Monday, August 24, 2020

"వాక్యము భగవంతుడై ఉన్నాడు" - (By సుజాతా1 గారు)

శ్రీ నాన్నగారు 1988-89 ప్రాంతంలో మా ఇంటికి వచ్చారు. ఆయన్ని మా మామగారి స్నేహితునిగా, ఒక బంధువుగానే మర్యాద చెసేవాళ్లం. చాలా మంది భక్తులు ఆయన్ని దర్శించుకోవటానికి వచ్చేవారు.

ఆయన అలా చాలా సార్లు వచ్చారు. బోధలు కూడా చెసేవారు. ఆయన అందరి కళ్లల్లోకి తదేకంగా చూసేవారు. భక్తులు కూడా ఆయన కళ్లల్లోకి చూసేవారు. ఎవరో నన్ను కూడా ఆయన కళ్లల్లోకి చూడమన్నారు. కాని నేను చూడ లేక పోయాను. విష్ణు సహస్ర నామాలు చదివితే అందులో ఒక శ్లోకంలో భగవంతుడు మన వైపు చూస్తే సరిపోతుంది అని ఉంది. ఈ మాట పట్టుకొని నాన్నగారి దగ్గరకు వెళ్లి, “విష్ణు సహస్రనామాల్లో ఇలా ఉంది. అందరూ మీ కళ్లల్లోకి చూడమంటున్నారు. నేను చూడలేక పోతున్నాను” అంటే, దానికి ఎమి సమాధానం చెప్పారో గుర్తు లేదు. కాని, “నేను నీ తండ్రి లాంటి వాడను. ఏ సందేహం వచ్చినా నన్నడుగు” అని ప్రేమ చూపించారు.

నన్ను భగవద్గీత చదవమనే వారు. అలాగే చదివే దాన్ని. చదవగా చదవగా అది తియ్యగా అనిపించేది. ఆయన నిశ్శబ్దముగా పని చేస్తూ నన్ను హృదయం వైపు ఆకర్షిస్తున్నారన్న సంగతి ఎప్పటికో గాని తెలియలేదు.


భౌతికంగా ఏ లోటూ లేకపొయినా ఇదే నిజమనుకొని, ఎలా జీవించాలో తెలియని నాకు, ఎటు గాలి వీస్తే అటు వెళ్లిపోయే నాకు, నాన్నగారు దొరకటము చాలా అదృష్టము. ఎందుకంటే నిజమైన సుఖమేదో తెల్పి ఆ మార్గంలో ప్రయాణించేటట్లు చేసారు.

నాన్నగారిది పవిత్రమైన ప్రేమ, దయ. ఆయన మాట, చూపు,దేహం ...అంతా ప్రేమ మయం. ఆయనను గమనిస్తే, అందరికీ అర్థమైయ్యేదే. ఈ ప్రేమ అందరిని ఆకర్షిస్తుంది...తన వైపు లాక్కుంటుంది. నాన్నగారు భౌతికంగా, ఆధ్యత్మికంగా అన్ని రకములుగా సహాయం చేస్తున్నారు. పరిపూర్ణమైన గురువు శ్రీ నాన్నగారు.

నాకు ఆయన బోధలంటే ఇష్టం. ఆయన మొదటి నుండి “నాకు దండాలొద్దు, నమస్కారాలొద్దు. నేను చెప్పినది విని అర్థం చేసుకొని జీవించండి” అని, “ మాట దేవుడై ఉన్నాడు” అని చెప్పి ఆయన పని ఆయన ఒక నిమిషమన్నా ఖాళీ లేకుండా చేసుకొని పోతున్నారు. అంతులేని ప్రేమతో తను పొందే ఆనంద స్థితికి మనలని తీసుకు వెళ్లటమే వారి పని. ఇది గుర్తుకు వస్తే ఒక క్షణం మనసు అణుగుతుంది. ఎంతో బాధ్యతగా భగవంతుడు చెప్పినట్టు జీవించాలనే ప్రేరణ కలుగుతుంది.


నాన్నగారంటే ఇష్టమున్న ఎందరో భక్తుల్ని చూసాను.మొదట నాకు అసూయ వచ్చేది. కాని ఇప్పుడనిపిస్తుంది, వాళ్ల మనసుల్ని ఎంత ఖాళీ చేసుకుంటే ఆ ప్రేమ ఉబికి ఉబికి వస్తోందోనని.

నాన్నగార్ని చూస్తూ, ఆయన మాటల్ని వింటూ, ఆయన భక్తులతో సహవాసం చేస్తూ, ఆయన సమక్షంలో జరిగిన మధుర స్మృతులలో నా జీవితాన్ని మధురం చేసుకొని, నన్ను నేను అర్పణ చేసుకోవాలని అంతులేని కోరిక. ఈ అనుబంధం... మనసు లేదు భగవంతుడు ఒక్కడే ఉన్నాడనే చిటారు కొమ్మకి తీసుకెళ్లి పోతుందని నా ప్రగాఢ విశ్వాసం.

No comments:

Post a Comment