Sunday, January 3, 2021

"షణ్ముఖుడే మన నాన్నగారు" - (By సౌగంధికా గారు)

మా చిన్నతనం నుండి మా ఇంటిలో అందరూ బాబాని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళం. ప్రతిరోజు క్రమం తప్పకుండా సాయి చరిత్రలో కనీసం ఒక్క అధ్యాయమైనా చదువుకునేవాళ్ళం. బాబాని నాకు నీ లాంటి గురువుని చూపించు బాబా అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఒకసారి బాబా స్వప్నంలో కనిపించి నీకు ఆరు ముఖములు కలవాడు గురువుగా వస్తాడు అని చెప్పారు.

మేము ఒక స్వామీజీ దగ్గరకు వెళుతూ ఉండేవాళ్ళం. అక్కడ నాకు ఒక భక్తురాలితో అనుబంధం ఏర్పడింది. ఆమె నాన్నగారి భక్తురాలు. ఆమె ఒక రోజు ఫోన్ చేసి మా అమ్మాయి ఇంట్లో నాన్నగారి సత్సంగం ఏర్పాటు చేసుకుంటున్నాము మీరు రండి అని ఆహ్వానించారు. నాకు అప్పట్లో అంతగా ఇష్టం లేకపోయినా, మొదటిసారి అయిష్టంగానే ఆ సత్సంగానికి వెళ్ళాను. మొదటిసారి భగవాన్ ఫోటో చూసినప్పుడు నాకు అంత ఎట్రాక్షన్ గా అనిపించలేదు. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, వారు ఆ రోజు సత్సంగానికి రమ్మని పిలిచినప్పటకి నేను వెళ్లకపోతే ఇంతటి మహానుభావుడు దర్శనభాగ్యం లభించక నా జీవితం వృధా అయ్యేది అనుకుంటూ ఉంటాను. నాకు బాబా అంటే ఇష్టం వలన గురువారాన్ని చాలా ప్రత్యేకమైన రోజుగా భావించేదాన్ని.ఆ రోజే నాన్నగారిని నేను మొట్టమొదటిసారిగా సావిత్రమ్మ గారి ఇంట్లో దర్శనం చేసుకున్నాను. నాన్నగారిని చూడగానే "He is none other than Shirdi Sai Baba" అనిపించింది. అదే రోజు అక్కడ ఉన్న ఒక భక్తురాలు నాన్నగారితో నాకు నామం ఇప్పించారు. నాన్నగారు నన్ను “నీకు ఏ దేవుడు ఇష్టం” అని అడిగారు. షిరిడి సాయిబాబా నాన్నగారు అని చెప్పాను. "ఓం శ్రీ సాయిరాం" అని మూడు సార్లు ఆయన చెబుతూ నాతో చెప్పించి ఈ నామము నీ నాలుక మీద కాపురం ఉండాలమ్మా అన్నారు.

ఒకసారి మాకు సత్సంగం చెప్పే టీచరు మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాన్నగారిని అడగవచ్చు అన్నారు. నాన్నగారు మధురానగర్ వచ్చినప్పుడు నాకు సారం అర్థమైంది నాన్నగారూ! అది అనుభవంలోకి రావటానికి మీరు సహాయం చేయండి అని నాన్నగారిని అడుగుదామని ఇంటిదగ్గర అనుకొని మధురానగర్ వెళ్ళాను. అక్కడ నాన్నగారి చైర్ కి ఎదురుగా కూర్చున్నాను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసాను చాలా మంది భక్తులు ఉండటంవలన నాన్నగారు వచ్చి కూర్చున్నా నేను అనుకున్న ప్రశ్న అడగకూడదు అనుకున్నాను. నాన్నగారు భాషణలు అనే పుస్తకం తీసుకు వచ్చి నా పక్కన కూర్చున్న ఒక భక్తురాలుకి ఇచ్చి నేను ఏ ప్రశ్న అయితే ఇంటిదగ్గర నాన్నగారిని అడుగుదామనుకున్నానో అదే ప్రశ్న చదవమని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఏదైతే అడగాలనుకుంటున్నానో అదే నాన్నగారు చెబుతున్నారు అని.

నాకు అరుణాచలం వెళ్ళాలి అని చాలా ఇష్టంగా ఉండేది. కానీ ఇంట్లో అంతగా ఇష్టపడేవారు కాదు. ఒకసారి మా Husband అరుణాచలానికి టికెట్టు కొని ఇచ్చి ఇదే మొదటిసారి, ఆఖరిసారి అరుణాచలం వెళ్ళటానికి అని చెప్పి అరుణాచలం పంపించారు. చాలా ఆనందం వేసింది. అప్పట్లో అరుణాచలం వెళ్ళినప్పుడు నాన్నగారికి ముందుగా చెప్పేవాళ్ళం. అలా నేను ఫోన్ చేసినప్పుడు నాన్నగారు తుని దీపోత్సవానికి వెళ్ళారని తెలిసింది. ఉష కూడా వెళ్ళారు అని తెలిసి ఉషకి ఫోన్ చేసి నాన్నగారికి నేను మొదటిసారి అరుణాచలం వస్తున్నాను అని చెప్పమ్మ అన్నాను. అలాగే చెబుతాను ఆంటీ అన్నారు. తరువాత ఉష నాకు ఫోన్ చేసి, నాన్నగారు కొంచెం బిజీగా ఉండటం వలన గదిలోకి వెళ్ళి పోతుంటే ఆఖరి నిమిషంలో చెప్పవలసి వచ్చింది అని చెప్పారు. నాన్నగారు విని ఉండకపోవచ్చు అనుకున్నాను. ఆంధ్రఆశ్రమంలో మెట్ల దగ్గర నాన్నగారు నన్ను చూసి ఎప్పుడు వచ్చావమ్మ సౌగంధికా? అని అడిగి నువ్వు మొదటిసారి అరుణాచలం వస్తున్నావు అని నాకు ఎవరో చెప్పారమ్మ అన్నారు. అంటే ఉష చెప్పింది నాన్నగారు విన లేదేమో అని నేను సందేహపడ్డాను కదా! ఆ సందేహాన్ని తొలగించారు. నాన్నగారు నువ్వు ఎన్ని రోజులు ఉంటావమ్మా అని అడిగారు. రెండు రోజులే ఉంటాను నాన్నగారూ, దీనికి కూడా మా ఇంట్లో అంగీకరించలేదు అతికష్టం మీద వచ్చాను. మా Husband తో మీరు చెప్పండి నాన్నగారూ నన్ను అరుణాచలం పంపించమని అన్నాను. అలాగేనమ్మా సంవత్సరానికి రెండు సార్లు నిన్ను అరుణాచలం పంపించమని అడుగుతాను అన్నారు. నాన్నగారు అలా అనగానే నాకు చాలా ఆనందం అనిపించింది.

తరువాత అరుణాచలేశ్వరుడి పెద్ద గుడికి వెళ్ళాము. అక్కడ అరుణాచలేశ్వరుడి మెడలో ఉన్న మాలని తీసి నాన్నగారి మెడలో వేసారు. నాన్నగారు ఆ మాల తీసి నా చేతికి ఇచ్చి అక్కడ ఉన్న విగ్రహాల చుట్టూ తిరుగుతూ సుబ్రహ్మణ్యేశ్వరుడు విగ్రహం ఎదురుగా నిలబడి చూస్తున్నారు. నేను నాన్నగారి పక్కనే ఉన్నాను. ఇదేంటి? నాన్నగారు అందరి దేవుళ్ళకు నమస్కారం పెట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడుకి నమస్కారం పెట్టకుండా అలా నిలబడి చూస్తున్నారు ఏమిటి? అని మనసులో అనుకుంటున్నాను. ఈలోపు నాన్నగారు అమ్మా సౌగంధికా! నాకు అందరికీ నమస్కారం పెట్టాలనిపిస్తుంది కానీ ఈయనకు పెట్టాలి అనిపించదు. మనకు మనం ఏమి పెట్టుకుంటాము అనిపిస్తుంది అన్నారు. అయితే నాన్నగారు సుబ్రహ్మణ్యుడు అని మనసులో అనుకుంటూ ఉంటే ఈ లోపు "ఈయనను షణ్ముఖుడు అంటారు. అంటే ఆరు ముఖములు కలవాడు" అని చెప్పారు. అప్పుడు నాకు బాబా స్వప్న దర్శనం గుర్తుకువచ్చింది. అంటే బాబా సుబ్రహ్మణ్యేశ్వరుడు గురువుగా లభిస్తాడు అని చెప్పారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే నాన్నగారి రూపంలో వచ్చారు అనుకొని, అయితే నాన్నగారిని బాబాయే పంపించారు అని అర్థమై నా హృదయ ద్వారాలు తెరుచుకుని, ఆ రోజు నుండి అందులో నాన్నగారు స్థిరపడిపోయారు. తరువాత నేను హైదరాబాద్ కి చేరాక మా husband ఎలా జరిగింది trip? అని అడిగారు. బాగా జరిగింది, చాల సంతోషంగా ఉంది అన్నాను. అపుడు మా husband, నీకు అంత ఆనందంగా ఉంది కాబట్టి సంవత్సరానికి రెండు సార్లు అరుణాచలం పంపిస్తాను అన్నారు. నాకు నాన్నగారు చెప్పిన వాక్యాలు గుర్తుకొచ్చాయి, గురువు వర్క్ అంటే ఇది కదా అనిపించింది.

ఒకసారి ఎస్ ఆర్ నగర్ లో నాన్నగారు జిన్నూరులో జరిగిన ఒక సంఘటన చెబుతూ ఈ విధంగా వివరించారు. ఒక భార్య,భర్తలు నా వద్దకు వచ్చి నా భార్యకు బిపి వచ్చింది నాన్నగారూ, జీవితాంతం తనకి బీపీ టాబ్లెట్స్ కొనే స్థోమత నాకు లేదు. అందుకని హోమియోపతి కి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అన్నారు. హోమియోపతి వాడినా మీరు ఒక నెల, రెండు నెలల వరకు ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడండి అని చెప్పారు కానీ ఆయన వాడలేదు. అలా వాడని కారణంగా ఆయన భార్య మరణించారు. ఎవరైతే ఏడు రోజులు వరుసగా బీపీ టాబ్లెట్ మానేస్తారో వారు చనిపోతారు అని చెప్పి నా వైపు చూస్తున్నారు. ఏంటి నాన్నగారు నా వైపు చూస్తున్నారు? నాకు ఏమీ బీపీ లేదు కదా అనుకొని, ఎవరో ఒకరి వంక చూసి చెప్పాలి కదా! అలా చూసి ఉంటారు అని సరిపెట్టుకున్నాను. అదే రోజు మధ్యాహ్నం మరలా వెళ్ళాము. నాకు కొంచెం ఆలస్యం అవ్వటం వలన గేటు దగ్గర నిలబడి ఉన్నాను. నాన్నగారు పొద్దున జరిగిన సంఘటనే మరలా చెబుతూ ఎవరైతే బీపీ టాబ్లెట్ వరుసగా ఏడు రోజులు వేసుకోరో వారు చనిపోతారు అని పెద్ద, పెద్ద కళ్ళతో నా వైపు సీరియస్ గా చూసి చెబుతున్నారు. ఏంటీ మళ్ళీ నా వైపే చూసి చెబుతున్నారు? ఏదో తేడాగా ఉంది అనుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా Husbandని మీరు బీపీ టాబ్లెట్ వేసుకున్నారా? అని అడిగాను. ఆరు రోజుల నుండి వేసుకోవటం లేదు అని సమాధానం చెప్పారు. వెంటనే నాన్నగారు మాట గుర్తుకు వచ్చి అర్జెంటుగా వెళ్ళి బీపీ టాబ్లెట్ తెచ్చుకుని వేసుకోమని చెప్పాను. అలా ఆ రోజు సాయంత్రం ఆయన బీపీ టాబ్లెట్ వేసుకున్నారు. నాన్నగారు ఈ విధంగా పరోక్షంగా నాకు చెప్పి మా Husband ని రక్షించారు అనిపించింది.

నాది ముక్కుసూటి మనస్తత్వం. అబద్ధం చెప్పటం వలన భయపడాలి కానీ, నిజం చెప్పటం వలన భయం ఎందుకు అనుకుంటూ ఉండేదాన్ని. దాని వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. అయితే నాన్నగారు ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు, నాన్నగారు నాకు ఈ వాసన గురించి క్లారిటీ ఇవ్వండి నేను మిమ్మల్ని పైకి అడగను. ఎందుకంటే, నా మనసులో ఉన్నవి అన్నీ మీరు చదివేస్తున్నారు. నా మైండ్ మీకు ఓపెన్ బుక్ కదా! అనుకొని నాకు దీని గురించి మీరు చెప్పాలి అనుకుంటూ ఆ రోజు నాన్నగారి దగ్గరకి వెళ్ళాను. ఆ రోజు నాన్నగారు ప్రవచనంలో ఇలా చెప్పారు.

"ప్రపంచంలో ఎక్కువ తగులుకోకూడదు. ప్రపంచం అంత మంచిది కాదు. మీరు మాట్లాడేది నిజమైనా సరే మాట్లాడవద్దు. యేసు ఎవరిని చంపలేదు, ఏ పాపము చేయలేదు. "I and my father one" అన్నాడు. అది absolute truth అయినప్పటికీ, ఉదయం శిలువ వేసి రాత్రి వరకు కొట్టి, కొట్టి చంపారు. మీరు ఈ ప్రపంచంలోకి వచ్చిన పని ఏమిటంటే, మరలా ఈ ప్రపంచంలోకి రాకుండా చూసుకోండి. ఈ ప్రపంచము అనిత్యము, దుఃఖాలయం. అయినా మనం ఈ ప్రపంచంలోకి వచ్చేసాము. మనము ఏమీ చేయాలి అంటే, కృష్ణుడు నన్ను భజించండి, నా పాదాలను ఆశ్రయించండి, మీరు ఏమైనా మాటలు చెప్పుకుంటే నా గురించి చెప్పుకోండి అని చెప్పాడు కదా! అందుచేత మీరు ఒక చేతితో నన్ను పట్టుకొని, మరో చేతితో మీ సంసారంలో ఉన్న పనులను చూసుకోండి. మీ పనులు పూర్తయ్యాక రెండు చేతులతో నన్నే పట్టుకోండి. ప్రపంచంలో స్థిరమైన వస్తువుని పట్టుకుంటే పడిపోరమ్మా! చిన్నపిల్లలు రెండు చేతులు చాచి తిరుగుతూ ఉంటే కళ్ళు తిరిగి కిందకి పడిపోతారు. కానీ ఒక స్ధంభాన్ని పట్టుకుని తిరిగితే ఎంతసేపు తిరిగినా కిందపడరు. అలాగే ఈ ప్రపంచంలో స్థిరమైన భగవంతుడిని పట్టుకుంటే మీరు ఈ ప్రపంచంలో పడిపోకుండా ఉంటారు. అలా ఈ ప్రపంచంలో అన్ని వేళలా నిజాలు మాట్లాడకుండా, మీరు వచ్చిన పని మీరు చూసుకుంటూ వెళ్ళిపోండి. ఈ లోకంలో అందరిని మార్చాలని అనుకోవద్దు. ఈ ప్రపంచలో చాలా ముళ్ళు ఉంటాయి. ముల్లుకి, మల్లుకి మధ్యలో అడుగులు వేసుకుంటూ మీ గమ్యమైన మోక్షాన్ని చేరుకోండి. ఈ ప్రపంచం నీది కాదు, నాది కాదు. అది ఈశ్వరుడిది! అది ఆయన చూసుకుంటారు" అని చెప్పారు.

ఆ మాటలు వినగానే నేను పైకి చెప్పకపోయినా నాన్నగారు నా మనసులోకి తొంగి చూసి నా సందేహాన్ని నివృత్తి చేశారు. నా మనస్సు నాన్నగారికి తెరిచిన పుస్తకం అనిపించింది.

ఒకసారి నాన్నగారు వచ్చినప్పుడు Jubilee Hills లక్ష్మి గారి ఇంటికి వెళ్ళాము. నేను వెళ్ళగానే నాన్నగారు నన్ను చూసి అమ్మా సౌగంధిక! ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోమ్మా, మరలా రేపురామ్మా! అన్నారు. నాన్నగారు ఆ మాట అనేసరికి ఏంటి ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారు అనుకొని వెంటనే బయలుదేరి తొందరగా ఇంటికి చేరుకున్నాను. నేను చేరుకునేసరికి ఇంటిలో పాలు మాడిపోయి ఉన్నాయి. మేము ఎప్పుడైనా బయటికి వెళితే మా ఇంటి తాళాలు కింద వేరేవారికి అప్పజెప్పి వెళ్తాము. అలా తాళాలు వారి దగ్గరే ఉన్నప్పటికీ వారు గ్యాస్ ఆఫ్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత చూసుకుంటామని అనుకున్నారట. అయినప్పటికీ నాకు వారి మీద ఎటువంటి కోపం రాలేదు. ఎందుకంటే నేను ఒక సినిమాకి వెళితే ఇంటిదగ్గర పాలు మాడిపోయాయి, గ్యాస్ బంద్ చెయ్యి అని నాకు ఎవరు చెప్పరు. కానీ నేను వెళ్ళింది ఒక సద్గురువు దగ్గరికి కాబట్టి నా ఇంట్లో ఏమి జరుగుతుందో, నా జీవితంలో ఏమి జరుగుతుందో అన్నీ ఆయనకు తెలుసు అనుకున్నాను. ఇంకొకసారి నాన్నగారు నాకు ఇలా చెప్పారు. "భక్తి అనేది మనం రహస్యంగా ఉంచుకోవాలమ్మా సౌగంధికా, అది నీకు భగవంతుడికి మాత్రమే చెంది ఉండాలమ్మా" అన్నారు .

నాన్నగారు తరచూ సాత్వికాహారం గురించి చెబుతూ ఉండేవారు కదా! అది విని ఆచరించాలి అనుకుని మాంసాహారం ముట్టకూడదు అనుకున్నాను. ఒకసారి ఏదో శుభకార్యం నిమిత్తం స్నేహితులతో కలిసి ఆ కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ ఒక వైపు శాకాహార విందు, మరోవైపు మాంసాహార విందు ఏర్పాటు చేశారు. మాంసాహారం చూడగానే తినాలి అనిపించింది కానీ తినకూడదు అనుకున్నాను. కాబట్టి శాకాహారం వైపు వెళుతుంటే మా స్నేహితురాలు ఈ ఒక్క రోజుకి తినండి అని అన్నారు. నాకు కూడా మనసులో తినాలి అనే కోరిక ఉంది కాబట్టి ఆమె వంపు పెట్టుకుని ఆ రోజు మాంసాహారం తిన్నాను. మరుసటి రోజు నాన్నగారి దగ్గరకు వెళ్ళాను. ఆరోజు నాన్నగారు మీరు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో బలవంతం చేశారని మాంసాహారం తింటారు. కానీ లోపల మీకు తినాలి అనే వాంఛ ఉంది కాబట్టి దానిని తింటున్నారు. అది కూడా ఒక వాసనే. ఆ వాసనలు అన్నీ నాశనం అయితే గాని మీరు ఆత్మ లో స్థిరపడరు అని చెప్పి. "ఒక ఏనుగు గోతిలో పడిపోతే దానిని వందమంది బయటకు లాగుదాము అనుకున్నా లాగలేరు. అదే ఏనుగు ఒక నదీ ప్రవాహంలో పడిపోతే అలా కొట్టుకుపోతుంది. అలాగే మీకు ఎన్ని వాసనలు ఉన్నా గురువు అనుగ్రహంలో పడితే, ఆ అనుగ్రహ ప్రవాహంలో వాసనలన్నీ కొట్టుకుపోతాయి" అన్నారు. అది విన్న తర్వాత నాన్నగారంటే సామాన్యుడు కాదు. మనం ఏమి చేసినా నాన్నగారికి తెలిసిపోతోంది. బహు జాగ్రత్తగా ఉండాలి అనిపించింది. నాలో ఎన్ని వాసనలు ఉన్నా నాన్నగారికి అవి తీయటం అసాధ్యం కాదు అనేది నా విశ్వాసం.

నాకు హార్ట్ లో హోల్ ఉందని ఆపరేషన్ చేయించాలని మా అమ్మాయి అమెరికా నుండి వచ్చింది. ఆపరేషన్ కి ముందు ఇద్దరం కలిసి జిన్నూరు వెళ్ళాము. నాన్నగారు మా అమ్మాయిని చూసి ఆపరేషన్ చేయించటానికి అమెరికా నుండి వచ్చినందుకు థాంక్స్ అమ్మ అని చెప్పారు. అలా నాన్నగారు నా గురించి మా అమ్మాయికి థాంక్స్ చెప్పటం చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒక రోజు మా అమ్మాయి నాన్నగారికి ఫోన్ చేసింది. అప్పుడు నాన్నగారు మా అమ్మాయిని, నువ్వు ఎన్ని రోజులు ఉంటావమ్మా ఇక్కడ? అని అడిగారు. 20 రోజులు సెలవులు పెట్టుకున్నాను నాన్నగారు అని చెప్పింది. నువ్వు రేపు బయలుదేరి అమెరికా వెళ్ళిపోమ్మా ఉండవద్దు! అన్నారు. ఫోన్ పెట్టేసిన తర్వాత అదేమిటి నాకు సెలవులు ఉన్నాయి కదా! ఉంటాను అంటే నాన్నగారు ఇలా అంటున్నారు ఏంటి అని అంది. నాన్నగారు వెళ్ళిపో మన్నారు కదా వెళ్ళిపో ఎందుకు వెళ్ళిపోమన్నారో నీకు ఇప్పుడు తెలియదు తర్వాత తెలుస్తుంది అన్నాను. తను వెంటనే బయలుదేరి వెళ్ళిపోయింది. ఆఫీస్ కి వెళ్ళేసరికి ఈరోజు మీరు రాకపోయి ఉంటే మిమ్మల్ని ఇక్కడ నుండి తొలగించేవారు అన్నారట. మా అమ్మాయి నాకు ఫోన్ చేసి ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యం ఏమీలేదమ్మ నాన్నగారు త్రికాలజ్ఞులు, సర్వాంతర్యామి ఆయనకి అన్నీ తెలుసు అని చెప్పాను. అంటే ఒకవైపు మన ఆరోగ్యాలను రక్షిస్తూ, మరోవైపు మన ఉద్యోగాలను కాపాడుతూ అన్నీ ఆయనే చూసుకుంటున్నారు.

ఆపరేషన్ అయిన తర్వాత నేను కొంచెం నీరసించాను. నాన్నగారు నన్ను చూసి ఏంటమ్మా ఇలా అయిపోయావు అన్నం సరిపడినంత తింటున్నావా? ఒక్కసారి ఆస్పత్రిలో చూపించుకో అని చెప్పారు. నాతో ఇలా ప్రేమగా మాట్లాడుతూ ఆయన నన్ను కట్టిపడేసారు. ఒకసారి కాశీ వెళ్ళాము అక్కడ నాన్నగారు ప్రవచనం అయిన తర్వాత బుద్ధుడి విగ్రహాలు చూస్తున్నారు. నాన్నగారికి నాకు మధ్యలో చాలామంది ఉన్నారు. అప్పుడు నా మనస్సులో నాన్నగారు ఇంత మందిని దాటుకొని మీ దగ్గరకి రాలేను. మీ చేత్తో ఒక బుద్ధుడి విగ్రహం ఇస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. కానీ తరువాత మర్చిపోయాను. మరుసటి రోజు ఎవరో ఒక భక్తురాలు నాన్నగారికి బుద్ధుడి విగ్రహం తీసుకుని వచ్చి ఇచ్చారు. ఆ బుద్ధుడు విగ్రహన్ని అమ్మా సౌగంధిక ఇలారా అని పిలిచి నాకు ఇచ్చారు. మన లోపల ఏమి అనుకుంటున్నామో అవిఅన్నీ నాన్నగారికి తెలిసిపోతున్నాయి. తలంపుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనిపించింది. ఒకసారి నాన్నగారు నాకు B12 టాబ్లెట్ ఇచ్చి సౌగంధిక నీవు జీవించి ఉన్నంత వరకూ ఈ టాబ్లెట్ వేసుకో అని చెప్పారు. అప్పుడు నాకు నాన్నగారు Spiritual doctor and Physical doctor also అనిపించింది.

నా భర్తకి స్నేహితులు చాలా ఎక్కువ. అందులో ఒకరు అత్యంత సన్నిహితులు. ఆయన ఒక రోజు మా ఇంటికి వచ్చారు ఆయన వచ్చేసరికి నేను ఇంట్లోలేను. ఎక్కడికి వెళ్లారు అని నా గురించి మావారిని అడిగారు. తను వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళింది అని చెప్పారు. అలా గురువుల దగ్గరికి పంపించవద్దు, బయట పరిస్థితితులు బాగా లేవు అని మా వారికి ఆయన చెప్పారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా స్నేహితుడు ఇలా అంటున్నారు అని నాకు చెప్తే అవును మీరు అన్నది కరెక్టే చాలామంది గురువులు అలాగే ఉన్నారు. కానీ నాన్నగారు లాంటి గురువుని ఆయన చూడలేదు కదా! అలాంటి మాటలు మీరు పట్టించుకోవద్దు అని చెప్పాను. ఈ సంఘటన జరిగిన రెండు సంవత్సరాల తరువాత ఆయనకి ఒక వ్యక్తిగత సమస్య వచ్చింది దానివలన ఆయనకి చాలా టెన్షన్, బీపి ఎక్కువ అయిపోయాయి. ఆ సమయంలో ఆ సమస్యని మా వారితో పంచుకోవటానికి మా ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ కి ఫోన్ చేశారు. అనుకోకుండా నేను ఆ ఫోన్ ఎత్తి మాట్లాడాను. ఆరోజు ఆయన చాలా టెన్షన్ గా ఉండటం వల్ల ఆయన పడుతున్న ఇబ్బంది అంతా నాతో పంచుకున్నారు. అది విని అక్కడే ఉన్న నాన్నగారు ఫోటో చూస్తూ నాన్నగారు ఈయన మనసు శాంతపడేటట్టు ఏదైనా నాలుగు వాక్యాలు నాతో చెప్పించండి అనుకొని ఆయనకు చెప్పాను. అయన అదంతా విన్న తర్వాత నాకు టెన్షన్ తగ్గిందమ్మా! అని చెప్పి ఫోన్ పెట్టేసారు. తరువాత మావారి స్నేహితులందరికీ కూడా కిషన్ గారి భార్య ఒక మంచి గురువు దగ్గరకు వెళ్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే ఆమెకు ఫోన్ చేస్తే మనకి టెన్షన్ తగ్గుతుంది అని చెప్పారు. అలా చెప్పటమే కాకుండా ఆయన కూడా హైదరాబాద్ లో నాన్నగారికి సంబంధించి జరిగిన కార్యక్రమాలు అన్నిటికీ హాజరయ్యేవారు.

నాన్నగారు నన్ను తెలంగాణ టీచర్ అని పిలిచేవారు. అంటే నువ్వు తెలంగాణలో ఉన్నావని నిన్ను తెలంగాణ టీచర్ అని పిలవటంలేదు. నేను చాలా మంది తెలంగాణ వాసులని మీరు ఏ సత్సంగానికి వెళ్తున్నారు? అని అడిగాను. వారందరూ సౌగంధిక సత్సంగం అని చెప్పారు. అంతమంది తెలంగాణ వాసులు ఇక్కడికి రావటం అనేది అసాధ్యం. వారందరూ నీ దగ్గరికి వస్తున్నారు కాబట్టి నిన్ను తెలంగాణ టీచర్ అంటున్నానమ్మ అన్నారు.

నాన్నగారు భక్తి మార్గం గురించి గాని, విచారణ మార్గం గురించి గానీ చెబుతూ, చిన్న,చిన్న ఉదాహరణలతో వివరించటం వలన ఆచరించాలి అనే బుద్ధి కలుగుతుంది. పక్షులకు వల వేసే వాడు ఆహారాన్ని ఎరగా పెట్టి వల వేస్తాడు. అవి తెలియక వచ్చి ఆహారాన్ని తిని ఆ వలలో చిక్కుకుపోతాయి. అలాగే నాన్నగారు ఆయన ప్రేమ, దయ అనే వలలో చిక్కుకునేటట్టు చేసి, మన మనసుకు స్వతంత్రం లేకుండా చేసి, మన హృదయంలో ఉన్న స్వతంత్రమైన సుఖాన్ని మనకి అందించటం కోసం ఆయన బోధించారు.

ఒకసారి ఒక భక్తురాలు నాన్నగారి వద్దకు వచ్చి నాన్నగారు మా అబ్బాయి పదో తరగతి ఫెయిల్ అయ్యాడు. చదవడు, ఇంట్లో ఏ పనీ చేయడు అని చెప్పి, మీరే ఏదో విధంగా ఒక దారి చూపించాలి అని విన్నవించుకున్నారు. మరుసటి రోజు ఒక భక్తుడు వచ్చి నాన్నగారూ ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాను, దాని ప్రారంభోత్సవానికి మీరు రావాలి అని ఆహ్వానించారు. అప్పుడు నాన్నగారు మీరు ఉద్యోగాలు ఇస్తారా మాకు? అని అడిగారు. ఎవరైనా ఉంటే పంపించండి నాన్నగారూ ఇస్తాను అని చెప్పారు. ఈ పదో తరగతి ఫెయిల్ అయిన అబ్బాయిని పంపించి ఉద్యోగం ఇమ్మన్నారు. ఒక సంవత్సరం అయిన తరువాత ఆ కంపెనీ ఓనర్ వచ్చి నాన్నగారు మీరు పెట్టిన అబ్బాయి అసలు పని చేయడు, చేసే వాళ్ళను కూడా చెయ్యనివ్వడు. మీకు ఒక మాట చెప్పి అతనిని తీసేద్దాం అనుకుంటున్నాను అన్నారు. దానికి నాన్నగారు మీకు కొబ్బరి చెట్లు ఉన్నాయా అని అడిగి, ఆ కొబ్బరి తోటలో మీరు ఎరువు అన్ని చెట్లుకి సమానంగా వేసినా అన్ని చెట్లు సమానంగా కాయవు కదా! కాయలేని చెట్లను తొలగిస్తారా అని అడిగారు. లేదు నాన్నగారు అలా చేయను అని చెప్పారు. అలాగే ఈ అబ్బాయిని కూడా మీ దగ్గర ఉంచండి. నెమ్మదిగా వాడే నేర్చుకొని మారుతాడు అని చెప్పారు. ఈ మాటలు వినగానే నాన్నగారికి ఎంత దయో కదా అనిపించింది. మనకి ఏ సమస్యలు ఉన్నా ఆయన దగ్గర ఉంచితే అవి తొలగిపోవలిసిందే.

నాన్నగారు సర్వదేవతా స్వరూపులు. ఎవరి గురించి చెప్పినా వారి స్వరూపంలో జీవిస్తూ చెప్పేవారు. నాన్నగారిని ఎప్పుడు చూసినా నా మనసుకి శాంతి లభించేది. అంటే అలా నా మనసు అరెస్ట్ అయిపోయేది. ఆయన ఎవరితో మాట్లాడినా నాతో మాట్లాడినట్టే ఆనందపడుతూ ఉండేదాన్ని. అలా ఇరవై మూడు సంవత్సరాలు ఆయన కురిపించిన ప్రేమలో తడిసి ముద్ద అయిపోయాను. ఈరోజు నాతో ఎవరు మాట్లాడినా, మాట్లాడకపోయినా నాకు ఏమీ అనిపించదు. నా కప్పు మొత్తం నాన్నగారు నింపేశారు అనిపిస్తుంది. నేను జీవించి ఉన్నంతవరకు సరిపోయే ప్రేమను ఆయన నాకు పంచారు. ఇప్పుడు నా మనసులో ఎలాంటి వెలితి లేదు. మానవజన్మ వచ్చినందుకు నాకు అర్హత లేకపోయినప్పటికీ, అతి సమర్థుడైన గురువు లభించాడు అనిపిస్తుంటుంది. నాన్నగారు అంటే సామాన్యులు కారు. ఆయన ఆధ్యాత్మిక వీరుడు (Spiritual Hercules).

No comments:

Post a Comment