Thursday, January 21, 2021

"ఓం దక్షిణామూర్తయే నమః" - (By డా. ఉష గారు)

నేను తర్డ్ ఇయర్లో ఉండగా నాన్నగారి కోసం కోయంబత్తూరు వెళ్ళాను. అలా వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులతో కలిసి హోటల్ రూమ్ లో ఉండటం జరిగింది. అక్కడ ఉన్నన్ని రోజులూ నాన్నగారు దాదాపు 6 - 8 గంటలు సజ్జక్ట్ బోధించేవారు. అందులో ఉదయంపూట ఎక్కువగా ఆచార్యులవారు, ఆయన జీవితం పొడవునా బోధించిన అద్వైతం గురించి చెప్పేవారు. ఆ బోధవిన్నాక ఒకరోజు భక్తుల మధ్య ఆధ్యాత్మిక చర్చ జరిగింది. అప్పుడు నేను ఉన్నది ఒక్కటే అని అనుభవంలోకి వచ్చేస్తే ఏమీ లేదు, ఈలోపు ఎంత గందరగోళం సృష్టించుకుంటామో కదా! అన్నాను. అలా కాదు ఉషా, ఇప్పుడు మనకు శరీరం ఉంది. శరీరం మీద గాయం అయింది. గాయంవల్ల మనకు బాధ కలుగుతుంది. గాయం పెద్దదయితే బాధ తొలగించుకోవటానికి మందువేస్తాం. అలాగే నేను అనే భావన రావడం వల్ల ఈశరీరం వచ్చింది. దానికి సాధన అనేమందు వేస్తే అనారోగ్యంలోంచి బయటకు వచ్చేస్తామని ఒక ఆవిడ చాలా అద్భుతంగా చెప్పారు. సాధనచేస్తేగాని ఈ ద్వంద్వంలోంచి బయటకు రాలేము కదా! అని మేమంతా చర్చించుకున్నాము.

ఆరోజు మధ్యాహ్నం నాన్నగారు లేచాకా, దయానంద ఆశ్రమానికి వెళ్ళడానికి వేను మాట్లాడుకుని నాన్నగారితోపాటు అందరం బయలుదేరాము. దారిపొడుగునా పచ్చగా ఉన్న ప్రకృతిని గమనిస్తూ, మధ్య మధ్యలో నాన్నగారివైపు చూస్తూ, ఉదయం సంభాషణలోని వాక్యాలు గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తున్నాను. అసలు గాయం అవడం, అనారోగ్యం రావడం దానికి మళ్ళీ మందు వేసుకోవడం ఇదంతా ఎందుకు? అనారోగ్యం రాకముందు మనం ఆరోగ్యంగానే ఉన్నాం. అసలు ఆరోగ్యంగా ఉంటే అనారోగ్యం రావడానికి ఆస్కారమేలేదు కదా! అనారోగ్యమనేది కల్పితమే!

భగవాన్ అక్షరమణమాలలో చెప్పినట్లు:

ఒకడవౌ నిను మాయ మొనరించి వచ్చువా
రెవరిది నీజాల మరుణాచలా!

నినువీడి మాయ అంటూ ఒకటి రావడానికి ఆస్కారముందా? నీకు తెలియకుండా మాయ అనేది ఎక్కడనుంచి వచ్చింది? ఈ మాయ అనేది కూడా నీలీలలో భాగమే తప్ప దానికి భిన్నత్వం ఏముంది? ఉన్నది ఒక్కటే! దానికి గాయమేంటి? అనుకుంటూ ఆలోచిస్తుంటే, అకస్మాత్తుగా అంతా అదృశ్యమైపోయి ఉన్నది ఒక్కటే అన్న అనుభవం వచ్చేసింది. అక్కడ ఇంక ఆరోగ్యం లేదు, అనారోగ్యం లేదు, ద్వద్వం లేదు. హృదయంలోంచి ఆనందం పొంగుతూఉంటే ఆ అనుభవానికి కళ్ళమ్మట నీళ్ళు కారుతుంటే, నాన్నగారివైపు చూసాను. అప్పుడే నాన్నగారు కూడా వెనకకు తిరిగి నా వైపు చూసి అవును అని సూచిస్తున్నట్లుగా నవ్వారు. నేను పైకి ఏమీ మాట్లాడలేదు. నాలో ఏం జరుగుతోందో పక్కన ఉన్న వారికి తెలియలేదు. అంటే భగవంతుడు నిన్ను అనుగ్రహించేటప్పుడు, నీకు అనుభవం ఇవ్వాలనుకున్నప్పుడు, రెండోకంటికి తెలియకుండా నిశ్శబ్ధంగా ఇవ్వగలడు అనేదానికి అది ఋజువు.

అప్పుడు నేను ఈ అనుభవం మాత్రమే నిజం! ఇదే ఫైనల్ అనుకున్నాను. నాకు కళ్ళమ్మట నీళ్ళు కారుతూ ఉన్నాయి . ఆ అనుభూతి చాలాసేపు ఉండిపోయింది. లోపల ఆనందాన్ని అనుభవిస్తూ, మెల్లగా నన్ను నేను అదుపులోకి తెచ్చుకుంటూ మామూలు స్థితికి వచ్చాను. అందరం కలిసి దయానంద ఆశ్రమానికి వెళ్ళగానే, నాన్నగారు ముందుగా ఆశ్రమంలో ఉన్న దక్షిణామూర్తి విగ్రహం దగ్గరకు తీసుకువెళ్ళారు. మేమంతా దూరంగా నిలబడి చూస్తున్నాము.

ఉషా ఈయన ఎవరు? అని అడిగారు. దక్షిణామూర్తి నాన్నగారూ అన్నాను. దక్షిణామూర్తి అమ్మా సనత్ కుమారులకు నోరు విప్పి మాటలద్వారా బోధించలేదు. మౌనంలోనే బోధించారు. ఆయన సమక్షంలోనే అనుభవం రావడం కూడా జరిగింది అన్నారు. వెంటనే నాకు ఈరోజు వేన్ లో జరిగింది అదే కదా అనిపించింది. దక్షిణామూర్తిది కొన్ని నిముషాల అవతారమమ్మా! రాముడులాగ, కృష్ణుడిలాగ అవతారపురుషులులాగ రాలేదమ్మా ఆయన. జ్ఞానం తాలూకు అనుభవాన్ని ఇచ్చి అవతారం చాలించేసారు అన్నారు.

నాకు మనసులో నాన్నగారు చెప్పిన ప్రవచనాలు ఇన్నిరోజులూ వింటూ వచ్చాము కానీ, హృదయంలో కలిగిన అనుభవం చాలా ప్రత్యేకమయినది అనిపించింది. నాన్నగారి సమక్షంలో అప్పుడప్పుడూ ఆత్మస్థితి అనుభవంలోకి వచ్చినా కూడా ఈసారి నాన్నగారు దానికి చాలా స్పష్టతనిచ్చారు. మౌనంలోనే నీకు లోపల ఉన్న వస్తువు అందుతుంది. మాట ఒకఎత్తు అయితే, మౌనం ఒక ఎత్తు.

No comments:

Post a Comment