Saturday, July 18, 2020

"దేవుడే నా గురువుగా..." - (డా. ఉష గారు)

ఒక సౌందర్య మూర్తి అందాన్ని మాటల్లో వర్ణించలేక "భూమి మీద నడుస్తున్న స్వర్గం" అని షేక్స్ఫియర్ ఒక నాటకంలో అన్నాడని నాన్న చెప్తే విన్నాను. కానీ, నా దృష్టిలో నాన్నకి భిన్నంగా స్వర్గంలేదు. ఆయన దివ్యమైన ప్రేమ, శాంతి, దయ, ఆనందము, ఓదార్పు, కరుణ మూర్తీభవించిన దివ్య స్వరూపులు.


ఆయనను భౌతికంగా 1991వ సం॥రం లో దర్శించాను. కానీ నేను అంతకు మునుపే ఆయన సాన్నిధ్యాన్ని చెట్ల పచ్చదనంలోనూ, పంటపొలాల్లోనూ, అచలమైన కొండల్లోనూ, ప్రకృతినిశ్శబ్ధం లోనూ, ఏకాంతంలోనూ, బాధలోనూ, చల్లటి గాలిలోనూ, చంటిపిల్లల్లోనూ నా హృదయంలో కూడా దర్శిస్తూనే వచ్చాను. ఈ విషయం నాకు ఆయనను భౌతికంగా కలిసి కొంతకాలం గడిపిన తరువాత అర్థమయింది.

భగవంతుడు ఎవరు? ఆయన స్వరూపము ఏమిటి? మనము ఎవరు? ఈ దేహాలు ఎందుకు వచ్చినియ్యి. జీవితం గమ్యం ఏమిటి? పుట్టిన మొదలు చనిపోయేవరకు ఏదో చేస్తువుంటాము. ఇవన్నీ దేనికి? మరణానంతరం ఏమౌతుంది? ఈ ప్రశ్నలు చిన్నప్పట్నుంచి నన్ను వేదించేవి. అద్దంలో చూసుకున్నప్పుడు దేహం ప్రతిబింభం కనిపిస్తుంది,కాని దానితో సంబంధం లేకుండా లోపల ఎక్కడినుంచో ఆలోచనలు వస్తున్నాయి. ఈ దేహం నేను కాదు. లోపల తలంపులు నేనా? నేనెవరు? అని అప్పుడప్పుడు అనిపించేది. చాలా మంది స్వాములు దర్శనం అయ్యింది. ఎవరిని అడిగినా దానికి సరైన సమాధానం రాలేదు. పూజలు చెయ్యి, జపం చెయ్యి అని చెప్పేవారు. ఆ సమాధానం నాకు తృప్తిని ఇవ్వలేదు. అయినా పెద్దవారు చెప్పారు కదా అని చేసేదాన్ని. భగవంతుని గైడెన్సు హార్ట్ లో తెలుస్తుండేది. అంతా ఆయన నిర్ణయం. ఎప్పుడు తెలియచెయ్యాలో అప్పుడు తెలియచేస్తాడు అని సర్దుకుపోయేదాన్ని.

నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు, ఒక శివరాత్రి రోజు రాజరాజేశ్వరానంద గారు ( శివానంద గారి దగ్గర ఆఖరి సన్యాసం తీసుకున్న శిష్యులు ) పరిచయం అయ్యారు. నేను నడిచే ఆధ్యాత్మిక మార్గంలో ఆయన కొంత వెలుగు చూపారు. కానీ అది నాకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు.

ఒకరోజు ఆయన నన్ను దీక్ష ( మంత్రోపదేశం ) తీసుకుంటావా? అని అడిగితే, భగవంతుడిని గురువుగా చేసుకోవచ్చా? అని అడిగాను. ఆయన చిరునవ్వుతో, అంతటా ఉన్న రూపంలేని భగవంతుడు, రూపం తీసుకొని గురువుగా వస్తాడని ఎలా చెప్పగలను? అన్నారు. కానీ భగవంతుడే గురువుగా ఉండాలని నేను పట్టుబట్టినప్పుడు, ప్రస్తుతానికి శుక్రవారం రోజు లలితా సహస్రనామం చేసుకోమన్నారు. రోజూ శ్రీ సూక్తం చదువుకోమన్నారు. కుదిరినప్పుడల్లా "ఓం నమః శివాయ" అని జపించుకోమన్నారు.

కొంతకాలం అది చెయ్యగా, అకారణంగా కన్నీరు వచ్చేది. తరువాత కొంతకాలానికి షిరిడీ సాయిబాబా వైపు ఆకర్షింపబడ్డాను. ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే మానసికంగా ఆయనకి చెప్పుకునేదాన్ని ( ఒక స్నేహితునికి చెప్పుకున్నట్లు ). ఆయన కలల్లోకి వచ్చేవారు. ఆయన అన్ని విధాలుగా మార్గం చూపించేవారు.

ప్రతిరోజూ సాయంత్రం సమయంలో నేను ఎక్కడ, ఏ ప్రదేశంలో ఉన్నా, సూర్యాస్తమయం వేళకి ఇంటికి వచ్చి మేడపైకి వెళ్ళి ఏకాంతంగా ఆకాశం వైపు చూస్తూ ఉండేదాన్ని. సూర్యుడు పూర్తిగా అస్తమించి, చూట్టూ ఉన్న పరిసరాలు వెలుతురు నుంచి చీకటిగా మార్పు చెందేవరకూ, అంటే దాదాపుగా గంటన్నర సమయంలో చుట్టూ జరుగుతున్నవన్నీ గమనిస్తూ ఉండేదాన్ని. పక్షులు గూటికి చేరుకోవడాన్ని, చెట్లనూ, ప్రకృతినీ గమనిస్తూ నిశ్శబ్ధంలోకి వెళ్ళేదాన్ని. ఆలా నిశ్శబ్ధాన్ని ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు నాకు ఈ నిశ్శబ్ధమే భగవంతుడు అయి ఉంటాడా? లేక దానికి మించి ఇంకేమయినా ఉందా ? అని ఆలోచన వచ్చేది.

ఇలా సం॥ లు గడిచే కొద్దీ ఆయనే సర్వస్వం అయ్యారు. అతి సన్నిహిత స్నేహితునిలా ఎప్పుడూ నా కూడా ఉన్నట్లు అనిపించేది. కొన్ని సం॥లు గడిచిన తరువాత ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు, ఒకసారి బాబా భక్తులతో షిరిడీ వెళ్ళడం జరిగింది.

ఉదయం బాబా దర్శనం అయ్యాకా, నా స్నేహితురాలు బాబా సన్నిధి నుంచి ఒక పువ్వు ఇమ్మని పూజారిగారిని అడిగితే, ఆయన గులాబీ పువ్వు తీసి ఇచ్చారు. అదే రోజు సాయంత్రం హారతి అయ్యాకా, దర్శనం సమయంలో నా స్నేహితురాలి తల్లి పువ్వు ఇమ్మని పూజారిగారిని అడిగితే, ఆయన బాబా మెడలోంచి లిల్లీపూల దండ తీసి ఇచ్చారు. వారికి ఏ పూలు ఇష్టమో అవే ఇవ్వడంతో, వారు ఎంతో ఆనందపడ్డారు.ఇదంతా చూసి నేను నవ్వుకుంటూ, నీ వాళ్ళు నిన్ను అడిగితే కానీ పువ్వులు ఇవ్వవా? అడగందే ఏమీ ఇవ్వవన్నమాట! అని నాలో నేను అనుకున్నాను. తరువాత అక్కడికి దగ్గరలో ఉన్న చావడికి వెళ్ళి, గోడ దగ్గర బాబా ధ్యానం చేసుకునే ప్రదేశాన్ని చూసాను. అక్కడ అంతా గమనిస్తూ, బాబాయే భగవంతుడు కదా! ఆయన మళ్ళీ ఇక్కడ ధ్యానం, ప్రార్థన చేసుకోవడం ఏమిటి? అనుకున్నాను.

భక్తులంతా వచ్చి అక్కడ ఉన్న తీగమీద పూలదండలు వేస్తున్నారు. ఈలోపు ఒక వ్యక్తి వెనక నుంచి నాభుజం తడితే తిరిగి చూసాను. మంచి రంగురంగుల గులాబీ పూలతో ఉన్న దండ ఇచ్చి అక్కడ వెయ్యమన్నారు. నన్ను ఎవరో అనుకొని పొరపాటుగా ఇస్తున్నారేమో అని, నేను కాదని సైగ చేసాను. నువ్వే ఈ దండ అక్కడ వెయ్యి అన్నారు. నేను దండ వేసి తిరిగి చూసేసరికి ఆ మనిషి కనిపించలేదు. అదృశ్యమయ్యారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్ని వైపులా చూస్తే కనిపించలేదు. ఇదంతా చూసి నేను షాకయ్యాను. ఏ మాటలూ లేకుండా అక్కడ మెట్లమీద కూర్చుండిపోతే కన్నీళ్ళొచ్చాయి. అంటే, కేవలం ప్రార్థనే కాదు, భగవంతుడు ఉన్నాడని నమ్మితే...! తల్లితండ్రుల కన్నా, స్నేహితుల కన్నా, అతి సన్నిహితంగా ఆయన ఉన్నాడు కదా...! నేను ఎప్పటికీ ఒంటరిని కాదు అనిపించింది. రూపరహితంగా ఆయనని తలపెట్టుకుంటూ ఉంటే, అవసరమయితే రూపం ధరించి వస్తాడని నాకు సజీవంగా అనుభవమయింది. భగవంతుడికి ఏదైనా సాధ్యమే అని అర్థమయింది

షిరిడీలో ఆఖరి దర్శనం చేసుకున్న-ప్పుడు బాబాని, ఇన్ని రోజులూ నేను తల్లిదండ్రుల రక్షణలో ఉన్నాను, ఇప్పుడు చదువుకోసం దూరప్రాంతానికి, తెలియని కొత్త ప్రదేశానికి వెళ్ళబోతున్నాను, కనుక నువ్వు ఎప్పుడూ నాకు రక్షణగా ఉండాలని ప్రార్థించాను. తరువాత తిరుగు ప్రయాణంలో ట్రైన్ లో నిద్రపోతున్నప్పుడు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను చీకటిలో ఒంటరిగా ఉన్నాను. నీడలాంటి నల్లటి ఆకారాలు వందలకొద్దీ నా వైపు వస్తున్నాయి. అప్పుడు నేను భయంతో కళ్ళు మూసుకొని బాబాని రక్షించమని ప్రార్థించాను.

వెంటనే బాబా నా పక్కనే ప్రత్యక్షమయ్యారు. ఆయన చేతిలో ఉన్న కర్రతో మా చుట్టూ రౌండు గా గీత గీసారు. ఆయన గీస్తున్నప్పుడే, ఆ గీత వెంబడి కర్రతో పాటు మంటలు సర్కిల్ చూట్టూ ఆక్రమించుకున్నాయి. నేను, బాబా సర్కిల్ మధ్యలో ఉన్నాము. నన్ను భయపెడుతున్న నీడలాంటి ఆకారాలు మా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసినా, మంటల వల్ల లోనికి రాలేకపోతున్నాయి. వెంటనే నాకు కల నుండి మెలుకువ వచ్చింది.

అప్పుడు నేను అనుకున్నాను. నేను ఎప్పుడు, ఎక్కడికి వెళ్ళినా బాబా తోడుగా ఉంటారు, అన్నీ ఆయనే చూసుకుంటారు అని. ఆఖరి దర్శనంలో నేను చేసిన ప్రార్థనకి బాబా ఈ విధంగా బదులు పలికారని నమ్మకం కలిగింది. ఈ సంఘటనతో నాకు ఎంతో ధైర్యం కలగడంతో పాటు, ఆయన పట్ల విశ్వాసం పెరిగింది.

షిరిడీ నుండి తిరిగి వచ్చాక, మా అక్క నాతో నాన్నగారి ప్రవచనాలు చాలా బావుంటాయి వచ్చి విను అని చెప్పింది. నేను షిరిడీ సాయిబాబాను నమ్ముకున్నాను, సజీవమైన అనుభవాలతో నాకు గైడెన్స్ ఇస్తున్నారు, నేను ఎక్కడికీ రాను అని చెప్పాను. తరువాత వారం రోజులకి నాన్నగారు మా పక్కింటికి వచ్చారు. వారితో నాన్నగారు మీ పొరుగున ఎవరు ఉన్నారు? అని అడిగారట. కొత్తగా వచ్చారు వాళ్ళు మీకు పరిచయం లేదు అంటే, నాకు వాళ్ళు తెలుసు వాళ్ళింటికి వెళదాము, మనమంతా అక్కడే కూర్చుందాము అని నాన్నగారు చెప్పారట.

వాళ్ళతో నాన్నగారు మా ఇంటికి వచ్చి, ఇంట్లో మనిషిలాగ అన్ని గదులూ తిరుగుతూ, దేవుడి గది కూడా చూసి, కలశం గురించి అడిగి నవ్వుతూ వచ్చి సోఫాలో కూర్చున్నారు. జరిగేదంతా మేము ఆశ్చర్యంగా చూస్తున్నాము. అప్పుడు నన్ను చదువు, స్కూలు గురించి వివరాలు అడుగుతూ, స్పిరిట్యుయల్ బుక్స్ ఏం చదివానో కూడా అడిగారు. మేము స్కూల్లో చేసే ప్రార్థన గురించి అడిగి, ప్రార్థనలో రెండు, మూడు లైన్లు నాతో పాడించి విశ్వమంతా నిండిన చైతన్యాన్నే మీరు ఆరాధించారమ్మా...! అన్నారు.

నాన్నగారు మొదటి రోజునే నన్ను, "నువ్వు భవిష్యత్తులో ఏమి చదువుదామనుకుంటున్నావు?" అని అడిగారు.

MBBS కి ప్రిపేర్ అవుదామనుకుంటున్నాను నాన్నగారూ అని చెప్పాను. ఆయన, "ఉషా..! నీకు మెడిసిన్ కంటే కూడా డెంటల్ డిగ్రీ చదివితే మంచిదమ్మా! మెడిసిన్ అంటే చాలా సం॥లు చదవాల్సుంటుంది, PG కూడా చెయ్యాల్సి వస్తుంది, లేకపోతే మంచిప్రాక్టీస్ ఉండదు. అదే డెంటల్ అయితే త్వరగా పూర్తి అయిపోతుంది, దీనికి PG అంత అవసరం ఉండదు. ప్రాక్టీస్ కీ బావుంటుంది, ఎమర్జెన్సీస్ ఉండవు. ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్ట్రబ్ అవదు. ఆడుతూ, పాడుతూ చదువు కోవచ్చు. నా దగ్గరకు తరచుగా రావచ్చు. ఆధ్యాత్మిక జీవితం కూడా సులభం అవుతుంది. మీ నాన్నగారు ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ డెంటల్ జోయిన్ అవుదువుగాని అన్నారు".

గంటసేపు అందరినీ పలకరించి తిరిగివెళుతూ, తరచూ నా దగ్గరకు వస్తూ ఉండండి అన్నారు.

మర్నాడు మధ్యాహ్నం నేను మా పొరుగువారితో కలిసి వేరే భక్తుల ఇంట్లో జరిగిన నాన్నగారి సత్సంగానికి వెళ్ళాను. నాన్నగారి దగ్గరకు వెళ్తుంటే, ఒక వ్యక్తి వెనుకనుండి నన్ను పిలిచి ఒక దండ ఇచ్చి నాన్నగారి మెడలో వెయ్యమన్నారు. మీరే తెచ్చారు కదా! మీరే వెయ్యండి అన్నాను. నాకు మొహమాటం నువ్వే వెయ్యి అన్నారు. నాకు వెంటనే షిరిడీలో కొత్త వ్యక్తి నాకు దండ ఇవ్వడం జ్ఞాపకం వచ్చింది. భగవంతుడే గురువుగా కావాలని నేను అనుకోవడం వల్ల, ఆయనే గురువుగా వచ్చారని నాకు సూచన ఇస్తున్నట్లు అనిపించింది.


1 comment: