Sunday, October 25, 2020

"గురు దేవుల ఋణం తీర్చలేనిది" - (By మోహనా గారు)

చించినాడలో ఒకసారి ఒక భక్తురాలు నాన్నగారి దగ్గరకు వచ్చి దుఃఖిస్తూ ఉంది. ఎందుకు దుఃఖపడుతున్నావు అమ్మా? అని నాన్నగారు అడిగారు. నేను 35 సంవత్సరాల నుండి విష్ణు సహస్రనామం చదువుతున్నాను. నాకు తుకారామ్ లా పుష్పక విమానం రావాలని కోరుకుంటున్నాను. ఎవరో భక్తులు వచ్చి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మనో కల్పితం అన్నారు. ఇప్పుడు నాకు పుష్పక విమానం రాదా? అని అడిగారు. విమానం రాదు అని ఎవరు చెప్పారమ్మా! నువ్వు విష్ణు సహస్రనామం మానకుండా చదువు. నీకు తప్పకుండా విమానం వస్తుంది, నేను చెప్తున్నాను కదా! నువ్వు విశ్వసించింది నీకు జరుగుతుంది అని చెప్పారు. దుఖ పడుతూ వచ్చిన ఆమె నవ్వుతూ తిరిగి వెళ్ళారు. ఆమె వెళ్ళిపోయిన తరువాత నాన్నగారు, ఎవరు చెప్పారు ఆవిడకి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మనో కల్పితమని! మీకు అనుభవం లో ఉందా? భగవాన్ చెప్పారంటే అది ఆయనకు చెల్లింది. ఆయన అనుభవం లోంచి తీసి చెప్పారు. మీకు అనుభవంలో ఉన్న మాటలు చెప్పండి. మీకు అనుభవంలో లేని మాటలు చెప్పకండి. వారు కంగారు పడతారు ఉన్న భక్తి పోతుంది అన్నారు.

మా స్నేహితురాలు మనవరాలిని అమెరికా నుంచి తీసుకొచ్చారు. దానికి రెండు సంవత్సరాలు వయసు ఉంది. ఆ అమ్మాయికి చర్మ వ్యాధి వచ్చింది. డాక్టరు కొంచెం డౌట్ గా చెప్పాడు. దాంతో ఆ అమ్మాయి పేరెంట్స్ అందరూ అమెరికా నుండి వచ్చేశారు. మీకు చూసుకోవటం రానప్పుడు ఎందుకు తీసుకు వచ్చారు అని అందరం తిట్టాము. ఒక నెల రోజుల తర్వాత నాన్నగారు వచ్చారు అమ్మా! నువ్వు నీ మనవరాలిని చాలా బాగా చూసుకున్నావు అన్నారు. అసలు మనము అంత ప్రేమగా అనగలమా! మాట్లాడటం అంటే ఇది కదా అని మా అందరికీ మతి పోయింది. మనం దేనికి భరోసా ఇవ్వలేము ఏది మనమీద పెట్టుకోము. మనమీద పెట్టుకోలేదు కదా అని ఏది ఆగదు. నాన్నగారు చెప్పే వాక్యాలు మనకు వేరే వాళ్ళు చెబితే నచ్చదు. అవి నాన్నగారి చెబితేనే నచ్చుతుంది. ఎందుకంటే నాన్నగారు ఆ స్థితి పొంది చెబుతున్నారు కాబట్టి నాన్నగారు చెబితేనే ఆ వాక్యాలు మనకు నచ్చుతాయి.

ఒకసారి జిన్నూరులో అరుగు మీద ఒక భక్తుడు నాన్న గారితో గురువుకి కృతజ్ఞత ఎలా చెప్పగలను? అని అడిగారు. "గురువు ఏ స్థితినైతే పొందాడో నువ్వు ఆ స్థితిని పొందు. అప్పుడు గురువు ఋణం తీరిపోతుంది" అన్నారు. ఈ జీవుడిని తీసుకువెళ్ళి గురువే ఆత్మలో లయింప చేస్తాడు కదా! అప్పుడు ఋణ పడేవాడు ఎవడు? ఋణం ఎవరికి తీర్చుకుంటాము నాన్నగారూ? అని అడిగాను. అప్పుడు నాన్నగారు మోహనా ఇది ప్రశ్నకు జవాబు. నువ్వు ప్రాక్టికల్ గా అడుగుతున్నావు. "జీవుడు చైతన్యంలో కలిసిపోతే అప్పుడు ఎవరికి రుణం తీరుస్తాము? నువ్వు అన్నది కరెక్టే. ప్రాక్టికల్ గా అదే జరుగుతుంది" అన్నారు.

ఒకసారి వైజాగ్ రమేష్ నాన్నగారి దగ్గరికి వచ్చి, భగవద్గీత పైనుండి క్రిందకు, కింద నుండి పైకి చాలా సార్లు చదివాను కానీ భగవాన్ చెప్పిన గాఢనిద్ర స్థితి నాకు ఎక్కడా కనిపించలేదు నాన్నగారూ! అని అడిగారు. నాన్న గారు రెండవ అధ్యాయం తీసి చదువు అన్నారు. ఆత్మన్యోవా ఆత్మనః అని చదువుతున్నారు. వెంటనే నాన్నగారు అక్కడ ఒకసారి ఆపమని చెప్పి, "ఆత్మకి అన్యంగా కాకుండా ఆత్మగా ఎప్పుడు ఉంటామంటే గాఢనిద్ర స్థితిలోనే ఉంటాము" అని చెప్పి, భగవద్గీతలో ఒక్కొక్క అక్షరానికి ఒక మార్గం సూచించారు. అది చాలా సూక్ష్మబుద్ధి ఉంటేనే అర్థమవుతుంది. ఈరోజు చెప్తున్నాను ఇంతవరకు ఎంతోమంది మహాత్ములు ఈ భూమి మీదకు వచ్చారు, ఇకముందు కూడా వస్తారు. వారందరూ ఏ మార్గం గురించి చెప్పినా, ఏ మాట చెప్పినా అది భగవద్గీతలో ఉండి తీరాలి. ఉంటుంది అన్నారు. ఇంత వైభవంగా చెప్పటం నాన్నగారి దగ్గర తప్ప నేను ఎవరి దగ్గరా వినలేదు. ఆ రోజు నుంచి నాకు భగవద్గీత అంటే గౌరవం పెరిగింది.

ఒకసారి బలిఘట్టం వెళ్లి వచ్చి PSN రాజు గారి ఇంట్లో నేను నాన్నగారు మాత్రమే ఉన్నాము. అప్పట్లో పెద్దగా భక్తులెవరూ లేకపోవటం వలన నాన్నగారితో చాలా సన్నిహితంగా ఉండేదానిని. బలిఘట్టం ఎక్కడ ఉంది మోహనా? అని అడిగారు. నేను ఏమీ మాట్లాడలేదు. నర్సీపట్నం రోడ్ లో ఉందా? అని మళ్ళీ అడిగారు. నేను ఏమీ సమాధానం చెప్పలేదు. బలిఘట్టం కూడా మైండ్ లోనే ఉంది అని లేచి నా పక్కకు వచ్చి నిలబడి "ఈ సృష్టి ని మోస్తున్న ఈశ్వరుడికి నువ్వు భారమా! నీ భారం ఆయన మీద వెయ్యి అన్నీ తొలగిపోతాయి" అన్నారు. నిరంతరం నా సమస్యనే దృష్టిలో పెట్టుకుని బోధించారు. నాకే కాదు, మొత్తం అందరకీ అలాగే బోధించారు. ఎవ్వరిని విడిచిపెట్టలేదు.

ఒకసారి జిన్నూరు మీటింగ్ లో నాన్నగారు అరుగు మీద కూర్చున్నారు. నువ్వు పుట్టాను అనుకుంటున్నావా మోహనా? పుట్టాను అనుకుంటే నీకు మోక్షం రాదు అన్నారు. నేను పుట్టాను అనుకుంటున్నాను నాన్నగారూ! నాకు మోక్షం రాదు అని కూడా తెలుసు, అసలు నేను పుట్టలేదు అని తెలియాలంటే గురువు దయ ఉండాలి కదా నాన్నగారూ అన్నాను. మాకు ఏవో కొన్ని అనుభవాలు కలుగుతున్నాయి. అవి మా సాధన వలన కాదు అని అర్ధమవుతోంది. మేము సాధన ఎందుకు చేయాలి నాన్నగారూ? అని అడిగాను. "మనసు చెయ్యకుండా ఉండదు కాబట్టి , పెద్దలు ఏదో సాధన చేయమని చెబుతారు" అన్నారు. అది కాదు, నాకు కలిగిన అనుభవం నా ప్రమేయంతో కలగటంలేదు అని నా మనసుకు కూడా అర్థమవుతోంది. కాబట్టి మనసు కూడా అతీత శక్తి గురించే కోరుకుంటోంది. అప్పుడది ఈశ్వరుడి దయ అవుతుంది కానీ సాధన ఎలా అవుతుంది నాన్నగారూ? అన్నాను. ఈ విషయం అర్థమైతే, భూమి మీదకు వచ్చిన పని అయిపోతుంది అని చెప్పి అంతా ఈశ్వరుడే అని, నమస్కారం పెట్టి నాకు నిద్ర వస్తోంది నేను పడుకోవడానికి వెళ్తున్నాను అని ఒక మాట చెప్పారు. "మోహనా! మన సబ్జెక్టులో ఎప్పుడూ పదిమందిని వేసుకొని తిరగాలనిపించదు. మనం బాగుపడేలా మనల్ని మన దగ్గరికి తీసుకు వస్తుంది. ఏదో నలుగురిని వేసుకుని ఖానా భజన చేయాలనే తలంపు మన సబ్జెక్టులో రాదని" చెప్పారు. అంటే అంత అత్యున్నతమైన సబ్జెక్టు. అటువంటి సబ్జెక్ట్ కి మనందరం సమకాలికులం.

ఒకసారి అరుణాచలంలో ఒక భక్తురాలుకి నేను కుడా మీతో గిరిప్రదక్షిణ కి వస్తాను అని చెప్పాను. ఆ భక్తురాలు నాతో చెప్పకుండా ప్రదక్షణ కి వెళ్ళిపోయారు. అప్పటికి నాన్నగారు ఆశ్రమంలో, నాన్నగారు బయట కూర్చుని ఉన్నారు. నేను అక్కడే ఉన్నాను. అప్పుడు నన్ను చెయ్యి పెట్టి పిలిచి మోహనా మనకి జ్ఞానం కావాలంటే భక్తులు సహాయం అవసరం లేదమ్మా అన్నారు. అంటే మనం జ్ఞానం పొందటానికి ఒక్క గురువు సహాయం తప్ప ఇంకెవరి సహాయం అవసరం లేదు.

నాన్నగారి దగ్గరికి వెళ్లిన కొత్తలో ఒక రెండు సంవత్సరాలు ఏ మూలన ఉన్నా నాన్నగారు నన్ను పిలిచి పాడించుకునేవారు. అందుకు పాటలు బాగా పాడతాను అని గర్వం ఉండేది. ఒకసారి క్రిస్మస్ సమయంలో నాన్నగారితో అరుణాచలం వెళ్ళాము. క్రిస్మస్ అవటం వలన అక్కడ భక్తులు నాన్న గారితో కేక్ కట్ చేయించారు. అప్పుడు పాటలు పాడాలి అన్నారు. అంతకు ముందు సంవత్సరం నన్ను పిలిచి పాడించారు. అందుకు ఈ సంవత్సరం కూడా నన్ను పిలుస్తారు అనుకున్నాను. అందరూ పొగుడుతారు కదా అని అందరి ముందు పాటలు పాడటం అంటే నాకు ఇష్టంగా ఉండేది. నాన్నగారు పిలుస్తారేమో అని రమణాశ్రమం భోజనానికి కూడా వెళ్ళకుండా ఎదురు చూస్తున్నాను. కానీ పిలవలేదు. పైకి నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం ఒకవైపు ఇంత కీర్తి కాంక్ష నాలో ఉంది ఏమిటి అని అనిపిస్తూ ఉంది. మరోవైపు నాన్నగారు పిలవలేదని బాధ కూడా ఉంది. నాన్నగారితో పాటు గిరి ప్రదక్షణ చేస్తూ కుబేర లింగం దగ్గర ఆగి నాన్న గారితో సహా అందరం కూర్చున్నాము. నేను వెనకాల ఎక్కడో కూర్చుని ఉన్నాను. వెనకాల నాకు వినిపించేటట్టు అన్నారు, "మనం ఒక పాట పాడితే, భగవంతుడి గురించి పాడితేనే అది సంగీతం. అందరూ పొగుడుతారు అని పాడితే అది మార్కెట్ మ్యూజిక్" అన్నారు. అంటే మన గర్వాన్ని గురువు ఒక్క మాటతో తీసేస్తాడు అనటానికి సత్యం అదే. ఆరోజు తర్వాత ఎప్పుడూ కూడా ఎక్కడికైనా వెళ్ళి పాడాలి అనే తలంపు రాలేదు. ఎక్కడైనా పాడినా కల్పించుకుని పాడలేదు అది ఇష్టంతో పాడాను.

ఏది చేసినా, చెయ్యక పోయినా వారి దర్శనం తరువాత నేను జీవిస్తున్న జీవితం కరెక్ట్ కాదు, భగవంతుడు చెప్పినట్లు జీవించాలని చాల గట్టిగా అనిపించసాగింది. వారి బోధతో life లో determination రావడం ప్రారంభమయింది. నాన్నగారి కృప వల్ల ఎందరో భక్తులతో సహవాసం కలిగింది. నాన్నగారి భక్తులను, వారికి నాన్నగారి పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయతలను చూస్తుంటే మనకు భక్తి లేక పోయినా, వాళ్ళని చూసి సంతోషించాలని అనిపిస్తుంది. ఆ భక్తులలో నాకు కనిపిస్తున్న భక్తి, నిర్మలత్వం, సహజత్వం చూసి ఈ జన్మలో ఆనందించగలుగుతున్నానంటే, అది నా తండ్రి అనుగ్రహం వలన కలిగిన సంస్కారమే!

భక్తి, మోక్షం, ఆత్మ ఇటువంటి పెద్ద పదాలకి అర్థం తెలియక పోయినా నాన్నగారి అమృతవాక్కులను విని, ఆయన జ్ఞాపకాలలో ఉంటూ ఉంటే కనీసము జీవితంలో వచ్చే ఆటు పోట్లను ఎదుర్కోగలుగుతున్నాను. నాన్నగారిని కనుక కలవకపోయుంటే, జీవితంలో అంతకంటే పోగొట్టుకునే సంపద ఉండదేమో! నాన్నగారి ఆ చూపు అందం, ఆ పలకరింపు అందం, ఆ ప్రేమ అందం, ఆ సహజత్వం అందం, అన్నీ అందాలే. నాన్నగారి అమృతవాక్కులలో నన్ను ఎక్కువగా ప్రభావితం చేసి నడిపే మాటలు- (1) జరుగవలసింది జరిగే తీరును, జరుగరానిది ఎవరు ఎంత ప్రయత్నించినా జరుగనే జరుగదు. ఇది నిశ్చయము. (2) భక్తి లేకుండా జ్ఞానం కలుగనే కలుగదు. భక్తి జ్ఞాన మాత. (3) నీలో ఉన్నదే నీకు బయట కనిపించును.

నాన్నగారి దర్శనం తో నామాట తీరు, ఆలోచనా తీరు పూర్తిగా మారిపోయింది. మోడును మోహనగా తీర్చిదిద్దిన గురు దేవుల ఋణం తీర్చలేనిది.

No comments:

Post a Comment