Sunday, August 9, 2020

"శరణాగతివైపుగా చిన్ని అడుగులు” - (డా. ఉష గారు)

నా డెంటల్ 2వ సం॥రం మొదలయ్యాక (జూనియర్స్ ని రాగింగ్ చేసే టైం లో), చిదంబరం నుంచి అరుణాచలం వెళ్ళాలి అనే తపన మొదలైంది. ఎలా వెళ్ళాలో, ఎక్కడుందో తెలియక స్నేహితుల్ని అడిగాను. ఎవరికీ తెలియదన్నారు. అప్పుడు పాండిచ్చేరికి చెందిన (అరబిందో ఆశ్రమం భక్తులకి రమణాశ్రమం తెలుస్తుందేమో అని) ఒక స్నేహితురాలిని అడిగితే తెలియదని చెప్పింది. ఒక గంట తర్వాత ఆ స్నేహితురాలు వరండాలో నడిచి వెళ్తున్న నలుగురు జూనియర్స్ ని, రాగింగ్ చెయ్యటానికి తన రూంలోకి పిలిస్తే, వారిలో సింధు అనే అమ్మాయి ఊరు తిరువణ్ణామలై అని తెలిసి తనని నా రూంకి పంపింది. తన ఊరు తిరువణ్ణామలై అని తెలిసి నేను చాలా ఆనందంగా, తనని తిరువణ్ణామలై ఎలా వెళ్ళాలో చెపుతావా అని అడగగా, ఈ శనివారం మా నాన్నగారు నన్ను తీసుకువెళ్ళటానికి వస్తున్నారు మీరు కూడా మాతో రావొచ్చు అని చెప్పింది. ఆ శనివారం వాళ్ళతో కలిసి వాళ్ళ కార్లో మొదటిసారి తిరువణ్ణామలై వెళ్ళాను. అదే రోజు నాన్నగారు భక్తులతో తిరువణ్ణామలై వచ్చి అక్కడే ఉన్నారనే విషయం నాకు తెలియదు.

రమణాశ్రమంకి వెళ్తూ వుంటే దారిలో భక్తులు, మా ఇద్దరు అక్కలు కనిపించారు. వెంటనే కారు దిగిపోయాను. నన్ను చూసి అక్కలిద్దరూ ఆశ్చర్యంగా, అయితే నాన్నగారికి నువ్వొస్తునట్టు ముందే తెలుసు అన్నమాట అన్నారు.


నేను వస్తున్నట్టు నాకే తెలియదు ఆయనకి ఎలా తెలిసిందని అడిగాను.

అప్పుడు అక్కలిద్దరు, ఒక గంట క్రితమే నాన్నగారితో ఉషకి మనం వస్తున్నట్టు తెలిసుంటే ఎదో రకంగా వచ్చేసేది నాన్నగారు అంటే, అప్పుడు ఆయన ఉష వస్తోంది కదా,దారిలో వుంది అన్నారు.

ఎదో యాదాలాపంగా అన్నారేమో అనుకున్నాం అని, నాన్నగారు ఇప్పుడే లోపలికి వెళ్ళారు తలుపు వేసుకుంటారేమో త్వరగా వెళ్ళి దర్శనం చేసుకో అన్నారు.

అప్పటికే నా చేతిలో రమణాశ్రమంలో ఇద్దామని దారిలో కొన్న పెద్ద గులాబీల గుత్తి ఉంది. అది తీసుకుని నాన్నగారి దగ్గరికి చాలా ఉత్సాహంగా వెళ్ళాను.

నన్ను చూడగానే ఆయన ఇంకా ఉత్సాహంగా, "వచ్చేసావమ్మా ఉషా..! అని గులాబీల వంక చూస్తూ ఇదేంటమ్మా?" అన్నారు. అరుణాచలం రావడం మొదటి సారి కదా నాన్నగారూ అందుకని దారిలో కొన్నానని ఆయనకి ఇచ్చేసాను. చాలా సంతోషం అమ్మా అని, నీకు అరుణాచలం అంతా చూపిస్తాను అన్నారు. అప్పటినుంచి రమణాశ్రమంలో టిఫిన్లకి, భోజనానికి వెళ్ళినప్పుడల్లా ఆయన పక్కనే కూర్చోపెట్టుకుని ఆయనకు వడ్డించే ప్రతీది నాకు వేసేవారు. హద్దులు లేని ఆయన దివ్యప్రేమలో నేను మైమరిచిపోయిన ఆ క్షణాల్లో, కన్నీళ్ళు ప్రవాహంలా వచ్చేవి. ఆయన ప్రేమలాగే నా కన్నీళ్ళకి కూడా హద్దులుండవేమో అనిపించేది.


గురువుకి మనం ఏవైనా చిన్న చిన్న బహుమతులు పళ్ళు, స్వీట్లు లాంటివి ఇచ్చినా, అవి అన్నీ భగవంతుడి సృష్టి లో ఒక భాగమే.భగవంతుడికి, గురువుకి ఏమిచ్చినా ఆయన సొత్తు ఆయనకే ఇచ్చినట్టు అవుతుంది. నాన్నగారు ఇలాంటి సందర్భాల్లో ఒక కథ చెప్పేవారు. ఒక భక్తుడు బెల్లంతో వినాయకుడిని చేసి, నైవేద్యం పెట్టడానికి ఏమీ లేకపోతే, ఆ బెల్లం వినాయకుడి పొట్టదగ్గరనుంచి చిన్న బెల్లం ముక్కని చిదిపి ప్రసాదంగా పెట్టాడు. అలాగే మనం భగవంతుడికి లేదా గురువుకి, ఏమిచ్చినా అది ఆయనకి చెందిందే అవుతుంది. అయితే, మనకి భగవంతుడికి, లేదా గురువుకి, ఏదైనా సమర్పించే అలవాటు ఉండాలని నాన్నగారు చెప్పేవారు. ఎందుకంటే ఇలాంటి అలవాటు ఉంటే,మన అహంకారాన్ని కూడా అర్పించగలుగుతాం. ఇలా ఇవ్వడం నేర్చుకుంటే, ఏదో ఒకరోజు మన నేనును కూడా కోల్పోయి భగవత్స్వరూపాన్ని పొందుతాము.

No comments:

Post a Comment