Sunday, July 26, 2020

"ఎరుకపడిన దైవం" - (డా. ఉష గారు)

విశ్వమంతటా వ్యాపించి ఉన్న దివ్యశక్తి ఒకరూపం ధరించి నా కోసం భూమిమీదకు వస్తుందని కలలోకూడా అనుకోలేదు. పుస్తకాలలో ఇలాంటివి చదివాను కానీ, నా జీవితంలో వాస్తవమవుతుందని ఊహించలేదు. ఒక సద్గురువుగా కన్నా, నా విషయంలో ఆయన అనురాగం, భాద్యత గల ఒక తండ్రిలా, మృదువుగా ప్రేమించే తల్లిలా, దయ,కరుణతో బోధించే గురువులా, అర్థంచేసుకుని ఆధరించే స్నేహితుడిలా ఒక్క మాటలో చెప్పాలంటే సర్వస్వం ఆయనే అయ్యారు. అజ్ఞానం, అంధకారం లో నుంచి జ్ఞానవెలుగులోకి నన్ను నడిపిస్తూ, నా జీవితాన్ని ప్రకాశింపచేసే వెలుగయ్యారు.

మొదటి రెండు సార్లు దర్శనం అయ్యాక ఆయన భగవంతుని గురుంచి ఏమీ చెప్పలేదేమిటి అనిపించింది. ఆ సంవత్సరం శివరాత్రి రోజు ఒంటరిగా ఇంట్లో ఉన్నాను. శివుని లింగాష్టకం వింటూ ఉండగా లోపలినుంచి ఆవేదన మొదలైంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. జీవితం ఇంతేనా? దీనికి ఓ గమ్యం లేదా? ఎంతకాలం ఇంకా అంధకారంలో జీవించాలి? నా సమస్యలకు పరిష్కారం ఎవరు తెలియచేస్తారు? అని దుఃఖం వచ్చేసింది. అక్కవి నాన్నగారి ప్రవచనాల కాసెట్స్ ఫ్రిడ్జ్ మీద కనిపించినవి. ఆయన ఏమి చెబుతారో విని చూద్దాము అని ఒక కాసెట్టు పెట్టాను. పది నిమషాలలో నాకు చిన్నప్పటి నుంచి వచ్చిన ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చేసింది. ఈ దేహం నువ్వుకాదు,మనస్సు నువ్వు కాదు నీవు ఆత్మ స్వరూపానివి. భగవంతుడు అందరి హృదయాలలో ఆత్మగా ఉన్నాడు. అది అనుభవంలోకి వచ్చినప్పుడు అది కడసారి జన్మ. ఆత్మ అనంతఆనంద సముద్రం, శాంతి సముద్రం. అది అనుభవంలోకి తెచ్చుకోవటమే నీ జీవిత లక్ష్యం అని చెప్పారు. కాసెట్ కట్టేసాను. నా ప్రశ్నలకు సమాధానం వచ్చేసింది. కానీ నాకు అనుభవంలో లేని దాని కోసం ఎలా ప్రయత్నం చెయ్యను? లోపల ఆత్మస్వరూపం ఉన్నా, దాని తాలూకు అనుభూతి ఏమాత్రం లేకుండా నేను దాన్ని ఎలా పొందగలను అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. అది కలా నిజమా? కల మాత్రం కాదు. ఒక అద్భుతమైన శాంతి ఆనందం నా హృదయం లోంచి ప్రవాహంలా రా సాగింది. దానికి బాహ్య కారణాలు ఏ మాత్రం లేవు. ఇదే ఆత్మానందమా? అని తలంపు వస్తోంది. ఆ తలంపు కూడా నా ఆనందానికి అడ్డుగా అనిపించింది. కళ్ళలో నుండి ఆనంద భాష్పాలు రాలుతున్నాయి కాని దేహ స్పర్శ లేదు. దేహానికి భిన్నంగా ఉంది ఆ అనుభూతి. అలా కొంతసేపు ఉన్నాక హఠాత్తుగా ఆనందం ఆగిపోయింది. దేహభావన వచ్చేస్సింది. మెలుకువ వచ్చాక అక్కనడిగాను. నాకు వచ్చిన అనుభూతి ఏమిటని? నాన్నగారు మూడు రోజుల్లో హైదరాబాద్ వస్తున్నారు ఆయననే అడుగు, అదేంటో నాకూ తెలియదు అంది.



మూడు రోజులు తర్వాత నాన్నగారు వున్న భక్తురాలి ఇంటికి అక్కతో వెళ్ళాను. గుమ్మం వద్ద నన్ను చూడగానే నా కోసం ఎదురు చూస్తున్నట్టుగా పెద్ద మొహం చేసుకుని నవ్వుతూ మన ఉష వచ్చేసింది దారి ఇవ్వండి అని హాల్లో ఇరుకుగా కూర్చున్న భక్తులకు చెప్పి, ముందుకు రమ్మని ఆయన ఎదురుగా కూర్చోమన్నారు. కూర్చిని అనుభూతిని చెప్పాను. నాన్న చిరునవ్వు నవ్వి ఏనుగు ఎక్కినంత ఆనందం వచ్చిందా? అని అడిగారు, ఏనుగు ఎక్కితే ఏం ఆనందం ఉందండి?ఈ ఆనందం దానికి మించినది అన్నాను.



ఆత్మ ఆనంద సముద్రం. నీకు వచ్చిన అనుభూతి నీటి బిందువంత. కాని ఈ అనుభవం కూడా ఎన్నో వందల సంవత్సరాలు కృషి చేసినా రాకపోవచ్చు కొంత మందికి అన్నారు.

ఏ సాధనాలేని నాకు ఈ అనుభూతి ఎందుకు వచ్చింది అని అడిగాను. ఆత్మకు సంబంధించిన అనుభూతి లేకుండా దాని కోసం ఎలా ప్రయత్నం చెయ్యను అని హృదయ పూర్వకంగా అనుకున్నావు కదా అన్నారు.

నాన్నగారు అన్నారు,”ఇప్పుడు ఒక పుస్తకంలో అంకెలు ఒకటి నుంచి వేస్తూ వెళ్ళావనుకో, 1700 దాకా వేసాకా పుస్తకం మూసావనుకో, మళ్ళీ తెరిచినప్పుడు 1701 నుంచి మొదలు పెడతావు కానీ, ఒకటి నుంచి మొదలు పెట్టవు కదా! అలాగే, బహుజన్మల కృషితో, సత్యాన్వేషణ చేసాకా సాధన ఈ జన్మలో ఎక్కడ ఆగిందో, అక్కడనుంచి మరుజన్మలో కొనసాగుతుంది. ఎవరికైనా సత్యాన్ని సాక్షాత్కరించుకోవడం కోసం చేసిన సాధన ఊరికే పోదమ్మా...! అదే అసలు విలవైంది కూడా" అన్నారు.

వెంటనే నాన్న సామాన్యులుకారని అర్ధం అయ్యింది. నేను కేవలం నా అనుభూతిని చెప్పాను కాని దానికి ముందు వచ్చిన ఆవేదన గాని, నేననుకున్న విషయాలు కానీ ఆయనతో చెప్పలేదు. నాకు వచ్చిన అనుభవం నీటిబిందువంత అని ఆయన ఎలా చెప్పగలిగారు.ఆయన సముద్రుడు అయి ఉన్నారు కనుక. అప్పటిదాకా ఆయన ఔన్నత్యం తెలియని నాకు ఆయన సాక్షాత్తు భగవంతుని స్వరూపం అని అర్ధమయ్యి వెంటనే కొంచం వెనక్కి జరిగాను. ఆ సంభాషణతోనే నాలో వచ్చిన అనుభూతికి క్లారిఫికేషన్ (స్పష్టంగా వివరించడం) ఇవ్వడమే కాకుండా ఆయన ఎవరు అనే విషయానికి కూడ క్లారిఫికేషన్ ఇచ్చిన మహానుభావుడు శ్రీ నాన్నగారు.

ఈ జన్మలో ఏమీ చెయ్యలేదనుకుంటున్నావు, నీ పూర్వ జన్మల్లో నువ్వేం చేసుకోచ్చావో నీకు తెలియదు. ఇప్పుడు నీలో ఆత్మ లేదని ఒక వందమంది పండితులు సాస్తర్ఙఞలు అంటే నువ్వు నమ్ముతావా అని అడిగారు.. అది నా అనుభవం కదా ఎలా నమ్ముతాను నాన్నగారు అన్నాను. అదే సత్యానికి వున్న నిస్చయత్వం అన్నారు. కానీ ఆ అనుభవం కొద్ది క్షణాలు మాత్రమే ఉండి ఆగిపోయింది. ఎందుకు కంటిన్యూ అవ్వలేదు అని అడిగాను. నీ తపనకు ఆత్మ రుచి చూపించాడు అవుట్ అఫ్ కంపాషన్ ( నీయందు దయ వలన). ఇప్పుడు దాని కోసం నువ్వు ప్రయత్నం చెయ్యకుండా ఉండలేవు. ప్రయత్నం చేసి ఆ అనుభూతిని నీ సొంతం చేసుకోవాలి అన్నారు. నాకు దేహంతో తాదాత్మ్యం ఎక్కువగా ఉంది,దానిలోంచి ఎలా బయటకి రావటం? అని అడిగాను. అది పోతే నువ్వు ఆత్మగానే ఉంటావు. అది పోవటానికే ప్రయత్నం అన్నారు.

నేను డెంటల్ లో గ్రాడ్యుయేషన్ చెయ్యటానికి అప్పటికే చిదంబరం లో అడ్మిషన్ వచ్చేసింది. నేను ఇప్పుడేం చెయ్యను అని అడిగాను. నీ ఎడ్యుకేషన్ పూర్తిచెయ్యి ముందు, ఆ తర్వాత నీకు తెలుస్తుంది అన్నారు. 5 సంవత్సరాలలో ఏమై పోతాను? అప్పటిదాకా నా పరిస్థితి ఏమిటి అని ఆందోళన పడ్డాను. కానీ ఆ 5 సంవత్సరాలలో ఆయన కురిపించిన అనుగ్రహం, చేసిన అద్భుతాలు, నా ఆధ్యాత్మిక అభివృద్ధికి మాటలతోనే కాకుండా, మౌనంలో ఆయన ఇచ్చిన ప్రాక్టికల్ టీచింగ్ నేను మాటల్లో పెట్టలేను. అయితే కొన్ని అద్భుతాలన్నా వ్యక్తం చెయ్యకపోతే ఆయన దయానుగ్రహానికి న్యాయం చెయ్యని దాన్నవుతాను. ఈశ్వరునికి శరణాగతి చెందితే జీవితం ప్రతీ క్షణం అద్భుతం అవుతుంది అని నాన్నగారు చెప్తారు. కానీ సరెండర్ అవ్వకుండానే నా జీవితాన్ని అద్భుతంగా మార్చిన దయామూర్తి శ్రీ నాన్నగారు.

పెద్ద పెద్ద బలహీనతలనుండి వెంటనే బయటకు రావటం కష్టం. ఒక్కొక్క చిన్న అలవాట్లలో నుండి బయటకు రావాలి అని అనుకుని ఉప్పులేకుండా పెరుగన్నం తినలేను కాబట్టి ఇప్పటి నుండి ఉప్పు మానేద్దాము అనుకున్నాను. రెండు రోజుల తర్వాత ఒక భక్తురాలి ఇంట్లో నాన్నగారు భోజనం చేస్తుండగా నేను పక్కన నించుని ఉండడం చూసి ఉషకి భోజనం పెట్టండి అన్నారు. నాన్నగారు పక్కనే కుర్చీలో కూర్చున్నాను. ఆయన భోజనం అయిపోయినా లేవకుండా నేను మజ్జిగన్నంలోకి వచ్చే వరుకు కూర్చుని, వడ్డించే భక్తురాలని పిలిచి ఉషకు నంచుకోవటానికి కూర వెయ్యండి అన్నారు. వెంటనే ఒద్దు నాన్నగారు అన్నాను, నాన్న దయతో నిండిన కళ్ళతో చూసి నేను వెయ్యమన్నది కూర- ఉప్పుకాదు అని లేచిపోయారు... కన్నతల్లికైనా ఇంత ప్రేమ ఉంటుందా? అని కళ్ళలోంచి నీరు దారలుగా కారాయి.

ఆయన ప్రేమకు చిన్న బలహీనతలు అలవాట్లు కాదు కొండంత బలహీనతలు కూడా పాటాపంచలయిపోతాయి. చిన్న కష్టం కూడా పడనివ్వకుండా ప్రేమతో బలహీనతలను తొలగించే గురువు ఈ సృష్టిలో నాన్నకు మించి ఎవరైనా ఉంటారా అనిపించింది.

ఒకసారి అక్క అత్తగారి ఊరు (కోడవల్లి) వెళ్ళినప్పుడు స్నేహితురాలు సినిమాకి రమ్మని బలవంతం చేసింది. అదే టైంకి నాన్నగారు భీమవరం వస్తున్నారని కబురు తెలిసింది. నాకు భీమవరం ఎలా వెళ్ళాలో తెలియక స్నేహితురాలి సహాయం అడిగాను. తనతో సినిమాకి వస్తే సినిమా అయిపోయాక తీసుకువెళతాను అంది. కానీ లోపల నాకు సినిమాకు వెళ్లాలని లేదు. అప్పటికే నిజానికి సినిమా చూడకూడదు, ఈ బలహీనతల్లోంచి బయటకి రావాలి అని అనుకుంటూ వున్నాను,కానీ నాన్నగారి దగ్గరకు వెళ్ళడానికి వేరే దారి లేక తనతో కలిసి సినిమాకు వెళ్లవలిసివచ్చింది. తనతో కలసి సినిమా చూసి నాన్నగారి దర్శనానికి వెళ్లాను. ఉషా భోంచేశావా అమ్మ అని అడిగారు.లేదు నాన్నగారు అన్నాను. మధ్యాహ్నం 3గం అయ్యింది భోజనం చెయ్యకుండా ఏంచేస్తున్నావు అన్నారు. ఆయనకి తెలియనిదేముంది అని మౌనం వహించాను. టైంకి భోజనం చెయ్యకపోతే ఆరోగ్యం పాడవుతుంది అని వాళ్ళ పాపగారిని పిలిచి భోజనం పెట్టమన్నారు. ఏ పనిలో వున్నా టైంకి భోజనం చేసేయ్యమ్మ అన్నారు. అంత అపారమైన ప్రేమకు ఆయన కోసం ఏదైనా సునాయాసంగా వదిలేయచ్చు అనిపించింది. నాకు మళ్ళీ ఎప్పుడూ సినిమా చూడాలనే కోరిక రాలేదు.

దాని తరువాత 2 సంవత్సరాలలో నేను నాన్నగారితో కలిసి ఉన్న ప్రతిసారీ ఏడ్చేదాన్ని ( ఇన్నాళ్ళు ఎందుకు కనబడలేదు? నా జీవితంలోకి రావడానికి 16 సం॥ రాలు పట్టిందా? అని ). ఒకసారి అలా ఏడుస్తున్న నన్ను చూసి, చదువుతున్న న్యూస్ పేపర్ పక్కన పెట్టి, తనని చూడండి, ఇది అకారణ భక్తి. కారణం లేని సంపూర్ణమైన ప్రేమ. ఆకర్షణలు ఎక్కువగా ఉండే టీనేజ్ లో, ప్రత్యేకంగా ఈ విధమైన ప్రేమ ఎప్పుడైతే మేల్కొందో, అప్పుడు దేవుడు జ్ణానాన్ని ఇవ్వకుండా ఉండలేడు అన్నారు.

No comments:

Post a Comment