Saturday, September 14, 2019

"నాన్నగారు - శాంతి సముద్రం" - (By రామచంద్రరాజు గారు (వడ్లవానిపాలెం))


అది ఒకనాటి సాయంకాలము. సద్గురువు శ్రీ నాన్నగారిని చూడాలని జిన్నూరు వారింటికి వెళ్లాను. ఆ సమయంలో ఆయన ఒక్కరే అరుగు మీద కుర్చిలో నిర్మలంగా, ఏకాంతంగా కూర్చుని ఉన్నారు. ఆయన నన్ను చూసి కూర్చోమన్నారు. నా యోగక్షేమాలన్నీ అడిగి తెలుసుకున్నారు.అలా మొదటి దర్శనంతోనే హృదయానందంతో రాత్రి మా ఇంటికి వెళ్లాను. ఆ రోజు నుండి శ్రీ నాన్నగారిని చూడటానికి రోజూ వారింటికి వెళ్లివస్తూండేవాడిని. నాకు రోజూ భక్తి, కర్మ, జ్నాన, వైరాగ్యాలను సమన్వయం చేస్తూ బోధిస్తూ ఉండే వారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి గురుంచి, అరుణాచల వైభవం గురించి తరచూ తెలియజేస్తూండేవారు. నాకు భగవదనుభవం పొందాలనే కాంక్ష కలిగింది. శ్రీ నాన్నగారితో సహవాసం వలన నా జీవితం మలుపు తిరిగింది.

శ్రీ నాన్నగారి దర్శన భాగ్యం వలన, ఆయన సన్నిధి మాత్రం చేత, ఆయన బోధల వల్ల నేను మా ఇంటికి వెళ్లినా, ఏ పని చేస్తున్నా, నిద్రిస్తున్నా, నిరంతరం నా స్మృతిలో ఉంటూ, నాలో ఉంటూ, నన్ను నడిపిస్తున్నట్లుగా ఉండేది. నా హృదయాంతరాలలో నుండి ఒక తెలియరాని ఆత్మానందం వెల్లుబికి వచ్చేది. ఈ ఆనందం, ఈ వైభవం ఏమిటని నన్ను నేనే నమ్మలేక పోయేవాడిని. అలా ఆయనను చూసినంత మాత్రాన, ఆయన ప్రవచానాలు విన్నంత మాత్రాన ఆయనతో ఉన్న సన్నిహిత సహచర్యం వల్ల- ఆనందం, శాంతి, కాంతి, సత్యం,ప్రేమ నా స్వంతమై నా అనుభవంలో శాశ్వతమైతే ఇంక ఎంత బాగుంటుందోనని, అంతకంటే సాధించేది లేదనిపించింది. ఆయన చూపులో, వాక్కులో ఎంతో ప్రేమానురాగాలు పొంగివచ్చి నా హృదయంతరాలలో ప్రవేశించి నన్ను అంతర్ముఖపరిచేవి.

మానవతా విలువలు క్షీణిస్తున్న ఈ కాలంలో జాతిని జాగృతం చెయటానికి సద్గురు నాన్నగారు జ్ఞాన నిధిగా శాంతిని ప్రజలకు అందించాలనే మహత్తర ఆశయంతో మన మధ్య నిలిచారు. మానవుడిని దుఃఖం లేని స్థితికి తీసుకుని వెళ్లటమే సద్గురు శ్రీ నాన్నగారి ప్రవచనములలోని ముఖ్య ఉద్దేశ్యం. ఇతరుల నుండి ఆయన కోరుకునేది వారి సుఖ శాంతులు మాత్రమే. శ్రీ నాన్నగారిలో నిగూఢంగా దాగి ఉన్న అంతర్వాహిని శక్తి దివ్యానుభూతులను కల్గించి, శాంతి తీరాలలో మనస్సును లగ్నం చెయటమే ఆయన సన్నిధిలో జరిగే గొప్ప విషయం. ఇది మహర్షులకు, మహాత్ములకు, జ్ఞానులకు మాత్రమే సాధ్యం. 


తండ్రిగా, తల్లిగా, పసిపాపగా, యజమానిగా, ఆచార్యునిగా, మిత్రునిగా సద్గురు శ్రీ నాన్నగారు మన ముందు సంచరిస్తూ, ఒక మానవ దేహంగా గోచరిస్తున్నారు. హృదయగుహలో ఉన్న అంతరాత్మ యొక్క సజీవ ఆవిష్కృతి యైన సద్గురు శ్రీ నాన్నను దర్శించినచో విశ్వాత్మ ఒక అమూల్యమైన నిధిగా మనకు అందుబాటులో ఉన్నదని గ్రహించగలము.

ఆకలి పోగొట్టే అన్నదాత కంటే అజ్ఞానం పోగొట్టే జ్ఞాన దాత శ్రేష్టుడు. ఇది శ్రీ నాన్నగారు చెసే జ్ఞాన యజ్ఞాల ప్రధాన ధ్యేయం. తనకున్న శక్తులన్నీ సమాజ కల్యాణానికి ఉపయోగించాలనే తపన మాత్రమే శ్రీ నాన్నగారి ప్రబోధాలలో మనకు అర్థమవుతుంది.

ఋషులు వేద మంత్రాలను దర్శించినట్లే సద్గురు శ్రీ నాన్నగారు తాను పొందిన ఆత్మానుభూతికి ప్రేమని జోడించి అన్ని వర్గాల వారికి, వారి అమృత వాక్కులుగా వినిపిస్తున్నారు. ఆ వాక్కులు విని నేడు భక్తులు ఎంతో సుఖంగా జీవించగలుగుతున్నారు. వినేవారి గ్రహణశక్తిని అనుసరించి మహార్థములు స్ఫురిస్తూంటాయి.

తొలత శ్రీ నాన్నగారి “అమృతవాక్కులు” శ్రవణం చేసిన వారు, చదివిన వారు ఎంతో ప్రభావితులై, వేదాంతాన్ని, ఉపనిషత్తుల సారాన్నంతా సులభ శైలిలో అందరికీ అర్థమైయ్యేటట్లు బోధించే మహాత్ముని దర్శించటానికి సుదూరమైన ప్రాంతాల నుండి వచ్చి ఆనందపరవశులైనారు.
శ్రీ నాన్నగారు సన్నిధి మాత్రం చేతనే భక్తులను పునీతులను చేయగల స్థిత ప్రజ్ఞులు.
ప్రతిఒక్కరు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, వివేకంగా జీవించాలని, చైతన్య వంతుల్లవ్వాలని తనలో దాగి ఉన్న అంతర్వాహినియైన శక్తిని సుఖస్వరూపాన్ని తెలుసుకొని అందరూ అమృతమూర్తులు కావాలనే తపనతో వారు నిరంతరం, నిర్విరామంగా జ్ఞానయజ్ఞాలు చేస్తూ, కృషి చేస్తున్నారు. అంతేగాని తన ఆశ్రితులందరూ ఏ దేవునికో, రమణ మహర్షికో, తనకో అవివేకంగా మూఢభక్తులు కావాలని శ్రీ నాన్నగారి ధ్యేయం కాదు. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో సద్గురు శ్రీ నాన్నగారి ప్రబోధలు సువర్ణాక్షరాలతో లిఖింపబడతాయి.

No comments:

Post a Comment