Sunday, June 13, 2021

ప్రారబ్ధాన్ని ప్రీతిగా అనుభవించాలి

ఒక భక్తురాలు చిన్న వయసులోనే తన భర్త చనిపోవడం వల్ల భరించలేని దుఃఖం అనుభవించారు. ఆమె నాన్నగారితో, నేను పూర్వజన్మలో ఎంత పాపం చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చిందో కదా! అని అడిగారు.

అప్పుడు నాన్నగారు, ఆనందం స్వతంత్రమైనది. అది బాహ్యమైన వస్తువుల మీద, మనుషుల మీద, విషయాల మీద, పరిసరాల మీద ఆధారపడి ఉండదు. చావు అంటే, ఒక ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళడం లాంటిది. నువ్వు శరీరంతో తాదాత్మ్యం పొందకూడదు. భగవంతుడు నియంత! మన ప్రారబ్ధ కర్మలను బట్టి దేహాలను నడుపుతూ ఉంటాఢు! ప్రారబ్ధాన్ని కనుక నువ్వు పాయసం తాగినట్టు, ఆనందంగా అనుభవించగలిగితే, అది ఈ జన్మలో ఖర్చు అయిపోతుంది. మళ్ళీ జన్మకి అది నీ వెంటరాదు. 24 గంటలలో నీ దుఃఖాన్ని నేను తీసుకుంటాను. నీకు శాంతి వస్తుంది. అంతులేని శాంతిని నీకు ప్రసాదిస్తాను. నువ్వు ఆనందంగా ఉంటావు అన్నారు.

కొద్దికాలం తరువాత ఆ భక్తురాలు నాన్నగారిని కలిసినప్పుడు నా స్వభావం మార్చుకోవడం ఎలా నాన్నగారూ అని అడిగారు.

దానికి నాన్నగారు, స్వభావం మారడం చాలా కష్టం అమ్మా! పూర్వ జన్మ వాసనలు బలీయంగా ఉండడం వల్ల స్వభావం మారడం కష్టంగా ఉంటుంది. అయితే, నీ దృఢ సంకల్పం వల్ల, భగవంతుడు జోక్యం చేసుకొని అనుగ్రహించడం వల్ల నీ స్వభావం మారుతుంది. స్వభావం మారడానికి ఒక పద్దతి ఏమిటంటే! సహనం, సహనం, మరింత సహనం అన్నారు.

No comments:

Post a Comment