Saturday, July 25, 2020

"ఇదే అది - అదే ఇది" - (హైమ గారు)


శ్రీ నాన్నగారితో పరిచయం- జ్నాపకాల పుటలను వెనక్కి తిప్పితే, ఆ రోజు ఇప్పటికీ నా కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. రమణ భక్తురాలు, నా స్నేహితురాలు “ భగవాన్ స్మృతులు” పుస్తకాన్నిచ్చి చదవమంది. ఏ సంఘటన ఎందుకు జరుగుతుందో మనం ఊహించలేము. ఆ గ్రంథం చదవటం మొదలు పెట్టిన అతి కొద్ది రోజులకే నాన్నగారి దర్శన భాగ్యం లభించింది. ఆ రోజు పలకొల్లులో బంగారమ్మ గారింటికి వచ్చారు శ్రీ నాన్నగారు. నా స్నేహితురాలితో కలిసి వెళ్లాను. వారికెదురుగా కూర్చున్నాను. “ ఈ అమ్మయి ఎవరు?” అని నాన్నగారు అడిగారు. పక్కనున్న స్నేహితురాలు పరిచయం చేసింది. నేను చూపు మరల్చకుండా వారి వంకే చూస్తున్నాను.

వారు, నా వంక చూస్తూ,” ఈ అమ్మయి టిక్కెట్టు కొనుకొచ్చింది” అన్నారు. ఎంత అలోచించినా ఆ మాటలు అర్థం కాలేదు.

ఇంతలో నాన్నగారు, ‘ ఏం చదువుతున్నావమ్మా?’ అన్నారు. భగవాన్ స్మృతులు అన్నాను. “బాగుందా?” అని మళ్లీ అడిగారు. “ భగవాన్ అతి సమీపంగా కూర్చుని చెప్తున్నట్లు అనిపిస్తొంది” అన్నాను. అదే వారితో నా ప్రథమ పరిచయం.

ఇంటికొచ్చినా వారి మాట, చూపు పదే పదే గుర్తొచ్చేది. రెందు రోజులు గడిచేసరికి ఎదో వెలితిగా అనిపించింది. వారి దర్శనానికి వెళ్లేదాన్ని. మనసు చెప్పలేని సంతృప్తితో నిండిపోయేది. మళ్లీ కొద్ది రొజులకి చూడాలనిపించేది. వారిని చూడగానే నిండుగా ఉండేది. వారి ప్రసంగాలకి వెళ్లే దాన్ని. వారి మాటలు నన్నెంతగానో ఆలొచింపచేసేవి. “ మనం దేహం కాదు-ఆత్మ” అన్న మాట నాలో స్పందన కలిగించింది. ఇంత కాలాన్ని వృథా చేసాననే బాధకలిగేది. కాని దేహం కోసం ఆరాటపడుతున్నాననే బాధ, ఆత్మను పొందాలనే కాంక్ష నాలో బలీయం కాజొచ్చింది.

నాన్నగారి ప్రసంగాలు వింటూ సమన్వయం చేసుకుని జీవించటం అలవాటు చేసుకున్నాను. లోపల తెలియకుండా గురువు చెసే పని అవగాహన కలిగింది. “ ఇదే అది- అదే ఇది” హృదయంలో ఉన్నదే బయట కనిపించే గురువు. బయట గురువే లోపల ఉన్నాడన్నది వారి బోధ ద్వారా అనుభవమయినది. మా ఇరువురి మధ్య మాటలు తక్కువ. మా బంధం మానసికం. ఏది చెప్పాలన్నా మానసికంగా చెప్పేదాన్ని. ఆయన గ్రహించినట్లు అనుభూతి పొందేదాన్ని. ఇంక మాటలతో పనేముంది? కళ్ళ ద్వారా ప్రేమ వ్యక్తమయ్యేది. బాహ్యంగా చూడాలనే ఆరాటం తగ్గింది. చైతన్యరూపం లో నాలోనే గురువున్నాడనే భావన మననం చెసుకోగా బాహ్యంగా చూడలేక పోయాననే బాధ తగ్గింది. గురువంటే దేహం కాదు, ఆత్మ! ... నాలోనే ఉన్నాడనే భావం రాగానే పర్వతం ఎత్తినట్టు ఎంతో శక్తి కలిగేది.

శ్రీ నాన్నగారి పరిచయం నా జీవిత విధానంలో గొప్ప మార్పు తెచ్చింది. ఎలా జీవించాలో నాన్నగారి బోధ ద్వారా అర్థమైయింది. ఎటువంటి సంఘటన వచ్చినా వారు చూసుకుంటారనే భావన ధైర్యాన్నిచ్చేది. మా ఇద్దరి మధ్య సంభాషణ ఉండదు రాయటానికి. మనసులో వ్యక్తం చేసిన నా సందేహానికి ఒక చూపు ద్వారానో, నవ్వు ద్వారనో, మాట ద్వారానో, సమాధానం అందిస్తారు. మనసు ఆనంద మయం, జీవితం శాంతిమయంగా దొర్లి పోతోంది. వారిని చూస్తే చాలు తృప్తి. చూడక పోయినా సంతృప్తే. ఇదే అది కదా!

No comments:

Post a Comment