Sunday, September 15, 2019

“నిజమైన ఆప్తుడు గురువే” - (By విజయ గారు)


మా ఇంట్లో, దగ్గర బంధువు ఒకరు పోవటంతో అందరూ దుఃఖంగా ఉన్న సమయంలో శ్రీ నాన్నగారు సఖినేటిపల్లి గీతామందిరం వస్తున్నట్లు తెలిసి, వారి దర్శనానికి వెళ్లాను.అలా వారితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత వారి ప్రసంగాలు ఎక్కడ జరిగినా వెల్తూండేదాన్ని.

సఖినేటిపల్లి నుండి మాకు హైదరాబాదు ట్రాంస్ఫరు అయ్యింది. నాన్నగారిని ఒదిలి చాలా దూరంగా వెళ్లిపోతున్నందుకు చాలా దుఃఖం వచ్చింది. “నాన్నగారూ! మీకు దూరంగా వెళ్లిపోతున్నాను. మీతో ఏదైనా చెప్పుకోవాలంటే ఇప్పటిలా కుదర్దు. ఏం చెయ్యను?” అని బాధగా అడిగాను. “నా ఫోటో ఉందామ్మా నీ దగ్గర?- దానితో చెప్పుకోమ్మా” అన్నారు. ఇన్నాళ్లూ ఫోటో అంటే ఒక కాగితం మాత్రమే అనుకున్నాను, కానీ నాన్నగారు ఇలా చెప్తున్నారంటే నాన్నగారు నా దగ్గరే ఉన్నారన్నమాట. నాన్నగారి ఫోటో నాన్నగారే!!! వారు చెప్పిన మాటలు గురువంటే ఏంటో తెలియజేసాయి. అంతే! ఆ రోజు నుంది ఏ సమస్య వచ్చినా, అసలు ఫొటో దగ్గర కూడా వెళ్లకుండానే లోపల నుండి గైడెంస్ వచ్చేది. ఎంత బరువైన సమస్య అయినా తేలికగా అనిపించేది. “నీకు సజీవమైన విశ్వాసం ఉంటే నిన్ను నీ నిజ గురువు దగ్గరకు తీసుకెళుతుంది” అన్న నాన్నగారి మాట నన్ను నడిపిస్తుంది.


“నిజమైన ఆప్తుడు గురువే” ఇది మాటగా మనకు అర్థమౌవచ్చు. కాక పోవచ్చు. కాని అనుభవ పూర్వకంగా గ్రహించినపుడు అందులోని నిజం మన గుండెను తాకుతుంది. అలా నా జీవితంలో జరిగిన సంఘటన-

ఆ రోజు షాపింగ్ వెళ్లి ఇంటికి వచ్చాను. ఇంటి చుట్టూ జనం వున్నారు. చుట్టు పక్కల వాళ్లందరూ ఏడుస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ముందుకు వెళ్లేసరికి నా భర్త శవం కనిపించింది. గుండె చిక్కబట్టుకున్నాను. ఆయనకు కొద్దిగా అనారోగ్యం ఉంది. కాని హఠాత్తుగా చనిపోయే అంతటి సుస్తీ లేదు. ఆయన దగ్గరకు వెళ్లలేదు. వెంటనే నాన్నగారి ఫోటో దగ్గరికి వెళ్లాను. “ఏంటి నాన్నగారూ!” అన్నాను. “ఈశ్వర సంకల్పాన్ని కాదంటావామ్మా!” అని లోపల నుండి గైడెంస్ వచ్చింది. నిజమే- కాని జీవితంలో అతి ముఖ్యమైన బంధం తెగిపోయింది – ఎన్నో సంవత్సరాలు కలిసి జీవించాం. కష్టంలోనూ, సుఖంలోనూ తోడుగా నిలిచారు. ఒక్క సారి ఆ సంఘటనలన్నీ కళ్ల ముందు మెదుల్తున్నాయి. దుఃఖం వస్తోంది. శవం దగ్గరకు వెళ్లి ఏడుస్తూంటే-“ జీవుడు లేడు కదా. కట్టె కోసమా నువ్వు విలపించేది? మనం దుఃఖిస్తే ఆ జీవుడికి అశాంతి కలుగజేసిన వారమౌతాము. మనం శాంతిగా ఉంటే ఆ శాంతి జీవుడు ఎక్కడున్నా అందుతుంది.” అని నాన్నగారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. భర్త చనిపోయాడని దుఃఖపడాలా? జీవుడు శాంతిగా ఉండాలని బాధ పడకుండా ఉండాలా? లోపల సంఘర్షణ. మళ్లీ నాన్నగారి ఫోటో దగ్గరకు వెళ్లాను. ఎదురుగా నాన్నగారి ప్రవచన పుస్తకం ఉంది. ఒక పేజీ తిరగవేసే సరికి “ నువ్వు నిమిత్త మాత్రంగా ఉండు” అన్న వాక్యం కనబడింది. అపుడు నాన్నగారి కళ్లలోకి అలా చూస్తూ ఉండిపోయాను. బయట పరిస్థితి దుఃఖంగా ఉంది. కాని నా లోపల నుండి నాకు చలించని ధైర్యాన్నిచ్చి శాంతిగా నన్ను నిలబెట్టిన ఆప్తుడు నా గురువు కాక మరెవరు. ఆయన అనుగ్రహం లేక పోయి ఉంటే మా శాశ్వత ఎడబాటుకి నేను ఏమైపోయి ఉండేదాన్నో!


ఈ సంఘటన జరగడానికి పది రోజుల ముందు నుండి నాన్నగారు నా పై చూపించిన ప్రేమ, కరుణ ఒక్క సారి నా కళ్ల ముందు కదిలాయి. పది రోజుల్లో భర్త పోతాడన్న సంగతి నా ఊహకు అందని విషయం. కాని గురువుకు తెలియని విషయమేముంటుంది. అంటే నాకు మానసికంగా శక్తినివ్వటానికి ఆ తండ్రి కురిపించిన ప్రేమని సంఘటన జరిగాక గుర్తించగలిగాను.

ఆ రోజు నుండి ఈ రోజు వరకు సాధ్యమైనంత వరకు వారి సన్నిధి లో గడిపేటట్లుగా నన్ను అనుగ్రహించిన కరుణామూర్తి నాన్నగారు. “నా మాటలను మీరు కాదనగలరేమో గాని నా అనుభవాన్ని కాదనలేరు కదా!”

No comments:

Post a Comment