Saturday, November 28, 2020

"భక్తుల హృదయాలలో జీవించే ఉంటారు" - (By పెద్దిరాజు గారు)

జన్మనిచ్చిన తల్లి ఈ చెయ్యిపట్టి నడిపించి ఈ లోకాన్ని చూపించింది. మనసంతా అమ్మతనం నింపుకొని ఆత్మీయపు పలకరింపుతో ఆధ్యాత్మిక లోకాన్ని చూపిన నాన్నగారి పాదాల చెంతకు సహధర్మచారిణి చేర్చింది. మనస్సులోనే వీరు ఇరువురికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాన్నగారితో నాకు మూడు దశాబ్దాల అనుబంధం. తొలిసారి భీమవరంలో నాన్న గారి ప్రవచనం విన్నాను. "ప్రియమైన ఆత్మ బంధువుల్లారా" అనే సంబోధన అమృతపు జల్లులా నా హృదయాన్ని తడిపింది. ఆ వేదికపై ప్రేమపూర్వక చూపులతో రెండు చేతులతో నా బుగ్గలను స్పృశించిన ఆ స్పర్శను, ఆ మధురస్మృతిని ఎలా మరిచిపోగలను?

ఆనాటి నుండి ఎన్నో పర్యాయాలు నాన్నగారిని దర్శించుకున్నాను. ఉద్యోగరీత్యా జిన్నూరుకు దూర ప్రాంతాలలో ఉండటంవలన నాన్న గారు విశాఖపట్నం వచ్చినప్పుడు పద్మ గారి ఇంటి దగ్గర దర్శనం చేసుకునేవారము. ప్రతి సంవత్సరం ఒకటి రెండు సార్లు జిన్నూరు రావటం జరిగేది. జిన్నూరు పరిసర గ్రామాల భక్తులు ప్రతిరోజు నాన్న గారి దర్శనం చేసుకునే వారని, నాన్న గారితో పాటు అరుణాచలం మరియు ఇతర పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారని అలాంటి అదృష్టం నేను పొందలేక పోయాననే మనోవేదన కలిగేది.

భక్తి, జ్ఞానం, యోగం, ముక్తి, ఆత్మ, శరణాగతి ఇలాంటి పదాలకు అర్ధాలు తెలియకపోయినా, ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాన్నగారి సమక్షంలో ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి కలిగింది. అరిషడ్వర్గాలని మదినిండా నింపుకుని, అజ్ఞానాన్ని మూటకట్టుకుని నాన్నగారి సన్నిధికి వెళ్ళినా, నాలో ఏ ప్రత్యేకతా లేకున్నా, సాధన పూజ్యమైన ఆచరణలో తప్పటడుగులు వేస్తున్నా, నాన్నగారు నాపై కురిపించే ఆత్మీయతలో లోటు రానివ్వలేదు. దూరంగా కూర్చున్) దగ్గరకు పిలిచి ఆప్యాయంగా యోగక్షేమాలు అడిగేవారు. నువ్వు చక్కగా ఎప్పుడూ నవ్వుతూ ఉంటావమ్మా అని నా సహధర్మచారిణితో అనేవారు. ఆ పిలుపు కోసం, ఆ అపురూపమైన క్షణాలను ఆస్వాదించటం కోసం జిన్నూరు వెళుతుండేవాళ్ళం.

మీరు చేసే ఉద్యోగంలో సంతోషంగా ఉన్నారాండీ, ఆశ్రమంలో భోజనం చేసి వెళ్ళండి, మీరు కళాశాలలో చేసిన ఆ రోజులు నాకు గుర్తుకువస్తున్నాయి. తక్కువ జీతంతో ఎక్కువ చదువు చెప్పేవారు. ఆ రోజుల్లో పడిన కష్టానికి భగవంతుడు ఈ స్థితిని కల్పించాడు అని నాన్నగారు పలికిన ఆ పలుకులు నా కళ్ళల్లో నీళ్ళు నింపాయి. ఆ మాటల్లో ప్రతీ అక్షరంలో హృదయం నుండి ఉప్పొంగే ప్రేమను చూసాను. ఆ ప్రేమను కొలవటానికి నా దగ్గర ఏ కొలమానం లేదు. ఏ బంధువులు, ఏ స్నేహితులు, మన చుట్టూ ఉండే ఏ ఒక్కరైనా ఆ ప్రేమను అందించగలరా!

అమరావతికి బదిలీపై వచ్చిన తరువాత, జిన్నూరు తరచూ వెళ్ళి నాన్నగారి దర్శనం చేసుకునే అవకాశం కలిగింది. కృష్ణా పుష్కరాలలో నాన్న గారితో పాటు పుష్కర స్నానం చేయడం, తిరుమల తిరుపతి దేవస్థానం వారు విజయవాడలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనా దేవాలయాలను సందర్శించడం ఒక మరపురాని అనుభూతిని మిగిల్చింది. మా ద్వితీయ పుత్రుని ఉపనాయనము జిన్నూరు రమణ క్షేత్రంలో నిర్వహించి నాన్న గారి ఆశీస్సులు పొందడం సంతోషకరమైనది.

నన్ను చూడటానికి మీరు చాలా శ్రద్ధగా వస్తున్నారు. అలాగే వచ్చివెళ్తూ ఉండండి అని నాన్నగారు అంటుండే వారు. పూర్వజన్మ పుణ్యఫలం లేకుండా ఇటువంటి గురువు సాంగత్యం లభించదు. నాన్న గారి సమక్షంలో గడిపిన ఆ క్షణాలు తీపి జ్ఞాపకాలు. నిండు పున్నమి వెన్నెల చల్లదనం ఆయన మోములో చూసాను. ఆ పిలుపులో ఆప్యాయత, ఆ చూపులో చల్లదనం, ఆ మాటలో తీయదనం, ఆ పెదవులపై చిరునవ్వు ప్రతీదర్శనంలోను చూశాను. ఆయన సమక్షంలో అనిర్వచనీయమైన ప్రశాంతత, అలౌకికమైన ఆనందం చవిచూసాను. ప్రతి కదలిక లోను సహజత్వం జ్ఞప్తికి వస్తోంది. ఆ క్షణాలు, ఆ దృశ్యాలు నా హృదయ ఫలకంపై పదిలంగా ఉన్నాయి.

నాన్నగారు 2017 లో విశాఖపట్నం వచ్చినప్పుడు మా కోరికపై మా ఇంటిలో అడుగుపెట్టి మా బంధువులందరినీ ఆశీర్వదించారు. సుజాత గారి ఇంటి దగ్గర నుండి, డాక్టర్ గారి ఇంటికి వెళుతూ భోజన సమయం దాటిపోయినా శ్రమ తీసుకుని మా ఇంటిలో కొంత సమయం గడిపి గతంలో మాట ఇచ్చిన ప్రకారం కరుణ చూపించి వెళ్ళారు. సుజాత గారి ఇంటి దగ్గర ఉన్నప్పుడే, ఒక సంవత్సర కాలం లోపు ఈ దేహం చాలిస్తాననే మాటను వ్యక్తం చేశారు. ఆ తరువాత కొన్ని రోజులకు వైద్యం నిమిత్తం విశాఖపట్నం వచ్చి అపోలో ఆస్పత్రిలో చేరారు. అది ఏ విశాఖపట్నం చివరి పర్యటన. ఆస్పత్రిలో చూడటానికి ఒకరిద్దరికి మినహా అనుమతి నివ్వలేదు. అనుమతి తీసుకొని నాన్నగారిని దర్శించుకుని వచ్చాను. మీ ఇంటికి వస్తామండి అన్న నాన్న గారి మాటలు జ్ఞప్తికి వస్తున్నాయి. నాన్నగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు జిన్నూరు వచ్చాక ఇంటి దగ్గర సపర్యలు చేసిన భక్తులందరికీ నా ప్రణామములు.

2017 వ సంవత్సరంలో సద్గురు శ్రీ నాన్నగారు రమణైక్యం చెందిన తరువాత, హృదయవాసియై మనందరికీ దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. నాన్నగారి కుటుంబ సభ్యులు శుభ సంకల్పంతో, భక్తుల సేవానిరతితో జిన్నూరు నాన్న గారి మందిరం నిర్మాణం, రమణ క్షేత్రం లో అరుణగిరి ఏర్పడింది. అరుణాచలం లో నాన్నగారి ఆశ్రమంలో నాన్నగారి విగ్రహ ప్రతిష్ట జరిగింది. నాన్నగారి ఆశీస్సులతో పవిత్రమైన ఉత్సవాలన్నింటిని సన్నిహితంగా, కుటుంబ సమేతంగా, వీక్షించే సువర్ణావకాశం కలుగుతూనే ఉంది. నాన్నగారి తోనూ, వారి కుటుంబ సభ్యులతోనూ అనుబంధం అలా కొనసాగుతోంది. మాపై కన్నమ్మ గారు చూపించే వాత్సల్యం ప్రత్యేకమైనది. రమణ క్షేత్రంలో సజ్జన సాంగత్యం లభించడం, రమణ భక్తులు, నాన్నగారి శిష్యులతో సత్సంగాలలో నాన్నగారి నోటి నుండి జాలువారిన తేనెలొలికే పలుకులను స్పురణకు తెచ్చుకొని మననం చేసుకోవటం పరమ సంతోషకరమైన కార్యక్రమము.

నాన్నగారి ఆశీస్సులతో "శ్రీ నాన్న గీత" వ్రాసి నాన్నగారికి సమర్పించడమైది. ఇది రవీందర్ నాథ్ ఠాగూర్ గీతాంజలి లాగ ఉందండి. మీ రచనకు హృదయం ఉంది అని నాన్నగారు ప్రశంసించడం ఆనందం కలిగించింది. అర్హతకు మించిన ప్రశంసలు అడపాదడపా లభిస్తూనే ఉన్నాయి. హృదయం అంటే అర్థం తెలియని నా చేత నాన్నగారు వ్రాయించుకున్నారు. ఇది జ్ఞాన ఫలంలో ముద్రించడమైనది. Ref: Jnana Phalam Book

రూపబుద్ధికి, నామబుద్ధికి మమేకమైన నేను నాన్నగారి రూపం కనుమరుగైనప్పుడు అందరిలాగే ఎంతో ఆవేదన చెందాను. నా శరీరం మరణించినా నా భక్తుల హృదయాలలో నేను జీవించే ఉంటాను అని నాన్నగారు పలికిన మాటలు జ్ఞప్తికి వస్తున్నాయి. హృదయవాసిగా ఉన్నారనే అనుభవం కలిగింది. అంతర్ముఖమైతే, నిజమైన శాంతి లభిస్తుందని. పరిస్థితులు అనుకూలించినా, ప్రతికూలించినా ప్రారబ్ధాన్ని పాయసం తాగినట్లు ఇష్టంగా అనుభవించాలని, సంఘటనలతో తాదాప్యం వల్ల సుఖం వస్తుందని, మనిషి జన్మ ఎత్తి భక్తి లేకుండా ఉండటం కంటే పశు జన్మ ఎత్తి భక్తి కలిగి ఉండటం మంచిదని ఇలాంటి సరళమైన బోధ మన స్థాయికి దిగి వచ్చి మనకి అందించారు.

నాన్నగారిని చూసినప్పుడు గౌతమ బుద్ధుని ప్రశాంత చిత్తం, ఆదిశంకరుని జ్ఞాన వైభవం రమణుని నిత్యానంద స్వరూపం, రామకృష్ణుని భక్తియోగం గోచరిస్తుంది. విచారణ మార్గం, శరణాగతి మార్గం వంటి విస్పష్టమైన మార్గాన్ని మన అందరికీ చూపించిన సద్గురువు నాన్నగారికి మనం సర్వదా కృతజ్ఞులము. నాన్నగారు అనే పిలుపుకే బాధ్యతలన్నీ భుజాలపైన మోసిన ఆ బంధం గుర్తుకువస్తోంది. కోరికలు దుఃఖ హేతువు అనే మాటలు జ్ఞప్తికి వస్తున్నాయి. పుట్టెడు దుఃఖం కొంగున కట్టుకొని చెంతకు వచ్చిన శిష్యుల మనోవేదనను ఒక్క చూపుతోనే తొలగించిన ఆ దృశ్యాలు గుర్తుకొస్తున్నాయి.

నీ జీవితమంతా హృదయాన్ని కేంద్రంగా పెట్టుకుని జ్ఞానబోధ చేసావు. ఎంత సహజత్వంతో కూడిన బోధ. అందుకే మా అందరి హృదయాలను కోవెలగా చేసి హృదయ వాసిగా నిలిచావు. ఈ తేలిక ప్రపంచంలో అశ్వవేగంతో పరుగిడి మా మనస్సులు అలసి పోయినాయి. గురుదేవా! ఎటు నుండి ఎటు పరుగులు పెట్టినా ఎండమావులే కానీ నీళ్ళు లేవాయే. అలసటతో మా గొంతులు ఎండిపోతున్నాయి. మా దాహార్తిని తీర్చి ప్రేమాభిమానాలు ముఖతహాః పంచగా మా చెంతకు మరలా వస్తావు కదూ!

No comments:

Post a Comment