Thursday, December 24, 2020

"శ్రీ నాన్నగారు సాక్షాత్తు వేంకటేశ్వర స్వామియే" - (By వర్మ గారు)

శ్రీ నాన్నగారితో నా చిన్ననాటి జ్ఞాపకాలు

నా ఎనిమిదవ సంవత్సరం వరకు శ్రీ నాన్నగారి దివ్య సాన్నిధ్యం లో ఉండగలిగే భాగ్యం నాకు లభించింది. ఆ తరువాత అన్ని సెలవులలో జిన్నూరుకు రావడం, అరుగు మీద ఆడుకోవడం, శ్రీ నాన్నగారి దర్శనార్థం వచ్చే భక్తులను చూడటం జరిగింది. కిరాణా సామాను కొనడానికి శ్రీ నాన్నగారు నన్ను సైకిల్ మీద పాలకొల్లు తీసుకెళ్లిన రోజులు నాకింకా గుర్తు. నా ఏడవ లేక ఎనిమిదవ సంవత్సరంలో అనుకుంటాను నా కాలు విరిగింది. అప్పుడు తరచుగా నన్ను ఇంటి లోపలి నుండి బయటకు, బయట నుండి లోపలకు తిప్పమని ఏడ్చి మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాను. వారు నాతో విసుగు చెంది నా పై కోపగించుకున్నప్పుడు, నాన్నగారు వారిమీద అరిచేసి 'నేను చూసుకుంటాను' అని అన్నారు. నేను అడిగినప్పుడల్లా నాన్నగారు నన్ను ఇంటి లోపలి నుండి బయటకు, బయట నుండి లోపలకు తిప్పారు. రామాయణ, మహాభారత, భాగవతం ప్రతీ ఒక్క బొమ్మల పుస్తకం నాకు కొనిచ్చారు. పోస్ట్ ఆఫీస్ లో జరిగిన ప్రతీ ప్రవచనానికి వెళ్ళేవాడిని. ఆయన చెప్పిన ప్రతీ మాట నన్ను వెంటాడేది. నాన్నగారికి అంతటి జ్ఞానం ఎక్కడనుంచి లభించింది? అని ఆశ్చర్యం వేసేది. ఎందుకంటే అంతటి జ్ఞానం కలిగిన వారిని నా జీవితంలో ఎన్నడూ కలవలేదు. ఒక బంధువు చేసిన విజ్ఞప్తి వలన నేను ఆవిడకు 'అమృత వాక్కులు' అనే పుస్తకం గట్టిగా చదివి వినిపించడం జరిగింది. ఆ తరువాత యవ్వనంలో ఉండే ఆకర్షణల వలన శ్రీ నాన్నగారి ప్రవచనాల పట్ల నాకు శ్రద్ధ తగ్గిపోయింది. మళ్ళీ నా 18వ సంవత్సరంలోనే శ్రీ నాన్నగారి ప్రవచనాల పట్ల శ్రద్ధ కలిగింది. శ్రీ నాన్నగారు నా జీవితానికి సంబంధించి ఎలాంటి సలహా ఇచ్చినా అది గుడ్డిగా ఆచరించమని మా అమ్మ నాకు తరచుగా చెబుతూ ఉండేవారు. అలా చేయడం నాకు అలవాటుగా మారిపోయింది.

శ్రీ నాన్నగారి గురించి గమనించి విశ్లేషించి తెలుసుకున్న కొన్ని విషయాలు

శ్రీ నాన్నగారికి అందరి నుండి ఎంతో ఆదరణ లభించేది అన్న విషయం నాకు తెలుసు. బాల్యం నుండి నేను శ్రీ నాన్నగారిని పరిశీలించిన, నా ఇంగిత జ్ఞానంతో, నా నమ్మకము , నిశ్చయము కొరకు కొంత విశ్లేషణ చేసాను.

a) శ్రీ నాన్నగారు ఒక సుసంపన్నమైన కుటుంబంలో జన్మించారు. ఆయనకు పని చేసి సంపాదించవలసిన అవసరం లేదు. అయినా అన్ని కాలాల్లో ఎలాంటి వాతావరణం లో అయినా ప్రతీ చోటికి సైకిల్ మీద వెళ్లి ఎందుకు ప్రబోధిస్తున్నారు?

b) అందరిలాగ ఆయన రుచికరమైన భోజనం ఎందుకు ఆస్వాదించడం లేదు?

c) తమ గదిలో ఏకాంతంగా ఉండినా, అంత ఆనందంగా సౌకర్యవంతంగా, సినిమాలు వెళ్ళకుండా, స్నేహితులు తో కబుర్లు చెప్పకుండా, ఎటువంటి వినోద విహారాలు లేకుండా ఎలా ఉండ కలుగుతున్నారు?

d) బాహ్యంగా ఏవైనా కష్టాలు వచ్చినా, ఎవరైనా విమర్శించినా ఎటువంటి ప్రతిక్రియ లేకుండా అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు?

e) తమ ప్రవచనాలలో ఏదైనా అబద్ధం చెప్పవలసిన అవసరం ఆయనకు ఉందా?

f) మన జీవితాలకు ఆయన ప్రబోధనలు కాకుండా వేరొక ప్రత్యామ్నాయం కలదా?

ఇటువంటి ప్రశ్నలు నా మనస్సును మార్చడమే కాక శ్రీ నాన్నగారి పట్ల నా భక్తి ఆదరణలను పెంచాయి.

మార్పు

బాల్యంలో చదివిన కొన్ని పుస్తకాలతో ప్రభావితుడనై శ్రీ వేంకటేశ్వరస్వామి అంటే నాకు ఎనలేని ప్రేమ కలిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తిగీతం ఏదైనా వినగానే ఒక ప్రశాంతమైన ధ్యానస్థితి లభించేది. కాలక్రమేణ అదే ప్రశాంతత శ్రీ నాన్నగారి ప్రవచనాలు వినడంలో లభించింది.

ఒకరోజు నేను నాన్నగారిని: ‘నాకు వైరాగ్యం ఎలా కలుగుతుంది?’ అని అడిగాను. అప్పుడు నాన్నగారు: ‘ నీకు వేంకటేశ్వర స్వామి అంటే ఇష్టం కదా? (నేను ఎప్పుడూ ఆయనతో చెప్పలేదు) అని అంటూ ‘ఓం నమో వేంకటేశాయ’ అనే నామం ఉపదేశించారు. అదే రోజు నాకు శ్రీ విష్ణుసహస్రనామం పుస్తకం ఇచ్చి అది ఎలా చదవాలో కూడా చెప్పారు. ‘ఓం నమో వేంకటేశాయ’ నామంలోని ప్రతీ పదానికి అర్థం కూడా చెప్పారు.

కొంతకాలానికి నాకు పుణ్యక్షేత్రాల్లోని దేవాలయాలు చూడాలనిపించింది. నాన్నగారి అనుమతి లేకుండానే తమిళనాడులో సుమారు అన్ని దేవాలయాలు చూసాను. క్రమేణ నాకు చేసే పనిపట్ల ఆసక్తి తగ్గిపోయింది. అప్పుడు నేను నాన్నగారికి ఫోన్ చేసి ‘ నాకు పని పట్ల ఆసక్తి తగ్గుతుంది. మీరే మార్గదర్శనం చేయాలి’ అంటే నాన్నగారు అన్నారు: ‘ కర్తవ్యమే దైవం ( డ్యూటీ ఇస్ గాడ్). భగవంతుని కోసం నీ కర్తవ్యం నిర్వర్తించు. అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు’. నా అదృష్టం ఏమిటంటే నా జీవితానికి సంబంధించిన ప్రతి చిన్ననిర్ణయం నాన్నగారే తీసుకున్నారు. అది ఎప్పుడు కూడా అతి సులభంగా, స్పష్టంగా ఉండేది. ఇలా చేయడం నాకు ఎంతో ఉపశమనం కలిగించేది. ఆయన చెప్పింది గుడ్డిగా అనుసరించడం సౌకర్యవంతముగా ఉండేది.

శ్రీ నాన్నగారి ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎన్నో విన్నా, నాకు అలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు కలుగలేదు. నాకు కనీసం స్వప్నదర్శనం కూడా లభించదేమిటి అని ఆశ్చర్యం కలిగేది. 2015 లో నాన్నగారు భీమవరంలో మా ఇంటికి వచ్చినప్పుడు: ‘నీ వయస్సు ఇప్పుడు 40 దాటింది కదూ’ అని అడిగారు. నేను ‘ఔను’ అన్నాను. అప్పుడు నాన్నగారు సూటిగా నా కళ్లల్లోకి చూసారు. ఆ చూపు మామూలుగా కాకుండా కొంత వేరుగా అనిపించింది. అంతకు మించి ఇంకేమీ జరుగలేదు.

ఒక రెండు మూడు రోజుల తర్వాత నాన్నగారు నాకు సంబంధించిన నిర్ణయం ఒకటి తీసుకున్నారు. దాన్ని నేను ఆంతరంగికంగా వ్యతిరేకించాను. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. కొంతసేపటికి శ్రీ నాన్నగారు నన్ను పిలిచి ‘జిన్నూరు తిరిగి వెళ్తున్నాను’ అని చెప్పారు. అప్పుడు ఏదో పొరపాటు జరిగింది. నాన్నగారు నా అంతరంగం గ్రహించారు అనిపించింది. నాలో ఒక ఆంతరంగిక ఘర్షణ మొదలయ్యి ‘ఇంతేనా? మన అనుబంధానికి ఇంతకన్నా విలువ లేదా?’ అని అనిపించింది. కాని నాన్నగారు జిన్నూరు తిరిగి వెళ్ళిపోయారు.

నాకు రెండు రోజులు నిద్ర పట్టలేదు. నేను ఎంతో ఘర్షణకు గురయ్యాను. నాన్నగారు పాలకొల్లులో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్ళాను. కాని నాన్నగారు నాతో మాట్లాడలేదు. భీమవరం తిరిగివచ్చి ఆంతరంగికంగా ఎంతగానో ఘర్షణ పడ్డాను. ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదు. ఈ బాధ తట్టుకోలేక నేను అశాంతపూరితమైన తలంపులతో సమయాసమయాలు లేకుండా వీధుల్లో తిరిగాను. అనుబంధం అంటే ఇంతేనా? నాన్నగారు కాకుండా నేను ఇంకెవరిమీద ఆధార పడగలను? నాకెవరూ కనిపించలేదు. అదే సమయంలో ‘నేనేవరను?’ అని తీవ్రంగా ప్రశ్నించుకున్నాను. అప్పుడు నేను దేహం నుంచి విడిపోయినట్లు, అసలు ప్రపంచమే లేదు, ఇదంతా మాయ అనే అనుభవం కొద్ది నిమిషాల పాటు కలిగింది. ఈ సంఘటన తర్వాత నాన్నగారు మళ్ళీ నా పట్ల ప్రేమగా ఉండటం మొదలుపెట్టారు. అప్పుడు నాకు అమృతవాక్కులు నిజంగా అర్థం అవ్వడం (సరైన అర్థం తెలియడం) మొదలైంది. దీనివలన నాకు నాన్నగారి subject అర్థం అవ్వడం మొదలైంది.

ప్రతీ ఆదివారం నేను జిన్నూరు వెళ్ళేవాడిని. శ్రీ నాన్నగారు నాకు కనీసం ఒక అరగంట ప్రత్యేకంగా కేటాయించేవారు.

శ్రీ నాన్నగారి జ్ఞాపకాలు:

a) ఒకసారి నేను ఉద్యోగరీత్యా వేరే ఊరిలో స్థిరపడటానికి నాన్నగారి అనుమతి కోరాను. నాన్నగారు అన్నారు: ‘ నువ్వు భీమవరంలోనే ఉండు. ఇంటి నుండే పని చేసే అవకాశం నీకు లభిస్తుంది’. ఆశ్చర్యం ఏమిటంటే వారంలోపే నాకు ఇంటినుండి పనిచేసే అవకాశం ఒక స్నేహితుడి ద్వారా లభించింది. అదీను బయట ఉద్యోగాల కన్నా ఎక్కువ జీతం.

b) ఒక 3 సంవత్సరాల తరువాత office లో మనస్పర్ధలు ఉన్నాయని నాన్నగారితో చెబితే, ‘ఆ ఉద్యోగం వదిలేసేయి’ అని నాన్నగారు అన్నారు. కాని ఆ ఉద్యోగం వదలడానికి నేను సంకోచించాను ఎందుకంటే office వారు నా పై ఎంతగానో ఆధారపడి ఉన్నారు. నేను ఉద్యోగం వదిలేస్తే వారు ఎంతో ఇబ్బందిపాలు అవుతారు. కొన్ని రోజులు గడిచాక నాన్నగారు నన్ను మళ్ళీ పిలిచి ఉద్యోగం వదిలేయమన్నారు. అప్పుడు ఇంకో ఉద్యోగం దొరకక మునుపే ఈ ఉద్యోగం వదిలేసాను. 24 గంటలు లోపే, ఎటువంటి application పెట్టుకోకుండానే, నాకు ఇంటినుండే పని చేసే ఉద్యోగం లభించింది.

c) ఒక సంవత్సరం తరువాత నాకు ఒక చిన్న consultancy పెట్టుకోవాలని అనిపించింది. అనుకోకుండా నాన్నగారు వెంటనే దానికి తమ సమ్మతం ఇచ్చారు. registration పూర్తి అవ్వక మునుపే నాకు ఒక project కూడా లభించింది.

d) ఒక contract గురించి ఇంకొక దేశం వెళ్ళాలిసి వచ్చింది. వెంటనే ఆ contract లభించడం, దానికి మంచి రుసుము లభించడం జరిగాయి. నేను తిరిగి వచ్చాక, నాన్నగారు ‘వారు చాల మంచి ధర ఇచ్చారు కదూ?’ అని అన్నారు.

e) నాకు Phd చేయాలనే తలంపు కలిగింది. ఆదివారం నాన్నగారిని కలిసినప్పుడు, నేను నాన్నగారికి ఏమీ చెప్పక మునుపే నాన్నగారు అన్నారు: ‘Phd గురించి ఆలోచించకు. నీకు Phd అనవసరం’.

f) అది 23rd September 2017 తేది, సమయం సుమారు 1.30 pm. భక్తులందరూ నాన్నగారి ప్రవచనం గురించి ఆశ్రమంలో వేచి ఉన్నారు. నాన్నగారు చాలా అలసిపోయి తమ ఇంట్లో ఉన్నారు. నాన్నగారిని చూస్తే అసలు మంచం నుంచి లేవగలుగుతారా అనిపించింది. కొన్ని నిమిషాల్లో నాన్నగారు ఎంతో శక్తివంతంగా మరియు చిరునవ్వుతో కనిపించారు. ఆశ్రమానికి వెళ్లి ఒక అధ్బుతమైన ప్రవచనం ఇచ్చారు. ప్రవచనం చెప్పేటప్పుడు నాన్నగారు ఒక దివ్యశక్తి యొక్క పనిముట్టువుగా మారిపోయేవారు. భౌతికదేహ పరిస్థితితో సంబంధం లేకుండా ఒక అద్భుతమైన శక్తి నాన్నగారి ద్వారా ప్రవహించేది.

చివరి రోజుల్లో శ్రీ నాన్నగారి సహవాసం:

నాన్నగారు skin treatment గురించి భీమవరం వచ్చారు. Time కి మందులు అందించే అవకాశం శ్రీనివాస్ గారితో పాటు నాన్నగారు నాకూ కలుగచేసారు. నాన్నగారికి ఒళ్ళంతా ఎర్రటి దద్దుర్లేసి విపరీతమైన దురదగా ఉండింది. అది పరిశీలించిన డాక్టర్ అన్నారు: ‘దద్దుర్లు చాలా తీవ్రంగా ఉన్నాయి. నాన్నగారు విపరీతంగా బాధ పడుతున్నారు’. భీమవరం నుండి బయలుదేరే వరకు నాన్నగారు భక్తుల కోసమే తమ సమయాన్ని కేటాయించారు. భక్తులతో ఉన్నంత సేపు నాన్నగారికి time తెలియదు. ఆ సమయంలో నాన్నగారు శ్రీ రామకృష్ణుల గురించి ఎక్కువగా మాట్లాడారు.

ఒక రాత్రి నాన్నగారు నన్ను దగ్గరికి పిలిచి ఇలా అన్నారు: ‘ఇంక సరిపోతుంది మాకు సరిపడా వయసు ఉంది కదా! ఇంకా ఉన్నా కాంప్లికేషన్స్ ఉంటాయి’. నాకు కేటాయించిన కొన్ని బాధ్యతలను ఎలా నెరవేర్చాలో తెలిపి తిరిగి జిన్నూరు వెళ్ళిపోయారు. మరుసటి రోజు వైజాగ్ వెళ్లి అక్కడ treatment గురించి ఒక హాస్పిటల్లో చేరారు అని తెలిసింది.

నేను వైజాగ్ వెళితే నాన్నగారు ఒప్పుకుంటారో లేదో అనే సంశయం లో ఉండగా, అత్యవసరమైన ఒక లోజీసాఫ్ట్ ఆయింటుమెంటు విశాఖపట్టణం లో దొరకట్లేదని, అది కొని తీసుకురమ్మని నాన్నగారి దగ్గర నుండి కబురు వచ్చింది. వెంటనే సంతోషంగా కొన్ని డబ్బాలు పట్టుకొని వెళ్లాను. నన్ను చూడగానే నాన్నగారు చిరునవ్వుతో ‘ఎన్ని తెచ్చావు?’ అన్నారు. 50 అనగానే నాన్నగారు నవ్వారు.

ఆ సమయంలో నేను పూర్తి చెయ్యవలసిన కొన్ని వృత్తి బాధ్యతలు ఆశ్చర్యకరంగా శ్రీ నాన్నగారి అనుగ్రహంతో బాహ్య కారణాల వల్ల వాయిదా పడగా, నాకు ఆయనతో కలసి ఉండే అవకాశం దొరికింది. ఒక రాత్రి డాక్టర్లు మమ్మల్ని పిలిచి: ‘కొన్ని మందుల వాడకం వలన శ్రీ నాన్నగారి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది’ అన్నారు. మేము నాన్నగారితో ఆ విషయం చెప్పలేదు, కానీ కొద్దిసేపటికి కళ్ళు తెరిచి “కంగారు పడవద్దు, నేను వెళ్ళిపోవటం లేదు”, అని మాతో చెప్పి, డాక్టర్లతో “మీరు ఇంటికి వెళ్లి ప్రశాంతముగా నిద్రపోండి, రేపు సాయంత్రానికి అన్నీ చక్కబడతాయి” అన్నారు. మర్నాడు సాయంత్రం ఒక చర్మవ్యాధి నిపుణుడు ఇచ్చిన మందుతో మంత్రం వేసినట్టుగా చర్మవ్యాధిబాధ తగ్గింది. మర్నాడు మెడికల్ రిపోర్టులు కూడా మామూలుగా వచ్చేసాయి.

హాస్పిటల్ లో ఉండగా తీవ్రమైన బాధ వలన రాత్రుళ్ళు నాన్నగారికి నిద్ర ఉండేదికాదు. కొంతమంది భక్తుల విజ్ఞప్తి మేరకు అపోలో హాస్పిటల్స్ వారు నాన్నగారికి ఇతర భక్తుల నుండి infections రాకూడదని ఒక ప్రత్యేకమైన ICU room కేటాయించారు. అక్కడి staff కూడా ఎంతో గౌరవంగా నాన్నగారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు. నాన్నగారు పడే శ్రమ, తీవ్రమైన బాధ చూడలేక ఒకరోజు బయటికి వచ్చి భగవాన్ పటం ముందు ఏడ్చాను “ఇన్ని సంవత్సరాలు ఆయనను పనిముట్టువుగా ఉపయోగించుకొని ఇప్పుడు ఈ బాధల్లో వదిలేసావు, నువ్వు కర్కశుడవు. దయచేసి ఆయనను ఈ శరీరం నుంచి విడిదల చేసి ఆయనకి ఉపశమనం కలిగించు” అని ప్రార్థించాను. నాన్నగారు శరీరం నుంచి విడుదల పొందాలని కోరుకుంటూ కొన్ని గంటలు వేచిచూసాను. శ్రీ నాన్నగారు కళ్ళు తెరిచి “నేనెప్పుడు చనిపోతాను అని అలా అనుకోకూడదు” అన్నారు. అప్పుడు నాతప్పు నాకు తెలిసింది, శ్రీ రమణ మహర్షులకు నాన్నగారికి బేధం లేదు అని అర్ధం అయ్యింది.

హాస్పిటల్ లో ఉన్నంత కాలం నాన్నగారు ‘RK, RK’ అని కలవరించారు. రకరకాల health complications రావడం వలన నాన్నగారు సుమారు 30 నుండి 40 రోజుల వరకు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది.

హాస్పిటల్ నుండి నాన్నగారిని శర్మిల అనే భక్తురాలి ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు నాన్నగారు తమంతట తాముగా లేవడం లేక కూర్చోవడం అనేది చేయలేకపోతున్నారు. ఒకరోజు పరిపూర్ణానంద స్వామిజీ నాన్నగారిని కలవడానికి వచ్చారు. అది తెలిసిన వెంటనే నాన్నగారు ఎటువంటి అసౌకర్యం లేకుండా తమంతట తాముగా లేచి కూర్చొని స్వామీజీ తో మాట్లాడారు. పరిపూర్ణనానంద స్వామి చేస్తున్న పనులను అభినందించారు. కొన్ని రోజుల తర్వాత నాన్నగారు తిరిగి జిన్నూరు చేరుకున్నారు.

విశాఖపట్టణం నుంచి జిన్నూరు తిరిగి వచ్చాక కొద్దిరోజులు గాలి వెలుతురు మొదటి అంతస్తులో బాగుంటాయని నాన్నగారు తన కుమారుని ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో వేల్పూరు ఆశ్రమం నుంచి కొందరు భక్తులు, శ్రీ రమణ మహర్షుల శిష్యులైన శ్రీ పళని స్వామి గురించి ముద్రించిన పుస్తకం తెచ్చారు. పుస్తకం అట్టపైన రమణులు పళని స్వామి కలిసి ఉన్న బొమ్మ చూసి నాన్నగారు చిరునవ్వుతో దానిని ప్రేమగా హృదయానికి హత్తుకున్నారు. నాన్నగారు తమ ప్రవచనాలలో ప్రస్తావించిన విరూపాక్ష గుహలో భగవాన్ తో తమకు గల అనుబంధం నిర్ధారణ అయినట్లు అనిపించింది. ఒక రోజు నాన్నగారు నన్ను పిలిచి నాలుగు వేళ్ళు చూపించి తన గదిలోనే ఉండిపోమన్నారు. అప్పటివరకు ఆయనకి ఎదురుగా ఉన్న గదిలో రాత్రిపూట పడుకునేవాడిని. ఆ రోజునుంచి రాత్రి పగలు ఆయన పక్క నుంచి కదలలేదు. అయిదవ రోజున I LOVE YOU అన్నారు. తరువాత ఏమైయిందో తెలియదు నాలో ఉన్న శక్తి అంతా హరించిపోయింది. నేను ఇదివరకటిలా ఆయన పనులు ఏమీ చెయ్యలేకపోయాను. తాము బయటకు వెళ్ళాలి అనుకొంటే నన్ను పిలిచేవారు. భీమవరం లో మా ఇంటికి కొద్ది రోజులు ఉందామని వెళ్లి ఉండలేక తిరిగి వచ్చేసి, చివరి పది రోజులు కదలకుండా నాన్నగారి పక్కనే ఉండిపోయాను. నాలాగా ఆయనతోపాటే ఉన్న ఉషా అనే భక్తురాలు ‘నాన్నగారు 5 రోజుల్లో శరీరం వదిలేస్తానని చెప్పారు’ అని అన్నారు. ఆ సమయంలో నేను అక్కడ లేను. 5 రోజుల తరువాత తిథి వైకుంఠ ఏకాదశి అని కూడా ఆవిడ చెప్పారు. వెంటనే మనస్సులో అనుకొన్నాను. అదే ఆయన సంకల్పం అయితే అలాగే జరుగుగాక!

చివరి రోజు మధ్యాహ్నం వరకూ భక్తులు ఆయన దర్శనానికి వస్తూనే ఉన్నారు. మధ్యాహ్నానికి కొద్ది నిమిషాల మునుపు నాన్నగారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీ నాన్నగారు శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ సమయంలో అంతకు ముందు ఆయన ముఖములో ఉన్న బాధ మాయమై కాంతివంతంగా మారింది. భక్తులు మరియు కుటుంబ సభ్యులు గౌరవంతో ఆయన దివ్యమైన భౌతిక దేహం అదే రోజున మహా సమాధి చేసారు.” శ్రీ నాన్నగారి సందేశం ఏమిటంటే subject మీదే దృష్టిని ఉంచండి, వేరే దేనిమీద ఉంచకండి.

శ్రీ నాన్నగారు సాక్షాత్తు వేంకటేశ్వర స్వామియే

నాన్నగారు ఒక సిద్ధపురుషులు, మహాజ్ఞాని. ఎవరు ఎలా చూస్తే అలాగే కనిపిస్తారు. ఆయన్ను నేను బాగా పరిశీలించి తెలుసుకున్న విషయం ఇదే.

ఒకరోజు నేను నాన్నగారి దర్శనార్థం తిరువన్నామలై లోని ఆంధ్రాశ్రమానికి వెళ్ళాను. భక్తులు ఎక్కువమంది ఉండేసరికి దూరంగా గేటు బయట నిలబడిపోయాను. నాన్నగారు బయటకు వెళ్తూ నావైపు వస్తుండగా సాక్షాత్తు వేంకటేశ్వర స్వామియే నావైపు నడిచి వస్తున్నారా అనిపించింది. జీవితములో మొదటిసారి నాన్నగారు నా భుజం తట్టారు. అలా చేయడంతో ‘శ్రీనాన్నగారే వేంకటేశ్వర స్వామి’ అనే నా నమ్మకాన్ని నిర్ధారణ చేసారు అనిపించింది. ప్రతీ సంవత్సరం నాన్నగారు నాకు వేంకటేశ్వర స్వామి పోస్టర్స్ పంపుతూ ఉండేవారు.

ఇటీవల తిరుమల లొ దర్శనము తీసుకుని మరల జిన్నూరు వచ్చాను. ప్రత్యక్ష అవతారమగు నాన్నగారు, “ అక్కడ బొమ్మ సరిగ్గ కనపడిందా? అని అడిగారు.”

నేనొక సామాన్య మనిషిని. నా సామర్థ్యాన్ని మించిన విషయాల్లో ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాను. సాక్షాత్తు వేంకటేశ్వర స్వామియే శ్రీ నాన్నగారి రూపంలో వచ్చి నా జీవితంలోని ప్రతీ అడుగుకీ బాధ్యత వహించారు అనిపించింది. తమ దేహం పడిపోయినా భక్తులతో అనుబంధం కొనసాగుతుందని నాన్నగారు చెప్పారు. నాకు భక్తిని ప్రసాదించమనే నేను నాన్నగారిని ప్రాధేయ పడుతున్నాను.

ఆఖరి రోజుల్లో ఎంతోమంది భక్తులకు నాన్నగారిని సేవించుకొనే అవకాశం లభించినది. డ్యూటీ డాక్టర్స్ treatment చేసారు, కొంతమంది మందులతోనూ, కొంతమంది పగలు లేక రాత్రి పరిచారకత్వంతో, కొంతమంది hospital బిల్ కట్టి, మరికొంతమంది భోజనం తోనూ, మరికొంతమంది సమాధి వద్ద సహాయ సహకారాలు అందించి, కొంతమంది భక్తులను నిగ్రహించడంలో, కొంతమంది శుభ్రం చేయడంలో పాలుపంచుకుని తమ వంతు సేవలను అందచేసారు. వేలాది భక్తులు శ్రీ నాన్నగారి సమాధి ప్రక్రియలో విధి విధానములలో పాల్గొన్నారు.

శ్రీ నాన్నగారి గాథ నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. శ్రీ నాన్నగారు ఆత్మవిద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.

No comments:

Post a Comment