మెల్లగా ఆయన దగ్గరకు వెళ్లాను. “ఎక్కడుంటావమ్మా?” అని అడిగారు...చెప్పాను...
నిన్ను ఇప్పుడు చూస్తున్నాను కాని ఆ ఇంటి పునాదుల్తో సహా నాకు పరిచయం ఉందమ్మ” అన్నారు.
ఆ మాటలు ఆ రోజు అర్థం కాలేదు కాని ఇప్పుడనిపిస్తూంది- దేహ సంబంధాలు దేహం పోగానే తెగిపోతాయి. కాని గురువుతో ఉన్న సంబంధం జన్మ జన్మలకు వెంటాదుతుందని, మన అడ్రస్సు గురువుకు కాక ఎవరికి తెలుస్తుంది? అలా నాన్నగారు నా జీవితంలో ప్రవేశించారు.

ఒక సారి ఇంటికి రమ్మని ఆహ్వానించి వచ్చేసాను. నాన్నగారి గురించి పెద్దగా తెలియదు కాని చూడగానే తండ్రి భావం కలిగింది. తరువాత రెండు రోజులు ఎప్పుడు కనిపించినా “నేను మీ ఇంటికి వస్తానమ్మా” అనేవారు తండ్రి. అందరూ వచ్చి నిన్ను ఎంతో ప్రేమగా వారి ఇళ్లకు తీసుకువెళతారు. దగ్గరలో ఉండి తీసుకు రాలేక పోతున్నాను అనిపించింది. అనుకోకుండా ఒక రోజు నాన్నగారే మా ఇంటికి స్వయంగా వచ్చారు. చెప్పలేని ఆనందం కలిగింది. ఆయన అడుగులతో మా ఇల్లు పావనం అయ్యింది. ఒక గంట కూర్చున్నారు.
రేపు ప్రసంగం ఉంది రామ్మా! వీలులేకపోతే రాలేకపోయానని బాధపడకు అన్నారు. వారు చెప్పినట్లుగానే కొన్ని కారణాల వల్ల ప్రసంగానికి వెళ్లలేక పోయాను. అలాగే బాధ కూడా అనిపించలేదు. జరిగేది ఈశ్వర సంకల్పమంటూ వారి మాట ద్వారా ఉపదేశం అందించినట్లనిపించింది.

నాన్నగారితో ఎప్పుడు మాట్లాడుదామనుకున్నా కన్నీరు తప్ప మాట రాదు. ఇదేమిటి అని అడిగా ఒక సారి- “ గురువంటే ఎవరనుకున్నావమ్మా- “ ఆప్తుడు” . ఆప్తుడి దగ్గర కన్నీరే వస్తుంది అని మూడు సార్లు “ ఆప్తాయ నమః” అన్నారు. అలా ఈ జీవుణ్ణి అతి సన్నిహితంగా తీసుకువచ్చారు.
పవిత్రత లేకుండా జ్ఞానం రాదంటారు. అలా పవిత్రంగా జీవించడానికి నాన్నగారు చెప్పిన 7 సూత్రాలు మా నిత్య జీవితం లో భాగాలుగా చేసుకున్నాం.
1. శ్రవణం
2. మననం
3. సత్సంగం
4. సద్ గ్రంథపఠనం
5. సజ్జనసహవాసం ( మంచిస్నేహాలు)
6. సత్పురుషుల సాంగత్యం
7. కపటం లేకుండా జీవించటం (మనసు, మాట, చేత ఒకేలా ఉండటం).
సంసార విషవృక్షంలో భగవంతుడు రెండు తియ్యటి ఫలాల్ని ప్రసాదించాడు.
a. సత్పురుషుల సాంగత్యం
b. రసాస్వాదనం. మనకి ఏ ప్రయాస లేకుండా వారి అమృతవాక్కులలోని రసాస్వాదన మన చేత చేయిస్తున్నారు. భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే ఇంతకు మించిన దురదృష్టం మరొకటి ఉండదు.
ఇక్క మాటలో నాన్నగారి గురించి చెప్పాలంటే- నాన్నగారంటే ప్రేమ. ప్రేమంటే నాన్నగారు.
No comments:
Post a Comment