Saturday, July 18, 2020

"సాధన కంటే విశ్వాసం ఎంత గొప్పది" - (సావిత్రమ్మ గారు)

అమ్మ మాట నిజంగా వేదమే! నిన్ను ఒక్క సారి దర్శనం చేసుకోమని పదే పదే చెప్పేది. కాని ఆ మాటలు ఈ కొంటె మనసు వింటేగా! తాతగారి మరణం నా మనసుని కలచివేసింది. ఎక్కడికీ వెళ్లాలనిపించేది కాదు. అప్పుడే నీ “అమృత వాక్కులు”, “ పసిడి పలుకులు” చదివాను. అమ్మకి నువ్వంటే పంచప్రాణాలు. నన్ను కూడ నీకు దగ్గర చేయాలని ఆవిడ తపన, ఎందుకో తర్వాత గాని అర్థం కాలేదు.

ఆ రోజు సఖినేటిపల్లి లో సత్యనారయణ రాజు గారి ఇంట్లో మొదటిసారిగా నిన్ను చూసాను. హాలంతా జనంతో నిండిపొయి ఉంది. ఎక్కడో దూరంగా ఒక మూల ఒడిగా కూర్చున్న నాపై నీ చూపు పడింది. అమ్మ మాటలు గుర్తుకొచ్చాయి. దగ్గరగా పిలిచావు. కూర్చోమన్నావు. అంతే!! ఆ ప్రథమ దర్శనంతోనే నీ దాసురాలనయ్యాను. ఏదో తెలీని ఆనందంతో మనసు నింపావు. మా ఇంటికి వస్తానన్నావు. ఎంత అర్హతను ప్రసాదించావు! మేలిమి బంగారంలా మెరిసిపోతూ, గుమ్మంలో అడుగుపెడ్తున్న నిన్ను చూసి క్షణకాలం ...ఇది కలా! నిజమా! అని సందేహించాను. “మనింటికి మనం వచ్చాం” అన్న నీ మాట నీకు-నాకు మధ్య ఉన్న బంధాన్ని గుర్తుకు తెచ్చింది. నీ పాదలను తాకినపుడు ‘ మచ్చలేని గురువు’ అన్న మధుర స్వరం విన్నాను. “ఓ మహానుభావుడు నీ ఇంటికి వస్తాడు. నువ్వు గుమ్మం దిగక్కర్లేదు. తరిస్తావు” అని ఎప్పుడో ఓ సిధాంతి చెప్పిన మాటలను నిజం చేసావు.


నీ ప్రేమతో కట్టేసావు. మెలకువలో, స్వప్నంలో, కూర్చున్నా, నించున్నా..నాతో మాట్లాడావు. నిన్ను మర్చిపోయిన క్షణం భరించరానిదిగా ఉండేది. అనుక్షణం వెంటాడావు. నిన్ను చూడకుండా ఉండలేననిపించింది. ఇదంతా నేను కావాలని కోరుకున్నది కాదు. నువ్వే నన్ను లాక్కున్నావు.

ఇది వరలో ప్రతిదానికీ కంగారే. పని జరిగితే సంతోషం, జరగక పోతే దుఃఖం వచ్చేది. చెంచా పొయినా బాధ పడి పోయేది మనసు.మంత్రగాడిలా అన్నీ మాయం చెసేశావు. చేతిలో కత్తెర లేకుండా ఆపరేషన్ చేసేశావు. ఇప్పుడు భూమ్యాకాశాలు ఏకమైనా చలించని ఎత్తుకు తీసుకెళ్లావు. నీ ప్రేమతో బంధించేశావు.ఆ ప్రేమ నా ఒక్క దాని సొంతమే అనుకున్నాను. ఎంత పిచ్చి భ్రమ! రేపల్లె లో ప్రతి గోపికకు కృష్ణుడు తన వాడేనన్న భావన నింపిన నల్లనయ్యవు నువ్వేనా అనిపించింది అందరి పట్ల నీ ప్రేమ చూశాక.


కుడి చేత్తో తుండును ఊపుతూ, విలాసంగా నడిచే నీ నడక చూసి మురిసిపోతాను. నీళ్లు తాగుతూ గ్లాసును అందంగా తిప్పే నీ చేతులను చూసి మురిసిపోతాను. నిర్మలంగా చూసే నీ చూపు చూసి మురిసిపోతాను. అమృతము కురిపించే నీ మాటకు మురిసిపోతాను. సోఫాలో రెండు కాళ్లు మడత వేసి కూర్చునే భంగిని చూసి మురిసిపోతాను. పొట్ట నిమురుకుంటూ బోసినోటితో నువ్వు తేన్చుతూ ఉంటే చూసి మురిసిపోతాను. కళ్లు మూసుకుని చూస్తూన్న నీ చూపుకు మురిసిపొతాను. నా మనసులోని మాటని విన్నట్టుగా తల ఊపుతూ అభయ హస్తం తో ఆశీర్వదించే నీ సుందర రూపాన్ని చూసి మురిసిపోతాను. ఇలా ఎన్ని చెప్పను? నిన్ను చూశాక సృష్టిలో ఇంక చూడాల్సింది ఏమీ లేదనిపిస్తుంది.

నీ కృపను ఎలా కనిపెట్టానో చెప్పమంటావా? నిన్నటి వరకు నిన్ను చూడాలన్న తపన. ఇప్పుడనిపిస్తుంది “నువ్వు లేని చోటు ఎక్కడుందని”. సాధన కంటే విశ్వాసం ఎంత గొప్పది!!

No comments:

Post a Comment