Sunday, January 10, 2021

"ప్రేమ మార్గం" - (By డా.ఉష గారు)

ఆయన సమక్షంలో మనస్సు నిర్మలమవుతుంది. శాంతి ఆవరిస్తుంది. హృదయం స్పందిస్తుంది. మౌనం ప్రకాశిస్తుంది. ఒకొక్కసారి అనిపిస్తుంది జ్ఞానం పక్కన పెడదాం. ఈ జన్మకు నాన్న చాలు. ఆ అందమైన కళ్ళల్లో నుంచి వ్యక్తమయే ప్రేమ, దయ, కరుణ, ఆయన నవ్వులో వున్నా ఆహ్లాదం, ఆయన పలుకులో ఉన్న ఔన్నత్యం, ఆయన నిరాడంబరత, నిర్మలహృదయం, ఆయన లో ఉన్న గంబీరత్వం చూసి ఈ జీవుడికి సృష్టిలో ఏదైనా ఆకర్షణగా కనబడగలదా అనిపిస్తుంది.

నాన్నగారికి సంబంధించి నాకు వచ్చిన స్వప్నాలు జరుగుతున్న వాస్తవాల్లా ఉండేవి. ఒకసారి వచ్చిన స్వప్నం ఏమిటంటే, లేడీస్ హాస్టల్ లో బయటివాళ్ళని ఎవరినీ లోపలికి రానివ్వకపోయినా, హాస్టల్ గేట్ తెరుచుకుని ఒకకారు లోపలికి వచ్చింది. ఆ కారులో నుంచి నాన్నగారు, రామచంద్రరాజు గారు దిగారు. ఆ హాస్టల్ ఎదురుగా పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌడ్ లో చూస్తే భక్తులు 1500 మంది పైగా కూర్చుని ఉన్నారు. హాస్టల్ లోకి భక్తులు ఎలా వచ్చారా? అని ఆశ్చర్యంగా చూస్తూనే, నాన్నగారికి రూములోనుండి ఒకకుర్చీ తెచ్చివేస్తే దానిలో కూర్చున్నారు. హాస్టల్ ప్రాంగణం అంతా భక్తులతో నిండిపోయి ఉంది.

ఆ సమయంలో ఒక భక్తుడు, పెద్దబుట్టతో అరటిపళ్ళు తీసుకువచ్చి నాన్నగారికి ఇచ్చాడు. నాన్నగారు ఉషా ఇలారా అని పిలిచి ఈ పళ్ళు అందరికీ పంచిపెట్టు అన్నారు. నాన్నగారూ ఈ పళ్ళు కొన్నే ఉన్నాయి కదా! అందరికీ సరిపోవు. చిన్నముక్కలు చేసి అందరికీ పంచమంటారా? అని అడిగాను. అవసరంలేదు అందరికీ ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్ళిపో అన్నారు. అయితే అక్కడున్న అందరికీ లోటురాకుండా అరటిపళ్ళు సరిపోయాయి.

భక్తులలో కూర్చున్న ఒక వృద్ధురాలికి అరటిపండు ఇచ్చినప్పుడు మాత్రం ఆవిడ తీసుకోలేకపోయారు. అనారోగ్యంతో దగ్గుతూ, ఒణికిపోతున్నారు. నాన్నగారూ ఆవిడ తీసుకోలేకపోతున్నారు అని చెప్పాను. తొక్క ఒలిచి పెట్టమ్మా అన్నారు. ఆవిడ దగ్గు ఎక్కువయి దానిని కూడా తీసుకోలేకపోయారు. నేనేం చేయాలా అని నాన్నగారివైపు చూస్తున్నాను. నాన్నగారు కుర్చీలోంచి లేచివచ్చి ఏది ఇలా ఇవ్వు అంటూ నా చేతిలో పండు తీసుకుని, ఆవిడ బుగ్గలు నొక్కి నోరుతెరుచుకునేలా చేసారు. నోరు తెరవగానే అమాంతంగా నోట్లోపెట్టి, ఆయన చేతిని ఆవిడనోటికి అడ్డుగా ఉంచి నోరుమూసి గుటకవేసేలా చేసారు. ఆవిడ ఆ పండు మింగగానే అనారోగ్యం తాలూకు చాయకూడా లేకుండా, ముసలిరూపం పోయి పూర్తిఆరోగ్యంగా తయారయ్యారు. అక్కడున్న అందరం జరిగినదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాము. దానితో కలచెదిరి నాకు మెలుకువ వచ్చింది.

ఆ తరువాత కొద్ది రోజులకి అరుణాచలం వెళ్ళాను. అక్కడ భగవాన్ సమాధి చుట్టూ ప్రదక్షిణ చేస్తూఉంటే, ఇదివరకులాగే మళ్ళీ ఒక భక్తురాలు నా చేయిపట్టుకుని మీతో ఒకసారి మాట్లాడాలి అంటూ బయటకు తీసుకువచ్చారు. ఈ మధ్య నాన్నగారి మీటింగ్ ఒకటి జరిగింది. మీరు కాలేజ్ లో ఉండడంవల్ల మీటింగ్ లకు రాలేరు కదా! అందుకని నాన్నగారు ఆ మీటింగ్ లో చెప్పిన అద్భుతమైన మాటలు మీకు చెప్పాలనిపించి బయటకు పిలిచాను. నాన్నగారు ఏం చెప్పారంటే, భూమిమీదకు వచ్చిన జ్ఞానులందరూ కూడా ఒక్కొక్కరూ ఒక్కొక్కమార్గాన్ని సూచించారు. వారిలో రామకృష్ణుడిది భక్తిమార్గం అయితే, భగవాన్ ది జ్ఞానమార్గం. బుద్ధుడిది ధ్యానమార్గం. యోగానందగారిది యోగమార్గం. మరి మనది ఏ మార్గం? అని నాన్నగారు అడిగారు. భక్తులు మాట్లాడకుండా నాన్నగారు ఏం చెప్తారా ? అని చూస్తున్నారు. అప్పుడు నాన్నగారు మనది ప్రేమమార్గం. ప్రేమతో ఇచ్చేయడమే అన్నారు. ఆయనే మళ్ళీ ప్రేమతో ఇచ్చేయడమంటే ఏమిటి? అన్నారు. ఎవరూ ఏమీ మాట్లాడకుండా చూస్తుంటే నాన్నగారు, ఒక ఆవుకి దూడ పుట్టినప్పుడు ఆవుదగ్గర పాలు తాగలేకపోతే, దానినోటిలో గొట్టంపెట్టి కడుపులోకి వెళ్ళిపోయేలా పోస్తారు. అలా మీకు అర్హత ఉందా? లేదా ? అన్నదానితో సంబంధం లేకుండా ప్రేమతో మీ అందరికీ ఇచ్చేయడమే మాపని అని చెప్పారు. ఇదంతా చెప్పి ఆవిడ, అసలు ఏ గరువు చెబుతారమ్మా ఇలాగ ? అన్నారు.

ఆ మాటలు విన్నాకా నాకు వచ్చిన కలకూ, నాన్నగారు చెప్పిన మాటలకూ సమన్వయం ఉందని అర్థమయింది. మన మానసిక అనారోగ్యం ఏదయితే ఉందో, ఏ అహంకారం వలన మనం జ్ఞానం పొందలేకపోతున్నామో, ఆ జ్ఞానాన్ని మనతో మింగించి మనల్ని ఆత్మ స్వరూపుల్ని చేస్తారు. అది ఆయన ప్రేమతోనూ, దయతోనూ చేస్తారు. అంతా నేనే చేస్తాను అని ఋజువు చేస్తున్నట్లు, వారం తిరగకుండానే నాకు వచ్చిన కలని ఆవిడతో నిర్థారణగా చెప్పించారు.

కేవలం ఆయన సమక్షంలో ( అంతర్యామికి సమీపంలో ) ఉంటే, ఆయన అన్నిరకాలుగా మనల్ని చూసుకుంటూనే మన జన్మ ధన్యమయ్యేలా చేస్తారు. మనం శరణాగతి చెంది అయన ధ్యాశలో ఉంటే, సాధన పేరుతో మనం ఏదో చెయ్యాలని తాపత్రయపడకుండా, భయపడకుండా, నిరాశపడకుండా ఉంటే మన ప్రయత్నంతో నిమిత్తం లేకుండా మోక్షం ఇచ్చి తీరతారనే విశ్వాసం నాలో దృఢపడింది.

No comments:

Post a Comment