Tuesday, June 29, 2021

"నాన్నగారితో తొలి రోజుల పరిచయాలు" - (లీల గారు)

నా పుట్టినిల్లు, మెట్టినిల్లు కూడా జిన్నూరు గ్రామమే. నాన్నగారి ఇంటికి దగ్గరలోనే మా అమ్మగారి ఇల్లు కూడా ఉంది. నాన్నగారు మా అమ్మగారి ఇంటికి తరచూ వస్తూ ఉండేవారు. మా తాతయ్య గారు, నాన్నగారు ఎక్కువ కలిసే ఉండేవారు. మా చిన్నాన్న గారి అమ్మాయిని నాన్నగారి కుటుంబంలో ఒకరికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుండి మేము నాన్నగారి ఇంటికి వెళుతూ ఉండేవాళ్ళం. నాన్నగారు అరుగుమీద భగవద్గీత శ్లోకాలు పాడుతూ ఉండేవారు. నాన్నగారు భగవద్గీత శ్లోకాలు ఒక సంస్కృతం మాస్టారు దగ్గర నేర్చుకున్నారట. చాలాకాలం తర్వాత నాన్నగారికి భగవద్గీత శ్లోకాలు చెప్పిన ఆ మాష్టారుగారు ఒకసారి నాతో “నాన్నగారు భగవద్గీత నా దగ్గర నేర్చుకున్నారు కానీ నేను శాస్త్రం పట్టుకు తిరుగుతున్నాను ఆయన సారం పట్టుకుని జ్ఞాని అయ్యారు. నాకు నాన్నగారికి అది వత్యాసం” అని చెప్పారు. నాన్నగారు భోజనానికి వచ్చేటప్పుడు ఆయన రెండవ తమ్ముడుతో కలిసి 'హే భగవాన్, ప్రియ భగవాన్ జయ భగవాన్' అని పాడుకుంటూ వచ్చేవారట. నాన్నగారు ఒక్కొక్కసారి మా తాతయ్య గారితో ఆయన గడిపిన జ్ఞాపకాలను నాతో పంచుకుంటూ ఉంటారు. పోస్టాఫీసులో నాన్నగారు ప్రవచనాలు చెబుతూ ఉంటే, అప్పటినుండి నాన్నగారి దగ్గరకు వెళ్ళటం మొదలుపెట్టాము.

నాన్నగారి ప్రవచనాలు పోస్ట్ఆఫీస్ లో జరిగేటప్పుడు ఒక పెద్ద నేల పీట ఉండేది. ఆ పీట మీద నాన్నగారు ఆసీనులై ఉండేవారు. ఆ దృశ్యం నాకు సౌందర్య భరితంగా కనిపించేది. అప్పట్లో ఒక గంట మౌనంగా ఉండేవారు. నేను నాన్నగారి దగ్గరికి రాకముందు ఆధ్యాత్మికత గురించి ఎవరి దగ్గర వినలేదు. 1969 వ సంవత్సరములో ఒకసారి కంచి పరమాచార్యులు పాలకొల్లు వచ్చారు. వారి దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత నాన్నగారి దగ్గరకే వచ్చాను. "మనము పడితే త్రాచుపాము నోటిలో పడాలి అది మింగేస్తుంది. అదే బురద పాము నోట్లో పడ్డాము అంటే మింగదు,కక్కదు అని చెబుతూ, త్రాచుపాముని గురువుగా ఉదాహరిస్తూ", చెప్పేవారు నాన్నగారు. అలా నాన్నగారి లాంటి మహాగురువు దగ్గరకి వచ్చి త్రాచుపాము నోటిలో పడ్డాము అనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా నాకు ఏమీ తెలియకపోవడం వలన నాన్నగారి మౌనం అర్థం అయ్యేది కాదు. "స్పందన లేని గోడలకు కూడా చదువు చెప్పేవాడే" గురువు అనేవారు నాన్నగారు. అలా ఏమీ తెలియని నన్ను నాన్నగారు ఆధ్యాత్మికంగా ఏవిధంగా తీర్చిదిద్దారో మీతో పంచుకుంటాను.

నాన్నగారు ఒక గంట మౌనంగా ఉండేవారు ఆమౌనం అర్థమయ్యేది కాదు, కానీ చూడకుండా ఉండలేక ఆ మౌనం గురించి వెళ్ళిపోయేదాన్ని. నాన్నగారి నేత్రాల వైపు చూస్తూ ఉంటే, అవి పెద్ద పెద్ద నేత్రాలు చేసి ఎర్రగా ఉండేవి. నాన్నగారి కుడి కన్ను వెంట కన్నీటి ధార వచ్చేది, కానీ ఎడమ కన్ను వెంట వచ్చేది కాదు. ఆ మౌనాన్ని చూస్తూ ఉంటే, నాకు భయం వేసి ఒకసారి నాన్నగారికి సమీపంగా ఉండే భక్తులలో ఒకరిని నాన్నగారు ఎందుకు అలా ఉంటారు అని అడిగాను. దానికి ఆ భక్తులు అది జ్ఞాని యొక్క వైభవం అమ్మ అని చెప్పారు. అప్పట్లో నాన్నగారు చెప్పిన వాక్యాలలో ఒక నాలుగు నా హృదయానికి బాగా పట్టాయి.

"మీరు భూమి మీదకు వచ్చినప్పుడు వంద వాసనలతో వచ్చారు అనుకోండి ఈ భూమి విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కనీసం ఒక్క వాసన అయినా విడిచిపెట్టి వెళ్ళాలి",  అన్నారు. అప్పట్లో నాన్నగారు చెప్పినది ఆచరిస్తున్నానా లేదా అని చూసుకుంటూ ఉండేదాన్ని. నాకు సరిగ్గా తెలియక పోవటం వలన నాన్నగారు ఒక వాసనలో నుండి బయటికి రమ్మన్నారు కానీ రెండు వాసనల నుంచి బయటకు వచ్చాను అనుకుని చాలా సంతోషపడ్డాను. నాన్నగారు ఒక ప్రవచనం లో, "మీరు పూర్వము చుసిన సినిమాలు ఇప్పుడు గుర్తు వస్తున్నాయా అని అడిగి, అవి గుర్తువస్తూ ఉంటే మీకు వాసన పోయినట్టు కాదు, దానికి సంబంధించిన బీజాలు కూడా కాలిపోవాలి",  అని చెప్పారు. అంటే పేరు గుర్తు వచ్చినా, ఆ పేరు పట్ల తాదాప్యం రాకూడదు. అప్పుడు వాసన పోగొట్టుకున్నట్టు అని వాసన ప్రక్షాళన గురించి వివరణ ఇచ్చారు. నాకు ఎన్టీరామారావు, నాగేశ్వరరావు గుర్తు వస్తే, వారికి సంబంధించిన రీలు అంతా గుర్తుకు వస్తోంది కాబట్టి నాకు వాసనలు తొలగలేదు, దీనికి చాలా పని ఉంది అనుకున్నాను. ఆవిధంగా నాకు సంబంధించిన వాటికి నాన్నగారు వివరణ ఇచ్చేటప్పుడు అర్థమవుతోందా? అన్నట్టు నా వైపు చూసి చెప్పేవారు. 

నాన్నగారు చెప్పిన మరొక వాక్యం ఏమిటంటే, "మన ఇంటికి కొత్తగా వచ్చిన కోడలకి అక్కడి పరిసరాలు వేరుగా ఉంటాయి, మన కుటుంబం పరిసరాలు వేరుగా ఉంటాయి. మీరు తనని ఇబ్బంది పెట్టకుండా, తనకు ఏది ఇష్టమైతే అది వండి పెడుతూ, ఇక్కడ పరిసరాలు అలవాటయ్యే వరకూ తనకి సహకరిస్తే, ఆమె మీకు జీవితాంతం అనుకూలంగా ఉంటుంది", అని చెప్పారు. నాన్నగారు చెప్పిన ఈ వాక్యం నా హృదయాన్ని తాకి, నాకు మంత్రంలా పట్టి మా కోడలు విషయంలో నన్ను అద్భుతంగా ఇప్పటివరకు నడిపించింది. 

 నాన్నగారు చెప్పిన మరొక వాక్యం ఏమిటంటే, "ఈశ్వరుడు పోస్ట్ మాస్టర్ కాదు, పోస్ట్ మాన్ అన్నారు . పోస్ట్ మాన్ మనకు వచ్చిన ఏ ఉత్తరాన్నైనా ఎలా ఇచ్చి వెళతాడో, అలాగే ఈశ్వరుడు మీ ప్రారబ్దంలో ఏది వస్తే అది ఇచ్చి వెళ్ళిపోతాడు", అని చెప్పారు. ఆ వాక్యం నాకు ఎదైనా కష్టం వస్తే నేను ఏమీ చేయలేదు, నాకు భగవంతుడు ఎందుకు ఈ కష్టాన్ని ఇచ్చాడు అనే నా భావాన్ని మార్చి, నేను చేసుకువచ్చిందే నాకు ఇస్తున్నారు అని అర్ధమయ్యేలా చేసింది. నాన్నగారు చెప్పిన ఆ వాక్యాలు అలా నా హృదయాన్ని తాకి నన్ను నడిపించాయి.

మొదట్లో నాన్నగారి మౌనం అర్థమయ్యేది కాదు కానీ ఆ మౌనంలో ఉన్న నాన్నగారిని చూస్తూ ఉంటే రెప్పవేయడం కూడా ఇష్టం ఉండేది కాదు. అప్పట్లో భక్తులు ఒక 30 మంది వరకు ఉండేవారు. అది అంతా ఒక వైభవం కింద ఉండేది. నాన్నగారు మౌనంగా ప్రతి ఒక్కరిని చూసుకుంటూ వచ్చేవారు ఒకసారి నన్ను కూడా చూశారు. అప్పుడు ఆయన కుడికంటిలో నుంచి ఒక రశ్మి వచ్చి నా హృదయాన్ని తాకింది. అలా తాకగానే, ట్రైన్ వెళుతుంటే శబ్దాలు ఎలా వస్తాయో అలా నాలోపల అంతా కొట్టుకుంటూ శరీరమంతా పైకి కదిలిపోతోంది అక్కడ ఉన్న వారు నన్ను గట్టిగా నొక్కి పట్టుకున్నారు. అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు. నాన్నగారి కంటిలో నుండి వచ్చిన రశ్మి ఏమిటన్నది కూడా నాకు తెలియలేదు. ఇంటికి వచ్చిన తరువాత కూడా నాకు ఆ భయం తగ్గకపోవటం వలన చాలాసేపటి వరకు మా దేవుడి మందిరం దగ్గరే కూర్చుండిపోయాను. మరలా ఆదివారం నాన్నగారు నా పక్కన ఉన్న నలుగురిని చూస్తూ, ఆ చూపు నా వైపు వచ్చేసరికి నాకు భయం వేసి నేను తల వంచేసుకున్నాను. నాన్నగారు చూపు నా వైపు నుండి మరిలిన తరువాత తల పైకిఎత్తాను. మరలా మూడో ఆదివారం నాన్నగారు అలా చూస్తుండగానే నెమ్మదిగా నాన్నగారి వైపు చూసాను అప్పుడు నాకు ఆ కాంతి ఏమీ కనపడలేదు కానీ కంగారుగా అనిపించి దుఃఖం వచ్చేసింది. పక్కన ఉన్న వారు పట్టుకున్నారు. తరువాత నాన్నగారు నన్ను పిలిచి ఇప్పటి నుండి నీకు భయం ఉండదులే అమ్మ అన్నారు. ఆ తరువాత నుండి నాన్నగారు వైపు చూసినా నాకు భయం అనిపించేది కాదు.

No comments:

Post a Comment