Friday, November 13, 2020

"ఉన్నది గురువు అనుగ్రహం మాత్రమే" - (By వేణమ్మగారు)

జిన్నూరు లో పుట్టాను. నాన్నగారి ఇంటి పక్కనున్న స్కూల్లో చదువుతున్నప్పుడు ఇంటర్వెల్ లో నాన్నగారి ఇంటి అరుగుమీద పెట్టిన కుండలో నీళ్ళు తాగినప్పుడు "ఈ ఇల్లు నాకు పుణ్యక్షేత్రం అవుతుందని తెలియదు". ఆ రోజుల్లో నాన్నగారిని ఎప్పుడూ చూశానో గుర్తులేదు. మా మేనత్త (నాన్నగారి లో సాక్షాత్తు భగవంతుడిని చూశారు) నాతో నాన్నగారి గురించి చెపుతున్నప్పుడు నేను అడిగాను "ఎవరు అత్తయ్యా నాన్నగారంటే! రాజాయమ్మ గారి అబ్బాయా?" అని. ఆయనే నా జీవితానికి సారథ్యం వహిస్తారని అప్పుడు నాకు ఏమి తెలుసు!

మొదటిసారి మా వదిన సావిత్రి మామ్మగారి ఇంటికి తీసుకువెళ్ళింది. గుమ్మంలో ఉండగానే "రా వేణమ్మ!" అన్నారు నాన్న. ఆ రోజు నాకు ఏమీ తెలియలేదు. 30 సంవత్సరాల తర్వాత ఆ మాట గుర్తొస్తే "భగవంతుడు నన్ను పిలిచాడు" అని గుండె పొంగి పోతుంది. కొద్దిరోజుల తరువాత నాన్నగారిని రోజూ చూడాలని ఉండేది. అది భరించలేక రెండు సంవత్సరాలు జిన్నూరులో ఉండాలని అనిపించి నాన్నగారిని అడిగాను. వద్దు నేను హైదరాబాదు వస్తాను అన్నారు. ఆ సంవత్సరం 4,5 సార్లు హైదరాబాద్ వచ్చారు. ఆయన సన్నిధి ఎంత ఇష్టమంటే చెరువు గట్టు మీద నడుస్తూ "ఆ చెరువు ని ఎంత అదృష్టవంతురాలివి? రోజూ నాన్నగారు నిన్ను చూస్తున్నారు!" అని ఆ చెరువు మీద అసూయపడే దాన్ని. ఆ రోజుల్లోనే కొద్దికాలం కర్ణాటక లో ఉన్నాను. అక్కడ సత్సంగంలో పాల్గొనేవారికి మేఘాలని చూపించి, మీరు నాన్నగారికి ఏమైనా చెప్పాలంటే చెప్పుకోండి మేఘాలు అటే వెళుతున్నాయి అనేదాన్ని. ఇది కల్పించడం కాదు అలా అనుభవించే దాన్ని. ఇప్పటికీ నాన్నగారంటే ఇంత ఇష్టము ఎందుకు ఉంది అంటే దానికి కారణం తెలియదు. ఎందుకు ఆయన ఫోల్డ్ లోకి వచ్చానో ఆయనకే తెలియాలి.

కర్ణాటకలో మా ఇంటికి ఒక బాగా పేరు ఉన్న స్వామి వచ్చారు. ధ్యానం నేర్పిస్తాను అన్నారు. 45 నిమిషాలు నేర్పించారు. ధ్యానం చేస్తున్నంత సేపు ఆయన మురళి ఊదారు. చాలా బాగా ఊదారు. తరువాత ధ్యానంలో ఏమనిపించింది? అని అడిగారు. నాకు భగవాన్ అంటే ఇష్టం ఆయనకు సంబంధించిన తలంపులు వచ్చాయి అన్నాను. ధ్యానం వల్ల మాత్రమే తరించాలి అన్నారు. బుద్ధుడు ధ్యానంలోనే తరించాడు అని చెప్పారు. అదేంటి స్వామి! ఏ జీవుడు అయితే పునర్జన్మల కి ప్రయాణం చేస్తున్నాడో వాడిని వాచ్ చేసి చూడు, వాడు ఇప్పుడే లేడని తెలుస్తుంది అని బుద్ధుడు వాచింగ్ కి పెద్దపీట వేశాడు కదా స్వామీ! అన్నాను. నేను చెప్పింది ఆయనకి నచ్చలేదు. భగవాన్ ను "Not at all Maharshi" అన్నారు. నాకు ఏమీ అనిపించలేదు. ఇదంతా లక్ష్మి కి చెప్పాను. లక్ష్మి నాన్నగారితో చెప్పారు. నాన్న గారు నన్ను చాలా తిట్టారు. వాళ్ళతో నీకు వాదన ఎందుకు అని కోప్పడ్డారు. తరువాత ఒక రోజు జిన్నూరు వెళ్ళాను. నాన్నగారు భగవాన్ ని Not at all Maharishi అంటే నీకు ఏమనిపించింది? అని అడిగారు. ఏమి అనిపించలేదు అన్నాను. ఆయన భగవాన్ ని పొగిడితే భగవాన్ కి ఏం వస్తుంది? Not at all Maharishi అంటే ఏం పోతుంది? అని అనిపించింది నాన్నగారూ అన్నాను. ఆయన టీచింగ్ ఎలా ఉంటుందో చెబుతున్నాను. భగవాన్ ని నువ్వు దేవుడు అనుకుంటున్నావు కాబట్టి ఆయనకు ఏం వస్తుంది? ఏం పోతుంది? అని అనుకుంటున్నావు. అలాగే నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నీకు ఏమి పోతుంది అని అడిగారు. ఏమి పోదు నాన్నగారూ అన్నాను. అలా నీవు ఉంటే! ఈ సృష్టి అంతా కలిసినా నిన్ను ఏమి చేయలేదు అన్నారు. ఎన్ని జన్మలెత్తినా ఈమాట మరచిపోగలమా? ఆయన ఏ మాట Personal గా చెప్పినా అది నాటుకు పోవాల్సిందే. ఎన్ని వేల మంది కైనా సరే ఎవరికి వారికే "నాన్నగారు నా వారే" అనిపిస్తుంది. అది అంతే.

నేను మొదట్లో రామకృష్ణ మఠానికి వెళ్ళేదాన్ని. నాన్నగారి దగ్గరకు వచ్చిన తరువాత, ఇంచుమించు ఒక సంవత్సర కాలం పాటు మఠానికి వెళ్ళడానికి ప్రయత్నించాను కానీ, ఏదో ఒక అడ్డంకి వలన వెళ్ళలేకపోయేదాన్ని. చాలా కాలం తర్వాత రామకృష్ణ మఠం స్వామి హాస్పటల్ లో ఉన్నారని తెలిసి వెళ్ళాను. ఆయన నన్ను చాలా బాగా చూసేవారు. ఆయన నువ్వు ఠాకూర్ ని వదిలేశావు అన్నారు. నేను ఒప్పుకోలేదు. నేను భగవాన్ సబ్జెక్ట్ కి ఎట్రాక్ట్ అయ్యాను, అక్కడికి వెళుతున్నాను అన్నాను. ఆయన పోనీలే అన్ని (అన్నీ)మానేసావు అనుకున్నాను. కానీ భగవాన్ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు కూడా లేడు అంటారు కదా? అది నీకు కష్టంగా లేదా? అని అడిగారు. లేదు స్వామీ, ఆ మాటే నన్ను ఆకర్షించింది అన్నాను. ఆయన కూడా సంతోషించారు. ఇదంతా లక్ష్మీ నాన్నగారికి చెప్పారు. నాన్నగారు ఎలా ఎంకరేజ్ చేసేవారు అంటే, చాలా బాగా చెప్పావు అది ఆ స్వామికి కూడా అర్థమై ఉండదు అన్నారు. స్వామీజీకి తెలియదని కాదు. నాన్నగారు ప్రతి ఒక్కరిని అలా పచ్చ గడ్డి చూపి దూడను లాక్కుని వెళ్ళినట్టు, ఆ సుఖ సముద్రంలోకి, శాంతి సముద్రంలోకి మనల్ని అందరని లాక్కెళ్ళారు.

కర్ణాటకలో బాగా ధనవంతుడు ఒక ఎంపీ గారు ఉన్నారు. ఆయన చాలా శివ భక్తుడు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి యజ్ఞాలు, యాగాలు చేశారు. ఆయన మా అన్నయ్యకి ఫ్రెండ్. ఆయన ఒకసారి ఎవరూ చేయలేని యజ్ఞం చేశాను. ఎప్పుడో భోజరాజు చేశాడు. తరువాత నేనే చేశాను అని చెప్తున్నారు. అదేముందండి! ఆ శివుడు ఇదంతా చేయించుకోవడానికి మీకు ధనం ఇచ్చాడు, చేసే బుద్ధిని ఇచ్చాడు, చేయించుకున్నాడు అంతే కదా! అన్నాను. నీ గురువు ఎవరమ్మా? అన్నారు నాకు ఆ రోజుల్లో నాన్నగారు అంటే చాలు పూనకం వచ్చేసేది. ఒక పదిహేను నిమిషాలు నాన్నగారు తన శిష్యులు అందరనీ దుఃఖం లేని స్థితికి తీసుకెళ్ళడానికి చేస్తున్నదంతా చెప్పాను. అప్పుడు ఆయన నేను మీ గురువుగారి దర్శనం చేసుకుంటాను అని, నువ్వు అంతా శివుడే చేశాడు అంటున్నావు కదా! నేను చేసింది ఏమీ లేదా అని అడిగారు. నేను వెంటనే అవి అన్నీ చేశారు కనుకనే మా గురువుగారిని దర్శించుకుంటున్నారు కదా! ఆ యజ్ఞఫలమే ఇది అన్నాను. అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యులయిపోయారు. మరి నువ్వు ఏం చేసావని ఆయన నీకు దొరికారు? అని అడిగారు. ఇప్పుడు నేను ఏమీ చేయలేదు. ఎన్నో జన్మలలో చేసిన పుణ్యము వలనే నాకు మా గురువు గారు లభించారు అన్నాను. నాన్నగారు అంటే అంత ఇష్టం కలగడానికి ఎంత వెతికినా నాకు కారణం కనబడదు. ఆయన కోసమని నేను చేసినది ఏమిటని ఎన్నోసార్లు వెతుకుతూ ఉంటాను. ఇప్పటికీ నేను చేసిందేమీ కనబడటంలేదు. ఆయన అనుగ్రహానికి పాత్రులం అవటానికి ఆయన ఎవరి నుండైనా ఏదైనా కావాలనుకున్న దాఖలాలు లేవు. నాన్నగారు సబ్జెక్ట్ ను వేలాది మంది భక్తుల రక్తంలో జీర్ణం చేశారు. ఆయనతో నాకున్న అనుబంధం గురించి నేను వ్రాయలేను. ఎందుకంటే, ఆయన గురించి మనం వ్రాయాలనుకున్నా, అది సముద్రంలో నీటిబొట్టు లా అవుతుంది.

నాకు ఇప్పటికి కూడా జ్ఞానం కావాలి, మోక్షం కావాలి లాంటి కోరిక ఉండదు. ఒకసారి నాన్నగారిని ఎప్పుడూ ఒక్కసారైనా మోక్షం కావాలి అని అనిపించదు నాన్నగారూ! అని అడిగాను. దానికి నాన్నగారు Derserve అవ్వు చాలు. Desire అక్కరలేదు అన్నారు. అందుకే నాకు ఎప్పుడూ నాన్నగారి మాట, ఆయన నవ్వు చాలు అనిపిస్తుంది. అంత తృప్తి, అంత ఆత్మీయత, మనకి ఏం కావాలన్నా ఆయన నవ్వు లో చూసుకోవచ్చు.

ఒకసారి చించినాడ ప్రవచనం ముగిసిన తరువాత నేను నడుచుకొంటూ వెళ్తున్నాను. నాన్నగారు కారుని నా పక్కనే ఆపి నన్ను ఎక్కించుకున్నారు. ఈరోజు మీటింగ్ లో నీకు ఏమి నచ్చింది? అని అడిగారు. “ఎప్పుడూ ఉన్న దాని దృష్టి లో ఉంటే, లేని దాన్ని నువ్వు సాధన చేసి తీసుకోనక్కరలేదు. వాటి అంతట అవే పోతాయి” అని చెప్పారు కదా! అది నాకు నచ్చింది నాన్నగారూ అన్నాను. ముందు సీట్ లో కూర్చున్న ఆయన, వెంటనే వెనుక సీట్ లో కూర్చున్న నా వైపుకు తిరిగి నీకు అది నచ్చిందా! అది అలవాటయితే తేలికైన మార్గం. కావాలంటే నువ్వు దానికి "సుఖ మార్గం" అని పేరు పెట్టుకో అన్నారు. మన స్వరూపం గురించి ఏ మాట విన్నా, ఆలోచించినా ఒక సుఖమార్గం అనే మాట గుర్తుకొస్తుంది.

ఒకసారి అరుణాచలంలో, ఆంధ్ర ఆశ్రమం మేడపైన అందరూ కూర్చున్నాము. ఆరోజు నేను హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. అసలు ఇష్టం లేదు ఏడుపు వచ్చేస్తోంది. నాన్నగారి కుర్చీ వెనక కూర్చుని ఏడుస్తున్నాను. సడన్ గా నాన్నగారు వేణమ్మా! ఈ కొండ రాళ్ళ గుట్ట లాగే కనిపిస్తుంది. కానీ నా గురువుకి ఇష్టం కనుక నేను హితవు చేసుకుంటున్నాను అన్నారు. ఆయన ఇష్టం నా ఇష్టంగా నేను చేసుకోవాలని చెప్పటం కోసం ఇంత దిగి రావాలా! (ఇది కేవలం వేణమ్మ గారి మనస్సును చాలార్చటానికి అన్నారు, నాన్నగారికి తెలుసు అరుణాచలేస్వరులు దయ సముద్రులు అని) అని ఇప్పటికీ తలుచుకుంటే చాలు ఆయన అనుగ్రహం టచ్ చేస్తూ ఉంటుంది.

ఆయన సన్నిధిని అనుభవిస్తున్న రోజులలో లక్ష్మి తో నాన్నగారు అంటే ఎంత ఇష్టమో చెబుతూ ఉండేదాన్ని. ఆవిడ అన్నారు "తలంపులు లేని స్థితిలో మీ హృదయంలో ఉన్న నాన్నగారిని ఇష్టపడి అప్పుడు ఇష్టం ఉంది అని చెప్పండి". ఇప్పుడు మీరు అంటున్న ఇష్టం నిజం కాదు అన్నారు. అది నా జీవితంలో పెద్ద షాక్. ఒక 15 రోజులు చాలా నలిగిపోయాను. అప్పుడు అర్థం అయింది. మనసుతో ఏది చేసినా అది అల్టిమేట్ కాదు అని. అప్పటి నుండి మనస్సును గమనించడం మొదలయ్యింది. చాలాకాలం గమనించటాన్ని ఎంజాయ్ చేశాను, అక్కడ మనసుకి ఎప్పుడూ అన్నీ అనుమానాలే! ఇక భరించలేక నాన్నగారికి చీటీ రాసి ఇచ్చాను. నాకు శరణాగతి అంటే కొంచెం ఇష్టం వస్తుంది. కానీ ఏ తలంపు బలంగా వచ్చినా శరణాగతి ఉంటే తలంపులు రావు కదా అని, నా మనసు నన్ను తినేస్తుంది నాన్నగారూ! మీరు నాకు ఏదో దారి చూపించాలి అని రాసి ఇచ్చాను. అప్పుడు ఆయన చెప్పింది నాకు మరో మలుపు. నాన్నగారు ఏమి అన్నారంటే "నీకు తలంపులు (ప్రారబ్దం) సుడిగాలిలా ఉన్నాయి అనుకో, ఈశ్వరుడు కూడా చేయలేని పని గురువు చేస్తాడు. అవి ఎందుకు వస్తున్నాయంటే గురువు నీకు చూపించి తీసేస్తున్నాడు. చూపిస్తాడు, తీసేస్తాడు, చూపిస్తాడు, తీసేస్తాడు. నీ తల పోయే ప్రారబ్దం ఉన్నప్పుడు నీ తలపాగా పోయేలా చేస్తాడు. నీ అప్పు మీ గురువు తీరుస్తున్నాడు. ఇదంతా ఏమిటంటే ఆయన అనుగ్రహం. ఆయన అనుగ్రహం నీకు తెలుసు అనుకో, ఈ ప్రారబ్ధాన్ని అనుభవించేవాడు అనుగ్రహాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు మీ సుడిగాలి ఎలా వచ్చిందో అలా పోతుంది. నువ్వు మాత్రం శరణాగతిని వదలకు. నువ్వు చెయ్యవలసిందల్లా "నీ గురువు అనుగ్రహాన్ని గుర్తించు చాలు". అన్నారు. ఆ రోజు తర్వాత నా శేష జీవితాన్ని ఎలా జీవించాలో ఒక దిశానిర్దేశం చేసినట్టయింది.

ఒకసారి ఒక కార్యక్రమం నిమిత్తం వైజాగ్ లో నాన్నగారితో పాటు ఒకరి ఇంటికి వెళ్ళాము. అక్కడ కాసేపు కూర్చుని ఇంకా సమయం ఉంది కదా అని, ఆ ఇంటి ఎదురుగా ఉన్నవారి ఇంటికి, నాన్నగారు మమ్మల్ని వీరు మన భక్తులే అని చెప్పి తీసుకువెళ్ళారు. ఆ ఇంట్లో వారందరూ నాన్నగారిని చూసి చాలా ఆనందపడ్డారు. గురువు ప్రేమిస్తాడు, ప్రేమిస్తాడు అంటారు! గురువు ప్రేమించటం కాదు. ప్రేమించకుండా ఉండలేక ప్రేమిస్తాడు అన్నారు నాన్నగారు అప్పుడు . మరల అక్కడనుండి మా బంధువుల ఇంట్లో ఏదో కార్యక్రమం ఉందని నాన్న గారితో కలిసి వారి ఇంటికి వెళ్ళాము. అక్కడ అందరూ కూర్చుని ఉన్నారు. నేను నాన్న గారికి దూరంగా కూర్చున్నాను. వారు నాన్నగారికి పాకం గారెలు పెట్టారు. ఒక గారె తీసి నాన్నగారు చేత్తో పట్టుకుని ఎంతో అందంగా నవ్వుతూ, వేణమ్మా ఇది ఏమిటి? అన్నారు. అంతకు ముందు ప్రవచనంలో మామూలు గారె భగవద్గీత అయితే, పాకం గారి భాగవతం అన్నారు నాన్నగారు. అందువలన పాకం గారి చూపించగానే భాగవతం నాన్నగారూ అన్నాను.

నాన్నగారు చూపు ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా ఆయన నా మనసు పై ఉరిది గా ఉండి ఈ మనస్సుని హృదయంలోకి తీసుకెళుతున్నారు అనిపిస్తుంది. ఎవరో రాశారు అని ఎవరో చెప్పారు అని అవన్నీ విని మనం రాముడిని, కృష్ణుడిని దేవుళ్ళని పూజిస్తున్నాం. వారికి మన కోర్కెలు చెప్పుకుని తీర్చమని అడుగుతున్నాం. కానీ నాన్నగారు కోరిక లేని చోటికి తీసుకెళ్తున్నారు. కోరికలతో నిండిన మనసులలో ఆయన నిండిపోయి, కోరుకోవాలి అన్న బుద్ధినే తీసేశారు.

నాకు ఇప్పటికీ చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. నేను నిజంగా నాన్నగారిని చూశానా? ఆయనతో మాట్లాడే నా? ఆయన నన్ను వేణమ్మా అని పిలిచారా? ఇలాంటి తలంపులు ఎన్నో సార్లు వస్తాయి. ఇవన్నీ నిజమే అని ప్రూవ్ చేయాలనుకుంటున్నారో ఏమో! అందుకే ఆయన తలంపు, ఆయన జ్ఞాపకం, ఇంత ఆనందాన్ని ఇస్తూ, ఇంత పులకింతనిస్తూ "అర్థమయిందా? ఇదంతా నిజమే" అని చెప్తున్నారు. నాన్నగారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం అంటే దేనికని చెప్తావు? ఎన్నింటికి అని చెప్తావు? అంటుంది మనసు.

నాన్నగారి మాట:
"మీరందరూ అంటే నాకు చాలా ఇష్టం! ఎందుకంటే, మీ అందరిలోనూ నేనే ఉన్నాను కనుక!"

.

No comments:

Post a Comment