Tuesday, December 29, 2020

"నాన్నగారి మహామౌనం" - (By డా.ఉష గారు)

నాన్నగారు నా జీవితంలోకి ఎన్నటికీ వీడని సుగంధ పరిమళంలా ప్రవేశించారు. ఒక సుడిగుండం మనల్ని చుట్టేస్తే బయటకు ఎలా రాలేమో, అలా నాన్నగారి ప్రేమ, అనుగ్రహం ఒక ప్రవాహంలా, ఒక సుడిగుండంలా నన్ను చుట్టేయడం వల్ల అందులో "నేను - నాది" అనుకునేదంతా కరిగిపోతూ వచ్చింది. నా జీవితాన్ని ఆయన స్వాధీనం చేసుకోవడం వల్ల ఆయనకూ, నాకూ మధ్య మధ్యవర్తుల అవసరం ఎన్నడూ రాలేదు. ఆయన అరుణాచలంలో ఒసారి "నా కోసమే నువ్వు పుట్టావమ్మా!" అన్నారు. మరొకసారి "ఇతరుల కోసమే నువ్వు పుట్టావమ్మా!" అన్నారు.

నా చిన్ననాటినుంచే సత్యం కోసం అన్వేషణ, తపన మొదలైంది. అందువల్ల దేనిమీదా ఆసక్తి ఉండేది కాదు. కుటుంబ సాంప్రదాయాల ప్రకారం జరిగే పూజలూ, పునస్కారాలూ నాకు సంతృప్తిని ఇవ్వలేదు. పుట్టినప్పటినుంచీ ఆయన సహకారం అందుతూనే ఉన్నా, అదృశ్యంగా ఉన్న ఆయన శక్తి అనుభవమవుతూనే ఉన్నా, ఆయన మా ఇంటి తలుపు తట్టి, భౌతికంగా నా జీవితంలో ప్రవేశించడానికి 17 సం॥ లు పట్టింది. ఆయన నా జీవితంలో ప్రవేశించింది మొదలు, ప్రతి అడుగూ అద్భుతమైన మహిమలాగే గడిచింది. నాన్నగారు నాకు ఆశ్రమ బాధ్యతలు అప్పగిస్తున్న సమయంలో ఒకసారి అన్నారు: "భగవాన్ పక్కన అతిసన్నిహితంగా ఉన్న కొందరు భక్తులు వారి ప్రారబ్ధవశాత్తూ భగవాన్ కి భౌతికంగా దూరమయ్యారు. అలా మనమిద్దరం ఎప్పటికీ, భౌతికంగా కూడా దూరం కాకూడదు. ప్రారబ్ధం కూడా మనల్ని వేరు చేయకూడదమ్మా!" అన్నారు.

నాన్నగారు నా జీవితంలో ప్రవేశించిన రోజునుంచీ నన్ను కొన్ని సందర్భాలలో "స్పిరిట్యువల్ డాటర్" అని, కొన్ని సందర్భాలలో "మానసిక పుత్రిక" అని అనేవారు. నా జీవితం మొత్తం ఆయన చుట్టూనే తిరిగింది. ఆయన దగ్గరకు వెళ్ళడం, ఆయనతో ప్రయాణాలు చేయడం, ఆయనతో ఆశ్రమంలో ఉండడం వీటితోనే ఎక్కువకాలం గడిచింది. నేను ఆయన సన్నిధిలో ఎక్కువ కాలం గడిపడానికే ఎప్పుడూ ప్రథమస్థానం ఇవ్వడం జరిగేది. ఆయన పని తరువాతే ఏదైనా! దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, ఆయన అనుగ్రహంలో అవి కొట్టుకుపోతూ ఉండేవి.

నాన్నగారి తల్లి రాజమ్మగారు స్వర్గస్థురాలు అయిన తరువాత, కాశీలో గంగానదిలో అస్థికలు కలిపిన తరువాత భక్తులందరి సమక్షంలో ఆయన అన్న మాటలు : "మీలో ఎవరైనా తల్లితండ్రులు లేనివారు ఉండి ఉండవచ్చు, మీలో ఎవరైనా అనాదలు ఉండి ఉండవచ్చు. కానీ నేను మాత్రం ఎన్నటికీ అనాదను కాను. మా అమ్మ వెళ్ళిపోతూ ఈ అమ్మని ఇచ్చి వెళ్ళింది అన్నారు". ఆనాటి నుంచి నా పాత్ర "స్పిరిట్యువల్ డాటర్ - మానసిక పుత్రిక" నుంచి తల్లిగా మారింది. అప్పటినుండీ ఆయన రోజుకి ఒక్కసారి అయినా నన్ను తలుచుకోకుండా రోజు గడపలేదు. అంటే అంతవరకూ నన్ను కూతురులా చూసుకుంటూ నా బాధ్యతను తీసుకున్నారు. ఆయన తల్లి వెళ్ళిపోయిన తరువాత నన్ను ఆయనకు తల్లిని చేసుకుని బాధ్యతను అప్పగించారు. ఒక బిడ్డలా ఆయన మీద ఆధారపడిపోయిన నన్ను తల్లిని చేసి ఒకవైపు బాధ్యతను అప్పగిస్తూ, మరొకవైపు నా హృదయాన్ని ఖాళీచేసి నన్ను స్వతంత్రురాలిని చేసారు. ఆయన ఏది చేసినా మనల్ని అభివృద్ధి చేయడం కోసమే ! ఆయనకంటూ ఏమీ అక్కరలేదు. నిజానికి ఆయన ఎప్పుడూ, ఎవరిమీదా, ఏ విషయంలోనూ అధారపడింది లేదు.

ఈ జన్మలో ఆయనతో నా అనుబంధం అత్యంత సన్నిహితమైనది, మాటలతో వర్ణించలేనిది. ఆయన దృష్టితో చూసి, ఆయన వాక్కులో చెప్పాలంటే "మా ఈ బంధం బహుజన్మలది." ఆయన నాకు ఇచ్చిన ప్రాముఖ్యత, స్వేచ్ఛ వల్ల ఆయన నన్ను ఒక సామ్రాజ్యానికి చక్రవర్తిని చేసినట్లుగా అనిపించేది. ఇంకా నా లోపల అపారమైన శాంతితో కూడిన శక్తి ప్రవహిస్తూ ఉండేది. ఇంతకంటే పొందవలసింది ఏమీలేదు అనికూడా అనిపించేది. ఆయన సమక్షంలో కలిగిన అనుభూతులు, అనుభవాలే కాకుండా ఆత్మ తాలూకు అనుభూతి ఎన్నో సందర్భాలలో విస్తృతంగా వచ్చింది. అలాంటి ఆత్మానుభూతి కలిగిన క్షణాలు అపూర్వము, అనిర్వచనీయము.

ఆయన తల్లిగారి అస్థికలు కాశీలో కలిపి జిన్నూరు వచ్చిన వారం రోజులకి నాన్నగారికి ఆరోగ్యం పాడయింది. అప్పుడు నాన్నగారిని మొదటిసారిగా హైదరాబాదు హాస్పిటల్ లో చేర్చాము. ఆయనకు అక్కడ 5 రోజులపాటు వైద్యం జరిగింది. అప్పటినుంచీ ఆయన ఆరోగ్యం పట్ల నాలో ఆందోళన మొదలైంది. హాస్పిటల్ నుంచి రోహిణి అనే భక్తురాలి ఇంటికి వెళ్ళి, అక్కడ ఒకవారం రోజులు గడిపి తిరిగి జిన్నూరు వచ్చారు. ఆ తరువాత అప్పుడప్పుడూ మళ్ళీ హాస్పిటల్ లో చేర్చటం, మందులు వాడటం అవసరమవుతూ వచ్చింది. 4 సం ॥ ల కాలంలో మధ్య, మధ్యలో వైజాగ్ హాస్పిటల్ లో ఉండవలసి వచ్చింది. ఆయన హాస్పిటల్ లో చేరిన ప్రతిసారీ నేను ఆయన దగ్గరకు వెళ్ళి, అక్కడ ఎన్నిరోజులు ఉంటే అన్నిరోజులూ దగ్గరుండి చూసుకోవడం జరిగింది.

2017 సెప్టెంబరు 23 న ఆయన పుట్టినరోజుకు నేను జిన్నూరు వెళ్ళినప్పుడు, నాన్నగారు చర్మంమీద దద్దుర్లు తో ఇబ్బంది పడుతున్నారు. అయినా ఆ సమయంలో కూడా మళ్ళీ హైదరాబాదు ప్రయాణం పెట్టుకున్నారు. ఎందుకు నాన్నగారూ ఇప్పుడు? మొన్నే హైదరాబాదు వెళ్ళి వచ్చారు కదా అని అడిగితే, ప్రసాదు అనే భక్తుని కూతురు పెళ్ళి నిమిత్తం వెళ్ళాలి. ఇదివరకు ఆయన కొడుకు వివాహం అయినప్పుడు వెళ్ళలేకపోయాము, అప్పుడు మాట నిలబెట్టుకోలేకపోయాము. ఇప్పుడు కూతురి వివాహానికి అయినా మనం తప్పనిసరిగా వెళ్ళాలి అంటూ, సునీల్ కి ఫోన్ చేయమని 4 రోజులలో విమానం టికెట్ తీయమన్నారు.

కొంచెం ఇబ్బందికర పరిస్థితిలోనే హైదరాబాదు వచ్చి అక్కడి భక్తులందరికీ దర్శనం ఇచ్చి 5 రోజులు హైదరాబాదులో ఉండి, ఆయన అనారోగ్యం గురించి ఎవరికీ తెలియనివ్వకుండా, అంతకుముందు ఎవరెవరి ఇంటికయితే వస్తానని చెప్పారో వారందరి ఇళ్ళకూ వెళ్ళి, ఎక్కువసమయం వారితో గడిపి, వారి హృదయాలు అనుగ్రహంతో నింపారు. ఆరోగ్యం బాగుపడేవరకూ అక్కడే ఉండమని చెప్పినా కూడా తిరిగి జిన్నూరు వెళ్ళారు.

జిన్నూరులో భక్తులందరికీ దర్శనం ఇచ్చి, డాక్టరుకి చూపించుకోవాలంటూ భీమవరం వెళ్ళి అక్కడ 4 రోజులు ఉండి, అందరితోనూ ఎక్కువ సమయం గడిపి వారికి ఆనందాన్ని, శాంతిని ప్రసాదించారు. ఆఖరి దర్శనం ఇవ్వడం కోసమే ఇలా వేగంగా ప్రయాణాలు చేస్తూ, భక్తులందరితో ఎక్కువ సమయం గడుపుతున్నారని తరువాత అర్థమయింది. అక్కడినుండి అక్టోబరు 13 న వైజాగ్ హాస్పిటల్ లో చేరారు. అక్కడ ఆయనకు తీవ్రస్థాయిలో చికిత్స జరిగితే, ఆయన పక్కనే ఉన్న సన్నిహిత భక్తులకు అది తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన అయింది. అక్కడ ఊహకందని అనుభవాలు శిష్యుల సొంతమయ్యాయి. R. K, R. K అని తలపెట్టుకుంటూ, ఆఖరి రోజులలో రామకృష్ణపరమహంస లీలలు ఎలా ఉండేవో అలా, నాన్నగారు ఆయనలో జీవిస్తూ రామకృష్ణ పరమహంసని కళ్ళముందుకు తీసుకొచ్చి చూపించారు.

వైజాగ్ హాస్పిటల్ లో నెలరోజులు ఉండి, నవంబరు 13 న షర్మిల అనే భక్తురాలి ఇంటికి వెళ్ళి అక్కడ ఒకవారం రోజులు ఉన్నారు. అప్పుడు పరిపూర్ణానందస్వామి నాన్నగారిని చూడటానికి వచ్చారు. ఓపిక లేకపోయినా లేచికూర్చుని ఆయనతో కొంతసేపు మాట్లాడారు. పరిపూర్ణానందస్వామి చేపట్టిన కార్యక్రమాలను మెచ్చుకుని అభినందనలు తెలియజేసారు.

షర్మిలగారి ఇంటినుండి, పూర్తిగా తగ్గేవరకు ఉండమంటున్నా కూడా డా. వివేక్ గారిని రమ్మని ఆయన అనుమతి తీసుకుని, అంబులెన్స్ లో జిన్నూరు వెళ్ళారు. అక్కడ ఆయన కుమారుని ఇంట్లో 15 రోజులు పైగా ఉన్నారు. అరుణాచల దీపోత్సవం రోజు కింది పోర్షన్ కి ఆయన ఇంట్లో ఆయన గదిలోకి మారారు.

మానవాళి పట్ల, ప్రత్యేకించి భక్తులపట్ల ఆయనకున్న అపారమైన ప్రేమవల్ల ఆయన శరీర ఆనారోగ్యాన్ని కూడా లెక్కచేయలేదు. ఒక సందర్భంలో ఆయన నన్ను "ఎందుకమ్మా ! నాకు ఇంత శారీరక క్షోభ ? ఎవరికోసం ?" అని అడిగారు. భక్తుల కోసమే ఆయన శారీరక అనారోగ్యాన్ని, అసౌకర్యాన్ని భరిస్తున్నారని నా మనసుకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే, ఆయన దగ్గరకు ఎంతోమంది సహాయాన్ని అర్థిస్తూ వచ్చేవారు. అంతేకాక అనారోగ్యంతో, దుఃఖంతో, క్షోభతో రక,రకాల సమస్యలతో వచ్చేవారు.

మహాత్ములందరూ కూడా శరీరాన్ని ధరించి భూమిమీదకు వచ్చిన తరువాత, శరీరాన్ని విడిచిపెట్టేలోపు దయతో శిష్యుల ప్రారబ్ధాన్ని వారి దేహంమీదకు ఆపాదించుకుని వాటిని అనుభవించి దేహం చాలిస్తారని వారి చరిత్రలలో చదివి ఉన్నాము. అలా నాన్నగారు కూడా శిష్యుల శారీరక, మానసిక.... బాధలను ఆయన దేహం మీదకు తీసుకుంటున్నారన్న సంగతి ప్రత్యక్ష అనుభవంతో నాకు అర్థమయింది. అప్పుడప్పుడు నాకు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను బయటకు వెల్లడిచేసి చెప్పేవారు. వ్యక్తిగతంగా నాకు ఆయన ఇచ్చిన ఆదేశం ఏమటంటే, జీవితంలో ఏ విషయంలోనూ, ఎప్పుడూ కంప్లైంట్ ( పిర్యాదు ) చేయవద్దు అన్నారు. ప్రత్యేకంగా ఒక సందర్భంలో నాకూ, నాన్నగారి మనుమడు వర్మగారికి "మీరు నాపని చేయండి, నేను మీ పని చేస్తాను" అని చెప్పారు.

ఆయన శారీరక బాధలు మరింతగా పెరిగినప్పుడు, చూడలేక నాకు కన్నీళ్ళు వస్తుంటే భగవంతుడికి ఇంత క్రూరత్వం ఎందుకు నాన్నగారూ ? అని అడిగాను. దానికి ఆయన, "శరీరం వస్తే బాధలు తప్పవు. శరీరం, మనసూ ఉంటే తిప్పలు తప్పవు. శరీరం ఎక్కడ లేదో, మనస్సెక్కడ లేదో అక్కడ నేను ఉన్నాను." అన్నారు.

నాకూ, ఆయనకూ ఉన్న అనుబంధంలో ప్రత్యేకమయినదీ, అమూల్యమయినదీ ఏమిటంటే, నాన్నగారు ఆహారం తీసుకున్నప్పుడు, కాఫీ తాగినప్పుడు వాటిని నాతో పంచుకునేవారు. ఆ అలవాటు ప్రకారం హాస్పిటల్ లో ఉన్నప్పుడు కూడా ఆయన తిన్న తరువాత మిగిలిన వాటిని నన్ను తినమనేవారు. ఆయన ఆరోగ్యం మరీ బావుండని ఒక సమయంలో, ఆయనకు ఇష్టమయిన నొప్పి తగ్గించే అల్ట్రాసెట్ మందు కూడా నన్ను వేసుకోమన్నారు. నేను ఒకటి వేసుకుంటాను, నువ్వూ ఒకటి వేసుకుని ప్రశాంతంగా పడుకోమ్మా ! అన్నారు. నాకు కళ్ళల్లోంచి నీళ్ళు ధారగా కారాయి. ఆయన పరిస్థితి చూసి నేను బాధ పడుతున్నానని గ్రహించి, నా నొప్పికి ఇది వేసుకుంటున్నాను, నీ మనసుకి కలిగిన నొప్పికి నువ్వుకూడా వేసుకుని నిశ్చింతగా పడుకో అని చెప్పకుండానే చెప్పారు.

నాకు చాలా సందర్భాలలో కన్నీళ్ళు వచ్చేవి. కొన్నిసార్లు కృతజ్ఞతతో, కొన్నిసార్లు ఆయనపట్ల అపారమైన ప్రేమతో, కొన్ని సందర్భాలలో ఆయన అనారోగ్యం చూడలేక దుఃఖంతో కన్నీళ్ళు వచ్చేవి. ఆయన నాకు శక్తిని, సహనాన్ని, క్షమాబుద్ధిని ..... ఇంకా దేహబుద్ధిని కోల్పోయి లోపల విశాలత్వం పొందడానికి అవసరమైనవన్నీ అందిస్తూ వచ్చారు. వృత్తి, కుటుంబము, పరిసరాలు, సమాజము, ప్రపంచము అన్నింటినీ మరిచిపోయి ఒక్క ఆయనపట్లే ఏకాగ్రత కుదిరేలా చేసి మనసుని పవిత్రంచేస్తూ వచ్చారు.

ఆల్చిప్పలో పడ్డ నీరు కాలక్రమంలో పరిణామం చెంది ముత్యంగా ఎలా మారుతుందో, అలా మనసుని ఆయన ఉన్నచోటనే కేంద్రీకరించి, ఏకచింతనతో శరణాగతి చెందిన భక్తులను ఆణిముత్యాల్లా తయారుచేసారు. ఆయన శరీరం విడిచిపెట్టేలోపు ఈ ప్రక్రియ అంతా చాలా విచిత్రంగా, వేగంగా చేసుకుంటూ వచ్చారు.

కొన్ని సందర్భాలలో ఆయన రెండుచేతులతోనూ నా బుగ్గలు పట్టుకుని ఎంతబాగా చూసుకున్నావమ్మా నన్ను ? అనేవారు. ఆయన వేలాదిమంది భక్తుల్ని ఎంతో అపురూపంగా చూసుకున్నారు. అలా చూస్తే మనం చేసింది ఏమీలేదు. అందర్నీ ప్రేమగా చూసుకుంటూ వాళ్ళు ఆయనని ప్రేమించినా, ప్రేమించకపోయినా వాళ్ళ బాధ్యతలన్నీ భుజాలమీద వేసుకున్నారు. భౌతికంగా మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్నివిధాలా అందరికీ సహకరిస్తూ ఎన్నో జీవితాలని ఉజ్వలమయ్యేలా చేసారు. ఎటువంటి నియమ, నిబంధనలూ లేకుండా, సాధన పేరుమీద ఎవర్నీ కష్టపెట్టకుండా, జ్ఞానం మనకి సునాయాసంగా రావాలనే ఉద్ధేశ్యంతో నిరంతరం శ్రమిస్తూనే జీవించారు. ఆయనతో గడిపిన జీవితం భక్తులందరికీ ఒక మహత్తరమైన వరం. ఆయన బోధ, ఆయన అనుగ్రహం, ఆయన ఆశీర్వచనం మనకే కాదు, మన ముందుతరాల వారందరికీ కూడా అంది వారు దుఃఖ రహిత స్థితికి వెళ్ళగలుగుతారు. 5 రోజులలో ఆయన వెళ్ళిపోతారు అనగా కళ్ళుకూడా తెరవలేని స్థితిలో, మాట ముద్దగా వస్తున్న సమయంలో మెల్లగా కళ్ళు తెరచి, నా కళ్ళల్లోకి చూసి నువ్వు వెళ్ళిరామ్మా! ( You go and come ) అన్నారు. మిమ్మల్ని ఒదిలి ఎక్కడికీ వెళ్ళను నాన్నగారూ! మీతోనే ఉంటాను అంటే, నేను ఇంకో 5 రోజులలో వెళ్తున్నాను అన్నారు.

ఆయన అన్నట్లుగానే డిసెంబరు 29 వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం నాడు, మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి ఎరుకలో నోట్లో వేసిన తులసి చుక్కలు గుటకవేసారు. ఒక చేతితో ఆయన చేతిని పట్టుకొని, మరోక చేతితో ఆయన హృదయంపైన మెల్లగా నిమురుతూ నాన్నగారూ, నాన్నగారూ అని పిలుస్తూ ఉండగా, వెళ్ళారని కూడా తెలియకుండా మహామౌనంలోకి నిశ్శబ్ధంగా దేహాన్ని విడిచిపెట్టారు. ఆయన చెప్పినట్లుగానే ప్రారబ్ధం కూడా మనల్ని విడదీయకూడదు అన్న మాటను నిజంచేసి చూపించారు. ఆయన తుదిశ్వాస వరకూ నన్ను ఆయన సమక్షంలోనే ఉంచుకుని, నా చేతితో ఆయన చేయి పట్టుకుని ఉండగా, 5 రోజుల ముందుగానే తెలియజేసి మరీ దేహాన్ని చాలించారు. అటువంటి ప్రేమకు సమానమైనది కానీ, దానికి మించినది కానీ మనకు ఈ భూమిమీద లభించదు.

నాన్నగారి దివ్య పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి.

No comments:

Post a Comment