Wednesday, January 13, 2021

"శ్రీ నాన్నగారి కటాక్ష వీక్షణాలు" - (By బంగారమ్మ గారు & లేట్ సూర్యకాంతమ్మ గారు (గుమ్ములూరు))

మాది గుమ్ములూరు గ్రామం. మా ఇంటి పక్కన మా వదిన గారు సూర్యకాంతమ్మ గారు ఉండేవారు. ఆవిడ కాపవరం లో నాన్నగారి ప్రవచనం విని నాతో ఇలా చెప్పారు. “బి. వి. ఎల్. ఎన్. రాజు గారు (నాన్నగారు) అని జిన్నూరు నుండి వచ్చి ప్రవచనం చెప్పారు చాలా బాగుంది” అన్నారు. ఈ సారి వెళ్ళినప్పుడు నేను మీ కూడా వస్తాను వదినా అని చెప్పాను. తరువాత ఇద్దరం కలిసి జిన్నూరు వెళ్ళాము. జిన్నూరులో నాన్నగారు ప్రతి ఆదివారం అరుగుమీద ప్రవచనం చెప్పేవారు. వదిన, నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం. తర్వాత పోస్ట్ ఆఫీస్ లో మొదలు పెట్టారు. మేము నాన్నగారిని మీ ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, మా గ్రామంలో కూడా పెట్టండి అని అడిగాము. సరే మీ గ్రామంలో సంవత్సరానికి మూడు సార్లు పెడతాము అని నాన్నగారు మాకు మాట ఇచ్చారు. అలా ఎనిమిది సంవత్సరాలు నాన్నగారి ప్రవచనాలు మా గ్రామంలో నిర్విరామంగా కొనసాగాయి.

సూర్యకాంతమ్మ గారి అరుగు చాలా పెద్దదిగా, పొడవుగా ఉండడంవల్ల, ప్రవచనాలు జరిగినప్పుడు ఆ అరుగుమీద భక్తులందరికి భోజనాల ఏర్పాట్లు చేసేవాళ్ళము. నాన్నగారు కూడా భక్తులతో పాటు కూర్చుని ఆ అరుగుమీద భోజనం చేసేవారు. నాన్నగారి మాటలు విన్నప్పుడల్లా మాకు అలౌకికమైన ఆనందం కలిగేది. తర్వాత డాక్టర్ రామారావు గారు నాన్నగారు దీపోత్సవానికి జ్యోతి వెలిగిద్దాం అన్నారు. అప్పుడు మేము ఒక పాత్రను చేయించి, ఒక కేజీ ఆవు నెయ్యితోపాటు ఒత్తు తయారు చేసి పట్టుకువెళ్ళాము. మిగతా భక్తులు కూడా ఆవునెయ్యి తీసుకువచ్చారు. అలా జిన్నూరులో దీపోత్సవం ప్రారంభమయింది. మేము ప్రసాదంగా రవ్వలడ్డు చేసుకుని వెళితే, నాన్నగారికి భక్తులు ఎక్కువ ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు కదా! “రవ్వ లడ్డు వద్దమ్మా పంచదార మిఠాయి చేయండి” అన్నారు. తరువాత సంవత్సరం నుండి పంచదార మిఠాయి చేసుకుని వెళ్ళేవాళ్ళం. తర్వాత భక్తులు పెరిగేకొద్దీ నాన్నగారు ప్రసాదం ఇంక మీరు ఆపేయండి, ఇక్కడ ఉప్మా చేయిద్దాం అని అలా ఉప్మా మొదలుపెట్టారు. “భగవాన్ ఫోటో వైపు ఎక్కువగా అలా చూస్తూ ఉండండి, ఎరుకతో ఉండాలి” అనేవారు. అలా ఎరుకతో ఉండటం మాకు తెలిసేది కాదు. ఒకసారి నాన్నగారు నాతో, “నామం చేస్తూ ఉంటే ఏ తలంపులు వస్తున్నాయో చూసుకొని, ఈ తలంపులు నాకు ఎందుకు వస్తున్నాయి? ఈ తలంపు నాకు రాకూడదు కదా! అనుకుంటూ నెమ్మదిగా వాటిని తీసి పడేయాలి. అలా చేస్తూ ఉంటే కొన్నాళ్లకు మౌనంగా ఉండటం అలవాటు అవుతుందమ్మా!" అన్నారు. ఆయన చెప్పిన మాటలను ఆచరణలో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండేదాన్ని.

గుమ్ములూరులో తారకం గారు, వేమూరి సూర్యనారాయణ గారు అనే బ్రాహ్మణులు ఉండేవారు. వారు భగవాన్ భక్తులు. నాన్నగారు మమ్మల్ని అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్ళమనే వారు. తారకం గారు, నాన్నగారు మాట్లాడుకుంటుంటే వినటం నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఒకసారి పాలకొల్లు బస్ స్టాండ్ కి వెళ్తే అక్కడ తారకం గారు, నాన్నగారు రోడ్డుమీద నిలబడి సబ్జెక్టు మాట్లాడుకుంటున్నారు. నేను కూడా వెళ్లి వారి వద్ద నిలబడి విన్నాను. అప్పుడు వారిద్దరూ గోపికలు గురించి మాట్లాడుకుంటున్నారు. నాన్నగారు "భక్తి అంటే గోపికల భక్తి లాగా ఉండాలి. వాళ్లకి కృష్ణుడు తప్ప ఇంకేమీ అక్కర్లేదు!" అని చెప్పారు. ఒకసారి ఆచంటలో నాన్నగారి ప్రవచనం జరిగింది. అక్కడ నాన్నగారిని ఒక ఫోటో తీశారు. ఆ ఫోటో మనం ఎటు వెళ్ళినా మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది. డాక్టర్ రామారావు గారు ఆ ఫోటో కొనుక్కోండి అమ్మా అని చెప్పారు. ఆ ఫోటో కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నాను. “మీరు ఎలాగూ ఎప్పుడూ మా వైపు చూస్తూనే ఉంటారు, నా దృష్టి ఎల్లప్పుడు మీ వైపే ఉండేటట్లు అనుగ్రహించండి!” అని వేడుకొనేదాన్ని.

ఏ పని చేసినా నేను కాదు చేసేది, ఆ భగవానే చేస్తున్నాడు అని అనుకోమనే వారు. అక్కడ నీవు లేవు అని నాన్నగారు చెప్పేవారు.

మా అబ్బాయి వికలాంగుడు, మాటలు రావు. తన సొంత పనులు కూడా తను చేసుకోలేడు. కానీ తనకు అన్నీ అర్థం అవుతాయి. మీటింగ్ కి వెళ్లేటప్పుడు వాడికి ఒక గిన్నెలో కూర అన్నం, ఒక గిన్నెలో పెరుగు అన్నం కలిపి అక్కడ పెట్టి వెళ్ళేదాన్ని. వాడు తినేవాడు. నాకు వివాహం అయిన మూడు నెలలకే నా భర్తకి మానసికంగా తేడా వచ్చింది. ఆయనను కూడా ఒక చిన్న పిల్లాడిని చూసుకున్నట్టు చూసుకోవాల్సి వచ్చేది. వాళ్ళిద్దరికీ నేను సేవ చేస్తున్నాను అనే భావన లేకుండా వారిద్దరిని చూసుకునేలా నాన్నగారు నన్ను అనుగ్రహించారు. ఒకసారి నాన్నగారు “బంగారమ్మ గారూ! మీకు ఏ సాధన అవసరం లేదు. వారి ఇరువురిని చూసుకోండి సరిపోతుంది" అన్నారు. అలాగే చూసుకునే శక్తి కుడా ఆయనే ఇచ్చారు.

నాకు కారం అంటే చాలా ఇష్టం. నాన్నగారు ఎక్కువ కారం తినకూడదు అని చెప్పేవారు. ఒకసారి భగవాన్ దగ్గర కూర్చుని, నాన్నగారు కారం ఎక్కువ తినకూడదు అంటున్నారు. నేనేమో కారం మానలేను అని వేడుకున్నాను. అంతే ఆ తర్వాత నుండి కారం తింటే గొంతులోమంట వచ్చేది. నాన్నగారు కాఫీ ఎక్కువ వేడిగా తాగవద్దు బంగారమ్మ గారూ అంతమంచిది కాదు అనేవారు. నాకేమో వేడి అంటే ఇష్టం. నాన్నగారు అలా చెప్పాక వేడి కాఫీ తాగితే నాలిక తిమ్మిరి వచ్చేసేది. తండ్రి నా మీద నీ కృప ఇలా చూపించావా అనుకున్నాను. ఇక ఆయన మాటే పట్టుకొని ఆయన ఎలా జీవించాలి అంటే అలా జీవించటానికి ప్రయత్నం చేసే వాళ్ళం.

నేనెప్పుడూ నాన్నగారితో మా అబ్బాయి గురించి గానీ, నా భర్త ఆరోగ్యం గురించి గానీ చెప్పే దాన్ని కాదు. నాన్నగారు ఎప్పుడు గుమ్ములూరు వచ్చినా మా అబ్బాయి ఆయన కూడా తిరిగేవాడు. మా అబ్బాయి రోడ్లమీద తిరుగుతూ శుభ్రంగా ఉండేవాడు కాదు. అందుకని నాన్నగారి వెనకే నువ్వు వెళ్ళవద్దు అనేదాన్ని. అయినా అగేవాడు కాదు. నాన్నగారు చేత్తో ఆశీర్వదించే వరకూ ఆయన వెనకే తిరిగే వాడు. ఆయన ఆశీర్వదించిన తరువాత వెళ్ళిపోయేవాడు.

మా వదిన గారు అయిన సూర్యకాంతమ్మ గారి అనుభవాలు నా జ్ఞాపకాలలో:

సూర్యకాంతమ్మ గారికి చిన్న వయస్సు నుండి ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. ఆమె చిన్న వయసులోనే భర్త పోతే, కుంటుంబ భారం అంతా మోస్తూ కూడా ఆధ్యాత్మిక చింతనని విడిచిపెట్టలేదు. ఎందరో గురువులు దగ్గరకు వెళ్లి ఎన్నో ప్రశ్నలు వేసేవారు. వారు చెప్పిన సమాధానాలు ఆమెకి సంతృప్తిని ఇచ్చేవి కావు. ఒకసారి స్వప్నంలో తెల్లని వస్త్రం ధరించిన ఆకారం ఒకటి ఆమెకి కనిపించింది. ఆ తరువాత త్వరలోనే ఆమెకి ఉన్న సంశయాలను తొలగించేవారిని కలుస్తాను అని అనిపించిందట.

కొద్ది రోజులకి ఆమె పుట్టపర్తి బాబా గారి దర్శనానికి వెళ్లారు. బాబాగారు అటుగా వస్తుంటే ఆమె మనస్సులో తండ్రీ, ప్రతిసారి ఇంత దూరం మేము రాలేము. మా పరిస్థితులు మీకు తెలియనవి కావు అని అనుకున్నారట. బాబా గారు ఒక్క క్షణం ఆగి బాధపడకండి త్వరలో మీ దగ్గరకి వచ్చి బోధ చెపుతారు అన్నారట. బాబా గారు ఇంతదూరం ఎలా వస్తారు? అనుకొని ఇంటికి వచ్చేశారు. ఆ తరువాత 1979 వ సంవత్సరం కాపవరంలో గీతాజయంతికి మొదటిసారి నాన్నగారి ప్రవచనం విన్నారు. నాన్నగారిని చూడగానే ఏదో తెలియని ఆనందం కలిగింది అన్నారు. ఆ ప్రవచనంలో ఆమె మదిలో మెదిలే ప్రశ్నలకు సమాధానాలు లభించాయి.

భగవాన్ శ్రీ రమణ మహర్షి అంటే ఇది వరకు నాకు తెలియదు. నాన్నగారు లాంటి జ్ఞాని జిన్నూరు గ్రామంలో మనకు దగ్గరగా ఉన్నా కూడా తెలియలేదు. 1979 నవంబరు నెలలో "గీతా జయంతి" కి కాపవరంలో మా బంధువులు అయిన కాపవరం సూర్యనారాయణ రాజు గారు నాన్నగారి ఉపన్యాసం ఉంది అని కబురు చేశారు. కాపవరం వెళ్లినందుకు నాన్నగారి దర్శనం అయింది. నిరాడంబరంగా ఉన్న నాన్నగారిని చూస్తే నా మనసుకి ఆనందం కలిగింది. ఉపన్యాసం విన్నాక నాన్న గారిని మా గ్రామం రమ్మని అడగాలనిపించింది. మా గ్రామంలో కూడా ఒక పదిమంది ఇలాంటి మంచి మాటలు వింటారు కదా! ఇటువంటి మాటలు చెప్పమంటే ఎవరు చెప్పగలరు? అది నాన్నగారికి మాత్రమే సాధ్యమవుతుంది అనుకొని 27/1/1981వ తారీకున గుమ్మలూరు రమ్మని ఆహ్వానిస్తే నాన్నగారు వచ్చారు. ఆ రోజు సభను చూసి ఆయన ఎంతో సంతోషించారు. గుమ్మలూరులో అందరు నెమ్మదిగా అర్థం చేసుకుంటారు, చాలా శ్రద్ధగా విన్నారు అని నాన్నగారు అన్నారు. తర్వాత ఎనిమిది సంవత్సరాలు మా గ్రామం వచ్చారు. మనం చెప్పుకోవలసినది ఏమంటే, నాన్నగారు భగవాన్ ద్వారా పొందిన ఆత్మానుభూతిని అనుభవపూర్వకంగా మన అందరికీ అందిస్తున్నారు. నాన్నగారు చెప్పిన మాటలు విని, విచారణ చేసి ఆచరించినట్లయితే జనన మరణ చక్రంలోంచి మనం విడుదల అవుతాము. నాన్నగారు అంటే ఎవరో కాదు రమణుడే. ఆయన సమక్షంలో ఉన్నప్పుడు మన మనసుని నాన్నగారు తప్పమరెవరూ అంతర్ముఖం చేయలేరు అనిపించేది. మనకు ఇంత దగ్గరలో ఇటువంటి మహా జ్ఞాన స్వరూపుడు అయిన నాన్నగారు దొరకడం ఎన్ని జన్మల సుకృతమో చెప్పటానికి సరిపోము. నాన్నగారు చెప్పిన మాటలు విన్నాక నాలో మారు మనసు కలుగుతూ వచ్చింది.

ఒకరోజు పాలకొల్లు ఉష గారు, నేను కలిసి నాన్నగారి దగ్గరకు వెళ్ళాము. శ్రీరమణ అనుగ్రహం వలన ఆ రోజు నాకు చాలా సుదినము. ఎందుకంటే ఒక మహత్తరమైన అనుభవం శ్రీ నాన్నగారి కటాక్ష వీక్షణాలు వలన నాకు లభ్యమై నా జీవితం ధన్యమైంది. ఆ అనుభవాన్ని నేను మాటలతో వర్ణించి చెప్పలేను. అసలు కళ్ళు విప్పి చూడాలని గాని, వినాలని కానీ లేని స్థితి నాకు కలిగింది. ఆ సహజ స్థితిలోనే ఉండిపోవాలని అనిపించింది. ఆసమయంలో కాసేపు నవ్వాలని, కాసేపు ఏడవాలని అనిపించింది. అంత ఆనందంగా ఉంది. ఇది అంతా కూడా పాలకొల్లు ఉష గారు వచ్చి జిన్నూరు రమ్మనడం వలన జరిగింది. అందుచేత ఆమెకు నా కృతజ్ఞతలు అని చెప్పారు. ఇక ఆ రోజు నుండి మా వదినగారు దేహం వదిలేవరకు నాన్నగారే ఆమెకి సర్వం అయ్యారు. అంతేకాకుండా ఆమెద్వారా ఎంతోమంది నాన్నగారి భక్తులు అయ్యారు.

No comments:

Post a Comment