Saturday, October 24, 2020

"నాన్నగారి పాద స్పర్శతో, నాలో చాలా మార్పు" - (By మోహనా గారు)

చిన్నతనం నుండి నాకు దేవుడంటే ఇష్టం. ఆ పఠానికి దగ్గరగా కూర్చుని పూజ చెయ్యటం అంటే చాలా ఇష్టం. నాన్నగారు పరిచయం అయ్యేవరకు నాకు భక్తి, జ్ఞానం, గురువు వీటి గురించి కొంచెం కూడా అవగాహన లేదు. 1995 మే 1వ తారీఖు ఒక స్నేహితురాలి ప్రేరణతో మొట్టమొదటి సారిగా నేను శ్యామల అనే భక్తురాలి ఇంట్లో నాన్నగారిని చూసాను. మొదటిసారి చూడగానే నాకు నాన్నగారి నేత్రాలు ఎందుకో చాలా బాగున్నాయి అనిపించింది.

నా చిన్నప్పటి నుండి కూడా మా నాన్నగారు ఎంతోమంది మహాత్ములను ఇంటికి తీసుకువచ్చేవారు. వారి దగ్గర ఏమీ అనిపించలేదు కానీ నాన్న గారి దర్శనం అయిన తరువాత నుండి, నాలో నేను మారాలి అనే మార్పు కనిపించేది. అప్పుడు "ఈయన ప్రపంచానికి సంబంధించిన వాడు కాదు, మానవమాత్రుడు కాదు" అని అనిపించింది. నాలో లోపాలు నాకు భూతద్దంలో చూసినట్టు పెద్దవిగా కనిపించేవి. అప్పుడు నాన్నగారు నీలో ఉన్న ఏదో ఒక మంచి గుణాన్ని వెతికి, వెతికి పట్టుకుని ఆచరణలోకి తెచ్చుకో మోహనా! అప్పుడు ఈశ్వరుడు దయ కలుగుతుంది అన్నారు. ఎలాగైనా నేను మారాలి అనుకుంటూ, బాబా ని అడుగుతూ ఉండేదానిని. బాబా ని ఎప్పుడూ సద్గురు దేవా అని పిలుచుకుంటాను. ఒకరోజు లోపల అంతరంగం నుండి ఒక వాణి "ఎప్పుడూ నన్ను సద్గురు దేవా అని పిలుస్తావు కదా! ఇప్పుడు వచ్చిన వాడు సద్గురువే అక్కడికి వెళ్ళు, నీకు సమాధానం దొరుకుతుంది అని వినిపించింది".

రెండవ సారి కూడా శ్యామల గారి ఇంట్లోనే నాన్నగారి దర్శనం జరిగింది. ద్వితీయం అద్వితీయం అన్నట్లు ఆ రోజు నుండి నాన్నగారితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ రోజు మా సంభాషణ ఇలా జరిగింది:

నాన్నగారు: అమ్మా! నువ్వు happy గా ఉన్నావా?
నాన్నగారి పాదాల మీద పడి కన్నీరు కార్చాను. నాన్నగారూ నాకు భగవంతుడి పట్ల భక్తిని ప్రసాదించండి అన్నాను.
నాన్నగారు: నీకు భక్తి కావాలా? జ్ఞానం వద్దా అమ్మా?
నాకు భక్తి చాలు నాన్నగారు అన్నాను.
నాన్నగారు: పుస్తకాలేమైనా చదువుతావా?
నాకు చదవటం కన్న వినడం అంటే ఇష్టం నాన్నగారు అన్నాను.

మా మధ్య జరిగిన సంభాషణ ఇదే. ఆ తరువాత రెండు రోజులు వైజాగ్ లో నాన్నగారు ఉన్నా వెళ్ళలేదు, కాని ఆయనతో మాట్లాడిన తరువాత నుండి నాలో నాకే ఎదో తెలియని వెలితి ప్రారంభమయింది. అప్పటి నుండి ‘రమణ భాస్కర’ చదవటం, చదివి కన్నీరు కార్చటం, ఇలా పదిహేను రోజులు నాకే తెలియకుండా నిద్ర లో కూడా ఏడ్చేదాన్ని. నాన్నగారి పాద స్పర్శ తో నాలో చాలా మార్పు వచ్చింది. ఆధ్యాత్మిక గ్రంధాలు చదవటం మొదలు పెట్టాను. నాన్నగారి ‘ అమృతవాక్కులు’ చదువుతూ ఉంటే మనసు ఆనందంతో ఊగిసలాడేది.

నాన్నగారిని జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఎన్నో అడిగేదానిని. ఒకసారి నాన్నగారు శ్యామల గారి ఇంట్లో ఉన్నప్పుడు నాన్నగారూ, నాకు నచ్చని వారు ఎవరైనా నా తలంపుల్లోకి వస్తే, ఆ తలంపుని తప్పించటానికి ఏదో నామము, విచారణా చేస్తున్నా అంత ఎఫెక్టివ్ గా కనిపించడం లేదు ఎందువలన? నామం చేస్తే మీరు సరిపోతుంది అని చెప్పారు కదా! అని అడిగాను.

"మోహనా నువ్వు ఎంతో సిన్సియర్ గా ఈ ప్రశ్న వేసినప్పుడు నేను కూడా అంతే సిన్సియర్ గా నీకు చెప్పాలి కదా! లోపల బీజం ఉండిపోతుంది, అది ఉన్నంత వరకూ ఏదో స్మరణ చేస్తే తగ్గుతుంది. కానీ మరలా విజృంభిస్తుంది" అన్నారు. దీనికి పరిష్కారం ఏమిటి నాన్నగారూ అని అడిగాను."నువ్వు ఏదో రూపంగా భగవంతుడిని ఆరాధిస్తున్నావు కదా! ఆయనని ఇచ్చేవరకు ప్రార్థించు. ప్రార్థించటం మానకు" అన్నారు. అప్పటి నుంచి ఒక ఐదు సంవత్సరాలు వరకు ప్రార్థన మానలేదు. నిరంతరం భగవంతుడిని నా స్వభావంలో మార్పు రావాలని ప్రార్థిస్తూ ఉండేదానిని. br />
ఒకసారి నాన్నగారు ప్రవచనం చెబుతుంటే, గురువు దయ నీ మీద ఉంది అనటానికి కొండగుర్తు ఏమిటో తెలుసా మోహనా? నీ లోపాలు నీకు తెలియటమే అన్నారు.

ఒకసారి జిన్నూరు వెళుతూ ప్రయాణానికి సంబంధించి భోజనంతో సహా అన్నీ సిద్ధం చేసుకుని కార్లో వెళ్ళాము. అయితే మంచి నీళ్ళు కార్ లో అయిపోయాయి అని నాకు తెలియదు. నాన్నగారు భోజనం చేశారా? అని అడిగారు. భోజనం తెచ్చుకున్నాము అని చెప్పాను. అయితే ఉండు నీకు రెండు వాటర్ బాటిల్స్ ఇస్తాను అన్నారు. ఉన్నాయి నాన్నగారూ మంచినీళ్ళు తెచ్చుకున్నాము అన్నాను. ఎందుకైనా ఉంటాయి తీసుకో అన్నారు. సరే అని తీసుకున్నాను. కొంచెం దూరం వెళ్ళేసరికి మంచినీళ్లు కావాల్సి వస్తే కార్లో నీళ్లు లేవు. నాన్నగారు ఇచ్చిన వాటర్ బాటిల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే నీకు మంచినీళ్ళు అవసరమైతే, మంచినీళ్ళు కూడా గురువే చూస్తాడు. అలా నీకు ఎప్పుడు ఏది అవసరమో అది గురువే చూసుకుంటాడు. నీకు జ్ఞానం కూడా గురువే ఇస్తాడు.

రమణ భాస్కర ఎప్పుడు చదివినా అందులో నేను గురించి వస్తే చదివే దానిని కాదు. ఎక్కువ శరణాగతి గురించి చదివేదానిని. నాన్నగారు వైజాగ్ వచ్చినప్పుడు ఎక్కడ కూర్చున్నా మోహనా ఇలా రా! అని పిలిచేవారు. అలా నాన్నగారు ఒకసారి వచ్చినప్పుడు నన్ను ప్రక్కనే కూర్చోపెట్టుకొని అక్కడ ఉన్న ఐదు రోజులు నేను గురించి ఎక్కువ చెప్పారు. మొత్తం చెప్పిన తర్వాత మోహనా నీకు నేను గురించి నచ్చినట్టు లేదు కదా అన్నారు. నాకు అర్థం కావట్లేదు నాన్నగారూ అన్నాను. "నీకు అర్థం అవుతుందిలే కానీ, అది ఏమిటంటే నేను గురించి జరిగేదంతా పేకముక్కలు మేడే. ఈ నేనుని విచారణ చేస్తే, మేడ అంతా కూలిపోతుంది. ఒక్కొక్క ముక్క తీయక్కరలేదు. నేను గురించి అవగాహన వస్తే పేకముక్కలు మేడ పడిపోతుంది" అన్నారు. అప్పుడు నాకు దాని అర్థం తెలియలేదు. కానీ నేనంటే చైతన్యం కదా! అని అర్థమైన తరువాత అసలు పేక ఉంటేనే కదా మేడ పడటానికి అనిపించింది.

ఒకసారి భగవద్గీత పుస్తకం చదివినప్పుడు అందులో క్షేత్రములలో ఉన్న క్షేత్రజ్ఞుడుని నేనే అనే వాక్యం చదివాను. అది చదివేసరికి మనసు ఆగిపోయింది. ఆగిపోయే సరికి ఏంటి నేను అంటే ఇదా! నేనంటే చైతన్యమా! నేనంటే నేనే. రెండోది లేని స్థితి. మొత్తం ఈ సృష్టి అంతా నేను నేను అంటున్న ఈ నేను మన హృదయంలో నుంచి కూడా వస్తోంది కాబట్టి అంతటా నేనే , మోహన నేనే కానీ, నేను మోహన కాను అని అర్థమైంది. అది అర్థమైనప్పుడు భరించలేని ఆనందం వచ్చేసింది. అటువంటి స్థితి అనుభవంలోకి వచ్చిన తరువాత, అసలు ప్రేమ అంటే ఇదా! ప్రేమంటే ప్రవాహం. ప్రేమ ప్రవాహం ఎలా ఉంటుందంటే సృష్టిని కౌగిలించుకోవాలి అనిపిస్తుంది అలాంటి స్థితి ఇచ్చి చూపించారు నాన్నగారు.

ఒకసారి భగవాన్ విస్తరాకులో అన్నీ వడ్డించి పెడతాను, మింగే పని మీరే చేయాలి అంటారు. మింగటమే కదా నాన్నగారూ ఇక్కడ అతి ముఖ్యమైనది. మింగటం ఏ శక్తి వలన చేస్తారు? అని అడిగాను. నాన్నగారు ఏమన్నారంటే "శరణాగతి పొందితే మింగటం పని కూడా వాడే చేస్తాడు" అన్నారు. ఇంత అద్భుతంగా ఎవరు చెప్పగలరు అనిపిస్తుంది.

మరోసారి నాన్నగారు మోహనా నీకు అసూయ వస్తోందా, అది పోగొట్టుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? అని అడిగారు. అసూయ వస్తోంది నాన్నగారు అది పోగొట్టుకోవటం అసాధ్యం అన్నాను. "ఇతరులతో పోల్చుకోకుండా ఉంటే అసూయని సులభంగా పోగొట్టుకోవచ్చు" అన్నారు. ఇంత అందంగా ఎవరు చెబుతారంటే, వస్తువు తానై ఉన్నవాడు మాత్రమే చెప్పగలడు. మాటలు వచ్చిన వారందరూ అందంగా మాట్లాడలేరు. ఎవరు అందంగా మాట్లాడతారు అంటే ఆయన మాత్రమే అందంగా మాట్లాడగలడు.

No comments:

Post a Comment