Sunday, April 4, 2021

సత్యం మాత్రమే నీలోంచి నిన్ను విడుదల చేస్తుంది

గణితంలో మేథావి అయిన ఒక వ్యక్తి నాన్నగారిని, లెక్కలకి అంతం ఎక్కడ? అని అడిగారు. అప్పుడు నాన్నగారు "జ్ఞానం" అని చెప్పి, అంతేకాదు అన్ని శాస్త్రాలకు, అన్ని గ్రంథాలకు, అన్ని మతాలకు, అన్ని సైన్సులకు, అన్ని తత్వాలకు జ్ఞానమే గమ్యం అని చెప్పారు. ఈ సందర్భంగా ఐన్ స్టీన్ గురించి చెబుతూ, ఐన్ స్టీన్ గణిత శాస్త్రంలోనూ, భౌతిక శాస్త్రంలోనూ మహా మేథావి. అంతేకాక అతనికి జ్ఞానం పట్ల అవగాహన ఉండేది. వీటన్నిటికి అంతం జ్ఞానమే అని ఐన్ స్టీన్ గుర్తించాడు అని చెప్పారు.
ఒక పెళ్ళి కొడుకు, అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాకా ఒక వారంలో పెళ్ళి ఉందనగా, నాన్నగారి దగ్గరికి వచ్చి, ఈ పెళ్ళి చేసుకోకూడదు అనుకుంటున్నాను అన్నాడు. అందుకు కారణమేమిటి అని నాన్నగారు అడిగితే, ఆ అమ్మాయి పెళ్ళయ్యాకా నా మీద అధికారం చెలాయించేలా ఉంది, అది నాకు అసహనం కలిగిస్తోంది. అందుకే ఈ పెళ్ళి వద్దనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు నాన్నగారు అమ్మాయి చాలా అందంగా ఉంది, ధనవంతురాలు, పైగా చదువుకుంది కదా! అన్నీ బానే ఉన్నప్పుడు ఇంత వరకూ వచ్చిన పెళ్ళిని ఆపడమెందుకు? కొన్ని విషయాలలో నువ్వు సర్ధుకుపోతే సరిపోతుందేమో! అన్నారు. దానికి ఆ అబ్బాయి, నా స్వేచ్ఛని నేను కోల్పోయాకా అవన్నీ నేనేం చేసుకుంటాను? అన్నాడు. ఆ తరువాత ఎప్పుడో నాన్నగారు ఆ సందర్భాన్ని గుర్తుచేసుకొని ఇలా చెప్పారు. మన స్వరూపం ఆనందమూ, శాంతి, స్వేచ్ఛ! దాన్ని కోల్పోవడానికి జీవుడు ఇష్టపడడు. బాహ్యమైన విషయాలకంటే కూడా, మనం ఎల్లప్పుడూ కోరుకునేది మన నిజమైన స్వరూప స్థితినే! జీసస్ కూడా "ఆత్మజ్ఞానం పొందవలసిందే, అది మాత్రమే నిన్ను స్వతంత్రుడిని చేస్తుంది!" అన్నాడు.

No comments:

Post a Comment