Sunday, February 28, 2021

నీ భౌతిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి వ్యత్యాసం చూడకు

ఒకసారి ఒక భక్తుడు ఆయన కొడుకుని తీసుకొని నాన్నగారి దగ్గరకు వచ్చారు. మా అబ్బాయి నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు, నేను చేసుకోను అంటున్నాడు. విదేశాల్లో తను చేస్తున్న ఉద్యోగం కూడా వదిలేసి, తన పూర్తి సమయాన్ని ధ్యానంలో గడుపుతాను అంటున్నాడు అని నాన్నగారితో చెప్పారు. అప్పుడు నాన్నగారు ఆ అబ్బాయితో నువ్వు భౌతిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి వ్యత్యాసం చూడకు. ఆధ్యాత్మికం, భౌతికం రెండూ వేరు కావు. భౌతిక జీవితంలో నువ్వు సక్రమంగా పనిచేస్తే అది ఆధ్యాత్మికమే అవుతుంది.

విష్ణు సహస్ర నామాల్లో వెయ్యినామాలు ఉంటాయి. అందులో ఒక నామం విశ్వం అని ఉంటుంది. అంటే విశ్వం రూపంలో ఉన్నది కూడా ఆయనే. అంతటా ఉన్నది, అందరిలో ఉన్నది ఆయనే కాబట్టి, నువ్వు చేసే పని ఆయన పని అనుకుని చేస్తే అది మోక్షానికి దారి తీస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు బహుజన్మల కృషి వలనే ఆత్మజ్ఞానం వస్తుందని చెప్పాడు. బుద్ధుడు కూడా బహు జన్మలలో తను చేసిన సత్కర్మ వల్లే తనకు నిర్వాణం (మోక్షం) కలిగిందని చెప్పాడు.

జ్ఞానమూ, కర్మ పక్షికి ఉండే రెండు రెక్కలలాంటివి. రెండు రెక్కలూ సమానంగా పనిచేస్తేనే పక్షి ఎగరగలుగుతుంది. అలాగే, జ్ఞానమూ, కర్మా పరస్పర విరుద్ధమైనవి కావు. జ్ఞానం పొందడానికి రెండూ అవసరమే! చాలామంది ఉద్యోగమూ, బాధ్యతలూ వదిలేసి ఆధ్యాత్మికంగా ఎదగాలని అనుకుంటారు. కానీ అది తప్పించుకుని తిరగడం అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇహమూ, పరమూ రెండిటికీ చెందకుండా అవుతారు. అందుచేత, ఇంకొక 20 సంవత్సరాలు నువ్వు పని చేస్తేనే మంచిదని ఆ అబ్బాయికి చెప్పి పంపించారు.

No comments:

Post a Comment