Monday, November 2, 2020

"నాన్నగారి దయే, భక్తుల పాలిట కల్పతరువు" - (వేంకట నరసమ్మ గారు & బంగారమ్మ (పోడూరు) గారు)

బంగారమ్మ (పోడూరు) గారు:

నాన్నగారు మాకు బాగా సుపరిచితం. ఆయన ప్రవచనాలకి వెళుతూ ఉండేవారం. ఒకరోజు నాన్న గారితో మేము ఇల్లు కట్టుకుంటున్నాము అని చెబితే, చాలా సంతోషపడ్డారు. మా మనవరాలు బ్యాగ్లు కుడుతూ ఉంటుంది. ఒకరోజు తను కుట్టిన బ్యాగ్ నాన్నగారికి ఇద్దామని, మా మనవరాలిని కూడా తీసుకుని నాన్నగారి దర్శనానికి వెళ్ళాను. నాన్నగారు ఆ బ్యాగ్ చూసి ఏంటమ్మా? బట్టలు పట్టుకుని వచ్చారా? అని అడిగారు. బట్టలు కాదు నాన్న గారూ! బ్యాగు పట్టుకుని వచ్చాను. ఏమీ లేకుండా ఉన్న వాళ్ళం ఈరోజు మీ దయవల్ల ఇల్లు కట్టుకుంటున్నాము అని చెప్పి, దయచేసి ఈ బ్యాగ్ మీరు తీసుకోవాలి అన్నాను. అలాగమ్మా! నేను బద్రపరుచుకుంటాను అని చెప్పి బ్యాగ్ లోపలికి పట్టుకొని వెళ్ళి, తిరిగి వచ్చి మా మనవరాలిని ఆశీర్వదించారు.

మా అబ్బాయి కువైట్ వెళ్ళాడు. అక్కడ ఆరోగ్యం బాగాలేక సీరియస్ అని చెప్పారు. ఆ విషయము జిన్నూరు వెళ్ళి నాన్నగారికి విన్నవించుకున్నాను. మీ అబ్బాయికి పది రోజులలో నయమైపోతుంది అన్నారు. అలాగే తగ్గిపోయింది. మా రెండవ అబ్బాయి విషయంలో కూడా అలాగే జరిగింది. నాన్నగారు చెప్పగానే అలాగే తగ్గిపోయింది. నాకు ఆపరేషన్ పడుతుంది అని చెప్పారు. నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పి నాన్నగారి పాదాలకి నమస్కారం చేసుకున్నాను. ఆయన దయవలన బానే ఉన్నాను. నాకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు, ఎక్కడైనా నొప్పిగా ఉంటే అక్కడ నాన్నగారిని తలుచుకొని విభూది రాసుకుంటాను. అప్పుడు నాకు ఏ బాధ తెలియదు. అలాగే ఇంట్లో వారికి కూడా ఏదైనా ఆరోగ్యం బాగోలేక పోతే వారికి కూడా అలాగే చేస్తాను. వారు కూడా తగ్గిందని చెబుతారు. నాన్నగారిని నమ్మండి అంతా తగ్గిపోతుంది అని చెబుతాను. నాకు నాన్నగారి దేహం ఉన్నప్పటికంటే ఇప్పుడే ఇంకా ఎక్కువ ధైర్యాన్ని, శాంతిని ఇస్తున్నారు. నాకు చదువు రాదు, కానీ నాన్నగారి పుస్తకాలు మాత్రమే చదవగలను. ఆయన నాకు చదవగలిగే శక్తిని ప్రసాదించారు. ప్రతిరోజు ఒక రెండు , మూడు పేజీలు చదువుకుంటూ, ఆయననే స్మరించుకుంటూ ఉంటాను. చాలా శాంతి గా ఉంటుంది. ఆయన ధ్యాస తప్ప నాకు రెండవది లేదు. ఈరోజు ఆయన దయ వలనే మేము బాగున్నాము. నాన్నగారు నన్ను, వెంకట నరసమ్మగారిని ఆశీర్వదించి మీరు నావారు అన్నారు. నాకు ఆయన దయ తప్పించి ఇంకేమీ లేదు.

వేంకట నరసమ్మ గారు:

నాన్నగారి దగ్గరకు శివరాత్రి పర్వదినాన, నామం తీసుకుందామని వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాను. నాన్నగారు నన్ను పిలిచి ఏమిటమ్మా? అని అడిగారు. నామం తీసుకోవాలి అని వచ్చాను నాన్నగారూ అన్నాను. ఏ నామం చేసుకుంటావమ్మా? అని అడిగారు. శివ నామంచేస్తాను అంటే, శివ నామమే ఇచ్చారు. నాకు చాలా అనుభవాలు స్వప్నంలో కలుగుతూ ఉండేవి.

ఒకసారి నాన్నగారితో అరుణాచలం వెళ్ళాను. అరుణాచలం గుడిలో దక్షిణామూర్తి గురించి చెబుతూ, మధ్యలో ఆగి అక్కడ ఉన్న దక్షిణా మూర్తి పోటో దగ్గర ఆగి అందరిని చూస్తూ సబ్జెక్టు చెబుతున్నారు. అప్పుడు హఠాత్తుగా కరంట్ పోయింది. నాన్నగారి కంటిలో నుండి వచ్చిన ఆ వెలుగు దక్షిణాముర్తి ఫోటో మీద పడినట్టు నాకు కనిపించింది. తరువాత కొద్ధిసేపటకి కరంట్ వచ్చింది. ఆ వెలుగు గురించి నా ప్రక్కన ఉన్నవారికి చెబితే వారికి కనబడలేదు అన్నారు. ఆ వెలుగు చూసిన తరువాత ఒక 15 రోజులు అస్సలు నాలో నేను లేను. అప్పటి నుండి నాన్నగారి మీద ఇష్టం, తపన పెరిగాయి.

నాకు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. నాన్నగారి దగ్గరకు వెళ్ళి నాన్నగారూ నాకు రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టటం లేదు అని చెప్పాను. అలా నాన్నగారు నా వైపే చూస్తూ మీకు వారం రోజులలో నిద్ర పట్టేస్తుంది అన్నారు. ఆయన సమక్షంలో చాలా శాంతిగా ఉండేది. ఆ వారం రోజులు కూడా క్రమం తప్పకుండా జిన్నూరు వెళ్ళాను. నిద్రలేమి సమస్య గురించి నేను ఏమీ మందులు వాడలేదు. కానీ, నాన్నగారు చెప్పినట్టు నాకు ఆ వారం రోజుల తరువాత నిద్ర పట్టేసింది. ఆ తరువాత నుండి నాన్నగారి దగ్గరకి రోజు వెళ్ళేదాన్ని.

మా పిల్లలకి అన్నప్రాసన, అక్షరాబ్యాసం అన్నీ ఆయన చేతుల మీదుగానే చేశారు. ఎప్పుడూ నాన్నగారి పాదాలే చూస్తూ ఉండేదాన్ని. నాన్నగారికి చివరి రోజులలో ఆరోగ్యం బాగాలేదు అని ఆయనను చూడటానికి వెళ్ళాను. అక్కడ ఉన్న సూర్యవతి అక్క నన్ను లోపలకి పిలిచారు. అలా నాన్నగారి దగ్గరకు వెళ్ళాను. నాన్నగారు ఆ రోజు అసలు కదల లేదు. ఆయనను చూసి చాలా బాధపడ్డాను. నాన్నగారు దుప్పటి కప్పుకోవటం వలన నాన్నగారి పాదాలు కనబడటం లేదు. నాన్నగారి పాదాలు కనబడటంలేదు అనుకుంటున్నాను. ఈ లోపు ఆ దుప్పటిని ప్రక్కకు జరిపి నాకు పాదాలు కనిపించేటట్టు చేసి నన్ను ఆనందింప చేశారు.

No comments:

Post a Comment