మెల్లగా నన్ను శరణాగతివైపు నడిపించారు.

ఒకసారి అలా నాన్నగారి కోసం అరుణాచలం వెళ్తున్నప్పుడు, విల్లుపురం నుంచి అరుణాచలం వెళ్ళే బస్సులో ప్రయాణం చేస్తున్నాను. మార్గం మధ్యలో బస్ పాడవడం వల్ల ఏదో ఊరిలో తెలియని చోట బస్ ఆపేసాడు. అప్పటికే సమయం రాత్రి 11 గం అవుతోంది. చుట్టూ చూస్తే ఆడవాళ్ళు ఎవరూ కనిపించలేదు. ఎక్కువ మంది పెద్దవయసు మగవాళ్ళు, ఒకరిద్దరు తాగేసివున్న వ్యక్తులు కనిపించారు.

కొంతసేపు చూసి అక్కడున్న ఒక వ్యక్తిని అరుణాచలం వెళ్ళే బస్ వస్తుందా? అని అడిగాను. ఆయన లేదు ఇందాకే ఆఖరి బస్ వెళ్ళిపోయిందన్నారు. దాంతో నేను సందిగ్ధంగా, లాస్ట్ బస్ వెళ్ళిపోతే నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అని ఆలోచిస్తున్న 5 నిముషాలకి ఒక ముసలావిడ వచ్చి పక్కన నిలబడింది. ఎక్కడికి వెళ్ళాలని ఆమె నన్ను అడిగింది. అరుణాచలం వెళ్ళాలి, ఇక్కడ అడిగితే ఆఖరి బస్ వెళ్ళిపోయిందన్నారు అని చెప్పాను. లేదు లాస్ట్ బస్ ఇంకా వెళ్ళలేదు, ఈరోజు లేటయింది, కాసేపట్లో వస్తుంది, నేను కూడా అరుణాచలమే వెళ్ళాలి అని చెప్పి నవ్వింది. నిజంగానే, ఆమె చెప్పిన 5 నిముషాలకి బస్ వచ్చింది. ఆమె కూడా నాతో పాటు బస్ ఎక్కి సీట్లో నా పక్కనే కూర్చుంది. అరుణాచలంలో దిగాక నువ్వెక్కడికి వెళ్ళాలని అడిగింది. ఆంధ్ర ఆశ్రమంలో ఉన్న మా గురువుగారిని కలవడానికి వెళ్తున్నానని చెప్పాను. 
 
బస్ దిగిన తరువాత ఆమె నాతో పాటు ఆటో స్టేండ్ కి వచ్చి ఆటో ఎక్కించి, డ్రైవర్ తో జాగ్రత్తగా ఆశ్రమం దగ్గర దించమని తమిళంలో చెప్పింది. ఆమె నా పట్ల చూపించిన ప్రేమకి చాలా ఆనందమనిపించి నా కృతజ్ఞతలు తెలియ చేసాను. పదినిముషాల్లోనే ఆటో అతను నన్ను ఆశ్రమం వద్ద దించాడు. అప్పుడు సమయం రాత్రి 1.00 గం అయింది.

మరుసటి రోజు ఉదయం నాన్నగారి దర్శనానికి వెళ్ళినప్పుడు మొదటిమాటగా నాన్నగారు నాతో, రాత్రి చాలా ఆలస్యమయిందమ్మా, ఒంటిగంట అయిపోయునట్టుగా ఉంది కదా...అయినా సహకారం అందింది కదా...! అన్నారు. ఆమాటతో నేను చెప్పలేనంత ఆనందంతో ఆయన వైపు అలా చూస్తూ ఉండిపోయాను. గురువు అనుగ్రహం యొక్క ఉనికిని ప్రతిక్షణం అనుభవిస్తున్న నాకు "ఎంత అద్భుతం ఈ జీవితం...!" అనిపించింది.


నాన్న చెప్పేవారు - భగవాన్ ఇలా అనేవారని, "హృదయం హృదయంతో మాట్లాడు-కునేటప్పుడు మాటలతో పని ఏముంది అని". అలా మాట అవసరం లేకుండానే నాన్నగారికి, నాకూ మధ్య జరిగే మౌన భాషకి పరవశించి చాలాసార్లు... ఆయన పాదాలకు హృదయపూర్వకంగా నమస్కరించేదానిని.

ఈ ట్రిప్ లోనే నాన్నగారు మమ్మల్నందర్నీ విరూపాక్ష గుహకి, స్కందాశ్రమానికి తీసుకు వెళ్ళారు. ముందుగా విరూపాక్ష గుహకి వెళ్తుండగా, వెహికల్ దిగి కొండపైకి వెళ్ళేటప్పుడే నాన్నగారు చెప్పులు విప్పేసారు. అప్పుడు మధ్యాహ్న సమయం అవడం వల్ల కాళ్ళు కాలుతున్నాయి . నాన్నగారూ చెప్పులు వేసుకోండి అని మేము చెబితే, మీరందరూ వేసుకోండి పరవాలేదు, నేను మాత్రం వేసుకోనన్నారు. అరుణాచలం పట్ల ఆయనకున్న పవిత్రమైన భక్తికి, గౌరవానికి ఇదొక నిదర్శనం. నాన్నగారు ఆమాట అన్నప్పట్నించీ నేను కూడా ఎప్పుడూ చెప్పులు వేసుకొని కొండపైకి వెళ్ళలేదు.

విరూపాక్ష గుహలో మేమంతా దాదాపు రెండు గంటల సేపు గడిపాము. అక్కడ నాన్నగారు మాకు, భగవాన్ విరూపాక్ష గుహలో ,స్కంధాశ్రమంలో ఉన్నప్పుడు భగవాన్ కీ, భక్తులకి మధ్య జరిగిన సంఘటనలు వివరించి చెప్పారు. చెప్పారు. నాన్నగారు ఏ అవతార పురుషుల గురించి లేదా మహాత్ముల గురించి మాట్లాడినా కూడా అది రాముడైనా, కృష్ణుడైనా, రమణుడైనా, బుద్ధుడైనా, రామకృష్ణుడైనా, శంకరులైనా.... వారంతా ఏం చేసేవారో, ఎలా మాట్లాడేవారో అలా వారితో తాదాత్మ్యం చెంది చెప్పేవారు. నాన్నగారిని అలా చూసినప్పుడు ఆ క్షణాలలో మాకు, ఆ అవతార పురుషుల రూపాలే కళ్ళెదురుగా కనిపిస్తున్నట్లుగా అనుభవమయ్యేది.

కొంత సేపు అయ్యాకా నాన్నగారు, చిన్నప్పుడు నేను ఇక్కడ ఆడుకునే వాడిని అన్నారు ( నిజానికి నాన్నగారు అరుణాచలం మొదటి సారి వచ్చింది 1959 వ సంవత్సరం జనవరి నెలలో, అంటే అప్పటికి నాన్నగారి వయసు సుమారు 25 సం॥ రాలు ). ఇలాంటి కొన్ని, కొన్ని అరుదైన సందర్భాలలో మాత్రమే నాన్నగారు, ఆయన గత జన్మల స్మృతులను భక్తులకు యధాలాపంగా తెలియ చేసేవారు.


నాన్న అపారమైన ప్రేమతో పాడేవారు ఆ రోజుల్లో, "మా మాటల్లో నీవే.., ఆటల్లో నీవే.., పాటల్లో నీవే..., అన్నీ నీవే..., అంతా నీవే..., అవునా భగవాన్...?" అని. అప్పుడు మేమెరుగము, భగవాన్ గురించి ఏదయితే పాడుతున్నారో, అది ఆయన మాకు అయిపోతున్నారని.

No comments:

Post a Comment