Saturday, July 11, 2020

" శ్రీ నాన్నగారి ప్రేమ అపూర్వం" - (హిమ బిందు)


‘శ్రీ నాన్నగారు’ అన్న పేరు నేను మొట్టమొదటి సారిగా 4.10.1991 న ఒక స్నేహితురాలి ద్వారా విన్నాను.ఆ స్వామి ఈ స్వామి అని చాలా మంది గురువుల గురించి విన్నాను, కానీ ‘నాన్నగారు’ ఏమిటి? చాలా ప్రత్యేకంగా ఉంది పేరు అనిపించింది.ఆ తరువాత ఒక నెల రోజులకి భగవాన్ జీవిత చరిత్ర విన్నాను. ‘అరుణాచల శివ’ అన్న పాట నాకు చాలా నచ్చింది. నేను చదివిన మొదటి పుస్తకం ‘ శ్రీ నాన్న ఉవాచ’. నేను కోరినట్లు జరిగితే కొబ్బరి కాయ కొడతాను, తిరుపతి మెట్లు ఎక్కుతాను అని మ్రొక్కుకునే నాకు ‘శ్రీ నాన్న ఉవాచ’ లో ‘ మీరు దేవుడి తో చేసేది వ్యాపారమా? అన్న వాక్యము చదివాక నేను చేస్తున్న పనికి సిగ్గు వేసింది. “నా మాటలు మీకు అర్థం కాక పోతే ఆ తప్పు నాది కాని మీది కాదు” అన్న మాట ఆయన పేరు లాగే చాల విచిత్రంగా అనిపించింది.చిన్నపటి నుండి చాలా పిరికిదాన్ని. కాని “ జరుగవలసినది జరిగే తీరును, జరుగరానిది జరుగనే జరుగదు” అన్న వాక్యము చదివాక నాలో పిరికితనం పోయి ధైర్యం వచ్చింది.

జనవరి 9, 1992న శ్రీ నాన్నగారు మా ఇంటికి వస్తారని తెలిసింది. ఉదయం నుండి పూలు గ్రుచ్చి పూజా స్థలం అంతా అలంకరించి శ్రీ నాన్నగారు నడువ బోయే మార్గానికి ఇరువైపులా రంగుల దీపాలను వేసాను. సాయంత్రం 4.30 గం. లకి నాన్నగారు వచ్చారు. మొట్టమొదటి సారిగా శ్యామల పిన్ని నన్ను నా తండ్రికి పరిచయం చేసారు. మూడు రోజులు శ్రీ నాన్నగారితో గడిపాను. సబ్జెక్ట్ గురించి ఏ మాత్రం నాకు తెలీదు. నా బాగు కోరే వ్యక్తి గా నాతో మాట్లాడే వారు. కానీ ఆ మూడు రొజులు ప్రతి క్షణం వారిని చూడాలనిపించేది. ఏమిటో తెలియని ఆనందం. ఇటువంటి ఆనందాన్ని ఇంతకు ముందెప్పుడూ రుచి చూడలేదన్న విషయం మాత్రం బాగా అర్థమైయ్యింది. ఆయన మా ఇంటి నుండి వెళ్లి పోయిన మరు క్షణం ఏమిటో తెలియని వెలితి. నా భావాలను ఎవరితోనైనా పంచుకోవాలి, లెక పోతే నేనేమైపోతానో అనిపించింది. ఏం చెయ్యను? వెంటనే ఒక పుస్తకము తీసి “ గురు దేవోభవ” అన్న పేరు పెట్టి డైరీ రాయటం మొదలుపెట్టాను. నా భావాలను పంచుకోవటానికి నా మనస్సు కన్నా స్నేహితులు ఎవరుంటారు? అనిపించింది. “ గురువు” అన్న పదానికి సరియైన అర్థం కూడా తెలియని సమయం లో “ గురుదేవోభవ” అన్న పేరుతో డైరీ మొదలు పెట్టాను. నేను తండ్రితో గడిపిన ప్రతి క్షణం అందులో పదిలంగా దాచుకున్నాను.

శ్రీ నాన్నగారు ప్రసంగాలలో చెప్పే మాటలకన్నా నాకు ఇంట్లో అనుభవపూర్వకంగా నా తండ్రి ఇచ్చిన ఉపదేశమే ఎక్కువ. “ నిన్న ఉండి ఈ రోజు లేనిది ఏదీ కూడా నిజం కాదు. నిన్న, నేడు, రేపు ఒకే లాగా ఉండేదే నిజం”- అని శ్రీ నాన్నగారు చెప్పారు. ఔను. ఆ నిజాన్ని నేను రుచి చూస్తున్నాను. అదే శ్రీ నాన్నగారి ప్రేమ. మొట్టమొదటి సారి నాన్నగారు నన్ను చూసినప్పుడు ఏ విధంగా ఎంత ప్రేమగా పలకరించారో ఈ నాటికీ అదే ప్రేమ... ఎప్పుడూ ఆ ప్రేమలో హెచ్చు తగ్గులు కనిపించ లేదు.
నిన్న, నేడూ, రేపు ఒకేలా ఉండేదే శ్రీ నాన్నగారి ప్రేమ. ఆ ప్రేమ అపూర్వం.

నెమ్మది నెమ్మదిగా శ్రీ నాన్నగారు నా జీవితంలో ప్రధానమైన భాగంగా మారారు. నాతో నా తండ్రి ఉన్నారు, నా తండ్రి ఉపదేశం తో నేను ఏదైనా సాధించగలను అన్న విశ్వాసం కలిగింది. రోజూ శ్రీ నాన్నగారి ఫొటో ముందు కూర్చుని నా సంతోషాన్ని, దుఃఖాన్ని, నా ప్రతి భావాన్ని ఆయనతో పంచుకునే దాన్ని. అక్కడ ఫొటో కాదు నా తండ్రే కనిపించేవారు. దుఃఖం లో ప్రతిసారి ముగ్ధ పరచే బోధనతో నా దుఃఖాన్ని మాయం చేసేవారు. నా సమస్యని ఆయన ముందు చర్చించే దాన్ని. ప్రతి సమస్యకి విశిష్టమైన పరిష్కారం అందేది. కాని ఒక్కో సారి, ఇదంతా నిజమేనా? అని అనుమానం వచ్చేది. కాని 7.8.1996న శ్రీ నాన్నగారు విజగ్ వచినప్పుదు “ అమ్మ! బిందు! నీ మాటలు నాకు అందుతున్నయి.” అన్న మాటతో నా అనుమానన్ని దూరం చేసారు.

వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిలు వంటివి చదవాల్సిన అవసరం లేకుండా అందులోని సారాన్ని తీసి బోధించటమే కాకుండా అనుభవ పూర్వకంగా జీవించేటట్లు చేస్తున్నారు. మా నిత్య జీవితం లో మాకు ఎదురైయ్యే ప్రతి సంఘటనకి, ప్రతి సమస్యకి పరిష్కారమే శ్రీ నాన్నగారి ప్రసంగాలు. శ్రీ నాన్నగారు తమ ప్రతి మాట ద్వారా, ప్రతి చేత ద్వరా మాకు ఒక ఆదర్శవంతమైన జీవితన్ని జీవించి చూపిస్తున్నారు. గృహస్తులుగా ఉంటూ ఏ బాధ్యతని అశ్రద్ధ చేయకుండా సక్రమంగా నెరవేరుస్తూ, భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని సూచిస్తున్న మహనీయులు శ్రీ నాన్నగారు.

సాధన అంటే రోజూ ఉదయమే లేచి స్నానం చేసి, భగవంతునికి ఒక గంట పూజ చేసి, ఆపైన మన రీతిలో ఉండటమే అనుకునే నా లాంటి వాళ్ళకి ‘సాధన’ కి ఒక సమయం లేదని, మన జీవితం లో ప్రతిరోజూ ప్రతి క్షణం సాధనా సమయమేనని, సాధన అంటే భగవంతుడు చెప్పినట్లుగా జీవించడమేనని, జీవితం లో సాధన చేయటం కాక సాధనలో జీవించడము నేర్పిన విశిష్టవ్యక్తి శ్రీ నాన్నగారు.

ఒక రోజు అంతా నాన్నగారి చుట్టూ కూర్చున్నాం. అందరూ నాన్నగారికి పళ్లు, స్వీట్స్ ఇస్తున్నారు. “ అమ్మా బిందూ! వీటిని ఏమంటారు” అని అడిగారు. నేను మాట్లాడలేదు. అదే మాట నాలుగు సార్లు అడిగారు. తరువాత ఆయనే, ‘ వీటిని “offerings” అంటారు అని అక్కడ ఉన్న స్వీట్స్ తీసి నా చేతిలో పెట్టారు. వాటిని తీసుకుంటూంటే, “ వీటీని ప్రసాదం అంటారు” అనిపించింది. ఆపై ఇంటికి వచ్చాక తండ్రి అన్నిసార్లు అడిగారంటే, అందులో ఏదో పరమార్థం ఉంది...ఏంటి తండ్రీ...అనిపించింది.
“మీరు ఏ offerings ఇచ్చినా తీసుకొవటానికి సిద్ధంగా ఉన్నాను, దాన్ని ప్రసాదంగా మార్చి మీకు ఇస్తాను. ఏ నాటికైనా నీ “నేను”ను ఇస్తే, దాన్ని పవిత్రం చేసి, ప్రసాదంగా , ఆత్మగా నీ చేతికి ఇవ్వాలని ఎదురుచూస్తున్నాను” అని అన్నట్లు అనిపించింది. క్షమించండి నాన్నగారూ! ఈ నేను గురించి నాకు ఇంకా సరైన అవగాహనే లేదు. దీన్ని నా నుండి వేరు చేసి మీకివ్వగల స్థాయికి నేనింకా ఎదగలేదు, కాని నాకు తెలిసింది, నా అనుభవములో ఉన్నది నా మనస్సు....ఆ మనసుకి కూడా ఎన్నో గొడవలు...కాబట్టి ఆ మనస్సుని పూర్తిగా కాకపోయినా, కనీసం కొంత భాగన్నైనా మీకు అర్పణ చేస్తాను. దాన్ని ప్రసాదంగా మార్చి మళ్ళీ నాకివ్వండి. అప్పుడు అందులోని పవిత్రత మిగిలిన మనసులోని అపవిత్రతని కాల్చివేస్తుంది. అప్పుడు నా మనసంతా పవిత్రమైపోతుంది. పవిత్రమైన మనసుతో మీ బాటలో నడవటం సులభం కదా నాన్నగారూ.....అనుకున్నాను.

శ్రీ నాన్నగారు జిన్నూరులోనే ఉంటారని నాకెప్పుడూ అనిపించలేదు. నేను “తండ్రీ” అని పిలిచిన ప్రతిసారి, “ గురుదేవా!” అని స్మరించిన ప్రతి రోజు, ఆయన నాకు బదులు పలికారు, నాతో ఉన్నారు, నాతో గడిపారు. ఇది నా అనుభవం. ఒక చిన్న పిల్లకి చాక్లెట్ ని బంగారన్ని చూపిస్తే, ఆ పాప చాక్లెట్ నే కోరుకుంటుంది. కారణం ఆ చాక్లెట్ రుచి తనకి తెలుసు కాబట్టి. బంగారం విలువ తెలీదు కాబట్టి. అలాగేనాకు మోక్షం అంటే ఏమిటో, ఎలా ఉంటుందో తెలీదు.నాకు తెలిసిందల్ల “నా తండ్రి ప్రేమ”. ఈ మనస్సులో పూర్తిగా నా తండ్రి నిండి ఉన్నప్పుడు నాకు కలిగే ఆనందం, దాని రుచి నాకు తెలుసు కాబట్టి నేను దాన్నే కోరుకుంటాను. ఒక్క చెడ్డ తలంపు కూడా దూరటానికి చోటు లేనంతగా ఈ మనస్సులో నా తండ్రి పూర్ణంగా నిండిపోవాలి. ఆయన చెప్పినట్టుగా జీవించి, ఈ చిన్ని జీవితాన్ని గురుదక్షిణగా అర్పణ చేయ్యాలన్నదే నా గమ్యం.

గురుదేవా! ఈ సృష్టికి జన్మనిచ్చింది బ్రహ్మదేవుడైతే, నా ఈ జన్మలో ఆధ్యాత్మిక జన్మనిచ్చిన బ్రహ్మ స్వరూపులు మీరు. ఈ సృష్టిని నడిపేది విష్ణువైతే, నా జీవితాన్ని సక్రమమైన మార్గం లో నడిపిస్తున్న విష్ణు స్వరూపులు మీరు, సృష్టి లయకారుడు శివుడైతే, నా ఈ మనస్సుని హృదయంలో లయింప జేయటానికి వచ్చిన మహేశ్వరులు మీరు. “గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః” అన్న వాక్యానికి అర్థమే మీరు. త్రిమూర్తి స్వరూపులైన మీరు, నా సర్వస్వం మీరే అయ్యి నిలబడతారన్న చెక్కు చెదరని విశ్వసాన్ని, ఈ మనస్సు నిండా మీరే నిండిపోయే వరాన్ని, ఈ గుండె మీ కోసమే కొట్టుకునే అదృష్టాన్ని ప్రసాదించండి.

1 comment: